గణేష్ ఉత్సవాలకు ఆన్‌లైన్‌లోనే అనుమతులు.. ఇలా చేస్తే చాలు..!
గణేష్ ఉత్సవాలకు సమయం దగ్గర పడుతోంది.. అయితే, గణేష్ మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలంటే అనుమతులు తప్పనిసరి.. పోలీసులు, విద్యుత్‌శాఖ.. ఇలా పలు రకాల అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది.. ఇది, కాస్త ఇబ్బందితో కూడిన పని కూడా.. అయితే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఆన్‌లైన్‌లోనే గణేష్ ఉత్సవాలకు అనుమతి ఇస్తోంది.. దీని కోసం ప్రత్యేక వెబ్‌సైట్‌ను ప్రారంభించింది.. సింగిల్ విండో విధానంలో ఆన్‌లైన్‌లోనే అన్ని అనుమతులు పొందేలా ఏర్పాట్లు చేసింది.. వినాయక ఉత్సవాలకు అనుమతుల కోసం ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ప్రత్యేకంగా ganeshutsav.net అనే వెబ్‌సైట్‌ను ప్రారంభించింది.. మండపాల నిర్వాహకులు ఈ వెబ్‌సైట్ ద్వారా సింగిల్ విండో విధానంలో ఆన్‌లైన్‌లో అనుమతులు పొందవచ్చు. ఇక, ఈ అనుమతులు పొందడానికి ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని ప్రకటించారు పోలీసులు.. అయితే, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న తర్వాత, సంబంధిత పోలీస్ అధికారి మండప స్థలాన్ని తనిఖీ చేసి, నిబంధనల ప్రకారం ఉంటే QR కోడ్‌తో కూడిన నిరభ్యంతర పత్రాన్ని (NOC) జారీ చేస్తారు. బహిరంగ ప్రదేశాలలో ఏర్పాటు చేసే వినాయక మండపాలకు మాత్రమే ఈ అనుమతులు తప్పనిసరి. ఈ ఆన్‌లైన్ వ్యవస్థ ఉత్సవాలను సురక్షితంగా, పారదర్శకంగా నిర్వహించడానికి ఈ అనుమతుల ఉద్దేశం అంటున్నారు ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా..
కర్నూలులో విషాదం.. నీటికుంటలో పడి ఆరుగురు విద్యార్థులు మృతి.. సీఎం దిగ్భ్రాంతి..
కర్నూలు జిల్లాలో విషాద ఘటన జరిగింది. నీటికుంటలో పడి ఆరుగురు స్కూల్ విద్యార్థులు మృతి చెందారు. ఆస్పరి మండలం చిగిలిలో ఈ ఘటన విషాదాన్ని నింపింది.. స్కూల్ కి వెళ్లిన విద్యార్థులు స్కూల్ వదిలిన తరువాత సమీపంలో నీటి కుంటకు ఆడుకునేందుకు వెళ్లారు.. నీటికుంటలో ఆడుకుంటూ జారిపడి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు. మృతులు శశికుమార్, కిన్నెరసాయి, సాయి కిరణ్, భీమ, వీరేంద్ర, మహబూబ్ గా గుర్తించారు. మృతదేహాలను వెలికి తీసి గ్రామానికి తరలించారు. ఒకేసారి ఆరుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడంతో వారి తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అయితే, నీటికుంటలో పడి ఆరుగురు చిన్నారుల మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.. కర్నూలు జిల్లా, ఆస్పరి మండలం, చిగిలిలో ఆరుగురు చిన్నారుల మృతి చెందడంపై స్పందించిన సీఎం.. ఐదవ తరగతి చదువుతున్న శశికుమార్, కిన్నెర సాయి, సాయి కిరణ్, భీమా, వీరేంద్ర, మహబూబ్ అనే ఆరుగురు విద్యార్థులు ఆడుకుంటూ నీటికుంటలో పడి మరణించడంపై విచారం వ్యక్తం చేశారు. ఎంతో భవిష్యత్ ఉన్న చిన్నారుల మృతి వారి కుటుంబాలకు తీరని కడుపుకోతను మిగిల్చిందన్నారు. ఈ ఘటన అత్యంత దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.. ఆదుకుంటామని భరోసా ఇచ్చారు సీఎం నారా చంద్రబాబు నాయుడు..
గండికోటలో బాలిక హత్య కేసులో కొత్త ట్విస్ట్..
కడప జిల్లా గండికోటలో జరిగిన మైనర్ బాలిక హత్య కేసులో కొత్త ట్విస్ట్ వచ్చి చేరింది.. లైవ్ డిటెక్టర్ పరీక్ష కు సిద్ధం కావాలని వైష్ణవి కుటుంబ సభ్యులకు పోలీసులు నోటీసు జారీ చేశారు.. దారుణ హత్యకు గురైన మైనర్ బాలికకు అన్న వరుస అయ్యే కొండయ్య, సురేంద్ర, బాలిక ప్రియుడు లోకేష్ కు నోటీసులు ఇచ్చారు పోలీసులు.. ఈనెల 26వ తేదీన జమ్మలమడుగు కోర్టుకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.. అయితే, వీరికి హైదరాబాద్‌లో లైవ్ డిటెక్టర్ పరీక్షలు నిర్వహించనున్నారు పోలీసులు.
శ్రీశైలం ఎమ్మెల్యే తీరుపై సీఎం సీరియస్.. కేసు నమోదుకు ఆదేశాలు..
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి తీరుపై సీరియస్‌గా స్పందించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. అటవీశాఖ సిబ్బందితో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి వివాదంపై ఆరా తీసిన సీఎం.. అధికారులతో మాట్లాడి ఘటనపై వివరాలు తెలుసుకున్నారు.. ఉద్యోగులతో ఘర్షణ వ్యవహారంలో ఎమ్మెల్యే తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. వివాదాలకు ఆస్కారం ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.. అయితే, తప్పు ఎవరిదైనా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని ఆదేశాలు జారీ చేశారు సీఎం చంద్రబాబు.. ఇక, సీఎం ఆదేశాలతో ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. మరోవైపు, మొత్తం ఘటనపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు నాయుడు..
కాళేశ్వరం కూలలేదు.. సీఎం రేవంత్ రెడ్డి మైండ్ దొబ్బింది
రంగనాయక సాగర్ ప్రాజెక్టును సందర్శించిన మాజీ మంత్రి హరీష్ రావు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. సీఎం రేవంత్ మ్యూసీ నదికి గోదావరి నీళ్లు తీసుకువెళ్తామన్న వ్యాఖ్యలపై హరీష్ రావు ప్రశ్నించారు. “మరి నీళ్లు ఎక్కడి నుంచి తీసుకువెళ్తారో ముందుగా సమాధానం చెప్పాలి. హైదరాబాద్‌కు కావాల్సింది కాళేశ్వరం జలాలే” అని అన్నారు. కాళేశ్వరం కూలడం కాదు, సీఎం రేవంత్ రెడ్డి మైండ్ దొబ్బింది అంటూ హరీష్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి తుమ్మల కౌంటర్
తెలంగాణలో యూరియా కొరతపై కేటీఆర్ విమర్శలకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కౌంటర్ ఇచ్చారు. ఈ వారంలోనే రాష్ట్రానికి అదనంగా 50 వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేయాలని కేంద్ర ఎరువుల మంత్రిత్వ శాఖను కోరినట్లు మంత్రి తెలిపారు. తెలంగాణ రైతాంగ అవసరాలను దృష్టిలో ఉంచుకుని వెంటనే సరఫరా చేయాలని విజ్ఞప్తి చేసినట్టు చెప్పారు. పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ ఎంపీలు చేపట్టిన ఆందోళన ఫలితంగా ఈ చర్యలు ప్రారంభమయ్యాయని తుమ్మల వ్యాఖ్యానించారు. కోరమాండల్ ఇంటర్నేషనల్‌కు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసి, మూడు షిప్‌మెంట్లలో యూరియా సరఫరా చేయనున్నట్టు వెల్లడించారు.
ఆన్‌లైన్ గేమింగ్ కొత్త బిల్లు.. ఈ-స్పోర్ట్స్‌కు గ్రీన్ సిగ్నల్..కానీ ..!
ఆన్‌లైన్ గేమింగ్‌పై నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త బిల్లును తీసుకొచ్చింది. దీనికి పేరు ‘ఆన్‌లైన్ గేమింగ్ అభివృద్ధి, నియంత్రణ బిల్లు’. ఈ బిల్లు ఇప్పటికే లోక్‌సభలో ఆమోదం పొందింది. దీని ప్రధాన ఉద్దేశ్యం ఆన్‌లైన్ సోషల్ గేమ్స్, ఈ-స్పోర్ట్స్‌ను ప్రోత్సహించడం, అలాగే ఆన్‌లైన్ గేమింగ్‌పై నియంత్రణ తీసుకురావడం. తాజాగా ప్రవేశపెట్టిన ఈ బిల్లులో ఆన్‌లైన్ మనీ గేమ్స్ ఆడే వారికి శిక్ష ఉండదు. కానీ, వాటిని అందించే సర్వీస్ ప్రొవైడర్లు, ప్రకటనలు ఇచ్చేవారు, ప్రచారం చేసేవారు, ఆర్థిక సహాయం అందించే వారు మాత్రం కఠిన శిక్షలు ఎదుర్కోవలసి ఉంటుంది. బిల్లుతో పాటు ప్రభుత్వం తెలిపిన దానిలో, ఆన్‌లైన్ మనీ గేమ్స్ నిర్వహణ, ప్రకటనలు, ఆర్థిక లావాదేవీలపై పూర్తిగా నిషేధం అమలులోకి వస్తుందని స్పష్టం చేసింది. మరోవైపు, ఇప్పటి వరకు చట్టబద్ధ మద్దతు లేని ఈ-స్పోర్ట్స్‌కు ఇప్పుడు గుర్తింపు లభించనుంది. యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఈ-స్పోర్ట్స్‌ను దేశంలో ఒక పోటీ క్రీడగా అభివృద్ధి చేసే దిశగా ఒక ప్రత్యేక చట్రం రూపొందించనుంది. అలాగే ప్రభుత్వం ఆన్‌లైన్ సోషల్ గేమ్స్‌ను ప్రోత్సహించనుంది. సర్కార్ వర్గాల ప్రకారం, ఆన్‌లైన్ మనీ గేమ్స్ సమాజానికి పెద్ద ముప్పుగా మారాయి. వీటి వలన మోసాలు, ఆర్థిక నష్టాలు, కుటుంబాల పతనం మాత్రమే కాకుండా ఆత్మహత్యలు, హింసాత్మక ఘటనలు కూడా పెరుగుతున్నాయి. అందువల్ల, ఇలాంటి గేమ్స్‌పై నిషేధం ద్వారా ప్రజల ప్రాణాలు, ఆర్థిక పరిస్థితులు కాపాడాలని కేంద్రం భావిస్తోంది.
విజయవంతమైన అగ్ని 5.. ఇక శత్రు దేశాలకు వణుకే..
భారతదేశం బుధవారం అగ్ని-V ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. ఈ బాలిస్టిక్ క్షిపణి పరిధి 5500 కి.మీ. వరకు ఉంది. దీంతో భారత్ ఇప్పుడు చైనా లేదా పాకిస్థాన్‌లోని ఏ ప్రాంతంపైనైనా దాడి చేయగలదు. ఈ క్షిపణితో కేవలం ఆసియాలో మాత్రమే కాకుండా, యూరప్, ఆఫ్రికాలపై కూడా దాడి చేయవచ్చు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ క్షిపణికి అణు బాంబులను మోసుకెళ్లగల సామర్థ్యం ఉంది. దీనిని దాదాపు స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు. ఒడిశాలోని చాందీపూర్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) నుంచి ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణి (ఐఆర్‌బిఎం) ‘అగ్ని-5’ ను విజయవంతంగా పరీక్షించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.
బీభత్సానికి నిధుల సేకరణ.. జైష్ ఏ మొహమ్మద్ ఉగ్రసంస్థ కొత్త ప్లాన్
భారత్ నిర్వహించిన ఆపరేషన్ సింధూర్‌తో పాకిస్థాన్‌లోని ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మొహమ్మద్ (జెఎం) కోరలు తీసిన పాములా తయారైంది. ఇప్పుడు ఈ ఉగ్రవాద సంస్థ క్రమక్రమంగా తిరిగి బలం పుంజుకొని బీభత్సాన్ని సృష్టించడానికి కొత్త ప్లాన్ వేసింది. నిఘా వర్గాల సమాచారం ప్రకారం.. ఈ ఉగ్రసంస్థ రహస్యంగా నిధుల సేకరణ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసింది. పాకిస్థాన్ అంతటా 3.91 బిలియన్ల PKRలను సేకరించడం ద్వారా 313 కొత్త మర్కజ్‌లను (శిక్షణా శిబిరాలు, సురక్షిత ప్రాంతాలు) ఏర్పాటు చేయడం లక్ష్యంగా పని చేస్తోంది.
ఎన్టీఆర్ పెద్దమనసు.. అతన్ని ఆదుకుంటున్నాడా..?
జూనియర్ ఎన్టీఆర్ రీసెంట్ గా నటించిన వార్-2 బాక్సాఫీస్ వద్ద మిక్స్ డ్ టాక్ సంపాదించుకుంది. ముందు నుంచే ఫ్యాన్స్ ఈ సినిమా పట్ల పెద్దగా ఆసక్తి చూపించలేదు. పైగా ఎన్టీఆర్ సినిమా స్థాయిలో బజ్ అసలే లేదు. ఎన్టీఆర్ ను సెకండ్ హీరోగా చూపించారంటూ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే ఓపెనింగ్స్ పెద్దగా రాలేదు. దీంతో ఎన్టీఆర్ ను నమ్ముకుని రూ.80 కోట్ల దాకా పెట్టేసిన నాగవంశీ.. ఇందులో సగం కూడా వచ్చే పరిస్థితి లేదు. కేవలం జూనియర్ ఎన్టీఆర్ ను నమ్మి తెలుగులో ఈ స్థాయిలో పెట్టేశాడు నాగవంశీ.
పవన్ కల్యాణ్ పక్కన సాంగ్ చేయనని చెప్పేశా.. యాంకర్ ఉదయభాను కామెంట్స్
యాంకర్ ఉదయభాను ఈ మధ్య చాలా ట్రెండింగ్ లో ఉంటుంది. ఎప్పటికప్పుడు ఆమె చేస్తున్న కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఆమె నటిస్తున్న మూవీ బార్బరిక్ త్రిబాణధారి. ఆగస్టు 22న మూవీ వస్తున్న క్రమంలో వరుస ఇంటర్వ్యూలు ఇస్తోంది ఉదయభాను. తాజా ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేసింది. నేను యాంకర్ గా మారిన తర్వాత ఎన్నో ఆఫర్లు రిజెక్ట్ చేశా. అప్పట్లో కొన్ని సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లో ఆఫర్లు ఇచ్చారు. కానీ వద్దని చెప్పా. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో వచ్చిన అత్తారింటికి దారేది సినిమాలో పార్టీ సాంగ్ కోసం నన్ను అడిగారు అంటూ తెలిపింది ఉదయభాను. కానీ నేను నో చెప్పాను. ఆ సినిమాలో అంత పెద్ద స్టార్స్ మధ్య నేను నటించాలంటే ఎందుకో ఇబ్బందిగా అనిపించింది. అందుకే వద్దని చెప్పేశాను. చాలా సినిమాలకు అంతే. నాకు స్క్రిప్ట్ నచ్చకపోతే వెంటనే నో చెప్పేస్తా. అలా చాలా ఆఫర్లు మిస్ చేసుకున్నాను అంటూ చెప్పుకొచ్చింది. ఇక టాలీవుడ్ లో యాంకర్లు అందరూ సిండికేట్ అయిపోయారని.. తనకు వ్యతిరేకంగా ఉన్నారంటూ సంచలన కామెంట్లు చేసింది. త్వరలోనే టాలీవుడ్ లో తనను ఇబ్బంది పెట్టిన వారి గురించి బయట పెడుతానంటూ వార్నింగ్ ఇచ్చింది. ఉదయభాను ప్రస్తుతం యాంకర్ గా అవకాశాలు రాక బయట కనిపించట్లేదు.
100% లవ్ లో బుడ్డోడు.. ఇప్పుడు హీరోలా మారిపోయాడే..
చాలా మంది చైల్డ్ ఆర్టిస్టులగా చేసిన తర్వాత పెద్దయ్యాక ఇండస్ట్రీలోనే కీలక నటులుగా ఎదుగుతున్నారు. కొందరు హీరోలుగా కూడా మారుతున్నారు. తాజాగా అలాంటి నటుడి గురించే చర్చ జరుగుతోంది. నాగచైతన్య, తమన్నా కాంబోలో సుకుమార్ తీసిన 100% లవ్ అందరికీ గుర్తుండిపోతుంది. ఆ సినిమాలో క్యూట్ గా ఓ బుడ్డోడు ఉంటాడు. తమన్నాకు ఫుల్ సపోర్టుగా నిలుస్తుంటాడు. ఆ బుడ్డోడు సత్యంరాజేశ్ ను ఆటపట్టించే సీన్ కడుపుబ్బా నవ్విస్తుంది. అతని పేరే నిఖిల్ అబ్బూరి. ఇతను చాలా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా చేసి మెప్పించాడు. ఇప్పుడు పెద్దోడు అయిపోయాడు. నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. 90’s వెబ్ సిరీస్ ఫేమ్ మౌళి టాక్స్ మెయిన్ లీడ్ లో నటిస్తున్న లిటిల్ హార్ట్స్ మూవీలో నిఖిల్ అబ్బూరి కీలక పాత్రలో నటించాడు.