నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం.. కస్టడీకి 10 మంది నిందితులు..
ఆంధ్రప్రదేశ్‌లో ఓవైపు లిక్కర్ స్కామ్ కేసు.. మరోవైపు.. నకిలీ లిక్కర్ కేసులు కాక రేపుతున్నాయి.. అయితే, అన్నమయ్య జిల్లా మొలకలచెరువు నకిలీ మద్యం వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.. ఈ కేసులో 10 మంది నిందితులను మూడురోజుల కస్టడీ కి అనుమతి ఇచ్చింది తంబళ్లపల్లె కోర్టు.. అయితే, నకిలీ లిక్కర్ స్కామ్ కేసులో 10 మంది నిందితులను ఏడు రోజులు కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది ఎక్సైజ్ శాఖ.. దీనిపై విచారణ జరిపిన తంబళ్లపల్లె కోర్టు.. 10 మంది నిందితులను మూడు రోజుల కస్టడీ అనుమతి ఇచ్చింది.. దీంతో, రేపు ఉదయం నిందితులను కస్టడీలోకి తీసుకోనున్నారు ఎక్సైజ్ శాఖ అధికారులు.. మరోవైపు, ఇంత వరకు A5 జయచంద్రారెడ్డి పీఏ రాజేష్, A.17 జయ చంద్రారెడ్డి, A.18 గిరిధర్ రెడ్డి ఆచూకీ లభించలేదు..
మందు బాబులకు గుడ్‌న్యూస్.. అమల్లోకి కొత్త నిబంధనలు..
ఆంధ్రప్రదేశ్‌లో నకిలీ మద్యం వ్యవహారం కలకం సృష్టించింది.. దీంతో, మనం తాగేది అసలైనా లిక్కరేనా? నకిలీ తాగేస్తున్నామా? అనే అనుమానాలు మొదలయ్యాయి.. దీని ప్రభావం లిక్కర్ అమ్మకాలపై స్పష్టంగా కనిపిస్తున్నాయి.. నకిలీ మద్యం వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత ఎక్సైజ్‌శాఖ ఆదాయం తగ్గిపోయింది.. దీంతో, నకిలీ మద్యానికి చెక్ పెట్టేందుకు సిద్ధమైంది ఏపీ సర్కార్.. నకిలీ మద్యం నివారణకు మరిన్ని చర్యలు చేపట్టింది.. మద్యం దుకాణాలు, బార్లలో నాణ్యమైన మద్యం అమ్మేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.. నకిలీ మద్యం నివారణకు నిబంధనలు అమల్లోకి తెచ్చింది ఎక్సైజ్ శాఖ.. ఇకపై క్యూఆర్ కోడ్ స్కానింగ్ చేశాకే మద్యం అమ్మేలా నిబంధన.. పెట్టింది ఎక్సైజ్‌శాఖ.. ‘ఎక్సైజ్ సురక్షా యాప్’ ద్వారా మద్యం సీసాపై కోడ్ స్కాన్ చేయాలని నిబంధన పెట్టింది.. ప్రతి దుకాణం, బార్ వద్ద ప్రత్యేకంగా బోర్డులు ప్రదర్శించాలని ఆదేశాలు జారీ చేసింది.. విక్రయించే మద్యం నాణ్యమైనదని ధ్రువీకరించినట్లు బోర్డులు పెట్టాలని నిబంధనలు పెట్టింది.. మద్యం సీసాపై సీల్, క్యాప్, హోలోగ్రామ్, ప్రామాణికత తనిఖీ చేయాలని నిబంధనల్లో పేర్కొంది.. ప్రతి దుకాణం, బార్‌లో డైలీ లిక్కర్ వెరిఫికేషన్ రిజిస్టర్ అమలు చేయాలని ఆదేశించింది.. ఎక్సైజ్ సిబ్బంది రోజూ మద్యం దుకాణాల్లో ర్యాండమ్‌గా తనిఖీ చేయాలని.. తనిఖీల వివరాలు దుకాణంలోని రిజిస్టర్‌లో నమోదు చేయాలని స్పష్టం చేసింది.. డిపో నుంచి మద్యం అందాక, కనీసం 5 శాతం సీసాలు స్కాన్ చేయాలని నిబంధన పెట్టింది.. తనిఖీల్లో నకిలీ మద్యం గుర్తిస్తే, ఎక్సైజ్ సిబ్బందికి ఫిర్యాదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది..
జీఎస్టీ క్యాంపెయినింగ్‌పై ఫోకస్ పెట్టండి.. సీఎం ఆదేశాలు..
జీఎస్టీ క్యాంపెయినింగ్‌పై మంత్రులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు సీఎం నారా చంద్రబాబు నాయుడు.. ప్రభుత్వ శాఖలు అందించే పౌర సేవలు, ఆర్టీజీఎస్ సమీక్ష నిర్వహించారు సీఎం.. ఆర్టీజీఎస్ కేంద్రంలో వివిధ శాఖలు అందించిన సేవలు ప్రజా సంతృప్త స్థాయిపై సమీక్షించారు.. ఈ సమీక్షకు సమాచార శాఖ మంత్రి కె.పార్ధసారధి, ఐటీ, ఆర్టీజీఎస్, ఎక్సైజ్ శాఖల అధికారులు హాజరయ్యారు.. జీఎస్టీ 2.0 సంస్కరణల కారణంగా ప్రజలకు కలిగిన ప్రయోజనాలు, లబ్ది తదితర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు సీఎం చంద్రబాబు.. నిత్యావసరాలు, ఇతర ఉత్పత్తులపై పన్నులు తగ్గిన అంశంపై గిరిజన ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని సూచించారు.. దీపావళి పండుగ తర్వాత కూడా ప్రజల్లోకి పన్ను తగ్గింపు అంశాన్ని మరింతగా తీసుకెళ్లాలని ఆదేశించారు.. ఇక, దీపావళి తర్వాత సీఎం చంద్రబాబు ప్రత్యేక టాస్క్ ఇస్తున్నారు.. జీఎస్టీ అంశాన్ని జనంలోకి తీసుకు వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు.. ముఖ్యంగా జీఎస్టీ క్యాంపెయినింగ్‌పై మంత్రులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.. నిత్యావసర వస్తువులపై పన్నులు తగ్గింపు అంశాన్ని గిరిజన ప్రాంతాల్లోకి ప్రత్యేకంగా తీసుకువెళ్లాలన్నారు సీఎం చంద్రబాబు.. కాగా, జీఎస్టీ శ్లాబ్‌లను కేంద్ర ప్రభుత్వం కుదించిన విషయం విదితమే.. దీని ద్వారా సామాన్యులకు లబ్ధి చేకూరుతుందిని ప్రభుత్వం ప్రచారం చేస్తోంది.. మరోవైపు, జీఎస్టీ తగ్గినా.. అది వినియోగదారులకు బదిలీ కావడం లేదనే ఫిర్యాదులు కూడా లేకపోలేదు..
నకిలీ మద్యం కేసులో అడ్డంగా దొరికిపోయారు.. చంద్రబాబుకు భయం పట్టుకుంది..!
నకిలీ మద్యం కేసులో అడ్డంగా దొరికిపోయామనే భయం చంద్రబాబుకు ఉంది.. కల్తీ మద్యం కోసం యాప్ పెట్టారంటేనే అర్థం చేసుకోవాలి అన్నారు.. రాష్ట్రమంతటా నకిలీ మద్యం ఉంది, ఎక్కడో ఒకచోట అయితే యాప్ పెట్టాల్సిన అవసరం ఏముంది? అని ప్రశ్నించారు. అంతే కాదు బెల్ట్ షాపులు ఉన్నాయని ఒప్పుకున్నారని.. నకిలీ మద్యం బయటపడగానే ఒకరు ఆఫ్రికా నుంచి దిగుతారు.. అతడికి రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతారు.. జోగి రమేష్ మమ్మల్ని నడిపారని చెప్పిరని మండిపడ్డారు సజ్జల రామకృష్ణారెడ్డి..
కారు ఇకపై రీపేర్లకు పనికి రాదు..
“కారు” రిపేర్లకు పనికి రాదని.. ఇకపై కారు షెడ్ కే పరిమితని.. దానిని ఎవరూ రెండవసారి కొనరని పేర్కొంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. BRS కారును రిపేర్ చేయలేకపోవడాన్ని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు . “కార్ బృందం వారి పని చూసుకుంటే మంచిది. వారి వాహనం ఇప్పటికే షెడ్‌లో పడిపోయింది, దానిని రిపేర్ కూడా చేయలేకపోయింది. “ఎవరూ దానిని సెకండ్ హ్యాండ్ గా కూడా కొనడానికి సిద్ధంగా లేరు” అని ఆయన అన్నారు, “ బిజెపి పూజకు తగని పువ్వు” అని కెటిఆర్ చేసిన వ్యాఖ్యలకు బండి సంజయ్ ఎదురుదాడి చేశారు. అలాంటి మాటలు మాట్లాడే వారి మనసులు పనిచేయడం లేదని స్పష్టంగా తెలుస్తుందని ఆయన సోషల్ మీడియా ‘ఎక్స్’లో అన్నారు. బీజేపీ పార్టీ చిహ్నమైన కమలం గురించి కెటిఆర్ అవమానకరమైన వ్యాఖ్య చేశారు. దీనికి ప్రతిస్పందనగా, సంజయ్ X (గతంలో ట్విట్టర్)లో KTR కమలం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలని పోస్ట్ చేశాడు. సమాంతరంగా: సంజయ్ BRS పార్టీని ఎగతాళి చేస్తూ, వారి “కారు” మరమ్మత్తు చేయలేని షెడ్‌లో ఉందని, ఎవరూ దానిని కొనడానికి ఇష్టపడటం లేదని, సెకండ్ హ్యాండ్ కూడా అని అన్నారు.
జూబ్లీహిల్స్ ఓట్ల చోరీపై కేటీఆర్ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయి
రాష్ట్రంలో దొంగఓట్లు తెచ్చిందే బీఆర్ఎస్ అని అర్వింద్ ఆరోపించారు బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల టైంలో సింపథి రాజకీయాలపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ క్లబ్స్, పబ్స్ కు డ్రగ్స్ సరఫరా ఎవరి కనుసన్నుల్లో నడిచింది? ఆ లోకల్ నాయకుడు ఎవరు అని ప్రశ్నించారు. దీనికి కేటీఆర్ సమాధానం చెప్పాలన్నారు. సింపతి చూపాల్సింది ఎవరికి డ్రగ్స్ సరఫరా చేసిన వాళ్లకా? లేక డ్రగ్స్ బాధితులకా అని అర్వింద్ ప్రశ్నిచారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్ జిల్లాలో మీడియాతో మాట్లాడిన అర్వింద్ కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. జూబ్లీహిల్స్ ఓట్ల చోరీపై కేటీఆర్ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని విమర్శించారు. జూబ్లీహిల్స్ క్లబ్స్, పబ్స్ కు డ్రగ్స్ సరఫరా ఎవరి కనుసన్నుల్లో నడిచాయని ఆయన ప్రశ్నించారు. డ్రగ్స్ కేసుల్లో దొరికిన సెలబ్రెటీలను కేటీఆర్ విడిపించలేదా అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. ఎన్నికల ముందు డీఎంకే “భాషా” సెంటిమెంట్
తమిళనాడు ప్రభుత్వం సంచలన బిల్లు ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. తమిళనాడు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో, ప్రజల్లో తమిళ సెంటిమెంట్ పెంచే ఉద్దేశంతో ఎంకే స్టాలిన్ సర్కార్ కొత్త బిల్లును తీసుకువచ్చేలా కనిపిస్తోంది. రాష్ట్రంలో హిందీని రుద్దడాన్ని నిషేధించే లక్ష్యంతో తమిళనాడు ప్రభుత్వం ఈ రోజు అసెంబ్లీలో ఒక బిల్లు పెట్టనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రతిపాదిత చట్టంపై చర్చించడానికి నిన్న రాత్రి న్యాయ నిపుణులతో అత్యవసర సమావేశం జరిగినట్లు సమాచారం. ఈ బిల్లు తమిళనాడు అంతటా హిందీ హోర్డింగులు, బోర్డులు, సినిమాలు, పాటలను నిషేధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇది రాజ్యాంగానికి లోబడి ఉంటుందని డీఎంకే వర్గాలు చెబతున్నాయి. డీఎంకే సీనియర్ నేత టీకెఎస్ ఎలంగోవలన్ ఈ బిల్లుపై వ్యాఖ్యానిస్తూ..“మేము రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఏమీ చేయము. మేము దానికి కట్టుబడి ఉంటాము. హిందీని విధించడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము” అని అన్నారు. అయితే, బీజేపీ నేత వినోజ్ సెల్వం ఈ చర్యను మూర్ఖత్వంతో కూడుకున్నదిగా అభివర్ణించారు. భాషను రాజకీయ సాధనంగా ఉపయోగిస్తోందని డీఎంకేపై మండిపడ్డారు.
టెట్‌పై సుప్రీంకోర్టులో పిల్.. సీజే బెంచ్‌కు రిఫర్ చేసిన ద్విసభ్య ధర్మాసనం
దేశవ్యాప్తంగా 6–14 సంవత్సరాల పిల్లలకు విద్యనందిస్తున్న అన్ని పాఠశాలల్లో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) తప్పనిసరి చేయాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి (CJI) పరిధికి రిఫర్ చేసింది. దేశంలోని అన్ని విద్యాసంస్థల్లో టెట్ పూర్తి చేసిన వాళ్లే ఉపాధ్యాయులుగా ఉండాలని, ఏ విద్యా సంస్థకు మినహాయింపు ఇవ్వొద్దని సుప్రీం కోర్టులో పిల్ దాఖలైంది. ఢిల్లీ యూనివర్సిటీలో చదువుతున్న లా స్టూడెంట్ నితిన్ ఉపాధ్యాయ్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. మైనారిటీ నిర్వహణలో ఉన్న విద్యాసంస్థలను రైట్ టు ఎడ్యుకేషన్ (RTE) చట్టం పరిధి నుండి మినహాయించడం ఆర్టికల్ 14, 15, 16, 21, 21A ప్రకారం ఉన్న సమానత్వం, విద్య హక్కుల ఉల్లంఘన అని పిటిషన్ లో పేర్కొన్నారు. RTE చట్టంలోని సెక్షన్ 1(4), 1(5)లను యాదృచ్ఛికమైనవి, వివక్షతాత్మకమైనవి, రాజ్యాంగ విరుద్ధమైనవిగా పేర్కొంటూ వాటిని రద్దు చేయాలని కోరారు పిటిషనర్. ఆర్టికల్ 21A ప్రకారం అందరికీ సమాన నాణ్యమైన విద్య హక్కు ఉంది. కాబట్టి కొన్ని పాఠశాలలను TET నుంచి మినహాయించడం రాజ్యాంగ లక్ష్యాలకు విరుద్ధం, అని పిటిషన్‌లో పేర్కొన్నారు.
భార్య భర్తను తన చుట్టూ తిప్పించుకోకూడదు..
వైవాహిక వివాద కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘భార్య,భర్తను తన చుట్టూ తిప్పించుకోకూడదు’’ అని వ్యాఖ్యానించింది. భార్యాభర్తలు ఇద్దరు తన పిల్లల కోసం ఈగోలను పక్కన పెట్టాలని కోరింది. న్యాయమూర్తులు బీవీ నాగరత్న, ఆర్ మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం పిల్లల సంక్షేమానికి తల్లిదండ్రులు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పింది. మధ్యవర్తిత్వం ద్వారా విభేదాలను పరిష్కరించుకోవాలని సూచించింది. ఈ కేసులో భార్యాభర్తలు ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు. భర్త ఢిల్లీలో రైల్వేలో పనిచేస్తుండగా, భార్య పాట్నాలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం చేస్తోంది. ఆమె తన తల్లిదండ్రులతో నివసిస్తోంది. అయితే, భర్త తన అత్తమామలతో ఉండటం లేదని భార్య కుటుంబం భర్తపై కేసు పెట్టింది. భర్త తాను అత్తమామల ఇంట్లో ఉండలేనని చెప్పడంతో భార్య కేసునమోదు చేసింది. భర్తను మానసికంగా కించపరిచిన తర్వాత ఇద్దరు ఎలా కలిసి ఉండగలరు అని కోర్టు ప్రశ్నించింది.
దీపావళి బిగ్ ఆఫర్.. ఒకే ధరకు ఐఫోన్ 15, ఐఫోన్ 13!
యాపిల్ ‘ఐఫోన్’కు అంత డబ్బు పెట్టడం ఎందుకని చాలామంది ఆలోచించడం సర్వసాధారణం. అందుకే సామాన్య జనాలు పాత మోడళ్ల వైపు మొగ్గు చూపుతారు. తక్కువ ధరకు వాటిని కొనుగోలు ఎదురుచూస్తుంటారు. అందులోనూ పాత, కొత్త మోడళ్లు దాదాపు ఒకే ధరకు అందుబాటులో ఉంటే?.. వెంటనే కొనేస్తారు. ప్రస్తుతం అలాంటి ఆఫర్ ఒకటి అమెజాన్‌లో ఉంది. యాపిల్ ఐఫోన్ 13, ఐఫోన్ 15 ధరలు అమెజాన్‌లో దాదాపు ఒకేలా ఉన్నాయి. ఇది కొంచెం ఆశ్చర్యకరమైనదే కానీ.. వినియోగదారులకు మాత్రం మంచి ఆఫర్ అని చెప్పొచ్చు. ఐఫోన్ 15 కొత్తది, మంచి మోడల్ అయినప్పటికీ.. ఐఫోన్ 13 ధరతో పోల్చితే పెద్దగా తేడా లేదు. అమెజాన్‌లో ప్రస్తుతం దీపావళి 2025 సేల్ నడుస్తోంది. ఐఫోన్ 13 కంటే కొంచెం ఎక్కువ డబ్బు పెడితే.. కొనుగోలుదారులు ఐఫోన్ 15ని పొందవచ్చు. ఐఫోన్ 13 వచ్చి ఇప్పటికే నాలుగు సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో ఈ ఆఫర్‌లో ఐఫోన్ 15ని కొనుగోలు చేయడం మంచి ఎంపిక. అమెజాన్‌లో ఐఫోన్ 13 ఫోన్ 128 జీబీ వేరియంట్ ధర రూ.43,900గా ఉంది. ఐఫోన్ 15 128 జీబీ వేరియంట్ ధర రూ.47,999కు అందుబాటులో ఉంది. అంటే రెండింటి మధ్య ధర వ్యత్యాసం రూ.4,099 మాత్రమే. అందుకే ఐఫోన్ 15ని కొనుగోలు చేయడం బెస్ట్.
లగ్జరీ కారు కొన్న హీరోయిన్.. ఎన్ని కోట్లంటే..?
హీరోయిన్లు లగ్జరీ కార్లు కొనడం షరా మామూలే కదా. పైగా వాళ్ల బర్త్ డేలకు ఇలాంటి గిఫ్ట్ లు సెల్ఫ్ గా ఇచ్చేసుకుంటున్నారు. ఇప్పుడు మలయాళ బ్యూటీ అహానా కృష్ణ తన పుట్టినరోజు సందర్భంగా తనకు తానే ఓ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చుకుంది. ఆమె ఎంతోకాలంగా కోరుకున్న లగ్జరీ కారైన BMW X5ని ఇంటికి తెచ్చేసుకుంది. ఈ విషయాన్ని అహానా సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంది. “20’s నుంచి 30’sలోకి అడుగుపెడుతున్నందుకు కొంచెం బాధగానే ఉంది. కానీ ఈ కొత్త ఏజ్ కు వెల్కమ్ చెబుతున్నా. లైఫ్ లో ఏం చేయాలి అనే విషయంలో మొన్నటి వరకు నాకు ఒక క్లారిటీ లేదు. సినిమాలు చేస్తూ ఉండగానే ఈ టైమ్ గడిచిపోయింది అంటూ ఆమె భావోద్వేగంగా రాసుకొచ్చింది. నా లైఫ్ లో నా కుటుంబానికి థాంక్స్. “ఇప్పటి వరకు నేను ఏం చేయాలో, ఏం చేయకూడదో అని ఎప్పుడూ కండీషన్లు పెట్టకుండా నాకు స్వేచ్ఛ ఇచ్చారు. నేను కచ్చితంగా ఇది కావాలి అని కోరుకోకుండానే అది వాళ్లు నాకు ఇచ్చారు. ఇక బర్త్ డేకు కార్ కొనాలి అనుకున్నప్పుడు ఏం కొనాలో నాకు అర్థం కాలేదు. అప్పుడే దుల్కర్ సల్మాన్ సలహా తీసుకున్నా. ఏ మోడల్ బాగుంటుందో, ఏది సరిపోతుందో అన్న విషయాల్లో అతనే సలహాలు ఇచ్చాడు. తెలిపింది ఈ బ్యూటీ. ఇక ఆమె కొన్న కారు ధర సుమారు రూ.95 లక్షల నుంచి రూ.1 కోటి వరకు ఉంటుందని సమాచారం. ఆమె చిన్నప్పటి నుంచే సీరియల్స్ లో నటిస్తూ బాగా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు పడి, ఆడి, నాన్సీ రాణి సినిమాల్లో హీరోయిన్‌గా చేసింది. రీసెంట్ గా వచ్చిన కొత్త లోక: చాప్టర్ 1 లో గెస్ట్ రోల్ చేసింది.
పెళ్లి వద్దు.. శృంగారమే ముద్దు.. ఫ్లోరా బోల్డ్ కామెంట్స్
ఫ్లోరా సైనీ బిగ్ బాస్ తో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఆమె హౌస్ లో ఉన్నంత కాలం డీసెంట్ గా ఉండి ఐదో వారం బయటకు వచ్చేసింది. వాస్తవానికి బిగ్ బాస్ కు వెళ్లిన వారు అంత త్వరగా బయటకు రావడానికి ఇష్టపడరు. కచ్చితంగా టైటిల్ కొట్టాలి అనుకుంటారు. మధ్యలో వస్తే తెగ బాధపడిపోతుంటారు. కానీ ఫ్లోరా మాత్రం అలా కాకుండా బయటకు వస్తే తెగ సంతోషపడింది. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఓ ఇంటర్వ్యూలో ఆమె షాకింగ్ కామెంట్లు చేసింది. ఆమె మాట్లాడుతూ.. నాకు ఎవరితోనూ పెద్దగా కలవడానికి ఇష్టం ఉండదు. నా పనేదో నేను చేసుకుంటాను. ఎవరితోనూ కలవడం, తర్వాత విడిపోవడం అంటే నాకు నచ్చదు అంటూ తెలిపింది. ఇక పెళ్లి గురించి మాట్లాడుతూ.. నేను పెళ్లి చేసుకోవద్దని డిసైడ్ అయ్యాను. నా ఫ్రెండ్స్ ను చాలా మందిని చూస్తున్నాను. వారంతా పెళ్లైన రెండు, మూడేళ్లకే విడాకులు తీసుకుంటున్నారు. అందుకే నాకు పెళ్లిపై ఇంట్రెస్ట్ లేదు. ప్రస్తుతం నాకు ఓ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. అతనితోనే డీప్ డేటింగ్ లో ఉన్నాను. మేమిద్దరం లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నాం. నా దృష్టిలో పెళ్లి అనేది అనవసర రిలేషన్ అనిపిస్తుంది. పెళ్లికి ముందే డేటింగ్ లో అన్నీ ఉన్నాయి. పెళ్లి చేసుకుని విడిపోవడం కన్నా డేటింగ్ చేస్తూ లైఫ్ ను ఎంజాయ్ చేయడమే బెటర్ అనిపిస్తోంది. అందుకే నాకు పెళ్లి వద్దు అని ముందే డిసైడ్ అయిపోయా’ అని తెలిపింది ఈ బ్యూటీ. ఆమె చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.