ఎయిర్‌పోర్ట్‌ల విస్తరణపై సీఎం చంద్రబాబు సమీక్ష..
ఆంధ్రప్రదేశ్‌లో ఎయిర్‌పోర్ట్‌ల విస్తరణపై సమీక్ష సమావేశం నిర్వహించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న విమానాశ్రయాలతో పాటు కొత్తగా నిర్మిస్తున్న విమానాశ్రయాలకు సంబంధించి ఈ సమావేశంలో చర్చ జరిగింది.. కుప్పం ఎయిర్‌పోర్ట్‌కు సంబంధించి పరిస్థితిపై చంద్రబాబు నాయుడు.. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.. ఇక, అనకాపల్లి జిల్లా నక్కపల్లి ప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటు జరుగుతోందన్నారు సీఎం చంద్రబాబు.. ఈ ప్రాంతంలో ఎయిర్‌పోర్ట్‌పై దృష్టి పెట్టాలని సూచించారు.. అనకాపల్లి, కాకినాడ, విశాఖపట్నంకు దగ్గరలో ఈ ఎయిర్‌పోర్ట్ ఉండే విధంగా ఏర్పాటు జరగాలని అధికారులకు సూచించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు..
టీడీఆర్ బాండ్లపై కీలక ఆదేశాలు.. అవి మినహా మిగతావి రిలీజ్..
టీడీఆర్ బాండ్లపై కీలక ఆదేశాలు జారీ చేసిన మంత్రి నారాయణ.. మున్సిపల్ కమిషనర్లు, యూడీఏల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన.. ఈ రాత్రిలోగా వెరిఫికేషన్ పూర్తయి పెండింగ్‌లో ఉన్న అన్నిబాండ్లను లబ్ధిదారులకు అందించాలని ఆదేశాలు జారీ చేశారు.. ఆన్‌లైన్‌లో బాండ్లను జారీ చేయాలని ఆదేశించారు.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్తగా వచ్చిన టీడీఆర్ దరఖాస్తులను రెండు రోజుల్లోగా పరిష్కరించాలని స్పష్టం చేశారు.. ఇక, గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పలు మున్సిపాల్టీల్లో టీడీఆర్ బాండ్లలో భారీ అక్రమాలు జరిగాయని ఆరోపించారు.. అక్రమాలు జరిగిన చోట కమిటీలు వేసి ప్రభుత్వం సమస్యలు పరిష్కరిస్తోందని స్పష్టం చేశారు.. గత ప్రభుత్వంలో అవకతవకలు జరిగిన బాండ్ల విషయంలో మినహా మిగతా బాండ్లను రిలీజ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు మంత్రి నారాయణ..
ఎన్టీఆర్ వైద్యసేవ, ఆరోగ్యశ్రీపై సర్కార్ కీలక నిర్ణయం..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్యసేవ, ఆరోగ్యశ్రీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది.. రాష్ట్రంలో బీపీఎల్‌లో ఉన్న కోటి 40 లక్షలకు పైగా కుటుంబాలకు బీమా చేయించి వైద్య సేవలు అందించనుంది ప్రభుత్వం.. హైబ్రిడ్ ఇన్సూరెన్స్ విధానం అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నాం అన్నారు మంత్రి సత్యకుమార్.. ఈ ఏడాది ఏప్రిల్ 1 తేదీ నుంచి బీమా విధానంలో ఆరోగ్య సేవలు అందుబాటులో ఉంటాయన్నారు.. ఆయుష్మాన్ భారత్, ఎన్టీఆర్ వైద్య సేవ, ఇన్సూరెన్స్ కంపెనీలు సంయుక్తంగా హైబ్రిడ్ బీమా విధానంలో వైద్య సేవలు అందిస్తాయన్నారు మంత్రి.. మొత్తం 1.43 కోట్ల కుటుంబాలకు భీమా విధానంలో వైద్య సేవలు అందేలా హైబ్రిడ్ విధానం ఉంటుందన్నారు మంత్రి సత్యకుమార్ యాదవ్.. 90 శాతం క్లెయిమ్‌లు రూ.2.5 లక్షల లోపే ఉంటున్నరాయన్న ఆయన.. రూ.2.5 లక్షల నుంచి 25 లక్షల వరకు వ్యయం భరించేలా కొత్త విధానం అమలు చేయనున్నట్టు వెల్లడించారు.. హైబ్రిడ్ విధానంలో ప్రతీ కుటుంబానికి రూ.2,500 వరకూ ప్రీమియం ఉంటుంది.. ఆస్పత్రులకు బిల్లులురావనే ఇబ్బంది లేకుండా, రోగులను ఇబ్బందులకు గురి చేయకుండా ఇన్సూరెన్స్ కంపెనీలు బిల్లులు చెల్లించేవిధంగా చర్యలు ఉంటాయన్నారు.. 2.5 లక్షల మించి వ్యయం అయితే ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు ద్వారా చెల్లింపు ఉంటాయని.. అడ్మిట్ అయిన ఆరు గంటల్లో గా అప్రూవల్ ఇచ్చేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నామన్నారు.. చికిత్సలకు సంబంధించి గతంలో జరిగిన అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నాం.. కొత్త హైబ్రిడ్ విధానంలోనూ 3,257 చికిత్సా విధానాలకు వర్తింపజేయనున్నట్టు వెల్లడించారు మంత్రి సత్యకుమార్ యాదవ్..
ఇకపై తెలుగులోనూ ప్రభుత్వ ఉత్తర్వులు.. జీవో జారీ
ఇకపై ప్రభుత్వ ఉత్తర్వులను తెలుగులోనూ విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఈ మేరకు ఇంగ్లీషుతో పాటు తెలుగులోనూ ఉత్తర్వులు జారీ చేసింది సాధారణ పరిపాలన శాఖ.. ప్రభుత్వ పనితీరులో ఉత్తర్వులు కీలక పాత్ర పోషిస్తాయని ఈ సందర్భంగా పేర్కొంది ప్రభుత్వం.. 90 శాతం మంది తెలుగు మాట్లాడే ప్రజలు ఉన్న రాష్ట్రంలో తెలుగులో ఉత్తర్వులు జారీ చేయడం సహేతుకం అని అభిప్రాయపడింది.. మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు భాషా సమగ్రతకు ఇలా ఉత్తర్వులు జారీ చేయడం తోడ్పడుతుందని పేర్కొంది.. ఇకపై ఆంగ్లం, తెలుగు రెండు భాషల్లో నూ ఉత్తర్వులు జారీ చేయాలని వివిధ శాఖలకు ఆదేశాలు ఇచ్చింది సాధారణ పరిపాలన శాఖ.. మొదట ఆంగ్లంలో ఉత్తర్వులు జారీ చేసి దాన్ని అప్‌లోడ్ చేయాల్సిందిగా సూచించిన సర్కార్.. రెండు రోజుల్లోగా తెలుగులోనూ అదే ఉత్తర్వు జారీ అయ్యేలా చర్యలు చేపట్టాలని వివిధ శాఖలకు సూచనలు ఇచ్చింది సాధారణ పరిపాలన శాఖ.. ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులో అనువదించడానికి డైరెక్టర్ ఆఫ్ ట్రాన్స్‌లేషన్ సేవలను వినియోగించుకోవాలని ప్రభుత్వం సూచించింది.. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్..
జనసేన ఆవిర్భావ దినోత్సవం.. 3 రోజుల పాటు పిఠాపురంలో ప్లీనరీ..
ప్రశ్నించేందుకే పార్టీ పెట్టానంటూ 2014 మార్చి నెలలో జనసేన పార్టీని ప్రారంభించారు పవన్ కల్యాణ్.. పోటీ దూరంగా ఉండి.. మరొకరి విషయం కోసం పనిచేసినా.. పొత్తులు పెట్టుకుని విజయాలు అందుకున్నా.. ఓటములు చవిచూసినా.. 2024 ఎన్నికల్లో మాత్రం కూటమి విజయంలో కీలక భూమిక పోషించారు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. అయితే, జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు.. మూడు రోజుల పాటు తాను ప్రాతినిథ్యం వహిస్తోన్న పిఠాపురం నియోజకవర్గంలో ప్లీనరీ నిర్వహించేందుకు సిద్ధం అయ్యారు.. ప్లీనరీ నిర్వహణపై పార్టీ పీఏసీ చైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో ఈ రోజు కోర్ కమిటీ సమావేశం నిర్వహించారు.. మార్చి 12, 13, 14 తేదీల్లో పిఠాపురంల నియోజకవర్గంలో ప్లీనరీ నిర్వహించనున్నట్టు వెల్లడించారు.. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మూడు రోజుల పాటు ప్లీనరీ నిర్వహించాలి పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ నిర్ణయించారు.. మార్చి 12 నుంచి 14 తేదీల్లో ప్లీనరీని పిఠాపురంలో నిర్వహిస్తామని తెలిపారు నాదెండ్ల మనోహర్.. 2014 మార్చి 14న విశాల దృక్పథంతో, ప్రజాహితం కోసం పవన్ కల్యాణ్ జనసేన పార్టీని స్థాపించారు.. పార్టీ ప్రస్థానంలో ఎన్నో ఒడుదుడుకులు ఎదరైనా బలంగా నిలిచారు.. ఈ రోజు కూటమి ప్రభుత్వ స్థాపనలో జనసేన పాత్ర క్రియాశీలకమైనది.. ఈ క్రమంలో పార్టీ ఆవిర్భావ వేడుకలను మూడు రోజుల పాటు నిర్వహించబోతున్నాంం.. పార్టీ సిద్ధాంతాలు, పవన్ కల్యాణ్ ఆశయాలు ప్రజలకు ఏ విధంగా చేరాయో వివరిస్తూ.. తదుపరి ఏ విధంగా ముందుకు వెళ్లాలో నిర్ధేశించేలా ప్లీనరీ సాగాలి.. ఇందు కోసం పార్టీ నాయకులు, మేధావుల నుంచి సూచనలు, సలహాలు తీసుకుంటామని.. ప్లీనరీ నిర్వహణకు వివిధ కమిటీలు నియమించుకోవాలి.. వారందరినీ సమన్వయం చేసుకుంటూ పార్టీ అధినేత సూచనలకు అనుగుణంగా ముందుకు వెళ్తాం అన్నారు..
కేటీఆర్ రేపో మాపో అరెస్టు అవుతారు
బీఆర్‌ఎస్ పై, కేసీఆర్ కుటుంబంపై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. ఇవాళ జనగామ జిల్లా చిల్పూర్ మండలం మల్కాపూర్‌లో గ్రామస్తులతో ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ.. కవిత ఇప్పటికే జైలుకు వెళ్లివచ్చింది.. కేటీఆర్ రేపో మాపో అరెస్టు అవుతారన్నారు. హరీష్ రావు, కేసీఆర్ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలో కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. కల్వకుంట్ల కుటుంబం పది సంవత్సరాల పాలనలో… కొత్త రకమైన అవినీతికి తెరలేపిందని, సాక్షాత్తు కేసీఆర్ బిడ్డ.. లిక్కర్ కుంభకోణంలో ఎన్ని రోజులు తీహార్ జైల్లో ఉందో అందరికీ తెలిసిందే అని ఆయన వ్యాఖ్యానించారు. రేపో, మాపో ఫార్ములా ఇ రేసులో కేటీఆర్ జైలుకు పోవడం ఖాయమని కడియం శ్రీహరి ఉద్ఘాటించారు.
ఆ పదవికి కేటీఆర్ రాజీనామా.. మంత్రి శ్రీధర్ బాబుకు బాధ్యత
మంత్రి శ్రీధర్ బాబుకు మరో కీలక బాధ్యత వరించింది. ‘తెలంగాణా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ’ అధ్యక్షుడిగా మంత్రి శ్రీధర్ బాబు నియమితులయ్యారు. ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షుడు పుల్లెల గోపిచంద్ ఎన్నికను అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. తెలంగాణను క్రీడలకు హబ్ గా మారుస్తానన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. తెలంగాణను క్రీడలకు హబ్ గా మార్చాలని కంకణం కట్టుకున్నారని తెలిపారు. దక్షిణ కొరియాలోని ఒక చిన్న స్పోర్ట్స్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు ఇటీవల జరిగిన ప్యారిస్ ఒలింపిక్స్ లో 37 పతకాలు సాధించారని గుర్తు చేశారు. ఈ స్ఫూర్తితోనే తెలంగాణలోనూ స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రారంభించబోతున్నట్లు చెప్పారు. అకడమిక్స్, గేమ్స్ ను మిళితం చేస్తూ విద్యార్థి వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా తీర్చి దిద్దుతామని.. వారిలోని ప్రతిభను వెలికితీసేందుకు స్పోర్ట్స్ పాలసీకి రూపకల్పన చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ ప్రక్రియలో విద్యావేత్తలు, ప్రముఖ క్రీడాకారులను భాగస్వామ్యం చేస్తున్నామన్నారు. అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ క్రీడాకారులు సత్తా చాటాలన్నదే ప్రజా ప్రభుత్వం లక్ష్యమని వివరించారు. కాగా.. ఇప్పటి వరకు ఈ పదవిలో కేటీఆర్ ఉన్నారు. 2026 వరకు తన పదవీకాలం ఉన్నప్పటికీ ఆయన హఠాత్తుగా అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నారు.
చైనా కొత్త వైరస్‌పై భారత్ అప్రమత్తం.. ఆరోగ్యశాఖ కీలక ఆదేశాలు..
చైనాని కొత్త వైరస్ ‘‘హ్యుమన్‌మోటాన్యూమో వైరస్( HMPV వైరస్)’’ విజృంభిస్తోంది. ముఖ్యంగా చైనా ఉత్తర ప్రాంతంలో ఈ వైరస్ తీవ్రత ఎక్కువగా ఉందని అక్కడి అధికారులు వెల్లడించారు. ఇప్పటికే చాలా చోట్ల ఆస్పత్రులకు ప్రజలు క్యూ కడుతున్నారు. జ్వరం, గొంతు నొప్పి, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది, ఛాతి నొప్పులు ఇలా కోవిడ్-19, ఫ్లూ వంటి లక్షణాలు కొత్త వైరస్ వల్ల కలుగుతున్నాయి. ఈ వ్యాధి వ్యాప్తిపై ప్రపంచదేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇదిలా ఉంటే, కొత్త వైరస్‌పై భారత ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ఈ వైరస్ వ్యాప్తిపై దృష్టి పెట్టాలని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్(ఎన్సీడీసీ)ని కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. శ్వాసకోశ లక్షణాలు, ఇతర ఫ్లూ కేసులను నిశితంగా పరిశీలించాలని సూచించింది. అంతర్జాతీయ ఏజెన్సీలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు భారత ప్రభుత్వం తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), ఇతర అనుబంధ ఏజెన్సీల నుంచి డిసెంబర్ 16-22 మధ్య వచ్చిన డేటా ప్రకారం చైనాలో సీజనల్ ఇన్‌ఫ్లుఎంజా, రైనోవైరస్, రెస్పిరేటరీ సిన్సిటియల్ వైరస్ (RSV) హ్యూమన్ మెటాన్యూమోవైరస్ (HMPV) వంటి తీవ్రమైన శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లు తీవ్రమయ్యాయి.
కోల్‌కతా ఈవెంట్‌కి బంగ్లాదేశ్ సింగర్.. సీపీఎం ఆహ్వానంపై వివాదం..
షేక్ హసీనా ప్రధాని పదవి నుంచి దిగిపోయిన తర్వాత బంగ్లాదేశ్ వ్యాప్తంగా హింసాత్మక ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా జమాతే ఇస్లామీ, అన్సరుల్లా బంగ్లా వంటి మతోన్మాద ఉగ్ర సంస్థలు మైనారిటీలు ముఖ్యంగా హిందువులపై దాడులకు తెగబడుతున్నాయి. ఇదే కాకుండా ప్రస్తుత తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్ నేతృత్వంలోని ప్రభుత్వంలోని ముఖ్యులు కూడా భారత్‌కి వ్యతిరేకంగా పెద్ద ప్రచారం చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ఈ నెలలో కోల్‌కతాలో శివార్లలోని న్యూ టౌన్‌లో జ్యోతి బసు సెంటర్ ఫర్ సోషల్ స్టడీస్ అండ్ రీసెర్చ్ నిర్వహించే పార్టీ సాంస్కృతిక కార్యక్రమంలో ప్రదర్శనకు ప్రముఖ బంగ్లాదేశ్ సింగర్‌ని ఆహ్వానించాలని సీపీఎం తీసుకున్న నిర్ణయంపై వివాదం తలెత్తింది. సీపీఎం కీలకమైన కేంద్ర కమిటీ సమావేశం ఈ ఏడాది జనవరి 17 నుంచి 19 వరకు న్యూ టౌన్‌లో జరగనుంది. దీనికి సీపీఎం పొలిట్ బ్యూరో కోఆర్డినేటర్ ప్రకాష్ కారత్ హాజరుకానున్నారు.
ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో ఉండగా ప్రాణాలు తీసుకున్న యువతి
ప్రేమలో హార్ట్‌బ్రేక్ కారణంగా ఓ యువతి తీవ్ర నిర్ణయం తీసుకుంది. ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో 20 మంది ఫాలోవర్లు చూస్తుండగా ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఈ సంఘటనల ఛత్తీస్‌గఢ్‌లోని జాంజ్‌గిర్ చంపా జిల్లాలో చోటుచేసుకుంది. అంకుర్ నాథ్(21) అనే యువతి సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్. సోషల్ మీడియాకు బానిసైంది. రీల్స్ చేయడం వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేయడం ఇదే ఆమె వ్యాపకం అయిపోయింది. రాయ్‌పూర్‌కు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న నవాగర్ పట్టణంలో అంకుర్ నాథ్ తన అక్కతో కలిసి నివసిస్తోంది. అయితే గత సోమవారం (డిసెంబర్ 30, 2024) ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో ఉండగా.. దాదాపు 20 మందికిపైగా ఫాలోవర్లు చూస్తుండగా ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. దీంతో లైవ్‌లో ఉన్నవారంతా భయకంపితులయ్యారు. ఆమెను రక్షించేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేశారు. ఇరుగుపొరుగు వారిని అప్రమత్తం చేశారు. ఇంటి డోర్ పగులగొట్టి లోపలి వెళ్లినా ప్రయోజనం లేకుండా పోయింది. అప్పటికే చేయ్యి దాటిపోయింది. ఆమె ప్రాణాలు పోయాయి. ఈ ఘటనతో ఒక ఫాలోవర్ షాక్‌లోకి వెళ్లిపోయాడు.
శుభ్‌మన్ గిల్‌తో పెళ్లి వార్తలపై నటి రిధిమా పండిట్ రియాక్షన్ ఇదే!
సెలబ్రిటీలు, క్రికెటర్లపై వదంతులు రావడం సహజమే. అంతేకాదు.. హీరోలు గానీ, హీరోయిన్లు గానీ, క్రికెటర్లు గానీ లవ్ మ్యారేజ్‌లు చేసుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. బాలీవుడ్ నటి అనుష్క శర్మ-క్రికెటర్ విరాట్ కోహ్లీ ప్రేమ వివాహం చేసుకున్నారు. తాజాగా మరో స్టార్ క్రికెటర్ శుభ్‌మన్ గిల్‌పై కూడా పుకార్లు వస్తున్నాయి. హిందీ నటి రిధిమా పండిట్‌ను పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు షికార్లు చేస్తున్నాయి. అంతేకాదు రిధిమా పండిట్‌కు సోషల్ మీడియా వేదికగా అభినందనలు, శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. దీంతో పెళ్లి వార్త తాజాగా హల్‌చల్ చేస్తోంది. పెళ్లి పుకార్లపై రిధిమా పండిట్ స్పందించారు. ఇప్పటి వరకు వినని హాస్యాస్పదమైన, విచిత్రమైన వార్తలు వింటున్నానని చెప్పుకొచ్చారు. తానెప్పుడూ జీవితంలో శుభ్‌మన్ గిల్‌ను చూడలేదన్నారు. టీవీల్లో చూడడం తప్ప.. నేరుగా తనకు తెలియదు అన్నారు. వివాహంపై వస్తున్న వార్తలన్నీ పుకార్లేనని కొట్టిపారేశారు. తనకు అభినందనలు రావడం మాత్రం వాస్తవమేనని చెప్పుకొచ్చారు. ఒకవేళ శుభ్‌మన్ గిల్ ఎదురుపడితే.. ఈ విషయంపై నవ్వుకుంటామని చెప్పింది. అయినా ఇలాంటి పుకార్లను ఎందుకు వ్యాప్తి చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. అయినా తన పెళ్లి విషయాన్ని తల్లిదండ్రులు చూసుకుంటారని తేల్చి చెప్పారు.
క్యారెక్టర్ ను నమ్ముకున్న ప్రతి ఒక్కరికీ “దిల్ రూబా” నచ్చుతుంది
యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న సినిమా “దిల్ రూబా”. ఈ సినిమాలో రుక్సర్ థిల్లాన్ హీరోయిన్ గా నటిస్తోంది. “దిల్ రూబా” సినిమా ఫిబ్రవరిలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ సినిమా టీజర్ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ – “దిల్ రూబా” గురించి మాట్లాడేముందు ఫస్ట్ మా ప్రొడక్షన్ హౌస్ సారెగమా వారికి థ్యాంక్స్ చెప్పాలి. తెలుగులో వారి ఫస్ట్ మూవీలో నేను హీరో కావడం సంతోషంగా ఉంది. నన్ను, మా టీమ్ ను వారు ఎంతో బాగా చూసుకున్నారు. డైరెక్టర్ కరుణ్ నాకు మూడేళ్లుగా తెలుసు. ఒకరోజు వచ్చి కథ చెప్పాడు. అతను కథ చెప్పే విధానం చాలా కొత్తగా అనిపించింది. “దిల్ రూబా” సినిమాలో నేను చేసిన సిద్ధు, సిద్ధార్థ్ క్యారెక్టర్ చాలా స్పెషల్ గా హార్డ్ హిట్టింగ్ గా ఉంటుంది. తను నమ్మిన సిద్ధాంతం కోసం ప్రేమతో సహా ఏ విషయంలోనైనా వెనక అడుగు వేయడు. తన నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాంతం కట్టుబడి ఉంటాడు. అలాంటి సిద్ధార్థ్ లు మీలోనూ ఉంటారు. అలాంటి క్యారెక్టర్ ఉన్న వారందరికీ “దిల్ రూబా” బాగా నచ్చుతుంది. “దిల్ రూబా” నా కెరీర్ లో బెస్ట్ ఆల్బమ్. సామ్ సీఎస్ గారికి థ్యాంక్స్ చెబుతున్నా. ఫిబ్రవరిలో “దిల్ రూబా” సినిమాను రిలీజ్ చేయబోతున్నాం. హీరో నమ్మే సిద్ధాంతం చాలా కొత్తగా ఉంటుంది. క సినిమా తర్వాత నా మూవీస్ మీద ఆడియెన్స్ పెట్టుకున్న అంచనాలను “దిల్ రూబా” తప్పకుండా అందుకుంటుంది.
‘రాజా సాబ్’ చెప్పిన టైమ్ కే వస్తాడా..?
పాన్ ఇండియా ప్రభాస్‌తో సినిమా చేయడానికి బడా బడా డైరెక్టర్స్ వెయిట్ చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణీ సైతం ప్రభాస్‌తో సినిమాకు చేయడానికి ట్రై చేస్తున్నాడు. సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ కూడా కరోనా సమయంలో ప్రభాస్‌తో చర్చలు జరిపాడు. కానీ కుదరలేదు. అలాంటిది దర్శకుడు మారుతి మాత్రం ప్రభాస్‌తో జాక్ పాట్ కొట్టేశాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను భారీ బడ్జెట్ పై నిర్మిస్తోంది. ఈ సినిమాతో వింటేజ్ డార్లింగ్‌ను చూపిస్తానని చెబుతున్నాడు మారుతి. అందుకు తగ్గట్టే ఇప్పటి వరకు వచ్చిన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్స్ అదిరిపోయాయి. అయితే ఈ సినిమా అనుకున్న సమయానికి రిలీజ్ అవుతుందా లేదా అనేదే ఇప్పుడు అందరి డౌట్. 2025 ఏప్రిల్ 10న రాజాసాబ్‌ను రిలీజ్ చేస్తామని గతంలోనే ప్రకటించారు మేకర్స్. కానీ గ్రాఫిక్స్ వర్క్ డిలే కారణంగా పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉందనే టాక్ ఉంది. అదే తేదీన స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ నటిస్తున్న ‘జాక్’ మూవీని రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేయడం రాజాసాబ్ వాయిదాకు మరింత బలాన్నిచ్చింది. కానీ రీసెంట్‌గా రాజా సాబ్ షూటింగ్ పగలు, రాత్రి తేడా లేకుండా శరవేగంగా జరుగుతోంది, దాదాపు 80 శాతం పూర్తయింది, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయని మేకర్స్ తెలిపారు. రాజా సాబ్ టాకీ పార్ట్ కంప్లీట్ అయినట్లుగా తెలుస్తోంది. కేవలం నాలుగు సాంగ్స్ మాత్రమే పెండింగ్ ఉన్నాయట. అవి కూడా త్వరలో పూర్తి చేసి అనుకున్న సమయానికి సినిమా రిలీజ్‌కు పక్కాగా ప్లాన్ చేస్తున్నారట. కాబట్టి రాజాసాబ్ వాయిదా పడే ఛాన్స్ లేదని అంటున్నారు.
రాసి పెట్టుకోండి..ఈ సంక్రాంతికి ‘డాకు మహారాజ్’ దబిడి దిబిడే
గాడ్ ఆఫ్ మాసెస్, నటసింహం నందమూరి బాలకృష్ణనటిస్తున్న చిత్రం ‘డాకు మహారాజ్’. బాలయ్య కెరీర్ లో 109వ సినిమాగా వస్తున్నా ఈ సినిమాకు బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్ పై హై అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర ప్రొడక్షన్స్, ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్ పై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నాడు. శ్రద్ద శ్రీనాధ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్స్ గా నటిస్తుండగా, చాందిని చౌదరి, ఊర్వశి రౌతేలా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కాగా ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానున్న నేపథ్యంలో చిత్ర నిర్మాత నాగవంశీ వ్యక్తిగత ఎక్స్ ఖాతాలో చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. నాగవంశీ తన వ్యక్తిగత ఎక్స్ ఖాతాలో ‘ మీకు సమరసింహా రెడ్డి యాక్షన్ గుర్తుందా. అసలైన మాస్ సినిమా అంటే ఏమిటో నిర్వచించింది ఆ యాక్షన్ అని సమరసింహా రెడ్డి పవర్ఫుల్ యాక్షన్ సీన్ ఫోటోను జతచేస్తూ.. నా మాటలను గుర్తుపెట్టుకోండి. డాకు మహారాజ్ లో సెకండ్ హాఫ్ లో ఒక సీక్వెన్స్ ఉంది, ఆ సీక్వెన్స్ మిమ్మల్ని మరోసారి సమరసింహా రెడ్డి రోజులను గుర్తుకురావడమే కాదు మీకు అదే ఊపునిస్తుంది. ఈ సంక్రాంతికి థియేటర్స్ మోత మోగుతాయి. దబిడి దిబిడి అని ఊరికే అనట్లేదు, జస్ట్ వెయిట్ అండ్ వాచ్’ అని పోస్ట్ చేసారు. తమన్ సంగీతం అందిస్తున్న డాకు మహారాజ్ ట్రైలర్ ఈ నెల 5న రిలీజ్ కానుంది.