సీఎం చంద్రబాబుతో బీపీసీఎల్, విన్ ఫాస్ట్ ప్రతినిధుల భేటీ.. రాష్ట్రంలో రూ.60 వేల కోట్ల పెట్టుబడులు..!
ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు రాబట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. వివిధ కంపెనీలతో సమావేశాలు నిర్వహిస్తూ.. రాష్ట్రంలో పెట్టుబడుల ఆహ్వానిస్తున్నారు.. ఇక, ఈరోజు సీఎం చంద్రబాబుతో బీపీసీఎల్, విన్ ఫాస్ట్ కంపెనీ ప్రతినిధులు వేర్వేరుగా భేటీ అయ్యారు.. రాష్ట్రంలో పెట్టుబడులపై చర్చించారు.. ఏపీలో ఆయిల్ రిఫైనరీ, పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటుపై బీపీసీఎల్ సీఎండీ కృష్ణకుమార్, సంస్థ ప్రతినిధులతో ఏపీ సీఎం చర్చలు జరిపారు.. ఆయిల్ రిఫైనరి కార్యరూపం దాల్చితే దాదాపు రూ.60 వేల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది.. తన ఢిల్లీ పర్యటనలో కేంద్ర పెద్దలతో బీపీసీఎల్ పెట్టుబడులపై చర్చించారు సీఎం చంద్రబాబు. ఆయిల్ రిఫైనరీ, పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటుకు 4, 5 వేల ఎకరాలు అవసరం ఉంటుందని సీఎంకు వివరించారు కంపెనీ ప్రతినిధులు.. అవసరమైన భూములు కేటాయిస్తామని.. 90 రోజుల్లో ప్రాజెక్టు ఏర్పాటుకు అవసరమైన పూర్తి ప్రణాళికతో రావాలని కంపెనీ ప్రతినిధులను కోరారు చంద్రబాబు. ఇక, అక్టోబర్ నాటికి ఫీజిబిలిటీ రిపోర్టుతో వస్తామని సీఎంతో చెప్పారు బీపీసీఎల్ ప్రతినిధులు. మరోవైపు.. విన్ ఫాస్ట్ ప్రతినిధులతో చంద్రబాబు సమావేశం జరిగింది.. విన్ ఫాస్ట్.. ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో వియత్నాంలో ప్రముఖ కంపెనీగా ఉంది.. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ఆ కంపెనీ ప్రతినిధులకు వివరించారు సీఎం చంద్రబాబు.. ఈవీ, బ్యాటరీ తయారీ ప్లాంట్ ను ఏపీలో నెలకొల్పాలని కోరారు.. ప్లాంట్ కు అవసరమైన భూమి, ఇతర మౌళిక సదుపాయాల కల్పనకు తాము సిద్ధంగా ఉన్నామన్న ఈ సందర్భంగా విప్ ఫాస్ట్ ప్రతినిధులకు హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
స్టేడియాలను ఆధునీకరిస్తాం.. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహిస్తాం..
రాష్ట్రంలోని స్టేడియాలను ఆధునీకరిస్తాం.. గ్రామీణ పేద క్రీడాకారులను ప్రోత్సహిస్తాం అన్నారు మంత్రి రాంప్రసాద్‌రెడ్డి.. కడప జిల్లా పులివెందులలో పర్యటించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేకపోయినా హాకీ ఆంధ్రప్రదేశ్ పోటీ నిర్వహించడం సంతోషించదగ్గ విషయం అన్నారు. ప్రభుత్వంపై ఆధారపడకుండా ఈ పోటీలను నిర్వహిస్తున్న హాకీ ఆంధ్రప్రదేశ్ అధికారులను అభినందించారు.. ఇక, రాష్ట్రంలో ఉన్న స్టేడియాలను ఆధునికరిస్తాం.. మంచి శిక్షణ ఇచ్చేలా తీర్చిదిద్దుతాం అని ప్రకటించారు. గత ప్రభుత్వంలో క్రీడా శాఖ ఒకటి ఉంది అన్నది కూడా ప్రజలు మర్చిపోయారని ఎద్దేవా చేసిన ఆయన.. ఐదేళ్ల చివరి పాలన కాలంలో ఆడుదాం ఆంధ్ర అంటూ ఒక ఈవెంట్ మాత్రమే నిర్వహించారు.. ఆడుదాం ఆంధ్రకు 130 కోట్ల రూపాయలు ఖర్చు చేసి క్రీడాకారుల కడుపు కొట్టారని విమర్శించారు.. క్రీడాకారుల జీవితాన్ని వాళ్ల చేతుల్లోకి తీసుకొని 130 కోట్లు ఖర్చు చేశారు.. క్రీడాకారుల కోసం కాకుండా కేవలం వైసీపీ నాయకుల ప్రచారం కోసం వాడుకున్నారని మండిపడ్డారు.. క్రీడాకారుల సొమ్ము వాడుకున్న వారి నుంచి కక్కిచ్చేందుకు ప్రత్యేకంగా కమిటీ వేస్తున్నామని పేర్కొన్నారు. ఇక, కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులతో పేద గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహిస్తాం… పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన గ్రామాల ద్వారా శాప్ ద్వారా క్రీడా పోటీల నిర్వహిస్తామని వెల్లడించారు మంత్రి రాంప్రసాద్‌రెడ్డి.
జూ పార్క్ అభివృద్ధి కోసం.. టీ విత్ డిప్యూటీ సీఎం కార్యక్రమం
అరుదైన జంతువుల దిగుమతి, ప్రదర్శనపై దృష్టి సారించాలని సూచించారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. జూ పార్క్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 14వ గవర్నింగ్ బాడీ సమావేశంలో పాల్గొన్నారు.. ఈ సమావేశంలో జూ పార్క్‌ల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.. ఇక, జూ పార్క్ అభివృద్దికి కార్పొరేట్ సంస్థలను ఆకర్షించేలా టీ విత్ డిప్యూటీ సీఎం కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు.. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. అంతర్జాతీయ ప్రమాణాలతో జూ పార్కులను అభివృద్ధి చేయాలని సూచించారు.. పర్యాటకులను ఆకర్షించేలా ప్రత్యేక కార్యక్రమాలకు రూపకల్పన చేయాలని ఆదేశించారు. అరుదైన జంతువుల దిగుమతి, ప్రదర్శనపై దృష్టి పెట్టండి. కొత్త జూ పార్కుల ఏర్పాటుకు నివేదికలు రూపొందించాలని ఆదేశించారు.. జూ పార్కుల అభివృద్ధిలో కార్పొరేట్ కంపెనీలను భాగస్వాముల్ని చేయాలని సూచించారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
నాసిరకం వస్తువులు వస్తే అంగన్వాడీ టీచర్లు తిరస్కరించాలి..
సచివాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖపై మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు. అంగన్వాడీ సెంటర్ల పనితీరు, అందుతున్న సేవలపై జిల్లా అధికారులతో మంత్రి సీతక్క వీడియో కాన్ఫరెన్స్ చేపట్టారు. ఈ సమీక్షలో మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి వాకాటి కరుణ, కమిషనర్ కాంతి వెస్లీ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల సంఖ్య పెంచడమే లక్ష్యంగా ‘అమ్మ మాట- అంగన్‌వాడీ బాట’ పేరుతో ఈ సోమవారం నుంచి వారం రోజులపాటు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని మంత్రి సీతక్క అధికారులకు సూచించారు. తొలి ఒడి అమ్మ అయితే మలి ఒడి అంగన్వాడి కేంద్రాలే అని మంత్రి తెలిపారు. దుకే పిల్లలకు ఆరోగ్యము, పోషకాహారము, భద్రత కల్పించే లక్ష్యంతో అంగన్వాడీ కేంద్రాలు పనిచేయాలన్నారు. మీ పిల్లల భద్రత మా బాధ్యత అనే నమ్మకాన్ని తల్లిదండ్రుల్లో కలిగించేలా అంగన్వాడీ కేంద్రాలు పని చేయాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల్లో నాణ్యమైన వస్తువులు అందేలా జిల్లా సంక్షేమ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. నాసిరకం వస్తువులు వస్తే అంగన్వాడీ టీచర్లు తిరస్కరించాలని.. నాసిరకం సరుకులు సప్లై చేసే కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తమిళనాడు బీజేపీ, కాంగ్రెస్ అధ్యక్షుల మధ్య ‘‘రౌడీ షీటర్’’ వ్యాఖ్యల వివాదం..
తమిళనాడులో బీజేపీ, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుల మధ్య విమర్శలు కొనసాగుతున్నాయి. బీజేపీ చీఫ్ అన్నామలై ఇటీవల కాంగ్రెస్ అధ్యక్షుడు సెల్వపెరుంతగైని ఉద్దేశిస్తూ హిస్టరీ-షీటర్‌గా పేర్కొన్నారు. దీనిపై అన్నామలై తనకు క్షమాపణలు చెప్పాలని లేకుంటే పరువునష్టం, క్యారెక్టర్ అసాసినేషన్ కేసు పెడతానని హెచ్చరించారు. దీనికి బుధవారం అన్నామలై స్పందిస్తూ, తన వ్యాఖ్యల్ని సమర్థించుకున్నారు. క్షమాపణలు చెప్పేందుకు నిరాకరించిన అన్నామలై, ఈ కేసును కోర్టులో ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఈ వారం ప్రారంభంలో తమిళనాడు బీఎస్పీ చీఫ్ కే ఆర్మ్‌స్ట్రాంగ్ హత్యకు గురయ్యాడు. ఆయనకు సంతాపం తెలుపుతూ అన్నామలై ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో క్రిమినల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వ్యక్తులు ఎవరూ లేనిని అన్నారు. దీనిపై సెల్వపెరుంతగై స్పందిస్తూ, అన్నామలై పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి 1971 కేసుల్లో ప్రమేయం ఉన్న 261 మందిని బీజేపీలో చేర్చుకున్నారని, కొందరు ఆఫీస్ బేరర్లు కూడా అయ్యారని చెప్పారు. “తమిళనాడు బీజేపీ చీఫ్‌గా అన్నామలై బాధ్యతలు స్వీకరించినప్పుడు, ఏ+ గ్రేడ్ రౌడీలను, సంఘవిద్రోహులను పార్టీలో నియమించారు, వారిలో 261 మందిపై 1,971 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. కానీ ఆయన నన్ను హిస్టరీ షీటర్‌గా పిలిచారు. వీటిని నిరూపించాలి’’ అని కాంగ్రెస్ నాయకుడు డిమాండ్ చేశారు.
అమెరికా గాట్ టాలెంట్ షోలో అదరగొట్టిన రాజస్థాన్ కుర్రాడు.. ఆశ్చర్యపోయిన న్యాయనిర్ణేతలు
భారతీయ కుర్రాడు తన టాలెంట్‌తో అమెరికా న్యాయనిర్ణేతలను ఆశ్చర్యపోయేలా చేశాడు. ఏమి ప్రతిభ.. డ్యాన్స్ చూసిన ప్రతి ఒక్కరూ నిలబడి చప్పట్లతో ఉత్సాహపరిచారు. దీంతో ఆ కుర్రాడి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. భారత్‌లోని రాజస్థాన్‌కు చెందిన ప్రవీణ్ ప్రజాపత్ అమెరికాలో జరుగుతున్న గాట్ టాలెంట్ షోలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా గ్రావిటీ డిఫైయింగ్ డ్యాన్స్ చేశాడు. తలపై టీ గాజు గ్లాసులపైన కుండ పెట్టుకుని బ్యాలెన్సింగ్ యాక్ట్ చేశాడు. ఏ మాత్రం తొణకకుండా.. డ్యాన్స్ చేస్తూనే ఉన్నాడు. దీంతో న్యాయనిర్ణేతలు, ప్రేక్షకులు కళ్లప్పగించి చూస్తూనే ఉన్నారు. ఏం జరుగుతుందోనన్న టెన్షన్‌తో అలానే చూశారు. చివరికి ప్రవీణ్ డ్యాన్స్ పూర్తి చేయడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అమెరికాస్ గాట్ టాలెంట్ న్యాయమూర్తులైతే మంత్రముగ్ధులైపోయారు. 10 సంవత్సరాల వయసు నుంచి తన తండ్రి దగ్గర శిక్షణ పొందినట్లు ప్రవీణ్ తెలిపాడు. గత దశాబ్ద కాలంగా రోజూ 2-3 గంటలు ప్రాక్టీస్ చేస్తున్నట్లు పేర్కొన్నాడు. గతంలో రాజస్థానీ భావాయి జానపద నృత్యంతో ఇండియాస్ గాట్ టాలెంట్‌పై కూడా ప్రదర్శన ఇచ్చాడు. అప్పుడు కూడా న్యాయనిర్ణేతల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. ప్రవీణ్ కళ, అతని నృత్యం చూసి కిరణ్ ఖేర్, శిల్పాశెట్టి కుంద్రా, బాద్షా, మనోజ్ మునాషీర్‌లతో సహా న్యాయనిర్ణేతలందరూ చాలా ముగ్ధులయ్యారు. తాజాగా మరోసారి మంగళవారం అమెరికాలో జరిగిన టాలెంట్ షో ద్వారా ప్రపంచానికి తన ప్రతిభను చాటిచెప్పాడు. ఇండియా పేరు మార్మోగేలా చేశాడు. ప్రవీణ్ డ్యాన్స్‌కి అమెరికా న్యాయనిర్ణేతలందరూ, ప్రేక్షకులు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. ఆ డ్యాన్స్ ఏదో మీరు కూడా ఒకసారి చూసేసి.. ఆనందించండి.
మరో ఫోల్డ్ ఫోన్ ను లాంచ్ చేసిన శాంసంగ్..ఫీచర్స్ ఇవే..
శాంసంగ్ తన కొత్త ఫోల్డ్.. ఫ్లిప్ ఫోన్‌లను విడుదల చేసింది. పారిస్‌లో జరిగిన కార్యక్రమంలో కంపెనీ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 6, ఫోల్డ్ 6లను విడుదల చేసింది. ఆకర్షణీయమైన ఫీచర్లతో వస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్‌లు భారతదేశంలో కూడా లాంచ్ చేయబడ్డాయి. కంపెనీ ఈ ఫోన్‌లకు AI సామర్థ్యాలను కూడా జోడించింది. అందులో కంపెనీ Galaxy AIని వినియోగించింది. దీనితో పాటు, కంపెనీ లాంచ్ ఈవెంట్‌లో గెలాక్సీ వాచ్ అల్ట్రా, గెలాక్సీ వాచ్ 7 సిరీస్, గెలాక్సీ బడ్స్ 3, గెలాక్సీ బడ్స్ 3 ప్రో మరియు గెలాక్సీ రింగ్‌లను విడుదల చేసింది. ఈ ఫోన్ల ఫీచర్స్ ఇప్పుడు తెలుసుకుందాం. Samsung Galaxy Z Fold 6, Z Flip 6 ప్రీ-ఆర్డర్ జూలై 10 నుంచి ప్రారంభమవుతుంది. ఈ ఫోన్ల విక్రయం మాత్రం జులై 24 నుంచి ప్రారంభమవుతుంది. మార్కెట్లో గెలాక్సీ Z ఫ్లిప్ 6.. సిల్వర్ షాడో, ఎల్లో, బ్లూ, మింట్ కలర్ లో లభ్యమవుతుంది. నలుపు, తెలుపు, బూడిద రంగుల ఫోన్లు మాత్రం కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఈ ఫోన్ ప్రధాన స్క్రీన్ 7.6-అంగుళాల డైనమిక్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. కవర్ స్క్రీన్ 6.3-అంగుళాల డైనమిక్ AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. రెండు స్క్రీన్‌లు 120Hz రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తాయి. కవర్ స్క్రీన్‌పై 10MP సెల్ఫీ కెమెరా అందుబాటులో ఉంది. మెయిన్ స్క్రీన్‌లో 4MP అండర్ డిస్‌ప్లే కెమెరా అందుబాటులో ఉంది. వెనుక వైపున, కంపెనీ ట్రిపుల్ కెమెరా సెటప్‌ను అందించింది. ఇందులో 12MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 50MP వైడ్ యాంగిల్ లెన్స్.. 10MP టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3లో పనిచేస్తుంది. ఫోన్ మూడు కాన్ఫిగరేషన్లలో వస్తుంది. ఇది 12GB RAM మరియు 1TB వరకు నిల్వను కలిగి ఉంది. ఈ ఫోన్‌ల్లో 4400mAh బ్యాటరీ అందించబడింది. ఇది 25W వైర్డు ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఫాస్ట్ వైర్‌లెస్ ఛార్జింగ్ కూడా ఇందులో ఉంది. ఫోన్ Android 14 ఆధారంగా One UI 6.1.1పై పని చేస్తుంది.
మొదట గిల్ బ్యాట్, ఆపై సుందర్ స్పిన్.. మూడో టీ-20లో భారత్ విజయం
జింబాబ్వేతో టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో ఓడిన భారత జట్టు పునరాగమనం చేసింది. రెండో మ్యాచ్‌లో టీమిండియా 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పుడు మూడో మ్యాచ్‌లో భారత్ 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్.. శుభ్‌మన్ గిల్ అర్ధశతకంతో 4 వికెట్లకు 182 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే 39 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. నిర్ణీత 20 ఓవర్లలో జింబాబ్వే జట్టు 6 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసి ఓటమిపాలైంది. ఈ విజయంతో భారత్ సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలో నిలిచింది. చివరి 10 ఓవర్లలో భారత బౌలర్లు 99 పరుగులు ఇచ్చారు. 49 బంతుల్లో ఏడు ఫోర్లు, మూడు సిక్సర్లతో 66 పరుగుల ఇన్నింగ్స్ ఆడడమే కాకుండా, ఓపెనర్ శుభ్‌మన్ గిల్ తొలి వికెట్‌కు యశస్వి జైస్వాల్ (36), రుతురాజ్ గైక్వాడ్ (49)తో కలిసి మూడో వికెట్‌కు 62 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. జట్టును బలమైన స్కోరు దిశగా నడిపించాడు. జింబాబ్వే తరఫున కెప్టెన్ సికందర్ రజా 24 పరుగులిచ్చి 2 వికెట్లు తీయగా, బ్లెస్సింగ్ ముజారబానీ 25 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. గిల్, జైస్వాల్‌తో కలిసి పవర్ ప్లేలో వికెట్ నష్టపోకుండా 55 పరుగులు జోడించి జట్టుకు శుభారంభం అందించారు. ఆఫ్ స్పిన్నర్ బ్రియాన్ బెన్నెట్ వేసిన తొలి ఓవర్‌లోనే జైస్వాల్ రెండు ఫోర్లు, ఒక సిక్సర్ బాదగా, ఆ తర్వాతి ఓవర్‌లో గిల్ రెండు ఫోర్లు, ఒక సిక్సర్ కొట్టాడు. ఫాస్ట్ బౌలర్ టెండై చతారా వరుస బంతుల్లో జైస్వాల్ ఫోర్లు, సిక్సర్లు బాదాడు.
సోషల్ మీడియాలో నటీనటుల మీద ట్రోలింగ్ వీడియోలను ఇక సహించం.. మంచు విష్ణు వార్నింగ్
గత కొద్దిరోజులుగా ప్రణీత్ హనుమంతు వ్యవహారం సోషల్ మీడియాలోనే కాదు టాలీవుడ్ వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. ఈరోజు సాయంత్రం అతన్ని బెంగళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు హైదరాబాద్ తీసుకొస్తున్నారు. అయితే ఈ అంశం మీద తాజాగా స్పందించిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు, హీరో మంచు విష్ణు యూట్యూబ్ ఛానల్స్ నడిపే వాళ్లకు వార్నింగ్ ఇస్తూ ఒక వీడియో రిలీజ్ చేశారు. తెలుగు వాళ్లంటే చాలా పద్ధతిగా ఉంటారని ప్రపంచవ్యాప్తంగా అనుకుంటూ ఉంటారు. కానీ తెలుగు సోషల్ మీడియాలో చేస్తున్న రచ్చ వల్ల మిగతా వాళ్ళందరూ ఇలా తయారయ్యారేంటి అని తెలుగు వాళ్ళందరినీ అనుకునే పరిస్థితి ఏర్పడిందని మంచు విష్ణు చెప్పుకొచ్చాడు. సాయిధరమ్ తేజ్ వీడియో మీద స్పందించిన రేవంత్ రెడ్డి సహా మిగతా ప్రభుత్వ పెద్దలందరికీ చాలా థాంక్స్ చెబుతున్నాను. నిజానికి ప్రణీత్ హనుమంతు కూడా మంచి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. అతను ఎందుకు దీన్ని కామెడీ చేసి ఆనందపడుతున్నారు అనేది నాకు అర్థం కాలేదు. కామెడీ పేరుతో ఇలాంటి వీడియోలు చేయడం కరెక్ట్ కాదని మంచు విష్ణు చెప్పుకొచ్చారు. ఇక ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో చేసి పోస్ట్ చేసే వాళ్ల మీద సైబర్ సెక్యూరిటీ సెల్ కి ఫిర్యాదు చేస్తామని ఇకనుంచి సోషల్ మీడియాలో ఉన్న వారందరూ తమ తీరు మార్చుకోవాలని మంచు విష్ణు వెల్లడించారు. సోషల్ మీడియాలో ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని కూడా మంచు విష్ణు కోరారు. కామెడీ పేరుతో ఇలాంటి వీడియోలు చేయడం సరికాదు, తెలంగాణ సీఎం రేవంత్ -డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏపీ సీఎం చంద్రబాబు- డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరపున ఈ మేరకు మేము అప్పీల్ చేస్తున్నాం. సోషల్ మీడియాలో నటీనటుల మీద ట్రోలింగ్ వీడియోలు చేసినా, డార్క్ కామెడీ పేరుతో వీడియోలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకునేలా చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వ పెద్దలను కోరారు.
త్రివిక్రమ్ నాకేం చేశాడో వేరే వాళ్ళ చేత ఏం చేయించాడో అతన్నే అడగండి!
వివాదాస్పద హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న పూనం కౌర్ ఈరోజు ఉదయం నుంచి స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ ని టార్గెట్ చేసింది. గతంలో ఎన్నోసార్లు త్రివిక్రమ్ ని టార్గెట్ చేసి సోషల్ మీడియా వేదికగా తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వస్తున్న ఆమె ఈరోజు ఒక అడుగు ముందుకు వేసి త్రివిక్రమ్ స్టాండర్డ్స్ తక్కువ అన్నట్లు అర్థం వచ్చేలా కామెంట్ చేసింది. జల్సా సినిమాలో రేప్ కామెంట్స్ ని ఉద్దేశిస్తూ త్రివిక్రమ్ నుంచి ఇంతకన్నా మంచి కంటెంట్ ఆశించలేమని కామెంట్ చేసింది. అయితే ఒక నెటిజన్ మీరు కావాలనే త్రివిక్రమ్ మీద మీ వ్యక్తిగత పగ సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్నారు. మీకు మీకు ఏమైనా ఉంటే సోషల్ మీడియా వరకు తీసుకురావద్దు త్రివిక్రమ్ టాలెంట్ ఏంటో మాకు తెలుసు అంటూ కామెంట్ చేశారు. దానికి పూనం కౌర్ స్పందిస్తూ త్రివిక్రమ్ ఎంత చెడు స్వభావం గల వ్యక్తో తనకు తెలుసని చెప్పుకొచ్చింది. అంతేకాదు అతనితో నీకున్న ఎక్స్పీరియన్స్ మంచిదైతే సరే కానీ నాకు అతనితో ఉన్న ఎక్స్పీరియన్స్ సరైనది కాదంటూ చెప్పుకొచ్చింది. అతను జీవితాలను నాశనం చేసే వ్యక్తిని కామెంట్ చేసింది. మళ్ళీ దానికి సదరు నెటిజన్ మీ టైం బాగా లేకనో లేకపోతే మీకు టాలెంట్ లేకనో మీరు స్టార్ హీరోయిన్ అవ్వలేదు. దానికి త్రివిక్రమ్ ఒక్కరే కారణమైనట్టు తప్పుగా బ్లేమ్ చేయకండి అని రాసుకొచ్చాడు. మరోసారి దానికి స్పందిస్తూ నేనెప్పుడూ సినిమాలు గురించి మాట్లాడలేదు. అతన్ని సపోర్ట్ చేసే మీలాంటి మేల్ ఇగోస్టులందరికీ ఒకటే చెబుతున్నా, ఒకసారి అతని దగ్గరికి వెళ్లి అతను నాకేం చేశాడో వేరే వాళ్ళ చేత ఏం చేయించాడో అతన్నే అడగండి అంటూ కామెంట్ చేసింది. ఇక ఈ వివాదం ఎంత దూరం వెళుతుంది అనేది తెలియడం లేదు.