ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.. దాదాపు 35కు పైగా అజెండా అంశాలకు మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది.. ఏపీ లాజిస్టిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది మంత్రివర్గం.. MSME పరిధిలో వచ్చే ఐదేళ్లలో 7,500 మందికి ఉపాధి కల్పనే లక్ష్యంగా ఏపీ క్లస్టర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాంను ఆమోదించింది.. పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు నిర్ణయాలకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం.. బార్లలో అదనపు రీటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ ఉపసంహరణపై మంత్రివర్గ ఉపసంఘం నివేదికపై చర్చించింది.. మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో మైక్రో బ్రూవరీలు ఏర్పాటుపై మంత్రివర్గంలో చర్చ జరిగింది.. గ్రామీణ ప్రాంతాల్లో జల్‌జీవన్ ద్వారా నీటి సరఫరాకు రూ.5 వేల కోట్ల రుణం పొందేందుకు ప్రభుత్వ గ్యారెంటీపై కూడా చర్చించారు.. ఇక, కోటబొమ్మాళిలో కొత్త ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది మంత్రివర్గం.. పాఠశాల కిట్‌ల పంపిణీ కోసం రూ.944.53 కోట్లకు పరిపాలన అనుమతులు ఇచ్చింది.. సంప్రదాయేతర ఇంధన, విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది కేబినెట్.. ఇక, వివిధ సంస్థల భూకేటాయింపులకు ఆమోదం తెలిపింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం..
కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత మంత్రులతో సీఎం కీలక చర్చలు.. విద్యుత్ ఛార్జీలపై గుడ్ న్యూస్..!
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం.. మంత్రులతో సీఎం ప్రత్యేకంగా కీలక చర్చలు జరిపారు. రాష్ట్ర రాజకీయాలు, తాజా పరిణామాలు, అభివృద్ధి కార్యాచరణపై మంత్రివర్గ సభ్యులతో విస్తృతంగా మాట్లాడారు. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు పీపీపీ (PPP– Public Private Partnership) విధానాన్ని విజయవంతంగా అనుసరిస్తున్నాయని సీఎం తెలిపారు. అదే విధానాన్ని ఆంధ్రప్రదేశ్‌లో మరింత బలోపేతం చేసే దిశగా కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్న పీపీపీ విధానంపై కూడా జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోందని వెల్లడించారు. తీరప్రాంత మౌలిక సదుపాయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం చంద్రబాబు.. ప్రతీ తీర జిల్లాలో ఒక పోర్టు ఏర్పాటు కావాలన్నది ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్న ఆయన.. లాజిస్టిక్స్ రంగంలో ఏపీ ప్రపంచ దేశాలతో పోటీపడేలా ఎదగాలన్నారు.. దీనికి అనుగుణంగా పోర్టుల అభివృద్ధి, కార్గో రవాణా, వాణిజ్య అవకాశాలు పెంచాలి అని సూచించారు. విద్యుత్ రంగంపై కూడా సీఎం స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం విధించిన రూ.4,490 కోట్ల ట్రూఅప్ ఛార్జీల భారాన్ని ప్రజలపై పడకుండా.. ప్రస్తుత ప్రభుత్వమే భరిస్తోందని వెల్లడించారు. విద్యుత్ యూనిట్ ధరను రూ.5.19 నుంచి రూ.4.90కి తగ్గించామని, మార్చి 2026 నాటికి దాన్ని రూ.4.80కి తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. వ్యవసాయ రంగంలో ఈసారి ప్రభుత్వం రికార్డు స్థాయిలో ధాన్యం సేకరణ చేపట్టిందని, రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించేలా అవగాహన కల్పించాలని సూచించారు. చివరిగా, పర్యాటక రంగంలో ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకుని రాష్ట్రాన్ని టూరిజం హబ్‌గా మార్చాలన్నది ప్రభుత్వ సంకల్పమని సీఎం పేర్కొన్నారు. మంత్రులు ప్రభుత్వ నిర్ణయాలు, సంస్కరణలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి.. రాష్ట్ర ప్రగతికి భాగస్వాములు కావాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.
పరకామణి కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. అది మనోభావాలు దెబ్బతీయడమే..!
ఆంధ్రప్రదేశ్‌లో చర్చగా మారిన టీటీడీ పరకామణి కేసు విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది హైకోర్టు.. కేసు దర్యాప్తుపై సంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు.. ఇదే సమయంలో.. పరకామణిలో టెక్నాలజీ తీసుకురావడం.. మానవ ప్రమేయం తగ్గించడంపై ఇంకా మెరుగైన సూచనలు, సలహాలు ఇవ్వాలని టీటీడీ కౌన్సిల్ ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు.. ఇక, శ్రీవారికి ఇచ్చిన కానుకలు పొర్లించడం, తొక్కడం మంచి పద్ధతి కాదని అభిప్రాయపడింది.. మరోవైపు, భక్తులను బట్టలు విప్పి తనిఖీలు చేయడం వారి మనోభావాలు దెబ్బతీయడమే అని వ్యాఖ్యానించింది.. ఈ కేసులో సీఐడీ, ఏసీబీ అధికారులు కేసు విచారణ వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు.. కేసుల నమోదులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ముందుకు వెళ్లాలని సీఐడీ, ఏసీబీ అధికారులకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.. ఇక, ఈ కేసులో తదుపరి విచారణ ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు..
అమరావతిలో ఎన్టీఆర్ విగ్రహం, స్మృతి వనం.. ప్లేస్ ఫైనల్ చేసిన కేబినెట్ సబ్ కమిటీ..
అమరావతిలో NTR విగ్రహం, స్మృతి వనం ఏర్పాటుపై కీలక నిర్ణయం తీసుకుంది కేబినెట్ సబ్ కమిటీ.. రాష్ట్ర రాజధాని అమరావతిలో దివంగత మాజీ ముఖ్యమంత్రి, తెలుగు జాతి గర్వకారణం నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) విగ్రహ ఏర్పాటు, స్మృతి వనం అభివృద్ధిపై ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం సచివాలయంలో జరిగింది.. ఈ సమావేశానికి మంత్రులు పి. నారాయణ, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, కందుల దుర్గేష్ అలాగే మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు, అమరావతి గ్రోత్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఎండీ శ్రీనివాస్ పాల్గొన్నారు. సమావేశంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ నమూనా విగ్రహాలను మంత్రులు పరిశీలించారు. డిజైన్, నిర్మాణం, కాన్సెప్ట్‌పై మంత్రుల మధ్య లోతైన చర్చ జరిగింది. విగ్రహం తుది రూపు ఖరారు, ఇతర అనుబంధ నిర్మాణాల రూపకల్పన కోసం ప్రభుత్వం ప్రత్యేక ఉపసంఘాన్ని కూడా నియమించింది. అయితే, అమరావతి పరిధిలోని నీరుకొండ గ్రామంలోని కొండపై, నీరుకొండ రిజర్వాయర్ సమీపంలో ప్రభుత్వం భారీగా 3,500 టన్నుల కంచు (Bronze) విగ్రహాన్ని ఏర్పాటు చేయనుంది. ఇది కేవలం విగ్రహమే కాకుండా తెలుగు జాతి వైభవం, తేజస్సు, సాహిత్య గొప్పతనాన్ని ప్రతిబింబించే స్మారకంగా నిలవనుంది అని మంత్రి నారాయణ తెలిపారు.
ఐ-ప్యాక్‌పై ఈడీ దాడులు.. మమత బెనర్జీ పరుగో పరుగు.. చేతిలో ‘‘గ్రీన్ ఫైల్’’
అసెంబ్లీ ఎన్నికలకు ముందు బెంగాల్‌లో ఈడీ సంచలన దాడులు నిర్వహించింది. సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీకి రాజకీయ కన్సల్టెన్సీగా పనిచేస్తున్న ఐ-ప్యాక్‌పై ఈడీ దాడులు చేయడం సంచలనంగా మారింది. ఈ దాడుల సమయంలో హైడ్రామా చోటుచేసుకుంది. తాజాగా ఈడీ దాడులు టీఎంసీ, బీజేపీ మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. ప్రశాంత్ కిషోర్‌కు చెందిన ఐ-ప్యాక్ (ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ)కి సంబంధించిన రెండు ప్రదేశాలలో ఈడీ ఏకకాలంలో ఈ రోజు దాడులు చేసింది. ఐ-ప్యాక్ చీఫ్ ప్రతీక్ జైన్ నివాసం, సాల్ట్ లేక్ ప్రాంతంలోని ఆఫీస్‌లో సోదాలు జరిగాయి. ఐ-ప్యాక్‌తో టీఎంసీ మంచి సంబంధాలు ఉన్నాయి. 2019 లోక్‌సభ, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీకి ఐ ప్యాక్ పనిచేసింది. ఈడీ దాడుల సమయంలో కోల్‌కతా పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్ హుటాహుటిన జైన్ నివాసానికి వెళ్లారు. కొద్దిసేపటికే అక్కడికి సీఎం మమతా బెనర్జీ చేరుకోవడం సంచలనంగా మారింది. కొన్ని నిమిషాల తర్వాత, ఆమె చేతిలో గ్రీన్ ఫైల్ ఉండటం, కంగారుగా కనిపించడం వైరల్ అయింది. ఈ దాడుల గురించి మాట్లాడుతూ.. ఇది రాజకీయ ప్రేరేపితమని, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు ఇది జరిగిందని ఆరోపించారు. తృణమూల్ ఎన్నికల వ్యూహాలను, 2026 ఎన్నికల అభ్యర్థల జాబితాను, పార్టీ రహస్య పత్రాలను పొందేందుకే ఈ దాడులు చేసినట్లు ఆమె ఆరోపించింది. ఎన్నికల వ్యూహాల ఫైళ్లను దొంగలించడానికి ఈడీ ప్రయత్నిస్తోందని అన్నారు.
దీపు చంద్ర దాస్ హత్యలో కీలక నిందితుడి అరెస్ట్.. మసీదు బోధకుడే సూత్రధారి..
బంగ్లాదేశ్‌లో హత్యకు గురైన హిందువు దీపు చంద్ర దాస్ కేసులో కీలక నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. దైవ దూషణ చేశాడనే ఆరోపణలతో వస్త్ర కర్మాగారంలో పనిచేస్తున్న దీపు దాస్‌పై మూక దాడికి పాల్పడి, అతడిని దారుణం హత్య చేసి, చెట్టుకు కట్టేసి నిప్పంటించారు. ఈ ఘటనను యావత్ ప్రపంచం ఖండించింది. దీని తర్వాత కూడా పలువురు హిందువులు హత్యకు గురయ్యారు. దీపు హత్య కేసులో ప్రధాన నిందితుడైన మాజీ ఉపాధ్యాయుడు యాసిన్ అరాఫత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతనే ఈ హత్యకు ప్రణాళిక రచించి, అమలు చేసినట్లు భావిస్తున్నారు. డిసెంబర్ 18న బంగ్లాదేశ్ ఢాకాకు 120 కి.మీ దూరంలో ఉన్న మైమన్‌సింగ్ జిల్లాలో వస్త్ర కర్మాగారంలో పనిచేస్తున్న 27 ఏళ్ల దీపు చంద్ర దాస్‌ను ఫ్యాక్టరీ సూపర్‌వైజర్లు బలవంతంగా రాజీనామా చేయించి, కార్యాలయం నుంచి బయటకు వెళ్లగొట్టారు. ఆగ్రహంతో ఉన్న మతోన్మాద గుంపుకు అప్పగించారు. దీంతో వారు దీపును దారుణంగా కొట్టి, హతమార్చారు. అతడి సహోద్యోగులు కూడా దీపు హత్యలో పాలుపంచుకున్నారు. హత్య తర్వాత, నిందితుడు అరాఫత్ ఆ ప్రాంతం నుండి పారిపోయి అజ్ఞాతంలోకి వెళ్ళాడని పోలీసులు తెలిపారు.
ఇంగ్లాండ్ ఇక ‘బజ్‌బాల్’కు చరమగీతం.. జట్టులో కీలక మార్పులు..!
ఆస్ట్రేలియాలో జరిగిన 2025–26 యాసిస్ సిరీస్ ఇంగ్లండ్‌కు మరోసారి నిరాశనే మిగిల్చింది. సిడ్నీ టెస్ట్‌లో ఐదు వికెట్ల తేడాతో ఓడి సిరీస్‌ను 1–4తో చేజార్చుకున్న తర్వాత ‘బజ్‌బాల్’ ఫిలాసఫీపై పెద్ద చర్చ మొదలైంది. కెప్టెన్ బెన్ స్టోక్స్ స్వయంగా ఈ దూకుడు విధానం ఇప్పుడు ప్రత్యర్థులకు అర్థమైపోయిందని అంగీకరించడం.. ఇప్పుడు ఇంగ్లండ్ క్రికెట్‌లో మార్పుల అవసరాన్ని స్పష్టంగా సూచిస్తోంది. సిరీస్ ఓటమి అనంతరం కెప్టెన్ స్టోక్స్ మాట్లాడుతూ.. మేము బ్యాటింగ్‌లో బాగానే కనిపించిన ప్రతిసారి ప్రత్యర్థులు ఒకే తరహా వ్యూహాలతో మాపై ఆధిపత్యం చూపిస్తున్నారని అన్నాడు. ఈ వ్యాఖ్యలు బజ్‌బాల్ ఇక పాత ఫార్ములాగా మారుతోందా? అన్న సందేహాలకు బలాన్నిచ్చాయి. సిడ్నీ టెస్ట్‌లో ఆస్ట్రేలియా కేవలం 160 పరుగుల లక్ష్యాన్ని ఐదో రోజు చేధించడం ఇంగ్లండ్ బలహీనతలను మరోసారి బహిర్గతం చేసింది. మార్నస్ లబుషేన్, జేక్ వెదరాల్డ్ మ్యాచ్‌ను సులువుగా ముగించగా.. ఇంగ్లండ్ బౌలింగ్, ఫీల్డింగ్ ప్రభావం చూపలేకపోయింది. ఆస్ట్రేలియా పరిస్థితులకు తగ్గట్టు ఆడలేకపోవడమే ఇంగ్లండ్ పరాజయానికి ప్రధాన కారణంగా మారింది. ఈ పరాజయంతో బజ్‌బాల్ భవిష్యత్తుపై విమర్శలు ఊపందుకున్నాయి. మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ వంటి వారు కూడా అతి దూకుడైన విధానానికి స్వల్ప మార్పులు అవసరమని బహిరంగంగా సూచిస్తున్నారు. స్టోక్స్ మాత్రం బాధ్యత నుంచి తప్పించుకోకుండా.. తాను కెప్టెన్‌గా “పెద్ద తప్పులు” చేశానని ఒప్పుకున్నాడు. అయితే ఇది నిందారోపణల సంస్కృతి కాదని, బాధ్యత తీసుకుని ముందుకు వెళ్లడమే లక్ష్యమని స్పష్టం చేశాడు.
‘కుక్క తోక వంకర’లా పాకిస్థాన్ ప్రీమియం బౌలర్ వ్యాఖ్యలు.. మళ్లీ ఇండియా, పాక్ ఆసియా కప్ వివాదం తెరపైకి..!
పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ అఫ్రిది గత ఏడాది సెప్టెంబర్‌లో జరిగిన ఆసియా కప్ లో భారత్ క్రీడాస్ఫూర్తిని ఉల్లంఘించిందని ఆరోపించాడు. తాజాగా లాహోర్‌లో జరిగిన ఓ మీడియా సమావేశంలో మాట్లాడిన ఆతను.. భారత్–పాకిస్థాన్ మ్యాచ్‌ల సమయంలో కనిపించిన పరిణామాలు “క్రీడా విలువలకు విరుద్ధంగా” ఉన్నాయని వ్యాఖ్యానించాడు. ఇంకా షాహీన్ అఫ్రిది మాట్లాడుతూ.. సరిహద్దు అవతలవైపు ఉన్నవారు క్రీడాస్ఫూర్తిని పాటించలేదని.. మా పని క్రికెట్ ఆడటమే, మేము మైదానంలోనే సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తాం అంటూ మాట్లాడాడు. ఈ వ్యాఖ్యలు 2026 టీ20 ప్రపంచకప్‌లో ఫిబ్రవరి 15న కొలంబోలో జరగనున్న ఇండియా–పాకిస్థాన్ మ్యాచ్‌కు మరింత ఆసక్తిని పెంచేలా చేస్తున్నాయి. ఇకపోతే గత ఏడాది జరిగిన ఆసియా కప్ సమయంలో భారత్–పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొని ఉంది. మ్యాచ్‌ల అనంతరం పాకిస్థాన్ ఆటగాళ్లతో హ్యాండ్ షాక్ చేయడానికి భారత జట్టు నిరాకరించడం పెద్ద చర్చకు దారితీసింది. భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో మొదలైన ఈ వైఖరిని మిగతా ఆటగాళ్లూ అనుసరించడంతో టోర్నమెంట్ మొత్తం ఈ అంశం వివాదంగా కొనసాగింది.
వాయిదా దెబ్బతో 50 కోట్లు వెనక్కి..జన నాయగన్ సెన్సేషనల్ రికార్డ్
దళపతి విజయ్ ఆఖరి సినిమా ‘జన నాయగన్’ విడుదల వాయిదా పడటం ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక అనూహ్యమైన పరిణామానికి దారితీసింది. సాధారణంగా ఒక సినిమా వాయిదా పడితే కొన్ని వందలు లేదా వేలల్లో రీఫండ్‌లు జరుగుతుంటాయి. కానీ, ఈ సినిమా విషయంలో ఏకంగా 4.5 లక్షల టికెట్లను బుక్‌మైషో రీఫండ్ చేస్తూ నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. ఈ క్రమంలోనే భారత సినీ చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో టికెట్లను క్యాన్సిల్ చేసి, డబ్బులు వెనక్కి ఇవ్వడం ఇదే తొలిసారిగా నిలవనుంది. ముందుగా నిర్ణయించిన ప్రకారం, ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామా జనవరి 9, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కావాల్సి ఉన్నా సెన్సార్ బోర్డు (CBFC) నుంచి సర్టిఫికేట్ రావడంలో జాప్యం జరగడం, మద్రాస్ హైకోర్టులో విచారణ వంటి కారణాలతో విడుదల అనివార్యంగా వాయిదా పడింది. దాదాపు రూ. 500 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉండటంతో, బుకింగ్స్ ఓపెన్ అయిన నిమిషాల్లోనే లక్షలాది టికెట్లు అమ్ముడయ్యాయి. సినిమా విడుదల ఆగిపోవడంతో, ప్రేక్షకుల నుంచి వచ్చిన ఒత్తిడిని దృష్టిలో పెట్టుకుని బుక్‌మైషో మరియు డిస్ట్రిబ్యూటర్లు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు.
గెట్ రెడీ రెబల్స్.. తెలంగాణ జీవో లోడింగ్.. డైనోసార్ కమింగ్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ ‘ది రాజా సాబ్’ విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తోంది, మారుతి దర్శకత్వంలో హారర్-కామెడీ జోనర్‌లో వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ వింటేజ్ లుక్ ఇప్పటికే సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ సినిమా టికెట్ ధరల పెంపు మరియు బెనిఫిట్ షోలకు సంబంధించి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా బెనిఫిట్ షోలకు, తర్వాత పది రోజుల పాటు టికెట్ రేట్లను పెంచుతూ ఒక జీవో జారీ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. కానీ తెలంగాణలో మాత్రం ఆ జీవో ఇంకా రాలేదు. ఈరోజు రాత్రికే బెనిఫిట్ షోలు, ప్రీమియర్స్ వేయాల్సి ఉండగా ఆ జీవో ఇంకా రాలేదు. అయితే కోర్టు సమయం ముగిశాక ఆ జీవో జారీ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. సాధారణంగా ఏదైనా పెద్ద సినిమాకు ప్రభుత్వం రేట్లు పెంచుతూ జీవో (GO) ఇచ్చిన వెంటనే, కొందరు కోర్టులో పిటిషన్లు దాఖలు చేసే అవకాశం ఉంటుంది. దీనివల్ల బుకింగ్స్ ఆగిపోవడం లేదా చివరి నిమిషంలో చిక్కులు ఎదురవడం వంటివి జరుగుతుంటాయి. ఈ ఇబ్బందులను ముందే ఊహించిన ప్రభుత్వం, కోర్టు పనివేళలు ముగిసిన తర్వాతే (సాయంత్రం 5:30 గంటలకు) టికెట్ రేట్ల పెంపు మరియు బెనిఫిట్ షోల అధికారిక ఉత్తర్వులను విడుదల చేసే యోచనలో ఉన్నారని తెలుస్తోంది. కోర్టు సమయం ముగియడం వల్ల, ఆ రోజున ఎవరూ ఈ జీవోపై స్టే కోరుతూ పిటిషన్ వేసే అవకాశం ఉండదు. తద్వారా ఎలాంటి ఆటంకాలు లేకుండా బుకింగ్స్ ప్రక్రియను పూర్తి చేయాలని ప్లాన్ చేశారు. ప్రభుత్వ జీవో వెలువడిన వెంటనే థియేటర్ యాజమాన్యాలు బుక్‌మైషో సహా ఇతర పోర్టల్స్‌లో బుకింగ్స్ జరిగేలా డేటాను అప్‌డేట్ చేస్తున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం, నేడు సాయంత్రం 5:30 నుండి 6:00 గంటల మధ్య ‘ది రాజా సాబ్’ అడ్వాన్స్ బుకింగ్స్ పూర్తిస్థాయిలో ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బెనిఫిట్ షోలకు (అర్ధరాత్రి లేదా తెల్లవారుజాము షోలు) కూడా లైన్ క్లియర్ అయింది. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన కేంద్రాలలో ఈ షోల కోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రభుత్వం అనుమతి కూడా దాదాపు ఖాయం కావడంతో ఇప్పుడు రికార్డు స్థాయి వసూళ్లపై చిత్ర యూనిట్ ధీమాగా ఉంది.