భారత ప్రజలు ఐక్యంగా నిలబడాల్సిన సమయం.. ఆ దేశాలు మూల్యం చెల్లించక తప్పదు..!
ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్న దేశాలు మూల్యం చెల్లించక తప్పదు అని హెచ్చరించారు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్.. విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పహల్గామ్ ఉగ్రదాడిపై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేవారు.. పహల్గామ్‌లో జరిగిన దాడి దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టే చర్చగా పేర్కొన్నారు సత్యకుమార్.. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ తీసుకునే ఏ నిర్ణయం అయినా.. మా మద్దతు ఉంటుంది అని ఆగ్రదేశాలు ముందుకు రావడం శుభపరిణామం అన్నారు.. పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం కావడంతో అక్కడ ప్రజల దృష్టి మరల్చడం కోసం ఈ దాడికి తెగబడ్డారని ఆరోపించారు.. ఆర్టికల్ 370 రద్దుతో కాశ్మీర్ లో ప్రశాంత పరిస్థితిని జీర్ణించుకోలేక దుష్ట శక్తులు దాడులుకు తెగబడుతున్నాయని ఫైర్ అయ్యారు.. ఇక, సోషల్ మీడియాలో మత విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టింగులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు సత్యకుమార్ యాదవ్.. అంతేకాదు ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్న దేశాలు మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.. ఈ సమయంలో భారత్ ప్రజల ఐక్యతగా నిలబడాల్సిన సమయం ఇదే అంటూ పిలుపునిచ్చారు.. దేశ సమగ్రతకి కేంద్ర ప్రభుత్వం నిర్ధిష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్..
ప్రవీణ్ పగడాల మృతిపై అనుమానాలు.. ఘటనా స్థలంలో బహిరంగసభ..
పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై ఇంకా అనుమానాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి.. అది రోడ్డు ప్రమాదంగా తేల్చిన పోలీసులు.. దానికి సంబంధించిన కొన్ని ఆధారాలను కూడా బయటపెట్టారు.. అయితే, పాస్టర్ ప్రవీణ్ పగడాలది హత్య అనడానికి అనుమానాలు పెరుగుతున్నాయని అంటున్నారు అమలాపురం మాజీ ఎంపీ హర్ష కుమార్.. అసలు మృతదేహాన్ని ఘటనా స్థలం వద్దకు వెనుక నుంచి తీసుకువచ్చినట్లుగా నాకు అనుమానం ఉందన్నారు. రీపోస్ట్ మార్టం కోసం హైకోర్టులో పిల్ వేశానని హర్ష కుమార్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో నేను వేసిన పిల్ కు సహకరించాలని రాజమండ్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హర్ష కుమార్ కోరారు. మరోవైపు, సీబీఐ విచారణ చేసినా పాస్టర్ ప్రవీణ్ కేసులో న్యాయం జరగదని అభిప్రాయపడ్డారు హర్షకుమార్.. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు, విశాఖ పోర్టులో డ్రగ్స్ కేసులను సీబీఐ ఏమీ తేల్చలేదని గుర్తు చేశారు. అందుకే సిట్టింగ్ జడ్జితో విచారణకు డిమాండ్ చేస్తున్నానని అన్నారు. వచ్చే నెల 24న పాస్టర్ ప్రవీణ్ ఘటనా స్థలం వద్ద బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు హర్ష కుమార్ ప్రకటించారు. ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు విధించ వద్దని విజ్ఞప్తి చేశారు. బహిరంగ సభకు కేఏ పాల్ ను ఆహ్వానిస్తానని అన్నారు.. పాస్టర్ ప్రవీణ్ ది హత్య అని నమ్మేవాళ్లు వచ్చేనెల 24న బహిరంగ సభలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
మత్స్యకార భరోసా పథకానికి సీఎం శ్రీకారం.. రూ.20 వేలకు పెరిగిన భృతి..
మత్స్యకారుల కుటుంబాలకు శుభవార్త చెప్పారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.. మత్సకారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు తమ ప్రభుత్వం వెన్నంటే ఉంటుందని ప్రకటించారు.. ఎన్ని ఇబ్బందులు ఉన్నా.. వారి సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు.. శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన ఆయన.. మత్స్యకారుల సేవలో పేరుతో మత్స్యకార భరోసా పథకానికి శ్రీకారం చుట్టారు. ఏప్రిల్ 15వ తేదీ నుంచి జూన్ 14వ తేదీ వరకు వేట విరామ సమయానికి సంబంధించి భృతి కింద ఒక్కో కుటుంబానికి ఇచ్చే మొత్తాన్ని కూటమి సర్కార్ రూ.10 వేల నుంచి రూ.20 వేలకు పెంచగా.. మొత్తం రూ.259 కోట్ల మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు.. ఇక, శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం సముద్ర తీరంలో మత్స్యకారులతో మాట్లాడిన సీఎం చంద్రబాబు.. వారి సమస్యలు తెలుసుకున్నారు. మత్స్యకారుల జీవన విధానాన్ని పరిశీలించారు.. శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల నియోజకవర్గం, బుడగట్లపాలెంలో మత్స్యకారుల సేవలో పథకం ప్రారంభోత్సవం సందర్భంగా మత్య్సకార కుటుంబాలతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. మత్య్సకార కుటుంబం అయిన మద్దు పోలేష్, రామలక్ష్మీతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. కారి రాంబాబు, ఉప్పాడ సీతోగ్య, చింతపల్లి ఎర్రయ్యతో ముచ్చటించారు. ఇక, వారితో మాట్లాడి చేపలు ఎండబెట్టే విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. మరోవైపు, మత్స్యకార శాఖ ఏర్పాటు చేసిన వివిధ మత్స్యకార స్టాల్స్ ను సందర్శించిన సీఎం చంద్రబాబు గారు, మత్స్యకారులకు ప్రభుత్వం అందిస్తున్న పరికరాలను పరిశీలించారు.
తెలంగాణలో పెట్టుబడులకు ఆహ్వానించాం.. దావోస్ నుంచి లక్ష కోట్ల పెట్టుబడులు తెచ్చాం..
హెచ్ఐసీసీలో భారత్ సమ్మిట్ ముగింపు సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ సమ్మిట్ లో మాట్లాడటం ఎంతో ఆనందంగా ఉంది.. తెలంగాణకు ఎంతో ఘన చరిత్ర ఉందన్నారు.. అయితే, గత పదేళ్లలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు.. అందుకే కాంగ్రెస్ పాలన మీద ప్రజలు ఎక్కువ నమ్మకాన్ని పెట్టుకున్నారని తెలిపారు. ఇక, రూ. 20 వేల కోట్లు రైతులకు రుణమాఫీ చేశాం.. దేశంలోనే ఇది పెద్ద నిర్ణయం.. రైతు భరోసా పేరుతో రూ. 12000 ఎకరాకు ఇస్తున్నాం.. ఉపాధి హామీ కార్డు దారులకు సాయం చేస్తున్నాం.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సమాజంలోని ప్రతి ఒక్కరి ఆకాంక్షలు నెరవేర్చడమే మా ప్రభుత్వ లక్ష్యం అని ఆయన పేర్కొన్నారు. భారత దేశ చరిత్రలోనే అతి పెద్ద సంక్షేమ పథకాలను తెలంగాణలో అమలు చేస్తున్నాం.. రూ. 20,617 కోట్లతో రుణమాఫీ చేశాం.. 24/7 ఉచిత విద్యుత్ అందిస్తున్నాం.. లక్షల మంది రైతులను రుణ విముక్తుల్ని చేశామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
కేసీఆర్ సభపై ప్రజల కంటే కాంగ్రెస్ నాయకులకు ఇంట్రెస్ట్ పెరిగింది..
వరంగల్ జిల్లా చేరుకున్న మాజీమంత్రి హరీష్ రావు కి బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభా ఏర్పాట్లను ఆయన దగ్గరుండి పరిశీలించారు. సభకు వచ్చే కార్యకర్తలకు, నాయకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. ఇక, హరీష్ రావు మాట్లాడుతూ.. వరంగల్ జిల్లాలో అతి పెద్ద సభకు వేదిక నిలిచింది.. ఇప్పటికి సభ ఏర్పాట్లు పూర్తయ్యాయి.. ఇప్పటికే జనం సభకి తరలి వస్తున్నారు.. బీఆర్ఎస్ లేకపోతే తెలంగాణ లేదు.. తెలంగాణ లేకపోతే ఇంత అభివృద్ధి ఉండేది కాదు.. తెలంగాణ ప్రజల పక్షంలోనే బీఆర్ఎస్ ఉంటుంది అని హరీష్ రావు పేర్కొన్నారు. ఇక, మాయ మాటలు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ ఒక్క పథకం ఇవ్వడం లేదని హరీష్ రావు ఆరోపించారు. వాళ్ళు చెప్పిన పథకాలు ఇవ్వకపోయినా.. గతంలో ఉన్న పథకాలు అమలు చేయడం లేదన్నారు. శృతి లేని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ఆదాయం తగ్గిపోయింది.. పాలన చేతకాక రేవంత్ మాట తప్పిండు.. రుణామాఫీ చేస్తానని మోసం చేసిండు.. అసెంబ్లీలో తప్పుడు ప్రకటన చేసి.. రైతులను మోసం చేశారు.. రైతుల కోసం పని చేసింది కేవలం కేసీఆర్ ప్రభుత్వం మాత్రమే.. కాంగ్రెస్ మోసం చేసిన తీరుకు ఈ సభకు అన్ని వర్గాల వాళ్ళు వస్తున్నారు.. కాంగ్రెస్ కు పరిపాలన చేతకాక పంటలను ఎండ బెట్టైంది అని హరీష్ రావు మండిపడ్డారు.
బిలావల్ భుట్టో ‘‘రక్తం’’ కామెంట్స్.. కేంద్రమంత్రి ‘‘నీటి’’తో దిమ్మతిరిగే సమాధానం..
పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, భారత్ ‘‘సింధు జలాల ఒప్పందం’’ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం పాకిస్తాన్‌ని తెగ భయపెడుతోంది. ఇదే జరిగితే పాకిస్తాన్ దాదాపుగా ఎడారిగా మారుతుంది. వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ కలిగిన పాకిస్తాన్‌కి ఆకలి చావులే గతి. అయితే, సింధు జలాలపై పాక్ నేతలు మాత్రం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. తమ ప్రజల్ని రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు. పాక్ ప్రధాని సింధు నదిని ‘‘జీవనాడి’’గా పేర్కొన్నారు. ఇదిలా ఉంటే, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చీఫ్ బిలావల్ భుట్టో జర్దారీ మాట్లాడుతూ.. ‘‘ సింధు నది మాది, మా నీరుని ఆపితే, భారతీయుల రక్తం ప్రవహిస్తుంది’’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి మాట్లాడుతూ దిమ్మతిరిగే సమాధానం ఇచ్చారు. ‘‘ నేను అతడి(భుట్టో) ప్రకటన విన్నాను. నీటిలో ఎక్కడైనా దూకమనండి. అయితే, నీరు లేనప్పుడు అతను ఎలా చేస్తాడు..? అలాంటి ప్రకటనల్ని పట్టించుకోవద్దు. వారికే తర్వాత అర్థం అవుతుంది’’ అని అన్నారు.
పాకిస్తాన్‌లో వధువు, బోర్డర్‌లో వరుడు.. పెళ్లి కష్టమే..
పహల్గామ్ దారుణమై ఉగ్ర దాడికి ప్రతీకారం తీర్చుకోవాలని ప్రతీ భారతీయుడు కోరుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం, పాకిస్తాన్‌తో అన్ని సంబంధాలను తెంచుకుంటోంది. ఇప్పటికే సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. ఇక పాకిస్తాన్‌తో సరిహద్దును మూసేయాలని నిర్ణయించింది. పాకిస్తాన్ జాతీయులకు వీసాలను రద్దు చేసింది. ప్రస్తుతం ఈ నిర్ణయంతో అట్టారీ -వాఘా సరిహద్దులో రద్దీ నెలకొంది. పాక్ జాతీయులు వారి దేశానికి వెళ్లేందుకు బారులు తీరారు. ఇదిలా ఉంటే, ఇప్పుడు ఈ నిర్ణయం పెళ్లిళ్లపై ప్రభావం చూపిస్తోంది. 1947లో దేశ విభజన జరిగినప్పటికీ, ఇప్పటికీ రెండు దేశాల మధ్య సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలోని చాలా మంది పాకిస్తాన్ అమ్మాయిని లేదా అబ్బాయిని వివాహం చేసుకుంటున్నారు. ఇప్పుడు వీరిపై పహల్గామ్ ఎటాక్ ప్రభావం పడింది.
రామ్ కోసం రంగంలోకి క్రేజీ హీరో..?
యంగ్ హీరో రామ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాను మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి డైరెక్టర్ మహేశ్ బాబు డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో భాగ్య శ్రీ బోర్సె నటిస్తోంది. ఈ మూవీలో రామ్ లుక్ వింటేజ్ లో కనిపిస్తోంది. ఈ సినిమాపైనే ఆశలన్నీ పెట్టుకున్నాడు. ఎందుకంటే రామ్ కు హిట్ పడి చాలా రోజులు అవుతోంది. ఈ సినిమాకు ఆంధ్రా కింగ్ తాలూకా అనే పేరు ప్రచారం ఉంది. ఈ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. ఇక రామ్ బర్త్ డే రోజు టైటిల్ తో పాటు టీజర్ ను రిలీజ్ చేస్తున్నారంట. అయితే ఈ సినిమాలో ఓ బలమైన పాత్ర ఉందంట. దాని కోసం ఓ సీనియర్ హీరోను వెతుకుతున్నారు. ఇప్పటికే మోహన్ లాల్ ను సంప్రదించారు. కానీ ఆయన నుంచి ఎలాంటి రెస్పాన్స్ రావట్లేదంట. దాంతో ఉపేంద్రకు కథను వినిపించారంట. ఈ సినిమా కోసం ఆయన్ను తీసుకునేందుకు చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఆయన సానుకూలంగా స్పందించారనే ప్రచారం జరుగుతోంది. ఉపేంద్ర గతంలో కూడా తెలుగు సినిమాల్లో కీలక పాత్రల్లో నటించారు. ఆయన పాత్రకు ప్రాధాన్యత ఉంటే నటించేందుకు ఉపేంద్ర సిద్ధంగానే ఉంటారు. అందులో భాగంగానే ఇప్పుడు ఈ సినిమా చేసేందుకు ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో ఉపేంద్ర యాక్ట్ చేస్తే మూవీకి మంచి హైప్ పెరిగే అవకాశాలు ఉన్నాయి.
బన్నీ కోసం ఐదుగురు భామలు?
అల్లు అర్జున్ హీరోగా అట్లీ ఒక సినిమా ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఈ మధ్యన ఒక ఆసక్తికరమైన వీడియోతో అనౌన్స్ చేశారు. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ నటించే సినిమాకి సంబంధించి అనేక వార్తలు తెరమీదకు వస్తూ ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమాలో హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ నటించే అవకాశం ఉందని ఒక ప్రచారం మొదలైంది. అందులో ఎంతవరకు నిజాలు ఉన్నాయో తెలియదు, కానీ ఇప్పుడు హీరోయిన్ల గురించి కూడా ఒక వార్త మీడియాలో చక్కర్లు కొడుతోంది. దాని ప్రకారం ఈ సినిమాలో ఐదుగురు హీరోయిన్లు నటిస్తారట. అందులో ముగ్గురు హీరోయిన్లు కీలక పాత్రలలో నటిస్తూ ఉండగా, ఇద్దరు హీరోయిన్లకు మాత్రం మైనర్ రోల్స్ ఉండబోతున్నాయని అంటున్నారు. ఇక ముగ్గురు కీలకమైన హీరోయిన్ల పాత్రల కోసం ఇప్పటికే పలువురు హీరోయిన్లను పరిశీలిస్తున్నారని, అందులో ఒక పాత్ర కోసం మృణాల్ ఠాకూర్‌ను తీసుకోవాలని ప్లాన్ చేశారని అంటున్నారు. ఇప్పటికే అట్లీ టీం మృణాల్ ఠాకూర్‌ను సంప్రదించిందని, ఆమె కథ విని ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలుస్తోంది. ఆమెకు కథ నచ్చింది కానీ డేట్స్ కుదురుతాయో లేదో చెక్ చేసుకుని గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇక ఏకంగా ఐదుగురు హీరోయిన్లు కావాల్సి రావడంతో మిగతా పాత్రల కోసం ఎవరిని తీసుకోబోతున్నారనే చర్చలు కూడా జరుగుతున్నాయి. పోటపోటీగా హీరోయిన్లను దింపితే వారికి కూడా దండిగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. మరి ఇప్పటికే పాన్ ఇండియా సినిమాగా అత్యంత భారీ బడ్జెట్‌లో రూపొందబోతున్న ఈ చిత్రం కోసం ఎవరు బరిలోకి దిగబోతున్నారో చూడాల్సి ఉంది.