నేడు దేవరగట్టు కర్రల సమరం.. ఏంటి ప్రత్యేకత..?
కర్నూలు జిల్లా దేవరగట్టులో పోలీసులు భారీగా మోహరించారు. మాలమల్లేశ్వర స్వామి కళ్యాణోత్సవం, బన్నీ ఉత్సవానికి 800 మంది పోలీసుల బందోబస్తు కొనసాగుతోంది. హళగొంద మండలం దేవరగట్టు కొండ ప్రాంతంలో స్వయంబుగా వెలిసిన మాళ మల్లేశ్వర స్వామి దేవాలయంలో విజయదశమి రోజు ఆర్ధరాత్రి జరిగే బన్నీ ఉత్సవంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు, అప్రమత్తంగా ఉన్నారు. ఇప్పటికే 148 మందిపై బైండోవర్ కేసులు నమోదయ్యాయి. మరోవైపు 100 నైట్ విజన్ సీసీ కెమెరాలు, 700 ఎల్ఈడీ లైట్లు అమర్చారు. 5 డ్రోన్ కెమెరాలతో నిఘా కొనసాగనుంది. మాల మల్లేశ్వర కళ్యాణోత్సవం అనంతరం జరిగే కర్రల సమరం ఎంతో చరిత్ర ఉందని స్థానికులు చెబుతున్నారు. త్రేతాయుగంలో మని, మల్లాసూరులు అనే రాక్షసులను కాల భైరవుడి అవతారంలో శివుడు అంతమొందిస్తాడు. రాక్షసులు ప్రాణాలు విడిచే సమయంలో తమకు ప్రతి ఏటా భక్తుల రక్తాన్ని ఓ కుండ నిండా సమర్పించాలని కోరుకున్నారట. అందుకు శివపార్వతులు అంగీకరించారని స్థలపురాణం చెబుతోంది. పిడికెడు రక్తం ఇచ్చేందుకు ఏటా రక్ష పడి వద్దకు వచ్చే భక్తులను గోరవయ్యాలు అడ్డుకునేయత్నం చేస్తారని ప్రతీతి. ఆ సమయంలో మాళమ్మ విగ్రహాన్ని తీసుకుని పూజారి దబనంతో తొడ నుంచి పిడికెడు రక్తం సమర్పిస్తారు. వెంటనే డిర్రు గో పరక్ అంటూ కేకలు వేస్తూ జరిగే బన్నీ జైత్రయాత్రలో కర్రలతో కొట్టుకుంటారు. దీంతో తలలు పగిలి రక్తం చిమ్ముతుంది.
నేటి నుండి స్కిల్ యూనివర్సిటీ అడ్మిషన్లు ప్రారంభం…
తెలంగాణ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో రాష్ట్రంలో చేపట్టిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ (YISU) అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ఏడాది దసరా పండుగ నుంచే స్కిల్స్ యూనివర్సిటీ ప్రారంభించాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనకు అనుగుణంగా కొన్ని కోర్సులకు యూనివర్సిటీ అడ్మిషన్స్ నోటిఫికేషన్ జారీచేసింది. తొలి విడతగా యూనివర్సిటీ ప్రాథమికంగా మూడు స్కూల్స్‌ను, వాటిల్లో నాలుగు కోర్సులను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. లాజిస్టిక్స్ అండ్ ఈ-కామర్స్, హెల్త్‌కేర్, స్కూల్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ అండ్ లైఫ్ సైన్సెస్‌ను ఈ ఏడాది నుంచే ప్రారంభిస్తోంది. వీటిల్లో లాజిస్టిక్స్ అండ్ ఈ -కామర్స్ స్కూల్ కింద వేర్‌హౌస్ ఎగ్జిక్యూటివ్, కీ కన్సయినర్ ఎగ్జిక్యూటివ్ కోర్సులు, హెల్త్‌కేర్‌లో భాగంగా ఫినిషింగ్ స్కిల్స్ ఇన్ నర్సింగ్ ఎక్సలెన్స్, ఫార్మాస్యూటికల్స్ అండ్ లైఫ్ సైన్సెస్ కింద ఫార్మా అసోసియేట్ ప్రోగ్రామ్ కోర్సుల్లో చేరే విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ కోర్సుల్లో చేరాలనుకునే అర్హులైన విద్యార్థులు అక్టోబర్ 29 లోగా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్ (https://yisu.in/) ద్వారా దరఖాస్తు చేసుకోవాలని యూనివర్సిటీ తెలిపింది. నవంబర్ 4 వ తేదీ నుంచి ఈ కోర్సులు ప్రారంభమవుతాయి. తాత్కాలికంగా హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా (ESCI) నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ (NAC) క్యాంపస్‌లలో ఈ కోర్సులను నిర్వహిస్తారు.
తమిళనాడులో ట్రైన్ యాక్సిడెంట్.. 18 రైళ్లు రద్దు
తమిళనాడు రాష్ట్రంలో శుక్రవారం ఘోర రైలు ప్రమాదం జరిగింది. మైసూర్- దర్భంగా భాగమతి ఎక్స్ ప్రెస్ చెన్నై సమీపంలోని తిరువళ్లూరు జిల్లాలోని కవరైపెట్లై రైల్వే ష్టేషన్ దగ్గర గూడ్స్ రైలును ఢీ కొట్టింది. దీంతో ఏకండగా 12 కోచ్‌లు పట్టాలు తప్పిపోయాయి. ఈ ఘటనలో 19 మందికి గాయాలయ్యాయని రైల్వే అధికారులు చెప్పారు. అయితే, శుక్రవారం రాత్రి 8.30 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే, ప్రమాద సమయంలో 1, 360 మంది ప్రయాణికులు ట్రైన్ లో ఉన్నారని తిరువళ్లూరు జిల్లా కలెక్టర్ టీ ప్రభుశంకర్ పేర్కొన్నారు. 19 మంది ప్రయాణికులు గాయపడగా, వారిలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారన్నారు. వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదన్నారు. అయితే, ట్రైన్ మెయిన్‌లైన్‌కు బదులు లూప్ లైన్‌లోనిక ప్రవేశించడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా విచారణలో తేలింది. అయితే, రైలు ప్రమాద ఘటన నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే 18 రైళ్లను క్యాన్సిల్ చేసింది. డా ఎంజీఆర్ చెన్నై సెంట్రల్- తిరుపతి ఎక్స్‌ప్రెస్(16203), తిరుపతి-డా.ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ ఎక్స్‌ప్రెస్(16204), ఎంజీఆర్ చెన్నై సెంట్రల్-తిరుపతి(16053), తిరుపతి- ఎంజీఆర్ చెన్నై సెంట్రల్(16054), ఎంజీఆర్ చెన్నై సెంట్రల్-తిరుపతి(16057), తిరుపతి-ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ ఎక్స్‌ప్రెస్(16058), తిరుపతి- పుదుచ్చేరి మెము(16111), పుదుచ్చేరి- తిరుపతి మెము(16112) ఉన్నాయి.
నేడే బంగ్లాతో భారత్ చివరి మ్యాచ్.. ఉప్పల్లో క్లీన్స్వీప్ చేస్తారా..?
బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌లో చివరి మ్యాచ్‌కు భారత జట్టు రెడీ అయింది. సూర్య కుమార్ యాదవ్ సారథ్యంలో ఇప్పటికే వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విజయదుందుభి మోగించింది. ఇప్పుడు హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో దసర పండగ రోజు విజయాల జోరు కొనసాగించేందుకు టీమిండియా కుర్రాళ్లు సై అంటున్నారు. దూకుడు మీదున్న యువ భారత్‌ను అడ్డుకోవడం బంగ్లాదేశ్ కు అంత ఈజీ కాదు. ఇప్పటికే సిరీస్ గెలిచిన నేపథ్యంలో ఈ మ్యాచ్ కోసం భారత జట్టు తుది జట్టులో కొన్ని మార్పులు చోటు చేసే అవకాశం ఉంది. అయితే, భారత్ అన్ని విభాగాల్లోనూ స్ట్రాంగ్ గా కనిపిస్తోంది. ముఖ్యంగా గత మ్యాచ్‌లో పవర్ ప్లేలోనే మూడు వికెట్లు పడిపోయినప్పటికీ టీమ్ 222 రన్స్ లక్ష్యాన్ని నిర్దేశించిందంటే బలమైన బ్యాటింగ్ లైనప్ ఉంది. ఆ మ్యాచ్‌లో తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి చెలరేగిపోయాడు. ఇక, యువ ఓపెనర్ అభిషేక్ శర్మ కూడా రెచ్చిపోతే అభిమానులకు పండగే. రింకు సింగ్, హార్దిక్, రియాన్ పరాగ్ కూడా మంచి ఫామ్‌లో కనిపిస్తున్నారు. మరోవైపు బౌలింగ్‌లోనూ టీమిండియా బాగా ఆకట్టుకుంటోంది. పేసర్లు అర్ష్‌దీప్ సింగ్, మయాంక్‌కు తోడు స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్ కూడా రాణిస్తున్నారు. గత మ్యాచ్‌లో ఏడుగురు భారత బౌలర్లు కనీసం ఒక వికెట్ తీసుకున్నారు. అంతర్జాతీయ టీ20ల్లో ఇలా జరగడం అదే తొలిసారి. ఇక, చివరి టీ20 కోసం టీమ్ లో కొన్ని మార్పులు జరిగే అవకాశం కనిపిస్తుంది. రవి బిష్ణోయ్, తిలక్ వర్మ, జితేశ్ శర్మ, హర్షిత్ రాణాలకు ఛాన్స్ దొరకనుంది.
న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు భారత జట్టు ఇదే..
భారత్ వేదికగా అక్టోబర్ 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్న మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకున్న టీమిండియాలో కేవలం ఒక్క మార్పు చేసింది. యువ పేసర్ యశ్ దయాల్‌ను సెలక్టర్లు పక్కన పెట్టేశారు. అతడి స్థానంలో కొత్త ప్లేయర్ ని ఎంపిక చేసేందుకు సెలక్టర్లు ఆసక్తి చూపలేదు. న్యూజిలాండ్‌తో సిరీస్ కోసం ముగ్గురు స్పెషలిస్ట్ ఫాస్ట్ బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్‌లను తుది జట్టులోకి తీసుకుంది. రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభమాన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్.. ఇక, ట్రావెలింగ్ రిజర్వ్ ప్లేయర్లు: హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి, మయాంక్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ ఉన్నారు.
జానీ మాస్టర్ కేసులో ఊహించని ట్విస్ట్..! ఆమె నాపై లైంగికదాడి చేసిందంటూ యువకుడి ఫిర్యాదు..
సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసులో ఊహించని ట్విస్ట్ వచ్చి చేరింది.. జానీ మాస్టర్ కేసులో బాధితురాలిగా ఉన్న యువతిపై ఇప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడో యువకుడు.. జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు పెట్టిన శ్రష్టి వర్మపై నెల్లూరు పోలీసులకు జానీ మాస్టర్ అల్లుడు షమీర్ ఫిర్యాదు చేయడం.. ఆమెపై ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది.. సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు పెట్టిన శ్రష్టి వర్మపై నెల్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు జానీ మాస్టర్ అల్లుడు షమీర్… మా మామ జానీతో కలిసి తాను హైదరాబాద్, చెన్నైలలో సినిమా షూటింగులకు వెళ్ళినప్పుడు.. తనను శ్రష్టి వర్మ లైంగికంగా వేధించిందని ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు.. లిఫ్టులు, షూటింగ్ లో విశ్రాంతి తీసుకునే వాహనం.. లాడ్జీ గదిలు.. ఇలా తనపై లైంగికంగా దాడిచేసిందని రాసుకొచ్చాడు.. లాడ్జీ గదిలో లైంగికంగా దాడి చేయడంతో పాటు తనను నగ్నంగా ఫోటోలు తీసిందని ఫిర్యాదులో వెల్లడించింది.. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే ఫోటోలు అందరికీ పంపుతానని బెదిరించినట్లు ఆరోపించారు.. శ్రష్టి వర్మ పై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు షమీర్..
బిగ్ బీకి అమితంగా నచ్చిన సినిమా.. ఏకంగా 60సార్లు చూశాడట
బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర నటుడు అమితాబ్ బచ్చన్. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా రంగంలోకి అడుగుపెట్టి స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. హిందీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి ఓ వెలుగు వెలుగుతున్నారు. ప్రస్తుతం అమితాబ్ వయసు 82 ఏళ్లు. ఇప్పటికీ సినిమాలు, టీవీ రియాల్టీ షోలు, ప్రకటనలతో బిజీ లైఫ్ గడుపుతున్నారు. ఈరోజు (అక్టోబర్ 11) అమితాబ్ బచ్చన్ పుట్టినరోజు. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు, అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే రజనీకాంత్ కీలక పాత్రలో నటించిన ‘వెట్టయన్’ సినిమా ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఉదయం నుంచి సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ ఏడాది ప్రభాస్ నటించిన కల్కి 2898 ADలో కూడా అమితాబ్ కీలక పాత్ర పోషించారు. బిగ్ బీ అమితాబ్ కెరీర్లో ఎన్నో మరుపురాని చిత్రాలున్నాయి. వాటిలో త్రిశూల్ ఒకటి. చేతిలో ఒక్క రూపాయి లేకుండా పట్టణానికి వచ్చి ఉన్నత స్థానానికి ఎదిగిన విజయ్ అనే వ్యాపార వేత్త పాత్రలో అమితాబ్ నటన అబ్బురపరిచింది. ప్రేక్షకులకే కాదు అమితాబ్ తో పలు చిత్రాలు నిర్మించిన ఆనంద్ పండిట్ కి కూడా ఈ చిత్రం ఎంతగానో నచ్చిందట. అందుకే ఆయన ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ సన్నాహాలు చేస్తున్నారు. `త్రిశూల్` ని ఇప్పటి వరకు 60సార్లు చూసి ఉంటాను. ఈ సినిమా కథ నాలో ఎంతో స్పూర్తిని నింపింది. అందుకే గుజరాత్ నుంచి ముంబైకి వచ్చాను. ఎప్పటికైనా అమితాబ్ తో త్రిశూల్ సీక్వెల్ చేయాలని నా కల` అని అన్నారు. ఈ సీక్వెల్ కు ఆయనే స్వయంగా కథ కూడా సిద్దం చేస్తున్నారు. ఆయనే నిర్మిస్తున్నారు. కానీ డైరెక్టర్ గా బాధ్యతలు మాత్రం తీసుకోరు. అతడి వివరాలు త్వరలో తెలిసే అవకాశం ఉంది. త్రిశూల్ చిత్రాన్ని యష్ చోప్రా తెరకెక్కించిన సంగతి తెలిసిందే.