టీడీపీలో కార్యకర్తలే అధినేత… పార్టీనే అందరికీ అధినాయకత్వం..
టీడీపీ అనేది ఒక వ్యక్తికి పరిమితం కాని పార్టీ అని, కార్యకర్తలే నిజమైన అధినేతలని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. పార్లమెంటరీ కమిటీలకు నిర్వహించిన శిక్షణ తరగతుల కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ, పార్టీనే అందరికీ అధినాయకత్వం అని పేర్కొన్నారు. పార్టీలో యువతకు ఎక్కువ అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని లోకేష్ అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పార్టీలో మార్పులు తీసుకురావాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పారు. గ్రామ పార్టీ అధ్యక్షుడు కూడా పొలిట్ బ్యూరో స్థాయికి ఎదిగేలా సంస్కరణలు చేపట్టామని తెలిపారు. పేదరికం లేని సమాజం లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, ముఖ్యంగా అన్నదాతకు అండగా నిలుస్తోందని చెప్పారు. రైతుకు కష్టం వస్తే ముందుండి పోరాడాల్సిందేనని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అన్ని పదవుల్లో సామాజిక న్యాయం చేయాల్సిన బాధ్యత మనపై ఉందని, జనాభా దామాషా ప్రకారం అన్ని కులాలకు ప్రాధాన్యం ఇస్తున్నామని వెల్లడించారు. మహిళలకు 33 శాతం పదవులు ఇచ్చి ప్రోత్సహిస్తున్నామని, పార్టీలో మహిళలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని స్పష్టం చేశారు లోకేష్. పార్టీ అంటే కమిట్మెంట్ ఉన్నవారికే కమిటీల్లో బాధ్యతలు అప్పగించామని, పార్లమెంటరీ కమిటీల్లో 83 శాతం మంది కొత్తవారికి తొలిసారి అవకాశం కల్పించామని లోకేష్ తెలిపారు. అంజిరెడ్డి, మంజులా, తోట చంద్రయ్య వంటి కార్యకర్తలు అందరికీ స్ఫూర్తి అని కొనియాడారు. “మడమ తిప్పటం, మాట మార్చటం తెలుగుదేశం రక్తంలోనే లేదు” అని పేర్కొన్న లోకేష్, సంక్షేమం, అభివృద్ధిని జోడెద్దుల్లా చంద్రబాబు నాయుడు నడిపిస్తున్నారని అన్నారు. ప్రజలకు సేవ చేయడం, కార్యకర్తలకు సాయం చేయడం కోసం నిరంతరం తపించే నాయకుడు చంద్రబాబు నాయుడని ప్రశంసించారు. సేనాధిపతి చంద్రబాబు నేతృత్వంలో మనమంతా ఆయన సైనికులమని పేర్కొన్న లోకేష్, చేసిన పనులను ప్రజలకు చెప్పుకోవాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని అన్నారు మంత్రి నారా లోకేష్..
పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేద్దాం.. పడగొట్టినవి నిలబెడదాం..
గ్లోబల్ మార్కెట్లో ఉన్న డిమాండ్‌కు అనుగుణంగా ఉద్యాన ఉత్పత్తులను పండించేలా ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని వ్యవసాయ, ఉద్యాన రంగాల అభివృద్ధిపై సమగ్ర కార్యాచరణ చేపట్టాలని సూచించారు. మంగళవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో వివిధ శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో ఆయన చర్చించారు. ఈ సందర్భంగా రాయలసీమ, ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో ఉద్యానరంగ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం తెలిపారు. ఆయా ప్రాంతాల్లో మొత్తం 500 లక్షల మెట్రిక్ టన్నుల ఉద్యాన ఉత్పత్తులు పండించడమే లక్ష్యంగా కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని 10 జిల్లాలను ఉద్యాన రంగానికి కేంద్ర బిందువులుగా అభివృద్ధి చేసేలా సమీకృత అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. పూర్వోదయ నిధులను వినియోగించి సమగ్రాభివృద్ధి సాధించాలని సూచించారు. అలాగే, 10 జిల్లాల్లో 20కి పైగా పెండింగ్‌లో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. “పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేద్దాం.. పడగొట్టినవి నిలబెడదాం” అంటూ ప్రభుత్వ సంకల్పాన్ని స్పష్టం చేశారు. ఇక, ఉద్యాన ఉత్పత్తుల సరఫరాకు అనుగుణంగా గ్రామీణ రహదారుల నెట్‌వర్క్, లాజిస్టిక్స్ వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని సీఎం పేర్కొన్నారు. ఉత్పత్తులు రైతుల వద్ద నుంచి మార్కెట్‌కు సులభంగా చేరేలా మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. రైతులకు ఆదాయం పెరిగేలా, రాష్ట్రానికి ఎగుమతుల ద్వారా ఆదాయం వచ్చేలా ఉద్యానరంగాన్ని అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు.
మోగిన తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా.. పూర్తి వివరాలు ఇవే..!
తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల సందడి మొదలైంది. 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి 2026 సాధారణ ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని అధికారికంగా విడుదల చేశారు. ఈ ఎన్నికల ప్రక్రియ ద్వారా మొత్తం 52 లక్షల 43 వేల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ప్రజాస్వామ్య పండుగలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని కమిషనర్ ఈ సందర్భంగా కోరారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం, జనవరి 28వ తేదీ (బుధవారం) నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. అభ్యర్థులు తమ నామినేషన్లను జనవరి 30వ తేదీ సాయంత్రం 5:00 గంటల వరకు దాఖలు చేయవచ్చు. జనవరి 31న నామినేషన్ల పరిశీలన చేపట్టి, అదే రోజు సాయంత్రం అర్హత పొందిన అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. ఫిబ్రవరి 3వ తేదీ మధ్యాహ్నం 3:00 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. అనంతరం తుది బరిలో నిలిచే అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తారు.
నేటి నుంచే ఎన్నికల కోడ్ అమలు.. రూల్స్ ఇలా..!
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. మొత్తం 116 మున్సిపాలిటీలు , 7 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 52,43,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఎన్నికల ప్రధాన ఘట్టాలు కింది విధంగా ఉన్నాయి.. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తక్షణమే రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి (Model Code of Conduct) అమల్లోకి వచ్చింది. అక్రమాలను అరికట్టేందుకు ఫ్లయింగ్ స్క్వాడ్లు రంగంలోకి దిగాయని ఏడీజీ మహేష్ భగవత్ తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున నగదు రవాణాపై పోలీసులు కఠిన నిబంధనలు విధించారు.. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో వ్యక్తులు గరిష్టంగా ₹50,000 వరకు మాత్రమే నగదును వెంట తీసుకెళ్లాలి. రూ.50,000 కంటే ఎక్కువ నగదు ఉంటే తప్పనిసరిగా సరైన ఆధారాలు చూపించాలి, లేని పక్షంలో ఆ నగదును సీజ్ చేస్తారు. పోలీసులు నగదు లేదా ఇతర వస్తువులను సీజ్ చేసినప్పుడు తప్పనిసరిగా రిసీట్ ఇస్తారు. దానిపైనే అప్పీల్ చేసుకునే వివరాలు కూడా ఉంటాయి.
23 మంది భారత మత్స్యకారులకు విముక్తి.. బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదల..
బంగ్లాదేశ్ జైలు నుంచి 23 మంది భారతీయ మత్స్యకారులకు విముక్తి లభించింది.. ఉత్తరాంధ్రకు చెందిన 9 మందికి విడుదలతో ఆ కుటుంబాల్లో ఆనందం నెలకొంది.. బంగ్లాదేశ్ జైల్లో బందీలుగా ఉన్న ఉత్తరాంధ్ర మత్స్యకారులకు ఎట్టకేలకు విముక్తి లభించింది. ద్వైపాక్షిక ఒప్పందాల మేరకు బంగ్లాదేశ్ హోం మంత్రిత్వశాఖ 23 మంది భారతీయ మత్స్యకారులను విడుదల చేసింది. వీరిలో విజయనగరం జిల్లాకు చెందిన 9 మంది, పశ్చిమ బెంగాల్‌కు చెందిన 14 మంది మత్స్యకారులు ఉన్నారు. బాగర్హాట్ (Bhagerhat) జైల్‌లో నిర్బంధంలో ఉన్న ఈ మత్స్యకారులను విడుదల చేసిన అనంతరం, అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య మోంగ్లా పోర్టుకు తరలించారు. బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్ స్వాధీనం చేసుకున్న బోటుకు మరమ్మతులు పూర్తయ్యాక, రేపు వీరంతా బోటు ద్వారా తిరుగు ప్రయాణం కానున్నారు. అయితే, గత ఏడాది అక్టోబర్ నెలలో పశ్చిమ బెంగాల్ తీరంలో వేట సాగిస్తున్న సమయంలో, అనుకోకుండా అంతర్జాతీయ జలాల్లోకి ప్రవేశించడంతో బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్ మత్స్యకారులను అరెస్ట్ చేసింది. అప్పటి నుంచి వీరు జైలులోనే గడుపుతున్నారు. విడుదల వార్తతో ఉత్తరాంధ్ర మత్స్యకార కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసింది. తమ వారి రాక కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నామని కుటుంబ సభ్యులు తెలిపారు. భారత ప్రభుత్వ జోక్యం, ద్వైపాక్షిక చర్చల వల్లే ఈ విముక్తి సాధ్యమైందని వారు భావోద్వేగంగా చెప్పారు.
ఫ్రాన్స్‌లో మొట్టమొదటి హిందూ దేవాలయానికి శంకుస్థాపన..
భారతదేశం – ఫ్రాన్స్ మధ్య సాంస్కృతిక సహకారం సోమవారం ఒక చారిత్రాత్మక మైలురాయిని చేరింది. పారిస్‌లోని బుస్సీ-సెయింట్-జార్జెస్‌లో కొత్త హిందూ దేవాలయానికి పునాది రాయి వేశారు. అలాగే ఇండియా నుంచి మొదటి రాళ్లు వచ్చాయి. ఈ రాళ్లకు ఉత్సవ స్వాగతం పలికారు. ఇది ఆలయ నిర్మాణ తదుపరి దశకు సంకేతం, ఇది ఫ్రాన్స్‌లో మొట్టమొదటి సాంప్రదాయ హిందూ దేవాలయం అవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. శతాబ్దాల నాటి హస్తకళ, ఉమ్మడి నైపుణ్యాన్ని ఉపయోగించి ఈ ఆలయాన్ని నిర్మించనున్నట్లు తెలుస్తుంది. ఆలయ నిర్మాణం కోసం భారతదేశం నుంచి తీసుకువచ్చి సాంప్రదాయ పద్ధతులను ఉపయోగించి రూపొందించిన ఈ రాళ్లు శతాబ్దాల నిర్మాణ వారసత్వాన్ని సూచిస్తాయి. ఎంపిక చేసిన రాళ్లను భారతదేశంలోని నైపుణ్యం కలిగిన చేతివృత్తుల వారు వారి చేతులతో చెక్కారు. ఫ్రాన్స్‌లో ఆలయ నిర్మాణం కోసం భారతీయ కళాకారులు ఫ్రెంచ్ స్టోన్‌మేసన్‌లతో కలిసి పని చేస్తారు. వీరిలో నోట్రే-డామ్ కేథడ్రల్ పునరుద్ధరణలో పాల్గొన్న బృందంలోని వారు కూడా ఉన్నారు. భారతీయ చేతివృత్తుల వారి సంప్రదాయాలను ఫ్రాన్స్ ప్రఖ్యాత స్టోన్‌మేసన్రీ నైపుణ్యంతో ఏకం చేసి ఈ ఆలయాన్ని నిర్మించనున్నట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. ఆరాధనకే కాకుండా, సంస్కృతి, విద్య, సమాజ భాగస్వామ్యానికి కూడా అంకితమైన స్థలాన్ని సృష్టించే సమగ్ర దృక్పథంలో భాగంగా ఈ ఆలయాన్ని రూపొందిస్తున్నారు. నిర్మాణం పూర్తయిన తర్వాత, ఈ ఆలయం భారతదేశం – ఫ్రాన్స్ మధ్య స్నేహానికి శాశ్వత చిహ్నంగా నిలుస్తుంది.
ఆపరేషన్ సిందూర్ దెబ్బకు.. పడిపోయిన పాక్ సైన్యం ర్యాంక్..
ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ అనిశ్చితి, సంఘర్షణల మధ్య, గ్లోబల్ ఫైర్‌పవర్ 2026 సంవత్సరానికి తన మిలిటరీ స్ట్రెంత్ ర్యాంకులను విడుదల చేసింది. ఇది ప్రపంచవ్యాప్తంగా 145 దేశాల సైనిక బలానికి వార్షిక ర్యాంకింగ్. ఈ ర్యాంకింగ్స్‌లో ప్రతి దేశం పవర్ ఇండెక్స్ (PwrIndx) స్కోర్‌కు దోహదపడే 60 కంటే ఎక్కువ అంశాలు ఉన్నాయి. ఒక దేశం బలాన్ని దాని పవర్ ఇండెక్స్ (PwrIndx) స్కోర్ ఆధారంగా అంచనా వేస్తారు. గ్లోబల్ ఫైర్‌పవర్ ప్రకారం.. ఒక ఖచ్చితమైన PwrIndx స్కోరు 0.0000, ఇది ప్రస్తుత GFP ఫార్ములాలో సాధించలేము; కాబట్టి, PwrIndx విలువ తక్కువగా ఉంటే, దేశం సాంప్రదాయ యుద్ధ సామర్థ్యాలు అంత శక్తివంతంగా ఉంటాయి. ఈ ర్యాంకింగ్‌లో భారతదేశం నాల్గవ స్థానంలో కొనసాగుతోంది. భారతదేశం భారీ సైన్యం, క్షిపణి వ్యవస్థలు, S-400 రక్షణ వ్యవస్థ, రాఫెల్ వంటి యుద్ధ విమానాలను కలిగి ఉంది. సైనిక శక్తి జాబితాలో అమెరికా అగ్రస్థానంలో ఉంది, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైన్యం, వైమానిక దళం, నావికాదళం కలిగి ఉంది. రష్యా, చైనా వరుసగా 0.0791, 0.0919 స్కోర్‌లతో రెండవ స్థానంలో ఉన్నాయి. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ కు లొంగిపోయిన పాకిస్తాన్ సైనిక బల ర్యాంకింగ్స్ లో తగ్గుదలకు గురైంది. గత సంవత్సరం పాకిస్తాన్ 12వ స్థానంలో ఉండగా, ఈ సంవత్సరం అది 14వ స్థానానికి పడిపోయింది. పాకిస్తాన్ ర్యాంకింగ్ తగ్గుతూనే ఉంది. 2024లో పాకిస్తాన్ తొమ్మిదవ స్థానంలో ఉంది, కానీ 2025లో 12వ స్థానానికి పడిపోయింది. ఇప్పుడు, 2026లో, అది 0.2626 PwrIndx స్కోరుతో 14వ స్థానానికి పడిపోయింది.
TharunBhascker – EeshaRebba: త్వరలోనే ‘గుడ్ న్యూస్’ వినవచ్చేమో..
ప్రస్తుతం టాలీవుడ్‌లో జోరుగా సాగుతున్న పెళ్లి పుకార్లలో ముందు వరుసలో ఉన్న పేర్లు డైరెక్టర్.. హీరో తరుణ్‌భాస్కర్- హీరోయిన్ ఈషారెబ్బ. జనవరి 30న ఈ ఇద్దరి జంటగా నటించిన ‘ఓం శాంతి శాంతి శాంతిః’ సినిమా థియేటర్లలోకి రాబోతుంది. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో ఈ ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందని సినీ సర్కిల్‌లో జోరుగా ప్రచారం జరుగుతుంది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హీరో తరుణ్ భాస్కర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. వారి రిలేషన్‌షిప్ గురించి ఓపెన్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “ఈషా నాకు స్నేహితురాలు కంటే ఎక్కువ.. జీవితంలో చాలా ముఖ్యమైన వ్యక్తి” అని చెప్పారు. గత కొద్ది కాలంగా ఆమె తన జీవితంగా కీలక వ్యక్తిగా మారారని అన్నారు. ఇందులో ప్రత్యేకంగా చెప్పడానికి గానీ, దాచడానికి గానీ ఏమీ లేదని వెల్లడించారు. ప్రస్తుతం తమ ఇద్దరి గురించి జరుగుతున్న ప్రచారానికి ఫుల్‌స్టాప్ పెట్టడానికి ఒక కరెక్ట్ టైం కోసం వెయిట్ చేస్తున్నట్లు చెప్పారు. నేను తొందరపడి ఏదైనా చెబితే అవతలి వారిని ఇబ్బంది పెట్టవచ్చు, అందుకే సరైన టైం కోసం ఆగుతున్నా అని అన్నారు. మొత్తానికి త్వరలోనే ఈ ప్రచారానికి శుభం కార్డు వేస్తామని చెప్పారు. ఇదే సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల నిర్వహించిన ఒక ఇంటర్వ్యూలో ఈషా రెబ్బా పాల్గొని మాట్లాడుతూ.. “నా జీవితంలో ఏదైనా ముఖ్యమైనది జరిగితే.. నేనే అందరికీ చెప్తాను” అని ఆమె వెల్లడించారు.
ఈషా అంటే నాకు చాలా ఇష్టం.. ఓపెనైన తరుణ్ భాస్కర్!
తరుణ్ భాస్కర్ లీడ్ రోల్ లో నటిస్తున్న హిలేరియస్ విలేజ్ కామెడీ ఎంటర్ టైనర్ ‘ఓం శాంతి శాంతి శాంతిఃలో ఈషా రెబ్బా హీరోయిన్ గా నటిస్తున్నారు. A R సజీవ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఎస్ ఒరిజినల్స్, మూవీ వెర్స్ స్టూడియోస్ బ్యానర్స్ పై సృజన్ యరబోలు, ఆదిత్య పిట్టీ, వివేక్ కృష్ణని, అనుప్ చంద్రశేఖరన్, సాధిక్ షేక్, నవీన్ సనివరపు ఈ వెంచర్‌ను నిర్మిస్తుండగా, కిషోర్ జాలాది, బాల సౌమిత్రి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విడుదలై ప్రమోషనల్ కంటెంట్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఓం శాంతి శాంతి శాంతిః జనవరి 30న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. హీరో తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ. అందరికంటే చివర్లో హీరోనే మాట్లాడాలి. ఇందులో మా హీరో ఈషా. తనే చివర్లో మాట్లాడుతుంది అని పేర్కొన్న ఆయన నిర్మాత సృజన్ నా జూనియర్. తనని ఎప్పుడు చూసినా నాకు అదే ఫీలింగ్ ఉంటుంది. తనకి సినిమా అంటే చాలా పాషన్. ఈ రోజుల్లో సినిమాలు నిర్మించడం చాలా కష్టమైన పని. ఏ సినిమా ఎప్పుడు ఆడుతుందో తెలీదు. ఇలాంటి సమయంలో ప్రొడ్యూసరే హీరో. ఈ సినిమా నిర్మాతలు అందరికీ హాట్సాఫ్. ఇంతమంది హీరోల మధ్యలో నేను చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ నే. ఈషా అంటే నాకు చాలా ఇష్టం. నెట్ ఫ్లిక్స్ లో రాములు చేసినప్పుడు కూడా తనని సంప్రదించాను. అప్పుడు తను వేరే ప్రాజెక్టులో భాగమై ఉన్నారు. శాంతి క్యారెక్టర్ కు తన ప్రాణం పోశారు. తను రియల్ లైఫ్ లో కూడా ఎన్ని ఎలాంటి పరిస్థితులు కూడా చాలా శాంతిగా ఉంటారు. ఈ సినిమాకి హీరో ఈషా. ఈ సినిమా తప్పకుండా మిమ్మల్ని అందరిని ఎంటర్టైన్ చేస్తుందని నమ్మకం ఉంది అందరూ థియేటర్స్ లో వెళ్లి సినిమా చూడండి. చాలా ఎంజాయ్ చేస్తారు అని అన్నారు. అయితే తరుణ్ భాస్కర్ ఈషా ప్రేమలో ఉన్నారని ప్రచారం జరుగుతున్న సమయంలో ఈషా అంటే నాకు చాలా ఇష్టం అని కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ అవుతోంది.
ఆల్-టైమ్ రీజినల్ ఇండస్ట్రీ బ్లాక్‌బస్టర్ ‘మన శంకరవరప్రసాద్ గారు’
మెగాస్టార్ చిరంజీవి హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మన శంకరవరప్రసాద్ గారు’ మూడవ వారంలో కూడా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ ఇప్పుడు బుక్‌మైషోలో, ప్రపంచవ్యాప్త వసూళ్లలో సంచలనాత్మక మైలురాళ్లను సాధించింది. మన శంకరవరప్రసాద్ గారు బుక్‌మైషోలో ఆల్‌టైమ్ నంబర్ 1 రీజినల్ ఫిల్మ్ గా నిలిచింది, 15వ రోజుకే 3.6 మిలియన్ టికెట్లు అమ్ముడై, ఇప్పటివరకు రికార్డు కలిగిన సంక్రాంతికి వస్తున్నాం (3.5 మిలియన్)ను అధిగమించింది. ఈ ఘనతను సాధించిన ఫాస్టెస్ట్ రీజినల్ ఫిల్మ్ గా MSG రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా MSG కేవలం 15 రోజుల్లో ₹358 కోట్లకు పైగా వసూలు చేసి ఆల్-టైమ్ రీజినల్ ఇండస్ట్రీ ఆల్‌టైమ్ బ్లాక్‌బస్టర్ గా నిలిచింది. ఉత్తర అమెరికాలో, ఈ చిత్రం $3.5 మిలియన్ల మార్కును దాటే దిశగా దూసుకుపోతోంది. మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కెరీర్‌లోనే హైయెస్ట్ రికార్డ్స్ నమోదు అవుతున్నాయి. ఇప్పటికే వీరిద్దరికీ ఇదే బిగ్గెస్ట్ గ్లోబల్ ఎర్నర్ గా నిలిచింది. MSG ఆల్-టైమ్ రీజినల్ ఇండస్ట్రీ బ్లాక్‌బస్టర్‌తో మెగాస్టార్ చిరంజీవి తన బాక్సాఫీస్ స్టామినా ఏమిటో మరోసారి నిరూపించారు. ఈ చిత్రం అనేక చారిత్రాత్మక మైలురాళ్లను సాధించింది: నార్త్ అమెరికాలో చిరంజీవి & అనిల్ రావిపూడి కెరీర్‌లో ఆల్‌టైమ్ హైయెస్ట్ ప్రీమియర్ గ్రాసర్… తెలుగు రాష్ట్రాల్లో డే 5, డే 7, డే 14 నాటికి ఇండస్ట్రీ హైయెస్ట్ గ్రాసింగ్ రికార్డ్స్.. కేవలం 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు భారీ లాభాలు.. అనిల్ రావిపూడికి ఇది వరుసగా రెండో రీజినల్ ఇండస్ట్రీ హిట్, మొత్తం మీద 9వ కంటిన్యూస్ బ్లాక్‌బస్టర్.