రాజమండ్రి సెంట్రల్ జైలులో ఎంపీ మిథున్‌రెడ్డి సరెండర్
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుడిగా ఉన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ మిథున్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైల్లో సరెండర్ అయ్యారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన ఆరు రోజుల మధ్యంతర బెయిల్ గడువు పూర్తి కావడంతో సెంటర్ జైల్లో సరెండర్ అయ్యారు మిథున్ రెడ్డి.. ఏసీబీ కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ రోజు సాయంత్రం ఐదు గంటలలోపు రాజమండ్రి సెంట్రల్ జైల్లోకి వెళ్లి సరెండర్ అయ్యారు.. కాగా, సంచలనంగా మారిన ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఎంపీ మిథున్ రెడ్డి.. ఇప్పటికే 47 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్నారు. ఇక, ఏసీబీ ఇచ్చిన రిమాండ్ గడువు కూడా రేపటితో ముగియనున్నది. ఈ నేపథ్యంలో రేపు విజయవాడలోని ఏసీబీ కోర్టులో మిథున్‌రెడ్డిని హాజరుపర్చనున్నారు పోలీసులు.. దీని కోసం రేపు ఉదయం ఏడు గంటలకు రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి ఎంపీ మిధున్ రెడ్డిని పోలీస్ ఎస్కార్ట్ తో రోడ్డు మార్గం ద్వారా విజయవాడకు తీసుకెళ్లనున్నారు పోలీసులు.. కాగా, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్‌కు మద్దతు తెలిపింది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. అయితే సెప్టెంబర్ 9న జరిగిన ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేసుందుకు బెయిల్ ఇవ్వాలంటూ ఎంపీ మిథున్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేయగా.. ఏసీబీ కోర్టు ఐదు రోజులు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. గడువు ముగియడంతో ఈ రోజు సరెండర్ అయ్యారు మిథున్ రెడ్డి..
ఇదే మనకు మంచి అవకాశం.. ఏ మాత్రం జాప్యం తగదు..
ఆంధ్రప్రదేశ్‌లో బీసీల ఉనికిని వెలుగులోకి తెచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మాత్రమే అన్నారు వైసీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి.. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర బీసీ అనుబంధ విభాగాల సాధికార అధ్యక్షుల సమావేశం జరిగింది.. ఈ సమావేశానికి సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ, బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ యాదవ్, వర్కింగ్ ప్రెసిడెంట్ నౌడు వెంకటరమణ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి అంకంరెడ్డి నారాయణమూర్తి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఆలూరు సాంబశివారెడ్డి సహా బీసీ కులాల సాధికార అధ్యక్షులు హాజరయ్యారు.. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. బీసీల ఉనికిని వెలుగులోకి తెచ్చింది జగన్ మాత్రమే.. అన్ని కులాలను గుర్తించి ప్రత్యేకంగా కార్పోరేషన్లు సైతం ఏర్పాటు చేయించారని గుర్తుచేశారు. ఒక సమగ్ర విధానం ద్వారా బీసీలందరికీ అభివృద్ధి ఫలాలను అందించిన వ్యక్తి వైఎస్ జగన్ మాత్రమే అని కొనియాడారు సజ్జల రామకృష్ణారెడ్డి.. బీసీలందరినీ చైతన్య పరిచి మళ్లీ ఏకతాటి మీదకు తీసుకురావాలన్న ఆయన.. వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధిని అందరికీ వివరించాలని సూచించారు.. బీసీల విషయంలో తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న ఫేక్ ప్రచారాలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు..
కొత్త కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్.. కీలక సూచనలు
కొత్తగా నియమితులైన 12 మంది కలెక్టర్లతో వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఈ సందర్భంగా కీలక సూచనలు చేశారు చంద్రబాబు.. సీఎం అంటే కామన్ మెన్ అని నేను చెబుతున్నా.. మీరు కూడా అలాగే పని చేయాలని సూచించారు.. ప్రతి పనికి దానికీ డబ్బులు లేవని చెప్పద్దు.. కేంద్రం నుంచి వచ్చే పథకాలు ఉపయోగించుకోవాలి.. అన్నింటికీ రూల్స్ అనొద్దన్నారు.. మానవీయ కోణంలో పని చేయండని సూచించారు చంద్రబాబు.. కలెక్టర్ గా పని చేయడం అంటే మీకు మంచి గుర్తింపు వస్తుందన్న ఆయన.. జిల్లా కలెక్టర్ల ఎంపికలో నాకున్న బెస్ట్ ఆప్షన్లలో మిమ్మల్ని ఎంపిక చేశానని వెల్లడించారు. నాలుగో సారి సీఎంగా ఉన్నా నా టీమ్ మీరే అన్నారు చంద్రబాబు.. పని చేసే వారిని ప్రోత్సహిస్తా.. లేకపోతే మిమ్మలిని కొనసాగించను స్పష్టం చేశారు.. ఇతర జిల్లాల కలెక్టర్లతో పోటీ పడండి. మీ నిర్ణయాలు క్రియేటివ్ గా.. ఇన్నోవేటివ్ గా ఉండాలి.. సోషల్ మీడియా.. మీడియాలో దుష్ప్రచారం పై ఫస్ట్ అవర్‌లోనే రియాక్ట్ కావాలని స్పష్టం చేశారు. ఇక, కలెక్టర్ అంటే అహంకారం, ఇగోలు వద్దు అని సూచించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
ఒకేసారి 12 జిల్లాలకు కొత్త కలెక్టర్లు
ఒకేసారి 12 జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. దీనిపై సుదీర్ఘ కసరత్తు చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. పాలనలో మార్పులు. మరింత చురుగ్గా పాలన కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు.. వచ్చే మూడేళ్ల పాటు మంచి టీమ్ ఉండాలనే ఆలోచనలో ఉన్న చంద్రబాబు. అందుకు అనుగుణంగా ఇప్పటకిఏ సీనియర్ అధికారులను బదిలీ చేశారు.. ఇప్పుడు.. 12 జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించారు.. 12 జిల్లాల కలెక్టర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్‌గా ప్రభాకర్‌రెడ్డి.. విజయనగరం కలెక్టర్‌గా రామసుందర్‌రెడ్డి, తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌గా కీర్తి చేకూరు.. గుంటూరు జిల్లా కలెక్టర్‌గా తమీమ్ అన్సారియా, పల్నాడు జిల్లా కలెక్టర్‌గా కృతిక శుక్లా, బాపట్ల జిల్లా కలెక్టర్‌గా వినోద్‌కుమార్, ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా రాజాబాబు, నెల్లూరు జిల్లా కలెక్టర్‌గా హిమాన్షు శుక్లా, అన్నమయ్య జిల్లా కలెక్టర్‌గా నిషాంత్‌కుమార్, కర్నూలు జిల్లా కలెక్టర్‌గా సిరి, అనంతపురం జిల్లా కలెక్టర్‌గా ఆనంద్, సత్యసాయి జిల్లా కలెక్టర్‌గా శ్యాంప్రసాద్‌ను నియమించింది ప్రభుత్వం.. ఇక, కొత్త కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. కీలక సూచనలు చేశారు..
కొత్త యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసిన వైఎస్ జగన్..!
గత ఎన్నికల్లో ఓటమి తర్వాత ప్రజా సమస్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటాలు చేస్తుంది. అన్నదాత పోరు, విద్యుత్ చార్జీలు, ఫీజు రియంబర్స్‌మెంట్ తదితర అంశాలపై ఆందోళనలు చేసింది. వైసీపీ చేపట్టిన నిరసన కార్యక్రమాలు సక్సెస్ అయ్యాయన్న టాక్ వచ్చింది. అయితే, ఆ కార్యక్రమాల్లో కేవలం వైసీపీ నేతలు మాత్రమే పాల్గొంటున్నారు. ఎక్కడా పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ కనబడలేదు. అయితే, మిర్చి, పోగాకు, మామిడి రైతుల సమస్యలు తెలుసుకోడానికి పలు ప్రాంతాల్లో పర్యటించారు జగన్. అలాగే, పార్టీ నేతల్ని పరమార్శించడానికి కూడా వెళ్లారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై 15 నెలలు దాటడంతో… కొత్త యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకున్నారు జగన్. ఇప్పటి వరకు దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా వైఎస్ జగన్ హయాంలో 17 మెడికల్ కాలేజీలు ప్రారంభమయ్యాయి. అయితే… అందులో పది మెడికల్ కాలేజీలను పీపీపీ మోడ్‌కి ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధం కావడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు జగన్. దీనిపై ప్రజా క్షేత్రంలోనే తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే నిరసన కార్యక్రమాల్లో కొత్త ఒరవడి తీసుకువచ్చారు జగన్. 24 గంటలు, 48 గంటలు, 96 గంటల దీక్షల చేపట్టారు. తాజాగా, సూపర్ సిక్స్ వైఫల్యాలను ఎండగట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. పేద విద్యార్ధులకు వైద్య విద్యను ఉచితంగా అందించాలన్న తన డ్రీమ్ ప్రాజెక్టుకు తూట్లు పొడవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు జగన్. పది మెడికల్ కాలేజీలను పీపీపీ మోడ్‌లో పెట్టడాన్ని తప్పుబడుతున్నారు. టెండర్ల ద్వారా వాటిని ఎవరైనా చేజిక్కించుకున్నా… తాము అధికారంలోకి రాగానే వాటిని రద్దు చేస్తామన్నారు. మరోవైపు… ఈ అంశంలో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఆందోళన చేస్తామంటున్నారు వైసీపీ నేతలు. ఈ పోరాటంలో తమతో కలిసి వచ్చే పార్టీలు, ప్రజా సంఘాలను కలుపుకుని పోతామంటున్నారు.
పని చేస్తున్న సంస్థకే కన్నం.. ఏకంగా రూ.కోటిన్నర డైమండ్స్‌తో పరార్..
పని చేస్తున్న సంస్థకే స్నేహితుడితో కలిసి కన్నం వేసి, డైమండ్స్ ఎత్తుకెళ్లిన ఇద్దరిని సైఫాబాద్, సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ బషీర్ బాగ్ లోని సెంట్రల్ జోన్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీపీ శిల్పవల్లి వివరాలను వెల్లడించారు. ముంబైకు చెందిన బంగారం వ్యాపారి విపుల్ షా తరుచూ హైదరాబాద్‌కు డైమండ్స్ , గోల్డ్ అర్నమెంట్స్ కొరియర్ లో పంపించేవాడు. అలాగే వారి ఎగ్జిక్యూటివ్స్ వాటిని తీసుకొని, హైదరాబాద్‌లో పలు బంగారు ఆభరణాల షాప్స్‌కు తిరుగుతూ… వాటిని అమ్మడం, ఆర్డర్స్ తీసుకునేవారు. ఇటీవల ముంబై నుంచి విపుల్ పార్సల్‌ను పంపించారు. వాటిని మార్కెటింగ్ చేయడానికి.. చడవ రోనక్ (24) ఎగ్జిక్యూటివ్ ముంబై నుంచి నగరానికి వచ్చాడు. మార్కెటింగ్ చేసిన తరువాత, డైమండ్స్, గోల్డ్ అర్నమెంట్స్‌ను బషీర్‌బాగ్‌లోని విజయ శంకర్ లాల్ జ్యూవెలర్స్‌లో భద్రపరిచారు. మరుసటి రోజు బ్యాగ్ చూడగా అందులో ఆభరణాలు కనిపించలేదు.
మీ ఏరియాలో మ్యాన్‌హోల్ తెరిచి ఉందా..? ఈ నంబర్‌కి కాల్ చేయండి..
పాతబస్తీ యాకుత్‌పురా మౌలాకా చిల్లా ప్రాంతంలో మ్యాన్‌హోల్ లో పడిపోయిన చిన్నారి ఘటనపై హైడ్రా దర్యాప్తు చేసింది. బుధవారం మ్యాన్ హోల్ తెరిచినప్పటి నుంచి గురువారం ఉదయం వరకు సీసీ ఫుటేజ్‌లను పరిశీలించింది. అసలు ఏం జరిగిదంటే.. స్థానిక కార్పొరేటర్ ఆదేశాలతో మ్యాన్ హోల్ ఓపెన్ చేసి హైడ్రా మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్ మట్టి తొలగించారు. జలమండలికి చెందిన జెట్టింగ్ మెషిన్ తో సిల్ట్ తొలగించారు. సిల్ట్ తొలగించిన అనంతరం మూత వేయకుండానే మరో మ్యాన్ హోల్ క్లీన్ చేయడానికి సిబ్బంది వెళ్ళింది. నిన్న సాయంత్రం వచ్చిన మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ మ్యాన్ హోల్ మూత క్లోజ్ చేయడానికి ప్రయత్నించగా.. మరింత సిల్ట్ తీయాల్సి ఉందని గమనించారు.. మ్యాన్‌హోల్ తెరిచే ఉండాలని స్థానికులు అడ్డుకున్నారని హైడ్రా తెలిపింది. దీంతో ఈ ఘటన జరిగినట్లు చెబుతున్నారు. నగరంలో మ్యాన్ హోల్స్‌పై రేపు జీహెచ్ఎంసీ, వాటర్ బోర్డు అధికారులతో హైడ్రా మీటింగ్ ఏర్పాటు చేయనుంది. ఎక్కడైనా మ్యాన్ హోల్ మూత తెరిచి ఉంటే వెంటనే 9000113667 నంబరుకు సమాచారం అందించాని హైడ్రా ప్రజలను కోరింది. మ్యాన్ హోల్ లో సిల్ట్ క్లియర్ చేసిన అనంతరం వెంటనే మూత వేయాలని సిబ్బందికి హైడ్రా కమీషనర్ ఆదేశాలు జారీ చేశారు.
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. 10 మంది మావోయిస్టులు హతం..
ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి కాల్పుల మోతమోగింది. గరియాబంద్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో సీనియర్ నక్సలైట్‌తో సహా 10 మంది నక్సల్స్ హతమయ్యారు. మరణించిన వారిలో సెంట్రల్ కమిటీ మెంబర్ మనోజ్ కూడా ఉన్నారు. ఇతడిని మోడెం బాలకృష్ణ అని కూడా పిలుస్తారు. ఇతడిపై రూ. 1 కోటి బహుమతి ఉంది. మెయిన్‌పూర్ అటవీ ప్రాంతంలో నక్సల్స్ ఉనికిపై నిఘా వర్గాల సమాచారం మేరకు, E-30, STF, కోబ్రా బలగాలు జాయింట్ ఆపరేషన్ ప్రారంభించాయి. గురువారం ఉదయం నుంచి భద్రతా బలగాలు, నక్సల్స్ మధ్య కాల్పులు జరుగుతున్నాయి. కాల్పుల్లో పలువురు సీనియర్ నక్సల్స్ మరణించి ఉండొచ్చని ప్రాథమిక నివేదికలు చెబుతున్నాయి. ఈ ఆపరేషన్‌లో కోబ్రా బలగాలు, రాష్ట్ర పోలీసులు పాల్గొన్నారు. ఆపరేషన్ పూర్తి అయిన తర్వాత, గ్రౌండ్ వెరిఫికేషన్ ముగిసిన తర్వాత పూర్తి సమాచారం రానుంది.
రేపు ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ ప్రమాణస్వీకారం..
ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన సీపీ రాధాకృష్ణన్ రేపు ప్రమాణస్వీకారం చేయనున్నారు. శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేత ప్రమాణస్వీకారం చేయించనున్నట్లు అధికారులు తెలిపారు. రాష్టప్రతి భవన్‌లో ఉదయం 10 గంటలకు జరగనున్న కార్యక్రమంలో రాధాకృష్ణన్ తదుపరి ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేస్తారని వారు తెలిపారు. మంగళవారం జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో 68 ఏళ్ల రాధాకృష్ణన్ 152 ఓట్ల తేడాతో విజయం సాధించారు. జూలై 21న ఆరోగ్య కారణాలు చెబుతూ, జగ్‌దీప్ ధంఖర్ ఆకస్మికంగా రాజీనామా చేయడంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి. మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్న రాధాకృష్ణన్‌ను బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే తమ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టి, గెలిపించింది.
పెళ్లయిన 4 నెలలకే.. వరకట్న దాహానికి నవ వధువు బలి..
వరకట్న దాహానికి మరో మహిళ బలైంది. పెళ్లయినప్పటి నుంచి అత్తామామల వేధింపులతో ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మహారాష్ట్ర లోని జల్గావ్ లో జరిగింది. 23 ఏళ్ల మయూరి గౌరవ్ తోసర్ ఆత్మహత్య చేసుకుంది. వివాహం జరిగిన నాలుగు నెలల తర్వాత, ఆమె పుట్టినరోజు తర్వాతి రోజు బలవన్మరణానికి పాల్పడింది. మయూరిని గత కొన్ని రోజులుగా అత్తమామలు కట్నం కోసం మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారు. పెళ్లయినప్పటి నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఆమె తల్లిదండ్రులు, బంధువులు ఆరోపించారు. వివాహం జరిగిన నాలుగు నెలల తర్వాత మధ్యవర్తిత్వ ప్రయత్నాలు జరిగాయని, అయినా కూడా వేధింపులు ఆగలేదని ఆమె తల్లిదండ్రులు చెప్పారు. అత్తమామలపై వెంటనే చర్యలు తీసుకోవాలని బాధితురాలి కుటుంబం పోలీసులను డిమాండ్ చేసింది.
GST ఎఫెక్ట్.. రూ.95,500 వరకు తగ్గిన Honda కార్ల ధరలు..!
ప్రముఖ ఆటోమొబైల్ తయారీదారు హోండా (Honda Cars India Ltd. (HCIL)) GST రిఫార్మ్స్ 2025 ద్వారా వచ్చిన పూర్తిగా లాభాలను తమ కస్టమర్లకు అందజేయనున్నట్లు ప్రకటించింది. ఈ మార్పులు సెప్టెంబర్ 22 నుండి అమలులోకి రానున్నాయి. వినియోగదారులు ఇప్పుడు తమ ప్రియమైన హోండా కార్లు బుక్ చేసుకుంటే, GST తగ్గింపు ధరలతో పాటు ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న ఆకర్షణీయమైన ఫెస్టివ్ ఆఫర్లను పొందవచ్చు. ఈ కార్లను నవరాత్రి ప్రారంభం నుండి డెలివరీ పొందవచ్చు. ఇందుకు సంబంధించి కంపెనీ మార్కెటింగ్ విభాగం వైస్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ.. కొత్తగా ప్రకటించిన GST రిఫార్మ్స్ 2025 ఆటో ఇండస్ట్రీకి వచ్చిన మంచి నిర్ణయం అని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కొత్త ధర మార్పులు కస్టమర్లకు వాహనాలను మరింత సులభంగా అందించడంతో పాటు, ఫెస్టివ్ సీజన్ డిమాండ్‌ను పెంపొందిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. వినియోగదారులు నవరాత్రి సమయానికే డెలివరీ పొందేందుకు ఇప్పుడు నుంచే బుకింగ్ చేసుకొనేలా ప్రోత్సహిస్తున్నట్లు ఆయన అన్నారు.
భారత్‌తో మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్‌కు భారీ షాక్!
ఆసియా కప్ 2025లో భాగంగా ఒమన్, భారత్‌తో మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్‌కు భారీ షాక్ తగిలింది. పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా ఫిట్‌నెస్ సమస్యలతో బాధపడుతున్నాడు. అతడు మెడ నొప్పితో బాధపడుతున్నట్లు పాకిస్థాన్ మీడియా జియో న్యూస్ పేర్కొంది. బుధవారం జరిగిన పాక్ ప్రాక్టీస్ సెషన్‌కు అఘా దూరంగా ఉన్నాడు. మిగతా ప్లేయర్స్ మాత్రం సాధనను కొనసాగించారు. పాక్ జట్టుతో కలిసి దుబాయ్‌లోని ఐసీసీ క్రికెట్ అకాడమీకి వచ్చినా.. మెడకు బ్యాండేజ్ వేసుకొని కనిపించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సల్మాన్ అఘా గాయంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అధికారి ఒకరు స్పందించారు. ‘సల్మాన్ అఘా కాస్త అసౌకర్యంగా కనిపించాడు. ముందస్తు చర్యల్లో భాగంగానే ప్రాక్టీస్‌కు దూరంగా ఉన్నాడు. అతడికి ఎలాంటి ఫిట్‌నెస్ సమస్యలు లేవు. అఘా మెడ నొప్పి చిన్నదే. ముందస్తు జాగ్రత్తలో భాగంగానే విశ్రాంతి తీసుకున్నాడు. ఒమన్‌తో జరిగే మ్యాచ్‌లో బరిలోకి దిగుతాడు. భారత్‌తో మ్యాచ్‌కు కూడా అందుబాటులో ఉంటాడు. అఘా అన్ని మ్యాచ్‌లు ఆడుతాడు’ అని చెప్పారు. 31 ఏళ్ల అఘా రేపు పూర్తి స్థాయి శిక్షణను తిరిగి ప్రారంభించే అవకాశం ఉంది. ఒకవేళ మెడ నొప్పి ఎక్కువగా ఉంటే ఒమన్‌తో మ్యాచ్‌కు విశ్రాంతి తీసుకుని.. భారత్‌తో మ్యాచ్‌కు అందుబాటులో ఉండే అవకాశాలు కూడా లేకపోలేదు.
టీమిండియా హెడ్ కోచ్ కావాలనుంది.. మనసులో మాట బయటపెట్టిన మాజీ దిగ్గజం!
కొన్నిసార్లు గట్టిగా మాట్లాడేవారి కంటే.. నిశ్శబ్దంగా పోరాడే వారే చరిత్రను సృష్టిస్తారు. అలాంటి వ్యక్తే ‘నయా వాల్’ చతేశ్వర్ పుజారా. ఏనాడూ స్లెడ్జింగ్‌లో పాల్గొనలేదు, సోషల్ మీడియాలో ఏనాడూ అతడికి వ్యతిరేకంగా వార్తలు రాలేదు. ప్రశాంతతకు మారుపేరైన పుజారా.. జట్టుకు అవసరమైన ప్రతిసారీ బ్యాట్‌తో అండగా నిలబడ్డాడు. రాజ్‌కోట్ వీధుల నుంచి మెల్‌బోర్న్, జోహన్నెస్‌బర్గ్ వరకు ప్రతి మైదానంలో రన్స్ చేశాడు. ఆసీస్ పర్యటనలో శరీరానికి బంతులు తగిలినా.. జట్టు కోసం క్రీజులో నిలబడ్డాడు. టీమిండియా కోసం ఎంతో చేసిన అతడు కొత్త బాధ్యతను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పాడు. ఇటీవలే అన్ని ఫార్మాట్‌ల క్రికెట్ నుంచి రిటైర్ అయిన చతేశ్వర్ పుజారా మరలా జట్టులో చేరాలని కోరుకుంటున్నాడు. అయితే ఈసారి భిన్న పాత్రను పోషించాలనుకుంటున్నాడు. ‘న్యూస్ 18’తో మాట్లాడుతూ.. భవిష్యత్తులో టీమిండియా కోచింగ్ బాధ్యతను స్వీకరించడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో తన అనుభవాన్ని యువ ఆటగాళ్లతో పంచుకోవడానికి రెడీగా ఉన్నానని పుజారా తెలిపాడు. తాను జట్టు బాధ్యతను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానని బీసీసీఐకి పుజారా సూటిగా చెప్పేశాడు. ప్రస్తుతం గౌతమ్ గంభీర్ పదవిలో ఉన్నాడు. గంభీర్ అనంతరం బీసీసీఐ కొత్త కోచ్ కోసం వేట మొదలెడుతుంది. అప్పుడు బోర్డు పుజారాపై ఆసక్తి చూపుతుందో లేదో.
రూ.4 కోట్ల కిరీటం బహూకరించిన ఇళయరాజా
ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా మరోసారి తన భక్తిని చాటుకున్నారు. కర్ణాటకలోని కొల్లూరు మూకాంబిక అమ్మవారి ఆలయాన్ని నేడు ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రూ.4 కోట్ల విలువైన కిరీటాన్ని అమ్మవారికి బహూకరించారు. ఈ కిరీటంలో రకరకాల వజ్రాలు పొదిగి ఉన్నాయి. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఇళయరాజా. ఆయనకు అమ్మవారి తీర్థ, ప్రసాదాలు అందజేసి.. ఆశీర్వచనం అందించారు పూజారులు. ఆయన వెంట కొడుకు కార్తీక్ తో పాటు మనవడు ఉన్నారు. అమ్మవారికి తన మొక్కు ఎప్పటి నుంచో ఉండిపోయిందని.. ఆమె తనకు ఇచ్చిన దాంట్లో కొంత తిరిగి ఇచ్చినట్టు తెలిపాడు. ఇళయరాజా సంగీత ప్రపంచాన్ని శాసించిన మ్యూజిక్ డైరెక్టర్. ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్న ఆయన.. సంగీతమే శ్వాసగా బతికారు. ఇప్పటికీ ఆయన పాటలు సోషల్ మీడియాను ఊపేస్తూనే ఉంటాయి. తెలుగులో రీసెంట్ గానే ఓ సినిమాకు పనిచేశారు. ఇప్పుడు ఆయన వరుసగా మూడు సినిమాలు చేస్తున్నారు.
రాజాసాబ్ లో సర్ ప్రైజ్ ఇవ్వబోతున్న ప్రభాస్..
ప్రభాస్ హీరోగా వస్తున్న ది రాజాసాబ్ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఆ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. జనవరి 9న ఈ సినిమా రాబోతోంది. మారుతి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను హర్రర్ కామెడీ కోణంలో తీసుకొస్తున్నారు. ఇప్పటికే వచ్చిన టీజర్ భారీ రెస్పాన్స్ దక్కించుకుంది. అయితే ఈ సినిమాలో పెద్ద యాక్షన్ సీన్లు, ఒళ్లు హూనం అయిపోయే స్టంట్లు ఏమీ లేవు కాబట్టి.. ప్రభాస్ ఆడుతూ పాడుతూ షూటింగ్ చేస్తున్నాడంట. ఈ క్రమంలోనే ఈ మూవీలో డ్యాన్స్ చేయడానికి డిసైడ్ అయ్యాడని తెలుస్తోంది. అందుకే మూవీ టైటిల్ సాంగ్ కోసం కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ ను తీసుకున్నారంట. ప్రస్తుతం సాంగ్ షూటింగ్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఆ సాంగ్ లో బాగానే స్టెప్పులు వేస్తున్నాడంట ప్రభాస్. గతంలో ఏ సినిమాలో లేనంతగా ఈ సాంగ్ లో ఫాస్ట్ బీట్ స్టెప్పులు వేయబోతున్నాడంట ప్రభాస్. ఆ విషయాన్ని సర్ ప్రైజ్ గా ఉంచి మూవీలో చూపించి ఫ్యాన్స్ ను సర్ ప్రైజ్ చేయాలని చూస్తున్నారంట. ప్రభాస్ అదిరిపోయే డ్యాన్స్ చేస్తే చూడాలని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. మొత్తానికి అది కాస్త ది రాజాసాబ్ తో తీరిపోనుందన్నమాట. ఈ మూవీలో ప్రభాస్ డ్యూయల్ రోల్స్ చేస్తున్న విషయం తెలిసిందే.