పోలీసు వ్యవస్థ దిగజారి పోయింది..! ప్రజలకు స్వేచ్ఛ లేకుండా పోయింది..!
ఆంధ్రప్రదేశ్‌లో పోలీసు వ్యవస్థ దిగజారి పోయిందని.. ప్రజలకు స్వేచ్చ లేకుండా పోయిందని ఆరోపించారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి.. పోలీసులను ప్రభుత్వ పెద్దలు ఇష్టానుసారం వాడుకుంటున్నారని.. నల్లపాడు పీఎస్ పరిధిలో జరిగిన ఒక హత్య కేసులో మా పార్టీ కార్యకర్తను అరెస్టు చేశారన్నారు.. మంత్రి నారా లోకేష్ నియోజకవర్గంలో వైసీపీ తరపున గట్టిగా నిలబడ్డాడని వీరయ్య అనే తమ పార్టీ కార్యకర్తను అరెస్టు చేశారన్నారు.. మధ్యవర్తినామాలో పోలీసులు ఇష్టానుసారం రాసుకుని సంతకం చేయించుకున్నారన్నారు.. ఇది పోలీసుల పక్షపాత వైఖరికి నిదర్శనమని.. నకిలీ మద్యం కేసు గురించి కాశీబుగ్గలో ధర్నా చేశారని.. తమ వారిపై ఏకంగా హత్యాయత్నం కేసు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.. ధర్నా చేస్తే పోలీసుల మీదనే హత్యాయత్నం చేసినట్టు కేసు పెట్టారని.. కోర్టు బెయిల్ ఇస్తుందని ఏకంగా మర్డర్ కేసులు, హత్యాయత్నం కేసులు పెడుతున్నారన్నారు.. కక్ష పూరిత రాజకీయాలతో రాష్ట్రాన్ని శ్మశానంలా మారుస్తున్నారన్నారు.. అలాంటి వారు బుద్ధి మార్చుకోకపోతే భవిష్యత్తులో ఇబ్బంది పడతారన్నారు.. హైకోర్టు ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తున్నారని.. అలాంటి వారంతా భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు వైసీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి..
ప్రభుత్వం దృష్టికి ఇవి రాలేదా..? ఇవి వైఫల్యాలు కావా..?
కూటమి ప్రభుత్వంపై మరోసారి ఫైర్ అయ్యారు వైసీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి.. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అధ్యక్షతన పార్టీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర కమిటీ, అన్ని జిల్లాల అధ్యక్షుల ఆత్మీయ సమావేశం జరిగింది.. ఈ సమావేశంలో సజ్జల మాట్లాడుతూ.. వైఎస్ జగన్ పాలన ఈ ఐదేళ్లు కొనసాగి ఉంటే ఒక కొత్త జనరేషన్ తయారయ్యేదన్నారు.. ఒక మంచి వ్యవస్ధలను జగన్ రూపొందిస్తే చంద్రబాబు దానిని కుప్పకూల్చారని ఆరోపించారు.. జగన్ పాలనలో నాడు నేడు పేరుతో స్కూల్స్ అభివృద్ది జరిగితే.. ఇప్పుడు ఏం జరుగుతుంది..? అని నిలదీశారు.. కురుపాం, తురకపాలెం ఘటనలే ఇందుకు నిదర్శనం.. ఇది క్రిమినల్ నెగ్లిజెన్స్ కాదా..? ప్రభుత్వం దృష్టికి ఇవి రాలేదా..? ఇవి వైఫల్యాలు కావా..? అని నిలదీశారు సజ్జల.. వైసీపీ హయాంలో క్యాలెండర్ పెట్టుకుని ఏ నెలలో ఏం పథకం వస్తుందని సంక్షేమ లబ్ధిదారులకు హక్కుగా లభించేలా చేశారు.. అసమానతలు తొలగించి రాజ్యాంగ స్ఫూర్తిని జగన్ అమలు చేశారు.. కానీ, జగన్ పాలనకు పూర్తి వ్యతిరేకంగా చంద్రబాబు పాలన సాగుతుందన్నారు సజ్జల.. ఏ రకంగా వడపోసి సంక్షేమ పథకాల లబ్ధిదారులను తగ్గించాలనేది చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారని దుయ్యబట్టారు.. చంద్రబాబు సంక్షేమం అంతా తన వారికే తప్ప నిజమైన లబ్ధిదారులకు కాదు అని విమర్శించారు. ఎల్లో మీడియా, ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు చంద్రబాబు చేతిలో ఉన్నాయి.. ఊతకర్రల సాయంతో కల్లబొల్లిమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. దివ్యాంగుల విషయంలో చంద్రబాబు రాక్షసంగా వ్యవహరిస్తున్నారు. దివ్యాంగులకు ఇచ్చే ఫించన్ లపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. అసలు దివ్యాంగులకు ఫించన్లు అవసరమా అనేలా చంద్రబాబు పాలన ఉంది.. రీవెరిఫికేషన్ పేరుతో దివ్యాంగులను వేధిస్తున్నారని మండిపడ్డారు.
నిమ్స్ ఆసుపత్రిలో వైద్య విద్యార్థి అనుమానాస్పద మృతి.. తప్పుదోవ పట్టిస్తున్న అధికారులు!
హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో అనస్థీషియా వైద్య విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. విద్యార్థి నితిన్ గురువారం రాత్రి విధులకు హాజరుకాగా.. శుక్రవారం ఉదయం ఆపరేషన్ థియేటర్లో విగతజీవిగా పడి ఉన్నాడు. ఆసుపత్రి సిబ్బంది సమాచారంతో పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మెదక్ జిల్లాకు చెందిన గిరిజన బిడ్డ నితిన్ మృతిపై తల్లిదండ్రలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏం జరిగిందో తెలియదు అంటూ నిమ్స్ అధికారులు విషయాన్ని గోప్యంగా ఉంచడానికి మీడియాను అన్నివిధాలుగా తప్పుదోవ పట్టిస్తున్నారు. ఎవరో తమ బిడ్డను పొట్టనబెట్టుకుంటే.. ఆత్మహత్య చేసుకున్నట్లుగా చిత్రీకరించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారని ఆరోపిస్తూ నితిన్ తల్లిదండ్రులు, బంధువులు నిమ్స్ హాస్పిటల్ వద్ద ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు వాస్తవమేంటో బయటపెట్టాలని జూనియర్ డాక్టర్లు, నితిన్ సహచరులు, మిత్రులు డిమాండ్ చేస్తున్నారు. ఆరోగ్య శాఖ మంత్రి గారు.. మీ సొంత ఉమ్మడి జిల్లాకు చెందిన విద్యార్థి మృతిపై వెంటనే స్పందించాల్సిన అవసరముంది, ఎలా నితిన్ మృతి చెందాడు తెలుసుకుని ప్రకటన చేయాలంటూ మృతుడి బంధువులు, స్నేహితులు డిమాండ్ చేస్తున్నారు.
ఇన్ఫోసిస్ వల్లే ఆయనకు అన్నీ తెలుసా..? నారాయణ మూర్తిపై కర్ణాటక సీఎం విమర్శలు
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్.ఆర్. నారాయణ మూర్తి, రచయిత్రి సుధా మూర్తిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో జరుగుతున్న సామాజిక, విద్యా సర్వే వెనుకబడిన తరగతుల కోసం మాత్రమే కాదు, మొత్తం జనాభా కోసం అని ఆయన అన్నారు. మూర్తి దంపతులు సర్వేలో పాల్గొనడానికి నిరాకరించిన తర్వాత ఆయన ఈ ప్రకటన చేశారు. కర్ణాటకలో సామాజిక, విద్యా సర్వే జరుగుతోంది. కానీ దాని చుట్టూ వివాదం పెరుగుతోంది. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి, ఆయన భార్య సుధా మూర్తిని సర్వే నుండి మినహాయించడం అధికారుల సమన్వయ లోపం ఆధారంగా జరిగిందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గురువారం తెలిపారు. సిద్దరామయ్య మాట్లాడుతూ.. “ఇది వెనుకబడిన తరగతుల సర్వే కాదు. వారు అర్థం చేసుకోకపోతే, నేను ఏం చేస్తాను? ఇది మొత్తం జనాభా సర్వే అని మేము 20 సార్లు చెప్పాము. వారు ఇన్ఫోసిస్ అయినందున వారికి ప్రతిదీ తెలుస్తుందా?” అని విమర్శించారు.
26 మందితో కేబినెట్ విస్తరణ.. మంత్రిగా రవీంద్ర జడేజా భార్య ప్రమాణం
దీపావళి పండుగకు మందు గుజరాత్ రాజకీయాల్లో కీలక పరిణామాలు జరిగాయి. శుక్రవారం కేబినెట్ విస్తరణ అట్టహాసంగా జరిగింది. 26 మందితో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగింది. ఇందులో హర్ష్ సంఘవి కొత్త డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేయగా.. రివాబా జడేజా మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. గురువారం అనూహ్యంగా ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ మినహా 16 మంది మంత్రులు రాజీనామాలు చేశారు. ఇక కొన్ని గంటల వ్యవధిలోనే 26 మందితో కొత్త కేబనెట్ ఏర్పాటు జరిగిపోయింది. గుజరాత్‌లోని గాంధీ నగర్‌లోని రాజ్‌భవన్‌లో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. 182 మంది సభ్యులున్న గుజరాత్ అసెంబ్లీలో గరిష్టంగా 27 మంది మంత్రులు ఉండవచ్చు. మునుపటి మంత్రివర్గంలో మొత్తం 17 మంది సభ్యులు ఉన్నా. ఎనిమిది మంది కేబినెట్ హోదాను కలిగి ఉండగా.. మిగిలినవారు సహాయ మంత్రులుగా పనిచేశారు. తాజాగా 26 మందితో మంత్రివర్గ విస్తరణ జరిగింది. గుజరాత్‌లో పాలనా నిర్మాణాన్ని బలోపేతం చేయడం. పరిపాలనలో కొత్త శక్తిని నింపడానికి మంత్రివర్గ విస్తరణ జరిగినట్లుగా తెలుస్తోంది.
24 గంటల్లో 8 దాడులు.. 12 మంది పాక్ సైనికులు హతం..
ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్య సరిహద్దు ఘర్షణలు తీవ్రమయ్యాయి. గత వారం మొదలైన ఈ ఘర్షణ వల్ల ఇరు వైపులు పదుల సంఖ్యలో సైనికులు మరణించారు. ఈ నేపథ్యంలో ఆఫ్ఘాన్ ధాటికి తట్టుకోలేక, సౌదీ అరేబియా, ఖతార్ దేశాలను మధ్యవర్తిత్వం వహించాలని పాకిస్తాన్ వేడుకుంది. దీంతో రెండు దేశాలు 48 గంటల ‘‘కాల్పుల విరమణ’’కు ఒప్పుకున్నాయి. ఇదిలా ఉంటే, తెహ్రిక్-ఇ-తాలిబన్ పాకిస్తాన్ (TTP) మాత్రం పాక్ ఆర్మీ, పోలీసులపై విరుచుకపడుతోంది. నివేదికల ప్రకారం, పాకిస్తాన్ పై పాక్ తాలిబాన్లు 8 కోఆర్డినేటెడ్ దాడులు చేశాయి. ఈ దాడుల్లో 13 మంది పాకిస్తాన్ సైనికులు హతమయ్యారు. వజీరిస్తాన్‌లోని మీర్ అలీలోని పాకిస్తాన్ సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపింది. 24 గంటల్లోనే టీటీపీ ఈ దాడులు చేసింది.
సాహో భారత్.. ఇండియాలో రష్యా Su-57 యుద్ధ విమానాల తయారీ..
ప్రపంచ దేశాల్లో భారత్-రష్యా స్నేహానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ రెండు దేశాల్లో ఏ దేశానికి ఆపద వచ్చినా సాయం చేయడానికి మరొక దేశం ముందుకు వస్తుంది. తాజాగా భారతదేశంలో రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్ ఒక ముఖ్యమైన ప్రకటన చేశారు. భారతదేశంతో రష్యా తన రక్షణ సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటుందని ఆయన ఈ ప్రకటనలో పేర్కొన్నారు. “భారతదేశం AMCA ప్రాజెక్టుకు మద్దతు ఇవ్వడానికి రష్యా సిద్ధంగా ఉంది. ఇందులో భాగంగా భారతదేశంలో ఐదవ తరం యుద్ధ విమానం Su-57 ఉత్పత్తి చేయనున్నాం. ఇది భారతదేశానికి చాలా మంచి విషయం” అని ఆయన పేర్కొన్నారు. భారతదేశం – రష్యా రెండు దేశాలు 60 ఏళ్లపైగా రక్షణ మిత్రులుగా ఉన్నాయి. రష్యా భారతదేశానికి అనేక ఆయుధాలు, విమానాలను అందించింది. ఉదాహరణకు… ఇండియాకు స్వతంత్రం సిద్ధించిన రోజుల్లో భారత వైమానిక దళానికి వెన్నెముక అయిన మిగ్-21 విమానం రష్యా అందజేసిందే. అలాగే నేటికీ ఉపయోగంలో ఉన్న Su-30MKI యుద్ధ విమానాలు కూడా మాస్కో అందజేసిందే. బ్రహ్మోస్ క్షిపణిని రష్యా – భారతదేశంతో కలిసి అభివృద్ధి చేసిన ఉమ్మడి ప్రాజెక్ట్. 2024లో Su-30 అప్‌గ్రేడ్ కిట్‌లను మాస్కో భారత్‌కు డెలివరీ చేసింది. రష్యా ఎల్లప్పుడూ భారతదేశానికి మద్దతు ఇచ్చింది. భారతదేశానికి యునైటెడ్ స్టేట్స్, ఫ్రాన్స్ వంటి దేశాలతో కూడా భాగస్వామ్యం ఉంది, కానీ రష్యాతో ఉన్న భాగస్వామ్యం ప్రత్యేకమైనది.
‘ఏదో జరగబోతోంది’.. బంగారం ధరలపై ఆర్థికవేత్త హెచ్చరిక!
బంగారం, వెండి ధరలు ఇటీవల చాలా వేగంగా పెరుగుతున్నాయి. ఊహించని రీతిలో వేలకు వేలు పెరుగుతూ దడపుట్టిస్తున్నాయి. సగటు వ్యక్తికి ఆభరణాలు లేదా బంగారం లేదా వెండితో చేసిన ఏదైనా వస్తువు కొనడం కష్టంగా మారింది. బంగారం, వెండి ధరలు పెరగడం వల్ల పెట్టుబడిదారులు కూడా కలవరపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఒక ప్రముఖ ఆర్థికవేత్త బంగారం గురించి ఒక ముఖ్యమైన హెచ్చరిక జారీ చేశారు. బంగారానికి ఏదైనా పెద్ద ప్రమాదం జరిగే ప్రమాదం ఉందని ఆయన అంటున్నారు. గత ఐదు సంవత్సరాలలో ఒక్క వారంలో కూడా బంగారం ఇంత పెరుగుదలను చూడలేదని యూరో పసిఫిక్ అసెట్ మేనేజ్‌మెంట్‌లో చీఫ్ ఎకనామిస్ట్, గ్లోబల్ స్ట్రాటజిస్ట్ పీటర్ షిఫ్ అన్నారు. “ఇది చాలా తీవ్రమైన పరిస్థితి. బంగారం ధర $4,370 వద్ద ఉంది. ఈ రాత్రికి అది $4,400కి చేరుకోవచ్చు. అంటే కేవలం ఒక వారంలోనే 10% పెరుగుదల. ఏదో పెద్ద విషయం జరగబోతోందని నేను భావిస్తున్నాను” అని ఆయన అన్నారు. శుక్రవారం బంగారం ధరలు ఔన్సుకు $4,300 మార్కును అధిగమించాయి. రికార్డు ర్యాలీని కొనసాగిస్తూ మార్చి 2020 తర్వాత వారి బలమైన వారపు లాభాలను నమోదు చేశాయి. 0233 GMT నాటికి స్పాట్ గోల్డ్ ఔన్సుకు 0.3 శాతం పెరిగి $4,336.18కి చేరుకుంది. ఇది $4,378.69 గరిష్ట స్థాయిని తాకింది. డిసెంబర్ డెలివరీ కోసం US గోల్డ్ ఫ్యూచర్స్ 1 శాతం పెరిగి $4,348.70కి చేరుకుంది.
నడవలేని స్థితిలో రాజమౌళి సినిమా ఆర్టిస్టు.. ఆదుకున్న లారెన్స్
దర్శకధీరుడు రాజమౌళి తీసిన విక్రమార్కుడు సినిమాలో చైల్డ్ ఆర్టిస్టు రవి రాథోడ్ అందరికీ గుర్తుండే ఉంటుంది. అందులో ఓ సీన్ లో ‘రేయ్ సత్తి బాల్ ఒచ్చిందా అని ఓ పిల్లాడు రవితేజను అడుగుతాడు. హా ఆ పిల్లాడే ఇప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నారు. చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. విక్రమార్కుడు తర్వాత చాలా సినిమాల్లో నటించాడు. కానీ చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో లారెన్స్ చేరదీసి ఓ స్కూల్ లో చేర్పించాడు. కానీ లారెన్స్ కు చెప్పకుండానే రవి రాథోడ్ అక్కడి నుంచి పారిపోయాడు. చదువు అబ్బలేదు. చిన్నా చితక పనులు చేసుకుంటూ మద్యానికి బానిస అయ్యాడు. దీంతో చాలా అనారోగ్య సమస్యలకు గురయ్యాడు. కిడ్నీలో రాళ్లు మరీ ఎక్కువ కావడంతో నడవలేని స్థితిలోకి వెళ్లిపోయాడు. రవి విషయం చాలా మీడియాల్లో వైరల్ అయింది. దీంతో లారెన్స్ ఈ విషయం తెలుసుకుని తనను ఒకసారి కలవమని కోరాడు. తనను ఆదుకున్న లారెన్స్ ను కలిసిన్నాడు రవి. మద్యానికి బానిస అయ్యాడని తెలిసి లారెన్స్ కోప్పడ్డాడు. లారెన్స్ కోసం ఇంకెప్పుడూ మద్యం ముట్టుకోను అని ప్రామిస్ చేసిన రవి.. అప్పటినుంచి మద్యానికి దూరంగానే ఉంటున్నాడు. లారెన్స్ ఇచ్చిన డబ్బులతోనే ఓ ఫోన్ కొనుక్కున్నాడు. ఇప్పుడు హెల్త్ కూడా సెట్ అవడంతో మరోసారి లారెన్స్ ను కలిసి ఆ ఫోన్ లోనే సెల్ఫీ తీసుకుని సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీంతో లారెన్స్ ను అందరూ మెచ్చుకుంటున్నారు. ఎంతో మందికి ఇలా సాయం చేస్తున్నాడని ఆయన్ను ప్రశంసిస్తున్నారు.
కిడ్నీ అమ్ముకుని సినిమా చేస్తా.. నటి షాకింగ్ కామెంట్స్
కాంట్రవర్సీ బ్యూటీ రేఖా భోజ్ గురించి ప్రత్యేకంగ పరిచయం అవసరం లేదు. ఆమె చేసిని సినిమాలు చాలా తక్కువే అయినా చేసే కామెంట్లు మాత్రం ఓ రేంజ్ లో ఓ కాంట్రవర్సీని క్రియేట్ చేస్తుంటాయి. ఎప్పటికప్పుడు ఆమె చేసే సోషల్ మీడియా పోస్టులు అలా ఉంటాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ షాకింగ్ కామెంట్లు చేసింది. ఆమె మాట్లాడుతూ.. నేను సినిమాల్లో నటించేందుకు ఏం చేయడానికైనా సిద్ధంగానే ఉంటాను. గతంలో నేను సామి సామి అనే కవర్ సాంగ్ చేశాను. దాని కోసం నా రెండు బంగారు గాజులు అమ్ముకున్నాను. అది నాకు మంచి పేరు తీసుకొచ్చింది. దాని వల్లే ఓ సినిమాలో ఛాన్స్ వచ్చింది. అలా ఇండస్ట్రీలో నాకు గుర్తింపు లభించింది. నాకు సినిమాల్లో పెద్దగా ఛాన్సులు రావట్లేదు. కానీ నటనను విడిచిపెట్టే ప్రసక్తే లేదు. అవసరం అయితే నా కిడ్నీ అమ్ముకుని అయినా సొంతంగా సినిమా చేస్తాను. నాకు గత మూడేళ్ల నుంచి ఎన్నో కమిట్ మెంట్ ఆఫర్లు ఇస్తున్నారు. వాళ్లకు కమిట్ మెంట్ ఇస్తే బిల్డింగ్ ఇస్తాం, కారు ఇస్తాం, ఫ్లాట్ ఇస్తాం అంటున్నారు. నేను వాటిని రిజెక్ట్ చేస్తూ వస్తున్నాను. ఒకవేళ వాళ్లు అడిగినట్టే నేను కమిట్ మెంట్ ఇచ్చి ఉంటే ఈ పాటికి సెటిల్ అయిపోయేదాన్ని. కానీ నాకు అలా సెటిల్ కావడం ఇష్టం లేదు. నా సొంత ట్యాలెంట్ తోనే సంపాదించుకుంటాను. ఇప్పటికీ నేను నిజాయితీగా ఉంటున్నాను కాబట్టే నా దగ్గర పెద్దగా డబ్బులు లేవు అంటూ తెలిపింది రేఖ.