అబుదాబీలో సీఎం చంద్రబాబు కీలక సమావేశాలు..
అబుదాబీలో పారిశ్రామికవేత్తలు, వివిధ కంపెనీల సీఈఓలతో నెట్ వర్కింగ్ సమావేశంలో పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. లంచ్ మీటింగ్‌లో పాల్గొన్నారు.. ముఖ్యమంత్రి చంద్రబాబు… మంత్రులు టీజీ భరత్, బీసీ జనార్దన్ రెడ్డి కూడా ఈ సమావేశం అయ్యారు.. అబుదాబీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఛైర్మన్ అహ్మద్ జాసిమ్ అల్‌జాబీతో చంద్రబాబు నాయుడు సమావేశం అయ్యారు.. వైజాగ్ లో జరిగే పెట్టుబడుల సదస్సుబుకు సంబంధించి చర్చ జరిగింది.. అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ ప్రతినిధులతో కూడా భేటీ అయ్యారు… ఏపీకి పెట్టుబడులకు సంబంధించి చర్చించారు. మొత్తంగా యూఏఈ పర్యటనలో భాగంగా రెండో రోజు అబుదాబీలో చంద్రబాబు బిజీ బిజీగా గడిపారు.. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశగా ఏపీ పయనిస్తోందని.. రాజధాని అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ సేవలు జనవరి నుంచి అందుబాటులోకి వస్తాయన్నారు సీఎం చంద్రబాబు.. ఏపీ రాజధాని అమరావతి కొత్త అవకాశాలకు, ఇన్నోవేషన్‌కు కేంద్రంగా ఉంటుందని వివరించారు సీఎం చంద్రబాబు.. విశాఖలో నవంబర్ 14, 15 తేదీల్లో జరిగే భాగస్వామ్య సదస్సుకు రావాలని ఆహ్వానించారు.. రాష్ట్రంలో త్వరలో పర్యటిస్తామని, పెట్టుబడులపై ఆలోచన చేస్తామని చంద్రబాబుకు తెలిపారు ప్రతినిధులు.. అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ (ADNOC) ప్రతినిధులతోనూ సీఎం భేటీ అయ్యారు.. ఇక, భారతదేశంలో తమ వ్యాపారాన్ని విస్తరించేందుకు ఏడీఎన్‌ఓసీ ఆసక్తి చూపింది.. ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన రంగంలో ఉన్న పెట్టుబడి అవకాశాలను వివరించిన చంద్రబాబు.. దక్షిణాసియాకు చేరువగా సుదీర్ఘ తీర ప్రాంతం కలిగిన వ్యూహాత్మక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని వివరించారు.. పెట్రో కెమికల్ కంపెనీలు కార్యకలాపాలు నిర్వహించేందుకు అవకాశం ఉందన్నారు..
వీధిన పడుతున్న టీడీపీ గొడవలు..! హాట్ టాపిక్‌గా విజయవాడ ఎంపీ, తిరువూరు ఎమ్మెల్యే వివాదం..
తెలుగుదేశం పార్టీ నేతల మధ్య అంతర్గత క్రమశిక్షణ… టీడీపీ లో కట్టుబాట్లు ఎక్కువ అని నేతలు చెబుతూ ఉంటారు.. కానీ, వాస్తవ పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉంది.. గతంలో టీడీపీ నేతలు కొంత క్రమశిక్షణ తోనే ఉన్న పరిస్థితి.. కానీ, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత టీడీపీ నేతలు బాగా రోడ్డెక్కిన పరిస్థితి కనిపిస్తోంది… ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేస్కోవడం.. పాలనా పరంగా.. రాజకీయంగా విమర్శలు చేసుకుంటున్న పరిస్థితి వచ్చింది. తాజాగా తిరువూరు ఎమ్మెల్యే కొలికలపూడి శ్రీనివాసరావు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. ఎంపీ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందన్నారు కొలికలపూడి.. పదవులు అమ్ముకుంటున్నారు అన్నారు.. దీనిపై ఎంపీ కూడా ఘాటుగా స్పందించారు.. తను నిఖార్సయిన టీడీపీ కార్యకర్తను అంటున్నారు కేశినేని చిన్ని.. తనపై చేస్తున్న విమర్శలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు.. ఒక గిరిజన మహిళ వివాదంతో మొదలైన ఘటన వీరి మధ్య వివాదానికి కారణం అయింది… టీడీపీలో ఉన్న అంతర్గత విభేదాల కారణంగా రచ్చ స్టార్ట్ అయింది.. ఇంకా కొన్ని జిల్లాలో ఎంపీ.. ఎమ్మెల్యే ల మధ్య వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి.. ఎంపీ బైరెడ్డి శబరి.. ఎమ్మెల్యే రాజ్ శేఖర్ రెడ్డి అంశం. కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి డైరెక్ట్ గా కౌన్సిల్ సమావేశంలో టీడీపీ నేతలపై విమర్శలు చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.. టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పదే పదే చెబుతున్నా కూడా నేతలు ఇదే తరహా వైఖరి కొనసాగించడం.. తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది… పార్టీ లైన్ దాటి పోవద్దు అని చెప్తున్నా కూడా ఇదే లైన్ లో నేతలు ఉన్నారు.. దీంతో టీడీపీ అధిష్టానం.. తిరువూరుతో పాటు మరికొన్ని నియోజకవర్గాల నేతలను రేపు పార్టీ కార్యాలయానికి రమ్మని పిలిచినట్టుగా తెలుస్తోంది.. దీంతో అధిష్ఠానం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనేది హాట్ టాపిక్ అయింది.. అయితే, నాకు అధిష్టానం నుంచి ఎటువంటి పిలుపు లేదు.. నన్ను ఎవరు రేపు పార్టీ ఆఫీసుకి రమ్మని చెప్పలేదు అన్నారు ఎంపీ కేశినేని చిన్ని… నాపై ఎవరు ఆగ్రహం వ్యక్తం చేయలేదన్న ఆయన.. ఎమ్మెల్యే కొలికపూడిని రేపు అధిష్టానం రమ్మని చెప్పారేమో నాకు సమాచారం లేదన్నారు కేశినేని చిన్ని.. మరి ఎవరెవరిని టీడీపీ అధిష్టానం పిలిచింది.. ఎవరిపై చర్యలు తీసుకోనున్నారు అనేది రేపు తెలిసే అవకాశం ఉంది.
రూ.6 కోట్లతో వాడపల్లి క్షేత్రానికి రోడ్డు.. నిధులు మంజూరు చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
కోనసీమ తిరుమలగా పేరొందిన పవిత్ర పుణ్యక్షేత్రం వాడపల్లి శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయానికి 216వ నంబర్ జాతీయ రహదారి నుంచి గోదావరి గట్టు మీదుగా నేరుగా చేరుకునేందుకు వీలుగా నూతన రహదారి నిర్మాణానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆమోదం తెలిపారు. రూ.6 కోట్లు పంచాయతీరాజ్ నిధులు మంజూరు చేశారు. ఈ రహదారి నిర్మాణం పూర్తయితే వాడపల్లి క్షేత్రానికి రాకపోకలు సాగించే భక్తుల ప్రయాణ కష్టాలు తీరతాయి. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో కొత్తపేట శాసన సభ్యులు బండారు సత్యానందరావు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కలిసి వాడపల్లి ఏటిగట్టు రోడ్డు నిర్మాణానికి నిధులు కేటాయించాలని కోరారు. కోరిన కోర్కెలు తీర్చే దైవంగా పేరున్న వాడపల్లి ఏడు వారాల వెంకటేశ్వరస్వామి వారి ఆలయానికి రోజు రోజుకీ భక్తుల రద్దీ పెరుగుతూ వస్తోందని, రావులపాలెం మీదుగా ఉన్న ప్రస్తుత రహదారి ఇరుకుగా ఉండడంతో ట్రాఫిక్ రద్దీతో భక్తులు ఇబ్బందిపడుతున్నారని తెలిపారు. 216 జాతీయ రహదారి నుంచి ఏటిగట్టు మీదుగా 7 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మిస్తే.. ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని తెలిపారు. దీనిపై సానుకూలంగా స్పందించి పవన్ కల్యాణ్.. తక్షణం నిధులు మంజూరు చేశారు. ఈ రోడ్డుని అభివృద్ధి చేస్తే భక్తులు గోదావరి తీరాన ప్రయాణించడం ద్వారా ఆధ్యాత్మిక పర్యాటకం అభివృద్ధి చెందుతుందని తెలిపారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
కొలికపూడి, కేశినేని చిన్ని వివాదంపై చంద్రబాబు సీరియస్.. రేపటి సమావేశం రద్దు..!
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిపోయింది.. అయితే, ఈ వ్యవహారంపై టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు, ఎమ్మెల్యే కొలికపూడి ఎంపీ కేశినేని, ఇతర కృష్ణా జిల్లా నేతల వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారట చంద్రబాబు.. టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో దుబాయ్ నుంచి ఫోన్‌లో మాట్లాడిన చంద్రబాబు.. ఆ నేతలతో మాట్లాడాల్సిన అవసరం లేదని చెప్పినట్టు సమాచారం.. దీంతో రేపటి టీడీపీ నేతల సమావేశం రద్దు చేశారట నేతలు.. సీఎం చంద్రబాబు ఆదేశాలతో రేపటి సమావేశాన్ని పల్లా శ్రీనివాసరావు రద్దు చేశారు.. నేతల వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు.. బాహాటంగా ఇలాంటి వ్యాఖ్యలపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారట..
పదోతరగతి విద్యార్థులు అలర్ట్.. ఆరోజే పరీక్ష ఫీజు గడువుకు లాస్ట్..!
తెలంగాణలోని పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు (మార్చి-2026)కు సంబంధించిన పరీక్ష ఫీజు చెల్లింపు గడువులు సంబంధిచి బిగ్ అప్డేట్ వెలుబడింది. పరీక్షలకు హాజరయ్యే రెగ్యులర్ విద్యార్థులు, అలాగే ఇదివరకు ఫెయిల్ అయిన అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవడానికి ఈ గడువులను ప్రకటించారు. లేట్ ఫీజు లేకుండా ఫీజు చెల్లించడానికి అక్టోబర్ 30, 2025 నుండి నవంబర్ 13, 2025 వరకు గడువుగా నిర్ణయించారు. విద్యార్థులు కట్టిన మొత్తాన్ని పాఠశాల హెచ్‌ఎంలు ఈ ఫీజును నవంబర్ 14 లోపల ట్రెజరీకి అందచేయాలి. ఆన్‌లైన్‌లో దరఖాస్తుల సమర్పణకు హెచ్‌ఎంలకు నవంబర్ 18, 2025 వరకు గడువు ఇవ్వబడింది. వీటితోపాటు లేట్ ఫీజు చెల్లింపులకు సంబంధించిన గడువులు కూడా ప్రకటించారు. రూ.50 లేట్ ఫీజుతో నవంబర్ 15 నుండి నవంబర్ 25 వరకు ఫీజు చెల్లించవచ్చు. రూ.200 లేట్ ఫీజుతో నవంబర్ 29 నుండి డిసెంబర్ 12 వరకు చెల్లింపులు చేయవచ్చు. ఇక రూ.500 లేట్ ఫీజుతో అయితే, డిసెంబర్ 15 నుండి డిసెంబర్ 29 వరకు ఫీజు చెల్లించే అవకాశం ఉంది. డీజీఈ కార్యాలయం ఈ గడువులను ఎట్టి పరిస్థితుల్లోనూ పొడిగించబోమని స్పష్టంగా తెలిపింది.
రౌడీ షీటర్‌కు కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సన్నాహక సమావేశంలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఈ ఉప ఎన్నికల్లో ఒక రౌడీ షీటర్‌కు టికెట్ ఇచ్చిందని తీవ్రంగా విమర్శించారు. హైదరాబాద్ ప్రజల విజ్ఞతకు, తెలివితేటలకు ఈ ఎన్నిక ఒక కఠిన పరీక్ష పెట్టిందని అభిప్రాయపడ్డారు. విజ్ఞులైన ప్రజలు రౌడీ షీటర్ కుటుంబం నుంచి వచ్చిన అభ్యర్థిని చిత్తుగా ఓడించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడుతూ… ‘కాంగ్రెస్ హయాంలో తెలంగాణ గుల్ల అయింది. బైపోల్స్‌లో బీఆర్ఎస్ విజయం ఖాయమైంది. హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతలను కాపాడుకోవడానికి జూబ్లీహిల్స్ ప్రజలు బీఆర్ఎస్‌ను గెలిపిస్తారు. కాంగ్రెస్ వచ్చాక తెలంగాణలో ఆర్థిక వ్యవస్థ దిగజారింది. బీఆర్ఎస్ పదేళ్ల కాలంలో అమలైన సంక్షేమ పథకాలు, అభివృద్ధి.. కాంగ్రెస్ వచ్చాక మాయమయ్యాయి. కాంగ్రెస్ దుష్టపాలనపై ప్రజలకు మరింత అవగాహన కల్పించాలి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం ప్రభావం జీహెచ్ఎంసీ ఎన్నికలపై ఉంటుంది. జూబ్లీహిల్స్‌లో గెలిస్తే.. స్థానిక సంస్థల ఎన్నికలోనూ ప్రజలు బీఆర్ఎస్ వైపే ఉంటారు’ అని అన్నారు.
వందేళ్లయినా “జంగిల్ రాజ్”ను మరిచిపోలేం.. ఆర్జేడీపై మోడీ ఫైర్..
బీహార్ ఎన్నికల ప్రచారంలోకి ప్రధాని నరేంద్రమోడీ దిగారు. బీహార్‌లోని బీజేపీ కార్యకర్తలతో ప్రధాని గురువారం మాట్లాడుతూ.. బీహార్‌లో ‘‘జంగిల్ రాజ్’’ మరో 100 ఏళ్లు అయినా మరిచిపోలేమని, ఆ కాలపు అనుభవానలు యువతరానికి అందించాలని రాష్ట్రంలోని సీనియర్ ఓటర్లను ఆయన కోరారు. ప్రతిపక్షాలు తమ తప్పును దాచడానికి ఎంత ప్రయత్నించినా, ప్రజలు దానిని క్షమించరని ఆయన అన్నారు. ప్రతిపక్ష కూటమి ఘటబంధన్(కూటమి)కి బదులుగా ‘లఠబంధన్’(నేరస్తుల కూటమి) అని పిలిచారు. ప్రతిపక్ష నేతలంతా ఢిల్లీ, బీహార్‌లో బెయిల్‌పై బయట ఉన్నారని అన్నారు. ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ పాలనను తరుచుగా ‘ఆటవిక రాజ్యం’గా విమర్శిస్తారు. ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ‘‘మేరా బూత్ సబ్సే మజ్‌బూత్: యువ సంవాద్’’ కార్యక్రమంలో ప్రధాని మోడీ మాట్లాడారు. బీహార్ లోని యువకులంతా ప్రతీ బూత్‌లో యువకులందర్ని సమావేశపరచాలని, ఆ ప్రాంతంలోని వృద్ధులను వచ్చి జంగిల్ రాజ్ గురించి యువతకు చెప్పాలని ప్రధాని చెప్పారు. సీఎం నితీష్ కుమార్, ఎన్డీయే బీహార్‌ను అడవి రాజ్యం నుంచి బయటకు తీసుకురావడానికి, చట్ట పాలనను స్థాపించడానికి చాలా కష్టపడ్డారని, ఇప్పుడు ప్రజలు తమను తాము గర్వంగా బీహారీలమని పిలుచుకుంటున్నారని మోడీ అన్నారు.
బ్యాంక్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. నవంబర్ 1 నుంచి కీలక మార్పులు..
బ్యాంక్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్. నవంబర్ 1 నుంచి కీలక మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. నవంబర్ 1 నుండి భారత బ్యాంకింగ్ వ్యవస్థలో ప్రధాన మార్పులు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, బ్యాంకింగ్ (సవరణ) చట్టం, 2025 కింద నామినేషన్‌కు సంబంధించిన కీలక నిబంధనలు నవంబర్ 1, 2025 నుండి అమల్లోకి వస్తాయి. ఏప్రిల్ 15, 2025న నోటిఫై చేయబడిన బ్యాంకింగ్ (సవరణ) చట్టం, 2025, ఐదు కీలక చట్టాలకు మొత్తం 19 సవరణలను చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం, 1934, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం, 1955, బ్యాంకింగ్ కంపెనీల (సముపార్జన, అండర్‌టేకింగ్‌ల బదిలీ) చట్టాలు, 1970, 1980. ఈ మార్పులన్నీ నవంబర్ 1 నుండి అమలులోకి వస్తాయి. మీకు బ్యాంక్ ఖాతా ఉంటే, ఇది మీపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. అత్యంత ముఖ్యమైన మార్పు నామినీ అవసరం. బ్యాంక్ కస్టమర్లు ఇప్పుడు తమ ఖాతాకు నలుగురు నామినీలను నియమించుకోవచ్చు. ఇది డిపాజిటర్లు, వారి నామినీలకు క్లెయిమ్ పరిష్కారాన్ని సులభతరం చేస్తుంది.
ఇంటెలిజెన్స్ బ్యూరోలో భారీగా ఉద్యోగాలు.. ఐటీ జాబ్స్ కు మించి..
హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్-II, టెక్నికల్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. IBలో ACIO లేదా టెక్నికల్ పోస్టుల్లో కెరీర్‌ను ప్రారంభించాలనుకునే అభ్యర్థులు త్వరలో ఈ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. IB మొత్తం 258 IB ACIO Gr-II/Tech పోస్టులను భర్తీ చేస్తుంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 25న ప్రారంభమవుతుంది. ఆసక్తిగల, అర్హత కలిగిన అభ్యర్థులు నవంబర్ 16, 2025 వరకు ఈ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థులు ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్స్ , కంప్యూటర్ ఇంజనీరింగ్ మొదలైన వాటిలో బి.టెక్ లేదా బి.ఇ. డిగ్రీని కలిగి ఉండాలి . అదనంగా, అభ్యర్థులు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, ఇతర అవసరమైన అర్హతలను కలిగి ఉండాలి. దరఖాస్తు చేసుకోవడానికి కనీస వయస్సు 18 సంవత్సరాలు. గరిష్ట వయస్సు 27 సంవత్సరాలు. అయితే, కొన్ని వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. SC, ST అభ్యర్థులకు 5 సంవత్సరాల వయోపరిమితిలో సడలింపు, OBC అభ్యర్థులకు 3 సంవత్సరాల వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది.
24 రోజుల బ్యాటరీ లైఫ్, 2.07 అంగుళాల AMOLED డిస్‌ప్లేతో REDMI Watch 6 స్మార్ట్‌వాచ్ లాంచ్..!
షియోమీ సంస్థ REDMI K90 సిరీస్‌తో పాటు తమ సరికొత్త స్మార్ట్‌వాచ్ REDMI Watch 6 ను విడుదల చేసింది. ఈ వాచ్ ప్రీమియం డిజైన్, అధునాతన ఫీచర్లు, అద్భుతమైన బ్యాటరీ లైఫ్‌తో వినియోగదారులను ఆకర్షించేలా ఉంది. REDMI వాచ్ 6.. 2.07-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 60Hz రిఫ్రెష్ రేట్, 2000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. ఈ వాచ్ ఏరోస్పేస్-గ్రేడ్ అల్యూమినియం అల్లాయ్‌ను ఉపయోగించి కేవలం 9.9 మి.మీ. సన్నని డిజైన్‌తో రూపొందించబడింది. దీనితో వాచ్ అధిక మన్నికను అందిస్తుంది. దీనికి క్విక్ రిలీజ్ స్ట్రాప్‌లు సపోర్ట్ చేస్తాయి, అదనంగా కోనా లెదర్ మాగ్నెటిక్ స్ట్రాప్‌లను కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌వాచ్ 550mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఇది సాధారణ వినియోగంలో 24 రోజుల వరకు స్టాండ్‌బై బ్యాటరీ లైఫ్‌ను, విలక్షణమైన మిశ్రమ వినియోగంలో 12 రోజులు, ఆల్వేస్-ఆన్ డిస్‌ప్లే ఎనేబుల్ చేస్తే 7 రోజుల వరకు ఛార్జ్ అందిస్తుంది. ఇది ఫ్యాషన్ అడాప్టబుల్ డిజైన్‌లతో సహా అనేక అనుకూలీకరించదగిన వాచ్ ఫేస్‌లను అందిస్తుంది. HyperOS 3 ఆపరేటింగ్ సిస్టమ్‌పై నడుస్తున్న REDMI వాచ్ 6 లో అనేక స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి. ఇందులో Xiaomi Super Island ఫీచర్ ద్వారా క్యాలెండర్ ఈవెంట్‌లు, డెలివరీల నోటిఫికేషన్‌లను డైనమిక్ ఇంటర్‌ఫేస్‌లో అందిస్తుంది. ఇది స్మార్ట్ హోమ్ ఉపకరణాలు, వాహనాల నియంత్రణతో పాటు NFC పేమెంట్స్.. వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్‌ను కలిగి ఉంది. వినియోగదారులు వీచాట్, SMS లకు వాయిస్, ముందే సెట్ చేసిన పదబంధాలు లేదా ఎమోజీల ద్వారా త్వరగా సమాధానాలు పంపవచ్చు.
అదరగొట్టిన స్మృతి, ప్రతీక.. ప్రపంచ రికార్డు సమం!
మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో భాగంగా డాక్టర్ డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత ఓపెనర్లు స్మృతి మంధాన, ప్రతీక రావల్ అదరగొట్టారు. స్మృతి మంధాన (109; 95 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్‌లు) సెంచరీ చేసి పెవిలియన్ చేరింది. స్మృతి 88 బంతుల్లో సెంచరీ చేసింది. మరో ఓపెనర్ ప్రతీక 122 బంతుల్లో శతకం చేసి భారత జట్టుకు మంచి స్కోర్ అందిస్తోంది. స్మృతి, ప్రతీక కలిసి 212 పరుగుల భాగస్వామ్యం అందించారు. దాంతో ఓ ప్రపంచ రికార్డును సమం చేశారు. స్మృతి మంధాన, ప్రతీక రావల్ కలిసి ఈ సంవత్సరం ఐదు సెంచరీ భాగస్వామ్యాలు నమోదు చేశారు. దాంతో ఒకే ఏడాదిలో అత్యధిక శతక భాగస్వామ్యాలు నమోదు చేసిన జోడిగా నిలిచారు. ఆస్ట్రేలియాకు చెందిన బెలిండా క్లార్క్, లిసా కీట్లీ నెలకొల్పిన ఆల్ టైమ్ రికార్డును మన ప్లేయర్స్ సమం చేశారు. 2000 సంవత్సరంలో బెలిండా, లిసాలు ఐదు సెంచరీ భాగస్వామ్యాలు నెలకొల్పారు. దక్షిణాఫ్రికాకు చెందిన టాజ్మిన్ బ్రిట్స్, లారా వోల్వార్డ్ట్ జంట నాలుగు సెంచరీ స్టాండ్‌లను నమోదు చేశారు. 2015లో న్యూజిలాండ్‌కు చెందిన సుజీ బేట్స్, రాచెల్ ప్రీస్ట్ జోడిలు కూడా 4 శతక భాగస్వామ్యాలు నెలకొల్పారు.
ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ సంగీత దర్శకుడు మృతి
కోలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎం.సి. సబేశన్(68) అనారోగ్య సమస్యలతో మృతి చెందారు. అలాగే నటుడు భూపతి(70) కూడా గురువారం కన్నుమూశారు. భూపతి శ్వాసకోశ సంబంధిత వ్యాధితో మృతి చెందినట్టు తెలుస్తోంది. భూపతి ఎవరో కాదు ప్రముఖ నటి, దివంగత మనోరమ కొడుకు. భూపతి తమిళంలో ఎన్నో సినిమాల్లో నటించాడు. ఆయన చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు సాధించాయి. భూపతికి ధనలక్ష్మి, కొడుకు, ఇద్దరు కుమార్తెలున్నారు. రేపు చెన్నైలో ఆయన అంత్యక్రియలు నిర్వహించబోతున్నారు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ సబేషన్ ఎన్నో సినిమాలకు మ్యూజిక్ అందించి ఊపేశాడు. 2017 దాకా దాదాపు 16 ఏళ్లు అలుపన్నది లేకుండా మ్యూజిక్ అందించాడు సబేషన్. సబేశన్ కుమారుడు కార్తీక్ సబేశన్, మేనల్లుడు జై ఇద్దరూ నటులుగా రాణిస్తున్నారు. ఇక సబేషన్ అంత్యక్రియలు కూడా శుక్రవారమే చెన్నైలో నిర్వహించబోతున్నారు. సబేషన్, భూపతి మృతిపట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కోలీవుడ్ లో ఒకే రోజు ఇద్దరు ప్రముఖులు మృతి చెందడం తీవ్ర కలకలం రేపుతోంది.