అన్నదాతలు ఆందోళన చెందవద్దు.. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మే ప్రభుత్వం మాది..
అన్నదాతలు ఆందోళన చెందవద్దు.. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మే ప్రభుత్వం మాది అంటూ సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. రైతు సమస్యలపై, గిట్టుబాటు ధరలపై విపక్షాలు ఆందోళన చేస్తున్న తరుణంలో ఎక్స్ (ట్విట్టర్)లో స్పందించిన ఆయన.. “రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అని నమ్మే ప్రభుత్వం మాది. అందుకే రైతుకు మద్దతు ధర విషయంలో ఏ సమస్య వచ్చినా… ఒకడుగు ముందుకు వేసి వారికి అండగా నిలుస్తున్నాం. సాగు విస్తీర్ణం పెరగడంతో పాటు వర్షాల కారణంగా ఉల్లి ధర తగ్గి రైతులు నష్టపోతుంటే వారిని ఆదుకోవడానికి కీలక నిర్ణయం తీసుకున్నాం. ప్రతి రైతుకు హెక్టారుకు రూ.50 వేలు చెల్లించాలని నిర్ణయించాం. ఈ నిర్ణయంతో 45 వేల ఎకరాల్లో ఉల్లి సాగు చేసే రైతులకు లబ్ధి చేకూరుతుంది. రైతులు ఉల్లి పంట పూర్తిగా సిద్ధం అయిన తర్వాత ఆరబెట్టి, గ్రేడింగ్ చేసి వారికి మంచి ధర వచ్చినప్పుడు అమ్ముకోవచ్చు. వారి పంటతో సంబంధం లేకుండానే ఈ – పంట ఆధారంగా హెక్టారుకు రూ.50 వేలు చెల్లిస్తాం. ఆర్థికంగా ప్రభుత్వంపై భారమైనా…రైతుల శ్రేయస్సు కోసం గతంలో ఎన్నడూ లేని విధంగా నిర్ణయం తీసుకున్నాం..” అని పేర్కొన్నారు..
ఏపీలో మరోసారి ఐఏఎస్‌ల బదిలీలు.. ఈ సారి తొమ్మిది మంది..
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అధికారుల బదిలీలు కొనసాగుతూనే ఉన్నాయి.. ఓవైపు సంక్షేమం మరోవైపు.. స్థిరమైన పాలనపై దృష్టిసారించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. సుదీర్ఘ కసరత్తు చేస్తూ.. అధికారులను బదిలీ చేస్తున్నారు.. ఈ మధ్యే సీనియర్ ఐఏఎస్ అధికారులు.. జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు.. వివిధ శాఖల అధిపతులను మారుస్తూ వచ్చిన కూటమి ప్రభుత్వం.. తాజాగా, మరో తొమ్మిది మంది IAS అధికారులను బదిలీ చేసింది.. 1. ఆర్ అండ్ ఆర్ డైరెక్టర్ గా ప్రశాంతి, 2. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఐజీగా అంబేద్కర్, 3. ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ డైరక్టర్‌గా శ్రీధర్ చామకురి, 4. ఏపీ జెన్కో ఎండీగా నాగలక్ష్మి, 5. సీఆర్డీఏ అడిషనల్ కమిషనర్‌గా భార్గవ్., 6. కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ (జేసీ)గా నవీన్., 7. ఖాదీ గ్రామీణ పరిశ్రమల సీఈవోగా కట్టా సింహాచలం.., 8. నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ (జేసీ)గా వెంకటేశ్వర్లు.. 9. ఎస్‌ఈసీ కార్యదర్శిగా మల్లికార్జున్‌ను బదిలీ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు..
నేను వచ్చిన వెంటనే చెత్త తొలగించా.. చెత్త నేతలకు అదే గతి..! సీఎం సీరియస్ వార్నింగ్..
నేను వచ్చిన వెంటనే చెత్త తొలగించా.. చెత్త నేతలను కూడా అలాగే తొలగిస్తాను అంటూ రౌడీషీటర్లకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. పల్నాడు జిల్లా మాచర్లలో పర్యటించిన ఆయన.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. చాలా రోజుల తర్వాత మాచర్లలో టీడీపీ జెండా ఎగరేశారు జూలకంటి బ్రహ్మారెడ్డి, శ్రీకృష్ణదేవరాయలు అని గుర్తుచేశారు.. మాచర్లకు వచ్చిన నాకు ఘనస్వాగతం పలికారు. ఈ రోజు మాచర్లకు స్వాతంత్ర్యం వచ్చింది.. ఇది నిలబెట్టాల్సిన బాధ్యత మీదే అని సూచించారు.. మాచర్లలో ఉండే రౌడీలు, ముఠా నాయకులు ప్రజల ఆస్తులను దోచేశారు. చరిత్రలో ఉన్న డిక్టేటర్లకు పట్టిన గతే వారికి పట్టిందన్నారు.. ఆత్మకూరు బాధితులను ఆదుకునేందుకు కూడా నన్ను రానివ్వకుండా నా ఇంటికి తాళ్లు కట్టారు. ఆరోజే చెప్పా… మీకు ఉరితాళ్లే అని.. మున్సిపల్ ఎన్నికలలో దౌర్జన్యం చేసినప్పుడే చెప్పా ఖబడ్దార్ అని గుర్తుచేశారు.
నారా లోకేష్ ఆరోపణలు.. వైసీపీ కౌంటర్..
తిరుమల పరకామణి విషయంలో మంత్రి నారా లోకేష్ చేసిన ఆరోపణలకు కౌంటర్ ఇచ్చింది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఎక్స్ (ట్విట్టర్)లో లోకేష్ కౌంటర్ గా ట్వీట్ చేసింది వైసీపీ.. “రాజకీయ ప్రయోజనాలకు తిరుమల క్షేత్రాన్ని వాడుకోవడం చంద్రబాబుకు, లోకేష్‌కు ఒక అలవాటుగా మారింది.. వెంకటేశ్వరస్వామి సాక్షిగా అబద్ధాలు, విషప్రచారాలు చేయడం వారిద్దరికీ అలవాటే. సిగ్గు, శరం వదిలేసి బరితెగించి విషప్రచారం చేయడంలో ఇద్దరూ హేమాహేమీలు. పరకామణిలో చోరీ విషయంలోనూ చంద్రబాబువి పచ్చి అబద్ధాలు..” అని మండిపడింది వైసీపీ.. ఇక, “దశాబ్దాలుగా పరకామణిలో చోరీకి పాల్పడుతున్న రవికుమార్‌ను పట్టుకున్నది 2023, ఏప్రిల్‌లో. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో లోకేష్ నువ్వైతే పంచాయతీ చేసి రవికుమార్ ఆస్తులను కొట్టేసేవాడివి.. కానీ, వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో పోలీసులు నిశిత విచారణ జరపడంతో, రవికుమార్ కుటుంబ సభ్యులు పశ్చాత్తాపం చెంది రూ.14.43 కోట్ల విలువైన ఆస్తులను టీటీడీకి గిఫ్ట్‌రూపంలో ఇచ్చేశారు. ఇదంతా చట్టప్రకారం, కోర్టులు నిర్దేశించిన న్యాయసూత్రాల ప్రకారం పారదర్శకంగా జరిగింది. లోకేష్.. నువ్వైతే పంచాయతీలు చేసి, ఈ ఆస్తులను కొట్టేసి, దొంగ పెట్టుబడుల రూపంలో ఏ దుబాయ్ కో తరలించేవాడివి.. రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పటికే ఓ స్లోగన్ నడుస్తోంది.. క్యాష్.. సూట్‌కేసు.. రాజేష్.. లోకేష్.. అని. ఈ ప్రభుత్వంలోని అలీబాబా అరడజను దొంగల్లో నువ్వు ఒకడివి..” అంటూ మంత్రి నారా లోకేష్‌కి ఘాటుగా కౌంటర్ ఇచ్చింది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ..
పవన్ కల్యాణ్‌పై బోండా ఉమా వరుస ట్వీట్స్.. వివాదం ముగిసినట్టేనా..?
అసెంబ్లీలో బోండా ఉమా ప్రశ్నోత్తరాల సమంలో చేసిన వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యణ్ సీరియస్ అయ్యారు.. శాఖా పరంగా ఎంక్వైరీకి కూడా ఆదేశించారు… అసలు ఏ ఉద్దేశంతో బోండా ఉమా ఈ వ్యాఖ్యలు చేయవలసి వచ్చిందో పూర్తిస్థాయి విచారణ చేసేందుకు పవన్ కల్యాణ్ సిద్ధమయ్యారనే ప్రచారం సాగింది.. సీఎం చంద్రబాబు దృష్టికి కూడా ఈ ఎపిసోడ్ తీసుకెళ్లాలని పవన్ సూచించారు. నెక్స్ట్ ఏం జరగబోతోంది… విచారణ తర్వాత పరిస్థితి ఏ రకంగా ఉండబోతోంది.. అనేది హాట్ టాపిక్‌గా మారిన సమయంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభ వర్షాకాల సమావేశాలలో భాగంగా జరుగుతున్న ప్రశ్నోత్తరాల సమయంలో, విజయవాడ సెంట్రల్ శాసన సభ్యులు బోండా ఉమా కాలుష్య నియంత్రణ మండలి పనితీరుపై లేవనెత్తిన ప్రశ్నలకు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమాధానం ఇచ్చారంటూ డిప్యూటీ సీఎం ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో షేర్ చేసిన వీడియోకి రిప్లే ఇచ్చిన బోండా ఉమ.. “అసెంబ్లీలో ప్రస్తావించిన సమస్యను విని తక్షణమే స్పందించి పరిష్కరించిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రివర్యులు పవన్ కల్యాణ్ గారికి నా ధన్యవాదాలు. ప్రజా సమస్యలపై ఇంత వేగంగా, నిష్పక్షపాతంగా చర్యలు తీసుకోవడం మీలో ఉన్న సేవా తపనకు నిదర్శనం..” అంటూ ట్వీట్.. ఇక, పవన్ కల్యాణ్ గారికి నా ధన్యవాదాలు. ప్రజా సమస్యలపై ఇంత వేగంగా, నిష్పక్షపాతంగా చర్యలు తీసుకోవడం మీలో ఉన్న సేవా తపనకు నిదర్శనం..” అంటూ మరో ట్వీట్ చేశారు బోండా ఉమామహేశ్వరరావు.
మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే
అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలు సహజం. కానీ ఆస్తి కోసం కొట్టుకోవడం మాత్రం కొన్ని ఘటనల్లోనే జరుగుతుంది. బూర్గంపాడు మండలం లక్ష్మీపురంలోనూ ఇద్దరు అన్నదమ్ముల ఆస్తి కోసం పోట్లాడుకున్నారు. గత కొంత కాలంగా.. తల్లి బంగారం కోసం లక్ష్మీపురానికి చెందిన నాగిరెడ్డి, రామకృష్ణారెడ్డి మధ్య తగాదాలు ఉన్నాయి. ఈ క్రమంలో మరోసారి ఘర్షణ జరిగింది. దీంతో… గొడవ పెరిగిన క్రమంలో అన్న నాగిరెడ్డి కుటుంబంపై తమ్ముడు రామకృష్ణా రెడ్డి కుటుంబ సభ్యులు కర్రలు, రాళ్లతో దాడి చేశారు… తమ్ముడు రామకృష్ణారెడ్డి తన అన్న నాగిరెడ్డి భార్య పద్మ, ఆయన కుమారుడు అంజిరెడ్డిపై బండరాళ్లతో దాడి చేశాడు. దీంతో ఈ దాడిలో ఇరువురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు పద్మను ఆమె కుమారుడు అంజిరెడ్డిని హాస్పిటల్‌కు తరలించారు. ఈ దాడిలో తీవ్ర గాయాల పాలైన పద్మ పరిస్థితి విషమంగా ఉందని నాగిరెడ్డి తెలిపారు. నాగిరెడ్డి ఫిర్యాదుతో దాడికి పాల్పడిన రామకృష్ణారెడ్డి, ఆయన భార్య కొడుకులపై కేసు నమోదు చేశారు బూర్గంపాడు పోలీసులు.. తల్లి బంగారం ఇద్దరు అన్నదమ్ములు తమ మధ్య సోదర భావాన్ని కూడా మర్చిపోయి విచక్షణారహితంగా కొట్టుకోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది….
రేపటి నుంచి బతుకమ్మ సందడి.. అసలు బతుకమ్మ కథ ఏంటో తెలుసా!
రేపటి నుంచి తెలంగాణ ప్రాంతంలో ప్రతి ఇంట్లో బతుకమ్మ పండుగ సందడి మొదలు కానుంది. ఇంతకీ మీకు ఎప్పుడైనా అనుమానం వచ్చిందా? ఇంతకీ ఈ బతుకమ్మ పండుగ తెలంగాణలో ఎందుకు ఇంత ప్రత్యేకమైనది అని.. అసలు బతుకమ్మ కథ ఏంటి అని ఎప్పుడైనా ఆలోచించారా.. మన పూర్వికలు బతుకమ్మ కథను తిరొక్కతీర్ల చెప్పిండ్రు.. అయితే అసలైన బతుకమ్మ కథ ఎక్కడికెళ్లి ప్రారంభం అయ్యిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.. చరిత్రలో మన తెలంగాణ ప్రాంతాన్ని రాష్ట్రకూట రాజులు పరిపాలించే వారిని చెప్పబడింది. వీళ్ల దగ్గర వేములవాడ చాళుక్యలు సామంతులుగా ఉండేవారు. ఆ సమయంలో చోళులకు, రాష్ట్రకూటులకు యుద్ధం జరిగింది. అప్పుడు వేములవాడ చాళుక్యలు రాష్ట్రకూటులకు మద్దతుగా నిలిచి పోరాడారు. అనంతర కాలంలో అంటే.. క్రీస్తు శకం 973లో ఈ చాళుక్యరాజైన తైలపాడు రాష్ట్రకూటుల చివరి రాజు అయిన కర్కుడిని ఖతం చేసి కళ్యాణి చాళుక్య రాజ్యాన్ని తెలంగాణ ప్రాంతంలో నెలకొల్పాడు. క్రీస్తు శకం 997లో తైలపాడు మరణించడంతో అతని కుమారుడైన సత్యాస్రాయుడు రాజు అయ్యారు. అప్పుడు వేములవాడలో ప్రసిద్ధి చెందిన రాజరాజేశ్వరస్వామి ఆలయం ఉండేది. ఆపదల్లో ఉన్నవారు స్వామివారిని దర్శించుకుంటే చల్లగా చూస్తారనే నమ్మకం ప్రజల్లో బలంగా ఉండేది.
ట్రంప్ H-1B రూల్స్‌పై స్పందించిన భారత్.. ఏం చెప్పిందంటే..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H-1B వీసా ఫీజును పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. వలసల్ని అరికట్టడం, స్థానిక అమెరికన్లకు ఉపాధిని పెంచడం అనే కారణాలు చెబుతూ.. H-1B వీసా దరఖాస్తుదారులపై $100,000 (రూ. 88 లక్షలకు పైగా) రుసుము విధించారు. ఈ ఫీజు పెంచడం వల్ల, అమెరికాకు వచ్చే వ్యక్తులు వాస్తవానికి చాలా నైపుణ్యం కలిగిన వారు అని, అమెరికన్ వర్కర్లను భర్తీ చేస్తారని నిర్ధారిస్తుందని అని ట్రంప్ అన్నారు. ‘‘అమెరికాకు గొప్ప కార్మికులు అవసరం అని, ఈ చర్య దీనికి ఉపయోగపడుతుంది’’ అని చెప్పారు. అయితే, ట్రంప్ నిర్ణయం భారతీయ వృత్తి నిపుణులపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. H-1B వీసా హోల్డర్లలో 70 శాతం మంది ఇండియన్స్ ఉన్నారు. ట్రంప్ నిర్ణయంపై భారత్ స్పందించింది. ఒక ప్రకటనలో ‘‘H-1B వీసా ఫీజు పెంపు చాలా కుటుంబాలకు ఇబ్బంది కలిగించే విధంగా మానవతా పరిణామాలను కలిగిస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. అమెరికా అధికారులు ఈ విషయాన్ని పరిష్కరిస్తారని ప్రభుత్వం ఆశిస్తున్నట్లు కూడా పేర్కొంది.’’ అని తెలిపింది.
H-1B వీసాలపై ట్రంప్ సెల్ఫ్ గోల్.. భారత్‌కే లాభమంటున్న నిపుణులు..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H-1B వీసాలపై కఠిన చర్యలు తీసుకున్నారు. H-1B వీసాలపై USD 100,000 (రూ. 88 లక్షలకు పైగా) వార్షిక రుసుము విధిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. ఇది ప్రధానంగా నైపుణ్యం కలిగిన భారతీయ వర్కర్లపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. అయితే, ఈ నిర్ణయంతో అమెరికా సెల్ఫ్ గోల్ చేసుకుందని కొంతమంది విశ్లేషకులు చెబుతున్నారు. భవిష్యత్తులో ఇది భారత్‌కు కలిసి వస్తుందని అంటున్నారు. హెచ్1బీ వీసా ద్వారా అమెరికన్ కంపెనీలు టాలెంటెడ్ ఇండియన్ ఉద్యోగుల్ని నియమించుకుంటుంది. తక్కువ ఖర్చుతో మంచి టాలెంట్‌ని కొనుగోలు చేస్తున్నామని కంపెనీలు అనుకుంటున్నాయి. అయితే, దీని వల్ల స్థానిక అమెరికన్లు నష్టపోతున్నారని అక్కడ కొంత మంది వాదిస్తున్నారు. ట్రంప్ చర్యలు కూడా స్థానిక అమెరికన్లకు ఉద్యోగాలు పెంచే యోచనగా చూడబడుతోంది. మాజీ దౌత్యవేత్త, నీతి ఆయోగ్ మాజీ సీఈఓ అమితాబ్ కాంత్‌తో సహా చాలా మంది ట్రంప్ చర్యను విమర్శించారు. H1-B రుసుము భారత ఆర్థిక వ్యవస్థను కాదు, అమెరికన్ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తుందని నొక్కి చెప్పారు. ట్రంప్ నిర్ణయం అమెరికాకే నష్టం చేస్తుందని, భారత్‌కు లాభమని అమితాబ్ కాంత్ అన్నారు. ఇది యూఎస్ ఆవిష్కరణను ఉక్కిరిబిక్కిరి చేస్తుందని, భారత దేశానికి టర్బోచార్జ్‌ను ఇస్తుందని చెప్పారు. ‘‘ప్రపంచ ప్రతిభకు తలుపులు మూసేయదడం ద్వారా అమెరికా ల్యాబ్‌లు, పేటెంట్లు ఆవిష్కరణలు, స్టార్టప్‌లు ఇప్పుడు బెంగళూర్, హైదరాబాద్, పూణే, గుర్గావ్‌కు వస్తాయి. భారతదేశంలో అత్యుత్తమ వైద్యులు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తల ఆవిష్కరణలు భారతదేశాన్ని వికసిత్ భారత్ వైపు పురోగమించేలా చేస్తాయి’’ అని ట్వీట్ చేశారు.
బిచ్చగాడిని భరణం కోరిన రెండో భార్య.. హైకోర్టు కీలక తీర్పు..
బిచ్చగాడు అయిన భర్తను, భార్య భరణం కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై కేరళ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. బిక్షాటన చేస్తూ బతికే తన అంధుడైన భర్త నుంచి భరణం కోరుతూ మహిళ దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు తీర్పు చెప్పింది. ‘‘ఒక బిచ్చగాడిని తన భార్యకు భరణం చెల్లించమని బలవంతం చేయకూడదు’’ అని వ్యాఖ్యానించింది. అదే సమయంలో, నిరుపేద జీవిత భాగస్వాములకు ఆహారం, దుస్తులు అందేలా చూసుకోవడానికి రాష్ట్రం జోక్యం చేసుకోవాలని ఆదేశించింది. ఈ కేసును విచారించిన కేరళ హైకోర్టు..‘‘ఒక భిక్షాటన పాత్రలో మరొకరు చేయి పెట్టవద్దు’’ అనే మలయాళ సామెతను ఉటంకిస్తూ, భిక్షపై ఆధారపడే వ్యక్తిని ఇతరులకు మద్దతు ఇవ్వమని బలవంతం చేయడం తగదని జస్టిస్ పి.వి. కున్హికృష్ణన్ అభిప్రాయపడ్డారు. ముస్లిం పర్సనల్ లా కింద రెండుసార్లు వివాహం చేసుకున్న సదరు వ్యక్తిని రెండో భార్య నెలకు రూ. 10,000 భరణం కోరింది. మలప్పురం ఫ్యామిలీ కోర్టు గతంలోనే ఆమె అభ్యర్థనను తిరస్కరించింది. భరణం ఇప్పించలేమని చెప్పింది. దీంతో మహిళ హైకోర్టుకు అప్పీల్ చేసుకున్న తరుణంలో ఈ తీర్పు వచ్చింది.
మ్యాచ్ రిఫరీగా ఆండీ పైక్రాఫ్ట్..! పాకిస్థాన్ మరోసారి బహిష్కరణ నాటకం ఆడనుందా..?
ఆసియా కప్ 2025లో భారత జట్టు వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచి అజేయంగా నిలిచింది. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు ఇప్పుడు తన మొదటి సూపర్ 4 దశ మ్యాచ్‌ను చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్ సెప్టెంబర్ 21వ తేదీ ఆదివారం దుబాయ్‌లోని దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. తాజాగా ఈ మ్యాచ్ గురించి ఒక ముఖ్యమైన సమాచారం వెలువడింది. జింబాబ్వేకు చెందిన ఆండీ పైక్రాఫ్ట్ మ్యాచ్ రిఫరీగా ఉంటారని వర్గాలు సూచిస్తున్నాయి. మునుపటి ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్‌లో కూడా ఈయనే రిఫరీగా ఉన్నారు. గత భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌లో సైతం పైక్రాఫ్ట్ రిఫరీగా ఉన్నారు. ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు మ్యాచ్ అనంతరం పాకిస్థాన్ ప్లేయర్స్‌కి షేక్ హ్యాండ్ ఇవ్వకుండానే వెళ్లిపోయారు. ఈ వివాదంపై పైక్రాఫ్ట్‌ను బాధ్యుణ్ని చేస్తూ.. ఐసీసీకి రెండు ఫిర్యాదు లేఖలు పంపింది. మొదటి మెయిల్‌లో అతణ్ని రిఫరీగా టోర్నీ నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది. రెండో లేఖలో పైక్రాఫ్ట్‌ను కనీసం పాక్ మ్యాచ్‌లకైనా దూరం పెట్టాలని అభ్యర్థించింది. అయితే.. పీసీబీ డిమాండ్‌ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ తిరస్కరించింది. కాగా.. గత యూఏఈ-పాకిస్థాన్ మ్యాచ్‌లో సైతం పైక్రాఫ్ట్ రిఫరీగా ఉన్నారు. మ్యాచ్‌కు ముందు ఆండీ పైక్రాఫ్ట్ విషయంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) చాలా వివాదం సృష్టించింది. మ్యాచ్ ప్రారంభం అయినప్పటికీ జట్టు గ్రౌండ్‌లోకి రాలేదు.
చిన్నతనంలోనే ఋగ్వేదం, భగవద్గీత చదివిన ముస్లిం దర్శకుడు.. ఇప్పటికీ…
యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యే దర్శకుడు ఇంతియాజ్ అలీ. తన సినిమాల్లోని నటీనటుల మధ్య నిజమైన బాండింగ్ ఏర్పడాలనుకుంటాడు. వరుసగా హిట్లు కొట్టి, థియేటర్లలో ప్రేక్షకుల కళ్లలో నీళ్లు తెప్పించే చిత్రనిర్మాతగా పేరుగాంచాడు. అతని తండ్రి మన్సూర్ అలీ కాంట్రాక్టర్, ఇరిగేషన్‌లో పనిచేశాడు. అతని మామ టీవీ నటుడు, దర్శకుడు ఖలీద్ అహ్మద్. ఇంతియాజ్ జబ్ వి మెట్, లవ్ ఆజ్ కల్, రాక్‌స్టార్, హైవే, తమాషా, జబ్ హ్యారీ మెట్ సెజల్, అమర్ సింగ్ చంకీలా, లైలా మజ్ను వంటి అద్భుతమైన చిత్రాల సృష్టికర్త. జూన్ 16, 1971న జన్మించిన అతడు.. తన బాల్యాన్ని పాట్నాలో గడిపాడు. అక్కడే తన విద్యాభ్యాసం పూర్తి చేసుకున్నాడు. తాజాగా ఇంతియాజ్ అలీ రణవీర్ అలహాబాద్ పాడ్‌కాస్ట్‌లో తాను చిన్నప్పుడు జరిగిన పలు సంఘటనలను పంచుకున్నాడు. తాను చిన్నప్పుడే ఋగ్వేదం, భగవద్గీతను చదివానని వెల్లడించాడు. భగవద్గీత తన జీవితంలో అత్యంత ముఖ్యమైన పుస్తకం అని పేర్కొన్నాడు. ఆ పవిత్ర గ్రంథాన్ని ఇప్పటికీ తన సైడ్ టేబుల్‌పై ఉంచుకుంటానని వెల్లడించాడు. తాను ఆరో తరగతిలో ఉన్నప్పుడు ఆ పుస్తకాన్ని కొన్నానని తెచ్చుకున్నట్లు వివరించాడు. అప్పటి నుంచి ప్రతిరోజూ ఆ పుస్తకంలోని కొన్ని పేజీలు చదువినట్లు తెలిపాడు. అంతే కాదు.. ఇంతియాజ్ అలీ 1995లో “లైలా మజ్ను” నిర్మాత ప్రీతిని వివాహం చేసుకున్నాడు. ఆమె హిందువు. వారు వేర్వేరు మతాలకు చెందినవారైనప్పటికీ చాలా కాలం కలిసి జీవించారు. ఈ దంపతులకు ఇడా అలీ అనే కుమార్తె ఉంది. ఆమె రచయిత-దర్శకురాలు. అనేక షార్ట్ ఫిలిమ్‌లను నిర్మించింది. అయితే.. ఇంతియాజ్, ప్రీతి జంట 2012లో విడిపోయింది. కానీ.. ఇప్పటికీ కలుసుకుంటారని వార్తలు వస్తుంటాయి.
మోహన్ లాల్ కు దాదా సాహేబ్ ఫాల్కే అవార్డు
మలయాళ అగ్ర హీరో మోహన్ లాల్ కు అరుదైన గౌరవం దక్కింది. ఆయనకు దాదా సాహేబ్ ఫాల్కే అవార్డు లభించింది. కేంద్ర సమాచార, ప్రసార శాఖ ఈ విషయాన్ని శనివారం సాయంత్రం ఎక్స్ వేదికగా ప్రకటించింది. మోహన్ లాల్ సినీ రంగానికి చేసిన సేవలకు 2023 సంవత్సరానికి ఆయన దాదా సాహేబ్ ఫాల్కే అవార్డుకు ఎంపికయినట్టు వివరించింది. సినీ రంగంలో మోహన్ లాల్ నటుడుగా, నిర్మాతగా, డైరెక్టర్ గా ఎన్నో సేవలు అందించారని.. ఆయన సేవలు సినీ రంగ చరత్రిలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గవని ఎక్స్ లో రాసుకొచ్చింది. సెప్టెంబరు 23న జరిగే 71వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ కార్యక్రమంలో మోహన్‌లాల్ ఈ అవార్డును అందుకోనున్నారు. దీంతో మోహన్ లాల్ కు అభిమానులు, సినీ రంగ ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. మోహన్ లాల్ మలయాళంలో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. తెలుగులో కూడా ఆయనకు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. సౌత్ లో వైవిధ్యభరిత పాత్రలకు ఆయన పెట్టింది పేరు. ఆయన సేవలను గుర్తించిన కేంద్ర సమాచార ప్రసారశాఖ ఆయన్ను అవార్డుకు ఎంపిక చేసింది.