ఇవాళ హైదరాబాద్‌కు మూడు రాష్ట్రాల సీఎంలు..
కేరళ, ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు నేడు హైదరాబాద్ రానున్నారు. జనవరి 18న జరగనున్న బీఆర్ఎస్ బహిరంగ సభలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంతన్ ఖమ్మం పాల్గొననున్నారు.యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ కూడా ఈరోజు హైదరాబాద్ చేరుకోనున్నారు. వీరంతా రేపు ఉదయం సీఎం కేసీఆర్‌తో కలిసి ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రికి వెళ్లనున్నారు. స్వామివారి దర్శనానంతరం అందరూ ఖమ్మం సభకు బయలుదేరారు. ఖమ్మంలో తొలి బీఆర్‌ఎస్ సమావేశానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సభను రహస్యంగా నిర్వహించనున్నారు. బహిరంగ సభలో ఏర్పాట్లను మంత్రి హరీశ్ రావు, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, తుమ్మల నాగేశ్వర్ ఇప్పటికే పరిశీలించారు. బీఆర్ఎస్ ముఖ్య నేతలంతా ఇవాళ హైదరాబాద్ చేరుకోనున్నారు. దాంతో 400 ఎకరాల్లో వాహనాల పార్కింగ్ ఏర్పాటు చేశారు. అంతేకాదు ఈ సమావేశంలో వెయ్యి మంది వాలంటీర్లను నియమించారు.
షార్ సెంటర్‌లో ఆత్మహత్యల కలకలం..
శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లో వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి.. 24 గంటల వ్యవధిలోనే ఇద్దరు సీఐఎస్‌ఏఫ్ ఉద్యోగులు ఆత్మహత్య చేసుకోవడంతో.. అసలు షార్ సెంటర్‌లో ఏం జరుగుతోంది? అనే ఆందోళన మొదలైంది.. అయితే, ఈ ఘటనలను సీరియస్‌గా తీసుకున్న అధికారులు.. ఆత్మహత్యలపై విచారణ చేపట్టారు.. చెట్టుకు ఊరివేసుకుని ఛత్తీస్‌గఢ్‌కు చెందిన కానిస్టేబుల్ చింతామణి ఆత్మహత్య చేసుకున్నారు.. 29 ఏళ్ల చింతామణి 2021లో కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారు.. శిక్షణానంతరం శ్రీహరికోటలోని యూనిట్‌లో విధులు నిర్వహిస్తున్నాడు.. నెలరోజుల పాటు దీర్ఘకాలిక సెలవుపై సొంతూరుకు వెళ్లి ఈ నెల 10న తిరిగి వచ్చిన చింతామణి.. నిన్న ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇక, నిన్న సాయంత్రం షార్ మొదటి గేటువద్ద కంట్రోల్ రూమ్‌లో విధుల్లో ఉన్న బీహార్ కు చెందిన సబ్ ఇన్స్పెక్టర్ వికాస్ సింగ్.. గన్ తో తలపై కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు.. ఇతనికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.. ఒకే రోజు ఇద్దరు ఆత్మహత్య చేసుకోవడంతో సహచరుల్లో ఆందోళన మొదలైంది.. చింతామణి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి చేసిన స్వగ్రామానికి తరలించారు అధికారులు.. ఇవాళ ఉదయం పది గంటలకు వికాస్ సింగ్ మృతదేహానికి కూడా పోస్టుమార్టం నిర్వహించనున్నారు.. అయితే, ఈ ఇద్దరు ఒకేరోజు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం ఏంటి? వ్యక్తిగత సమస్యలా..? లేదా డ్యూటీపరమైన ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? అనే విషయాలపై కూడా ఫోకస్ పెట్టారు పోలీసులు..
ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు..
టీడీపీ సీనియర్ నేత, బెజవాడ ఎంపీ కేశినేని నాని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఎన్నికల్లో పోటీపై కీలక వ్యాఖ్యలు చేశారు.. పార్టీలతో నాకు పని లేదు.. ప్రజలు కోరుకుంటే నన్ను ఇండిపెండెంటుగా గెలిపిస్తారు.. చంద్రబాబు టిక్కెట్ ఇవ్వకుంటే ఏమవుతుంది..? అంటూ హాట్ కామెంట్లు చేశారు.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని నేనెక్కడా చెప్పలేదన్న ఆయన.. ప్రధాని నరేంద్ర మోడీని నిండు సభలో వ్యతిరేకించా.. అయినా బెజవాడలో పనులు ఆగాయా..? దటీజ్ కేశినేని నాని అంటూ వ్యాఖ్యలు చేశారు.. నన్ను.. నా పర్సనాల్టీని డీగ్రేడ్ చేయాలని చూడొద్దు.. నన్ను డీ-గ్రేడ్ చేయాలని చూస్తే.. అంతగా నా పర్సనాల్టీని పెరుగుతుందన్నారు. 2013కు ముందు టీడీపీ నుంచి వైసీపీలోకి వలసలు ఎక్కువ ఉండేవి.. చంద్రబాబు నాయకత్వం మీద నమ్మకంతో నేను టీడీపీలో చేరాను.. నేను 2013లో టీడీపీలో చేరాకే వైసీపీలోకి వలసలు ఆగాయని చెప్పుకొచ్చారు. టాటా ట్రస్టుతో కలిసి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించానని తెలిపారు ఎంపీ కేశినేని నాని.. వంద చీరలు పంచి.. పది ట్రై సైకిళ్లు పంచి కొందరు దాన కర్ణుడులాగా కలర్ ఇస్తున్నారని.. ఈ దాన కర్ణుల చరిత్రేంటో..? ఎక్కడి నుంచి ఊడిపడ్డారో చరిత్ర చూడండి.. ఎన్నికలనగానే వస్తారు.. ఫౌండేషన్ అంటారు.. సేవా కార్యక్రమాలంటారు.. వీరికి డబ్బులెక్కడి నుంచి వచ్చాయో ఇన్వెస్టిగేట్ చేయండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో పేదొళ్లకు డబ్బులిస్తారు.. జిందాబాద్ లు.. జైజైలు కొట్టించుకుంటారు.. ఇదేనా రాజకీయం అంటూ నిలదీశారు. ఓ చిన్న మాట కోసం నా వ్యాపారాలు వదిలేసుకున్నా అని గుర్తుచేసుకున్నారు.. ఈస్ట్ కోస్ట్, వెస్ట్ కోస్ట్, సెంట్రల్ ఇండియాను బస్సుల వ్యాపారంలో నేను కింగ్ అని.. ఎంపీగా మాట్లాడుతున్నారా..? ఆపరేటరుగా మాట్లాడుతున్నారా..? అన్నందుకు నేను వ్యాపారం వదిలేసుకున్నాను అన్నారు.. లోఫర్లు.. ల్యాండ్ గ్రాబర్లు వచ్చి ఏదో చేస్తే.. ప్రొజెక్షన్ ఇస్తున్నారు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు ఎంపీ కేశినేని నాని.. అయితే, బెజవాడ ఎంపీ చేసిన తాజా కామెంట్లు మరోసారి టీడీపీలో కాకరేపుతున్నాయి. పార్టీ అధిష్టానం ఈ వ్యవహారంలో ఎలా స్పందిస్తుందో చూడాలి.
నేడు మాస్టర్ ప్లాన్ బాధిత రైతుల అత్యవసర సమావేశం..
కామారెడ్డి జిల్లా మళ్లీ వేడక్కనుంది. ఇవాళ మాస్టర్ ప్లాన్ బాధిత రైతుల అత్యవసర సమావేశం నిర్వహించనుంది. పాత రాజం పేట పోచమ్మ ఆలయం వద్ద విలీన గ్రామల రైతులు సమావేశం కానున్నారు. భవిష్యత్ కార్యాచరణపై రైతు జే.ఏ.సి. కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈ నెల 20 లోపు మున్సిపల్ కౌన్సిలర్లు రాజీనామా చేయాలని డెడ్ లైన్ పెట్టుకున్నారు. మాస్టర్ ప్లాన్ రద్దు చేసే వరకు పోరాటం కొనసాగించాలని, ఉద్యమం ఉదృతం చేసేలా మాస్టర్ ప్లాన్ బాధిత రైతులు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌కు వ్యతిరేకంగా రైతు జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో పండగ వాతావరణం చోటుచేసుకున్నా తరుణంలో ఇంటింటా బోగి మంటలు వేసుకుని ఆనందాన్ని గడుపుతున్నా కానీ.. భోగి రోజుకూడా కామారెడ్డి రైతన్నలు భగ్గు మన్నారు. ముగ్గులు వేసి వినూత్న నిరసనలు చేపట్టారు. మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని కోరుతూ ముగ్గులతో మహిళలు నిరసన తెలిపారు. మాస్టర్ ప్లాన్ హఠా వో.. కామారెడ్డి బచావో వ్యవసాయం నిలవాలి, రైతు గెలవాలి అంటూ నినాదాలు చేసి పండుగ రోజుకూడా నిరసలు చేపట్టారు. ఈ నెల 5న చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తంగా మారడం అనివార్యమైంది. ఎల్లారెడ్డికి చెందిన రైతు రాములు ఆత్మహత్య తర్వాత ఆందోళన తీవ్ర రూపం దాల్చింది. మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ మాత్రమేనని జిల్లా కలెక్టర్ ప్రకటించారు. దీంతో వారం రోజుల పాటు ఆందోళనలు వాయిదా పడ్డాయి. మరోవైపు రైతులు తమ నిరసనను ఇంకా కొనసాగిస్తున్నారు.
లవర్‌తో గడిపేందుకు కిడ్నాప్ స్కెచ్.. భార్య ఎంట్రీతో బట్టబయలు..
ప్రేమకు హద్దులు లేవని చాలా మంది అంటుంటారు. లవ్‌బర్డ్‌లు ఒకరితో ఒకరు సమయం గడపడానికి ఎంతకైనా తెగించే సందర్భాలు కూడా మనకు కనిపిస్తాయి. చాలా మంది ట్యూషన్ నుంచి తప్పించుకుని తల్లిదండ్రులకు అబద్ధం చెప్పి కలుస్తూ ఉంటారు. చాలా మంది వ్యక్తులు తమ భాగస్వాములతో ప్రత్యేక సందర్భాలను గడపాలని కోరుకుంటారు. ఆస్ట్రేలియాకు చెందిన ఒక వ్యక్తి తన నూతన సంవత్సర వేడుకలను తన భార్యతో గడపడానికి ఇష్టపడలేదు. తను ఇష్టపడిన ప్రియురాలితో గడపాలని అనుకున్నాడు. దీని కోసం ఓ ప్రణాళికను రచించాడు. తన భాగస్వామికి బదులు ప్రియురాలితో గడిపేందుకు తన సొంత కిడ్నాప్ కథను రూపొందించాడు. కానీ చివరికి చిక్కుల్లో పడ్డాడు. 35 ఏళ్ల పాల్ ఐరా తన ప్రేమికురాలైన మరో మహిళతో నూతన సంవత్సర వేడుకలను గడపడానికి కిడ్నాప్ నాటకాన్ని ఆడాడు. ఆ వ్యక్తి డిసెంబర్ 31న తన ఆర్థిక సలహాదారుడిని కలవడానికి వెళ్తున్నానని భార్యకు చెప్పి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అనంతరం తనను ఓ సెక్స్ వర్కర్ కిడ్నాప్ చేశాడని తన భార్యకు మెస్సేజ్ పంపించాడు. దానిని నమ్మి ఆమె వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. వెంటనే పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. ఊహించని విధంగా, అతను రాత్రిపూట బ్యాగ్‌తో తన ప్రేమికురాలి ఇంట్లోకి ప్రవేశించడాన్ని వారు కనుగొన్నారు.
కాలిఫోర్నియాలో కాల్పులు..
అమెరికాలోని కాలిఫోర్నియాలో మళ్లీ కాల్పులు చోటు చేసుకున్నాయి. గన్ కల్చర్ అమెరికాలో మరోసారి సామాన్యపౌరుల ప్రాణాలు తీసింది. కాలిఫోర్నియాలోని ఓ ఇంటిపై సోమవారం తెల్లవారుజామున ముష్కరులు జరిపిన కాల్పుల్లో ఆరు నెలల పాప, ఆమె తల్లితో సహా ఆరుగురు మరణించినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఈ కాల్పులు మాదకద్రవ్యాల ముఠాతో ముడిపడి ఉండొచ్చని తులారే కౌంటీ షెరీఫ్ కార్యాలయానికి చెందిన షెరీఫ్ మైక్ బౌడ్రేక్స్ వివరించారు. సోమవారం తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు అనేకసార్లు కాల్పులు జరిపి ఇంటిపై దాడి చేసినట్లు తాము భావిస్తున్నామని పోలీసులు తెలిపారు. ‘‘ఈ దారుణానికి పాల్పడిన ఇద్దరు అనుమానితుల కోసం గాలిస్తున్నాం. ఈ హత్యలకు ముఠాలతో సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఉద్దేశపూర్వకంగా చేసి ఉండొచ్చు’’ అని పోలీసులు తెలిపారు. ఇద్దరు వ్యక్తులు భవనం లోపల దాక్కుని దాడి నుంచి బయటపడ్డారు. అయితే చాలా మంది క్షతగాత్రులకు స్థానికులు అత్యవసర వైద్య సహాయం అందించారు. క్షతగాత్రులలో ఒకరు ఆసుపత్రికి తరలించిన కొద్దిసేపటికే మృతి చెందారు. ఈ దాడి డ్రగ్స్‌కు సంబంధించిందని అని షెరీఫ్ తెలిపారు. ఇది యాదృచ్ఛికంగా జరిగిన చర్య కాదని.. కావాలనే ఆ కుటుంబాన్ని టార్గెట్ చేసి కాల్పులు జరిపినట్లు తాము భావిస్తున్నామన్నారు. యునైటెడ్ స్టేట్స్‌లో 2021లో తుపాకీ కాల్పుల వల్ల సుమారు 49,000 మంది మరణించారు. దేశంలో ప్రజల కంటే ఎక్కువ ఆయుధాలు ఉన్నాయి. ముగ్గురిలో ఒకరు కనీసం ఒక ఆయుధాన్ని కలిగి ఉంటారు.
అబ్దుల్ రెహ్మాన్ మక్కీ గ్లోబల్ టెర్రరిస్ట్.. ఐక్యరాజ్యసమితి ప్రకటన
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యూఎన్‌ఎస్‌సీ) సోమవారం పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాది అబ్దుల్ రెహ్మాన్ మక్కీని ఐఎస్‌ఐఎల్ (దాయెష్), అల్-ఖైదా ఆంక్షల కమిటీ కింద గ్లోబల్ టెర్రరిస్ట్‌గా జాబితా చేసింది. అబ్దుల్ రెహ్మాన్ మక్కీని గ్లోబల్ టెర్రరిస్ట్‌గా ప్రకటించాలని గత ఏడాది ఐక్యరాజ్య సమితిలో భారత్ ప్రతిపాదించింది. అయితే అందుకు చైనా అడ్డుపడిన విషయం విధితమే. భారతదేశం, అమెరికా ఇప్పటికే తమ దేశీయ చట్టాల ప్రకారం మక్కీని ఉగ్రవాది జాబితాలో చేర్చాయి. తాజాగా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి మక్కీని గ్లోబల్ టెర్రరిస్ట్‌గా ప్రకటించింది. జూన్ 2022లో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో 1267 కమిటీ అని కూడా పిలువబడే ఆంక్షల కమిటీ కింద టెర్రరిస్ట్ అబ్దుల్ రెహ్మాన్ మక్కీని జాబితా చేయాలనే ప్రతిపాదనను నిరోధించిన తర్వాత భారతదేశం చైనాను నిందించింది. లష్కరే తోయిబా చీఫ్, ముంబయి దాడుల సూత్రధారి అయిన హఫీజ్ సయీద్ బావ అయిన అబ్దుల్ రెహ్మాన్ మక్కీని గ్లోబల్ టెర్రరిస్టుగా ప్రకటించింది. ఎల్‌ఈటీ కార్యకలాపాల కోసం నిధుల సేకరణలో కూడా మక్కీ కీలక పాత్ర పోషించారు.ఐక్యరాజ్యసమితి గ్లోబల్ టెర్రరిస్టుగా ప్రకటించాక వారి ఆస్తులను స్తంభింప చేయడంతో పాటు ప్రయాణ నిషేధం విధించారు. గ్లోబల్ టెర్రరిస్టు అయిన అబ్దుల్ రెహ్మాన్ మక్కీ జమ్మూకశ్మీరులో ఉగ్ర దాడులకు నిధులను సేకరించడంతోపాటు యువతను ఉగ్రదళాల్లోకి రిక్రూట్ మెంట్ చేశాడని వెల్లడైంది. 2020వ సంవత్సరంలో పాకిస్థాన్ ఉగ్రవాద నిరోధక న్యాయస్థానం అబ్దుల్ రెహ్మాన్ మక్కీ ఉగ్రవాద ఫైనాన్సింగ్ కేసులో జైలు శిక్ష విధించింది. గతంలో, ముఖ్యంగా పాకిస్తాన్ నుంచి తెలిసిన టెర్రరిస్టుల జాబితాకు చైనా అడ్డంకులు పెట్టింది. పాకిస్తాన్ ఆధారిత యూఎన్ నిషేధించిన ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మహ్మద్ (JeM) చీఫ్ మౌలానా మసూద్ అజార్‌ను నిషేధించాలన్ని ప్రతిపాదనలను అది పదేపదే అడ్డుకుంది.
టీం ఇండియా ఆటగాళ్లతో యంగ్ టైగర్ ఎన్టీఆర్…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రిస్మస్ సమయంలో ఫారిన్ వెళ్లాడు. అప్పటి నుంచి ఫ్యామిలీతో పాటు అమెరికాలో టైం స్పెండ్ చేస్తున్నాడు ఎన్టీఆర్. క్రిస్మస్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లాస్ ఏంజిల్స్ లోనే సెలబ్రేట్ చేసుకున్న ఎన్టీఆర్, ఇటివలే గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఈవెంట్ కి రాజమౌళి, రామ్ చరణ్, కీరవాణిలతో కలిసి అటెండ్ అయ్యాడు. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నాటు నాటు సాంగ్ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ గెలుచుకోవడంతో, ఇంటర్నేషనల్ మీడియాలో ఆర్ ఆర్ ఆర్ హాట్ టాపిక్ అయ్యింది. దీంతో చరణ్, ఎన్టీఆర్ లు వెస్ట్రన్ మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు. గోల్డెన్ గ్లోబ్ ఈవెంట్ లో మార్వెల్ సినిమాలో ఛాన్స్ గురించి మాట్లాడిన ఎన్టీఆర్, “వన్ కాల్ అవే” అని చెప్పాడు. ఈ మాట సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఎన్టీఆర్ ‘బ్లాక్ పాంథర్’ క్యారెక్టర్ లో నటిస్తే బాగుంటుందనే కామెంట్స్ వినిపించాయి. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఈవెంట్ కంప్లీట్ అవ్వడంతో ఎన్టీఆర్ ఇండియాకి తిరిగొచ్చాడు. ఎక్కడ కలిసారు అనే విషయంలో క్లారిటీ లేదు కానీ ఎన్టీఆర్ ఇండియా తిరిగొచ్చిన తర్వాత ఇండియన్ స్టార్ క్రికెటర్స్ తో కలిసి దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో సూర్య కుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, యుజివిందర్ చాహల్, శార్దుల్, శుభమాన్ గిల్ లు ఉన్నారు. ఎన్టీఆర్ వైట్ టీషర్ట్ లో ఉన్న ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తోంది. ఫోటోల్లో కాస్త క్లారిటీ మిస్ అవ్వడంతో ఎన్టీఆర్ ఫాన్స్, HD ఫోటోస్ ని పోస్ట్ చెయ్యండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇంతకీ ఎన్టీఆర్ హైదరాబాద్ ఎప్పుడు తిరిగి వస్తాడు? ఎన్టీఆర్ 30 పనులు ఎప్పుడు మొదలుపెడతాడు? రెగ్యులర్ షూటింగ్ ఎప్పటినుంచి జరుగుతుంది అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది?