మంత్రి సవితతో నాకు ఎలాంటి విభేదాలు లేవు.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ
మంత్రి సవిత.. హిందూపురం ఎంపీ పార్థసారథి మధ్య విభేదాలు ఉన్నాయనే ప్రచారం సాగుతూ వచ్చింది.. అయితే, దానిపై క్లారిటీ ఇచ్చారు హిందూపురం ఎంపీ పార్థసారథి.. కార్యకర్తల్ని విస్మరిస్తే, వారిని కాపాడలేక పోతే నాయకులకు భవిష్యత్తు ఉండదని స్పష్టం చేశారు.. కానీ, మంత్రి సవితకు నాకు ఎటువంటి గొడవలు లేవు, కలిసే పని చేస్తాం అంటూ ఎంపీ పార్థసారథి వారి ఇరువురి మధ్య ఉన్న వైరానికి తెరదించారు. కాగా, గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యే టికెట్ పార్థసారథి ఆశించి భంగపడ్డారు, ప్రస్తుత మంత్రి సవిత అప్పట్లో తెలుగుదేశం పార్టీ టికెట్‌ను సాధించి గెలిచి మంత్రి అయ్యారు. అప్పటినుండి పెనుగొండ నియోజకవర్గంలో మంత్రి మరియు పార్థసారథి ఎంపీ వర్గాలుగా విడిపోయారనే విమర్శలు ఉన్నాయి.. ఈరోజు సోమందేపల్లిలో జరిగిన భగీరథ కళ్యాణమండపం భూమి పూజలో మంత్రి మరియు ఎంపీ పార్థసారథి పాల్గొన్నారు. సభలో మంత్రి మాట్లాడుతూ ఎంపీ పార్థసారథి 80 లక్షల రూపాయలు భగీరథ కళ్యాణ మండపానికి కేటాయించడం సంతోషకరమని అన్నారు. ఎంపీ పార్థసారథి మాట్లాడుతూ.. ఒకానొక సమయంలో స్వార్థపరులుగా తామిద్దరం వ్యవహరించినట్టు అనిపిస్తోందని వ్యాఖ్యానించారు.. తనకు 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందని పరిటాల రవి, పరిటాల సునీత అప్పటి మంత్రి రామచంద్ర రెడ్డితో కలిసి పని చేసిన ఎప్పుడూ విభేదాలు రాలేదని మరి ఎందుకు ఇప్పుడు మంత్రి సవితతో విభేదాలు వచ్చాయో అర్థం కాలేదన్నారు.. అయితే, కొంతమంది స్వార్థపరులు ఇద్దరు మాట్లాడకుండా ఉంటే వారికి పబ్బం గడపదని విభేదాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు.. ఇద్దరి మధ్య విభేదాల వల్ల కార్యకర్తలు దెబ్బతింటున్నారని, ఇక నుండి తాము కలిసి పనిచేసి అభివృద్ధికి పాటుపడతామని ఎంపీ పార్థసారథి స్పష్టం చేశారు..
2047 నాటికి అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఏపీ..!
2047 నాటికి అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉండాలని ఆకాక్షించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. కృష్ణా జిల్లా పోరంలో ఎనర్జీ ఎఫీసెన్సీపై నిర్వహిస్తున్న ఉర్జావీర్ కార్యక్రమoలో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, మంత్రి నారాయణ, ఇంధన శాఖ అధికారులు తదితరులతో కలిసి పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మనోహర్ లాల్ ఖట్టర్ రెండు నిముషాలు తెలుగులో మాట్లాడటంతో విజయవాడ ప్రజలకు గుర్తుంటారన్న ఆయన.. ప్రధాని మోడీకి ఎంతో ఇష్టమైన నాయకుడు మనోహర్ లాల్ కావడంతో ప్రధాన డిపార్ట్మెంట్‌లు ఇచ్చారు అని పేర్కొన్నారు. ఇక, ఆన్‌లైన్ లో రిజిస్ట్రేషన్ లు ఎంతో వేగంగా జరుగుతున్నాయి.. EESL లో రిజిష్టర్ చేసుకుని ఇంటి వద్ద నుంచే సంపాదించుకుంటున్నారు.. అంగన్వాడీలు ఇప్పుడు ఇచ్చిన స్టవ్ ల ద్వారా వేగంగా వంటలు చేయగలరు.. 43 వేల స్కూళ్ళలో పేరెంట్స్ కమిటీ మీటింగ్ పెట్టింది ప్రపంచంలోనే మొదటిసారి… ఏ రాష్ట్రంలో అయినా తలసరి విద్యుత్ వినియోగం తలసరి ఆదాయాన్ని చెపుతుంది.. పరిశ్రమలు, వ్యవసాయం, వాహనాలు అన్నిటికీ విద్యుత్ అవసరం అన్నారు..
కడపలో ప్రేమోన్మాది ఘాతుకం.. యువతిపై కత్తితో విచక్షణారహితంగా దాడి..
కడప జిల్లాలో ప్రేమోన్మాది రెచ్చిపోయారు.. తనను ప్రేమించలేదని ప్రేమోన్మాది ఓ యువతిపై కత్తితో విచక్షణ రహితంగా దాడి చేశారు. వేముల మండలం కొత్తపల్లిలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటరిగా ఉన్న షర్మిల అనే యువతిపై కులయప్ప అనే యువకుడు కత్తితో దాడి చేశారు. బాలిక కేకలు వేయడంతో చుట్టుపక్కల ఉన్న వారు అక్కడకు రావడంతో వారిని చూసి కులయప్ప పరారయ్యారు. అయితే, రక్తపు మడుగులో ఉన్న షర్మిలను చికిత్స కోసం బంధువులు పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో పులివెందులలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె శరీరంపై 14 కత్తిపోట్లు ఉన్నాయని డాక్టర్లు గుర్తించారు. షర్మిల అపస్మారక స్థితిలో ఉండడంతో పాటు రక్తస్రావం ఎక్కువగా అవుతుండడంతో మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్ కు తరలించారు. షర్మిల తండ్రి వీఆర్ఏగా పనిచేస్తూ రెవెన్యూ గ్రామసభలు కోసం గొందిపల్లెకు వెళ్లారు. తల్లి కూలి పనికి వెళ్లడంతో ఇంట్లో షర్మిల ఒక్కరే ఉన్నారు.. అయితే, ఇదే అదునుగా భావించిన ఉన్మాది.. ఇంట్లోకి దూరి ఘాతుకానికి పాల్పడ్డాడు.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ ఘటన జరిగినట్లు బంధువులు వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తెలంగాణలో మార్పు బీజేపీతోనే సాధ్యం
కాంగ్రెస్ ఏడాది పాలనలో హామీలు అమలు చేయకుండా ప్రజల్ని మోసం చేసిందని కేంద్ర మంత్రి, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్రంగా విమర్శలు గుప్పించారు. ప్రజల వికాసానికి బీజేపీ పనిచేస్తుందని.. కాంగ్రెస్ పార్టీ వాళ్ల స్వలాభం కోసం పని చేస్తుందని అన్నారు. 70 ఏళ్లుగా ప్రభుత్వ వ్యతిరేకత గురించి విన్నామని.. మోడీ ప్రధాని అయ్యాక ప్రభుత్వ అనుకూలత గురించి వింటున్నామన్నారు. హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో బీజేపీ బహిరంగ సభలో జేపీ నడ్డా ప్రసంగించారు. బీజేపీ ఒంటరిగా 13 రాష్ట్రాల్లో అధికారంలో ఉందని.. ఎన్డీఏ కూటమి మరో 6 రాష్ట్రాల్లో అధికారంలో ఉందని చెప్పుకొచ్చారు. తెలంగాణ ప్రజలు బీజేపీ ప్రభుత్వం కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు. ప్రాంతీయ పార్టీల సహకారంతోనే కాంగ్రెస్ పార్టీ గెలుస్తూ ఉంటుందన్నారు. ఇరు పార్టీల బలహీనతలే కాంగ్రెస్ బలమని జేపీ నడ్డా వ్యాఖ్యానించారు. కర్ణాటక, హిమాచల్, తెలంగాణలో అబద్ధపు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఒక్కటేనని.. తెలంగాణలో మార్పు బీజేపీతోనే సాధ్యమన్నారు. రేవంత్ ప్రభుత్వం మాయలఫకీర్‌లా మోసం చేస్తోందని విమర్శించారు. మూడో సారి వరుసగా ప్రధాని అయిన వ్యక్తి మోడీ అని, జవహర్ లాల్ నెహ్రూ అయినప్పుడు ప్రతిపక్షాలు లేవన్నారు.
జనవరిలో రైతు భరోసా.. మూసీ ప్రక్షాళన జరగాల్సిందే.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించడంలో నల్గొండ జిల్లా ముందువరుసలో ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఉద్యమంలో ఆత్మబలిదానం చేసుకున్న శ్రీకాంతాచారి నల్గొండవాసేనని సీఎం తెలిపారు. నల్గొండలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. అంతకు ముందు నూతన మెడికల్ కళాశాల భవనాన్ని ప్రారంభించారు. ఆనాడు భూమి కోసం, భుక్తి కోసం సాయుధ రైతాంగ పోరాటానికి నాయకత్వం వహించిన గడ్డ ఇదంటూ ఆయన కీర్తించారు. రజాకార్ల అరాచకాలకు ఎదురొడ్డి నిలిచిన జిల్లా నల్గొండ అని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయం కంటే కేసీఆర్ పాలనలో నల్గొండ జిల్లాకు ఎక్కువ అన్యాయం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పూర్తి చేసి ఉంటే ఫ్లోరైడ్ సమస్య పరిష్కారమయ్యేదని.. కేసీఆర్ నిర్లక్ష్యం కారణంగా నల్గొండ జిల్లా అభివృద్ధికి నోచుకోలేదని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. వరి వేసుకుంటే ఉరి వేసుకున్నట్టేనని, ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం అన్నదని సీఎం చెప్పారు. 500 రూపాయల బోనస్ ఇచ్చి, వ్యవసాయం అంటే పండగ అనేలా ప్రభుత్వం చేస్తోందన్నారు. అధికారంలో ఉంటే పాలన, లేదంటే ఫాంహౌస్‌కు పరిమితం కావడం సరికాదని.. గెలిచినా, ఓడినా ప్రజలతోనే ఉండాలన్నారు. కేసీఆర్ ఎప్పుడైనా ప్రతిపక్ష నేత పాత్ర పోషించారా?.. శాసనసభలో ప్రతిపక్ష స్థానం ఖాళీగా ఉండటం తెలంగాణ సమాజానికి మంచిది కాదన్నారు.
ప్రధాని మోడీని చంపేస్తామని బెదిరింపులు..
ప్రధాని నరేంద్రమోడీని చంపేస్తామని ముంబై పోలీసులకు శనివారం బెదిరింపు మెసేజ్‌లు వచ్చినట్లు ఓ అధికారి తెలిపారు. అజ్మీర్‌కి చెందిన ఓ నెంబర్ నుంచి ఈ మెసేజ్ వచ్చినట్లు గుర్తించామని, నిందితుడిని పట్టుకునేందుకు అక్కడికి పోలీస్ టీంలను పంపామని అధికారి తెలిపారు. తెల్లవారుజామున ట్రాఫిక్ పోలీస్ హెల్ప్‌లైన్‌కి వాట్సాప్ మెసేజ్ వచ్చింది. ఇద్దరు ఐఎస్ఐ ఏజెంట్లు ప్రధాని మోడీని లక్ష్యంగా చేసుకుని బాంబు పేలుడుకు ప్లాన్ చేసినట్లు పేర్కొన్నాడు. ఈ మెసేజ్ పంపిన వ్యక్తి మెంటల్‌గా సరిగా ఉన్నాడా.? మద్యం మత్తులో ఉన్నాడా..? అని పోలీసులు అనుమానిస్తున్నారు. తదుపరి విచారణ కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. ముంబై ట్రాఫిక్ పోలీసులకు హెల్ప్‌లైన్‌కి గతంలో సల్మాన్ ఖాన్‌ని చంపేస్తాంటూ కూడా బెదిరింపు మెసేజ్‌లు వచ్చాయి.
వామ్మో.. వాడు తప్పిపోయిన కొడుకు కాదు.. బయటపడ్డ నిజస్వరూపం
ఉత్తరప్రదేశ్‌లో కొత్త తరహా దోపిడీ వ్యవహారం బయటపడింది. నిందితుడిని చాకచక్యంగా పట్టుకుని కటకటాల వెనక్కి పంపించారు. ఈ ఘటన ఘజియాబాద్‌లో చోటుచేసుకుంది. ఇటీవల రాజు అనే యువకుడు ఘజియాబాద్ పోలీస్ స్టేషన్‌లో ప్రత్యక్షమయ్యాడు. 30 ఏళ్ల క్రితం తాను కిడ్నాప్‌కు గురైనట్లు.. సోదరితో స్కూల్‌కి వెళ్తుండగా అగంతకులు ఎత్తుకెళ్లిపోయారని స్టోరీ చెప్పాడు. నిజమే అనుకుని పోలీసులు ఆశ్రయించి.. ప్రకటనలు ఇచ్చారు. ఓ వ్యక్తి.. తప్పిపోయిన మేనల్లుడే అనుకుని ఇంటికి తీసుకెళ్లాడు. ఇంట్లో వాళ్లు కూడా ముచ్చటపడ్డారు. తప్పిపోయిన బిడ్డ తిరిగి వచ్చాడని ఎమోషనల్ అయ్యారు. ఇంట్లో పరిస్థితులు అన్ని కుదిటపడ్డాక.. అతగాడి నిజస్వరూపం బయటపడింది. ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయని ఆరా తీయడం మొదలుపెట్టాడు. దీంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు.. డీఎన్‌ఏ టెస్ట్ నిర్వహించారు. డీఎన్‌ఏ టెస్ట్‌లో కుటుంబ సభ్యులతో సరిపోలేదు. దీంతో తమదైన శైలిలో విచారిస్తే.. రాజు నేరాన్ని అంగీకరించాడు. ఎక్కడెక్కడా పిల్లలు తప్పిపోయిన కుటుంబాలు ఉన్నాయో.. ఎంక్వైరీ చేసి వారి ఇంట్లోకి ప్రవేశించి ఆస్తులు వివరాలు తెలుసుకుని దోపిడీ చేస్తున్నట్లు నేరాన్ని ఒప్పుకున్నాడు.
మహా వికాస్ అఘాడీలో లుకలుకలు.. కూటమి నుంచి వైదొలిగిన ఎస్పీ
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహా వికాస్ అఘాడీ కూటమి ఘోరంగా ఓటమి పాలైంది. కూటమిలో పార్టీకి ఆశించ దగ్గ సీట్లు రాలేదు. ఓ వైపు ఈవీఎంలపై నెపం నెడుతున్నా.. ఇంకోవైపు పార్టీలో విభేదాలు మాత్రం కొట్టిచ్చినట్లు కనబడుతున్నాయి. ఒకరిపై ఒకరు నిందలు వేసుకునే స్థితికి వచ్చాయి. దీంతో కూటమి విభేదాలు తారాస్థాయికి చేరాయి. తాజాగా బాబ్రీ మసీదు కూల్చివేతకు సంబంధించి శివసేన (యూబీటీ) నేత చేసిన వ్యాఖ్యలు మరింత ఆజ్యం పోశాయి. ఆ వ్యాఖ్యలపై మండిపడ్డ సమాజ్‌వాదీ పార్టీ కూటమి నుంచి వైదొలగాలని నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉంటే తాజాగా ఇండియా కూటమి బాధత్యలు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి అప్పగించాలంటూ సమాజ్‌వాదీ పార్టీ డిమాండ్ చేసింది. 100 శాతం మమతనే న్యాయం చేయగలరంటూ ఎస్పీ నేత ఉదయవీర్ సింగ్ వ్యాఖ్యానించారు. అయితే కాంగ్రెస్ మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. మరోవైపు ఆర్జేడీ కూడా తామేమీ తక్కువ కాదంటూ.. లాలూ ప్రసాద్ యాదవ్ అయితేనే న్యాయం చేయగలరని.. ఆయనే నిజమైన ఆర్కిటెక్ట్ అని ఆర్జేడీ పేర్కొంది. ఇంకోవైపు ప్రతిపక్షాల కూటమికి నాయకత్వం వహించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని మమతా బెనర్జీ చెప్పుకొచ్చారు. ఇలా కూటమిలో భిన్న స్వరాలతో కలకలం రేగుతోంది. ఈ నేపథ్యంలో కూటమి చీలిక దిశగా వెళ్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
అధ్యక్షుడు సుక్ యోల్‌కు తప్పిన పదవీ గండం.. ఓటింగ్ బహిష్కరించిన సభ్యులు
దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌కు పదవీ గండం తప్పింది. పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టిన అభిశంసన తీర్మానంపై ఓటింగ్‌ను పీపుల్ పవర్ పార్టీ బహిష్కరించింది. దీంతో ఆయనకు పదవీ గండం తప్పింది. యూన్ సుక్ యోల్‌పై విపక్షాలు పార్లమెంట్‌లో అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. అయితే తీర్మానం ఆమోదం పొందాలంటే మూడింట రెండువంతుల మెజారిటీ ఉండాలి. కానీ అధికార ‘పీపుల్ పవర్’ పార్టీకి చెందిన చాలామంది చట్టసభ్యులు ఓటింగ్‌ను బహిష్కరించడంతో ఆయన అభిశంసన నుంచి బయటపడ్డారు. పార్లమెంట్‌ను తమ అధీనంలోకి తెచ్చుకునేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని, శత్రు దేశం ఉత్తర కొరియాకు అనుకూలంగా వ్యవహరిస్తూ దేశానికి వ్యతిరేకంగా పని చేస్తున్నాయంటూ యూన్ సుక్ యోల్ మంగళవారం రాత్రి దేశంలో ఎమర్జెన్సీ మార్షల్ లా ప్రకటించారు. అయితే మార్షల్ లా విధించడాన్ని దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలతో పాటు అధికార పక్షం నేతలు కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. రాత్రికి రాత్రే పార్లమెంట్‌లో ప్రత్యేక సమావేశం నిర్వహించి మార్షల్ లాను రద్దు చేసేందుకు ఓటింగ్‌కు డిమాండ్ చేశారు. అయితే అధ్యక్షుడిపై అభిశంసన తీర్మానం ఆమోదం పొందాలంటే నేషనల్ అసెంబ్లీలో 300 మంది సభ్యుల్లో 200 మంది మద్దతు అవసరం. ప్రతిపక్ష పార్టీలకు 192 సీట్లు ఉండగా, అధికార పార్టీకి చెందిన ముగ్గురు చట్టసభ్యులు మాత్రమే ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఓట్ల సంఖ్య 200కి చేరుకోనందున బ్యాలెట్ లెక్కింపు లేకుండానే తీర్మానం రద్దైంది. అధ్యక్ష పదవి ప్రతిపక్షాల చేతుల్లోకి వెళ్లిపోతుందన్న కారణంతో ఓటింగ్‌కు దూరంగా ఉండాలని అధికార పార్టీ సభ్యులు నిర్ణయించినట్లు సమాచారం.
ఆడియన్స్ కి దూరంగా త్రీఖాన్స్.. ఎందుకబ్బా?
బాలీవుడ్ బాక్సాఫీసుపై డామినేషన్ అంటే త్రీ ఖాన్స్‌దే. అది బాహుబలికి ముందు మాట. టాలీవుడ్ హీరోలు నార్త్ బెల్ట్ కబ్జా చేశాక.. కింగ్ ఖాన్ షారూఖ్, కండల వీరుడు సల్మాన్ ఖాన్, మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ హవా చూపించడంలో తడబడుతున్నారు. వీరిలో కింగ్ ఖాన్ కాస్త బెటర్. సక్సెస్ కంటిన్యూ చేస్తూ ఛరిష్మాను కాపాడుకుంటున్నాడు. ఇక హీరోగా కన్నా నిర్మాతగా సక్సెస్ అవుతున్నాడు అమీర్ ఖాన్. సల్లూ భాయ్ షూటింగ్స్‌లో తక్కువ.. న్యూసుల్లో ఎక్కువ నిలుస్తున్నాడు. ఈ ఏడాది ప్రేక్షకులను పలకరించలేదు త్రీఖాన్స్. డంకీ తర్వాత నెక్ట్స్ ప్రాజెక్ట్ ఎనౌన్స్ చేయలేదు కింగ్ ఆఫ్ బాక్సాఫీస్ షారూఖ్ ఖాన్. అయితే సుజోయ్ ఘోష్ దర్శకత్వంలో కింగ్ మూవీకి కమిటయ్యాడని సమాచారం. ఇందులో తన డాటర్ సుహానా ఖాన్ యాక్ట్ చేస్తోంది. ఇక కండల వీరుడు సల్మాన్ ఖాన్ సింగం ఎగైన్, అప్ కమింగ్ మూవీ బేబీ జాన్‌లో క్యామియో రోల్స్‌కు మాత్రమే ఫిక్సయ్యాడు. డెత్ అలర్ట్ ఉన్న నేపథ్యంలో భారీ సెక్యూరిటీ మధ్యలో సికిందర్ షూటింగ్ కంప్లీట్ చేస్తున్నాడు. ఈ ఇద్దరిదీ ఒకదారి అయితే.. అమీర్ ఖాన్‌ది మరోదారి. హీరోగా కంటే నిర్మాతగా సక్సెస్ కొడుతున్నాడు. ప్రజెంట్ తన నిర్మాణ సంస్థలో తారే జమీన్ పర్ సీక్వెల్ సితారే జమీన్ పర్ తెరకెక్కించాడు. ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకన్న ఈ మూవీ క్రిస్మస్ రిలీజ్‌కు ప్లాన్ చేశారు మేకర్స్. డిసెంబర్ 25నే రావాల్సి ఉండగా.. వస్తుందో, రాదో కూడా తెలియదు. సినిమా గురించి ఎటువంటి అప్డేట్ లేదు. ఇందులో బొమ్మరిల్లు భామ హాసిని అలియాస్ జెనీలియా డిసౌజా యాక్ట్ చేస్తోంది. గత ఏడాది నిర్మించిన లాపతా లేడీస్ ఆస్కార్ బరిలో నిలవడంతో.. సినిమా ప్రమోట్ చేయడంలో బిజీగా మారిపోయాడు అమీర్. దీంతో సితారే జమీన్ పర్ పక్కన పెట్టేసినట్లు టాక్. మరీ ఈ సినిమా క్రిస్మస్‌కు వస్తుందో లేదో అన్నది డౌటే..
రెండో రోజుకే 500 కోట్ల క్లబ్బులో పుష్ప.. అస్సలు తగ్గేదేలే!
పుష్ప మూవీ సెకండ్ పార్ట్ డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్ లభించింది. మధ్యలో మిక్స్డ్ టాక్ వచ్చిన సరే కలెక్షన్స్ విషయంలో మాత్రం ఏ మాత్రం తగ్గేదే లేదు అన్నట్టు దూసుకుపోతోంది. మొదటి రోజు 294 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించిన ఈ సినిమా రెండోరోజు 449 కోట్లు సాధించినట్లు సినిమా యూనిట్ అధికారికంగా ఒక పోస్టర్ రిలీజ్ చేసింది. అయితే కొద్దిసేపటి తర్వాత నిర్వహించిన సినిమా సక్సెస్ ప్రెస్ మీట్లో మాత్రం ఈ సినిమా ఏకంగా 500 కోట్లు క్రాస్ చేసినట్లు నిర్మాతలలో ఒకరైన ఎలమంచిలి రవిశంకర్ వెల్లడించారు. ఈ ప్రెస్ మీట్ జరుగుతున్న సమయంలోనే పలువురు డిస్ట్రిబ్యూటర్ల నుంచి తనకు మెసేజ్లు వచ్చాయని మీరేదో పొరపాటు పడినట్టున్నారు మాకు ఉన్న అంచనాల ప్రకారం 500 కోట్లు దాటేసినట్లు వాళ్లు చెప్పడంతో సినిమా రెండో రోజు 500 కోట్లు క్రాస్ చేసినట్లు ఆయన ప్రకటించారు. అలాగే ఇండియన్ హిస్టరీలో అత్యంత త్వరగా 500 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాగా ఈ సినిమా రికార్డులకు ఎక్కినట్లు మరో నిర్మాత నవీన్ ప్రకటించారు. ఇక రేపు ఆ తర్వాత ఎల్లుండి రెండు వీకెండ్ కావడంతో ఈ సినిమాకి సంబంధించిన బుకింగ్స్ మరింత ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే నిర్మాతలు మాట్లాడుతూ మాకున్న అంచనాలను కూడా ఈ సినిమా ఖచ్చితంగా దాటేసే సూచనలు కనిపిస్తున్నాయి. మేము ఒక లెక్క వేసుకున్నాం దానికి మించి సినిమా ముందుకు దూసుకు వెళ్తుంది అంటూ ఆయన పేర్కొన్నారు.
కళ్యాణ్ బాబాయ్ థాంక్యూ.. అల్లు అర్జున్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు
పుష్ప సక్సెస్ మీట్ లో అల్లు అర్జున్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సినిమా మొత్తాన్ని హిట్ చేసేది దర్శకుడు మాత్రమేనని అన్నారు ఈరోజు నాకు పేరు వచ్చినా వేరే ఆర్టిస్టులకు పేరు వచ్చిన ఆ క్రెడిట్ అంతా ఒక్కడికే దక్కుతుంది. నాకు ఎన్ని కాంప్లిమెంట్స్ వచ్చినా సరే అవన్నీ ఆయన చేసిన డిజైన్ కారణంగానే. నేను ఈరోజు ఇక్కడ ఉన్నానంటే నామీద సుకుమార్ కి ఉన్న ప్రేమే కారణం. ఇంతకంటే నేనేం చెప్పగలను డార్లింగ్ అని సుకుమార్ ని ప్రశ్నించారు.. తంతే అక్కడ కూర్చోబెట్టావ్.. నేను ఇది అహంకారంతో చెప్పడం లేదు చాలా వినమ్రంగా చెబుతున్నాను అని చెప్పుకొచ్చారు. నెంబర్స్ కూడా నాకు సరిగ్గా గుర్తులేవు. నాకు థాంక్యూ చెప్పడం తప్ప ఇవాళ పెద్దగా చెప్పడానికి ఏమీ లేదు. ముందుగా నేను తెలంగాణ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి థాంక్స్ చెబుతున్నాను. మా సినిమాకి స్పెషల్ హైక్ ఇచ్చినందుకు అలాగే సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి గారి సపోర్టు కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇంత పెద్ద సినిమా చేసిన తర్వాత మీలాంటి వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ వల్ల మరింత ముందుకు వెళుతున్నాం. సేమ్ ఇక్కడ ఎంత ప్రైసెస్ పెంచుకునే అవకాశం ఇచ్చారు అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా మమ్మల్ని సపోర్ట్ చేయడానికి అంతే పెంచుకునే అవకాశం ఇచ్చారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి నారా చంద్రబాబు నాయుడు గారికి ఎప్పటినుంచో సినీ పరిశ్రమ మీద మీ ప్రేమ కొనసాగుతూనే ఉంది. నేను సభాముఖంగా మిమ్మల్ని అభినందిస్తున్నాను అని అన్నారు. ఈ స్పెషల్ జీవో పాస్ అయ్యి స్పెషల్ హైక్స్ రావడానికి కారణమైన పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను.. అలాగే పర్సనల్గా కళ్యాణ్ బాబాయ్ థాంక్యూ అంటూ పేర్కొన్నారు. ఆ తరువాత ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలను, ఇతర బాషల సినీ పరిశ్రమలకు సైతం ఆయన థాంక్స్ చెప్పారు.