కార్తీక మాసం రద్దీ.. ప్రముఖ ఆలయాల్లో భక్తుల భద్రతపై పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు..
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ ఘటనతో ప్రభుత్వం అప్రమత్తమైంది.. వివిధ ఆలయాల్లో భక్తుల భద్రత, సౌకర్యాల కల్పనపై ఫోకస్ పెట్టింది.. కార్తీక మాసం సందర్భంగా ప్రముఖ ఆలయాలకు భక్తుల రద్దీ పెరిగిన నేపథ్యంలో కాకినాడ జిల్లా పరిధిలోని ప్రముఖ క్షేత్రాల్లో భక్తుల భద్రత, సౌకర్యాల కల్పనపై యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. క్యూ లైన్ల నిర్వహణ, పారిశుధ్య నిర్వహణ, భద్రతాపరమైన అంశాలపై తగిన చర్యలు చేపట్టాలన్నారు. ఎక్కడా భక్తులకు అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు పాటించాలని జిల్లా కలెక్టర్, ఎస్సీలను ఆదేశించారు. కాకినాడ జిల్లా పరిధిలో ప్రముఖ శైవ క్షేత్రాలయిన సామర్లకోట కుమార భీమేశ్వరస్వామి ఆలయం, పిఠాపురం శ్రీ పాద గయ, అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి ఆలయాలతోపాటు పలు ప్రధాన ఆలయాల్లో కార్తీక మాసంలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది.. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ముందుగానే ఏర్పాట్లు చేసుకోవాలని స్పష్టం చేశారు. కాకినాడ జిల్లా కలెక్టర్, ఎస్పీతోపాటు వివిధ శాఖల జిల్లా అధికారులకు పుణ్య క్షేత్రాలు, దేవాలయాలలో ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు పవన్ కల్యాణ్.. కాశీబుగ్గ ఘటన నేపథ్యంలో దేవాదాయ శాఖ ఆలయాల దగ్గర తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అన్నారు పవన్. ప్రసిద్ధ క్షేత్రాలతోపాటు ప్రైవేట్ వ్యక్తులు, సంస్థల నిర్వహణలో ఎన్ని ఆలయాలు ఉన్నాయో దేవాదాయ శాఖ అధికారులు నివేదిక సిద్ధం చేసి జిల్లా కలెక్టర్, ఎస్పీలకు తక్షణమే అందించాలి అన్నారు. అక్కడ కూడా రద్దీ విషయమై పర్యవేక్షణ చేయాలని తెలిపారు. ఈ నెల 5వ తేదీన కార్తీక పౌర్ణమి ఉన్నందున ఆ రోజు, ఆ తరవాతి రోజు ఉండే రద్దీని అంచనా వేసుకోవాలి. ముఖ్యంగా శని, ఆది, సోమవారాల్లో భక్తుల సంఖ్య ఊహించని విధంగా పెరుగుతోంది. ఆలయాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవాదాయ, పోలీసు, పంచాయతీరాజ్, మున్సిపల్, రెవెన్యూ శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలి. భక్తుల రద్దీకి తగిన విధంగా ఆలయ ప్రాంగణంలో క్యూ లైన్ల నిర్వహణ ఉండాలి. క్యూ లైన్లపైనా, ఆలయ పరిసరాల్లోనూ సీసీ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ వ్యవస్థ ఏర్పాటు చేయాలి అని ఆదేశించారు..
సర్కార్‌పై సజ్జల ఫైర్.. ప్రభుత్వానికి అర్థమే మారిపోయింది..!
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వానికి అర్థమే మారిపోయింది అని ఆరోపించారు వైసీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి.. ప్రజల ఆకాంక్షల మేరకు ఏ ప్రభుత్వాలు అయినా పనిచేస్తాయి.. మానిఫెస్టోలు అమలు చేయటంతో పాటు వ్యవస్థలకు అనుగుణంగా పనిచేయాలి.. కానీ, కూటమి ప్రభుత్వం మాత్రం వ్యవస్థలను గాలికి వదిలేసింది.. ప్రభుత్వమే నేరస్వభావం కలిగి ప్రత్యర్థి పార్టీల నేతలను టార్గెట్ చేస్తుందని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో ఇలాంటి పరిస్థితులు లేవు.. ప్రభుత్వం లోని పెద్దలే ఆర్గనైజ్డ్ క్రైమ్ కు పాల్పడుతున్నారు.. శాంతిభద్రతల పరిరక్షణ విషయం డొల్లగా మారిపోయింది.. చంద్రబాబు పొలిటికల్ గవర్నెన్స్ వికృత రూపంలోకి వెళ్ళిపోయింది.. మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్ తో వీరి వికృత చేష్టలు పీక్ స్టేజ్ కు వెళ్లాయి.. అసలు ఈ ప్రభుత్వంలో ఏం జరుగుతుందని చూపించిన వ్యక్తిపై కేసులు పెట్టారు అంటూ మండిపడ్డారు.. నకిలీ మద్యం తయారు చేసి అమ్మే బ్యాచ్ ని పట్టుకున్నారు.. ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర తర్వాత కూడా మా నేతలపై నెపాన్ని వేయటం శోచనీయం అన్నారు సజ్జల.. టీడీపీ నేత జయచంద్రారెడ్డి ప్రత్యక్ష ప్రమేయంపై సాక్ష్యాధారాలు ఉన్నాయి.. టీడీపీ వాళ్ల పాత్ర క్లియర్ గా కనిపిస్తున్నా తిరిగి వైసీపీ నేతలపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మాపై అనేక ఆధార రహిత ఆరోపణలు చేశారు.. సోషల్ మీడియా యాక్టివిస్టులపై కేసులు పెట్టారు.. లడ్డూ కల్తీ అంటూ దాన్ని వివాదం చేశారు.. టీడీపీ గ్రూపుల్లో గొడవలతో జంట హత్యలు జరిగినా మా పార్టీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులపై కేసులు పెట్టారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు..
ఎకో టూరిజం గమ్యస్థానంగా పులికాట్.. ఫ్లెమింగోల శాశ్వత స్థావరంగా తీర్చిదిద్దుతాం..
ఎకో టూరిజం గమ్యస్థానంగా పులికాట్.. ఫ్లెమింగోల శాశ్వత నివాస స్థావరంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. పులికాట్ సరస్సుకు శీతాకాలపు అతిథుల రాక మొదలైంది. వేల కిలోమీటర్లు ప్రయాణించి సైబీరియా నుంచి వచ్చి చేరిన ఫ్లెమింగోలు.. మన అందరికీ కనువిందు చేయడానికి సిద్ధమయ్యాయి. ఆహారం, విశ్రాంతి కోసం వచ్చే ఆరు నెలలపాటు పులికాట్ పరిసరాల్లోనే నివసిస్తాయి. అందుకే ప్రతి ఏడాది ఈ నీటి పక్షుల రాకను ‘ఫ్లెమింగో ఫెస్టివల్’ పేరిట ఘనంగా జరుపుకుంటాం. మూడు రోజుల పండుగకు ఏడు నుంచి ఎనిమిది లక్షల మంది సందర్శకులు రావడం.. ఈ పక్షులతో మనకున్న అనుబంధానికి నిదర్శనం. మనమందరం ముద్దుగా ‘రాజహంస’ అని పిలిచే ఈ ఫ్లెమింగోలు జీవ వైవిధ్యానికి ప్రతీకలు. అక్టోబర్ లో వచ్చి మార్చిలో తిరిగి వెళ్లే ఈ విదేశీ అతిథులు.. ఇటీవల మాత్రం సంవత్సరం పొడవునా పులికాట్ ప్రాంతంలోనే కనిపిస్తున్నాయి. అంటే, ఇక్కడి వాతావరణం, ఆహారం, భద్రత.. ఇవన్నీ వీటి సహజ జీవనానికి ఎంతగానో అనుకూలిస్తున్నాయనే మాట అన్నారు పవన్..
కేసీఆర్ వక్రబుద్ధితో SLBCని పడుకోబెట్టారు
నాగర్‌కర్నూల్ జిల్లా మన్నేవారిపల్లిలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటిస్తున్నారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. SLBCని గత ప్రభుత్వం గాలికి వదిలేసిందన్నారు. పదేళ్లు.. పది కిలో మీటర్ల టన్నెల్ కూడా పూర్తి చేయలేదని విమర్శించారు. కేసీఆర్‌కి చిత్తశుద్ధి ఉంటే ఎప్పుడో టన్నెల్ పూర్తియ్యేదని, SLBC పూర్తి ఐతే కాంగ్రెస్ కి పేరు వస్తుంది అని పక్కన పెట్టారని ఆయన మండిపడ్డారు. పేరే కాదు.. కమిషన్ కూడా రాదని కేసీఆర్.. హరీష్ పక్కన పెట్టారన్నారు. కేసీఆర్ వక్రబుద్ధితో SLBCని పడుకోబెట్టారని ఆయన ధ్వజమెత్తారు. అంతేకాకుండా..’ 42km టన్నెల్ ప్రపంచంలో ఎక్కడా లేదు. దీన్ని పూర్తి చేస్తే.. ఆ కీర్తి కూడా తెలంగాణ కి దక్కుతుంది. పదేళ్లలో 5 వేల కోట్లు లిఫ్ట్ ల విద్యుత్ కి ఖర్చు చేశారు. కానీ రెండు వేల కోట్లు ఇస్తే ప్రాజెక్ట్ పూర్తి అయ్యేది. ఇప్పుడు 4600 కోట్లతో ప్రాజెక్టు ఇప్పుడు పూర్తి అవుతుంది. గ్రావిటీతో నీళ్ళు ఇవ్వచ్చు. నల్గొండ.. మహబూబ్ నగర్ కి తీవ్ర నష్టం చేశారు కేసీఆర్. కృష్ణ నది మీద కేసీఆర్ కూడా తెలంగాణ కి నష్టం చేశారు. ప్రాజెక్టులకి 1.86 వేల కోట్లు ఖర్చు చేశారు కేసీఆర్. కాళేశ్వరంకే లక్ష 20 వేల కోట్లు ఖర్చు చేశారు. పదేళ్లలో ప్రాజెక్టు లు పూర్తి చేయలేదు. ఇప్పుడు వాటి మీద ఆంధ్రా అభ్యంతరం చెప్తుంది. ఏపీకి అలూసు ఐపోయింది. కార్మికులు చనిపోవడం బాధకరమైన అంశమే. మాక్కూడా ప్రాణం విలువ తెలుసు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక్కడే ఉండి.. ఆర్మీ సపోర్ట్ తీసుకున్నారు. నిపుణులైన ఆర్మీ అధికారులను డిప్యూటేషన్ మీద తెచ్చుకున్నాం. బ్యాలెన్స్ టన్నెల్ 9.8 km ఉంది.
ఇద్దరు పిల్లలను అనాథలను చేసిన చేవెళ్ల బస్సు ప్రమాదం
చేవెళ్ల సమీపంలో జరిగిన ఘోర ఆర్టీసీ బస్సు ప్రమాదం ఓ కుటుంబాన్ని దుఃఖంలో ముంచేసింది. వికారాబాద్ జిల్లా యాలాల మండలం హాజీపూర్ గ్రామానికి చెందిన దంపతులు ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో మరణించిన వారు కురుగుంట బందేప్ప (45), కురుగుంట లక్ష్మి (43). వీరిద్దరూ జీవనోపాధి కోసం అడ్డా కూలీలుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. అయితే.. లక్ష్మి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. శరీరంలో బలహీనత, అస్వస్థత కారణంగా వైద్య పరీక్షల కోసం ఉస్మానియా ఆసుపత్రికి వెళ్లాలని నిర్ణయించారు. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున భార్యాభర్తలు చేవెళ్ల వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ప్రయాణం ప్రారంభించారు. అయితే దురదృష్టవశాత్తు, చేవెళ్ల సమీపంలో బస్సు టిప్పర్ వాహనాన్ని ఢీకొనడంతో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఈ దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు.
19 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి
చేవెళ్ల ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిపై పోస్టుమార్టం ప్రక్రియ పూర్తయింది. చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో మొత్తం 19 మృతదేహాలకు పోస్ట్‌మార్టం నిర్వహించారు. ఉస్మానియా ఆసుపత్రి నుండి వచ్చిన 12 మంది వైద్యుల బృందం ఈ పోస్టుమార్టం ప్రక్రియలో పాల్గొన్నారు. ఫోరెన్సిక్ విభాగం వైద్యుల ప్రకారం, ప్రమాదానికి కారణమైన టిప్పర్ డ్రైవర్ ఎలాంటి మద్యం సేవించలేదని తేలిందని తెలిపారు. ఇప్పటికే 18 మంది మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. చివరి మృతదేహం.. టిప్పర్ డ్రైవర్‌ది.. అప్పగించే ప్రక్రియ కొనసాగుతోంది. డ్రైవర్ కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్ద మృతదేహం కోసం ఎదురుచూస్తున్నారు. మరికాసేపట్లో టిప్పర్ డ్రైవర్ మృతదేహాన్ని తరలించేందుకు అంబులెన్స్ ఇప్పటికే చేవెళ్ల ఆసుపత్రికి చేరుకుంది. ఈ ఘటనతో చేవెళ్ల ప్రాంతం అంతా విషాదంలో మునిగిపోయింది.
‘‘మీకు అడగటానికి వేరే ప్రశ్నలే లేవా.?’’ మీడియాపై సీఎం ఆగ్రహం..
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల చివర్లో కాంగ్రెస్ ప్రభుత్వం తన ఐదేళ్ల పదవీ కాలంలో సగం కాలం పూర్తి చేసుకోబోతోంది. ఈ నేపథ్యంలో సీఎం మార్పు ఉంటుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మద్దతుదారులు ఆయన తదుపరి సీఎం కావాలని డిమాండ్ చేస్తున్నారు. సోమవారం రాష్ట్ర నాయకత్వ మార్పుపై రిపోర్టర్ అడిగిన ప్రశ్నపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మీకు అడగటానికి ఇకేం ప్రశ్నలు లేవా..? ప్రజలు ఏమి కోరుకుంటున్నారో దాని గురించి మాట్లడనివ్వండి. కానీ హైకమాండ్ ఎవరు.? దీని గురించి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే మాట్లాడారా..’’ అని విలేకరిని సీఎం అడిగారు. ‘‘మీరు ఎప్పుడూ దీని గురించే ఎందుకు మాట్లాడుతున్నారు..? ఇప్పుడు ఈ ప్రశ్న అడగాల్సిన అవసరం ఎందుకు వచ్చింది.? హైకమాండ్ కాకుండా దీని గురించి ఎవరు మాట్లాడినా ప్రాముఖ్యత ఉండదు’’ అని ఆయన అన్నారు.
‘‘ పప్పు, తప్పు, అక్కులు మూడు కోతులు ’’.. ముగ్గురు నేతలపై యోగి సెటైర్లు..
ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సోమవారం ప్రతిపక్ష ఇండి కూటమి నాయకులపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్‌లను ‘‘పప్పు, తప్పు, అక్కు’’గా ప్రస్తావించారు. బీహార్‌లోని దర్భంగాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న యోగి, వీరిని మూడు కోతులుగా పిలిచారు. ‘‘మహాత్మా గాంధీ చెప్పినట్లు మూడు కోతులు ఉన్నట్లే, నేడు ఇండియా కూటమి పప్పు, తప్పు, అక్కు (రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్, అఖిలేష్ యాదవ్) పేరుతో మూడు కోతులను తీసుకువచ్చింది. పప్పు నిజం మాట్లాడలేడు, మంచి ఏమీ చెప్పలేడు. తప్పు ఏ సత్యాన్ని చూడలేడు, అప్పు నిజం వినలేడు’’ అని ఆయన అన్నారు.
క్రైస్తవ దేశంపై అమెరికా వైమానిక దాడులు.. ఇక వారికి చావే!
అమెరికా త్వరలో నైజీరియాపై వైమానిక దాడులు ప్రారంభించవచ్చని సమాచారం. ఈ దేశంలో క్రైస్తవులను చంపుతున్న ఉగ్రవాదులను నిర్మూలించడానికి తన మనస్సులో అనేక ప్రణాళికలు ఉన్నాయని ఇటీవల యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. నైజీరియాలో క్రైస్తవ మతం ఉనికికి ముప్పును ఎదుర్కొంటుందని ట్రంప్ వెల్లడించారు. ఈ దేశంలో వేలాది మంది క్రైస్తవులను చంపుతున్నారు, ఈ సామూహిక హత్యకు రాడికల్ ఇస్లాంవాదులు బాధ్యత వహిస్తున్నారని ట్రంప్ స్పష్టం చేశారు. తర్వలోనే నైజీరియాలోని కొన్ని స్థావరాలపై వైమానిక దాడులు లేదా అమెరికా దళాలను పంపవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
మహిళల వన్డే ప్రపంచ కప్ నిజమైన ఛాంపియన్.. ఈయనే !
అమోల్ మజుందార్ తన ఫస్ట్-క్లాస్ కెరీర్‌ను 1993లో ముంబై జట్టుతో ప్రారంభించాడు. రెండు దశాబ్దాలకు పైగా తన కెరీర్‌లో అమోల్ మజుందార్ 171 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌ల్లో 11,000 పరుగులు సాధించాడు. ఈ కాలంలో ఆయన 30 సెంచరీలు చేశాడు. కానీ టీమిండియా తరపున ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు. రంజీల్లో అద్భుతమైన ప్రదర్శనలు చేసిన భారత జట్టులో అవకాశం రాకపోవడంతో అమోల్ ముజుందార్ నిరాశ చెందాడు. దీంతో ఆయన 2014లో క్రికెట్ నుంచి రిటైర్ అయ్యి కోచింగ్ వైపు మొగ్గు చూపాడు. ఆయన తన కెరీర్‌లో నెదర్లాండ్స్, దక్షిణాఫ్రికా, రాజస్థాన్ రాయల్స్ వంటి జట్లతో కలిసి పనిచేశాడు. ఈ సమయంలో ఆయనకు గొప్ప పేరు వచ్చింది. అక్టోబర్ 2023లో ఆయన భారత మహిళా జట్టుకు ప్రధాన కోచ్‌గా నియమితుడయ్యాడు. ఆ సమయంలో దేశం తరపున ఎప్పుడూ ఆడని వ్యక్తి కోచ్ ఎలా అవుతాడని చాలామంది ప్రశ్నించారు. కానీ ఆయన భారత మహిళా జట్టుకు అందించిన అపూర్వ విజయంతో ఇప్పుడు ప్రశ్నించిన వారందరి నోళ్లు మూతపడ్డాయి.
జట్టు నుంచి తొలగించారు, తండ్రికి గుండెపోటు.. షెఫాలీ భాధలు వర్ణనాతీతం!
ప్రతిభతో పాటు కాస్త అదృష్టం కూడా తోడుంటేనే విజయం సాధిస్తారు అని అంటుంటారు. భారత మహిళా జట్టు ఓపెనర్ షఫాలీ వర్మ విషయంలో ఇదే జరిగింది. 21 ఏళ్ల షఫాలీ భారత క్రికెట్ చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకుంది. ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ 2025 ఫైనల్‌లో బ్యాట్, బంతితో మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన ఇచ్చి.. భారత జట్టు 52 ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలికింది. ప్రపంచ కప్ సెమీఫైనల్స్‌కు ముందు కూడా చర్చించబడని షఫాలీ పేరు.. ఇప్పుడు సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. ఇదే విధి అంటే. ఓపెనర్ ప్రతికా రావల్ స్థానంలో షెఫాలీ వర్మ ప్రపంచకప్ జట్టులోకి వచ్చింది. సెమీఫైనల్స్ ముందు ప్రతీకా గాయపడింది. ఆ సమయంలో షెఫాలీ దేశీయ టీ20 సిరీస్‌లో ఆడుతోంది. మేనేజ్మెంట్ నుంచి కాల్ రావడంతో.. భారత జట్టులో అడుగుపెట్టారు. సెమీఫైనల్స్‌లో ఆస్ట్రేలియాపై ఆడింది. సెమీఫైనల్స్‌లో షెఫాలీ రాణించలేదు. ఎందుకు తీసుకున్నారు రా బాబు అని అందరూ అనుకున్నారు. కానీ ఫైనల్స్‌లో సత్తాచాటింది. బ్యాట్, బంతితో తన అద్భుతంగా రాణించింది. బ్యాటింగ్‌లో 78 బంతుల్లో 87 పరుగులు చేసిన షెఫాలీ.. ఆపై బౌలింగ్‌లో 7 ఓవర్లలో 36 పరుగులు ఇచ్చి భారత విజయంలో కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు ఆమెపై ప్రశంసలు కురుస్తున్నాయి.
ఆస్కార్ అవార్డుల్లో లాబీయింగ్ ఉంది.. స్టార్ యాక్టర్ కామెంట్స్
ఆస్కార్ అవార్డుల విషయంలో కూడా లాబీయింగ్ ఉందనే విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఎందుకంటే ఎంతో మంది హాలీవుడ్ నటులు ఈ ఆరోపణలు చేశారు. కొన్ని దేశాల విషయంలోనే ఆస్కార్ అవార్డుల కమిటీ సానుకూలంగా ఉంటుందని.. మిగతా దేశాల్లో ఎంత గొప్ప సినిమాలు వచ్చినా పట్టించుకోరు అనే విమర్శలు లేకపోలేదు. తాజాగా స్టార్ యాక్టర్ పరేశ్ రావల్ కూడా ఇలాంటి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. అవార్డుల కంటే తనకు వచ్చే ప్రశంసలే ముఖ్యం అన్నారు పరేశ్. అవార్డుల విషయంలో తాను ఎప్పుడూ పెద్దగా ఆశించబోనన్నారు. నేషనల్ అవార్డుల విషయంలోనూ లాబీయింగ్ కు ఆస్కారం ఉందన్నాడు.