నేడు సొంత జిల్లాకు సీఎం జగన్.. స్టీల్ ప్లాంట్‌కు భూమి పూజ…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఇవాళ తన సొంత జిల్లా కడపలో పర్యటించనున్నారు.. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తోన్న స్టీల్ ప్లాంట్‌కు ఇవాళ భూమిపూజ చేయనున్నారు.. సున్నపురాళ్ళపల్లెలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ప్లాంటుకు భూమిపూజ చేస్తారు. అలాగే పులివెందులలో ఓ శుభకార్యంలో పాల్గొననున్నారు.. కడప జిల్లా పర్యటన కోసం ఇవాళ ఉదయం 9 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయల్దేరి ఉదయం 10.50 గంటలకు జమ్ములమడుగు మండలం సున్నపురాళ్ళపల్లె చేరుకుంటారు. ఇక, ఉదయం 11.10 – 11.30 జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ప్లాంటుకు సంబంధించి భూమిపూజ కార్యక్రమంలో జేఎస్‌డబ్ల్యూ గ్రూపు చైర్మన్ సజ్జన్ జిందాల్‌తో కలిపి పాల్గొంటారు సీఎం జగన్.. అలాగే శిలాఫలకాల ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుంది. ఉదయం 11.45 – 12.45 మధ్య స్టీల్ ప్లాంటు మౌలిక సదుపాయాలపై సమావేశం నిర్వహిస్తారు. ఇక, ఆ తర్వాత మధ్యాహ్నం 1.20 గంటలకు అక్కడినుంచి బయలుదేరి మధ్యాహ్నం 1.40కి పులివెందుల చేరుకుంటారు సీఎం వైఎస్ జగన్.. మధ్యాహ్నం 2 – 2.15 గంటల మధ్య పులివెందుల ఎస్‌సీఎస్‌ఆర్ ఫంక్షన్ హాల్‌లో జరిగే మూలి బలరామిరెడ్డి కుమారుని వివాహ రిసెప్షన్ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు ఏపీ సీఎం.. మధ్యాహ్నం 2.40 గంటలకు పులివెందుల నుంచి బయలుదేరి సాయంత్రం 4.30 గంటలకు తిరిగి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.
నేడు టీటీడీ పాలకమండలి సమావేశం.. రూ.3500 కోట్లతో వార్షిక బడ్జెట్..!
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి ఈ రోజు సమావేశం కాబోతోంది.. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన అన్నమయ్య భవన్‌లో సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోవడంతో పాటు.. వార్షిక బడ్జెట్‌కు కూడా ఆమోదం తెలపనున్నారు. 398 అంశాల అజెండాపై నిర్ణయం తీసుకోనుంది పాలకమండలి.. ఇక, రూ.3,500 కోట్ల అంచనాతో 2023-24 వార్షిక బడ్జెట్‌కి ఆమోదం తెలపనున్నారు.. ఇక, అలిపిరి వద్ద స్పిర్య్టూవల్ సిటీ నిర్మాణానికి రూ.120 కోట్లు కేటాయించనుంది టీటీడీ.. లడ్డూ పోటు యాంత్రికరణ అంశంపై కూడా నిర్ణయం తీసుకోనున్నారు. తమిళనాడులోని ఉల్లందురుపేట, యానంలో టీటీడీ ఆలయ నిర్మాణానికి నిధులు కేటాయింపుపై కూడా నిర్ణయం తీసుకోనుంది పాలకమండలి. లడ్డూ కౌంటర్ల పెంపుదలపై నిర్ణయం తీసుకోబోతోంది టీటీడీ. కాగా, తిరుపతి సమీపంలోని అలిపిరి – చెర్లోపల్లి మార్గంలో తలపెట్టిన స్పిరిచ్యువల్ సిటీలో దాదాపు 50 వేల మంది భక్తులకు ఒకే చోట వసతి కల్పించేవిధంగా వసతిగృహ సముదాయం నిర్మించే విధంగా టీటీడీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.. అలాగే తమిళనాడులోని ఉలందూరు పేటలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి సంబంధించి రూ.4 కోట్లు, యానాంలో శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి రూ.3 కోట్లు నిధులను మంజూరుకు ఆమోదం తెలపనున్నారు.. తిరుమలలో భక్తుల సౌకర్యార్థం లడ్డూ ప్రసాదాల పంపిణీకోసం మరిన్ని కౌంటర్లను ఏర్పాటు చేయనున్నారు. 8 కాటేజీల పునర్నిర్మాణం కోసం ఈ టెండర్ విధానంపై చర్చించనుంది టీటీడీ పాలకమండలి..
కొట్టుకున్న కోటంరెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ వర్గీయులు.. కత్తి పోట్లు
నెల్లూరు జిల్లా రాజకీయాలు అసలే కాకమీదున్నాయి.. వైసీపీ నేతలు, తిరుగుబాటు నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది.. అదికాస్తా ఇప్పుడు దాడుల వరకు వెళ్లింది.. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల తర్వాత ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగిపోయింది.. ఇప్పుడు అది ఘర్షణ వరకు వెళ్లింది.. నెల్లూరు బారా షాహిద్ దర్గా ప్రాంతంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుఇంది.. ఈ ఘటనలో సమీర్ ఖాన్ అనే వ్యక్తి కత్తి పోట్లకు గురయ్యారు.. ఇక, వెంటనే అతడిని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.. ప్రస్తుతం సమీర్ ఖాన్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక, ఈ ఘటనలో కోటంరెడ్డి వర్గీయుడు సయ్యద్, సమీ, హుస్సేన్ తో పాటు మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని చెబుతున్నారు.. మరోవైపు, రెండు వర్గాల ఘర్షణలు, ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో.. పోలీసులు భారీగా మోహరించారు. అసలు ఘర్షణ ఇరు వర్గాల మధ్య ఎందుకు చోటుచేసుకుంది.. వివాదానికి కారణం ఏంటి? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
21 నుంచి యాదగిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు..
యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహ స్వామి వార్సిక బ్రహ్మోత్సవాలు ముహూర్తం ఖరారైంది. ఈనెల 21 మాఘ శుద్ధ పాడ్యమిన స్వస్తివాచనం, అంకురారోపణం, విశష్వక్సేనారాధన, రక్షాబంధనంతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. మార్చి 3వరకు అత్యంత వైభవోపేతంగా సాగే వేడుకల్లో 27న ఎదుర్కోలు, 28న స్వామివారి తిరుకల్యాణోత్సవం, మార్చి ఒకటిన దివ్య విమాన రథోత్సవం నిర్వహించనున్నారు. నాలుగు రోజులపాటు అలంకార సేవలు చేపట్టనున్నారు. కల్యాణోత్సవంలో సీఎం కేసీఆర్ దంపతులు పాల్గొని.. రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామి, అమ్మవారికి పట్టువస్ర్తాలు సమర్పించనున్నారు. కేసీఆర్ సంకల్పంతో రూ.1,250 కోట్లతో మహాద్భుతంగా రూపుదిద్దుకున్న ప్రధానాలయం పునఃప్రారంభం అనంతరం వస్తున్న తొలి బ్రహ్మోత్సవాలు అవడంతో కనీవినిఎరుగని రీతిలో నిర్వహించనున్నట్లు ఆలయ ఇన్‌చార్జి ఈఓ రామకృష్ణారావు తెలిపారు. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.1.50 కోట్ల నిధులు కేటాయించినట్లు వెల్లడించారు. కల్యాణోత్సవాన్ని గతంలో మాదిరి కాకుండా ఈసారి కొండపైన తిరుమాఢవీధుల్లో నిర్వహించనున్నట్లు చెప్పారు. పది వేల మంది భక్తులు కూర్చుని వీక్షించే విధంగా ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. ఇక ప్రధానాలయం ప్రాంగణంలోనే స్వామి, అమ్మవార్ల తిరు కల్యాణోత్సవం చేపట్టనున్నారు.
ఫారిన్ తీసుకెళ్తానని చెప్పి.. డాక్టర్లకే పంగనామాలు పెట్టాడు..
విదేశీ ప్రయాణ ప్యాకేజీలు ఇప్పిస్తానంటూ పలు రాష్ట్రాల్లో వందలాది మంది వైద్యులను మోసం చేసి కోట్లాది రూపాయలను దోచుకున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఉత్తరప్రదేశ్ పోలీసులు మంగళవారం తెలిపారు. ప్రముఖ ఫార్మాస్యూటికల్ కంపెనీకి మెడికల్ రిప్రజెంటేటివ్‌గా గుర్తించిన నిందితుడిని పశ్చిమ బెంగాల్‌కు చెందిన సైబర్ క్రైమ్ బృందం నోయిడా యూనిట్ అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. నోయిడాలోని నోయిడా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ ఇన్‌స్పెక్టర్ రీటా యాదవ్ మాట్లాడుతూ.. విశాల్ పాండే (31)పై గ్రేటర్ నోయిడాకు చెందిన ఒక వైద్యుడు తన వద్ద రూ.18.72 లక్షల మోసం చేశాడని ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. “విశాల్ పాండే ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటికల్స్‌లో ఎఫ్‌ఎస్‌ఓగా పనిచేశాడు. కానీ 2017లో నోట్ల రద్దు తర్వాత ఉద్యోగం కోల్పోయాడు. అతను బనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రుడయ్యాడు. అనంతరం ఎంబీఏ కూడా చేశాడు. అతను పశ్చిమ బెంగాల్‌లోని బర్ద్‌మాన్ జిల్లాకు చెందినవాడని రీటా యాదవ్ వెల్లడించారు.
తేజస్ జెట్ కొనుగోలుకు ముందుకొచ్చిన ఈజిప్ట్, అర్జెంటీనా.. భారత్ చర్చలు
అర్జెంటీనా, ఈజిప్ట్‌లు భారత్ స్వయంగా అభివృద్ధి చేసిన లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (LCA) తేజస్‌ను కొనుగోలు చేయడంలో ఆసక్తిని కనబరచడంలో అనేక ఇతర దేశాలలో చేరాయి. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) ఛైర్మన్ సీబీ అనంతకృష్ణన్ మంగళవారం ఏరో ఇండియా-2023 ప్రదర్శన సందర్భంగా మాట్లాడుతూ.. తేజస్ విమానాల సరఫరా కోసం అర్జెంటీనా, ఈజిప్ట్ రెండింటితో భారత్ చర్చలు జరుపుతోందని చెప్పారు. ఈజిప్టుకు 20 విమానాల అవసరం ఉందని, అర్జెంటీనా 15 ఫైటర్ జెట్‌లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిందని ఆయన అన్నారు. అమెరికా, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్ దేశాలు కూడా తేజస్ విమానాలపై ఆసక్తి చూపుతున్నాయి. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(HAL)చే తయారు చేయబడిన తేజస్ ఒక సింగిల్-ఇంజిన్ మల్టీ-రోల్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్.. ఇది అధిక-ప్రమాదకరమైన గాలి వాతావరణంలో పనిచేయగలదు. ఫిబ్రవరి 2021లో, భారత వైమానిక దళం కోసం 83 తేజస్ తేలికపాటి యుద్ధ విమానాల కొనుగోలు కోసం రక్షణ మంత్రిత్వ శాఖ హెచ్‌ఏఎల్‌తో రూ.48,000 కోట్ల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈజిప్టు కూడా ఎంఆర్‌వో (మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్‌హాల్) సదుపాయాన్ని కలిగి ఉండటానికి ఆసక్తిగా ఉందని, ఏరోస్పేస్ పర్యావరణ వ్యవస్థను నిర్మించడానికి ఆ దేశానికి భారతదేశం మద్దతు ఇవ్వాలనుకుంటుందని అనంతకృష్ణన్ అన్నారు. అర్జెంటీనా వైమానిక దళానికి చెందిన రెండు బృందాలు హెచ్‌ఏఎల్‌ని సందర్శించి, ఎల్‌సీఎలో ప్రయాణించాయని ఆయన చెప్పారు.
ఏడుగురి తర్వాత.. ఒకే కాన్పులో ఐదుగురు పిల్లలకు జననం
మహిళలు కవల పిల్లలకు జన్మనివ్వడం సాధారణ విషయమే, కొందరు మహిళలు ఒకే సారి ముగ్గురు లేదా నలుగురు పిల్లలకు జన్మనిస్తుంటారు. అయితే ఓ మహిళ ఒకే కాన్పులో ఐదుగురు పిల్లలకు జన్మనిచ్చింది. ఈ విషయం తెలిసిన వారు షాక్ అవుతున్నారు. పోలాండ్‌లోని క్రాకో నగరంలో ఓ ఆస్పత్రిలో ఓ మహిళ ఒకే కాన్పులో ఐదుగురు శిశువులకు జన్మనిచ్చింది. ఇప్పటికే ఏడుగురు పిల్లలు ఉన్న పోలిష్-బ్రిటీష్ తల్లిదండ్రులు ప్రేమికుల దినోత్సవం రోజునే ఐదుగురు శిశువులను స్వాగతించారు. తాను ఆరోగ్యంగా ఉన్నట్లు తల్లి మంగళవారం చెప్పింది. డొమినికా క్లార్క్‌కు ఇప్పటికే 10 నెలల నుంచి 12 ఏళ్ల వయస్సు గల ఏడుగురు పిల్లలు ఉన్నారు. ఆమె మరో ఐదుగురు పిల్లలకు జన్మనిచ్చింది. తాము ఎనిమిదో బిడ్డను కనాలని ప్లాన్ చేశాం.. కానీ కడుపులో ఇంకా ఎక్కువ మంది ఉన్నారని ప్రసవానికి ముందు ఆమె తన భర్త విన్స్‌తో కలిసి ఆస్పత్రిలో విలేకరులతో అన్నారు. పిల్లలు 29 వారాలకు సిజేరియన్ ద్వారా ప్రసవించబడ్డారు. ఆ పిల్లలకు కృత్రిమ శ్వాసకోశ మద్దతు అవసరమైంది. ఆదివారం ఆమె డెలివరీ కాగా.. మంగళవారం ఆమెను, పిల్లలను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు.