బంగాళాఖాతంలో అల్పపీడనం..! ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారుతోంది ఉపరితల ఆవర్తనం.. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో 5 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.. ఇక, అల్పపీడనం ప్రభావంతో ఇవాళ విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని.. ఆరెంజ్ బులెటిన్ హెచ్చరికలు జారీ చేసింది విశాఖపట్నం వాతావరణ కేంద్రం.. మిగిలిన కోస్తా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.. ఆయా జిల్లాల్లో ఇవాళ, రేపు విస్తారంగా వర్షాలకు ఆస్కారం ఉంది.. తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి.. అయితే, అల్పపీడనం ప్రభావం ఉన్న నేపథ్యంలో.. వచ్చే ఐదు రోజులు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని ఆదేశాలు జారీ చేసింది విశాఖ వాతావరణ కేంద్రం.. కాగా, మరోవైపు, ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలోనూ వర్షాలు కురుస్తున్నాయి.. ఓ అల్పపీడనం ప్రభావం తగ్గక ముందే.. మరో అల్పపీడనంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి.. వైఎస్సార్ ఘాట్‌లో నివాళులర్పించిన జగన్..
దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తోంది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఇక, ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్‌లో తమ కుటుంబసభ్యులతో కలిసి నివాళులు అర్పించారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఆ తర్వాత మత పెద్దలు నిర్వహించే ప్రత్యేక ప్రార్థనల్లో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు జగన్.. ఆయనతో పాటు.. వైఎస్సార్ సతీమణి వైఎస్ విజయమ్మ, కోడలు వైఎస్ భారతి, ఇతర కుటుంబ సభ్యులు, వైఎస్సార్‌సీపీ నేతలు ఈ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.. ఇక, పులివెందుల సబ్ జైల్లో ఉన్న వైసీపీ నేతలను పరామర్శించనున్నారు వైఎస్ జగన్.. అంబకపల్లెలో ఎంపీ నిధులతో నిర్మించిన గంగమ్మ చెరువులో జలహారతి ఇవ్వనన్నారు.. రేపు ఉదయం ఏడు గంటలకు ప్రత్యేక హెలికాప్టర్ లో బెంగళూరు బయల్దేరి వెళ్లనున్నారు వైఎస్ జగన్.. మరోవైపు, ఇవాళ దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు వైసీపీ శ్రేణులు.. తాడేపల్లి లోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో వర్ధంతి కార్యక్రమంలో ఆ పార్టీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, ముఖ్య నేతలు పాల్గొననున్నారు.. నేడు దివంగత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని రాజమండ్రిలో పలు సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.. రాజమండ్రి సిటీ, రాజానగరాలలో జరిగే వైఎస్. రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకల్లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొంటారు..
కవిత ఇప్పుడొచ్చి.. కేసీఆర్‌కు ఏ పాపం తెలియదంటే నమ్మేస్తారా?
కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా విచారణ జరపాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కు అప్పగించిన విషయం తెలిసిందే. కాళేశ్వరం అవినీతి కేసును సీబీఐకి అప్పగించడంపై ఎంపీ డీకే అరుణ స్పందించారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కేసీఆర్ కుటుంభం సభ్యులందరికీ కాళేశ్వరం అవినీతిలో భాగం ఉన్నదన్నారు. కల్వకుంట్ల కవిత ఇప్పుడొచ్చి.. కేసీఆర్‌కు ఏ పాపం తెలియదంటే ముక్కున వెలిసుకుంటారు తప్పితే, ఎవరు నమ్మరు అని విమర్శించారు. ఏ రాజకీయం లబ్ది కోసం కవిత ఆ డైలాగులు కొట్టిందో తెలియదు? అని డీకే అరుణ ఎద్దేవా చేశారు. ఎంపీ డీకే అరుణ మీడియాతో మాట్లాడుతూ… ‘ఏం రాజకీయం కోసం కల్వకుంట్ల కవిత ఆ డైలాగులు కొట్టిందో తెలియదు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కేసీఆర్ కుటుంభం సభ్యులందరికీ కాళేశ్వరం అవినీతిలో భాగం ఉంది. ఇప్పుడొచ్చి కవితమ్మ కేసీఆర్‌కు ఏ పాపం తెలియదంటే ముక్కున వెలిసుకుంటారు తప్పితే.. ఎవరు నమ్మరు. కాళేశ్వరం విషయంలో కమిటీ, నివేదికలంటూ ఇన్నాళ్లు కాంగ్రెస్ కావాలనే తాత్సరం చేసింది. ఇది కాంగ్రెస్, బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందంలా కనిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీని తప్పించాలనే కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నట్లు ఉంది. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే అధికారంలోకి రాగానే ఈ కేసును సీబీఐకి అప్పగించొచ్చు కదా. కమిటీలు, విచారణలు, నివేదికలు అన్నారు. ఆ నివేదికలో ఏముందో ఎందుకు బయట పెట్టలేదు?. చివరకు అర్ధరాత్రి వరకు అసెంబ్లీలో చర్చ పెట్టి సీబీఐకి అప్పగిస్తున్నామన్నారు’ అని చెప్పారు.
యూపీలో ఘోరం.. చెల్లిని ప్రేమించాడని ఓ అన్నయ్య ఘాతుకం.. ప్రియుడిని బయటకు తీసుకెళ్లి..!
ఎన్ని కఠిన చట్టాలొచ్చినా నేరాలు మాత్రం తగ్గడం లేదు. ఎక్కడొక చోట నేరాలు-ఘోరాలు జరుగుతూనే ఉంటున్నాయి. రోజురోజుకూ నేర తీవ్రత పెరిగిపోతుంది తప్ప తగ్గడం లేదు. స్నేహితుడి చెల్లిని ప్రేమించిన పాపానికి ప్రియుడిని అత్యంత క్రూరంగా చంపేసి అవయవాలు నదిలో విసిరేశారు. ఈ ఘోరం ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. రిషికేశ్ (22) కాన్పూర్‌లోని చకేరి ప్రాంత వాసి. పవన్ మల్లా అనే స్నేహితుడి చెల్లిని రిషికేశ్ ప్రేమించాడు. అయితే ఈ వ్యవహారం పవన్ మల్లాకు రుచించలేదు. రిషికేశ్‌ను చంపాలని కుట్రపన్నాడు. అందుకోసం మరికొంత మంది స్నేహితుల మద్దతు కోరాడు. ఆగస్టు 29న సాయంత్రం రిషికేశ్‌ను స్నేహితులు మోగ్లి, నిఖిల్ ఇంట్లో నుంచి పిలిచారు. గణేష్ చతుర్థి పండల్‌ను దర్శించేందుకు వెళ్తున్నట్లు కుటుంబ సభ్యులకు చెప్పి బయటకు తీసుకెళ్లారు. రెండ్రోజులైనా రిషికేశ్ ఇంటికి రాకపోవడంతో అతని అన్నయ్య రవికుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగి నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. రిషికేశ్‌ను చంపేసి.. తలను వేరు చేసి.. మిగతా అవయవాలను ముక్కలు.. ముక్కలు చేసి నది ఒడ్డున విసిరేసినట్లు చెప్పుకొచ్చారు. నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు మహారాజ్‌పూర్ ప్రాంతంలో నది ఒడ్డున తల, కొన్ని అవయవాలను స్వాధీనం చేసుకున్నారు.
సూడాన్‌లో విరిగిపడిన కొండచరియలు.. శవాల దిబ్బగా మారిన గ్రామం.. 1,000 మంది మృతి
ప్రకృతి కన్నెర్ర చేస్తే ఎంతంటి విధ్వంసం జరుగుతుందో ఇలీవలి జరుగుతున్న కొన్ని సంఘటనలు చూస్తే తెలిసిపోతుంది. నిన్న ఆఫ్ఘనిస్థాన్ లో భూకంపం కారణంగా వందలాది మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇది మరువకముందే ఆఫ్రికన్ దేశమైన సూడాన్‌లో ప్రకృతి ఉగ్ర రూపందాల్చింది. సూడాన్ లో కొండచరియలు విరిగిపడి 1,000 మంది మరణించారని సూడాన్ లిబరేషన్ మూవ్‌మెంట్/ఆర్మీ తెలిపింది. ఈ కొండచరియ పశ్చిమ సూడాన్‌లోని మర్రా పర్వత ప్రాంతంలోని ఒక గ్రామాన్ని పూర్తిగా నాశనం చేసింది. గ్రామంలో ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ఆ గ్రామం ఇప్పుడు పూర్తిగా నేలమట్టమైందని సైన్యం తెలిపింది. గ్రామం శవాల దిబ్బగా మారిందని తెలిపారు. అబ్దేల్‌వాహిద్ మొహమ్మద్ నూర్ నేతృత్వంలోని బృందం ఒక ప్రకటనలో మాట్లాడుతూ.. చాలా రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఆగస్టు 31న కొండచరియలు విరిగిపడ్డాయని తెలిపింది. డార్ఫర్ ప్రాంతంలో ఉన్న ప్రాంతాన్ని ఈ ఉద్యమం/సంఘం నియంత్రిస్తుంది. పురుషులు, మహిళలు, పిల్లలు సహా మృతుల మృతదేహాలను వెలికి తీయడానికి సహాయం చేయాలని ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ సహాయ సంస్థలకు విజ్ఞప్తి చేసింది.
ప్రభుత్వ ఖజానాను నింపిన జీఎస్టీ.. ఆగస్టులో రూ. 1.86 లక్షల కోట్ల వసూళ్లు
వస్తు సేవల పన్ను (జీఎస్టీ) ప్రభుత్వ ఖజానాకు భారీ ఆదాయం సమకూర్చింది. ఆగస్టు నెలలో రూ. 1.86 లక్షల కోట్లు వసూల్ అయ్యాయి. జీఎస్టీ వసూళ్ల గణాంకాలను ప్రభుత్వం వెల్లడించింది. ఇది గత సంవత్సరం ఇదే కాలం కంటే 6.5 శాతం ఎక్కువ. ఆగస్టు 2024లో రూ. 1.75 లక్షల కోట్లు వసూల్ అయ్యాయి. మరోవైపు, గత నెల గురించి మాట్లాడుకుంటే, జూలై 2025లో, జీఎస్టీ వసూళ్ల నుంచి ప్రభుత్వ ఖజానాకు రూ. 1.96 లక్షల కోట్లు వచ్చాయి. సోమవారం విడుదల చేసిన ప్రభుత్వ గణాంకాల ప్రకారం, దేశీయ ఆదాయంలో పెరుగుదల కారణంగా, ఆగస్టులో స్థూల GST వసూళ్లు రూ.1.86 లక్షల కోట్లకు పైగా చేరుకున్నాయి. గత నెలలో ఈ ఆదాయం 9.6 శాతం పెరిగి రూ.1.37 లక్షల కోట్లకు చేరుకోగా, దిగుమతి పన్ను 1.2 శాతం తగ్గి రూ.49,354 కోట్లకు చేరుకుంది. GST వాపసును పరిశీలిస్తే, ఇది సంవత్సరానికి 20 శాతం తగ్గి రూ.19,359 కోట్లకు చేరుకుంది. ఇప్పటివరకు అతిపెద్ద GST వసూళ్లను పరిశీలిస్తే, ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలోనే ప్రభుత్వం GST వసూళ్ల ద్వారా రూ.2.37 లక్షల కోట్లు సంపాదించింది. GST అమలులోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఇదే అత్యధిక వసూళ్లుగా రికార్డ్ సృష్టించింది.
మిచెల్ స్టార్క్ షాకింగ్ నిర్ణయం!
ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పేశాడు. టీ20 ప్రపంచకప్ 2026కు కొన్ని నెలల ముందు రిటైర్మెంట్ ప్రకటించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. వచ్చే జనవరిలో 36 ఏళ్ల పడిలోకి వెళ్లనున్న స్టార్క్.. టెస్ట్‌లు, వన్డేల్లో కొనసాగుతానని తెలిపాడు. దేశవాలీ టీ20 లీగ్ సహా ఐపీఎల్‌కు కూడా తాను అందుబాటులో ఉంటానని చెప్పాడు. భారత్ పర్యటన, యాషెస్ సిరీస్, 2027 వన్డే ప్రపంచకప్ కోసం తాను ఎదురుచూస్తున్నానని.. అందుకే టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలికానని స్టార్క్ స్పష్టం చేశాడు. ‘టెస్ట్ క్రికెట్ ఎల్లప్పుడూ నా మొదటి ప్రాధాన్యత. నేను ఆస్ట్రేలియా తరపున ఆడిన ప్రతి టీ20 మ్యాచ్, ప్రతి క్షణాన్ని ఆస్వాదించా. ముఖ్యంగా 2021 ప్రపంచకప్‌ను బాగా ఎంజాయ్ చేశా. ఆస్ట్రేలియా కప్ గెలిచినందుకు కాదు.. ఆ సమయంలో అద్భుతమైన టీమ్ ఉంది. భారత్ పర్యటన, యాషెస్ సిరీస్, 2027 వన్డే ప్రపంచకప్ కోసం ఎదురుచూస్తున్నా. ఈ టోర్నీలకు తాజాగా, ఫిట్‌గా, నా ఉత్తమ ప్రదర్శన ఇవ్వడానికి టీ20 ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పాను. టీ20 ప్రపంచకప్‌కు సిద్ధం కావడానికి మా బౌలర్లకు సమయం కూడా ఉంటుంది కాబట్టి రిటైర్మెంట్ ఇవ్వడానికి ఇదే మంచి సమయం అని భావించా. ఆసీస్ తరఫున పొట్టి ఫార్మాట్ ఆడటాన్ని బాగా ఎంజాయ్ చేశా’ అని మిచెల్ స్టార్క్ తెలిపాడు.
బిగ్ బాస్ లోకి ఆ క్రేజీ బ్యూటీ.. ఇక రచ్చే
బిగ్ బాస్ సీజన్-9 త్వరలోనే స్టార్ట్ కాబోతోంది. సెప్టెంబర్ 7 నుంచి ఈ షో స్టార్ట్ కాబోతోంది. బిగ్ బాస్ కు తెలుగులో ఏ స్థాయి క్రేజ్ ఉందో మనకు తెలిసిందే. ఈ సారి కామన్ పర్సన్లను కూడా ఎక్కువగానే తీసుకుంటున్నారు. దీని కోసం అగ్నిపరీక్ష ప్రోగ్రామ్ కూడా నిర్వహించేస్తున్నారు. ఈ సారి షోలోకి సెలబ్రిటీలు బాగానే వస్తున్నారంట. లిస్టు కూడా రెడీ అయిపోయింది. ఇందులోకి రీతూ చౌదరి కూడా రాబోతోందంట. ఈ బ్యూటీ కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. ఆ మధ్య ఏపీలో రూ.750 కోట్ల స్కామ్ లో ఆమె పేరు మార్మోగిపోయింది. ఆమె పేరు ఏపీ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయిపోయింది. వాటితో తనకు సంబంధం లేదని ఆమె ఎంత చెప్పినా కాంట్రవర్సీ మాత్రం ఆగలేదు. ఇక దాని తర్వాత బెట్టింగ్ యాప్స్ కేసులో ఆమె పేరు రచ్చకు దారి తీసింది. ఇలాంటి కాంట్రవర్సీలతో ఉన్న ఈ బ్యూటీ బిగ్ బాస్ లోకి వస్తే రచ్చ మామూలుగా ఉండదు. పైగా ఆమె సోషల్ మీడియాలో ఏ స్థాయిలో అందాలను ఆరబోస్తుందో మనకు తెలిసిందే. ఆమె అందాలకు ఓ రేంజ్ లో మాస్ ఫాలోయింగ్ ఉంది. మరి ఈ బ్యూటీ షోలో ఎలాంటి రచ్చ చేస్తుందో చూడాలి. ఆమె మాత్రం తన మీద ఉన్న నెగెటివిటీని కొంచెం తగ్గించుకుందామని చూస్తోందంట.
ప్రెజర్ తట్టుకోలేక ప్రొడక్షన్ హౌస్ ను మూసేస్తున్నట్టు ప్రకటించిన స్టార్ డైరెక్టర్
నిర్మాణ సంస్థ అంటే మాటలు చెప్పినంత ఈజీ కాదు. కోట్ల రూపాయల పెట్టుబడి కావాలి. సరైన కథలు ఎంపిక చేసుకోవాలి. సరైన స్టార్ కాస్టింగ్ వంటివి చూసుకోవాలి. అనుకున్న బడ్జెట్ లో సినిమాలు ఫినిష్ చేయాలి, లేదంటే వడ్డీలు అదనం. ఒక్కోసారి సినిమా ప్లాప్ అయితే కోట్ల రూపాయల డబ్బు వెనక్కి ఇవ్వాలి. ఇలా ఒకటి కాదు రెండు అనేక విషయాలు ప్రొడక్షన్ ముడిపడి ఉంటాయి. స్టార్ హీరోలు ముందు తమ వారిని ఉంచి పెట్టుబడులు పెడుతుంటరు. కొందరు డైరెక్ట్ గానే పెట్టుబడులు పెడుతుంటారు. ఇటీవల కాలంలో స్టార్ హీరోలు, దర్శకులు కూడా నిర్మాణ సంస్థలు స్థాపించి సినిమా నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నారు. అలాగే నిర్మాణ రంగంలో అడుగుపెట్టిన ఓ స్టార్ డైరెక్టర్ ఇప్పడు ఆ ప్రెజర్ తట్టుకోలేక తన సంస్థను మూసేస్తున్నట్టు ప్రకటించాడు. అతడెవరో కాదు తమిళ స్టార్ డైరెక్టర్స్ లో ఒకరైన వెట్రిమారన్. దర్శకుడిగా సూపర్ హిట్ సినిమాలు అందించిన వెట్రిమారన్ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాడు. గ్రాస్ రూట్ ఫిలిం కంపెనీ పేరుతో సిద్దార్ధ్ హీరోగా NH-4 అనే సినిమాతో నిర్మాతగా మారి పలు సినిమాలు నిర్మించారు. ఇటీవల బ్యాడ్ గర్ల్ అనే సినిమాను నిర్మించారు వెట్రి. ఈ సినిమా ఈ నెల 5న రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి సంబంధించి జరిగిన ఈవెంట్ లో వెట్రి మాట్లాడుతూ.. తన నిర్మాణ సంస్థ GrassRootFilmCompany ని మూసివేయనున్నను. డైరెక్టర్ గా ఉండటం తనకు స్వేచ్ఛనిస్తుందని, కానీ నిర్మాతగా ఉండటం తనపై చాలా ఒత్తిడిని పెంచుతుంది, ఆ ఒత్తిడిని హ్యాండిల్ చేయలేను, నిర్మాతగా బ్యాడ్ గర్ల్ నా చివరి చిత్రం’ అని తెలిపారు.
కూలీ రిజల్ట్ పై లోకేష్ స్పందన.. ఇలా అన్నాడేంటి..
రజినీకాంత్ హీరోగా వచ్చిన కూలీ మూవీ ఆశించిన స్థాయిలో హిట్ కాలేకపోయింది. సాధారణంగా లోకేష్ సినిమాలు అంటే వేరే లెవల్ ఎక్స్ పెక్టేషన్లు ఉంటాయి. లోకేష్ యూనివర్స్ స్థాయికి మించి కూలీపై ఫ్యాన్స్ అంచనాలు పెట్టేసుకున్నారు. కానీ అంచనాలు మొత్తం తప్పాయి. మూవీకి మిక్స్ డ్ టాక్ వచ్చింది. స్టోరీ వీక్ గా ఉండటంతో పాటు పాత్రల్లో డెప్త్ లేదు. సాదా సీదాగా అనిపించే సీన్లతో కూలీ అంచనాలను అందుకోలేకపోయాడు. ఈ రిజల్ట్ పై ఫస్ట్ టైమ్ లోకేష్ స్పందించాడు. ఈ సినిమా ట్రైలర్ చూసి చాలా మంది ఇది టైమ్ ట్రావెల్ కథ అనుకున్నట్టు తెలిపాడు. ప్రేక్షకులు ఏవేవో అంచనాలు పెట్టేసుకున్నారు. టైమ్ ట్రావెల్ కథ అని, ఎల్ సీయూలో భాగం అని రకరకాల అంచనాలతో థియేటర్లకు వచ్చారు. అవేవీ ఉండవని నేను రిలీజ్ కు ముందే చెప్పాను. అయినా వాళ్లు పట్టించుకోలేదు. అందుకే వారి అంచనాలకు తగ్గట్టు మూవీ లేదు. దానికి నేనేం చేయలేదు. అయినా ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టు కథలు రాయలేను. ప్రేక్షకులకు నచ్చలేదంటే ఈ సారి మరింత గట్టిగా ట్రై చేస్తాను. ఆడియెన్స్ ఊహించలేని కథతో సినిమా చేస్తాను అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు లోకేష్. తన తర్వాత సినిమా ఖైదీ-2 అని గతంలో చెప్పాడు. కానీ ఇప్పుడు రజినీకాంత్, కమల్ హాసన్ కాంబోలో సినిమా చేస్తున్నట్టు తెలుస్తోంది. దానిపై త్వరలోనే క్లారిటీ రాబోతోంది.