ఆ వర్గాలకు గుడ్‌న్యూస్ చెప్పిన ఏపీ కేబినెట్.. కీలక నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. మొత్తం 35 అజెండా అంశాలపై చర్చించి రాష్ట్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసినట్లు సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పార్థసారథి వెల్లడించారు. అభివృద్ధి, సంక్షేమం, ఉపాధి, మౌలిక వసతులు, గృహ నిర్మాణం, విద్యుత్, పర్యాటక రంగాలకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. చిత్తూరు జిల్లా పలమనేరులో లైవ్‌స్టాక్‌కు సంబంధించి 33 ఎకరాల భూమి బదలాయింపుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అదే విధంగా పలమనేరు ఏఎంసీకి కూడా 33 ఎకరాల భూమి బదలాయించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక, నిరుద్యోగులకు శుభవార్త చెబుతూ.. పిడుగురాళ్ల ప్రభుత్వ ఆస్పత్రిలో బెడ్ల సంఖ్యను 420కి పెంచడంతో పాటు 837 పోస్టుల మంజూరుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మరోవైపు, ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన అథ్లెటిక్స్ క్రీడాకారిణి ఎర్రాజు జ్యోతికి ప్రోత్సాహకాలు ప్రకటించింది. విశాఖపట్నంలో 500 చదరపు గజాల స్థలం, ఆర్థిక సాయం, గ్రూప్–1 ఉద్యోగం ఇవ్వాలన్న ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది ఏపీ కేబినెట్.. ఏపీ టిడ్కోకు హడ్కో నుంచి రూ.4,450 కోట్ల రుణానికి ప్రభుత్వ గ్యారెంటీ ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. పీఎంఏవై 1.0 కింద ఉన్న ఇళ్లను అక్టోబర్ నాటికి పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. వచ్చే నెలలో కేంద్రం నుంచి కొత్త ఇళ్ల మంజూరు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 2028 నాటికి ఇళ్లు లేని పేదలందరికీ ఇళ్లు కల్పించాలనే లక్ష్యంతో చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. మరోవైపు.. అమరావతిలో వీధిపోటు వచ్చే 120 మంది రైతులకు ప్లాట్ల మార్పుల ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే అమరావతిలో భూమిలేని పేదలకు ఇచ్చే రూ.5 వేల పింఛన్‌ను తల్లిదండ్రులు లేని పిల్లలకూ వర్తింపజేయాలని నిర్ణయించింది.
ఫిబ్రవరి 14న ఏపీ బడ్జెట్
ఓవైపు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ 2026-27ను రూపొందించే పనిలో పడిపోయింది.. ఫిబ్రవరి 1వ తేదీన లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. మరోవైపు.. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 11వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం అసెంబ్లీ వర్గాలకు సమాచారం అందించింది. నాలుగు వారాల పాటు, అంటే మార్చి 12వ తేదీ వరకు బడ్జెట్ సమావేశాలు కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 11వ తేదీ ఉదయం 10 గంటలకు గవర్నర్ రాష్ట్ర శాసనసభ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం ఫిబ్రవరి 12న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని సభ్యులు ప్రవేశపెట్టనున్నారు. ఆ రోజంతా ఈ తీర్మానంపై చర్చ సాగనుంది. ఇక, ఫిబ్రవరి 13వ తేదీన ధన్యవాద తీర్మానంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సభలో ప్రసంగించనున్నారు. ఫిబ్రవరి 14వ తేదీన 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. అదే రోజు వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి అచ్చెం నాయుడు సభలో ప్రవేశపెట్టనున్నారు. అయితే, బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అభివృద్ధి ప్రణాళికలు, సంక్షేమ పథకాలపై విస్తృత చర్చ జరగనుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
దక్షిణాది రాష్ట్రాల బీజేపీ సమన్వయకర్తగా జీవీఎల్..
బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావుకు కీలక బాధ్యతలు అప్పగించింది భారతీయ జనతా పార్టీ.. దక్షిణాది రాష్ట్రాల్లో కేంద్ర బడ్జెట్ ద్వారా కలిగే ప్రయోజనాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. దక్షిణాది రాష్ట్రాల బీజేపీ “సమన్వయకర్త” (కోఆర్డినేటర్)గా రాజ్యసభ మాజీ సభ్యుడు జీవీఎల్ నరసింహారావును కేంద్ర నాయకత్వం నియమించింది. కేంద్ర బడ్జెట్‌లో దక్షిణాది రాష్ట్రాలకు జరిగిన కేటాయింపులు, వాటి వల్ల వివిధ సామాజిక వర్గాలకు కలిగే ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పించే బాధ్యతలను జీవీఎల్‌కు బీజేపీ అప్పగించింది. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాల వల్ల రైతులు, మహిళలు, యువత, ఉద్యోగులు, మధ్యతరగతి ప్రజలకు ఒనగూడే ప్రయోజనాలను వివరించే కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ నాయకత్వం ఆయనకు నిర్దేశించింది. అంటే, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో బీజేపీ సమన్వయకర్తగా జీవీఎల్ నరసింహారావు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. కేంద్ర, రాష్ట్ర పార్టీ విభాగాలను సమన్వయం చేసుకుంటూ క్షేత్రస్థాయిలో ప్రజలకు బడ్జెట్ అంశాలను వివరించే కీలక పాత్రను ఆయన పోషించనున్నారు. ప్రత్యేకంగా తెలంగాణలో జరగనున్న పట్టణ, నగర పాలక సంస్థల ఎన్నికల నేపథ్యంలో, కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన కేటాయింపులు, వివిధ సామాజిక వర్గాలకు కలిగే లాభాలపై విస్తృత ప్రచారం చేపట్టనున్నట్లు సమాచారం.
విద్యార్థులతో వెళ్తున్న స్కూల్ బస్సులో మంటలు.. క్షణాల్లో బస్సు దగ్ధం..
అనంతపురం జిల్లా పుట్లూరు మండలంలో పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. ప్రైవేట్ స్కూల్ విద్యార్థులతో వెళ్తున్న బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. పుట్లూరు నుంచి కడవకల్లుకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే, బస్సులో మంటలు రావడాన్ని గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమయ్యాడు. బస్సును రోడ్డు పక్కకు నిలిపి, క్షణాల్లోనే విద్యార్థులందరినీ కిందకు దింపడంతో పెద్ద ప్రమాదం తప్పింది. విద్యార్థులెవరికీ ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం. ఈ ప్రమాదంలో పుట్లూరు శ్రీ రామ గ్లోబల్ స్కూల్‌కు చెందిన బస్సు పూర్తిగా దగ్ధమైంది. అగ్ని ప్రమాదం జరిగిన కొద్ది సేపటికే బస్సు మొత్తం మంటల్లో కాలి పోయింది. ప్రాథమిక సమాచారం ప్రకారం షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలపై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర ఆందోళన నెలకొంది. స్కూల్ వాహనాల భద్రతపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
మున్సిపల్ పోరుకు కాంగ్రెస్ సన్నద్ధం.. అభ్యర్థుల ఎంపికపై భట్టి విక్రమార్క కీలక ఆదేశాలు!
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక అనేది కేవలం ఒకరిద్దరి నిర్ణయం కాకూడదని, అత్యంత పారదర్శకంగా , సమిష్టిగా సాగాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఆయా మున్సిపాలిటీల బాధ్యతలు చూస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు , సీనియర్ నాయకులు అందరూ కలిసి చర్చించి, ఏకాభిప్రాయంతో అభ్యర్థులను ఖరారు చేయాలని సూచించారు. అభ్యర్థుల ఎంపికలో అందరినీ కలుపుకుని పోవడం వల్ల పార్టీలో అంతర్గత విబేధాలు రాకుండా ఉంటాయని, ఇది ఎన్నికల్లో పార్టీ విజయావకాశాలను మెరుగుపరుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా పార్టీ మండల , పట్టణ స్థాయి నాయకులతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ ఈ ప్రక్రియను విజయవంతం చేయాలని శాసనసభ్యులకు దిశానిర్దేశం చేశారు. అభ్యర్థుల ఎంపికకు సంబంధించి భట్టి విక్రమార్క కొన్ని కీలక మార్గదర్శకాలను విడుదల చేశారు. కేవలం రాజకీయ ప్రాధాన్యతలకు కాకుండా, క్షేత్రస్థాయిలో గెలిచే సామర్థ్యం ఉన్న అభ్యర్థులకే టికెట్లు కేటాయించాలని ఆయన ఆదేశించారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను నమ్మిన వారు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లే అభ్యర్థులపై దృష్టి సారించాలని కోరారు. ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న ‘ఆరు గ్యారెంటీలు’ , ఇతర అభివృద్ధి పనులను ఓటర్లకు వివరించి, వారి మద్దతు పొందే నాయకులను గుర్తించడం ఈ ఎన్నికల్లో అత్యంత కీలమని ఆయన పునరుద్ఘాటించారు.
అజిత్ పవార్ విమాన ప్రమాదం.. కొత్త వీడియోలో షాకింగ్ విజువల్స్..
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ ఈరోజు (బుధవారం) ఉదయం విమాన ప్రమాదంలో చనిపోయారు. ఆయన ముంబై నుంచి బారామతికి లియర్‌జెట్ 45 విమానంలో వెళ్లారు. అయితే, ల్యాండింగ్‌కు కొన్ని క్షణాల ముందు రన్ వేకు పక్కనే విమానం క్రాష్ ల్యాండ్ అయింది. వెంటనే పెద్ద మంటలు చెలరేగి అందులో ఉన్న ఐదుగురు మరణించారు. అయితే, ఈ ప్రమాదానికి సంబంధించిన కొత్త వీడియో వెలుగులోకి వచ్చింది. విమానం వేగంగా కిందికి దిగుతున్నట్లు కనిపించింది. అదే సమయంలో ఎడమ వైపు వంగినట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ల్యాండింగ్ కు ముందు ఇలా జరగడం అసాధారణమని ఎవియేషన్ ఎక్స్‌ఫర్ట్ చెబుతున్నారు. ఇది సాంకేతిక లోపం లేదా పైలట్లు విమానంలో ఏర్పడిన ఒత్తిళ్లను భర్తీ చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు కనిపిస్తోందని చెబుతున్నారు. బారామతిలోని గోజుబావి గ్రామ పంచాయతీలోని సీసీటీవీ కెమెరాల్లో ఈ విజువల్స్ రికార్డ్ అయ్యాయి. విమానం వేగంగా ఎత్తును కోల్పోతున్నట్లు గా కనిపిస్తోంది. కొత్తగా వైరల్ అవుతున్న వీడయోలో విమానం ముందుగా నియంత్రణ కోల్పోయినట్లు తెలుస్తోంది. పల్టీలు కొట్టడం, వేగంగా కిందకు దూసుకు రావడం, ఆ తర్వాత నేలను బలంగా ఢీకొట్టి అగ్ని ప్రమాదం ఏర్పడటం కనిపిస్తోంది. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం, విమానం విమానాశ్రయం చుట్టూ తిరుగుతూ కనిపించిందని, ఆ సమయంలో అస్థిరంగా ఉందని, నేలను ఢీకొన్న తర్వాత పేలిపోయిందని చెబుతున్నారు.
“అజిత్ పవార్ మరణంలో ఎలాంటి కుట్ర లేదు, ఇది ప్రమాదమే”..
అజిత్ పవార్ మరణంపై ఎన్సీపీ కురువృద్ధుడు శరద్ పవార్ స్పందించారు. అజిత్ పవార్ మరణంలో ఎలాంటి కుట్ర లేదని, ఇది కేవలం ప్రమాదమే అని స్పష్టం చేశారు. ఈ విషాదాన్ని రాజకీయ చేయొద్దని ఇతర పార్టీలు, నేతలను కోరారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే వంటి వారు అజిత్ పవార్ మరణంపై అనుమానాలను వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు పర్యవేక్షనలో దర్యాప్తుకు పిలుపునిచ్చారు. అన్న కొడుకైన అజిత్ పవార్ మరణంపై భావోద్వేగానికి గురైన శరత్ పవార్.. కుట్ర సిద్ధాంతాన్ని కొట్టిపారేశారు. దీనిని ప్రమాదంగా మాత్రమే చూడాలని కోరారు. “ఇది పూర్తిగా ప్రమాదం; ఇందులో రాజకీయం లేదు. రాష్ట్రం అపారమైన నష్టాన్ని చవిచూసింది, ఇది పూడ్చలేనిది” అని ఆయన అన్నారు. ఈ రోజు ఉదయం బారామతిలో జరిగిన విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ మృతి చెందారు. విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో క్రాష్ అయింది. ఈ ఘటనలో అజిత్ పవార్‌తో సహా అందులో ఉన్న మొత్తం ఐదుగురు మరణించారు. మహారాష్ట్రలో ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.
పన్ను పోటు.. అమెరికా తర్వాత భారత్‌పై 50 శాతం ట్యాక్స్ విధించేందుకు సిద్ధమైన మరో దేశం..!
ప్రపంచ వాణిజ్యంలో భారత్‌కు మరో సవాల్ ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే అమెరికా భారతదేశంపై 50 శాతం సుంకాలు విధిస్తుండగా, ఇప్పుడు అదే బాటలో మరో దేశం అడుగులు వేయడానికి సిద్ధమవుతోంది. భారతదేశం మరియు చైనా నుంచి దిగుమతి చేసుకునే వాహనాలపై 50 శాతం సుంకం విధించే అంశాన్ని దక్షిణాఫ్రికా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం, దక్షిణాఫ్రికా వాణిజ్యం, పరిశ్రమ మరియు పోటీ విభాగం ఈ అంశంపై అంతర్గత సమీక్ష చేపట్టింది. భారత్, చైనా నుంచి భారీగా వాహనాల దిగుమతులు జరుగుతుండటంతో స్థానిక ఆటోమొబైల్ పరిశ్రమ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోందని దక్షిణాఫ్రికా ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ రెండు దేశాల నుంచి వచ్చే వాహనాలపై అధిక సుంకాలు విధించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, స్థానిక కంపెనీలను కాపాడుకోవడం, దేశీయ తయారీదారులకు పోటీ నుంచి ఊరట కల్పించడమే ఈ ప్రతిపాదిత చర్య ప్రధాన లక్ష్యమని అధికారులు చెబుతున్నారు. తక్కువ ధరకు భారత్, చైనా నుంచి వస్తున్న వాహనాలు ముఖ్యంగా ఎంట్రీ-లెవల్ సెగ్మెంట్‌లో స్థానిక తయారీదారులకు గట్టి పోటీని ఇస్తున్నాయని విధాన నిర్ణేతలు అభిప్రాయపడుతున్నారు.
16,000 మంది ఉద్యోగులకు అమెజాన్ లేఆఫ్.. వీరి స్థానంలో AI..
ప్రపంచవ్యాప్తంగా 16,000 మందిని తొలగించనున్నట్లు అమెజాన్ తెలిపింది. దీని వల్ల ఏ యూనిట్లు ప్రభావమవుతాయో అనేది చెప్పలేదు. మూడు నెలల్లో ఈ-కామర్స్ కంపెనీ రెండో రౌండ్ భారీ లేఆఫ్స్‌కు సిద్ధమైంది. వీరి స్థానంలో జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI)ని ఉపయోగించుకోవాలని యోచిస్తున్నట్లు టెక్ దిగ్గజం వెల్లడించింది. కోవిడ్ మహమ్మారి సమయంలో పెరిగిన శ్రామిక శక్తిని కూడా ఇది తగ్గిస్తోంది. అమెజాన్‌లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ బెత్ గాలెట్టి బుధవారం ఒక బ్లాగ్ పోస్ట్‌లో.. కంపెనీ ‘‘నిర్వహణ స్థాయిలను(లేయర్లను) తగ్గించడం, ఉద్యోగుల్లో బాధ్యతాభావాన్ని పెంచడం, బ్రూరోక్రసీని తగ్గించడం’’ చేస్తోందని చెప్పారు. కేవలం మూడు నెలల్లోనే ఇది అమెజాన్ చేపట్టిన రెండో దశ మాస్ లేఆఫ్స్, గతేడాది అక్టోబర్‌లో 14,000 మందిని తొలగించిన తర్వాత తాజాగా ఈ లేఫ్స్ వచ్చాయి. అమెరికాలోని కంపెనీ ఉద్యోగులు కొత్త ఉద్యోగాలు వెతుకున్నేందుకు 90 రోజుల సమయం ఇవ్వబడుతుందని ఆమె చెప్పారు. కొత్త ఉద్యోగం కోరుకోని వారికి సెవరెన్స్ పే, అవుట్ ప్లేస్‌మెంట్ సర్వీసులు, హెల్త్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ ఉంటాయని గాలెట్టి చెప్పారు. ఈ మార్పులు చేస్తూనే, భవిష్యత్తులో కీలకమైన వ్యూహాత్మక విభాగాల్లో రిక్రూట్మెంట్, పెట్టుబడులు పెడుతామని వెల్లడించారు.
“మీరు ఆడకుంటే త్వరగా చెప్పండి”.. పాకిస్తాన్‌పై ఐస్లాండ్ ట్రోలింగ్..
టీ20 ప్రపంచ కప్ నుంచి బంగ్లాదేశ్ అవుట్ అయింది. భారత్‌లో ఆడేందుకు భద్రతా కారణాలు చూపుతూ వివాదం చేసిన బంగ్లాదేశ్ స్థానంలో ఐసీసీ స్కాట్లాండ్‌ను తీసుకుంది. ఇదిలా ఉంటే, బంగ్లాదేశ్‌కు మద్దతుగా పాకిస్తాన్ కూడా టోర్నీని బాయ్‌కాట్ చేస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, దీనిపై ఐస్లాండ్ పాకిస్తాన్‌పై ట్రోలింగ్ చేస్తుంది. ఐస్లాండ్ క్రికెట్ సోషల్ మీడియాలో ..‘‘ పాకిస్తాన్ టోర్నీ నుంచి వైదొలగాలని నిర్ణయించుకుంటే తాము జోక్యం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము’’ అని సెటైర్లు వేసింది. ‘‘టీ20 వరల్డ్ కప్ ఆడటంపై పాకిస్తాన్ త్వరగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం మాకు ఉంది. ఫిబ్రవరి 2న వారు వైదొలిగితే, వెంటనే మేము బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాము. కానీ ఫిబ్రవరి 7న విమాన షెడ్యూల్ కారణంగా కొలంబో చేరుతామో లేదో. ’’ అంటూ పోస్ట్ చేసింది. అయితే, బంగ్లాదేశ్‌కు మద్దతుగా తాము కూడా టోర్నీని బహిష్కరిస్తామని పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్(పీసీబీ) అధికారులు కామెంట్ చేస్తున్నారు. రెండు రోజుల క్రితం పీసీబీ చీఫ్ మోహ్సీన్ నఖ్వీ, ఆ దేశ ప్రధాని షహబాజ్ షరీఫ్‌తో భేటీ అయ్యారు. ఈ శుక్రవారం లేదా సోమవారం తమ నిర్ణయం వెల్లడిస్తామని నఖ్వీ చెప్పారు. తమకు లాగే బంగ్లాదేశ్‌కు కూడా తటస్థ వేదికలపై ఆడేందుకు అవకాశం ఇవ్వాలని నఖ్వీ డిమాండ్ చేశారు. పాక్ తన అన్ని మ్యాచుల్ని శ్రీలంకలో ఆడుతోంది. బంగ్లాదేశ్ కూడా తాము భారత్‌లో ఆడమని తమ వేదికల్ని కూడా శ్రీలంకు మార్చాలని డిమాండ్ చేసింది. అయితే, ఐసీసీ అంగీకరించపోవడంతో టోర్నీ నుంచి బయటకు వెళ్లాల్సి వచ్చింది.
హీరోయిన్’గా అచ్చమైన తెలుగమ్మాయి కావలెను!
దర్శకుడు యదు వంశీ కొత్త వారితో తీసిన ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రం ప్రేక్షకులందరినీ ఆకట్టుకుంది. ఇక యదు వంశీ తన రెండో ప్రాజెక్ట్ కోసం పనులు ప్రారంభించారు. ఈ క్రమంలో తన రాబోయే ప్రాజెక్ట్ లో హీరోయిన్ కోసం క్యాస్టింగ్ కాల్‌ను ప్రకటించారు. 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అచ్చ తెలుగు అమ్మాయి కోసం యదు వంశీ అన్వేషిస్తున్నారు. నటన, ప్రతిభ-ఆధారిత ప్రక్రియ ద్వారా తెలుగు సినిమాలోకి ప్రవేశించడానికి ఆశావహులైన నటీమణులకు ఓ సువర్ణ అవకాశాన్ని అందించడం లక్ష్యంగా యదు వంశీ ముందుకు సాగుతున్నారు. ఈ కాస్టింగ్ కాల్‌తో దర్శకుడు కొత్త వారిని కనుగొనడం వైపు దృష్టి సారించారు. ఉత్సాహం, విశ్వాసం, సాంస్కృతిక మూలాల మిశ్రమాన్ని సహజంగా ప్రతిబింబించే “అచ్చమైన తెలుగు అమ్మాయి” కోసం అన్వేషణ జరుగుతోంది. గ్లామర్ కంటే వ్యక్తీకరణ సామర్థ్యం, భావోద్వేగ లోతు, తెలుగు భాషపై ఉన్న పట్టుతో ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
రాజీ పడలేను.. ఒంటరిగానే పోరాడతా: నిశ్చితార్థం రద్దు చేసుకున్న బిగ్ బాస్ బ్యూటీ!
తెలుగు బుల్లితెర నటి, బిగ్ బాస్ ఫేమ్ కీర్తి భట్ తన వ్యక్తిగత జీవితం గురించి షేర్ చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది, తన ప్రియుడు విజయ్ కార్తీక్‌తో నిశ్చితార్థం జరిగి, పెళ్లి పీటలు ఎక్కబోతున్న తరుణంలో ఆమె తన రిలేషన్‌షిప్‌కు ముగింపు పలుకుతున్నట్లు ప్రకటించడం అందరినీ షాక్‌కు గురిచేసింది. ఈ విషయాన్ని గురించి కీర్తి భట్ తన పోస్ట్‌లో చాలా స్పష్టంగా, హుందాగా స్పందించారు, “నా జీవితంలోని ఒక ముఖ్యమైన బంధం ఇప్పుడు ముగిసింది. ఆ బంధం చాలా కాలం సాగింది, అది నిజమైనదే.. కానీ ఒక జీవిత భాగస్వామిగా లేదా భర్తగా ఉండాల్సిన ఆ భావన మాత్రం మా మధ్య కలగలేదు” అని పేర్కొన్నారు. పరస్పర గౌరవంతో ఈ బంధాన్ని స్నేహంగా మార్చుకుని ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్లు ఆమె తెలిపారు. తమ బ్రేకప్ గురించి వస్తున్న, రాబోయే రూమర్ల పట్ల ఆమె ఆవేదన వ్యక్తం చేశారు, “జీవితం ఇప్పుడు ఒక యుద్ధం లాంటిది. నేను హుందాగా, దృఢంగా నిలబడతాను, రాజీ పడే జీవితం కంటే నా సంతోషమే నాకు ముఖ్యం. దయచేసి ఊహలతో అపోహలు సృష్టించకండి” అని తన అభిమానులను కోరారు. కీర్తి భట్, విజయ్ కార్తీక్‌ల నిశ్చితార్థం 2023 ఆగస్టులో జరిగింది. దాదాపు రెండున్నరేళ్ల నిరీక్షణ తర్వాత వీరు పెళ్లి చేసుకుంటారని ఫ్యాన్స్ భావించారు, నిశ్చితార్థం తర్వాత కూడా వీరిద్దరూ కలిసి అనేక టీవీ షోలలో సందడి చేశారు. కానీ, ఇటీవలి కాలంలో వీరి మధ్య మనస్పర్థలు వచ్చాయని, అందుకే పెళ్లి ఆలస్యమవుతోందని చర్చలు జరిగాయి. ఇప్పుడు కీర్తి స్వయంగా ఈ బంధం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడంతో ఆ చర్చలకు ఫుల్ స్టాప్ పడింది, కీర్తి భట్ గతంలో తన కుటుంబాన్ని ఒక ఘోర ప్రమాదంలో కోల్పోయి అనాథగా మారిన సంగతి తెలిసిందే. తన జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించి, ఇప్పుడు కూడా ఒంటరి పోరాటం చేస్తున్న ఆమెకు నెటిజన్లు పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్నారు. గతంలో దీప్తి సునైన తర్వాత ఇప్పుడు మరో బిగ్ బాస్ నటి బ్రేకప్ చెప్పడం హాట్ టాపిక్ అవుతోంది.
హిందీలోకి లక్ష్మీ రాయ్ ‘జనతా బార్’
రాయ్ లక్ష్మీ ప్రధాన పాత్రలో వచ్చిన ‘జనతా బార్’కి రమణ మొగిలి దర్శక, నిర్మాతగా వ్యవహరించారు. ఇక ఈ సినిమా గత ఏడాది చివర్లో ఆడియెన్స్ ముందుకు వచ్చింది. తెలుగు, తమిళంలో మంచి రెస్పాన్స్ అందుకున్న ఈ మూవీ ఇప్పుడు కన్నడ ఆడియెన్స్‌ను మెప్పిస్తోంది. ఇక త్వరలోనే ఈ మూవీని కేరళ, హిందీ ఆడియెన్స్‌ను అలరించేందుకు సిద్దం అవుతోంది. అన్ని భాషల్లో థియేట్రికల్ రన్‌ను పూర్తి చేసుకున్న తరువాత ఓటీటీ ప్రేక్షకుల ముందుకు చిత్రం రానుంది. స్పోర్ట్స్, రివేంజ్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో అమీక్షా పవర్, అమన్ ప్రీత్ సింగ్, దీక్షా పంత్, శక్తి కపూర్, అనూప్ సోనీ, ప్రదీప్ రావత్, సురేష్, భూపాల్, విజయ్ భాస్కర్, గోవర్ధన్, “మిర్చి” మాధవి, రమ్య తదితరులు ముఖ్య పాత్రల్ని పోషించారు. ఇక క్రీడల్లో మహిళలపై జరిగే వేధింపులు, ఎదురయ్యే చేదు అనుభవాల చుట్టూ ఈ కథను అల్లారు. తన సోదరికి జరిగిన అన్యాయాన్ని బయట పెట్టి, ప్రతీకారం తీర్చుకునే రివేంజ్ డ్రామాగా ఈ ‘జనతా బార్’ మూవీని అద్భుతంగా తెరకెక్కించారు. అశోక్ రాజా, సుచిత్ర చంద్రబోష్, అజయ్ సాయి ఈ సినిమాలోని పాటలకు కొరియోగ్రఫీ చేశారు. డ్రాగన్ ప్రకాష్ ఈ మూవీలోని ఫైట్స్ కంపోజ్ చేశారు.