కేంద్ర నిఘా వ్యవస్థ పూర్తిగా విఫలం..! ఆ ఉగ్రవాదులను అప్పగించాకే పాక్‌తో చర్చలు జరపాలి..!
పహల్గామ్ ఉగ్రదాడి ఘటనలో కేంద్ర నిఘా వ్యవస్థ పూర్తిగా విఫలమైందని ఆరోపించారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. జమ్మూ కాశ్మీర్‌లో పానీపూరి బండి నడుపుకునే వ్యక్తికి తెలిసిన సమాచారం కూడా కేంద్ర నిఘావర్గాలకు తెలియడం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఇక, పహల్గామ్‌లో దాడి చేసిన ఉగ్రవాదులను వెంటనే పాకిస్తాన్ అప్పగించాలని డిమాండ్ చేశారు.. ఆ ముగ్గురు ఉగ్రవాదులను అప్పగించిన తర్వాతనే పాక్‌తో భారత్ చర్చలకు వెళ్లాలని సూచించారు.. ఉగ్రవాదులను అంతం చేసేంత వరకు నిద్రపోకూడదన్నారు.. దేశంలోని అన్ని వ్యవస్థలను నాశనం చేస్తున్న బీజేపీ నేతలే దేశం విడిచి వెళ్లిపోవాలని మండిపడ్డారు నారాయణ.. నక్సలైట్లను చంపేస్తానని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పడం సరైన పద్ధతి కాదన్న ఆయన.. అరాచకాలను సృష్టించే ఉగ్రవాదులతో కేంద్రం మాట్లాడేటప్పుడు.. నక్సలైట్లతో ఎందుకు మాట్లాడకూడదు? అని నిలదీశారు..
కడప మేయర్‌కు షాక్.. అనర్హత వేటు వేసిన ప్రభుత్వం..
కడప మేయర్ సురేష్ బాబుపై అనర్హత వేటు వేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. మున్సిపల్ చట్టాన్ని ఉల్లంఘించిన అంశంలో సురేష్ బాబుపై అనర్హత వేటు వేసినట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది.. అయితే, తన కుటుంబ సభ్యులకు కాంట్రాక్టు పనులు అప్పగించిన అంశంలో మేయర్ సురేష్ బాబుపై ఫిర్యాదులు వచ్చాయి.. ఈ వ్యవహారంలో మంగళవారం రోజు మేయర్ సురేష్‌బాబును విచారించారు మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ… ఇక, తనపై వచ్చిన ఆరోపణలపై వివరణ కోసం రెండు వారాల గడువు కోరారు సురేష్ బాబు.. కానీ, మేయర్ వివరణపై సంతృప్తి చెందని ప్రభుత్వం.. అతడిపై అనర్హత వేటు వేస్తూ నిర్ణయం తీసుకుంది..
కేతిరెడ్డిపై జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
మరోసారి అనంతపురం జిల్లా తాడిపత్రిలో పొలిటికల్ హీట్ పెరిగింది.. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డిపై మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మా భూమిలో అడుగుపెడితే ఊరంతా తిప్పుతూ చెప్పుతో కొట్టానంటూ గతంలో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు జేసీ ప్రభాకర్‌రెడ్డి.. అయితే, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గతంలో అధికారం అడ్డం పెట్టుకుని ప్రభుత్వ భూములు కబ్జా చేశారని, సోలార్ ప్లాంట్ కి రైతులు ఇచ్చిన భూములను బలవంతంగా లాక్కున్నా చరిత్ర ఉందని ఆరోపించారు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి.. గతంలో పెద్దారెడ్డి భూమిలో అడుగు పెడితే నన్ను ఊరంతా తిప్పుతూ చెప్పుతో కొడతా అన్నాడని, ఇప్పుడు నీ భూమిలో నా వాళ్లు అడుగు పెట్టి నీ భూమి ఫెన్సింగ్ పీకారు, నీ చేతనైతే వచ్చి నన్ను చెప్పుతో కొట్టమని సవాలు విసిరారు. దేవుని సొమ్ము తిన్నావని, ఆలయాల భూములను అక్రమించుకున్నావని కేతిరెడ్డి పెద్దారెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు జేసీ.. ఈ రోజుతో నువ్వు తాడిపత్రి వదిలి సంవత్సరం అయిందని ప్రజలు పండగ చేసుకున్నారని పేర్కొన్నారు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి.
భారీ అప్పుల్లోనూ సంక్షేమానికి తడబాటులేదు
రాష్ట్రంలో ఆశించిన స్థాయిలో ఆదాయం లేని పరిస్థితుల్లోనూ, అప్పులపై వడ్డీలు కట్టడం వంటి ఆర్థిక బాధ్యతలు వహిస్తూ సంక్షేమ పథకాలను నిలకడగా అమలు చేస్తున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. మధిర నియోజకవర్గం ఎర్రుపాలెంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నిరుపేదలకు ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చినా అమలు చేయలేదని విమర్శించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నుంచే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేస్తున్నామని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ధనిక రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసిందని ఆరోపించారు. రూ.7 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని ఖాళీగా వదిలిందని విమర్శించారు. అయినప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోందన్నారు. 90 లక్షల కుటుంబాలకు సన్న బియ్యం అందజేస్తున్నట్లు వెల్లడించారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా రూ.9,000 కోట్లతో రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించామని చెప్పారు. జూన్ 2న లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందజేస్తామని తెలిపారు. ఈ పథకానికి సంబంధించిన సిబిల్ స్కోర్పై సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాలను నమ్మొద్దని యువతకు విజ్ఞప్తి చేశారు. ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ.22,500 కోట్లు ఖర్చు చేస్తామని, నిజమైన లబ్ధిదారులకు న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. ఇళ్లు లేని వారు ఆందోళన చెందవలసిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.
శాంతి చర్చలకు మేం ఎప్పుడూ సిద్ధమే.. ప్రధాని రెడీయా లేదో స్పష్టం చేయాలి.. మావోయిస్టుల లేఖ..
ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా ముందుకు సాగుతోంది కేంద్ర ప్రభుత్వం.. అయితే, భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో.. ఆపరేషన్ కగార్‌ను తాత్కాలికంగా వాయిదా వేసింది ప్రభుత్వం.. ఇక, తాము శాంతి చర్చలకు సిద్ధమని మావోయిస్టులు ఎప్పుటి నుంచో చెబుతూ ఉన్నారు.. మరోవైపు.. శాంతి చర్చలు జరపడానికి ప్రభుత్వాన్ని ఒప్పించడానికి ఆంటూ పౌర హక్కుల సంఘాలు కూడా ప్రయత్నాలు చేస్తున్నాయి.. ఈ నేపథ్యంలో.. చర్చల ద్వారా శాంతి నెలకొల్పాలని కోరుతూ మరో లేఖ విడుదల చేసింది మావోయిస్టు పార్టీ.. భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) కేంద్ర కమిటీ ప్రతినిధి అభయ్ పేరుతో ఈ లేఖ విడుదల చేశారు.. శాంతియుత సంభాషణల ద్వారా ప్రజా సమస్యలను పరిష్కరించడానికి మా పార్టీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని లేఖలో పేర్కొన్నారు భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) కేంద్ర కమిటీ ప్రతినిధి అభయ్.. గౌరవనీయులైన ప్రధాని నరేంద్ర మోడీ నేపథ్యంలోని కేంద్ర ప్రభుత్వం దీనికి అనుకూలంగా ఉందో లేదో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.. ప్రజా సమస్యలను పరిష్కరించడానికి మరియు ఆపరేషన్ కగార్‌ను ఆపడానికి ముందుకు రండి అంటూ పిలుపునిచ్చారు.. ఇక, శాంతి చర్చలు జరపడానికి.. ప్రభుత్వాన్ని ఒప్పించడానికి ముందుకు రండి.. అంటూ పౌర హక్కుల ప్రజాస్వామ్యవాదులకు తన లేఖ ద్వారా పిలుపునిచ్చారు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రతినిధి అభయ్..
మధ్యప్రదేశ్ మంత్రికి హైకోర్టు భారీ షాక్.. అనుచిత వ్యాఖ్యలపై ఎఫ్ఐఆర్ నమోదుకు ఆదేశం
ఆర్మీ కల్నల్ సోఫియా ఖురేషిపై నోరు జారిన మధ్యప్రదేశ్ గిరిజన సంక్షేమ మంత్రి కున్వర్ విజయ్ షాపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అనుచిత వ్యాఖ్యలపై కేసు నమోదు చేయాలని పోలీసులకు న్యాయస్థానం ఆదేశించింది. ఇటీవల పాకిస్థాన్‌పై భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. దీనికి కల్నల్ సోఫియా ఖురేషి నాయకత్వం వహించారు. ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించిన విషయాలు ఎప్పటికప్పుడు మీడియాకు తెలియజేస్తూ చాలా పాపులర్ అయింది. ఒక్కసారిగా ఆమె పేరు మార్మోగింది. అయితే ఆమెపై మధ్యప్రదేశ్ మంత్రి కున్వర్ విజయ్ షా నోరు పారేస్తున్నారు. పాకిస్థాన్ ఉగ్రవాదులు మన సోదరీమణుల సిందూరం తుడిచేస్తే.. అదే ఉగ్రవాదుల మతానికి చెందిన కల్నల్ సోఫియా ఖురేషిని ప్రధాని మోడీ పాకిస్థాన్‌పైకి పంపించారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపాయి. కాంగ్రెస్ తీవ్రంగా తప్పుపట్టింది. భారత ముద్దు బిడ్డపై అనుచిత వ్యాఖ్యలు ఏ మాత్రం సహించరానివని.. వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేయాలని హస్తం నేతలు డిమాండ్ చేశారు. అంతేకాకుండా జాతీయ మహిళా కమిషన్ కూడా మంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టింది. తాజాగా మంత్రి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మధ్యప్రదేశ్ హైకోర్టు సీరియస్ అయింది. వెంటనే మంత్రి కేసు నమోదు చేయాలని రాష్ట్ర పోలీస్ చీఫ్‌కు ధర్మాసనం ఆదేశించింది.
కొత్త ‘చిప్’ యూనిట్ ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్
దేశంలో మరో కొత్త సెమీకండక్టర్ల యూనిట్ ఏర్పాటు చేసేందుకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. బుధవారం ప్రధాని మోడీ అధ్యక్షతన కేబినెట్ సమావేశం అయింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేబినెట్ నిర్ణయాలను కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌లోని జెవార్ విమానాశ్రయం సమీపంలో రూ.3,706 కోట్లతో ఆరో చిప్ యూనిట్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. యమునా ఎక్స్‌ప్రెస్‌వే ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ అథారిటీలో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. దీని ద్వారా 2 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. హెచ్‌సీఎల్, ఫాక్స్‌కాన్ సంయుక్త భాగస్వామ్యంతో ఈ యూనిట్ ఏర్పాటు చేయనున్నారు. మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఆటోమొబైల్‌లు, కంప్యూటర్‌లు మరియు ఇతర డిస్పేలు ఉన్న పరికరాలకు అవసరమైన “డిస్‌ప్లే డ్రైవర్ చిప్”లు తయారీకి ఈ యూనిట్ ఏర్పాటు చేయనున్నారు. ప్రతి నెల 20,000 “వెఫర్లు” ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉంటుంది. నెలవారీగా 36 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేయనున్నారు. ఇప్పటికే దేశంలో ఐదు సెమీకండక్టర్లు ఉన్నాయి. ఇది ఆరో యూనిట్.
టర్కీకి మరో షాక్.. వీటి దిగుమతి కూడా నిలిపివేత
భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్థాన్‌కు మద్దతుగా నిలుస్తున్న టర్కీకి భారత వ్యాపార వర్గాలు గట్టి ప్రతిస్పందన ఇస్తున్నాయి. ఇప్పటికే పుణేలోని వ్యాపారులు టర్కీ యాపిల్ దిగుమతులను నిలిపివేసిన వేళ… రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ మార్బుల్ వ్యాపారులు మరో ఘాటైన నిర్ణయం తీసుకున్నారు. టర్కీ నుంచి మార్బుల్ దిగుమతులను పూర్తిగా ఆపాలని నిర్ణయించి, దేశీయ పరిశ్రమకు మద్దతుగా నిలిచారు. ఆసియాలోనే అతిపెద్ద మార్బుల్ ఎగుమతి కేంద్రంగా పేరొందిన ఉదయ్‌పూర్‌లో “మార్బుల్ ప్రాసెసర్స్ కమిటీ” ఈ నిర్ణయాన్ని తీసుకుంది. కమిటీ అధ్యక్షుడు కపిల్ సురానా మాట్లాడుతూ, “టర్కీ పాక్‌కు మద్దతు ఇవ్వడాన్ని నిరసిస్తూ, టర్కీతో వాణిజ్య సంబంధాలను తెంచుకోవాలని కమిటీ ఏకగ్రీవంగా తీర్మానించింది,” అని తెలిపారు. ప్రస్తుతం దేశానికి దిగుమతయ్యే మార్బుల్‌లో 70 శాతం టర్కీ నుంచే వస్తోందని ఆయన గుర్తు చేశారు. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా మార్బుల్ వ్యాపారులకు మార్గదర్శకంగా నిలవాలని, టర్కీపై వాణిజ్యంగా ఒత్తిడి తెచ్చేలా అన్ని రాష్ట్రాల్లోని మార్బుల్ సంఘాలు ఇదే బాటలో నడవాలని ఆయన పిలుపునిచ్చారు. “ఇది కేవలం వ్యాపార నిర్ణయం కాదు… దేశ భద్రత పట్ల, ప్రభుత్వం పట్ల మేము కట్టుబాటుగా ఉన్నామన్న సంకేతం,” అని సురానా స్పష్టం చేశారు.
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకు బీసీసీఐ గుడ్‌న్యూస్..
తాజాగా, టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించినా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకు గుడ్‌న్యూస్ చెప్పింది బీసీసీఐ.. అసలు టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయిన ఈ స్టార్ ఆటగాళ్లు గ్రేడ్ A+ కాంట్రాక్ట్‌ను కోల్పోతారా? అనే సందేహాలు వ్యక్తమవుతోన్న వేళ.. దీనిపై క్లారిటీ వచ్చేసింది.. భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (BCCI) కార్యదర్శి దేవజిత్ సైకియా మాట్లాడుతూ.. T20 మరియు టెస్ట్‌ల నుండి రిటైర్ అయినప్పటికీ స్టార్ ఇండియా బ్యాటర్లు అయిన విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మ గ్రేడ్ A+ కేటగిరీలోనే ఉంటారని స్పష్టం చేశారు.. ఏప్రిల్ ప్రారంభంలో, బీసీసీఐ వార్షిక ప్లేయర్ రిటైనర్‌షిప్ 2024-25ను ప్రకటించిన విషయం విదితమే కాగా.. అందులో కోహ్లీ, రోహిత్, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజాతో పాటు గ్రేడ్ A+ కేటగిరీలో ఉంచారు. అయితే, టీ20, టెస్ట్‌ల నుండి రిటైర్మెంట్ తీసుకున్నప్పటికీ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల గ్రేడ్ A+ కాంట్రాక్ట్ కొనసాగుతుంది. వారు ఇప్పటికీ భారత క్రికెట్ జట్టులో భాగమే, వారు గ్రేడ్ A+ యొక్క అన్ని సౌకర్యాలను పొందుతారు అని దేవజిత్ సైకియా పేర్కొన్నారు.
ఆర్సీబీ ‘మంత్రం’.. టైటిల్ కోసమేనా..
టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మతో కలిసి బృందావనంలోని ప్రేమానంద్ మహారాజ్‌ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. విరుష్క దంపతులను బృందావనం నిర్వాహకులు ఆహ్వానించి ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత కోహ్లీ, అనుష్క గురువు కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. ప్రేమానంద్ జీ ఆధ్యాత్మిక ప్రవచనాలను విన్నారు. నిజానికి కోహ్లీ కెరీర్ పరంగా సమస్యలు ఎదుర్కొంటున్న సమయాల్లో ఎక్కువగా ప్రేమానంద్ మహారాజ్‌ను కలుస్తారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఘోర వైఫల్యం తర్వాత విరాట్ కుటుంబ సమేతంగా వెళ్లారు. దాంతర్వాత జరిగిన ఛాంపియన్ ట్రోఫీలో అద్భుతంగా రాణించాడు. అంతకుముందు ఇంగ్లాండ్ వన్డే సిరీస్ లోనూ సత్తా చాటాడు. ప్రస్తుతం కోహ్లీ ఐపీఎల్ లో ఆడుతున్నాడు. ఈ సీజన్లో ఆర్సీబీ వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. ఇందులోను కోహ్లీదే కీలక పాత్ర. అయితే విరాట్ స్వామీజీని కలిసాక ఆర్సీబీ శిబరంలో సంతోషం వ్యక్తమవుతోంది. ప్రేమానంద్ మహారాజ్‌ను దర్శించుకున్న ప్రతిసారి కోహ్లీ విజయం సాధించాడు. ఇప్పుడు ఐపీఎల్ టైటిల్ పోరులో ఆర్సీబీ ముందంజలో ఉండటంతో ఐపీఎల్ టైటిల్ పక్కా అంటున్నారు ఫ్యాన్స్. ప్రేమానంద్ మహారాజ్ ఆశీస్సులతో ఈ సారి కోహ్లీ కప్ అందుకుంటాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి 17 ఏళ్లుగా అందని ద్రాక్షగా మిగిలిన ఐపీఎల్ ట్రోఫీని ఈ సారైనా ఆర్సీబీ దక్కించుకుంటుందో లేదో చూడాలి.
‘కన్నప్ప’తో ‘భైరవం’ పోటీ.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ !
ప్రజంట్ విడుదలకు సిద్ధంగా ఉన్న టాలీవుడ్ పాన్ ఇండియా సినిమాలో ‘కన్నప్ప’ ఒకటి. మంచు విష్ణు దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్‌తో భారీగా తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న ఈ సినిమాలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, మధుబాల, శరత్ కుమార్, కాజల్.. ఇలా చాలా మంది స్టార్స్ నటిస్తున్నారు. ఈ సినిమాని ఏప్రిల్ 25న రిలీజ్ చేయనున్నారు. అయితే .. ఇప్పుడు అన్న మంచు విష్ణు ‘కన్నప్పకి’ పోటీగా, మంచు మనోజ్ రాబోతున్నట్టు తెలుస్తుంది. మంచు మనోజ్, నితిన్, బెల్లంకొండ శ్రీనివాస్.. ముగ్గురు కలిసి భారీ మల్టీస్టారర్ గా ‘భైరవం’ సినిమాని తెరకెక్కిన విషయం తెలిసిందే. మే 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టారు. అయితే మనోజ్ ఓ ఈవెంట్ లో భాగంగా ‘భైరవం’ ఎప్పుడు రిలీజ్ అని అడగ్గా.. ‘ఏప్రిల్ లో వస్తున్నాం తమ్ముడు. చిన్న తెరల్లో కాదు ఈసారి వెండి తెరలో చూసుకుందాం అని డిసైడ్ అయ్యాను’ అని చెప్పాడు. దీంతో కన్నప్ప, భైరవం చిత్రాలు పోటీ పడుతున్నట్టు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఇక తాజాగా ‘భైరవం’ మూవీ డైరెక్టర్ విజయ్ కనకమేడల దీనిపై క్లారిటీ ఇచ్చారు. ‘ ఓటీటీ డీల్స్ కారణంగానే సినిమా రిలీజ్ లేట్ అయింది, అప్పుడు రెండు రిలీజ్ డేట్స్ క్లాష్ అవ్వడంతో మనోజ్ అలా అన్నారు. అదేమీ లేదు మా నిర్మాతల మాట ప్రకారమే మేం రిలీజ్ చేస్తాం’ అని తెలిపారు.
బాలకృష్ణ సినిమాలో నన్ను తీసేయమన్నాడు.. సీక్రెట్ చెప్పిన లయ..
సీనియర్ హీరోయిన్ లయ గురించి పరిచయం అక్కర్లేదు. అప్పట్లో ఫీల్ గుడ్ సినిమాలతో అలరించింది. దాదాపు 40 తెలుగు సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ.. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ రీ ఎంట్రీ ఇస్తోంది. నితిన్ నటించిన తమ్ముడు మూవీతో వస్తున్న లయ.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో బాలకృష్ణపై ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘బాలకృష్ణ గారితో నేను విజయేంద్ర వర్మ సినిమాలో నటించాను. ఆయన సెట్స్ లో ఎలా ఉంటారో నాకు అంతకు ముందు పెద్దగా తెలియదు. మొదటి రోజే మా ఇద్దరికీ ఓ సాంగ్ పెట్టారు. ఆ సాంగ్ షూటింగ్ లో పొరపాటున నేను ఆయన కాలు తొక్కేశాను. దాంతో ఆయన సీరియస్ గా ఎక్స్ ప్రెషన్ ఇచ్చారు. ‘నా కాలే తొక్కుతావా.. ఈమెను సినిమాలో నుంచి తీసేయండి’ అని పక్కకు వెళ్లి కూర్చున్నాడు. ఆయన మాటలతో నేను చాలా హర్ట్ అయ్యాను. వెంటనే బోరున ఏడ్చేశాను. నేను ఏడవడం చూసిన బాలకృష్ణ వెంటనే నా దగ్గరకు వచ్చాడు. అయ్యో ఏడుస్తున్నావా నేనేదో సరదాగా అన్నాను. ఇలా కాలు తొక్కించుకోవడం నాకు కొత్తేం కాదు… షూటింగ్ లో ఇవన్నీ కామన్’ అంటూ చెప్పాడు. ఆయన సెట్స్ లో అలాగే సరదాగా ఉంటాడు. ఆ తర్వాత ఆయన ఆయనతో నటించడం జాలీగా అనిపించేది. సినిమా మాకు ఎన్నో గొప్ప అనుభూతులు ఇచ్చింది అంష్ట్ర చెప్పుకొచ్చింది లయ. రీ ఎంట్రీతో ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.