సభకు ఎందుకు రావడం లేదు..? వైసీపీ ఎమ్మెల్యేల వివరణ కోరనున్న ఎథిక్స్ కమిటీ..
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల హాజరుపై ప్రతీసారి చర్చ సాగుతూనే ఉంది.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు మొక్కుబడిగా ఒక్కరోజు మాత్రం అసెంబ్లీకి వచ్చి వెళ్లిపోతున్నారు.. ఆ తర్వాత సెషన్ మొత్తం సభ వైపు చూడడం లేదు.. అయితే, వైసీపీ ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తామని చెబుతున్నారు.. ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యేలు వరుసగా గైర్హాజరు కావడంపై అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ కీలక నిర్ణయం తీసుకోనుంది. త్వరలోనే వైసీపీ ఎమ్మెల్యేలకు కమిటీ నుంచి అధికారిక పిలుపు వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఏపీ అసెంబ్లీలో ఎథిక్స్ కమిటీ సమావేశం జరిగింది.. కమిటీ చైర్మన్ మండలి బుద్దప్రసాద్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో వైసీపీ ఎమ్మెల్యేలు శాసనసభ సమావేశాలకు హాజరుకాకపోవడంపై చర్చించారు.. అయితే, అసెంబ్లీకి హాజరు కాకపోవడానికి గల కారణాలపై ఎమ్మెల్యేలు నుంచి లిఖితపూర్వక వివరణ కోరనున్నట్లుగా తెలుస్తోంది.. సభకు ఎప్పటి నుంచి హాజరు కావడం లేదు?.. ఎందుకు అసెంబ్లీ సమావేశాలకు రావడం లేదు?.. సభకు దూరంగా ఉండటానికి గల స్పష్టమైన కారణాలు ఏమిటి? అనే విషయాలపై సదరు ఎమ్మెల్యేలను ప్రశ్నించాలని ఎథిక్స్ కమిటీ నిర్ణయం తీసుకుంది.. వచ్చే బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యేలోపు వైసీపీ ఎమ్మెల్యేలను ఎథిక్స్ కమిటీ పిలిచి వివరణ తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. బడ్జెట్ సమావేశాల్లో వారి పూర్తి స్థాయి భాగస్వామ్యం ఉండేలా చర్యలు తీసుకోవాలని కమిటీ భావిస్తోంది. ఎథిక్స్ కమిటీ నుంచి నోటీసులు జారీ అయితే, వైసీపీ ఎమ్మెల్యేలు తమ వాదన, గైర్హాజరు వెనుక ఉన్న కారణాలను అధికారికంగా కమిటీ ముందు ఉంచనున్నారు. బడ్జెట్ సమావేశాల నాటికి ఈ వ్యవహారం ఒక తుది స్పష్టతకు వచ్చే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు.
జల వివాదంపై మంత్రి లోకేష్ హాట్ కామెంట్స్.. మేం ఎక్కడ చిల్లు పెట్టాం..?
తెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య కొనసాగుతున్న జల వివాదంపై మంత్రి నారా లోకేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నీటి అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం సరికాదని హితవు పలికారు. తెలంగాణ దాటి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన తర్వాత ప్రాజెక్టు కడితే తప్పేమిటి?.. మేం అదే నీటిని లిఫ్ట్ చేసి రాయలసీమకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. తెలంగాణ వాటాకు ఎక్కడా చిల్లు పెట్టడం లేదు కదా? కనీసం కామన్ సెన్స్‌తో ఆలోచించాలి అని వ్యాఖ్యానించారు. నీటి కోసం చిన్న పరిమాణాలకైనా పెద్ద వివాదాలు జరిగాయని గుర్తుచేశారు మంత్రి. ఒక టీఎంసీ కోసం రాష్ట్రాల మధ్య, 10 టీఎంసీల కోసం దేశాల మధ్య కూడా గతంలో వివాదాలు నడిచాయి. సముద్రంలో కలిసే వరద నీటిని సద్వినియోగం చేసుకుంటే తప్పేమిటి? అని ప్రశ్నించారు. పట్టిసీమ ప్రాజెక్టుపై గత వైసీపీ ప్రభుత్వం వైఖరిని కూడా ఆయన విమర్శించారు లోకేష్.. పట్టిసీమ దండగ అన్న వైఎస్ జగన్.. ఐదేళ్లు అధికారంలో ఉండగానే ఆ ప్రాజెక్టును ఆపరేట్ చేశారు. 2020లో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే ఈ ప్రాజెక్టుపై స్టే వచ్చింది అని అన్నారు. మరోవైపు, తమ పర్యటనల ఖర్చుల విషయంలోనూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మంత్రి లోకేష్. నా పర్యటనల్లో ఖర్చు పెట్టే ప్రతి రూపాయి మేమే పెట్టుకుంటున్నాం. ప్రభుత్వం నుంచి తీసుకోవడం లేదు. నాది, బాబు గారి క్రెడిట్ కార్డు బిల్లులు కూడా అమ్మ, బ్రహ్మణి కడుతున్నారు అని వెల్లడించారు.
అమరావతి రైతులకు గుడ్‌న్యూస్..! ల్యాండ్ పూలింగ్‌లో భూములు ఇచ్చేవారికి రుణ మాఫీ..
కూటమి ప్రభుత్వం అమరావతి రాజధాని అభివృద్ధిపై ఫోకస్ పెట్టింది.. గతంలో సేకరించిన భూములతో పాటు.. ఇప్పుడు కొత్తగా మరిన్ని భూములు సేకరించేందుకు శ్రీకారం చుట్టారు.. ఇక, అమరావతి రాజధాని ప్రాంత రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. ల్యాండ్ పూలింగ్ పథకంలో కొత్తగా భూములు ఇచ్చిన రైతు కుటుంబాలకు 1.5 లక్షల రూపాలయ వరకు రుణమాఫీ వర్తింపజేయనున్నట్లు మంత్రి నారాయణ ప్రకటించారు. అయితే, ఈ మాఫీ నిన్నటి వరకూ ఉన్న వ్యవసాయ రుణాలకు మాత్రమే వర్తిస్తుందని, కొత్తగా తీసుకునే రుణాలకు ఇది వర్తించదని ఆయన స్పష్టం చేశారు. అమరావతి మండలం ఎండ్రాయి గ్రామంలో ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను అధికారికంగా ప్రారంభించారు మంత్రి నారాయణ. ఈ సందర్భంగా గ్రామ రైతులు మంత్రి, ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ కుమార్‌కు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యేతో కలిసి రైతులతో సమావేశం నిర్వహించిన మంత్రి, ల్యాండ్ పూలింగ్ వల్ల కలిగే ప్రయోజనాలు, ప్రభుత్వం చేపట్టనున్న అభివృద్ధి ప్రణాళికలపై వివరించారు. ఎండ్రాయిలో ల్యాండ్ పూలింగ్ కాంపిటెంట్ అథారిటీ కార్యాలయాన్ని మంత్రి నారాయణ, ఎమ్మెల్యే ప్రవీణ్ కుమార్, CRDA కమిషనర్ కన్నబాబు కలిసి ప్రారంభించారు. అదే రోజు 400 ఎకరాలకు చెందిన రైతులు అంగీకార పత్రాలు సమర్పించి, తమ భూములను ల్యాండ్ పూలింగ్‌కు ఇచ్చేందుకు ముందుకొచ్చారు. ఈ భూముల అంగీకార పత్రాలను రైతులు స్వయంగా మంత్రి నారాయణకు అందజేశారు. ఎండ్రాయి గ్రామంలో మొత్తం 1925 ఎకరాల భూమిని సమీకరించేందుకు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ల్యాండ్ పూలింగ్‌కు రైతులు చూపుతున్న స్పందన పట్ల మంత్రి నారాయణ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. ఈ జిల్లాల్లో రెండు రోజులు భారీ వర్షాలు..!
ఆగ్నేయ బంగాళాఖాతంలోని వాయుగుండం రాగల 24 గంటల్లో తీవ్రవాయుగుండంగా బలపడనుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీని ప్రభావంతో నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో శని, ఆదివారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో శ్రీలంకకు సమీపంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం, వచ్చే 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని.. ప్రస్తుతం పశ్చిమ–వాయవ్య దిశగా కదులుతూ నైరుతి బంగాళాఖాతం వైపు ప్రయాణిస్తోందని పేర్కొంది.. తీవ్ర వాయుగుండంతో రాష్ట్రంపై ప్రత్యక్ష ప్రభావం తక్కువగా ఉన్నప్పటికీ.. నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో శనివారం, ఆదివారం రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అయితే, రాష్ట్రంలో రాగల 48 గంటలు పొడి వాతావరణం కొనసాగుతుంది. ఉదయం వేళల్లో కొన్ని ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.. వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో చలి తీవ్రత కొంత తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాత్రి ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగి, చలి ప్రభావం తగ్గుముఖం పట్టే సూచనలు ఉన్నాయి.
సంక్రాంతి సంబరాలు.. రేపటి నుంచి పిఠాపురంలో పవన్ కల్యాణ్ పర్యటన..
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. మూడు రోజులపాటు తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో పర్యటించనున్నారు. రేపు రాత్రికి పిఠాపురం చేరుకోనున్న పవన్.. శుక్రవారం ఉదయం పీఠికాపుర సంక్రాంతి మహోత్సవం పేరిట నిర్వహించనున్న ముందస్తు సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటారు. ఉదయం 10.30 గంటలకు ఆర్.ఆర్.బి.హెచ్.ఆర్. కళాశాల మైదానానికి చేరుకుని సంక్రాంతి సంబరాలను ప్రారంభిస్తారు. ఉదయం 11.30 గంటలకు నియోజకవర్గ పరిధిలో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. అనంతరం సంక్రాంతి మహోత్సవంలో పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలు, స్టాళ్లను తిలకిస్తారు. సాయంత్రం పిఠాపురం మున్సిపాలిటీ పరిధిలో ఇటీవల ముంపునకు గురైన ఇందిరానగర్ కాలనీ, రైల్వే స్టేషన్ సమీపంలోని మోహన్ నగర్ లను సందర్శిస్తారు. శనివారం ఉదయం గొల్లప్రోలు ప్రాంతంలోని ఇళ్ల స్థలాలను పరిశీలిస్తారు. అక్కడి నుంచి ఉదయం 10. 30 గంటలకు కాకినాడలోని జిల్లా పోలీస్ కార్యాలయానికి చేరుకుని శాంతి భద్రతలపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు కాకినాడలోని రంగరాయ మెడికల్ కళాశాలకు చేరుకుని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు.
మున్సిపల్ ఎన్నికల కోసం సిద్ధమైన ఈసీ.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఈసీ) పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతోంది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, మున్సిపల్, కార్పొరేషన్ కమిషనర్లతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు తీసుకోవాల్సిన చర్యలు, టైమ్‌లైన్స్‌పై కమిషన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. సమావేశంలో భాగంగా కలెక్టర్లకు ముఖ్యంగా ఓటర్ల జాబితా, పోలింగ్ స్టేషన్ల వివరాల ప్రచురణపై డెడ్‌లైన్లు నిర్దేశించారు. జనవరి 12వ తేదీ నాటికి తుది ఓటర్ల జాబితాను తప్పనిసరిగా ప్రచురించాలని ఈసీ ఆదేశించింది. 13వ తేదీ నాటికి పోలింగ్ స్టేషన్ల వివరాలతో కూడిన ముసాయిదా జాబితాను విడుదల చేసి, వెంటనే టీ పోల్ యాప్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించారు. ఇక, జనవరి 16వ తేదీ లోపు పోలింగ్ స్టేషన్ల పూర్తి వివరాలతో పాటు ఫోటోలతో కూడిన తుది జాబితా, తుది ఓటర్ల జాబితాను వార్డు పరిధిలోని అన్ని పోలింగ్ స్టేషన్లలో ప్రదర్శించాలని ఆదేశించారు. ఈ చర్య ద్వారా ఓటర్లకు తమ పోలింగ్ కేంద్రం, వివరాలు సులభంగా అందుబాటులోకి వస్తాయని ఈసీ పేర్కొంది. ఎన్నికల నిర్వహణకు అవసరమైన మౌలిక వసతులపై కూడా ఈసీ కలెక్టర్లకు దిశానిర్దేశం చేసింది. పోలింగ్‌కు అవసరమైన బ్యాలెట్ బాక్స్‌లు, ఎన్నికల సిబ్బంది నియామకం, రిటర్నింగ్ ఆఫీసర్లు (RO), అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లు (ARO), ఫ్లయింగ్ స్క్వాడ్స్, సిట్టింగ్/సర్వైలెన్స్ స్క్వాడ్స్ను నియమించి, ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించాలని కమిషన్ సూచించింది. మరోవైపు, ఎన్నికల ఏర్పాట్లు పారదర్శకంగా, సమయపాలనతో జరిగితేనే ప్రజాస్వామ్య ప్రక్రియ బలోపేతమవుతుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ స్పష్టం చేశారు. కలెక్టర్లు ఈ డెడ్‌లైన్లను కచ్చితంగా పాటిస్తూ, అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని ఎన్నికలకు సిద్ధం కావాలని ఆదేశించారు. అయితే, మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ఈసీ తీసుకున్న ఈ నిర్ణయాలు ఎన్నికల వేళ కీలకంగా మారనున్నాయి. ఓటర్లకు ఇబ్బందులు లేకుండా ఎన్నికలు జరగాలనే లక్ష్యంతోనే ఈ ఆదేశాలు జారీ చేసినట్లు కమిషన్ వర్గాలు వెల్లడించాయి.
యుద్ధ ప్రాతిపదికన మేడారం ఆలయ పునర్నిర్మాణ పనులు పూర్తి చేశాం..!
యుద్ధ ప్రాతిపదికన మేడారం ఆలయ పునర్నిర్మాణ పనులు పూర్తయ్యాయని మంత్రి సీతక్క అన్నారు. ఆలయ పునర్నిర్మాణ పనులకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ నెల 19న ఉదయం 7 గంటలకు మేడారం ఆలయాన్ని సీఎం ప్రారంభిస్తారని వెల్లడించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధిపై జరిగిన రివ్యూ మీటింగ్ లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వరంగల్ జిల్లా అభివృద్ధికి రేవంత్ రెడ్డి ఎంతో సహకరిస్తున్నారన్న సీతక్క మేడారం మహాజాతరకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని వెల్లడించారు. హైదరాబాద్ తో పోల్చుకొని హైదరాబాద్ తర్వాత మరి అంత స్థాయిలో డెవలప్ చేసే విధంగా ఒక సంకల్పాన్ని పెట్టుకొని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుకు వెళ్ళడం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టుదలతోటి ఎయిర్ పోర్ట్ ను కూడా ఇక్కడికి తీసుకురావడం.. వారికి ఉమ్మడి వరంగల్ జిల్లా గారి మీద ఉన్నటువంటి అభిమానానికి నిదర్శనం అన్నారు.
గచ్చిబౌలిలో భారీగా డ్రగ్స్ పట్టివేత.. 12 మంది అరెస్ట్..!
గచ్చిబౌలి ప్రాంతంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. స్టార్ హోటల్‌లో జరుగుతున్న డ్రగ్ పార్టీని పోలీసులు భగ్నం చేయడంతో నగరంలో సంచలనం నెలకొంది. తెలంగాణ ఈగిల్ (EAGLE) ఫోర్స్, గచ్చిబౌలి పోలీసులతో కలిసి సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో డ్రగ్స్ సేవించిన యువకులను అదుపులోకి తీసుకున్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని గచ్చిబౌలి మసీద్ బండా ప్రాంతంలో ఉన్న కోవ్ స్టేస్ (Kove Stays) హోటల్‌లో డ్రగ్ పార్టీ జరుగుతోందన్న సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. మంగళవారం రాత్రి సమయంలో రూమ్ నెంబర్ 309పై ఈగిల్ ఫోర్స్, గచ్చిబౌలి పోలీసులు కలిసి ఆకస్మిక దాడులు నిర్వహించారు. దాడుల సమయంలో గదిలో ఏడుగురు మద్యం సేవిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గదిని పూర్తిగా తనిఖీ చేసినప్పటికీ, అక్కడ ఎలాంటి మత్తు పదార్థాలు భౌతికంగా లభించలేదు. అయితే అనుమానం రావడంతో అందరికీ యూరిన్ డ్రగ్ టెస్ట్ నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఐదుగురికి గంజాయి సేవించినట్లు పాజిటివ్ ఫలితాలు వచ్చాయి. వారు గత రోజే గంజాయి సేవించినట్లు విచారణలో స్వయంగా అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.
యూఎస్-రష్యా మధ్య ప్రతిష్టంభన.. ఆయిల్ ట్యాంకర్ సీజ్ చేసిన అమెరికా…
రష్యన్ ప్లాగ్ కలిగిన ఆయిల్ ట్యాంకర్‌ను యూఎస్ దళాలు సీజ్ చేశాయి. అట్లాంటిక్ మీదుగా ప్రయాణిస్తున్న ‘మరినెలా’ అనే ఈ చమురు ట్యాంకర్‌ను గత రెండు వారాలుగా యూఎస్ ట్రాక్ చేస్తోంది. వెనిజులాతో సంబంధ ఉన్న ఈ ట్యాంకర్‌ను యూఎస్ నియంత్రించేందుకు ప్రయత్నించింది. దీంతో, యూరప్ సముద్ర తీరాల్లో రెండు దేశాల మధ్య ఉద్రికత్త నెలకొంది. ఈ ఆపరేషన్ జరుగుతున్న సమయంలో, రష్యా యుద్ధ నౌకలు, ఒక సబ్‌మెరీన్ కూడా ఇదే ప్రాంతంలో ఉన్నట్లు సమాచారం. రష్యన్ మీడియా చెబుతున్న దాని ప్రకారం.. అమెరికా బలగాలు హెలికాప్టర్ ద్వారా ‘మరినెలా’ అనే ట్యాంకర్ పైకి ఎక్కేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పింది. దీనికి సంబంధించిన చిత్రాలను కూడా విడుదల చేసింది. అమెరికన్ కోస్ట్ గార్డ్ నౌక చాలా రోజులగా ట్యాంకర్‌ను వెండిస్తున్నట్లు పేర్కొంది. యూఎస్ కోస్ట్ గార్డ్ ఓడపైకి ఎక్కేటప్పుడు మారినెలా సమీపంలో రష్యన్ నౌకలు లేవని న్యూ్యార్క్ టైమ్స్ నివేదించింది. దీని వల్ల యూఎస్, రష్యన్ దళాల మధ్య ప్రతిష్టంభన తప్పిందని చెప్పింది.
టెలికాం కంపెనీలకు ట్రాయ్ షాక్.. రూ.150 కోట్లు ఫైన్!
స్పామ్ కాల్స్, సందేశాలను అరికట్టడంలో విఫలమైనందుకు టెలికాం ఆపరేటర్లపై టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) రూ.150 కోట్ల జరిమానా విధించింది. ఈ రూ.150 కోట్ల జరిమానా 2020 నుంచి మూడు సంవత్సరాల పాటు వర్తిస్తుందని చెప్పింది. జరిమానాకు ప్రధాన కారణం స్పామ్ కాల్స్, సందేశాలను ఆపడంలో టెలికాం కంపెనీలు విఫలమవడం, వినియోగదారుల ఫిర్యాదులను సరిగ్గా పట్టించుకోవడం అని ట్రాయ్ పేర్కొంది. పలు నివేదికల ప్రకారం.. టెలికాం కంపెనీలు TRAI విధించిన ఈ జరిమానాను సవాలు చేసినట్లు సమాచారం. నిబంధనలను పాటించని టెలికాం ఆపరేటర్లపై TRAI జరిమానాలు విధించింది. గత సంవత్సరం TRAI 2.1 మిలియన్ల స్పామర్‌లను డిస్‌కనెక్ట్ చేసింది, 100,000 కంటే ఎక్కువ మందిని బ్లాక్ చేసింది. సెప్టెంబర్ 2024లో TRAI 1.88 మిలియన్ల స్పామర్ కనెక్షన్‌లను డిస్‌కనెక్ట్ చేసి, 1,150 మందిని బ్లాక్‌లిస్ట్ చేసింది. పలు నివేదికల ప్రకారం.. టెలికాం ఆపరేటర్లపై TRAI ఈ జరిమానా విధించిందని, స్పామ్ కాల్‌లు లేదా సందేశాలు పంపినవారిపై కంపెనీలు తగిన చర్యలు తీసుకోవడంలో విఫలమైనందుకు ఈ జరిమానా విధించిందని పేర్కొంది. స్పామ్ కాల్స్, సందేశాలను నియంత్రించడంలో వినియోగదారుల ఫిర్యాదులు గణనీయమైన పాత్ర పోషిస్తాయి. టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు అనేక వినియోగదారుల ఫిర్యాదులను తప్పుగా మూసివేసినట్లు ట్రాయ్ దర్యాప్తులో తేలింది. దీంతో ఈ కంపెనీలకు ట్రాయ్ జరిమానా విధించినట్లు పేర్కొంది. ఇదే టైంలో TRAI ఒక DND యాప్‌ను కూడా ప్రారంభించింది. ఇది వినియోగదారులు ఏదైనా స్పామ్ కాల్ లేదా సందేశాన్ని నివేదించడానికి అనుమతిస్తుంది.
ఈపీఎఫ్ వేజ్ సీలింగ్‌ను పెంచే దిశగా కీలక మైలురాయి..
ఉద్యోగుల సామాజిక భద్రతకు కీలకమైన ఈపీఎఫ్ (ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్) వేజ్ సీలింగ్‌ను పెంచే దిశగా కీలక మైలురాయి పడింది. ప్రస్తుతం రూ.15 వేలుగా ఉన్న వేజ్ సీలింగ్‌ను తాజాగా సుప్రీంకోర్టు సమీక్షించి, 4 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. 2014 సెప్టెంబర్ నుంచి ఈ లిమిట్ మారలేదు… ఇంతకాలం జీతాలు, ధరలు పెరిగినా ప్రభుత్వం చలనం లేదంటూ ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు అత్యున్నత న్యాయస్థానం జోక్యం చేసుకుని కేంద్రాన్ని ఆ వైపుగా ఆలోచించేలా ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ జేకే మహేశ్వరి, ఏఎస్ చందుర్కర్ ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. సామాజిక కార్యకర్త నవీన్ ప్రకాష్ నౌటియాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం ధర్మాసనం విచారణ జరిపింది. విచారణలో ఈపీఎఫ్‌ఓ (ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్) నిర్వహిస్తోన్న సామాజిక భద్రత పథకాల నుంచి రూ.15 వేలకు పైగా జీతం తీసుకునే ఉద్యోగులు బయటపడుతున్నారని పిటిషనర్ ఆరోపించారు. ఈ వేజ్ సీలింగ్ అంటే ఈపీఎఫ్, ఈపీఎస్ (పెన్షన్ స్కీమ్), ఈడీఎల్‌ఐ (డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్) పథకాలకు తప్పనిసరి కంట్రిబ్యూషన్ చేయాల్సిన గరిష్ఠ జీతం లిమిట్. పిటిషనర్ తరఫు న్యాయవాదులు ప్రణవ్ సచ్దేవ, నేహా రాథీ వాదనలు వినిపించారు.
ఇది కదా అసలైన పుత్రోత్సాహం!
“పుత్రోత్సాహము తండ్రికి.. పుత్రుడు జన్మించినపుడు పుట్టదు, జనులా.. పుత్రుని కనుగొని పొగడగ.. పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ!” అని సుమతీ శతకంలో పేర్కొన్నట్లు, ఒక తండ్రికి కుమారుడు పుట్టినప్పుడు కాదు, అతని విజయాన్ని చూసి జనం పొగిడినప్పుడే అసలైన పుత్రోత్సాహం. ఆ అసలైన పుత్రోత్సాహాన్ని ఈరోజు అనిల్ రావిపూడి తండ్రి ఫీలయ్యారు. అనిల్ రావిపూడి తండ్రి రావిపూడి బ్రహ్మయ్య గారు, ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ సంస్థలో ఒక డ్రైవర్‌గా పనిచేసేవారు. ఈ విషయాన్ని గతంలోనే అనిల్ రావిపూడి పలు సందర్భాలలో వెల్లడించారు. అయితే, ఇప్పుడు తన కుమారుడు పెద్ద డైరెక్టర్ అయిపోవడంతో, రిటైర్మెంట్ తర్వాత కుమారుడు డైరెక్టర్‌గా పనిచేసే సినిమాలకే ప్రొడక్షన్ మేనేజర్‌గా వ్యవహరిస్తూ వస్తున్నారు. అనిల్ డైరెక్ట్ చేసే సినిమాల్లో అడపాదడపా కనిపిస్తూ కూడా ఉంటారు. అయితే, ఈరోజు మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన మన శంకర్ వరప్రసాద్ గారు’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన హైలైట్ అయ్యారు. అనిల్ రావిపూడి వెనుక సీటులో కూర్చున్న ఆయన, అనుకోకుండా మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్‌లతో పాటు తన కుమారుడు అనిల్ రావిపూడి వెనుకే ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తూ, తన కుమారుడి వైభవాన్ని చూస్తూ ఎమోషనల్ అవ్వడం వీడియోలలో కనిపిస్తోంది. మొత్తంగా ‘ఇది కదా అసలైన పుత్రోత్సాహం’ అనే కామెంట్స్ సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.
కళ్లు చెమర్చే వీడియో..మెగాస్టార్ ఒడిలో ఆ చిన్నారి.. చిరంజీవి మాటలకు నెటిజన్లు ఫిదా!
ప్రస్తుతానికి ‘జీ తెలుగు’ ఛానల్‌లో ‘సూపర్ సింగర్ లిటిల్ ఛాంప్స్’ అంటూ ఒక ప్రోగ్రాం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి సుధీర్ యాంకర్‌గా వ్యవహరిస్తుండగా, జడ్జిలుగా అనంత శ్రీరామ్, అనిల్ రావిపూడి, ఎస్పీ శైలజ వ్యవహరిస్తున్నారు. అయితే ఈ సీజన్‌లో వరుణవి అనే చిన్నారి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తోంది. వాస్తవానికి ఆమె దివ్యాంగురాలు, పుట్టుక నుంచే రెండు కళ్ళు కనిపించవు. అయినా తన ముద్దు ముద్దు పాటలతో, మాటలతో ఈ సీజన్ మొత్తానికి ఆమె హైలైట్ అవుతోంది. ఒకరకంగా ఆమె వల్లే ఈ సీజన్ ఇంతగా టీఆర్పీ తెచ్చుకుంటుంది అని చెప్పొచ్చు. అయితే, ఆమె అడక్క అడక్క ఈ మధ్య అనిల్ రావిపూడిని తనను మెగాస్టార్ చిరంజీవి దగ్గరికి తీసుకువెళ్ళమని, కలిపించమని కోరింది. అక్కడికక్కడే మెగాస్టార్ అపాయింట్‌మెంట్ తీసుకున్న అనిల్ రావిపూడి, తాజాగా ఆ చిన్నారిని మెగాస్టార్ చిరంజీవి దగ్గరికి తీసుకువెళ్లారు. ఇక తన ఒడిలో కూర్చోబెట్టుకుని ఆ చిన్నారితో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఆ వీడియో చూసిన ఎవరైనా ఎమోషనల్ కాకుండా ఉండలేరు. ఆ చిన్నారికి ఎలాంటి అవసరమున్నా తాను అండగా ఉంటానంటూ మెగాస్టార్ చిరంజీవి ఆ చిన్నారి కుటుంబ సభ్యులకు అభయం ఇవ్వడం గమనార్హం.