Pakistan: నిజానికి పాకిస్థాన్‌ను శాసించేది ప్రజల చేత ఎన్నుకోబడిన పాలకులు కాదని.. పాక్ సైన్యం అని పలువురు విశ్లేషకులు చెబుతుంటారు. అంతటి శక్తి ఉంటుంది దాయాది దేశంలో సైన్యానికి. పాకిస్థాన్ రాజకీయాల్లో నెలకొన్న గందరగోళం ఇప్పట్లో తగ్గే సూచనలు కనిపించడం లేదు. తాజాగా పాక్ సైన్యం.. ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ తర్వాత, మరో ప్రధాన రాజకీయ పార్టీ అయిన ముత్తహిదా క్వామీ మూవ్‌మెంట్ (ఎంక్యూఎం) పాకిస్థాన్‌పై సైన్యం నిఘా పెట్టినట్లు సమాచారం.
READ ALSO: ADG Mahesh Bhagwat : నేటి నుంచే ఎన్నికల కోడ్ అమలు.. రూల్స్ ఇలా..!
ఇటీవల పాకిస్థాన్‌లో జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే.. అనేక మంది అగ్ర MQM నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేల భద్రతను అకస్మాత్తుగా సైన్యం ఉపసంహరించుకుంది. ఇది రాజకీయ వర్గాలలో భయాందోళనలకు గురిచేసింది. దీనిని ఆ పార్టీ నాయకత్వం తీవ్రమైన భద్రతా ముప్పుగా పేర్కొంది. ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండానే ఫెడరల్ మంత్రి ఖలీద్ మక్బూల్ సిద్ధిఖీ, సీనియర్ నాయకులు ఫరూఖ్ సత్తార్, ముస్తఫా కమల్, అనీస్ ఖైంఖానీల భద్రతను ఉపసంహరించుకున్నట్లు పలు వర్గాలు తెలిపాయి. అంతే కాకుండా, సింధ్ అసెంబ్లీలో MQM ప్రతిపక్ష నాయకుడు అలీ ఖుర్షీదీ భద్రతను కూడా ఉపసంహరించుకున్నట్లు నివేదికలు వెల్లడించాయి. కరాచీలో జరిగిన గుల్ ప్లాజా సంఘటనకు సంబంధించి MQM ప్రశ్నలు లేవనెత్తుతూ, ప్రభుత్వ యంత్రాంగాన్ని విమర్శిస్తున్న సమయంలో ఈ భద్రత ఉపసంహరణ తెరపైకి రావడం సంచలనం సృష్టిస్తుంది.
ఈ నిర్ణయంపై మంత్రులు, అసెంబ్లీ సభ్యులు, సీనియర్ MQM నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. భద్రతా ఉపసంహరణకు తమకు కచ్చితమైన కారణం ఇవ్వలేదని లేదా వారికి ఎటువంటి ముప్పు అంచనా వేయలేదని పార్టీ నాయకులు చెబుతున్నారు. ఈ చర్యకు గుల్ ప్లాజా సంఘటనను బహిరంగంగా ప్రశ్నించడమే కారణమై ఉండవచ్చని ఒక సీనియర్ MQM నాయకుడు పేర్కొన్నారు. ఈ అంశంపై ఎలాంటి ఒత్తిడి లేదా బెదిరింపులతో సంబంధం లేకుండా తమ పార్టీ ప్రశ్నలు లేవనెత్తుతూనే ఉంటుందని ఆయన స్పష్టంగా పేర్కొన్నారు. ఈ చర్య పాకిస్థాన్‌లో పెరుగుతున్న పౌర-సైనిక ఉద్రిక్తత, రాజకీయ అసమ్మతిని సూచిస్తుందని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి పాక్‌లో మొదట PTI పై అణచివేత, ఇప్పుడు MQM నాయకులకు భద్రతను తొలగించడం అనేది ఆలోచించాల్సిన విషయమే అని వెల్లడించారు. ఈ మొత్తం పరిణామం తరువాత, MQM నాయకత్వం అత్యవసర విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ సమావేశంలో ఆ పార్టీ నాయకత్వం తాజా అంశంపై తన అధికారిక వైఖరిని ప్రదర్శిస్తుందని సమాచారం.
READ ALSO: TharunBhascker – EeshaRebba: త్వరలోనే ‘గుడ్ న్యూస్’ వినవచ్చేమో..