అవకాలు చెవాకులు పేలొద్దు.. జగన్ మాట్లాడితే నోరు తెరుస్తారు..?
కూటమి నేతలపై మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పేర్ని నాని.. ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డ ఆయన… పార్టీ కార్యకలాపాల విషయంలో అధికారులు అధికార పార్టీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని ఘాటుగా విమర్శించారు. మచిలీపట్నంలో మా పార్టీ సమావేశం పెట్టుకుంటే.. కాగితాలే ఇవ్వలేదని మున్సిపల్ కమిషనర్ చెప్పడం హాస్యాస్పదం. అధికారులు ప్రభుత్వ ఉద్యోగులుగా కాకుండా, పార్టీ నాయకులుగా, కార్యకర్తలుగా పని చేస్తున్నారు అంటూ ధ్వజమెత్తారు. హైకోర్టు తీర్పులు వచ్చినా కూడా మంత్రి కొల్లు రవీంద్రకు మించి ఎవ్వరూ లేరన్నట్లుగా కమిషనర్ వ్యవహరించిన తీరు కనిపిస్తోందని విమర్శించారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ జాగ్రత్త, జైలుకు పంపుతా అని హెచ్చరించారంటే.. కమిషనర్ ఎంత పొగరుగా వ్యవహరించారో అర్థమవుతోంది అన్నారు. మంత్రి కొల్లు రవీంద్రపై అవినీతి ఆరోపణలు వస్తేనే కమిషనర్ చర్యలు తీసుకుంటారా? అని ప్రశ్నించారు పేర్ని నాని. మీ మంత్రి పదవి పోతే ACBకి ఫిర్యాదు చేస్తేనే స్పందిస్తారా? మంత్రి సమాధానం చెప్పాలి అన్నారు. అధికారుల్ని ఉద్దేశించి, ప్రజల పన్నులతో జీతాలు తీసుకుంటున్నారు.. పాలేరుల్లా పని చేయొద్దు. బ్రిటిష్ కాలంలో తొత్తులుగా మారిన వాళ్లను ప్రజలు ఏం చేశారో గుర్తుంచుకోండి. రేపు ప్రజలే మీలాంటి అధికారుల్ని పీకేస్తారు అంటూ హెచ్చరించారు. అదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్‌పై కూడా తీవ్ర విమర్శలు చేశారు. ప్రజల ఆస్తుల్ని దోచుకోవడానికి చంద్రబాబు, లోకేష్ బరితెగించారు. లోకేష్ ‘99 రూపాయలు కాదు, అర్ధరూపాయికైనా ఇస్తా’ అని మాట్లాడటం సిగ్గుచేటు అని నిలదీశారు.. హెరిటేజ్ ఆస్తులు రూపాయికి ఇస్తారా? లోపల ప్రొడక్ట్స్ పావలాకు ఇస్తారా? ప్రజల సొమ్ము పంచుకుని తినేస్తారా? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
స్థల వివాదం..! టీటీడీ బోర్డు సభ్యత్వానికి జంగా కృష్ణమూర్తి రాజీనామా
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పాలకమండలి సభ్యత్వానికి బోర్డు సభ్యులు జంగా కృష్ణమూర్తి రాజీనామా చేశారు.. దీనికి ప్రధాన కారణం స్థల వివాదంగా తెలుస్తోంది… 2005లో టీటీడీ తనకు కేటాయించిన 500 గజాల స్థల వివాదమే కారణంగా చెబుతున్నారు.. 2005లో జంగా కృష్ణమూర్తికి తిరుమల బాలాజీ నగర్‌లో ప్లాట్ నం.2ను డొనేషన్ స్కీమ్ కింద కేటాయించింది టీటీడీ.. 31 జూలై 2005న టీటీడీ బోర్డు తీర్మానం ద్వారా గెస్ట్ హౌస్ నిర్మాణానికి ప్లాట్ కేటాయించారు.. అయితే, 2006లో నిబంధనలు పాటించలేదన్న కారణంతో ప్లాట్ కేటాయింపు రద్దు చేసింది.. కానీ, 2008లో డొనేషన్ చెల్లింపుకు గడువు పెంచాలని జంగా విజ్ఞప్తి చేశారు.. జంగా కట్టిన 10 లక్షల రూపాయల డిమాండ్ డ్రాఫ్ట్ (DD) 2008లో టీటీడీకి చెల్లింపు కాగా.. 21 అక్టోబర్ 2008న జీవో నెం.1220 జారీ అయ్యింది.. ఈ నేపథ్యంలో ప్రత్యేక కేసుగా పరిగణించి మళ్లీ ప్లాట్ కేటాయింపునకు ప్రభుత్వం అనుమతి ఇవ్వగా.. 2009లో హైకోర్టును ఆశ్రయించారు జంగా కృష్ణమూర్తి.. 2009లో పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. ఎనిమిది వారాల్లోపు నిర్ణయం తీసుకోవాలని 2009లో ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.. ఆ మేరకు ఇటీవల జరిగిన టీటీడీ బోర్డు సమావేశంలో జంగాకు స్థలం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.. కానీ, దీనిపై విమర్శలు రావడం తో రద్దు చేయాలని నిన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో నిర్ణయానికి వచ్చారు.. అయిదే, దీనిపై జంగా కృష్ణమూర్తి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు.. టీడీపీ పాలకమండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు.. సీఎం నారా చంద్రబాబు నాయుడుతో పాటు టీటీడీ చైర్మన్ కి రాజీనామా లేఖను ఫ్యాక్స్ ద్వారా పంపించారట.. తిరుమలలో స్థల కేటాయింపు వ్యవహారంపై మనస్థాపానికి గురైన ఆయన.. ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.. అయితే, జంగా రాజీనామాను ఆమోదించే దిశగా టీటీడీ అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది.
అందుకే టీటీడీ పాలక మండలికి రాజీనామా.. జంగా కృష్ణమూర్తి ఆసక్తికర వ్యాఖ్యలు
టీటీడీ పాలక మండలి సభ్యత్వానికి జంగా కృష్ణమూర్తి రాజీనామా చేయడం హాట్ టాపిక్‌గా మారింది.. తిరుమల స్థల వివాదంలో మనస్తాపానికి గురైన ఆయన రాజీనామా చేశారు.. తన రాజీనామా లేఖను సీఎం చంద్రబాబు, టీటీడీ చైర్మన్‌కు పంపించారు.. ఇక, రాజీనామా అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన జంగా కృష్ణమూర్తి.. మూడోసారి వెంకటేశ్వర స్వామి వారికి సేవ చేసే అవకాశం చంద్రబాబు కల్పించారు.. దీనికి సీఎం చంద్రబాబుకు రుణపడి ఉంటాను అన్నారు.. అయితే, నాపై అనేక ఆరోపణలు చేస్తూ నా వ్యక్తిగత హననానికి పాల్పడుతున్నారు.. దీనివల్ల నేను కలత చెంది ఆవేదనగా ఉన్నాను.. నా వల్ల సీఎం చంద్రబాబుకు ఇబ్బంది కలగకుండా ఉండాలని బోర్డు సభ్యుడిగా రాజీనామా చేస్తున్నాను అని ప్రకటించారు.. రాజీనామా పత్రాన్ని సీఎం చంద్రబాబుకి, టీటీడీ బోర్డు చైర్మన్ కు పంపాను అని వెల్లడించారు.. గతంలోనే నాకు స్థలం కేటాయింపు జరిగినా నా దగ్గర డబ్బులు లేక చెల్లించలేదు.. దీంతో హైకోర్టుకు వెళ్లాను అని గుర్తు చేసుకున్నారు జంగా.. వైసీపీ సమయంలో కేటాయింపు చేయాలని రిక్వెస్ట్ చేశాను.. కొండపై నా పేరుతో స్థలం ఉండాలని నేను ట్రస్ట్ ఏర్పాటు చేశాను.. అక్కడ ఏది నిర్మాణం చేసినా ఆలయం పరిధిలోనే ఉంటుంది.. మేం ఎంత చెల్లించి నిర్మాణాలు చేసినా అవి స్వామి వారికి చెందుతాయి.. వ్యక్తిగతంగా సంక్రమించవు అని పేర్కొన్నారు. గతంలో నాకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా రిజెక్ట్ చేశారు.. అప్పుడు నేను సీఎం దృష్టికి పంపగా బోర్డుకు వెళ్లింది.. బోర్డు అనుమతి ఇచ్చిన తర్వాత మళ్లీ ఇదంతా జరుగుతోంది.. కొన్ని శక్తులు ఇదంతా చేస్తున్నాయి అంటూ ఆరోపణలు గుప్పించారు.. బలహీన వర్గాలకు చెందిన నేను దైవ సేవ చేయటం కోసం ప్రయత్నిస్తే ఇలా చేస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు.. నేను ఈ స్థాయికి రావటానికి కుల సపోర్ట్, రాజకీయ కుటుంబం కాదు.. సొంతంగా ఎదిగాను అన్నారు.. నేను టీటీడీనీ అపవిత్రం చేస్తున్నానని లబ్ది కోసం ఇదంతా చేస్తున్నానని ఆరోపణలు చేస్తున్నారు అని మండిపడ్డారు.
తెలంగాణ డీజీపీకి హైకోర్టులో ఊరట
తెలంగాణ రాష్ట్ర పోలీస్ బాస్ (డీజీపీ) నియామకానికి సంబంధించి గత కొంతకాలంగా కొనసాగుతున్న న్యాయపరమైన సందిగ్ధతకు హైకోర్టు తీర్పుతో ఒక కీలక మలుపు లభించింది. ప్రస్తుత డీజీపీ నియామక ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన ధర్మాసనం, రాష్ట్ర ప్రభుత్వానికి ఊరటనిచ్చేలా కీలక నిర్ణయం తీసుకుంది. డీజీపీ నియామక ఉత్తర్వులను కొట్టివేసేందుకు న్యాయస్థానం నిరాకరించడమే కాకుండా, ఈ ప్రక్రియలో తక్షణమే జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. దీనివల్ల ప్రస్తుత డీజీపీ బాధ్యతల్లో కొనసాగడానికి ఉన్న చట్టపరమైన ఆటంకాలు ప్రస్తుతానికి తొలగిపోయినట్లయింది. అయితే, ఇదే సమయంలో రాష్ట్రంలో ఇన్-చార్జ్ డీజీపీ వ్యవస్థ కొనసాగడంపై న్యాయస్థానం స్పష్టమైన దిశానిర్దేశం చేసింది. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం.. రాష్ట్రంలో పూర్తి స్థాయి డీజీపీ నియామకం తప్పనిసరని గుర్తు చేస్తూ, ఆ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం , యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సమన్వయంతో పనిచేసి, రాబోయే నాలుగు వారాల వ్యవధిలో పూర్తి స్థాయి డీజీపీ నియామక ప్రక్రియను ముగించాలని గడువు విధించింది. అర్హులైన అధికారుల జాబితాను పంపడం నుంచి తుది నియామకం వరకు అన్ని చర్యలు ఈ గడువులోపు పూర్తి కావాలని కోర్టు స్పష్టం చేసింది.
శబరిమల ఆలయ ప్రధాన పూజారి అరెస్ట్..
కేరళలోని శబరిమల ఆలయంలో బంగారం తాపడాల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆలయ ప్రధాన పూజారి కందరారు రాజీవరును సిట్ అధికారులు తాజాగా అరెస్టు చేశారు. పలు నివేదికల ప్రకారం.. బంగారు తాపడాల చోరీ కేసులో ఆయన పాత్ర కూడా ఉన్నట్లు విచారణలో తేలడంతో అరెస్టు చేసినట్లు సమాచారం. ఈ సందర్భంగా పలువురు సిట్ అధికారులు మాట్లాడుతూ.. శుక్రవారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో సిట్ అధికారుల బృందం ఆయన్ను అదుపులోకి తీసుకుందని వివరించారు. విచారణ అనంతరం శబరిమల ఆలయ ప్రధాన పూజారి కందరారు రాజీవరును అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఉన్నికృష్ణన్ పొట్టితో రాజీవరుకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు విచారణలో గుర్తించినట్లు అధికారులు తెలిపారు. నిజానికి శబరిమలకు ఉన్ని కృష్ణన్ పొట్టిని తీసుకువచ్చింది కూడా తంత్రి కందరారు రాజీవరేనని ఇతర నిందితులు తమ వాంగ్మూలంలో తెలిపినట్లు అధికారులు పేర్కొన్నారు. బంగారు తాపడాల చోరీ గురించి ఆయనకు ఫస్ట్ నుంచే సమాచారం ఉందని తెలిపారు. ఈ చోరీపై ఈడీ కేసు ఫైల్ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
ఖమేనీని భయపెడుతున్న “కొత్త నినాదం”.. ఇరాన్‌లో భారీ నిరసనలు..
ఇరాన్‌లో నిరసనలు తీవ్రమవుతున్నాయి. సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మత పాలనకు వ్యతిరేకంగా ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు. ‘‘నియంతకు మరణం’’, ‘‘జావిద్ షా’’ నినాదాల తర్వాత ఇప్పుడు మరో నినాదం ఖమేనీ గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. శుక్రవారం నాటికి నిరసనలు ప్రారంభమై 13 రోజులకు చేరుకుంది. భారీ నిరసనల మధ్య ఖమేనీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఇంటర్నెట్‌ను నిలిపేసింది. ‘‘గాజా కాదు, లెబనాన్ కాదు, నా ప్రాణం ఇరాన్ కోసం’’ అంటూ ప్రజలు నినదిస్తున్నారు. ఇస్ఫహాన్ ప్రావిన్సుల్లో ఆస్ఘరాబాద్‌లో ప్రజలు ఈ నినాదాన్ని ఎత్తుకున్నారు. ఖమేనీ పాలన గత కొంత కాలంగా గాజా, లెబనాన్ అనుకూల విదేశాంగ విధానాన్ని అవలంభిస్తోంది. ముఖ్యంగా హమాస్, హిజ్బుల్లాలకు మద్దతు ఇస్తోంది. దీనిని వ్యతిరేకిస్తూ ప్రజలు నినాదాలు చేస్తు్న్నారు. దేశంలో జీవన ప్రమాణాలు క్షీణిస్తుంటే.. గాజా, లెబనాన్‌లకు ఇరాన్ మద్దతు ఇస్తుండటంపై ఇరాన్ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇజ్రాయిల్, అమెరికాలకు వ్యతిరేకంగా భౌగోళిక, రాజకీయ లక్ష్యాల కోసం గాజాలో హమాస్, లెబనాన్‌లో హిజ్బుల్లాకు ఇరాన్ మద్దతు ఇస్తోంది.
ఇక్కడి వారందరూ మరుజ్జులే.. ప్రపంచంలోనే అత్యంత వింతైన గ్రామం ఇదే!
ప్రపంచంలో ఒక వింత గ్రామం ఉందని మీలో ఎంత మందికి తెలుసు.. అక్కడి ప్రజలందరూ మరుగుజ్జులుగా ఉంటారు మీకు తెలుసా.. ఇంతకీ ఈ గ్రామం ఎక్కడ ఉందని అనుకుంటున్నారు .. ఇరాన్ తూర్పు అంచున ఉంది. ఈ గ్రామం పేరు మఖునిక్. ఒక శతాబ్దం క్రితం వరకు కూడా ఇక్కడ నివసించే ప్రజలందరూ నేటి ఇరానియన్ల కంటే అర మీటర్ పొట్టిగా ఉండేవారని చరిత్రకారులు చెబుతున్నారు. పలు నివేదికల ప్రకారం.. ఆఫ్ఘన్ సరిహద్దు నుంచి 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామం సుమారు 1,500 సంవత్సరాల పురాతనమైనది. ఇక్కడ నివసించే చాలా మంది ప్రజలు ఒక మీటర్ ఎత్తు మాత్రమే ఉన్నారని చెబుతారు. వాస్తవానికి 2005లో ఈ గ్రామం సమీపంలో 25 సెంటీమీటర్ల పొడవు మాత్రమే ఉన్న ఒక మమ్మీ శరీరం గుర్తించారు. అనంతరం జరిగిన పరిశోధనలలో ఇక్కడ దొరికిన మమ్మీ శరీరం 400 సంవత్సరాల క్రితం మరణించిన ఒకరిదని వెలుగు చూసింది. అయితే ఈ గ్రామంలో నివసించిన వారు నిజంగా చాలా పొట్టిగా ఉన్నారనే ప్రజల నమ్మకాన్ని ఇది ఏమాత్రం తగ్గించలేదు. ఈ గ్రామంలో సుమారుగా 70 నుంచి 80 ఇళ్లు ఉన్నాయి. ఉన్న ఇళ్లు అన్నీ కూడా చాలా చిన్నవిగా ఉన్నాయి. ఇక్కడి ఇళ్లు ఎంత చిన్నవిగా ఉన్నాయో తెలిస్తే అందరూ షాక్ అవుతారు. నిజానికి ఇక్కడి ఇళ్లు దాదాపు ఒకటిన్నర నుంచి రెండు మీటర్ల ఎత్తు మాత్రమే ఉన్నాయి. ఇక్కడి ప్రజలు నిజంగా మరుగుజ్జులు అని ఈ ఇళ్ల నిర్మాణం సూచిస్తుందని చరిత్రకారులు చెబుతున్నారు. ఎందుకంటే సాధారణంగా ఎక్కువ ఎత్తు ఉన్నవారు అలాంటి చిన్న ఇళ్లలో నివసించడం అసాధ్యం. ఇక్కడ మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. మఖునిక్ గ్రామం మాత్రమే కాకుండా, చుట్టుపక్కల ఉన్న అనేక ఇతర గ్రామాలు కూడా ఒకప్పుడు మరుగుజ్జులు నివసించేవని చెబుతారు. అందుకే ఈ మొత్తం ప్రాంతాన్ని “మరుగుజ్జుల నగరం” అని కూడా పిలుస్తారు.
చాలా ఖరీదైన విడాకుల కేసు..
జోహో ఫౌండర్ శ్రీధర్ వెంబు తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి ఆయన తన విడాకులకు సంబంధించిన వార్తలతో సంచలనం సృష్టించారు. శ్రీధర్ వెంబు విడాకుల కేసు ప్రస్తుతం అమెరికా కోర్టులో నడుస్తోంది. వీరికి అక్కడి కోర్టు విడాకులు మంజూరు చేస్తే, ఇది భారతదేశంలో అత్యంత ఖరీదైన విడాకులలో ఒకటిగా మారవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. జోహో సహ వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబును ప్రస్తుతం కొనసాగుతున్న విడాకుల కేసులో 1.7 బిలియన్ డాలర్లు లేదా రూ.15 వేల కోట్లకు పైగా బాండ్లను డిపాజిట్ చేయాలని అమెరికాలోని కాలిఫోర్నియా కోర్టు ఆదేశించింది. వెంబు మాజీ భార్య ప్రమీలా శ్రీనివాసన్ అమెరికాలో నివసిస్తున్న విద్యావేత్త, వ్యవస్థాపకురాలు. పలు నివేదికల ప్రకారం.. ఈ ఉత్తర్వు జనవరి 2025లో ఆమోదించబడింది. కాలిఫోర్నియా సుపీరియర్ కోర్టు జోహో సంస్థలను పర్యవేక్షించడానికి ఒక రిసీవర్‌ను నియమించింది. కాలిఫోర్నియా సుపీరియర్ కోర్టు జారీ చేసిన ఉత్తర్వులో ఈ కేసు రికార్డు పిటిషనర్ (శ్రీధర్) కమ్యూనిటీ ఆస్తులలో ప్రతివాది (ప్రమీల) ప్రయోజనాలను విస్మరించారని, చట్టాన్ని ఉల్లంఘించారని స్పష్టంగా నిరూపిస్తున్నట్లు పేర్కొంది.
బిగ్ బాస్ లో ఫీమేల్ విన్నర్స్ ఎందుకు ఉండరంటే..!
ఎన్టీవీ పాడ్ కాస్ట్ లో పాల్గొన్న గాయని గీత మాధురి ఆమె జీవితంలో జరిగిన అనేక విషయాలపై చర్చించారు. ఈ సందర్బంగా ఆమె బిగ్ బాస్ లో ఫీమేల్ విన్నర్స్ ఎందుకు కారన్న విషయమై మాట్లాడింది. బిగ్ బాస్ సీజన్ 2లో మొదటి రన్నర్ గా నిలబడిన ఆమె ఆ షో సంబంధించి అనేక విషయాలను పంచుకున్నారు. ఈ విషయమై ఆమె మాట్లాడుతూ.. బిగ్‌బాస్ హౌస్ అనేది సాధారణ గేమ్ కాదని గీత మాధురి అన్నారు. అది ఒక 100 రోజుల తీవ్రమైన మానసిక ప్రయాణమని.. అక్కడికి వెళ్లిన ప్రతి వ్యక్తి (పురుషుడైనా, మహిళైనా) ఎప్పుడో ఒక సమయంలో ‘వల్నరబుల్’ (శారీరకంగా లేదా మానసికంగా దాడి ద్వారా హాని కలిగించే) అవుతారని ఆమె అంటుంది. ముఖ్యంగా మహిళలకు ఆ ఒత్తిడి మరింత ఎక్కువగా అనిపిస్తుందని గీత మాధురి అభిప్రాయ పడ్డారు. ఆమె బిగ్‌బాస్ హౌస్ గురించి మాట్లాడుతూ.. అక్కడ నిద్ర, సరైన ఆహారం ఉండదని.. అలాగే మనకు కావలసిన వాళ్లు ఉండరని అన్నారు. ఒక్కసారిగా మనల్ని ఒక గేమ్‌లోకి నెట్టేస్తారు. అక్కడ ప్రతి మాట, ప్రతి ఎమోషన్, ప్రతి కన్నీటి బొట్టు కూడా జడ్జ్ చేయబడుతుందని.. ఈ పరిస్థితుల్లో మహిళలు మరింతగా భావోద్వేగానికి లోనవుతారని ఆమె అన్నారు. ఎవరో మనతో మాట్లాడితే బాగుండని, ఎవరో మనను అర్థం చేసుకుంటే బాగుండని అనిపిస్తుందని అన్నారు. అదే సమయంలో “వాళ్లు నాతో నిజంగా మాట్లాడుతున్నారా..? లేక కంటెంట్ కోసమేనా..?” అనే డౌట్ కూడా వెంటాడుతుంది. ఈ అంతర్గత సంఘర్షణ మహిళలను మానసికంగా బలహీనంగా చేస్తుందని అన్నారు.
శివకార్తికేయన్ ‘పరాశక్తి’కి లైన్ క్లియర్!
సుధ కొంగర దర్శకత్వంలో తమిళ్ హీరో శివకార్తికేయన్ కథానాయకుడిగా రూపొందిన సినిమా ‘పరాశక్తి’. డాన్ పిక్చర్స్ రూ.150 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రంను నిర్మించింది. శివకార్తికేయన్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ పీరియడ్ డ్రామా జనవరి 10న రిలీజ్ కానుంది. అయితే గురువారం రాత్రి వరకూ సెన్సార్ సర్టిఫికెట్ రాకపోవడంతో.. పరాశక్తి రిలీజ్ అవుతుందా? లేదా? అన్న దానిపై అందరిలో సందిగ్ధత నెలకొంది. ఆ సందిగ్ధతకు ఈరోజు తెరపడింది. ఈరోజు ఉదయం పరాశక్తి మూవీకి సెన్సార్ బోర్డు ‘యూ/ఏ’ సర్టిఫికెట్ ఇచ్చింది. దీంతో చిత్ర యూనిట్ ఊపిరి పీల్చుకుంది. షెడ్యూల్ ప్రకారమే జనవరి 10న సినిమా రిలీజ్ కానుంది. విషయం తెలిసిన శివకార్తికేయన్ ఫాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ విడుదల కానుంది. 1960లలో తమిళనాడులోని హిందీ వ్యతిరేక నిరసనల నేపథ్యంతో ఇద్దరు స్నేహితుల చుట్టూ తిరిగే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కినట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. పరాశక్తిలో శ్రీలీల, రవిమోహన్, అథర్వ మురళీ కీలక పాత్రల్లో నటించారు.