రేపు ఏపీ కేబినెట్ భేటీ.. అజెండా ఇదే..!
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ రేపు సమావేశం కానుంది.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు కేబినెట్ ప్రత్యేక సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అజెండా అంశాలపై చర్చ జరగనుంది. ముఖ్యంగా అమరావతి అభివృద్ధి, ప్రభుత్వ నిర్మాణాలు, పెద్ద ప్రాజెక్టుల అమలు వంటి విషయాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. రూ.169 కోట్ల వ్యయంతో టెండర్లు పిలవడానికి కేబినెట్ ఆమోదం ఇవ్వనుంది. ఇది రాష్ట్ర స్థాయి అధికారుల ఆవాసానికి అవసరమైన ప్రాజెక్ట్. రూ.163 కోట్లు వ్యయంతో పరిపాలనా అనుమతులకు ఆమోదం ఇవ్వనుంది. కోర్టు సిబ్బందికి శిక్షణకు అవసరమైన సౌకర్యాలు అందించడానికి ఇది కీలకం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక నివేదికలను క్యాబినెట్ ఆమోదం ద్వారా విడుదల చేయనుంది. అమరావతి నిర్మాణానికి CRDAకి రూ.7380.70 కోట్ల రుణం పొందడానికి అనుమతి ఇవ్వనుంది. ఇది నగర అభివృద్ధి, మౌలిక సౌకర్యాల నిర్మాణానికి ఉపయోగపడుతుంది. 16వ జాతీయ రహదారితో అనుసంధానం కోసం 532 కోట్లు ఆమోదం ఇవ్వనుంది. ఇది రవాణా మరియు లాజిస్టిక్ వేగవంతానికి దోహదం చేస్తుంది. ఇప్పటికే SIPBలో నిర్ణయించుకున్న కీలక అంశాలను క్యాబినెట్ సమీక్షించి ఆమోదం ఇస్తుంది. 20,000 కోట్లు పెట్టుబడులు, 56,000 ఉద్యోగాలను సృష్టించే ప్రాజెక్టుల ఆమోదం కూడా ఇవ్వనుంది. ఇది రాష్ట్ర ఆర్థిక, ఉద్యోగ అవకాశాలను పెంచే దిశలో కీలకం. పలు ప్రభుత్వ మరియు semi-government సంస్థలకు భూ కేటాయింపుల అనుమతులు కూడా ఈ సమావేశంలో ఇవ్వబడతాయి.
ఇంద్రకీలాద్రిపై భవాని దీక్షల విరమణకు ఏర్పాట్లు పూర్తి.. భక్తులకు కీలక సూచనలు.
బెజవాడలోని ఇంద్రకీలాద్రిపై ఈ నెల 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు భవాని దీక్షా విరమణలు జరగనున్న నేపథ్యంలో దేవస్థానం, పోలీసులు, వివిధ శాఖలు భారీ ఏర్పాట్లు చేపట్టాయి. ప్రతి ఏటా భవానీల సంఖ్య పెరుగుతుండటంతో ఈసారి మరింత విస్తృతంగా ఏర్పాట్లు చేశారు.. భవానీలు ఇరుముడులు సమర్పించేందుకు మొత్తం మూడు హోమగుండాలు ఏర్పాటు చేశారు. భవానీలు 41 రోజులపాటు అనుసరించిన నియమ నిష్టలకు ముగింపు పలకబోతుండటంతో వేలాదిగా భక్తులు తిరిగి ఇంద్రకీలాద్రి చేరుతున్నారు. ఈసారి, రాష్ట్రం నలుమూలల నుంచి 7 లక్షల మంది భవానీలు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.. భక్తులకు మంచినీరు, నిత్యాన్న ప్రసాదం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు.. 19 ప్రసాదం కౌంటర్లు ఏర్పాటు చేసి రద్దీ లేకుండా.. భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు.. మరోవైపు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.. 4,000 మంది పోలీసు సిబ్బంది భద్రతా ఏర్పాట్లు చేయనుండగా.. 370+ సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు.. ఇక, భవానీల రద్దీ దృష్ట్యా డిసెంబర్ 11వ తేదీ నుంచి 16వ తేదీ వరకు అన్ని అర్జిత సేవలను నిలిపివేశారు అధికారులు.. భక్తుల సౌకర్యార్థం గిరి ప్రదక్షిణ మార్గం వివరాలు అందించే విధంగా ‘భవాని దీక్ష 2025’ మొబైల్ యాప్ ను అందుబాటులోకి తెచ్చారు. భవానీలు నిర్వహించే గిరి ప్రదక్షిణ 9 కిలోమీటర్ల మేర సాగనుంది. భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్లు, ఉచిత క్యూ లైన్లు, పెద్దపీఠాల సౌకర్యాలు అందుబాటులో ఉంచారు.
గవర్నర్‌తో వైఎస్ జగన్ సమావేశం షెడ్యూల్ మార్పు..
ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి సర్కార్ పీపీపీ మోడ్‌లో మెడికల్ కాలేజీలను అభివృద్ధి చేయాలని ప్రణాళికలు సిద్ధం చేయగా.. పీపీపీ మోడ్ అంటే.. మెడికల్ కాలేజీలను ప్రైవేట్‌పరం చేయమే అంటూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఉద్యమాన్ని చేపట్టింది.. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు, ఆందోళనలు, ర్యాలీలు చేసి.. కోటి సంతకాల సేకరణ చేపట్టింది.. ఇక, మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 18న గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలవనున్నారు. ముందుగా సంతకాల ప్రతులను గవర్నర్‌కు డిసెంబర్ 17న అందజేయాలని వైసీపీ నిర్ణయించినా, షెడ్యూల్‌లో స్వల్ప మార్పుల నేపథ్యంలో ఈ నెల 18కి భేటీ వాయిదా పడింది. ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గాల నుండి సేకరించిన సంతకాల పత్రాలు జిల్లా కేంద్రాలకు, అక్కడి నుండి విశాఖ నగర వైయస్సార్సీపీ కార్యాలయానికి చేరాయి. ప్రతి నియోజకవర్గ ఇంఛార్జ్‌లు సంతకాల పత్రాలను ఊరేగింపుతో పార్టీ కార్యాలయానికి తీసుకువచ్చారు. విశాఖ నగర వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కేకే రాజు మాట్లాడుతూ.. అంచనాలకు మించిన స్థాయిలో ప్రజలు సంతకాల సేకరణకు స్పందించారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకునే వరకు మా పోరాటం కొనసాగుతుంది” అని తెలిపారు.
ప్రేమించినోడి కోసం హైదరాబాద్‌కు యువతి.. పోలీసుల ఎంట్రీతో కటకటాల్లోకి..!
హైదరాబాద్ పోలీసులు మోపిన కేసులతో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ యువతి వాపోతోంది.. కానీ, పట్టించుకునే దిక్కు లేక జైలు జీవితం గడుపుతోంది. FIRలు నమోదైన సమయంలో తాను రొయ్యల ఫ్యాక్టరీలో పనిచేస్తున్నట్టు బంధువులు ఆధారాలు సేకరించడంతో, ఆమెను విడిపించేందుకు కుటుంబసభ్యులు ప్రయత్నాలు ప్రారంభించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం వెలివర్రుకు చెందిన 19 ఏళ్ల రాజీ అనే యువతి గత మూడు వారాలుగా చెంచల్‌గూడ జైలులో ఉంది. తల్లి మరణం తర్వాత ఉండిలోని వెల్కమ్ రొయ్యల ఫ్యాక్టరీలో కూలీగా పనిచేస్తున్న ఆమె.. గతంలో ఎప్పుడూ హైదరాబాద్ వెళ్లలేదు. అయితే, గత నెల 6వ తేదీన ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు రొయ్యల ఫ్యాక్టరీలో పని చేసిన రాజీ, అదే రోజు అర్ధరాత్రి తన ప్రేమించిన యువకుడు లోకేష్‌తో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆ తర్వాత వారిని హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బంధువుల ఆరోపణల ప్రకారం.. రాజీపై చిల్లర దొంగతనాల కేసులతో మొత్తం 12 FIRలు నమోదు చేశారు. ఆ FIRలు నమోదైన సమయానికి ఆమె ఉండిలో ఫ్యాక్టరీలో పనిచేస్తున్నట్లు కుటుంబసభ్యులు ఆధారాలు చూపుతున్నారు. ఇటీవల ములాఖాత్‌లో రాజీని కలవడంతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.. చోరీలు చేశానని ఒప్పుకో, శిక్ష తగ్గిపోతుంది; బయటికి వెళ్తావు.. అని పోలీసులు బలవంతం చేస్తున్నారని తండ్రి, బంధువులకు వాపోయింది. మరోవైపు, పోలీసుల దర్యాప్తులో, రాజీతో కలిసి వెళ్లిన భీమవరం యువకుడు లోకేష్ మరియు అతని స్నేహితులు చోరీలకు పాల్పడుతున్నట్టు గుర్తించారు. అందుకే రాజీ కూడా వారి వెంట ఉన్నందున కేసుల్లోకి లాగేశారని బంధువుల ఆరోపణ. 6వ తేదీన మా అమ్మాయి ఇక్కడే ఉంది. అదే రోజు హైదరాబాద్‌లో ఆమెపై కేసులు ఎలా పెడతారు?అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాజీ బంధువులు.
చంద్రబాబు చెప్పినట్టు పవన్ కల్యాణ్ వికృత క్రీడ..! అంబటి ఫైర్
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు మాజీ మంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అంబటి రాంబాబు.. సీఎం చంద్రబాబు చెప్పినట్లు పవన్ కల్యాణ్ వికృత క్రీడ ఆడుతున్నాడని నిప్పులు చెరిగారు.. చంద్రబాబు ఏం చెబితే పవన్ అదే మాట్లాడుతున్నారని ఆరోపించారు… పవన్ కల్యాణ్‌కు ఏది కావాలో.. చంద్రబాబు అది ఇస్తాడు.. కాబట్టే ఆయన చెప్పినట్టుగానే మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఇక, కూటమి నేతలు దేవుడిని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. దేవుడి పేరుతో రాజకీయాలు చెయ్యబట్టే చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా తిరుమలలో తొక్కిసలాట జరిగి ఎనిమిది మంది చనిపోయారన్నారు. తిరుమలలో వెయ్యి కాళ్ల మండపాన్ని ఎవరు పడగొట్టారని పవన్ కల్యాణ్ ను ప్రశ్నించారు అంబటి రాంబాబు… గోదావరి పుష్కరాల సమయంలో 29 మంది చనిపోతే.. పవన్ ఎందుకు ప్రశ్నించలేదు అని నిలదీశారు.. విజయవాడలో చంద్రబాబు గుళ్లు కూల్చేస్తే వైఎస్ జగన్ వాటిని తిరిగి కట్టించారని గుర్తుచేశారు. రాష్ట్రంలో లోకేష్ అజ్ఞానుడు అనుకుంటే.. పవన్ కల్యాణ్ అంతకంటే అజ్ఞానుడిగా మారుడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి అంబటి రాంబాబు..
పటాన్‌చెరులో పరువు హత్య.. యువకుడిని కొట్టి చంపిన యువతి తల్లిదండ్రులు
హైదరాబాద్ పరిధిలోని సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు, అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణమైన పరువు హత్య ఘటన చోటుచేసుకుంది. ప్రేమ వ్యవహారమే కారణంగా ఓ యువకుడిని ఇంటికి పిలిపించి బ్యాట్లతో కొట్టి హత్య చేసిన ఘటన కలకలం రేపుతోంది. బీరంగూడ ప్రాంతానికి చెందిన సాయి (20), అదే ప్రాంతానికి చెందిన యువతి (19) గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం ఇటీవల యువతి తన తల్లిదండ్రులకు చెప్పడంతో, వారు పెళ్లి విషయంపై మాట్లాడతామని సాయిని ఇంటికి రావాలని పిలిచినట్లు సమాచారం. పెళ్లి అంగీకారం ఇస్తారన్న నమ్మకంతో సాయి శ్రీజ ఇంటికి వెళ్లాడు. అయితే ఇంటికి వెళ్లిన వెంటనే అక్కడి పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. శ్రీజ తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు కలిసి సాయిపై బ్యాట్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో సాయి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. తీవ్ర రక్తస్రావంతో కొద్ది సేపటికే సాయి మృతి చెందినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పటాన్‌చెరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రేమిస్తున్నాడన్న కారణంతోనే సాయిని హత్య చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారించిన పోలీసులు, శ్రీజ తల్లిదండ్రులు సహా కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు.
సీఎం సహాయ నిధి పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త రికార్డు
తెలంగాణలో ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త రికార్డు సృష్టించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో గత రెండేళ్లలో పేద, మధ్యతరగతి ప్రజలకు ఎప్పుడూ లేని స్థాయిలో వైద్య సహాయం అందింది. 2023 డిసెంబర్ 7 నుంచి 2025 డిసెంబర్ 6 వరకు మొత్తం 3,76,373 మంది లబ్ధిదారులకు రూ.1,685.79 కోట్ల సహాయం అందజేశారు. గతంలో 2014 నుంచి 2024 వరకు సంవత్సరానికి సగటున రూ.450 కోట్లు మాత్రమే సహాయ నిధి ద్వారా పంపిణీ కాగా, ప్రస్తుత ప్రభుత్వం రెండు సంవత్సరాల్లో సగటున సంవత్సరానికి రూ.850 కోట్ల మేర నిధులు వెచ్చించడం గమనార్హం. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ప్రజలకు రెండు విధాలుగా వైద్య సహాయం అందుతోంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స కోసం ముందుగానే ఖర్చు భరించే లెటర్ ఆఫ్ క్రెడిట్ విధానం ద్వారా 27,421 మంది లబ్ధిదారులకు రూ.533.69 కోట్ల సహాయం అందింది. నిమ్స్, ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రి, ప్రభుత్వ ఈఎన్‌టీ ఆసుపత్రి వంటి వైద్య కేంద్రాల్లో ఈ సహాయం నేరుగా చికిత్స ఖర్చులకు ఉపయోగపడింది. మరోవైపు ప్రైవేటు లేదా కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన వారు ఖర్చులు చెల్లించిన అనంతరం తిరిగి పొందే రీయింబర్స్‌మెంట్ విధానం ద్వారా 3,48,952 మందికి రూ.1,152.10 కోట్లు అందజేశారు.
అవును, మేము RSS సిద్ధాంతాలను అనుసరిస్తాం..
ఆర్ఎస్ఎస్ దేశంలోని అన్ని వ్యవస్థను ఆక్రమిస్తోందని రాహుల్ గాంధీ లోక్‌సభలో ఆరోపించిన ఒక రోజు తర్వాత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా సభలో ఈ రోజు మాట్లాడుతూ.. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) సభ్యులు దేశం కోసం తమ ప్రాణాలను త్యాగం చేశారని, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, తాను కూడా ఆ సంస్థ అనుచరులేనని అన్నారు. ఎన్నికల సంస్కరణలపై ఈ రోజు(బుధవారం) అమిత్ షా, రాహుల్ గాంధీ మధ్య సవాళ్లు పర్వం నడిచింది. ఓట్ చోరీ అంశాన్ని రాహుల్ లేవనెత్తగా, అమిత్ షా తీవ్రంగా బదులిచ్చారు. ఓట్ చోరీ అంశంపై తనతో చర్చకు సిద్ధమా? అని రాహుల్ గాంధీ, అమిత్ షాకు సవాల్ విసిరారు. తాను ఎప్పుడు మాట్లాడాలో తానే నిర్ణయిస్తానని అమిత్ షా కౌంటర్ ఇచ్చారు. దీని తర్వాత ప్రతిపక్షాలు వాకౌట్ చేశాయి. దీనిపై అమిత్ షా మాట్లాడుతూ.. వారు 200 సార్లు బహిష్కరించవచ్చు. ఈ దేశంలో ఒక్క చొరబాటుదారుడిని కూడా ఓటు వేయడానికి అనుమతించము అని అన్నారు. సర్దార్ పటేల్ ప్రధాని కావాల్సింది, ఓట్ చోరీ ద్వారా నెహ్రూ అయ్యారని షా అన్నారు. సర్దార్ పటేల్‌కు 28 ఓట్లు వస్తే, నెహ్రూకు 2 ఓట్లు వచ్చాయని కానీ, నెహ్రూనే ప్రధాని అయ్యారని అన్నారు.
“చనిపోవాలని లేదు”.. నా భార్య, ఆమె బాయ్‌ఫ్రెండ్ కారణంగానే ఆత్మహత్య చేసుకుంటున్నా..
ఉత్తర్ ప్రదేశ్ వారణాసిలో విషాదకర సంఘటన వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వ్యక్తి భార్య చేసిన మోసానికి బలైపోయాడు. తన బిడ్డను తన నుంచి దూరం చేయడమే కాకుండా, తన భార్యకు తన ప్రియుడితో ఉన్న సంబంధం గురించి ఆరోపిస్తూ తన బాధను 7 నిమిషాల వీడియలో రికార్డ్ చేశాడు. బైక్ నడుపుతున్నప్పుడు చిత్రీకరించిన ఈ వీడియోలో తాను చనిపోవాలని అనుకోవడం లేదని, కానీ తనకు వేరే మార్గం లేదని పదే పదే చెప్పాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఐదేళ్ల క్రితం వారణాసిలోని లఖన్‌పూర్ కు చెందిన ఒక మహిళను ప్రేమ వివాహం చేసుకున్న రాహుల్ మిశ్రా మంగళవారం ఉదయం లోహతా ప్రాంతంలోని తన ఇంట్లో ఉరేసుకుని కనిపించాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపారు. రాహుల్ కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా భార్య, ఆమె ప్రియుడిపై, అతడి అత్తగారిపై ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు కేసు నమోదు చేశారు.
నెల రోజులు కాకముందే.. 29.9 కిమీ మైలేజ్ సాధించి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం..
టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికిల్స్ విభాగం నుండి భారత మార్కెట్‌లో సియెరా SUVను లాంచ్ చేసింది. ఐకానిక్ పేరును తిరిగి తెచ్చిన ఈ మోడల్‌ను సంస్థ రూ.11.49 లక్షల ప్రారంభ ధరతో అందుబాటులోకి తీసుకవచ్చింది. లాంచ్ అయిన మొదటి రోజు నుంచే ఈ SUVకు ప్రజాదరణ భారీగా పెరుగుతోంది. దీనిని మరింత పెంచేందుకు టాటా కంపెనీ పలు ప్రత్యేక పరీక్షలు నిర్వహిస్తోంది. తాజాగా ఇండోర్‌లోని NATRAX ట్రాక్‌లో నిర్వహించిన పరీక్షలో సియెరా 29.9 కిమీ మైలేజ్ సాధించి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం దక్కించుకుంది. ఈ రికార్డు 12 గంటల పాటు చేసిన పరీక్షలో నమోదైంది. ఈ పరీక్ష కోసం టాటా కొత్తగా అభివృద్ధి చేసిన 1.5 లీటర్ హైపీరియన్ పెట్రోల్ ఇంజిన్‌తో కూడిన మోడల్‌ను ఉపయోగించారు. ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తున్న ఈ ఇంజిన్ 160 hp పవర్, 255 nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అంతకుముందు ఇదే హైపీరియన్ ఇంజిన్‌తో నియంత్రిత పరిస్థితుల్లో సియెరా 222 కి.మీ గరిష్ట వేగాన్ని నమోదు చేసింది.
OYO యూజర్స్‌కు గుడ్‌న్యూస్.. ఇకపై దానితో పని లేదు
OYO యూజర్స్‌కు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని రక్షించడానికి UIDAI ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ఇకపై ఓయోలో ఆధార్ ఫోటో కాపీల సేకరణను UIDAI నిషేధిస్తున్నట్లు తెలిపింది. ఈ కొత్త నియమం అమల్లోకి వచ్చిన తర్వాత హోటళ్లు, ఈవెంట్ నిర్వాహకులు, టెలికాం కంపెనీలు QR కోడ్ లేదా ఆధార్ యాప్ ఉపయోగించి డిజిటల్ ఆధార్ ధృవీకరణ కోసం UIDAI వద్ద నమోదు చేసుకోవాల్సి ఉంది. ఆధార్ కార్డులోని QR కోడ్ విలువైన సమాచారాన్ని కలిగి ఉంటుంది. ఇది సున్నితమైన వివరాలను బహిర్గతం చేయకుండా సురక్షిత ధృవీకరణకు అనుమతిస్తుంది. ఆధార్ యాప్ సురక్షిత ధృవీకరణ, చిరునామా నవీకరణలకు సహాయపడుతుంది. ఈ కొత్త ఫ్రేమ్‌వర్క్ కింద ఆధార్ ఆధారిత ధృవీకరణను నిర్వహించే కంపెనీలు ఈ వ్యవస్థలో నమోదు చేసుకోవాల్సి ఉంటుందని UIDAI CEO భువనేష్ కుమార్ తెలిపారు. కొత్త ధృవీకరణ సాంకేతికత వేగంగా ఉంటుంది, గుర్తింపు దొంగతనం ప్రమాదాన్ని తగ్గిస్తుందని వెల్లడించారు. “కొత్త నియమాన్ని అధికారులు ఆమోదించారు. ఇది త్వరలో అధికారికంగా అమలులోకి వస్తుంది. హోటళ్లు, ఈవెంట్ నిర్వాహకులు వంటి ఆఫ్‌లైన్ ధృవీకరణను నిర్వహించే సంస్థలకు రిజిస్ట్రేషన్‌ను తప్పనిసరి చేస్తుంది. కాగితం ఆధారిత ఆధార్ ధృవీకరణను తగ్గించడమే దీని లక్ష్యం” అని ఆయన స్పష్టం చేశారు. సెంట్రల్ ఆధార్ డేటాబేస్ సర్వర్ లేకపోయినా యాప్-టు-యాప్ ధృవీకరణను ప్రారంభించే కొత్త యాప్‌ను టెస్టింగ్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. “ఆఫ్‌లైన్ ధృవీకరణతో పని లేకుండా ఈ కొత్త వ్యవస్థ ధృవీకరణ సౌలభ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇంకా వినియోగదారుల గోప్యత కాపాడతుంది. దీంతో ఆధార్ డేటా లీక్ అయ్యే ప్రమాదం ఉండదు” అని అన్నారు.
రెగ్యులర్ షోల బుకింగ్స్ ఓపెన్.. ప్రీమియర్ బుకింగ్స్ ఎప్పుడు అంటే!
నందమూరి అభిమానులతో పాటు, అఖండ 2 సినిమా అభిమానులకు గుడ్ న్యూస్.. ‘గాడ్ ఆఫ్ మాసెస్’ నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తోన్న ‘అఖండ 2 తాండవం’ సినిమా తెలంగాణలో రెగ్యులర్ షోల టికెట్ బుకింగ్స్ ఈ రోజు నుంచే ఓపెన్ అయ్యాయి. అలాగే ప్రీమియర్ షోల బుకింగ్స్ రేపటి (డిసెంబర్ 11) నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 12 నుంచి ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. నందమూరి అభిమానులతో పాటు, సినిమా ప్రేమికులు ఈ చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాలకృష్ణ – బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన ‘అఖండ’ ఎంతటి బ్లాక్‌బస్టర్ సక్సెస్ సాధించిందో తెలిసిందే. అలాంటి కాంబినేషన్‌లో వస్తున్న ఈ సీక్వెల్‌పై అంచనాలు ఆకాశాన్నంటాయి. ఈ చిత్రంలో బాలయ్య డ్యూయల్ రోల్స్‌లో కనిపించబోతున్నారు. ఆది పినిశెట్టి, సంయుక్త మేనన్, తదితరులు కీ రోల్స్ పోషిస్తుండగా, తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించారు.
ఎవర్రా నిప్పుల కొండను ఆపేది..! అఖండ 2 కొత్త టీజర్ చూశారా..
ఎక్కడ చూసిన ఇప్పుడు అఖండ 2 ఊపే నడుస్తుంది. తాజాగా ‘అఖండ-2: తాండవం’ గ్రాండ్ రిలీజ్ టీజర్ వచ్చేసింది. ఈ టీజర్‌లో బాలయ్య బాబు ఎలివేషన్స్ సీన్ చూస్తే రోమాలు నిక్కబొడుచుకోవాల్సిందే. కాషాయం కట్టుకున్న ఆ దేశాన్ని చూడు, తిశ్రూలాన్ని పట్టుకున్న ఆ దైవాన్ని చూడు, ఎవర్రా ఆ విబూది కొండను ఆపేది అంటూ పలికిన డైలాగ్స్ టీజర్‌లో హైలేట్‌గా నిలిచాయి. ఈ టీజర్ చూస్తున్నంత సేపు బాలయ్య రుద్రతాండవం కనిపించింది. నందమూరి అభిమానులతో పాటు, సినిమా ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా అఖండ 2. తాజాగా రిలీజ్ అయిన 67 సెకన్ల టీజర్‌లో బోయపాటి శ్రీను మాస్ మ్యాజిక్ మళ్లీ ఆవిష్కృతమైంది. మంచు పర్వతాలు, అగ్ని జ్వాలలు, రక్తం కకకలాడే యాక్షన్.. అంతకంటే మించి బాలయ్య దివ్య రౌద్ర రూపం ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమా డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఇప్పటికే సోషల్ మీడియా అంతా బాలయ్య మాస్ జాతరతో మారుమోగిపోతుంది. ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్నారు.