ఏపీలో కొత్తగా 6 విమానాశ్రయాలు..!
భోగాపురం ఎయిర్‌పోర్టు గడువు కంటే ముందే పూర్తి చేయబోతున్నాం… ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 6 విమానాశ్రయాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు రోడ్లు–భవనాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి.. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో రహదారుల పరిస్థితి దారుణంగా మారడానికి గత ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని బీసీ జనార్ధన్ రెడ్డి విమర్శించారు. గత ఐదేళ్ల పాలనలో రోడ్ల సంరక్షణ, మరమ్మతులు పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో ప్రస్తుతం ప్రభుత్వం భారీ ఆర్థిక భారం మోస్తోందని ఆయన తెలిపారు. అయితే, రహదారుల పునర్నిర్మాణానికి భారీ వ్యయం అవుతుందని వెల్లడించారు బీసీ జనార్ధన్ రెడ్డి.. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రోడ్ల మరమ్మతులకు అదనంగా రూ.20,000 కోట్ల భారం పడిందన్న ఆయన.. మొత్తం 15,000 కిలో మీటర్ల మేర రహదారులు పూర్తిగా పనికిరానంతగా దెబ్బతిన్నాయి. మొత్తం 30,000 కిలో మీటర్లు రోడ్లు సరైన సంరక్షణ లేక పాడైపోయాయన్నారు.. అయితే, దెబ్బతిన్న రహదారుల మరమ్మతులకు ఇప్పటివరకు రూ.3,000 కోట్ల నిధులు వెచ్చించినట్టు పేర్కొన్నారు.. 22,000 కిలో మీటర్ల గుంతల రోడ్లను రూ.1,061 కోట్ల వ్యయంతో పునరుద్ధరించారు. పీపీపీ మోడల్‌లో 175 రహదారులను 5,130 కిలో మీటర్ల పొడవు వరకు అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్టు పేర్కొన్నారు..
ప్రజల కోసం.. రాజ్యాంగ పరిరక్షణ కోసం ఈ పోరాటం..!
పీపీపీ మోడల్‌పై బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు.. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను అడ్డుకుంటామని ప్రకటించారు.. ప్రజల కోసం.. రాజ్యాంగ పరిరక్షణ కోసం ఈ పోరాటం అని పేర్కొన్నారు.. రాష్ట్రంలో మెడికల్ కళాశాలలను పీపీపీ మోడల్‌లో ప్రైవేట్ దక్కించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించిన శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలిసి తమ అభ్యంతరాలను తెలియజేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజల కోసమే మెడికల్ కళాశాలలు ప్రారంభించాం.. గత ప్రభుత్వ కాలంలో ప్రజలకు విద్య, వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో మెడికల్ కళాశాలలు ప్రారంభించామని బొత్స స్పష్టం చేశారు. ప్రభుత్వ నిధులు, ఆర్థిక సంస్థల సహకారంతో పనులు ప్రారంభించామని.. తమ ప్రభుత్వ హయాంలోనే ఐదు కళాశాలలు పూర్తి అయ్యి పనిచేస్తున్నాయని గుర్తుచేశారు బొత్స.. ఈ ప్రభుత్వం వచ్చి ప్రజలకు మేలు చేస్తుందనే భయంతోనే పనులు ఆపివేసినట్టు బొత్స ఆరోపించారు. జగన్‌కు పేరు వస్తుందనే అసూయతో ప్రైవేటీకరణకు రెడీ అయ్యారు అన్నారు. పీపీపీ మోడల్‌పై పాట పాడుతున్నా.. అసలు నియంత్రణ ప్రభుత్వం చేతులకే ఉంటుందంటూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని చెప్పారు.
బంగాళాఖాతంలో మరో తుఫాన్.. ‘దిత్వా’గా నామకరణం.. ఏపీకి భారీ వర్ష సూచన..
నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక తీరానికి ఆనుకుని ఉన్న ప్రాంతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్రంగా మారి తుఫాన్‌గా మారిందని.. దానికి ‘దిత్వా’గా నామకరణం చేశారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. గడిచిన 6 గంటల్లో 15 కిలో మీటర్ల వేగంతో కదులుతూ తుపాన్ ప్రస్తుతం ట్రింకోమలీ (శ్రీలంక)కు 200 కిలో మీటర్లు.. పుదుచ్చేరికి 610 కిలో మీటర్లు, చెన్నైకి ఆగ్నేయంగా సుమారు 700 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని పేర్కొంది.. అయితే, వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. ఈ తుపాన్ ఆదివారం తెల్లవారుజామున తీరాన్ని తాకనుంది.. ఉత్తర తమిళనాడు–పుదుచ్చేరిని ఆనుకుని ఉన్న దక్షిణ ఆంధ్రప్రదేశ్ కోస్తా ప్రాంతాలకు చేరువలో తీరం దాటే అవకాశం ఉండగా… ఏపీలో వర్షాలు, గాలుల ప్రభావం పెరుగుతుందని అంచనా వేసింది.. ఇక, తుపాన్ ప్రభావంతో శనివారం మరియు ఆదివారం భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది.. తీరం ప్రాంతాల్లో బలమైన గాలులు వీచే ప్రమాదం ఉందని.. సముద్రం ఉగ్రరూపం దాల్చే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
సిగాచీ పేలుళ్ల ఘటన… పోలీసుల దర్యాప్తుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం..
సిగాచీ పేలుళ్ల ఘటనపై పోలీసులు చేపట్టిన దర్యాప్తు పట్ల తెలంగాణ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇది సాధారణ ఘటన కాదని, ఒకేసారి 54 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయిన దారుణం అని సీఎస్ జస్టిస్ వ్యాఖ్యానించారు. ఇదేనా దర్యాప్తు? 5 నెలలు గడిచినా పురోగతి ఏమీ లేదు” అంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.. ఈ కేసులో ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదని హైకోర్టు ప్రశ్నించింది. ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది అంటే మాటలు ఏమిటి?.. ఇంత పెద్ద ప్రమాదంలో బాధ్యత ఎవరికో ఇప్పటికీ నిర్ధారణ కాలేదా? అంటూ ఏఏజీ తేరా రజినీకాంత్ రెడ్డిని కోర్టు ప్రశ్నించింది. ఈ కేసు తీవ్రత దృష్ట్యా ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేయాల్సిందిగా కోర్టు వ్యాఖ్యానించింది. 54 మంది చనిపోయినా.. DSP స్థాయి అధికారి దర్యాప్తు చేయడం ఎలా సమంజసం?” అని హైకోర్టు ప్రశ్నించింది. అయితే, ఈ కేసులో ఇప్పటి వరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని, ఇది అత్యంత తీవ్రమైన నిర్లక్ష్యం అని ప్రజాప్రయోజన వ్యాజ్య పిటిషనర్ బాబు రావు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. 237 మందిని విచారించినా దర్యాప్తులో పురోగతి లేదు.. నిపుణుల కమిటీ పరిశీలనలో ఫ్యాక్టరీ నిర్వహణలో ఘోర లోపాలు తేలాయి.. నిబంధనలకు విరుద్ధంగా 17 టన్నుల సోడియం క్లోరైడ్ నిల్వ చేశారు.. పేలుడు తీవ్రతకు 8 మంది శరీరాలు ఆనవాళ్లు లేకుండా కాలిపోయాయని గుర్తు చేసింది..
బీసీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం.. బీఆర్‌ఎస్, బీజేపీ… బీసీ ద్రోహులు..
బీసీ రిజర్వేషన్ అంశంపై ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. బీసీల కోసం పోరాడేది తాము మాత్రమేనని, ఇతర పార్టీలు మాత్రం రాజకీయ ప్రయోజనాల కోసం మొసలి కన్నీళ్లు కారుస్తున్నాయని తీవ్ర విమర్శలు చేశారు.. బీఆర్ఎస్, బీజేపీ. బలహీనవర్గాల ద్రోహులు అని మండిపడ్డారు.. గతంలో ఇతర రాష్ట్రాల్లోనూ రిజర్వేషన్లు 50 శాతం మించకూడదన్న కోర్టు తీర్పులు ఉన్నప్పటికీ, ఈ పరిమితిని అధిగమించేందుకు ప్రభుత్వం సేకరించిన డాటా, నివేదికలు ఆధారంగా కోర్టులో సమర్థవంతంగా వాదనలు వినిపిస్తున్నామని తెలిపారు. అసలు BRS కోర్టులో ఇంప్లీడ్ ఎందుకు కాలేదు? అని పొన్నం ప్రశ్నించారు.. సిగ్గులేకుండా బయట విమర్శలు చేసే బీఆర్ఎస్ నాయకులు కోర్టులో మాత్రం లేరు అని మంత్రి ఆరోపించారు. కోర్టులో రిజర్వేషన్ నిలిపేస్తే బీఆర్ఎస్ నేతలు నవ్వుకుంటున్నారని విమర్శించారు. అటు.. బీసీ రిజర్వేషన్ల అమలులో అడ్డంకులు తొలగించేందుకు కేంద్రం సహకరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్‌లో ఉన్న నిధులు ఇప్పించేందుకు బీజేపీ నేతలు ప్రయత్నం చేయడం లేదా? అని ప్రశ్నించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు 42% రిజర్వేషన్లతోనే జరపాలన్న ఆలోచన ఉందని తెలిపారు పొన్నం.. ఇక బీసీ సర్వేలో పాల్గొనని పార్టీలకు మాట్లాడే నైతిక హక్కు లేదని పొన్నం తీవ్రంగా హెచ్చరించారు. కేంద్రంలో మా ప్రభుత్వం ఉంటే గంటల్లో బీసీ రిజర్వేషన్ అమలు అయ్యేదన్న ఆయన.. మేము కోర్టులో చేస్తున్న పని మీకూ తెలుసు. తెలిసీ మాపై ఆరోపణలు చేయొద్దు. సలహాలు ఇవ్వండి.. తీసుకుంటాం.. కానీ, రాజకీయ పార్టీల ఒత్తిడికి లోనవ్వొద్దు అని సచించారు.. బీజేపీ–బీఆర్ఎస్ బీసీ ద్రోహులు అని మండిపడ్డారు పొన్నం.. బలహీన వర్గాల పట్ల బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు అన్యాయం చేశాయని తీవ్రంగా మండిపడ్డారు. రాజ్యాంగం ఏం చెబుతుందో తెలియకపోతే తెలుసుకోవాలి. గిరిజన ప్రాంతాల్లో వారికి హక్కుగా రిజర్వేషన్ ఇవ్వాలి.. బీసీ సర్వేలో పాల్గొనని వారు ఇప్పుడు మాట్లాడటం హాస్యాస్పదం.” అని వ్యాఖ్యానించారు.
పెద్ద ప్లానే.. డీకే శివకుమార్‌కు చెక్ పెట్టేందుకు సిద్ధరామయ్య వ్యూహం..
కర్ణాటక కాంగ్రెస్ పంచాయతీ కొనసాగుతూనే ఉంది. సిద్ధరాయమ్యను దించేసి, డీకే శివకుమార్‌ను అధిష్టానం సీఎంగా చేస్తుందా.? అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇరు వర్గాలు కూడా తమ బాస్‌లకే సీఎం పదవి ఉండాలని బలంగా కోరుకుంటున్నాయి. రెండు పవర్ సెంటర్స్ కూడా అధిష్టానంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. ఒక వేళ సీఎం పదవి డీకే శివకుమార్‌కు కట్టబెడితే, తాము ఏం చేయాలనే దానిపై సిద్ధరామయ్య వర్గం వరస సమావేశాలు నిర్వహిస్తోంది. డీకేను సీఎంగా నిర్ణయించాలనుకుంటే, వెంటనే తామంతా ఢిల్లీ వెళ్లి పార్టీ హైకమాండ్‌పై ఒత్తిడి తేవాలని సిద్ధరామయ్య వర్గం భావిస్తోంది. ఒక వేళ కాంగ్రెస్ అధిష్టానం డీకే శివకుమార్ వైపు మొగ్గు చూపితే, ఆయనకు కాకుండా వేరే వ్యక్తికి సీఎం పదవి అప్పగించాలని సిద్ధరామయ్య వర్గం కోరే అవకాశం కనిపిస్తోంది. ఇందులో కర్ణాటక హోం మంత్రి జీ. పరమేశ్వర పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈయన సిద్ధరామయ్య వర్గానికి చెందిన బలమైన దళిత నేత. ఈ వ్యూహాన్ని సిద్ధరామయ్య వర్గానికి చెందిన మంత్రి సతీష్ జార్కిహోలీ రచించారు. ఇప్పుడు, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కర్ణాటకలో దిగజారకుండా అధిష్టానం నెమ్మదిగా పావులు కదుపుతోంది. ఈ సంక్షోభంపై ఖర్గే, సోనియా, రాహుల్ కలిసి సమావేశం కానున్నారు. ఆ తర్వాత సిద్ధరామయ్య, డీకేలను ఢిల్లీకి పిలిచే అవకాశం ఉంది.
హైదరాబాద్ బిర్యానీ అంటే ఆ మాత్రం ఉంటాది.. ప్రపంచ టాప్ 10 వంటకాలలో స్థానం..!
ప్రపంచవ్యాప్తంగా బియ్యం ఆధారిత వంటకాలపై ప్రసిద్ధి చెందిన TasteAtlas తాజాగా విడుదల చేసిన టాప్ 50 బెస్ట్ రైస్ డిషెస్ జాబితాలో హైదరాబాద్ బిర్యానీకి ప్రత్యేక స్థానం లభించింది. భారతదేశం నుండి ఈ జాబితాలో చోటుదక్కిన ఏకైక వంటకం ఇదే కావడం విశేషం. హైదరాబాద్ బిర్యానీ నేరుగా టాప్ 10లో 10వ స్థానాన్ని సాధించడం ఇంకా దాని ప్రాముఖ్యాన్ని తెలుపుతుంది. ఈ జాబితాలో జపాన్ అత్యధిక వంటకాలతో నిలిచింది. అందులో ప్రముఖమైన Negitoro Don వంటకం ప్రపంచంలో నంబర్ 1 బెస్ట్ రైస్ డిష్ గా గుర్తింపు పొందింది. ఫ్యాటీ మిన్స్డ్ ట్యూనా (టోరో), కట్ చేసిన నెగి ఉల్లిపాయలు, వెచ్చని జపాన్ రైస్ పై సర్వ్ చేయడం దీని ప్రత్యేకత. అదేవిధంగా ఒటోరో నిగిరి సుషి, మాకి, అజి నిగిరి సుషి వంటి అనేక జపనీస్ వంటకాలు కూడా జాబితాలో చోటు దక్కించుకున్నాయి. ఇక హైదరాబాద్ బిర్యానీ దేశంలోని ఇతర ప్రాంతాలలో తయారయ్యే బిర్యానీలతో పోలిస్తే పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఇందులో మాంసం, బియ్యాన్ని మసాలాలతో కలిపి ఒకేసారి వండుతారు. దీనిని కచ్చి బిర్యానీగా పిలుస్తారు. ఈ ప్రత్యేకమైన విధానమే దీని రుచికి మూలం అని ఫుడ్ గైడ్స్ చెబుతున్నాయి. ఇక మరో విధానం పక్కి బిర్యానీ. ఇందులో ముందుగా మసాలాలతో మాంసం వేరు, బియ్యం వేరు ఉడికించి, ఆ తర్వాత వాటిని పొరలుగా అమర్చిన తరువాత ‘దమ్’ మీద ఉంచి వండుతారు. ఈ విధానం కొద్ది సమయంలో సిద్ధమయ్యే తేడాతో పాటు బిర్యానీకి ప్రత్యేకమైన, స్పష్టమైన రుచులను ఇస్తుంది.
AI ఆధారిత మొబైల్ యాంటీ-డ్రోన్ టెక్నాలజీ.. హైదరాబాద్‌లో ‘ఇంద్రజాల్ రేంజర్’ లాంచ్..!
హైదరాబాద్‌లో ఈరోజు ప్రపంచపు తొలి మొబైల్, AI ఆధారిత యాంటీ-డ్రోన్ పెట్రోల్ వెహికల్ ‘ఇంద్రజాల్ రేంజర్’ (Indrajaal) అధికారికంగా లాంచ్ అయ్యింది. సాధారణంగా ఒకేచోట స్థిరంగా ఉండే యాంటీ-డ్రోన్ సిస్టమ్‌లకు భిన్నంగా.. ఇది కదులుతున్న డ్రోన్లను గుర్తించి, ట్రాక్ చేసి, నిర్వీర్యం చేసే సామర్థ్యంతో రూపొందించబడిన అత్యాధునిక టెక్నాలజీతో కూడిన వాహనం. ఇటీవలి కాలంలో బార్డర్ ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా డ్రగ్స్, ఆయుధాలు, స్మగ్లింగ్ వస్తువులు తరలింపు కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఢిల్లీ బ్లాస్ట్ వంటి ఘటనల్లో కూడా డ్రోన్లను ఉపయోగించి సరిహద్దుల నుంచి అక్రమ వస్తువులు దేశీయ నగరాలకు చేరుతున్నాయి. ఈ పెరుగుతున్న ముప్పు నుంచి రక్షించడానికి సమాధానంగా ఇంద్రజాల్ రేంజర్ రూపొందించబడింది. ఇంద్రజాల్ రేంజర్ 10 కి.మీ పరిధిలో డ్రోన్ డిటెక్షన్ చేస్తుంది. ఈ వాహనం 10 కిలోమీటర్ల రేడియస్‌లో ఉన్న ఏ డ్రోన్‌నైనా వెంటనే గుర్తించే సామర్థ్యం కలిగి ఉంది. అలాగే ఇది ఇతర సిస్టమ్‌ల మాదిరిగా ఆపి మళ్లీ సెటప్ చేయాల్సిన అవసరం లేదు. డ్రోన్ డిటెక్ట్ అయిన వెంటనే డ్రైవర్ ఆ దిశగా వెహికల్‌ను తీసుకెళ్లి ఆపరేషన్‌ను కొనసాగించవచ్చు. ఇక 4 కి.మీ రేంజ్‌లో వాహనంలోని AI సిస్టమ్ డ్రోన్‌ను హ్యాక్ చేసి, వెహికల్ పక్కనే సురక్షితంగా ల్యాండ్ చేయిస్తుంది.
రోడ్డుపై బస్సులాగా.. ట్రాక్‌లపై రైలులాగా.. 15 సెకన్లలో మోడ్ మారే వెహికల్(వీడియో)
టెక్నాలజీతో అద్భుతాలు ఆవిష్కృతమవుతున్నాయి. ముఖ్యంగా రవాణా వ్యవస్థలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా జపాన్ లో ఓ వెహికల్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇది రోడ్డుపై బస్సులాగా, రైల్వే ట్రాక్‌లపై రైలులాగా ప్రయాణిస్తుంది. దీనిని డ్యూయల్ మోడ్ వెహికల్ (DMV) అని పిలుస్తారు. ఇది ప్రపంచంలోనే రెండు మోడ్‌లలో పనిచేయగల మొట్టమొదటి వాహనం. DMV అత్యంత ఆసక్తికరమైన లక్షణాలలో ఒకటి దాని వేగవంతమైన మోడ్ ట్రాన్స్ ఫార్మేషన్. బస్ మోడ్ నుంచి రైలు మోడ్‌కు లేదా రైలు మోడ్ నుంచి బస్సు మోడ్‌కు రూపాంతరం చెందడానికి ఇది కేవలం 15 సెకన్లు మాత్రమే పడుతుంది. అవాకైనన్, కన్నౌరా స్టేషన్లలోని ప్రయాణీకులు ఈ ట్రాన్స్ ఫార్మేషన్ ను తమ కళ్ళతో వీక్షించారు. ఇది బస్సును పోలి ఉంటుంది. 15 సెకన్లలో, రైలు చక్రాలు తెరుచుకుని పట్టాలపై పరుగెత్తడం ప్రారంభిస్తుంది. ఆ తర్వాత రైల్వే ట్రాక్ ఎండ్ కాగానే బస్ రైర్లు ఓపెన్ అయి రోడ్డుపై దూసుకెళ్తుంది. ఇది ఒకేసారి 21 మంది ప్రయాణికులను తీసుకెళ్లగలదు. పట్టాలపై దీని వేగం గంటకు 60 కి.మీ, రోడ్డుపై గంటకు 100 కి.మీ. ఈ DMV 2021 నుండి పనిచేస్తోంది. జపాన్‌లోని షికోకు ద్వీపంలోని కొచ్చి, తోకుషిమా ప్రిఫెక్చర్ మధ్య నడుస్తుంది. దీనిని ప్రైవేట్ పబ్లిక్ రైల్వే కంపెనీ అయిన ఆసా కోస్ట్ రైల్వే నిర్వహిస్తుంది.
సారీ చెప్పిన రిషబ్ పంత్.. ఎందుకో తెలుసా!
దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్ ఓటమితో ప్రస్తుతం భారత జట్టులో నిరాశ వాతావరణం నెలకొంది. గౌహతి టెస్ట్‌లో జట్టుకు నాయకత్వం వహించిన వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్ తాజాగా సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పాడు. ఈ టెస్ట్‌లో తన పేలవమైన ప్రదర్శనకు క్షమాపణలు చెబుతున్నానని పంత్ పేర్కొన్నాడు. అయితే తాను మరింత కష్టపడి తిరిగి వస్తానని పంత్ వెల్లడించాడు. గౌహతి టెస్ట్‌లో రిషబ్ పంత్ ఔటైన తీరుపై సర్వత్రా విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. రిషబ్ పంత్ సోషల్ మీడియాలో తాజాగా ఒక పోస్ట్ చేశాడు.. అందులో ” గత రెండు వారాల్లో మేము బాగా రాణించలేదనే వాస్తవాన్ని వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు” అని పేర్కొన్నాడు. ఒక జట్టుగా, వ్యక్తులుగా, మేము ఎల్లప్పుడూ అత్యున్నత స్థాయిలో ప్రదర్శన ఇవ్వాలనుకుంటున్నాము, అలాగే లక్షలాది మంది భారతీయుల ముఖాల్లో చిరునవ్వులు తీసుకురావాలనుకుంటున్నాము.. కానీ క్షమించండి, ఈసారి మేము ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయాము, భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడం మా జీవితంలో అతిపెద్ద గౌరవం. ఈ జట్టు సామర్థ్యం ఏమిటో మాకు తెలుసు, మేము కష్టపడి పనిచేస్తాము, కలిసి, బలంగా తిరిగి వస్తాము. మీ అచంచలమైన మద్దతు, ప్రేమకు ధన్యవాదాలు. జై హింద్ ” అని పంత్ తన పోస్ట్‌లో పేర్కొన్నాడు.
మంగ్లీపై అసభ్యకర వ్యాఖ్యలు.. మేడిపల్లి స్టార్ అరెస్ట్..
ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీపై సోషల్ మీడియాలో అసభ్యకరంగా, కించపరుస్తూ వ్యాఖ్యలు చేసినందుకు ఓ వ్యక్తిని ఎస్ఆర్ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై మంగ్లీ స్వయంగ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఇటీవల విడుదలై సూపర్ హిట్ అవుతున్న మంగ్లీ పాడిన “బాయిలోన బల్లి పలికే” అనే పాటకు డాన్స్ చేస్తూ ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు మేడిపల్లి స్టార్ అనే వ్యక్తి. ఆ వీడియోలో మంగ్లీని బూతులు తిడుతూ, పాటను కించపరుస్తూ, ఆమె చెందిన ఎస్టీ సామాజిక వర్గాన్ని నీచంగా అవమానించేలా మాట్లాడాడని మంగ్లీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వీడియో వైరల్ కావడంతో మంగ్లీ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే స్పందించిన ఎస్ఆర్ నగర్ పోలీసులు మేడిపల్లి స్టార్‌ను అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. మహిళా గౌరవాన్ని దెబ్బతీసేలా, షెడ్యూల్డ్ తెగలను అవమానించేలా చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం సహా ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మంగ్లీ ఈ ఘటనపై స్పందిస్తూ, “నా పాటలు ప్రజలకు ఆనందాన్ని ఇస్తాయి కానీ, ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు బాధ కలిగిస్తాయి. మహిళగా, ఎస్టీ సామాజిక వర్గం నుంచి వచ్చిన వ్యక్తిగా ఇలాంటి అవమానాలు సహించలేను. చట్టం తన పని తాను చేస్తుందని నమ్ముతున్నాను” అని తెలిపారు. ప్రస్తుతం ఈ కేసుపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. సోషల్ మీడియాలో మహిళలు, గిరిజన సామాజిక వర్గాలపై ద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
జైలర్-2 లోకి ఎంట్రీ ఇవ్వనున్న పూరీ హీరో..
నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన సూపర్ హిట్ చిత్రం జైలర్. ఈ చిత్రం సూపర్, డూపర్ హిట్ కావడంతో తాజాగా జైలర్-2 ను తెరకెక్కించే పనిలో మేకర్స్ ఉన్నారు. రిలీజ్‌కు ముందు నుంచే జైలర్ -2 సినిమాపై ప్రేక్షకులలో మంచి అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక న్యూస్ వైరల్‌గా మారింది. ఈ సినిమాలో ఒక స్టార్ హీరో ఎంట్రీ ఇచ్చారని, ఇప్పటికే ఆయనకు సంబంధించిన సీన్లను చిత్రీకరిస్తున్నారని టాక్ నడుస్తుంది. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరు, ఆయన నిజంగానే ఈ సినిమాలో భాగం అయ్యారా అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం. జైలర్ – 2 సినిమాలో పలువురు స్టార్స్ కేమియో పాత్రల్లో కనువిందు చేస్తారని గతంలోనే చిత్ర యూనిట్ తెలిపింది. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న న్యూస్ ఏంటంటే.. ఈ సినిమాలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి భాగం అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సేతుపతి సీన్లను గోవాలో షూట్ చేస్తున్నారని టాక్ నడుస్తుంది. గతంలో కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్‌లో వచ్చిన ‘పెట్టా’ సినిమాలో రజినీకాంత్-విజయ్ సేతుపతి కలిసి నటించారు. అయితే జైలర్-2లో నిజంగానే విజయ్ సేతుపతి నటిస్తున్నాడా అనే విషయంపై అఫీషియల్ క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం విజయ్ సేతుపతి – పూరీ జగన్నాథ్ డైరెక్టర్ ఒక ప్యాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకున్నట్లు మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు. ఈ క్రమంలో పూరీ హీరో రజినీకాంత్ సినిమాలో భాగం అయ్యాడనే వార్తలు వైరల్‌గా మారాయి.