నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ అగ్ర నేతలతో కీలక భేటీ!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ( అక్టోబర్ 25న) ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఏఐసీసీ అగ్ర నేతలతో ఆయన కీలక సమావేశం జరిపే అవకాశం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలోని పరిపాలన, పార్టీ పరిస్థితులపై ప్రధానంగా చర్చించే ఛాన్స్ ఉంది. జిల్లా, పట్టణ కాంగ్రెస్ కమిటీల అధ్యక్షుల నియామకంపై జరిగే సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. ఈ సమావేశంలో సీఎంతో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొననున్నారు. కాగా, ఇప్పటికే జిల్లా, పట్టణ కాంగ్రెస్ కమిటీలకు అధ్యక్షుల ఎంపికపై, జిల్లా పర్యటనలు ఏఐసీసీ పరిశీలకులు చేశారు.
నేటి నుంచి జాగృతి అధ్యక్షురాలు కవిత జిల్లాల యాత్రకు శ్రీకారం..
నేటి నుంచి జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జనం బాట పేరుతో సుదీర్ఘ యాత్ర చేపట్టబోతున్నారు. ఈరోజు నుంచి ఫిబ్రవరి 13వ తేదీ వరకు నాలుగు నెలల పాటు జిల్లాల పర్యటన కొనసాగనుంది. తన మెట్టి నిల్లు నిజామాబాద్ నుంచి జనం బాట ప్రారంభించబోతుంది. ఇవాళ మధ్యాహ్నం 1 గంటకు ఇందల్ వాయి టోల్ గేట్ దగ్గరకు చేరుకోనున్న కవిత.. బర్దిపూర్ నుంచి జాగృతి కార్యాలయం వరకు బైక్ ర్యాలీలో పాల్గొననుంది. జిల్లా కేంద్రంలోని జాగృతి కార్యాలయం వద్ద ప్రజలను ఉద్దేశించి ఆమె ప్రసంగిస్తారు. అనంతరం నవీపేట మండలం యంచ వద్ద ముంపు బాధితుల తో సమావేశం కానున్నారు. నందిపేట మండలం సీహెచ్ కొండూరులో లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని కవిత సందర్శించనున్నారు.
తెలంగాణ వ్యాప్తంగా ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల్లో కొనసాగుతున్న తనిఖీలు..
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. జిల్లాల్లోని పలు కీలక ప్రాంతాలలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కొరడా. నిబంధనలకు విరుద్దంగా నడుస్తున్న బస్సులపై ఆర్టీఏ అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. మహబూబ్‌నగర్, నల్గొండ, కోదాడ, కామారెడ్డి, నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాలతో పాటు హైదరాబాద్ శివారు ప్రాంతాలలో ఈ రైడ్స్ కొనసాగుతున్నాయి. శంషాబాద్, వనస్థలిపూరం, గగన్ పహాడ్, అల్విన్ చౌరస్తా, ముంబాయి హైవేపై తనిఖీలు చేస్తున్నారు. కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, పాండిచ్చేరి, నాగాల్యాండ్, ముంబై నుంచి హైదరాబాద్ నగరానికి వచ్చే ప్రతి వాహనాన్ని అధికారులు చెక్ చేస్తున్నారు. ఇక, బస్సుకు సంబంధించిన ఆర్సీ, ఫిట్నెస్ సర్టిఫికేట్, ఆర్‌సి, ఫిట్‌నెస్, బీమా, పర్మిట్, పన్ను, డబుల్ డ్రైవర్, ఎస్కార్ట్ ఫైర్ ఎక్స్‌టింజిషర్ తో పాటు ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ లను క్షుణ్ణంగా రవాణా శాఖ అధికారులు పరిశీలిస్తున్నారు. నేటి ఉదయం నుంచి ఈ దాడులు కొనసాగుతున్నాయి. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు.. కర్నూలు బస్సు ప్రమాదం జరిగిన తరువాత ఆర్టీఏ అధికారులు కళ్లు తెరిచారా అంటూ పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. తమ ప్రాణాలు పోయిన తరువాత అధికార యంత్రాంగం రెండు మూడు రోజులు హడావుడి చేయడం తప్పా అంతా షరా మాములే అంటున్నారు ప్రయాణీకులు.
ముగిసిన దుబాయ్ పర్యటన.. హైదరాబాద్ చేరుకున్న సీఎం చంద్రబాబు
దుబాయ్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. పెట్టుబడులే లక్ష్యంగా మూడు రోజుల పాటు దుబాయ్‌లో పర్యటించారు ఏపీ సీఎం.. ఈ పర్యటనలో ప్రముఖ వ్యాపారవేత్తలు, యూఏఈ మంత్రులతో.. 25 కీలక సమావేశాల్లో పాల్గొన్నారు.. గల్ఫ్ దేశాల్లోని ప్రవాసాంధ్రులతోనూ సమావేశమయ్యారు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు.. ఉన్న వనరులు.. రాష్ట్ర ప్రభుత్వం కల్పించే సౌకర్యాలు.. ఇలా అన్ని వివరించారు సీఎం చంద్రబాబు.. నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నం వేదికగా జరగనున్న CII ఇన్వెస్టర్స్ మీట్‌లో పాల్గొనేందుకు రావాల్సిందిగా అందరినీ ఆహ్వానించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. దుబాయ్‌లో తెలుగు ప్రజలతో నిర్వహించిన డయాస్పోరా సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. కీలక వ్యాఖ్యలు చేవారు.. గల్ఫ్‌లోని యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్, ఓమన్, బహ్రెయిన్, ఖతార్ దేశాల నుంచి పెద్ద సంఖ్యలో తెలుగు ప్రజలు ఈ సమావేశానికి హాజరయ్యారు.
శ్రీవారి భక్తులకు అలర్ట్..
కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులు అలర్ట్ కావాల్సిన సమయం వచ్చింది.. ప్రతి నిత్యం తిరుమల గిరులు భక్తులతో రద్దీగా ఉంటాయి.. శ్రీవారి దర్శనానికి గంటల తరబడి క్యూ లైన్లలో వేచిఉండాల్సిన పరిస్థితి ఉంటుంది.. అయితే, ఇబ్బంది లేకుండా శ్రీవారిని దర్శించుకోవడానికి ముందే టికెట్లు బుక్ చేసుకుంటారు భక్తులు.. ఇప్పటికే జనవరి నెలకు సంబంధించిన పలు సేవల టికెట్లను ఆన్‌లైన్‌లో విక్రయించిన టీటీడీ.. ఇప్పుడు భక్తుల నుంచి ఫుల్ డిమాండ్ ఉండే.. ప్రత్యేక దర్శన టికెట్లను విడుదల చేసేందుకు సిద్ధమైంది.. ఇవాళ ఆన్‌లైన్‌లో జనవరి నెలకు సంబంధించిన దర్శన టికెట్లు విడుదల చేయనుంది.. ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఆన్‌లైన్‌లో పెట్టనున్నారు టీటీడీ అధికారు.. ఇక, మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలో వసతి గదులు కోటా విడుదల చేయనున్నారు. మరోవైపు, ఇవాళ నాగుల చవితి సందర్భంగా తిరుమలలో ప్రత్యేక ఏర్పాట్లు చేవారు.. ఈ రోజు శ్రీవారికి పెద్దశేష వాహన సేవ నిర్వహించనున్నారు.. రాత్రి 7 గంటలకు పెద్దశేష వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామి.. ఇక, తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.
నేటి నుంచి 4 రోజులు బీహార్‌లో ఛత్ పండుగ.. ప్రత్యేక ఇదే!
బీహార్‌లో ప్రస్తుతం ఓట్ల పండుగ జరుగుతోంది. తాజాగా ఓట్ల పండుగతో పాటు తరతరాలుగా ఆచారంగా వస్తున్న ఛత్ ఫెస్టివల్ కూడా వచ్చేసింది. దీంతో రాష్ట్రమంతటా సందడి.. సందడి వాతావరణం.. కోలాహలం కనిపిస్తోంది. నేటి నుంచి నాలుగు రోజుల పాటు ఛత్ పండుగ జరగనుంది. ఈ పండుగ కోసం రాష్ట్రం బయట ఎక్కడున్నా సరే సొంత గ్రామాలకు వచ్చేస్తారు. అంత ఉత్సాహంగా.. ఆనందంగా ఈ పండుగను జరుపుకుంటారు. ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఛత్ పండుగ శుభాకాంక్షలు చెప్పారు. ఛత్ అనేది ఒక పురాతన ఇండో-నేపాల్ హిందూ పండుగ. తూర్పు భారతదేశం-దక్షిణ నేపాల్‌కు చెందిన పండుగ. ముఖ్యంగా భారతదేశంలోని బీహార్, జార్ఖండ్, తూర్పు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ పండుగ జరుపుకుంటారు. అలాగే నేపాల్‌లోని కోషి, గండకి, బాగ్మతి, లుంబిని, మాధేష్ ప్రావిన్సుల్లో ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు. విదేశాల్లో ఉన్న ప్రవాస భారతీయులు కూడా ఎంతో ఆనందంగా ఈ ఫెస్టివల్‌ను నిర్వహిస్తారు.
హోవార్డ్ యూనివర్సిటీ దగ్గర కాల్పులు.. నలుగురు మృతి!
అగ్ర రాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టిస్తున్నాయి. వాషింగ్టన్ డీసీలోని హోవార్డ్ యూనివర్సిటీ సమీపంలో దుండగులు జరిపిన కాల్పుల్లో నలుగురు చనిపోయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. శుక్రవారం రాత్రి 8:23 గంటల సమయంలో ఈ కాల్పులు జరిగినట్లుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరి దర్యాప్తు చేపట్టారు. దుండగుల కోసం గాలిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం వాషింగ్టన్ డీసీలోని హోవార్డ్ యూనివర్సిటీ క్యాంపస్ సమీపంలో గృహప్రవేశ వేడుకలు జరుగుతున్నాయి. వేలాది మంది అతిథులతో సందడి సందడిగా ఉంది. ఇంతలో దుండగులు ప్రవేశించి కాల్పులకు తెగబడ్డాడు. ఆ ఘటనలో నలుగురు చనిపోయినట్లుగా సమాచారం. పలువురు గాయపడినట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది.
డ్రగ్స్ కేసులో మరో సెన్సేషన్ – టాలీవుడ్ హీరోలపై ఈడీ విచారణ!
టాలీవుడ్ మళ్లీ డ్రగ్స్ కేసుతో కుదిపేస్తోంది. డ్రగ్స్ కొనుగోలు, సప్లై వ్యవహారంలో ప్రముఖ సినీ నటులు శ్రీరామ్ (శ్రీకాంత్), కృష్ణ పేర్లు బయటకు రావడంతో సంచలనం రేగింది. ఈ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగిస్తున్న ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) వీరిద్దరికీ సమన్లు జారీ చేసింది. వివరాల్లోకి వెళితే.. గత జూన్‌లో ప్రదీప్ కుమార్ అనే వ్యక్తికి మత్తు పదార్థాలు సప్లై చేసినందుకు జాన్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో అతని వద్ద నుంచి లభించిన వివరాల ఆధారంగా, ఈ డ్రగ్స్ రాకపోకలలో కొంతమంది సినీ ప్రముఖుల పేర్లు బయటకు వచ్చాయి. ఆ జాబితాలో శ్రీకాంత్, కృష్ణ పేర్లు ఉండటంతో, ఈడీ వీరి ఆర్థిక లావాదేవీలను కూడా పరిశీలిస్తోంది. ఈ కేసు ఇటీవల ED పరిధిలోకి చేరడంతో, శ్రీకాంత్‌ను ఈ నెల 28న, కృష్ణను 29న విచారణకు హాజరుకావాలని అధికారికంగా నోటీసులు జారీ చేసింది. వీరి సమాధానాల ఆధారంగా మరికొందరిపై కూడా విచారణ జరగొచ్చని సమాచారం. ఇక టాలీవుడ్‌లో మరోసారి డ్రగ్స్ ఇష్యూ బహిర్గతం కావడంతో సినీ వర్గాల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటికే పలువురు హీరోలు, టెక్నీషియన్లు, మేనేజర్లు ఈ కేసులో విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ ఈ ఇద్దరు నటులపై ఈడీ దృష్టి పడటంతో పరిశ్రమలో టెన్షన్ పెరిగింది.
SSMB29 నుంచి సౌండ్ మొదలైంది – కాలభైరవ రివీల్ చేసిన ఆసక్తికర అప్‌డేట్!
సూపర్‌స్టార్ మహేష్ బాబు హీరోగా, విజన్‌రీ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం SSMB29 ప్రస్తుతం టాలీవుడ్‌లోనే కాక, దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎక్స్‌పెక్టేషన్‌ని సెట్ చేసింది. ప్రపంచస్థాయి కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మహేష్ బాబు ఈ సినిమాలో పూర్తిగా కొత్త లుక్‌తో, ఇప్పటివరకు చూడని స్టైల్‌లో కనిపించబోతున్నాడని సమాచారం. ఇక ఈ సినిమాకి సంబంధించిన తాజా అప్‌డేట్‌ని గాయకుడు, సంగీత దర్శకుడు కాళభైరవ బయటపెట్టాడు. తాజాగా జరిగిన ‘మోగ్లీ’ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో మాట్లాడిన ఆయన.. “SSMB29 సినిమాకి సంబంధించిన మ్యూజిక్ సెషన్స్ మొదలయ్యాయి. నా నాన్న (ఎం.ఎం.కీరవాణి) ఎప్పుడూ తన ప్రతి సినిమా మ్యూజిక్ ప్రాసెస్‌లో నాకు ఏదో ఒక పని అప్పగిస్తారు. ఈసారి మహేష్-రాజమౌళి ప్రాజెక్ట్‌లో కూడా నాకు బాధ్యత ఇచ్చారు” అని తెలిపారు. ఈ మాటలతోనే మహేష్ అభిమానులు ఉత్సాహంగా మారారు. “మహేష్ బాబు – రాజమౌళి కాంబినేషన్‌కి కీరవాణి మ్యూజిక్ అంటే ఊహించలేనంత మ్యాజిక్ ఖాయం” అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.
నేడే ఆస్ట్రేలియాతో భారత్ చివరి వన్డే.. ఈ మ్యాచ్ గెలిచి పరువు నిలిపేనా..?
ఆస్ట్రేలియాతో సిరీస్‌ను కోల్పోయిన టీమ్‌ఇండియా.. ఈరోజు ( అక్టోబర్ 25న) జరిగే నామమాత్రమైన చివరి మ్యాచ్‌కు రెడీ అయింది. మరోవైపు ఆస్ట్రేలియా సిరీస్ గెలిచిన ఉత్సాహంలో క్లీన్‌స్వీప్ చేయాలనే పట్టుదలతో ఉంది. కంగారుల జట్టును ఆపడం గిల్ సేనకు అంత తేలిక కాదు. ఇక, తొలి వన్డేలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలపై ఎన్నో ఆశలు పెట్టుకుంటే ఇద్దరూ దారుణంగా విఫలమయ్యారు. అయితే రెండు వన్డేలో కోహ్లీ డకౌటవడం క్రికెట్ అభిమానులకు షాక్‌కు గురి చేసింది . ఈ వైఫల్యానికి తోడు పెవిలియన్‌కు వెళ్తూ అతను ఫ్యాన్స్ కు అభివాదం చేయడంతో తన రిటైర్మెంట్‌పై ప్రచారం కొనసాగుతుంది. చివరి వన్డేలోనూ విఫలమైతే అతడి రిటైర్మెంట్‌పై చర్చ మరింత ఊపందుకుంటుంది. మరి తన ఆటతో విమర్శకులకు కోహ్లీ ఎలా సమాధానం చెబుతాడో చూద్దాం. అలాగే, రెండో వన్డేలో హాఫ్ సెంచరీతో రోహిత్‌పై ఒత్తిడి తగ్గినట్లే.. కానీ అతను అడిలైడ్‌లో సహజ శైలిలో ఆడలేకపోయాడు.