ఏపీలో తొలిసారిగా రెండు రాష్ట్రాల అధికారుల భేటీ.. వీటిపై ఫోకస్
ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా రెండు తెలుగు రాష్ట్రాల అధికారులు భేటీ అయ్యారు. ఏపీ ఐఐసీ కార్యాలయంలో ఏపీ, తెలంగాణ అధికారుల కమిటీ సమావేశం అయ్యింది.. ఏపీ ఐఐసీ కార్యాలయానికి ఒకే కారులో వచ్చారు ఏపీ సీఎస్ నీరభ్ కుమార్, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంత కుమారి.. ఆ తర్వాత సమావేశం ప్రారంభమైంది.. రెండు తెలుగు రాష్ట్రాల్లో పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారమే అజెండాగా ఈ సమావేశం జరుగుతోంది.. విభజన చట్టంలోని 9, 10 షెడ్యూలు సంస్థల ఆస్తుల పంపకాలపై చర్చించనుంది సీఎస్‌ల కమిటీ.. విద్యుత్ బకాయిలు, ఉద్యోగుల పరస్పర మార్పిడి, వృత్తి పన్ను పంపకంపై అధికారుల కమిటీ చర్చిస్తోంది.. ఉమ్మడి సంస్థల ఖర్చులను తిరిగి చెల్లించే అంశంపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉండగా.. విభజన పూర్తి కాని సంస్థలకు చెందిన నగదు నిల్వలపైనా అధికారుల కమిటీలో చర్చ సాగనుంది.. షెడ్యూలు 9, 10లోని సంస్థల బ్యాంకు ఖాతాల్లో పంపకం కాకుండా మిగిలిపోయిన 8 వేల కోట్ల అంశంపై కూడా చర్చ జరిగే అవకాశం ఉందంటున్నారు.. తెలంగాణా నుంచి ఆ రాష్ట్ర సీఎస్ శాంతి కుమారి, ఆర్ధిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా, ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, సాధారణ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శి రఘునందన్ రావు ఈ సమావేశానికి హాజరు కాగా.. ఏపీ నుంచి సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ , ఆర్ధిక శాఖ ముఖ్యకార్యదర్శి పీయూష్ కుమార్ , సాధారణ పరిపాలన శాఖ సురేష్ కుమార్, బాబు.ఏ హాజరయ్యారు..
సీఎం, డిప్యూటీ సీఎం భేటీ.. 2 గంటల పాటు కీలక చర్చలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సమావేశం అయ్యారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాన్.. మధ్యాహ్నం ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసానికి వెళ్లిన పవన్ కల్యాణ్.. ఆయనతో సుదీర్ఘంగా సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు.. కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం సీజ్ వ్యవహారం.. బియ్యం అక్రమ రవాణా సహా తాజా రాజకీయ పరిణామాలు, రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక.. పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటనతో పాటు కాకినాడ పర్యటనపై సమాలోచనలు చేసినట్టుగా తెలుస్తోంది.. సోషల్ మీడియా కేసుల వ్యవహారంతో పాటు నామినేటెడ్ పోస్టుల అంశంపై కూడా ఇద్దరు నేతల మధ్య సుదీర్ఘ సమాలోచనలు జరిగినట్టుగా చెబుతున్నారు.. ఇక, రేపటి కేబినెట్ సమావేశం సహా పలు ప్రధాన అంశాలపై కూడా చర్చ జరిగినట్టుగా చెబుతున్నారు.. కాగా, ఈ మధ్యే ఢిల్లీలో పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ప్రధాని నరేంద్ర మోడీ సహా పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.. ఇక, ఆ తర్వాత.. కాకినాడలో పట్టుబడి రేషన్ బియ్యాన్ని ఆయన గ్రౌండ్‌లెవల్‌లోకి వెళ్లి పరిశీలించడం.. ఆ తర్వాత డిప్యూటీ సీఎంగా ఉన్న నన్నే అధికారులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.. దీనిపై కేంద్రానికి లేఖ రాస్తానని వ్యాఖ్యానించడం సంచలనంగా మారిన విషయం విదితమే.. అయితే, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మధ్య జరిగిన సమావేశంలో.. ఈ అన్నింటినిపై చర్చ సాగినట్టుగా తెలుస్తోంది..
వాళ్లు ఇప్పుడు రాజకీయాలు వదిలేస్తే.. చట్టం వదిలేస్తుందా..?
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. గతంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో భాగస్వాములు అయినవాళ్లు.. అనుకూలంగా వ్యవహరిస్తూ.. వీడియోలు, పోస్టులు పెట్టినవాళ్లు కొందరు.. తాము రాజకీయాలకు గుడ్‌బై చెప్పేస్తునట్టు ప్రకటించారు.. కొందరు గత వివాదాల్లో కేసులు ఎదుర్కొంటుండగా.. ఇంకా కొందరు ముందుగానే క్షమాపణలు కోరుతున్నారు.. అయితే, ఈ వ్యవహారాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. పోసాని కృష్ణమురళి, శ్రీరెడ్డి, ఆర్జీవీ ఈవేళ రాజకీయాలు వదిలేస్తే.. చట్టం వదిలేస్తుందా? అని ప్రశ్నించారు.. సొంత చెల్లినే బయటకు నెట్టేసిన వాడు.. ప్రజలకు ఏమీ చేస్తాడు..? ప్రజలకు ఏమీ చెబుతానని జనంలోకి వస్తాడు..? అంటూ నిలదీశారు.. ఇక, మాజీ సీఎం జగన్ పై ఫైర్ అయ్యారు మాజీ బుచ్చయ్య చౌదరి. ల్యాండ్ గ్రాబింగ్ చట్టంతో భూకబ్జా దారులపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు..
కాళేశ్వర రావు ఇప్పుడు కూలేశ్వర రావు గా మారిపోయారు
హరీష్ రావు వ్యాఖ్యలకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. ఇవాళ ఆది శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వర రావు ఇప్పుడు కూలేశ్వర రావు గా మారిపోయారని, హరీష్ రావు కాంగ్రెస్ లోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేసింది నిజం కాదా? అని ఆయన వ్యాఖ్యానించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ లోకి వస్తానని అడిగింది వాస్తవం కాదా? హరీష్ ప్రయత్నాలు కేసీఆర్ కి తెలిసి దూరం పెట్టలేదా? అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ కొప్పడడం వల్ల హరీష్ రావు వార్తలు సైతం మీడియాలో రాలేదని ఆది శ్రీనివాస్ అన్నారు. హరీష్ రావుకు అన్ని తెలిసినా పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని, పార్టీ ఫిరాయింపుల పై మాట్లాడే అర్హత హరీష్ రావుకు ఎక్కడిది? అని ఆయన మండిపడ్డారు. హరీష్ రావు మార్ఫింగ్ సినిమా చూపిస్తున్నాడని, బీఆర్ఎస్ సినిమా అయిపోయిందన్నారు ఆది శ్రీనివాస్. కాంగ్రెస్ పార్టీ ఎపిసోడ్ నడుస్తోందని, రైతుల వడ్డీలు కూడా బీఆర్ఎస్ కట్టలేకపోయిందన్నారు. రైతులు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇస్తున్న మద్దతు చూసి హరీష్ కండ్లలో నిప్పులు పోసుకుని మాట్లాడుతున్నారన్నారు. పడేండ్లలో రైతులకు 80 వేల కోట్లు వేశామని హరీష్ అబద్ధాలు చెబుతున్నారని, మేం పది మాసాలలో 22 వేల కోట్లు రైతులకు రుణమాఫీ చేశామన్నారు ఆది శ్రీనివాస్. రైతులపై కాంగ్రెస్ పార్టీకి పేటెంట్ హక్కు ఉందని, వాగులు, వంకలు, కొండలు, కొనలకు గత ప్రభుత్వం రైతుబందు వేసిందన్నారు. కౌలు రైతులకు సైతం బోనస్ ఇచ్చామని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ ఇచ్చిన బతుకమ్మ చీరలను పంట చేలల్లో బెదురుకు వాడిన విషయం మర్చిపోవద్దని, గత పదేండ్లలో ఒక్క డీఏస్సీ కూడా వేయలేదన్నారు. కేసీఆర్ చేసిన కుటుంబ సర్వే లాభం ఏంటి? అని ఆయన వ్యాఖ్యానించారు. మేం ఎవరి లెక్క ఎంతో తేల్చడానికి సర్వే చేస్తున్నామని, బీఆర్ఎస్ నాయకులు బీసీ కుల గణనకు అనుకూలమా? వ్యతిరేకమా? అని ఆది శ్రీనివాస్ అన్నారు. అక్రమ నిర్మాణాలు కూల్చాలని కేసీఆర్ అన్నారని, హైదరాబాద్ మునిగిపోవాలని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారా? అబద్దాలు మాట్లాడే హరీష్ రావు ఇప్పటి నుండైనా నిజాలు మాట్లాడాలని కోరుతున్నానన్నారు.. ఈ సీజన్లో కాళేశ్వరం నుండి ఒక్క చుక్క కూడా వినియోగంలోకి రాలేదన్నారు ఆది శ్రీనివాస్.
‘గృహజ్యోతి’ పథకంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
తెలంగాణ ప్రభుత్వం పేదల కుటుంబాలపై విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించే లక్ష్యంగా గృహజ్యోతి పథకాన్ని అమలు చేస్తోంది. ఈ చొరవ కింద, నెలకు 200 యూనిట్ల వరకు విద్యుత్ వినియోగించే కుటుంబాలకు ఉచిత విద్యుత్ లభిస్తుంది. దీంతో ఈ కుటుంబాలకు విద్యుత్ బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేకపోవడంతో ఆర్థిక భారం గణనీయంగా తగ్గింది. తాజాగా ఈ పథకంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్ చేశారు. బడుగు బలహీన వర్గాల ఇళ్లలో వెలుగులు నింపేందుకు ప్రభుత్వం చేస్తున్న సంకల్పం సత్ఫలితాలను ఇస్తోందని పేర్కొన్నారు. గృహజ్యోతి పథకం ద్వారా ఒక్క హైదరాబాద్‌లోనే 10.52 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరిందని, ఇది అద్భుతమైన పరిణామమని సీఎం పేర్కొన్నారు. సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం ఇందిరమ్మ పరిపాలన వారసత్వాన్ని ప్రతిబింబిస్తోందని ఆయన అన్నారు. ఈ ఏడాది మార్చిలో లబ్ధిదారుల సంఖ్య 8,71,841 ఉండగా, నవంబర్ నాటికి 10,52,432కు చేరుకుంది. అయితే.. ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా ప్రభుత్వం గత మార్చి నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తోంది. గృహజ్యోతి పథకానికి గ్రేటర్ హైదారాబాద్‌లో 21 లక్షల మందికిపైగా దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఇప్పటి వరకు పదిన్నర లక్షల మందికిపైగా అర్హత సాధించారు. అయితే.. ప్రస్తుతం వాతావరణంలో మార్పులు చోటుచేకోవడంతో.. ఇంట్లో ఫ్యాన్లు, ఏసీలు ఆఫ్ ఫలితంగా నిన్నా మొన్నటి వరకు నెలకు సగటున 200 యూనిట్లకుపైగా విద్యుత్ వినియోగించిన వారు.. ప్రస్తుతం 150 యూనిట్ల లోపే వాడుతున్నారు. ఫలితంగా డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి మాసాల్లో ఈ లబ్ధిదారుల సంఖ్య మరింత పెరగనున్నట్లు డిస్కంలు అంచనా వేస్తున్నాయి.
హిందువులపై హింస.. యూఎన్‌కి మమతా బెనర్జీ పిలుపు..
బంగ్లాదేశ్ వ్యాప్తంగా హిందువుల అణిచివేత జరుగుతూనే ఉంది. ముఖ్యంగా ప్రముఖ హిందూ నేతల్ని అక్కడి మహ్మద్ యూనస్ ప్రభుత్వం అరెస్ట్ చేస్తోంది. రిజర్వేషన్ వ్యతిరేక అల్లర్ల కారణంగా షేక్ హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి, భారత్ పారిపోయి రావాల్సి వచ్చింది. అప్పటి నుంచి ఆ దేశవ్యాప్తంగా మైనారిటీలు, ముఖ్యంగా హిందువులపై దాడులు పెరిగాయి. గుడులు, హిందూ వ్యాపారాలు, ఇళ్లపై దాడులు చేస్తూనే ఉన్నారు. ఇదిలా ఉంటే, హిందువులపై జరుగుతున్న దాడుల గురించి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆందోళన వ్యక్తం చేశారు. ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ దళాన్ని ఆ దేశంలో మోహరించాలని సూచించారు. పొరుగు దేశంలో జరుగుతున్న పరిణామాలను ప్రస్తావించాలని ప్రధాని నరేంద్రమోడీని ఆమె కోరారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీని ఉద్దేశించి మాట్లాడిన ఆమె హిందువుల దాడిని ఖండించారు. “కులం, మతం లేదా మతంతో సంబంధం లేకుండా ఏ రకమైన దురాగతాలను మేము ఖండిస్తున్నాము. బంగ్లాదేశ్‌కు శాంతి పరిరక్షక బృందాన్ని పంపాలని కూడా నేను సూచిస్తున్నాను. ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి బంగ్లాదేశ్ పరిణామాలను పట్టించుకోవాలి” అని ఆమె అన్నారు. ఇలాంటి సంఘటనలు కొనసాగితు, మేము మా ప్రజల్ని తీసుకురావాలని అనుకుంటున్నాము, వారికి ఎలాంటి ఆహార కొరత రాదని నేను హామీ ఇస్తుున్నానని మమతా బెనర్జీ అన్నారు.
కోలుకోని షిండే.. ఎన్డీఏ సమావేశం రద్దు! అసలేం జరుగుతోంది
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎంపిక బీజేపీ అధిష్టానానికి కత్తిమీద సాములా తయారైంది. నవంబర్ 23న మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వచ్చాయి. దాదాపు నేటికి 9 రోజులైంది. అయినా కూడా ఈనాటికి సీఎం అభ్యర్థిని ఎంపిక చేయలేకపోయారు. హైకమాండ్ పెద్దలు ఢిల్లీకి పిలిపించి చర్చలు జరిపినా ప్రయోజనం లేకుండా పోయింది. ముఖ్యమంత్రి పేరును అధికారికంగా ప్రకటించేందుకు తీవ్ర హైరానా పడుతోంది. వాస్తవానికి బీజేపీ 132 సీట్లు సాధించి అగ్ర స్థానంలో ఉంది. కానీ మహాయుతి కూటమిలో భాగంగా బీజేపీ సీఎం అభ్యర్థి పేరును అధికారికంగా ప్రకటించేందుకు మాత్రం జంకుతోంది. దీనికంతటికి కారణం.. ఏక్‌నాథ్ షిండేనే కారణంగా తెలుస్తోంది. మహారాష్ట్రలో మరాఠాలు అధికంగా ఉంటారు. పైగా శివసేనలో కూడా ఆ వర్గానికి చెందిన వారే ఎక్కువగా ఉన్నారు. ఒకవేళ మరాఠా వర్గానికి చెందిన వ్యక్తి కాకుండా.. మరొక వ్యక్తిని సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే.. ఏం జరుగుతోందోనని భయాందోళన చెందుతోంది. ఇందుకోసం ముఖ్యమంత్రి పేరును అధికారికంగా ప్రకటించేందుకు మల్లగుల్లాలు పడుతోంది. ఇదిలా ఉంటే ఇటీవల ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను దేవేంద్ర ఫడ్నవిస్, ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్ కలిశారు. ముగ్గురితో విడివిడిగా సమావేశం నిర్వహించి చర్చలు జరిపారు. కానీ సమస్య మాత్రం కొలిక్కి రాలేదు. అనంతరం ఢిల్లీ నుంచి షిండే ముంబైకి రాగానే.. నేరుగా తన సొంత గ్రామానికి వెళ్లారు. అక్కడికెళ్లాక అనారోగ్యానికి గురి కావడంతో ఆదివారమే తిరిగి షిండే ముంబైకి చేరుకున్నారు. అయితే సోమవారం ముంబైలో ఎన్డీఏ సమావేశం జరగాల్సి ఉండగా షిండే ఇంకా కోలుకోలేదని తెలుస్తోంది. దీంతో ఎన్డీఏ సమావేశం రద్దైంది. అభ్యర్థి పేరు ప్రకటన వాయిదా పడే ఛాన్సుంది. ఇదిలా ఉంటే డిసెంబర్ 5న మహారాష్ట్ర సీఎం ప్రమాణస్వీకారం ఉంటుందని బీజేపీ ప్రకటించింది. కానీ పంచాయితీ మాత్రం ఇంకా తెగేటట్టు కనిపించడం లేదు. తాజాగా ఏక్‌నాథ్ షిండే అన్ని అపాయింట్‌మెంట్లను రద్దు చేసుకున్నారు.
4 వేరియంట్లలో “స్కోడా కైలాక్”.. రూ. 14.40 లక్షలకే టాప్ వేరియంట్
స్కోడా ఇండియా ప్రతిష్టాత్మకంగా ‘‘కైలాక్’’ని భారతీయ మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. సబ్-4 మీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ కార్ సెగ్మెంట్‌లో స్కోడా కైలాక్ రాకతో మరింత పోటీ పెరుగనుంది. ఇప్పటికే ఈ సెగ్మెంట్‌లో మారుతి సుజుకి బ్రెజ్జా, టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్ వంటివి ఉన్నాయి. ఇప్పుడు కైలాక్ ఎంట్రీ ఇవ్వబోతోంది. తాజాగా స్కోడా కైలాక్ వేరియంట్స్, వాటి ధరల్ని వెల్లడించింది. కైలాక్ 4 వేరియంట్లలో లభ్యమవుతోంది. ఇప్పటికే క్లాసిక్ వేరియంట్ ఎంట్రీ ఫ్రైజ్‌ని రూ.7.89 లక్షలుగా ప్రకటించింది. స్కోడా కైలాక్ క్లాసిక్, సిగ్నేచర్, సిగ్నేచర్+ మరియు ప్రెస్టీజ్ వేరియంట్లలో లభ్యమవుతోంది. సిగ్నేచర్ వేరియంట్ మాన్యువల్ ధర రూ. 9.59 లక్షలు , ఆటోమేటిక్ వేరియంట్ రూ. 10.59 లక్షలుగా ఉంది. సిగ్నేచర్+ వేరియంట్ మాన్యువల్‌కు రూ.11.40 లక్షలు, ఆటోమేటిక్ వేరియంట్‌కు రూ. 12.40 లక్షలకు రిటైల్ అవుతుంది. టాప్ వేరియంట్ ప్రెస్టీజ్ మాన్యువల్ ధర రూ. 13.35 లక్షలు, ఆటోమేటిక్ వేరియంట్ ధర రూ. 14.40 లక్షలుగా ఉంది. బుకింగ్స్ డిసెంబర్ 02 నుంచి ప్రారంభమయ్యాయి. జనవరి 27, 2025 నుంచి డెలివరీలు ప్రారంభం కానున్నాయి.
పుష్ప 2 రిలీజ్ ముంగిట.. మైత్రీ మేకర్స్ వ్యూహాత్మక నిర్ణయం
పుష్ప 2కు ఎంతటి హైప్ తీసుకొచ్చినా..ఎక్కడో భయం నిర్మాతలను వెంటాడుతూనే ఉంది.ఫస్ట్ డే మార్నింగ్ షోకు వచ్చే టాక్.. రిజల్ట్ ను డిసైడ్ చేసే పరిస్థితులు ఉండడంతో సుకుమార్ పై ఒత్తిడి అంతకంతకు పెరిగిపోతుంది. నిజానికి పుష్ప-2కు… అనుకున్నదానికంటే ఓవర్ హైప్ వచ్చేసింది.ఫస్ట్ పార్ట్ కు మించి ఉంటుందనే అంచనాలు మేకర్స్ లో ఒత్తిడి పెంచేస్తున్నాయి. సినిమాకు ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా.. ఎన్నో సినిమాల రికార్డులు గల్లంతైపోతాయంటున్నారు. అయితే రియాల్టీలో పుష్ప 2 ఆ స్థాయి సక్సెస్ ను అందుకుంటుందా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఎందుకంటే సినిమాపై ముందు నుంచి మార్కెట్లో నెగిటివ్ ప్రచారం గట్టిగా నడుస్తుంది. అందుకు తగ్గట్లుగానే బన్నీ చూపించిన ఆటిట్యూడ్ తో.. రేపు సినిమా రిలీజ్ అయ్యాక ఏ రకంగా కాస్త నెగిటివ్ గా కనిపించినా అది సినిమా మొత్తానికి ఆపాదించి బొమ్మకు డివైడ్ టాక్ తెచ్చేస్తారు. మైత్రి మేకర్స్ మార్కెట్లో నడుస్తున్న నెగిటివిటీని గమనిస్తూనే ఉంది. అందుకే దర్శకుడు సుకుమార్ ను మాత్రమే నమ్ముకుంది. ఇప్పుడున్న టైమ్లో తన హుందాతనంతో కంటెంట్ విషయంలో సుకుమార్ తోనే సోమవారం ఈవెంట్ లో ఓ స్టేట్మెంట్ ఇప్పించే ఆలోచనలో నిర్మాతలున్నారు. మార్కెట్లో స్ప్రెడ్ అవుతున్న రూమర్స్ కి చెక్ పెడుతూ… సుకుమార్ ఇచ్చే స్పీచ్ తో ..నెట్టింట్లో నడుస్తున్న నెగిటివిటీ కొంతవరకు తగ్గించాలని చేస్తున్న ప్రయత్నాలు ఓ కొలిక్కి రావచ్చు.నిజానికి ఇక్కడ హీరోయిజంతో సినిమా నడిపించాలనే ఉద్దేశ్యం దర్శకుడికి లేదు. తాను నమ్మిన కంటెంట్ తో మాత్రమే బొమ్మను ఆడించి హిట్ కొట్టాలని చూస్తున్నాడు. పుష్ప 2కు పెద్ద టాస్క్ గా చెబుతున్న ఫస్ట్ డే రికార్డ్ పై .. మైత్రి మేకర్స్ కు అంత ఆసక్తి లేదన్నట్లుగా ప్రచారం నడుస్తోంది. అల్లు కాంపౌండ్ ఈ టాస్క్ పై శ్రద్ద చూపిస్తుండడంతో చేసేది లేక అందుకు తగ్గట్టుగా అడుగులు వేయాల్సి వస్తుందట. థియేట్రికల్ ,నాన్ థియేట్రికల్ వేయి కోట్ల బిజినెస్ జరిగిందని తెలియడంతో ఈక్వేషన్స్ ఓ రేంజ్లో ఉన్నాయి.
అల్లు అర్జున్ ది కాన్ఫిడెన్సా? ఓవర్ కాన్ఫిడెన్సా?
పుష్ప అంటే పేరు కాదు.. బ్రాండ్.. పుష్ప అంటే ఫైర్ అనుకుంటివా.. వైల్డ్ ఫైర్.. ఈ డైలాగ్స్ బ్లడ్ బాయిల్ చేసేస్తున్నాయి డై హార్ట్ బన్నీ ఫ్యాన్స్‌ను. టీజర్, ట్రైలర్స్, సాంగ్స్ పుష్ప2కు ఎడిక్ట్ అయ్యేలా చేశాయి. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానోడు కూడా.. ఈ సినిమా గురించి చర్చించుకుంటున్నారో ఏ లెవల్లో బజ్ నడుస్తుందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ హైప్ సినిమా టార్గెట్స్‌ను గుర్తు చేస్తున్నాయి. ముఖ్యంగా ఫస్ట్ డే కలెక్షన్స్. ఈ ఏడాదిలో విపరీతమైన అటెన్షన్ క్రియేట్ చేసిన ప్రభాస్ కల్కి, తారక్ దేవరలు ఫస్ట్ డే మంచి కలెక్షన్స్ రాబట్టుకున్నాయి. ఈ ఏడాది హయ్యెస్ట్ ఓపెనింగ్‌గా నిలిచింది దేవర. 175 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇప్పుడు ఈ నంబర్ బీట్ చేయాల్సి ఉంది పుష్ప 2. అయితే పుష్పరాజ్ హల్చల్ లో పర్సనల్ ఎజెండా ఉందా…? అంటే అవుననే మాటలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. వైల్డ్ ఫైర్ ట్యాగ్స్ ట్రెండింగ్ చేయిస్తుంది కూడా బన్నీ టీం అనే చర్చలు జరుగుతున్నాయి. పుష్ప 2 ప్రమోషన్స్ లో బన్నీ ఆటిట్యూడ్ స్టార్ అయ్యాడా..? అనే అనుమనాలు కలిగించేలా బన్నీ ప్రవర్తన కనిపిస్తోంది. ముందు నుంచి కాస్త దూరంగా ఉంటున్న మెగా ఫ్యాన్స్ ఐకానిక్ స్టార్ కాదు ఆటిట్యూడ్ స్టార్ అంటూ ట్రోల్ చేస్తున్నారు. నిజానికి బన్నీ ముందు ఉన్న అసలైన టాస్క్ ఆర్ఆర్ఆర్ ఫస్ట్ డే 223 కోట్ల రికార్డును బ్రేక్ చేయడమే. అది ఇప్పటికప్పుడు సాధ్యం కాదు కాబట్టే 12వేల స్క్రీన్స్ రిలీజ్ కు అల్లు కాంపౌండ్ స్కెచ్ వేసింది. అయితే గ్లింప్స్ హిట్ అయితే బొమ్మ హిట్ అవ్వాలని రూల్ ఉందా..? అంటూ మెగా ఫాన్స్ కామెంట్లు చేస్తూ అల్లు కాంపౌండ్ భ్రమల్లో బతికేస్తుందనే మాటలొస్తున్నాయి.