గులాబీ పార్టీ బాస్ ప్రసంగంపై ఉత్కంఠ
మరో కొత్త చరిత్రకు నాంది పలుకుతున్నారు తెలంగాణ సీఎం, గులాబీ పార్టీ బాస్ కె.చంద్రశేఖర్‌రావు.. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చిన తర్వాత తొలి సారీ ఖమ్మం వేదికగా భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు.. ఇప్పటికే ఈ సభ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.. తెలంగాణ జైత్రయాత్ర సాగించిన పోరు భూమి మరో సమర నినాదానికి సిద్ధమైంది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పి.. మతోన్మాద శక్తుల నుంచి దేశాన్ని కాపాడి.. యావత్ దేశ ప్రజలకు తెలంగాణ తరహా పాలన అందించాలనే సంకల్పంతో జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన కేసీఆర్.. అడుగులు ఎలా పడనున్నాయి.. తన కార్యాచరణ ఎలా ఉండబోతోంది.. ఖమ్మం శివారులోని వీ వెంకటాయపాలెం వద్ద జరిగే భారీ బహిరంగ సభ వేదికగా కేసీఆర్ ఎలాంటి ఉపన్యాసం చేయబోతున్నారు అనేది ఉత్కంఠగా మారిపోయింది.. ఇక, ఈ సభకు బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌తో పాటు.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్, పంజాబ్ సీఎం భగవంత్‌మాన్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్, సీపీఎం, సీపీఐ జాతీయ నేతలు హాజరుకానున్నారు. దీంతో ఇప్పుడు అందరి దృష్‌టి బీఆర్‌ఎస్ సభవైపు మళ్లింది.. కేసీఆర్ ప్రసంగం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. రాష్ట్ర ప్రజలతో పాటు.. జాతీయ నేతలు కూడా కేసీఆర్ ప్రసంగం కోసం ఆసక్తిగా చూస్తున్నారు.. మరోవైపు.. బీఆర్ఎస్ తొలి సభ కోసం ఖమ్మం నగరం గులాబీ మయం అయిపోయింది.. భారీ కటౌట్లపై ప్రభుత్వ పథకాల కొటేషన్లు, బీఆర్‌ఎస్ నినాదాలతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నది. ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ అనే నినాదంతో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకుంటున్న కేసీఆర్.. చరిత్రలో నిలిచిపోయేలా సభ విజయవంతం చేసేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు.. మతం పేరిట, కులం పేరిట ప్రజల మధ్య చిచ్చుపెడుతున్న బీజేపీని పడగొట్టి కేంద్రంలో లౌకిక, ప్రజాస్వామ్య విలువలతో కూడిన ప్రభుత్వ ఏర్పాటుకు సభ నాంది పలుకుతాం అంటున్నారు..
బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ.. ఏపీ నుంచి ప్రత్యేక బస్సులు
జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టిన తెలంగాణ సీఎం కేసీఆర్.. ఖమ్మం వేదికగా బీఆర్ఎస్ తొలి సభను నిర్వహిస్తున్నారు.. ఈ సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.. ఇప్పటికే మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు.. మాజీ ముఖ్యమంత్రులు, జాతీయ నేతలు.. రాష్ట్ర నేతలు ఇలా.. చాలా మంది హాజరుకాబోతున్నారు.. ఇదే సమయంలో.. భారీ ఎత్తున జన సమీకరణ జరుగుతోంది.. ఓవైపు తెలంగాణలోని వివిధ జిల్లాలతో పాటు.. సరిహద్దులోని ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ప్రజలు తరలివస్తున్నారు.. దీని కోసం భారీ జన సమీకరణకు పూనుకుంది ఏపీ బీఆర్ఎస్… ఏపీఎస్ ఆర్టీసీ నుంచి బస్సులను అద్దెకు తీసుకుంది. ఒక్క విజయవాడ జోన్ పరిధిలోనే 150 బస్సులను తీసుకున్నట్టు చెబుతు్నారు.. వీటిలో ఎన్టీఆర్ జిల్లాలో 105, ఏలూరు జిల్లాలో 45 బస్సులు ఉన్నాయి. ఒక్క విజయవాడ నుంచే 70కి పైగా బస్సులను అద్దెకు తీసుకున్నారు. దీనిని బట్టి విజయవాడ నుంచి అధిక సంఖ్యలో ఖమ్మం బీఆర్ఎస్ సభకు జనాలను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.. ఇక, బీఆర్ఎస్ తొలి బహిరంగ సభకు జగ్గయ్యపేట, తిరువూరు, ఏ.కొండూరు, గంపలగూడెం, మైలవరం, జి.కొండూరు, కంచికచర్ల, నందిగామ, ఏలూరు జిల్లా నూజివీడు నుంచి భారీగా జన సమీకరణ తలపెట్టారు. ఆర్టీసీ బస్సులను తెలంగాణ బీఆర్‌ఎస్ నాయకులే మాట్లాడినట్టు తెలుస్తోంది.. ఖమ్మం వేదికగా జరిగే ఈ భారీ బహిరంగ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తోపాటు ఢిల్లీ, పంజాబ్, కేరళ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్, పినరయి విజయన్, ఎస్పీ అధినేత, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ తదితర నేతలు హాజరుకానున్నారు.. ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ అనే నినాదంతో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకుంటున్న కేసీఆర్.. చరిత్రలో నిలిచిపోయేలా సభ విజయవంతం చేసేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు..
నేడు అధికార లాంఛనాలతో చివరి నిజాం అంత్యక్రియలు
టర్కీలోని ఇస్తాంబుల్ లో ఎనిమిదో నిజాం బర్కత్ అలీఖాన్ ముకరం ఘా బహదూర్ గత శనివారం రాత్రి మరణించిన సంగతి తెలిసిందే.. ఆయన చివరి కోరిక మేరకు ఆయన అంత్యక్రియలు హైదరాబాద్ లో నిర్వహించనున్నారు. ఎనిమిదో నిజాం భౌతిక కాయాన్ని ఆయన తండ్రి అజమ్ ఘా సమాధి పక్కనే ఖననం చేయనున్నారు. ముకరం ఘా బౌతిక కాయాన్ని ఇస్తాంబుల్ నుంచి నిన్న సాయంత్రానికి ప్రత్యేక విమానంలో నగరానికి తీసుకువచ్చి.. అక్కడి నుంచి పాతబస్తీలో ఉన్న చౌమహల్లా ప్యాలెస్‌కు భౌతిక కాయాన్ని తరలించారు. ఇవాళ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సాధారణ ప్రజలకు ఆయన భౌతిక కాయాన్ని చూసే అవకాశం కల్పిస్తారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత మక్కా మసీదుకు తరలిస్తారు. ముకర్రమ్ ఝా కోరిక మేరకు ఆయన తండ్రి అజమ్ ఝా సమాధి పక్కనే అంత్యక్రియలు చేస్తారు. కాగా.. మక్కా మసీదులోనే దక్షిణ భాగంలో అజమ్ ఝా సహా అసఫ్ జాహీ కుటుంబ సభ్యుల సమాధులు ఉన్నాయి..అక్కడే ముకరం ఝా భౌతిక కాయాన్ని కూడా ఖననం చేయనున్నారు. హైదరాబాద్ ఏడవ నిజాం ఉస్మాన్ అలీఖాన్‌కు ఆజం ఝా, మౌజంఝా అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిలో 7వ నిజాం తన మొదటి కొడుకు కుమారుడైన ముకరం ఝాను 8వ నిజాంగా ప్రకటించాడు. 1971లో భారత ప్రభుత్వం కిరీటాలను రద్దు చేసే వరకు ముకరం ఝా అధికారికంగా హైదరాబాద్ యువరాజుగా పిలిచేవారు. ఇక ప్రిన్స్ ఆఫ్ హైదరాబాద్ కు నలుగురు భార్యలు, ఐదుగురు పిల్లలు ఉన్నారు. ముకరం ఝా తండ్రి ఆజాం ఝా, తల్లి దుర్రె షెహవార్.
తన కొడుకు ఘటనపై స్పందించిన బండి సంజయ్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ ఓ వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని మహేంద్ర యూనివర్సిటీలో చదువుతోన్న బండి భగీరథ్.. ఓ విద్యార్థిని తిడుతూ దాడి చేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అయితే దీనిపై తాజాగా బండి సంజయ్ స్పందించారు. బీజేపీ కార్యవర్గ సమావేశాల్లో భాగంగా ఢిల్లీలో ఉన్న ఆయన మాట్లాడుతూ.. ‘కేసీఆర్… నీకు దమ్ముంటే, నువ్వు మొగోడివైతే నాతో రాజకీయం చెయ్… నాతో చేయడం చేతగాక, తట్టుకోలేక నా కొడుకును లాగుతావా?… నీ మనువడి విషయంలో తప్పుడు వ్యాఖ్యలు చేస్తే నేనే ఖండించిన అని ఆయన అన్నారు. చిన్న పిల్లలను రాజకీయాల్లోకి లాగొద్దనే సోయి కూడా లేదా? నా కొడుకు విషయంలో ఎప్పుడో జరిగిన దానిని ఇప్పుడు తెరపైకి తీసుకొచ్చి కేసు పెట్టిస్తవా? నేను తప్పు చేశానని ఆ అబ్బాయే (దెబ్బలు తిన్న శ్రీరాం అనే విద్యార్థి) ఒప్పుకున్నడు. అయినా పిల్లలు పిల్లలు కొట్లాడుకుంటరు. మళ్లీ కలుస్తారు. మరి నీకేం నొచ్చింది? కేసు పెట్టియాల్సిన అవసరం ఏమొచ్చింది? కంప్లయింట్ ఎవరిచ్చారు? నీ రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారుతావా? నా కొడుకుతోసహా ముగ్గురు పిల్లల జీవితాలను నాశనం చేస్తావా? థూ… నీ బతుకు చెడ… ఎందుకు బతుకుతున్నవో అర్ధం కావడం లేదు’’ అంటూ బండి సంజయ్ కుమార్ సీఎం కేసీఆర్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్ లో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ మనోహర్ రెడ్డి, కోశాధికారి శాంతికుమార్ తదితరులతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తన కుమారుడిపై కేసీఆర్ ఫ్రభుత్వం కేసు నమోదు చేసిన విషయాన్ని మీడియా ప్రస్తావించగా బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు.
శ్రీశైలంలో నేటితో ముగియనున్న సంక్రాంతి బ్రహ్మోత్సవాలు
శ్రీశైలంలో ఇవాళ్టితో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.. సాయంత్రం అశ్వవాహనంపై పూజలు అందుకోనున్నారు ఆదిదంపతులు.. ఆలయంలో శ్రీస్వామి, అమ్మవారికి ఆలయ ఉత్సవం నిర్వహించనున్నారు.. రాత్రి పుష్పోత్సవం, శయనోత్సవం, ఏకాంతసేవతో సంక్రాంతి బ్రహ్మోత్సవాలకు ముగింపు పలకనున్నారు.. ఏడు రోజుల పంచాహ్నిక దీక్షతో నిత్యం శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, అలంకారాలు భక్తులను కనువిందు చేస్తున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆరవరోజు అనగా మంగళవారం ఉదయం శ్రీచండీశ్వరస్వామికి షోడశోపచార క్రతువులు చేశారు. అటుపై దేవస్థానం ఈవో లవన్న ఆధ్వర్యంలో రుద్రహోమ పూర్ణాహుతి, కళశోద్వాసన, త్రిశూలస్నానం, మహదాశీర్వచన పూజాధికాలు నిర్వహించారు.. ఇక, సంక్రాంతి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో శ్రీశైలం క్షేత్రానికి భక్తుల తాకిడి కొనసాగుతోంది.. శ్రీశైల భ్రమరాంబికా మల్లిఖార్జున స్వామి అమ్మవార్ల హుండీ ఆదాయాన్ని నిన్న లెక్కించారు. ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో పటిష్ఠ నిఘా మధ్య ఆలయ సిబ్బంది, శివసేవకులు ఉభయ దేవాలయాలు, పరివార దేవతాలయాల హుండీల్లో వచ్చిన బహుమతులు, నగదును లెక్కించి.. ఆ తర్వాత వివరాలను ప్రకటించారు.. గత 28 రోజులుగా స్వామి అమ్మవార్లకు భక్తులు చెల్లించిన మొక్కులు, కానుకలు నగదు రూపంలో రూ. 3,57,81,068 వచ్చినట్టు శ్రీశైలం ఆలయ ఈవో లవన్న వెల్లడించారు.. ఇక, 103 గ్రాముల బంగారం, 7.520 కిలోల వెండి ఆభరణాలు, 243 అమెరికా డాలర్లు, 220 యూఏఈ ధీర్హమ్‌లు, 61 సింగపూర్ డాలర్లు, 175 ఆస్ట్రేలియా డాలర్లు, 20 కెనడా డాలర్లు, 150 యూరోలు, 25 ఇంగ్లాండ్ పౌండ్లు తదితర విదేశీ కరెన్సీ సైతం భక్తులు మొక్కుల రూపంలో స్వామి అమ్మవార్లకు హుండీలో సమర్పించారిన పేర్కొన్నారు ఈవో లవన్న.. కాగా, శివరాత్రి సమయంతో పాటు సంక్రాంతి బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. మొత్తంగా ఈ నెల 12వ తేదీన శ్రీశైలంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయ్యాయి.. ఇవాళ్టితో ముగియనున్నాయి.. పంచాహ్నిక దీక్షతో ఏడు రోజులుపాటు వైభవంగా జరిగే బ్రహ్మోత్సవాల్లో భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లు ప్రతిరోజు విశేష పూజలు అందుకున్నారు.. యాగశాల ప్రవేశం, వేదస్వస్థి, శివసంకల్పం, గణపతిపూజ, పుణ్యాహవచనం, చండీశ్వరపూజ, వాస్తుహోమం, మండపారాధనలు, రుద్రకళశ స్థాపన, వేదపారాయణాలతో పాటు ప్రత్యేక పూజాధికాలు నిర్వహించారు..
హైదరాబాద్ తిరిగొచ్చిన జక్కన్న, కీరవాణి..
ఏషియన్ కాంటినెంట్ కి మాత్రమే పరిమితం అయిన ఇండియన్ సినిమాని కాదు ఎమోషన్స్ ప్రతి మనిషికీ ఒకేలా ఉంటాయి. ఈస్ట్రన్ కంట్రీ సిటిజెన్స్ కైనా, వెస్ట్రన్ కంట్రీ సిటిజెన్స్ కైనా ఎమోషన్స్ ఒకటే అని నిరూపిస్తున్నాడు రాజమౌళి. ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ఇండియన్ సినిమాని వరల్డ్ మ్యాప్ లో పెట్టిన జక్కన, ఇండియాకి ఆస్కార్ తీసుకోని వచ్చే పనిలో ఉన్నాడు. రేస్ టు ఆస్కార్స్ లో భాగంగా పోటి చేసిన ప్రతి అవార్డ్స్ ఈవెంట్ లో జెండా ఎగరేస్తున్న రాజమౌళి అండ్ టీం రీసెంట్ గా ప్రెస్టీజియస్ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ అందుకుంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నాటు నాటు సాంగ్ కి గాను మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గోల్డెన్ గ్లోబ్ అవార్డుని గెలుచుకున్నారు. ఈ అవార్డ్ అందుకున్న మొదటి ఏషియన్ సినిమాగా ఆర్ ఆర్ ఆర్ చరిత్రకెక్కింది. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఈవెంట్స్ లో ఆర్ ఆర్ ఆర్ సినిమాని ప్రమోట్ చేస్తున్న రాజమౌళి గోల్డెన్ గ్లోబ్ అందుకున్న తరువాత తొలిసారి హైదరాబాద్ కు తిరిగొచ్చాడు. రాజమౌళి, కీరవాణి ఫ్యామిలీతో పాటు హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సంధర్భంగా “చాలా హ్యాపీగా ఉంది, అందరికి థాంక్స్. కొంచం అన్ హెల్తీగా ఉంది. తరువాత మాట్లాడుకుందాం..” అని రాజమౌళి మాట్లాడాడు. ఒకటి రెండు రోజులు రెస్ట్ తీసుకోని రాజమౌళి అండ్ టీం, ఒక ప్రెస్ మీట్ కానీ పార్టీ కానీ జరిపి మీడియాతో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ కొన్ని రోజులు ఉండి జనవరి 24న ఆస్కార్ ఫైనల్ నామినేషన్స్ అనౌన్స్మెంట్ లిస్టులో ఆర్ ఆర్ ఆర్ సినిమా ఉంటే అప్పుడు జక్కన అండ్ టీం తిరిగి లాస్ ఏంజిల్స్ వెళ్తారు.
తాతకి నివాళులర్పించిన ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్…
దివంగత ముఖ్యమంత్రి, విశ్వవిఖ్యాత నటుడు, స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు 18 జనవరి 1996లో మరణించారు. ఆ మహానాయకుడి 27వ వర్ధంతిని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు నివాళులు అర్పించారు. ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు ఈరోజు తెల్లవారుజామునే ఘాట్ వద్దకు చేరుకున్న తాత సమాధిపై పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులు అర్పించారు. ఇతర కుటుంబ సభ్యులు, కొందరు అభిమానులు కూడా ఎన్టీఆర్ ఘాట్ చేరుకోని నివాళులు అర్పించారు. తెలంగాణా, ఆంధ్ర రాష్ట్రాలలోని తెలుగు దేశం యువత కూడా ఎన్టీఆర్ విగ్రాహాలకి పూల మాలలు వేసి తమ అభిమాన నాయకుడిని స్మరించుకుంటున్నారు.
నేడు ఉప్పల్ వేదికగా తలపడనున్న న్యూజిలాండ్-ఇండియా
నేడు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా న్యూజిలాండ్-ఇండియా జట్లు తలపడనున్నాయి. ఇప్పటికే శ్రీలంకపై వన్డే, టీ20 గెలిచి విజయోత్సాహంతో ఇండియా ఉంది. ఈ వరుస విజయాలతో ఫుల్ జోష్ మీదున్న భారత్ ఇప్పుడు న్యూజిలాండ్‌తో మూడు వన్డేలు, మూడు టీ20ల సమరానికి సిద్ధమైంది. మరోవైపు పాకిస్తాన్‌పై వన్డే సిరీస్ గెలిచి న్యూజిలాండ్ కూడా జోరుమీదుంది. అయితే.. నేడు ఉప్పల్‌లో కివీస్-భారత్‌ల మధ్య తొలి వన్డే మ్యాచ్ మధ్యాహ్నం 1.30గంటలకు ప్రారంభం కానుంది. అయితే.. వన్డేల్లో, టీ20ల్లోనూ కివీస్ పై భారత్ పైచేయిగా ఉంది. మరి నేడు తొలి మ్యాచ్ గెలిచి సిరీస్ లో బోణీ ఎవరు కొట్టనున్నారో చూడాలి మరీ.. రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్య (వైస్ కెప్టెన్), శుబ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, కేఎస్ భరత్, రజత్ పాటిదార్, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్,శార్దూల్ ఠాకూర్, యుజ్వేంద్ర చాహల్, కుల్‌దీప్ యాదవ్,మహమ్మద్ షమి, మహమ్మద్ సిరాజ్,ఉమ్రాన్ మాలిక్. టామ్ లాథమ్ (కెప్టెన్), ఫిన్ అలెన్, డగ్ బ్రేస్‌వెల్, మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, జాకబ్ డఫీ, లాకీ ఫెర్గూసన్, డారిల్ మిచెల్, హెన్రీ నికోల్స్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ శాంట్నర్, హెన్రీ సో షిప్లెన్, బ్లెయిర్ టిక్నర్.