నేటి నుంచి కడప జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన.. రేపు ఇడుపులపాయకు మాజీ సీఎం..
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మరోసారి తన సొంత జిల్లా.. కడప జిల్లాలో పర్యటించబోతున్నారు.. నేటి నుంచి రెండు రోజులు కడప జిల్లాలో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన కొనసాగనుంది.. రేపు దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించనున్నారు జగన్.. ఇక, రెండు రోజుల పర్యటన కోసం.. ఈ రోజు సాయంత్రం 3.30 గంటలకు బెంగుళూరు నుంచి బయలుదేరి 5.15 గంటలకు పులివెందులలోని తన నివాసానికి చేరుకుంటారు జగన్.. ఈ రోజు రాత్రికి పులివెందులలోనే బస చేస్తారు.. ఇక, రేపు ఉదయం 6.45 గంటలకు పులివెందులలోని తన స్వగృహం నుంచి వాహనంలో రోడ్డు మార్గాన బయలుదేరి ఉదయం 7.30 గంటలకు ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్దకు చేరుకుంటారు వైఎస్ జగన్.. 8.15 గంటల వరకు వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పిస్తారు.. అనంతరం రోడ్డు మార్గాన బయలుదేరి 8.45 గంటలకు పులివెందులలోని క్యాంప్ ఆఫీస్ కు చేరుకుంటారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 3.30 వరకు పులివెందుల క్యాంప్ ఆఫీస్ లో ప్రజలను కలుస్తారు.. వారి నుంచి వినతులు స్వీకరిస్తారు.. అనంతరం పులివెందుల నుంచి 3.50 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి సాయంత్రం 5.20 గంటలకు బెంగళూరు చేరుకుంటారు వైసీపీ అధినేత వైఎస్ జగన్..
ప్రాణం తీసిన చికెన్ పకోడీ..! యువకుడి దారుణ హత్య..
చికెన్ పకోడీ వివాదం ఒక వ్యక్తిని హత్య చేసేదాకా వచ్చింది. మద్యం మత్తు నిండు ప్రాణాన్ని బలి చేసింది. మరొకరిని హంతకుడిగా మార్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం వసపలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గ్రామానికి చెందిన మిన్నారావు అనే యువకుడు శనివారం రాత్రి పూటుగా మద్యం సేవించాడు. మద్యం మత్తులో సమీపంలోని ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కు వెళ్లాడు. చికెన్ పకోడీ కావాలని అడిగాడు. అయితే, షాపు యజమాని లేదని చెప్పాడు. అయితే ఎట్టి పరిస్థితుల్లో తనకు చికెన్ పకోడీ ఇవ్వాల్సిందే అంటూ పట్టుబట్టాడు మిన్నారావు. శంకర్ కాదని చెప్పినా వినలేదు. మరింత గదమాయించాడు. షాపు తలుపులను గట్టిగా తన్నుతూ శంకర్ పై దూసుకొచ్చాడు. ఆపై శంకర్ పీక నొక్కి కింద పడవేసే ప్రయత్నం చేశాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న శంకర్ సైతం పక్కనే ఉన్న సుత్తిని తీసి మిన్నారావు తలపై బలంగా మోదాడు. అప్పటికి ఆవేశం తగ్గలేదు ఆయనలో. పక్కన ఉన్న కత్తిని తీసి పీక కోశాడు. మృతదేహాన్ని రోడ్డుకు అవతల వైపు ఉన్న కాలువలో పడేసాడు. దీనిపై కొత్తూరు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు కోసం గాలిస్తున్నారు .
ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాల హెచ్చరికలు..!
ఏపీలో ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తున్నాయి.. మాకు రావాల్సినవి ఇవ్వకపోతే ఉద్యమిస్తాం అంటూ అల్టిమేటం ఇస్తున్నాయి… ఒకటో తేదీనే జీతం ఇస్తున్న ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూనే, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఆర్టీసీ ఉద్యోగులు అసంతృప్తి ప్రకటిస్తున్నారు.. ఏపీజేఏసీ నాయకులు.. ఉద్యోగ, ఉపాధ్యాయుల విషయంలో ప్రభుత్వ జగన్నాథ రథచక్రాలు పని చేయడం లేదని, సంవత్సర కాలం ఎదురుచూసాం.. ప్రభుత్వ జగన్నాథ రథచక్రాలు ఉద్యోగుల వైపు చూడాలి అంటూ మనసులో మాటను బయటపెట్టారు.. పీఆర్సీ సవరణకు రెండు సంవత్సరాలైనా కమిషనర్ ను నియమించకపోవడం పై ఉద్యోగ సంఘాలు సీరియస్ వ్యాఖ్యలు చేస్తున్నాయి.. అలాగే సీఎం చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నపుడు ఇచ్చిన హామీలే నెరవేర్చాలని అడుగుతున్నామని జెఏసీ నేతలు అంటున్నారు..
తెలంగాణ ప్రజలకు అలర్ట్.. ఆ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు..!
తెలంగాణ రైతులకు వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. రాబోయే ఐదు రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీంతో వానల కోసం ఆకాశం వైపు ఆశగా చూస్తున్న రైతులకు శుభవార్తే అని చెప్పాలి. ముఖ్యంగా వరి, కందులు మొదలైన వర్షాధారిత పంటల సాగు రైతులకు ఇది గుడ్ న్యూస్. అయితే మరోవైపు వర్షం కారణంగా జనం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది. సోమవారం (జులై 7) నుంచి వర్షాలు ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని తెలిపారు. అలాగే మంగళవారం వర్షం పెరిగి అతి భారీ వర్షాలుగా మారే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో హెచ్చరికలు ఎక్కువగా ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.
నేడు ఢిల్లీకి పయనం కానున్న సీఎం రేవంత్.. షెడ్యూల్ ఇలా..!
తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ఇవాళ (జూలై 7) ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. ఇది కేవలం అధికారిక టూర్ మాత్రమే కాకుండా, రాష్ట్రాభివృద్ధి ప్రణాళికలు, కేంద్ర మద్దతు కల్పన, పార్టీ వ్యూహాలపై హైకమాండ్‌తో కీలక చర్చలకు వేదికగా మారనుంది. ముఖ్యంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇటీవల తెలంగాణ పర్యటన పూర్తిచేసుకున్న నేపథ్యంలో.. సీఎం రేవంత్ ఢిల్లీ పయనం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. నేడు ఢిల్లీ వెళ్లనున్న సీఎం మరో రెండు రోజుల పాటు ఢిల్లీలోనే ఉంటూ సీఎం రేవంత్ కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ అధిష్ఠానం, పార్టీ శ్రేణులతో సమావేశాలు జరపనున్నట్లు సమాచారం. ముఖ్యంగా హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశ విస్తరణకు సంబంధించిన డీపీఆర్, రీజనల్ రింగ్ రోడ్ కు సంబంధించి కేంద్ర స్థాయిలో మద్దతు పొందడమే లక్ష్యంగా చర్చలు జరగనున్నాయి. అలాగే ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా యూరియా, ఎరువుల కొరత నేపథ్యంలో.. కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డాను ముఖ్యమంత్రి కలవనున్నారు. రాష్ట్రానికి తక్షణ ఎరువుల కోటా విడుదల చేయాలని కోరనున్నారు. రైతుల అవసరాల దృష్ట్యా ఇది అత్యవసరంగా భావిస్తున్నారు.
బ్రిక్స్ వేదికగా పాకిస్థాన్‌పై నిప్పులు చెరిగిన మోడీ
బ్రిక్స్ వేదికగా ప్రధాని మోడీ పాకిస్థాన్‌పై నిప్పులు చెరిగారు. ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్న దాయాది దేశం తీవ్ర విమర్శలు గుప్పించారు. భారతదేశం ఉగ్రవాద బాధిత దేశమని.. పాకిస్థాన్ మాత్రం మద్దతుదారు అని తెలిపారు. బాధితులను మద్దతుదారులను ఒకే త్రాసులో తూకం వేయలేమని చెప్పారు. బ్రెజిల్‌లోని రియో డి జనీరోలో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో మోడీ ప్రసంగించారు. పహల్గామ్ ఉగ్ర దాడిని ఖండించిన దేశాలకు కృతజ్ఞతలు తెలియజేశారు. భారదేశానికి మద్దతుగా నిలిచిన దేశాలకు ధన్యవాదాలు చెప్పారు. ఉగ్రవాదులకు నిశ్శబ్దంగా అనుమతి ఇవ్వడం ఆమోదయోగ్యం కాదన్నారు. ఈ సందర్భంగా వ్యక్తిగతంగా లేదా రాజకీయ ప్రయోజనాల కోసం ఉగ్రవాద వ్యాప్తికి వ్యతిరేకంగా మాట్లాడని.. ఏమీ చేయని వారిని కూడా పరోక్షంగా మోడీ ప్రస్తావించారు. ఇక పాకిస్థాన్ గడ్డపై ఉగ్రవాదులకు ఎలా ఆశ్రయం కల్పిస్తుందో భారత్ స్పష్టమైన ఆధారాలను చూపించింది.
సెకన్ల వ్యవధిలో ముంచెత్తేసిన టెక్సాస్ వరదలు.. వీడియోలు వైరల్
ఊహించని రీతిలో వచ్చిన వరదలు టెక్సాస్‌ను అతలాకుతలం చేశాయి. నెలల పాటు కురవాల్సిన వర్షమంతా కొన్ని గంట్లోనే కురవడంతో టెక్సాస్ హడలెత్తిపోయింది. ఏకధాటిగా కుండపోత వర్షం కురవడంతో గ్వాడాలుపే నది ఒక్కసారిగా ఉప్పొంగడంతో సెకన్ల వ్యవధిలోనే వరదలు ముంచెత్తాయి. ప్రజలు తేరుకునేలోపే ముంచేశాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. అగ్రరాజ్యం అమెరికాలోని టెక్సాస్‌లో కుండపోత వర్షాలు కురిశాయి. ఏకధాటిగా కురిసిన వర్షాలకు టెక్సాస్ అల్లాడిపోయింది. నగరాన్ని నగరాన్నే ముంచెత్తేసింది. ఒక్కసారిగా వరదలు రావడంతో సమ్మర్ క్యాంప్‌ల్లో ఉన్నవారంతా కొట్టుకుపోయారు. ఇప్పటి వరకు 82 మంది చనిపోయారు. ఇంకా చాలా మంది గల్లంతయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చు. ఇక బాధితుల కోసం భార్య మెలానియా, తాను ప్రార్థిస్తున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. సహాయ బృందాలు వరద బాధితులకు సాయం చేస్తున్నట్లు పేర్కొన్నారు.
శారీరకంగా, మానసికంగా అలసిపోయా.. ఇంగ్లాండ్ కెప్టెన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!
జూలై 2న ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ప్రారంభమైన ఇంగ్లాండ్, భారత్ రెండో టెస్టు మ్యాచ్ లో టీమిండియా చారిత్రాత్మక విజయం సాధించింది. 336 పరుగుల భారీ తేడాతో ఇంగ్లాండ్‌ను చిత్తు చేసిన భారత్.. ఐదు టెస్టుల సిరీస్‌ను 1–1తో సమం చేసింది. తొలి టెస్టులో పరాజయం పాలైన గిల్ సేన, రెండో టెస్టులో గట్టి ప్రతీకారం తీర్చుకున్నట్లు అయ్యింది. ముఖ్యంగా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ ఆటతీరు మ్యాచ్ మొత్తాన్ని మార్చేసింది. ఈ టెస్టులో గిల్ ప్రత్యర్థి బౌలర్లకు భయాందోళన కలిగించేలా, మరోవైపు పురాతన టెస్టు రికార్డులను తుడిచిపెట్టేలా బ్యాటింగ్ చేశాడు.
గిల్ తొలి ఇన్నింగ్స్‌లో 387 బంతుల్లో 269 పరుగులు (30 ఫోర్లు, 3 సిక్సులు) చేయగా, రెండో ఇన్నింగ్స్‌లో 162 బంతుల్లో 161 పరుగులు (13 ఫోర్లు, 8 సిక్సులు) చేశాడు. మొత్తం కలిపితే 430 పరుగులతో టెస్టు చరిత్రలో ఒకే టెస్టులో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా గిల్ నిలిచాడు.
ఇంతవరకూ వారితో తిట్లు పడలేదు– శేఖర్ కమ్ముల
శేఖర్ కమ్ముల మాట్లాడుతూ.. ‘ఇప్పటి వరకు 25 ఏళ్ల నా కెరీర్లో 10 సినిమాలు మాత్రమే చేశాను. కానీ ఒక్క సినిమా పైనా ప్రేక్షకులు నన్ను తిట్టలేదు. నా సినిమాలను ఆదరించారు. అదే నా బలం. నా సినిమాల్లో నా నిజాయితీ స్పష్టంగా కనిపిస్తుంది. కాసుల కోసం కాదు, కంటెంట్ కోసం సినిమా తీయాలనే దృక్పథంతో ఉన్నాను. ఇక ఈ 25 ఏళ్లలో నేను ఇప్పటికీ అదే పద్మారావు నగర్ లో సింపుల్ గా, నా మనుషుల మధ్య ఉండటానికి కారణం, నేను పెరిగిన విధానం. ఈ పొజిషన్ నాకు ఆడియన్స్ ఇచ్చినది. అందువల్ల.. నేను గ్రౌండెడ్‌గా ఉండగలిగాను అని నమ్ముతాను. అందుకే మనిషిగా, దర్శకుడిగా నన్ను ఎక్కువగా అప్డేట్ చేసుకోలేదు. నేను ట్రెండ్స్‌కి తగ్గట్లుగా మారిపోయే మనిషిని కాదు. కానీ ఇప్పుడు ‘కుబేరా’ లాంటి కథ కోసం కొన్ని కమర్షియల్ అంశాలు తీసుకోవాల్సి వచ్చింది. ఇది నాకు ఒక కొత్త ప్రయోగం. ‘కుబేరా’ అనేది నేను ఇప్పటివరకు తీసిన సినిమాలకు పూర్తి విరుద్ధం.. కానీ కథ నన్ను టచ్ చేసింది అందుకే చేసాను. ప్రేక్షకుల ప్రేమ వల్లే నాకు పేరు వచ్చింది. వాళ్లు నాపై నమ్మకంతో థియేటర్‌కి వస్తారు. వాళ్ల నమ్మకాన్ని వమ్ము చేయను’ అంటూ చెప్పుకొచ్చారు.
లక్ అంటే ఇలా ఉండాలి.. జాక్ పాట్ కొట్టిన మైత్రీ మూవీ మేకర్స్
లవ్ టుడే సినిమాతో దర్శకుడి నుండి హీరోగా యూటర్న్ తీసుకుని తొలిసినిమాతో హిట్ అందుకున్నాడు ప్రదీప్ రంగనాథ్. ఇక రెండవ సినిమా డ్రాగన్ సినిమాతో వంద కోట్ల కలెక్షన్స్ రాబట్టిన హీరోగాను రికార్డు క్రియేట్ చేసాడు. దాంతో ప్రదీప్ కు ఆఫర్స్ క్యూ కట్టాయి.ప్రస్తుతం లవ్ ఇన్సురెన్స్ కంపెనీ, డ్యూడ్ అనే మరో యూత్ ఫుల్ సినిమా కూడా చేస్తున్నాడు. డ్యూడ్ సినిమాను టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. కోలీవుడ్ స్టార్ దర్శకురాలు సుధాకొంగర వద్ద అసిస్టెంట్ గా పనిచేసిన కీర్తిశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది డ్యూడ్. అయితే ఈ సినిమాతో నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కు జాక్ పాట్ తగిలింది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ డీల్ క్లోజ్ చేసారు మేకర్స్. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ డ్యూడ్ డిజిటల్ రైట్స్ ను రూ. 25 కోట్లకు కొనుగోలు చేసిందని సమాచారం. దాదాపు రూ. 20 నుండి రూ. 25 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న డ్యూడ్ కేవలం డిజిటల్ రైట్స్ తోనే ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ అయింది. ఇంకా మ్యూజిక్ మరియు శాటిలైట్ ఉండనే ఉన్నాయి. ఇక థియేటర్ లో హిట్ టాక్ వస్తే ఆక్కడ నుండి వచ్చేది అంతా లాభమే. సో ఎలా చూసుకున్న మైత్రీ మూవీస్ కు డ్యూడ్ తో జాక్ పాట్ కొట్టినట్టే అని చెప్పాలి. షూటింగ్ దశలోనే టేబుల్ ప్రాఫిట్ సినిమా అంటే ఈ నిర్మాతకైనా అంతకు మించిన ఆనందం ఏముంటుంది. షూటింగ్ చివరి దశలో ఉన్న డ్యూడ్ ఈ ఏడాది దీపావళికి రిలీజ్ కానుంది.
6ఏళ్లుగా ఒక్క హిట్ లేదు.. అయినా ఆఫర్స్ తగ్గడం లేదు
కొంత మంది స్టార్ భామలకు వరుసగా ఫెయిల్యూర్స్ ఎదురైనా వారి క్రేజ్ ఏమాత్రం తగ్గదు. పూజాహేగ్డే, శ్రీలీల ఈ కోవకే వస్తారు. ఇప్పుడు వీరికి తోడయ్యింది మృణాల్ ఠాకూర్. సౌత్‌లో ప్యామిలీ స్టార్ తప్ప మిగిలినవన్నీ హిట్స్. కానీ.. నార్త్‌లో సీతామహాలక్ష్మి వరుస డిజాస్టర్లను చూసింది. అయినా సరే ఆఫర్స్ కి కొదవ లేదు. 6 ఏళ్ల నుండి బీటౌన్‌లో హిట్టే చూడని భామకు నార్త్ బెల్ట్ వరుస ఆఫర్లు ఇచ్చి రెడ్ కార్పెట్ వేయడం విడ్డూరం. హృతిక్ సూపర్ 30, బాట్లా హౌస్ తర్వాత బీటౌన్‌లో బ్లాక్ బస్టర్ సౌండ్ వినలేదు మృణాల్. కరోనా ఎఫెక్ట్ వల్ల ఓటీటీకి పరిమితమైన ఈ భామ జెర్సీతో థియేటర్ ప్రేక్షకులను పలకరిస్తే రిజల్ట్ ప్లాప్. ఇక అదే టైంలో టాలీవుడ్‌లో సీతామాహాలక్ష్మీగా ఎంటరై భారీ సక్సెస్ తెచ్చుకోవడంతో మేడమ్ క్రేజ్ అమాంతం పెరిగింది. దీంతో బీటౌన్ కూడా వరుస ఆఫర్లు ఇస్తూ ఎంకరేజ్ చేసింది. కానీ గుమ్రా, ఆంఖ్ మిచోలీ డిజాస్టర్లుగా మారాయి. గోస్ట్ స్టోరీస్, లస్ట్ స్టోరీస్ సిరీస్ చిత్రాలతో కాస్తో కూస్తో ఇమేజ్ నిలబడింది. తెలుగులో హాయ్ నాన్న హిట్టు మరోసారి ఆమె కెరీర్‌కు బూస్టర్ అయ్యింది. ఇలా ఆమె బీటౌన్ ముంగిట్లో ఫెయిలవుతున్న ప్రతిసారి టాలీవుడ్ ఆదుకుంది. బాలీవుడ్‌లో వరుస ప్లాపులున్నా టాలీవుడ్‌లో ఉన్న క్రేజ్ వల్ల ఆఫర్స్ క్యూ కడుతున్నాయి . ప్రస్తుతం అజయ్ దేవగన్ సన్నాఫ్ సర్దార్ 2లో నటిస్తోంది. జులై 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇవే కాదు మేడమ్ చేతిలో హై జవానీ తో ఇష్క్ హోనా హై, తుమ్ హో తో, పూజా మేరీ జాన్ కాకుండా బైలింగ్వల్ డెకాయిట్, హై ఆక్టేన్ పాన్ ఇండియా మూవీ అల్లు అర్జున్, అట్లీ మూవీలోను నటిస్తుంది. మరి మృణాల్ బాలీవుడ్ హిట్ కల ఎప్పుడు తీరుతుందో.