నేను ఏ పార్టీలోకి వెళ్లలేదు.. నన్నే పిలిచి సీటిచ్చారు.. ఆర్.కృష్ణయ్య ఆసక్తికర వ్యాఖ్యలు..
ఆ మధ్యే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన బీసీ ఉద్యమ నేత ఆర్. కృష్ణయ్య.. మరోసారి పెద్దల సభలు అడుగుపెట్టబోతున్నారు.. దీని కోసం.. రాజ్యసభ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు ఆర్.కృష్ణయ్య.. అయితే, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ఏ పార్టీలో ఉన్నా.. తాను బీసీల సంక్షేమం కోసం పని చేస్తాను అని స్పష్టం చేశారు.. అయితే, ఈను ఏ పార్టీలోకి వెళ్లలేదు.. నన్నే పిలిచి సీటిచ్చారని పేర్కొన్నారు.. నేను ఏపార్టీలో ఉన్నా బీసీల కోసమే పని చేస్తా అంటున్నారాయన.. అయితే కేంద్రంలో ఉన్న అధినాయకత్వం బీసీలే.. ఇక్కడ నేను బీజేపీ బలోపేతానికి పని చేస్తా అంటున్నారు.. ఇక, బీజేపీయే నన్ను ఆహ్వానించి రాజ్యసభ సీటు ఇచ్చిందని తెలిపారు ఆర్.కృష్ణయ్య.. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరిలకు ఈ సందర్‌భంగా అభినందనలు తెలిపారు.. ఎప్పుడైనా పార్టీలే నా దగ్గరకి వచ్చాయి.. కానీ, నేను పార్టీ మారలేదన్నారు.. 2014లో తెలంగాణ సీఎం చేస్తా అంటూ చంద్రబాబు పిలిచారు.. ఆ తరువాత వైసీపీ పిలిచి రాజ్యసభ ఇచ్చింది.. కానీ, మాట్లాడాలని చూసినా అవకాశం రాలేదు నాకు వైసీపీలో అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.. బీసీలకు అవకాశల కోసం పోరాడాను.. అధికారం నాకు అవసరం లేదు.. రాజీనామా చేసిన తరువాతే నన్ను బీజేపీ పిలిచిందని స్పష్టం చేశారు.. బీసీలకు లాభం జరుగుతుందంటే ఎక్కడికైనా వెళ్తాను అన్నారు.. బీసీల కోసమే పోరాడతాను.. అవకాశం ఉన్నపుడు పార్టీ కోసం పని చేస్తాను అన్నారు ఆర్.కృష్ణయ్య.. కాగా, ఏపీలో మూడు రాజ్యసభ స్థానాలకు కూటమి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. బీజీపీ అభ్యర్థిగా ఆర్.కృష్ణయ్యతో పాటు.. టీడీపీ అభ్యర్థులు బీదా మస్తాన్ రావు, సానా సతీష్ కూడా నామినేషన్లు వేశారు..
రాజధాని నిర్మాణం ఇక చకచకా.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు ఇక చకచకా సాగనున్నాయి.. అమరావతిలో చేపట్టాల్సిన పనులకు ఆమోదం తెలియచేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.. సీఆర్డీఏ అథారిటీ అమోదించిన 20 సివిల్ పనులకు ఆమోదాన్ని తెలియచేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.. రాజధానిలో చేపట్టనున్న ఈ 20 సివిల్ పనులకు 11,467 కోట్ల రూపాయల మేర వ్యయం అవుతుందని అంచనా వేశారు.. ప్రపంచబ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు సంయుక్తంగా ఇవ్వనున్న రుణంతో ఈ పనులు చేపట్టేలా కార్యాచరణ సిద్ధం చేశారు.. గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారులు, ఉద్యోగుల నివాస అపార్టమెంట్లు, ఐఏఎస్ అధికారులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నివాసాల నిర్మాణం పూర్తికి నిధుల విడుదలకు ఆమోదం తెలిపింది ప్రభుత్వం.. న్యాయమూర్తులు, మంత్రులు, సీనియర్ ఐఎఎస్ అధికారుల బంగ్లాల నిర్మాణం కోసం కూడా నిధుల మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం విదితమే.. ప్రభుత్వ కాంప్లెక్స్ నిర్మాణంలో భాగంగా సచివాలయ టవర్లు, అసెంబ్లీ, రాజధాని పరిధిలో మౌలిక సదుపాయాల నిర్మాణం కోసం ఈ నిధుల్ని వెచ్చించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది.. అమరావతిలో కొండవీటి వాగు, పాలవాగు వెడల్పు చేయటంతో పాటు శాఖమూరు, నీరు కొండవద్ద రిజర్వాయర్ నిర్మాణం కోసం 1585 కోట్ల రూపాయాలు వెచ్చించనుంది సీఆర్డీఏ.. హ్యాపీనెస్ట్ ప్రాజెక్టులో భాగంగా 12 టవర్లుతో 1200 అపార్టమెంట్ల నిర్మాణం కోసం 984 కోట్ల రూపాయలు కేటాయించనున్నారు.. రాజధాని పరిధిలో వరద నీటి కాలువలు, డ్రెయిన్లు, నీటి సరఫరా నెట్వర్క్, సీవరేజి, యుటిలిటీ డక్టులు, పాదచారుల బాట, సైకిల్ ట్రాక్ లు ఏర్పాటు కోసం నిధులను వెచ్చించాలని నిర్ణయం తీసుకున్నారు.. మొత్తంగా 20 సివిల్ పనులకు గానూ 11,467 కోట్ల రూపాయల మేర వ్యయం చేసేందుకు ఆమోదం తెలిపింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం..
శ్రీశైలంలో స్పర్శదర్శనాలపై కీలక నిర్ణయం..
ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో మల్లన్న స్పర్శదర్శనంపై కీలక నిర్ణయం తీసుకుంది దేవస్థానం.. శ్రీశైలంలో ఇకపై భక్తుల రద్దీ రోజుల్లోనూ స్పర్శ దర్శనం కల్పించనున్నట్టు వెల్లడించారు నూతన ఈవో ఎం.శ్రీనివాసరావు.. అయితే, శని, ఆది, సోమవారాలు పర్వదినాలలో భక్తుల రద్దీ దృష్ట్యా స్పర్శదర్శనాలు, అభిషేకాలు నిలివేస్తూ గతంలో దేవస్థానం ప్రకటించిన విషయం విదితమే కాగా.. భక్తుల విజ్ఞప్తి మేరకు దేవస్థానం వైదిక కమిటీ, అధికారులతో చర్చించి స్పర్శ దర్శనానికి మాత్రమే అవకాశం కల్పించాలనే నిర్ణయానికి వచ్చినట్టు వెల్లడించారు ఈవో శ్రీనివాసరావు.. ఇక, రద్దీ రోజుల్లో 4 విడతలు అలంకార దర్శనం, 3 విడతలు స్పర్శ దర్శనానికి అవకాశం కల్పించారు ఈవో శ్రీనివాసరావు.. ఇకపై శని, ఆది, సోమ వారంతో పాటు.. సెలవు రోజుల్లో కూడా స్పర్శ దర్శనానికి అవకాశం ఇవ్వనున్నట్టు స్పష్టం చేశారు.. ఇక, స్పర్ష దర్శనం కోసం.. గతంలో వలె టికెట్లను ఆన్‌లైన్ ద్వారానే పొందేలా ఏర్పాట్లు చేయనున్నారు శ్రీశైలం దేశస్థానం అధికారులు..
బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. ఏపీలో భారీ వర్షాలు…
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రరూపం దాల్చింది.. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి.. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతోన్న తీవ్ర అల్పపీడనం.. రేపటికి తమిళనాడు – శ్రీలంక తీరాలకు చేరుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.. దీని ప్రభావం దక్షిణ కోస్తా, రాయలసీమపై రెండు రోజులు ఉంటుందని చెబుతున్నారు.. ఇక, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు వాతావరణశాఖ అధికారులు.. మరోవైపు.. ఎల్లుండి నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు, శ్రీ సత్యసాయి జిల్లాలకు వర్ష హెచ్చరికలు జారీ చేశారు.. ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది వాతావరణశాఖ.. ఇక, ఈ రోజు కడప, శ్రీ సత్యసాయి, అనంతపురం, నంద్యాల, కర్నూలు, నెల్లూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, అల్లూరి జిల్లాల్లో పలు చోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయని వెల్లడించారు వాతావరణశాఖ అధికారులు.. కాగా, ఏపీని వరుస తుఫాన్‌లు భయపెడుతూనే ఉన్నాయి.. తుఫాన్ ఏపీ తీరాన్ని తాకపోయినా.. సమీప రాష్ట్రాల్లో తుఫాన్ తీరం దాటడంతో.. ఆ ప్రభావంపై ప్రతీ సారి ఏపీపై భారీగానే ఉంటున్న విషయం విదితమే..
డిప్యూటీ సీఎం పవన్‌కు ఉండవల్లి బహిరంగ లేఖ.. ఆ బాధ్యత మీదే..!
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు బహిరంగ లేఖ రాశారు సీనియర్ రాజకీయ నేత, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్.. 2014లో విభజన కారణంగా ఏపీకి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే బాధ్యతను పవన్ కల్యాణ్ తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు ఉండవల్లి.. బీజేపీతో కలిసి అధికారంలో ఉండటంతో కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినవి రాబట్టుకోవడానికి పవన్ కల్యాణ్ శ్రద్ధ తీసుకోవాలని లేఖలో కోరారు.. సుప్రీంకోర్టులో చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న రాష్ట్ర విభజన అంశాన్ని కూడా ఒక కొలిక్కి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.. మొత్తంగా నాలుగు పేజీలతో కూడిన సుదీర్ఘ లేఖను పవన్ కల్యాణ్‌ను రాశారు ఉండవల్లి.. పార్లమెంట్‌లో రాజ్యసభ విభజన జరిగిన తీరును లేఖలో ప్రస్తావించిన ఆయనే.. ఈ విషయంపై నేను సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పదేళ్లుగా నడుస్తూనే ఉంది.. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం కనీసం కౌంటర్ కూడా దాఖలు చేయలేదన్నారు.. గతంలో ఇలాంటి విషయాలను చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లాను.. రాష్ట్రం తరఫున సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయాలని నిర్ణయించారు.. కానీ, కారణాలేమైనా అవి అమలు కాలేదని పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు.. అయితే, ఈ విషయంపై శ్రద్ధ తీసుకుని.. పార్లమెంట్ ఉభయ సభల్లోనూ విభజన జరిగిన తీరూ తర్వాత మనకు జరిగిన అన్యాయం విషయమై చర్చకు నోటీసులు ఇప్పించాలని.. సుప్రీంకోర్టులో చాలా కాలంగా పెండింగ్‌లో పడిపోయిన రాష్ట్ర విభజన అంశాన్ని త్వరితగతిన ఒక కొలిక్కి తీసుకురావాలని.. మీ శ్రేయోభిలాషి అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు లేఖ రాశారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్..
తెలంగాణ సంస్కృతితో సంబంధం లేకుండా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ తల్లిని నిర్మించింది
అంగరంగ వైభవంగా కాంగ్రెస్ నేతలు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు మరోసారి ప్రమాదం జరగబోతుందని, సినిమా పాటలతో ప్రజా విజయోత్సవ పాలన చేసుకున్నారని ఆయన అన్నారు. అయితే తాము సినిమా పాటలకు మేము వ్యతిరేకం కాదని, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు లేకుండా ప్రజా విజయోత్సవ పాలన చేసుకున్నారని ఆయన అన్నారు. ఆనాడు సినిమా పాటల మత్తులో పడి, తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ లో కలిపారని.. సినిమా పాటల మోజులో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ఆనాడే తుంగలో తొక్కారని కీలక వ్యాఖ్యలు చేసాడు. తెలంగాణ సంస్కృతితో సంబంధం లేకుండా కాంగ్రెస్ పార్టీ తల్లినీ నిర్మించారని, ప్రజా విజయోత్సవాల్లో ముఖ్యమంత్రి, మంత్రులు ఒక్కరు అంటే ఒక్కరు కూడా ‘జై తెలంగాణ’ అనలేదని ఆయన అన్నారు. తెలంగాణ మేధావుల్లారా.. తెలంగాణ ద్రోహుల పక్కన చేరకండి.. మా హయంలో కాళోజీ, బండి యాదగిరి, చాకలి అయిలమ్మ , కొమరంభిమ్ , బంధగి , జయశంకర్ ఒక్కొక్కరిని స్మరించుకున్నామని ఆయన గుర్తు చేసారు. కాంగ్రెస్ పార్టీ స్వరూపం తెలిసే విధంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ తల్లినీ సచివాలయంలో పెట్టారని, జరుగుతున్న కుట్రలను తెలంగాణ వాదులు గమనించాలని ఆయన పేర్కొన్నారు. సమైక్య వాదుల తోత్తులు ఈ రాష్ట్రాన్ని నడిపిస్తున్నారని, అలంటి వారితో తస్మాత్ జాగ్రత్త అని ఆయన అన్నారు. దేవతులను స్మరించుకోవడం కోసం ప్రభుత్వ ఉత్తర్వులు అవసరం లేదని, మూర్ఖపు జివోలు తెచ్చి ప్రజలను బయపెట్టిస్తున్నారంటూ.. అన్ని వర్గాల నుంచి ఏడాదిలోనే వ్యతిరేకతను మూటగట్టుకున్న వ్యక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన అన్నారు.
హిందూ సభలో ప్రసంగం.. న్యాయమూర్తిపై సుప్రీంకోర్టుకు ఫిర్యాదులు..
విశ్వ హిందూ పరిషత్(వీహెచ్‌పీ) కార్యక్రమంలో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్ చేసిన ‘‘మెజారిటీ’’ వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం అయ్యాయి. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రతిపక్షాలు, పలు సంఘాలు సుప్రీంకోర్టుకు లేఖలు రాస్తున్నాయి. భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా ఈ ఫిర్యాదులను స్వీకరించారు. ఈ ప్రసంగంపై సుప్రీంకోర్టు అలహాబాద్ హైకోర్టుని మంగళవారం వివరణ కోరింది. ప్రసంగానికి సంబంధించిన వివరాలనున అందించాలని ఆదేశించింది. జస్టిస్ శేఖర్ యాదవ్‌ని తొలగించాలని కోరుతూ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ నోటీసుపై సంతకం చేయడంతో లోక్‌సభలో కూడా చర్చనీయాంశంగా మారింది. న్యాయమూర్తి ప్రవర్తన రాజ్యాంగ నిబంధనల్ని ఉల్లంఘించిందని ఓవైసీ అన్నారు. “అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి శేఖర్ యాదవ్‌పై తొలగింపు చర్యలను కోరుతూ నేను నోటీసుపై సంతకం చేసాను. నోటీసులో 100 మంది లోక్‌సభ సభ్యుల సంతకం అవసరం అని, అప్పుడే లోక్‌సభ స్పీకర్ పరిగణనలోకి తీసుకుంటారు” అని ఓవైసీ చెప్పారు. గత వారం వీహెచ్‌పీ లీగల్ సెల్ నిర్వహించిన కార్యక్రమంలో జస్టిస్ శేఖర్ యాదవ్ మాట్లాడుతూ.. మెజారిటీల(హిందువుల) అభీష్టం మేరకు భారతదేశం పనిచేస్తుందని ఆయన అన్నారు. ముస్లిం కమ్యూనిటీ పేరుని నేరుగా ప్రస్తావించకుండా.. చిన్నప్పటి నుంచి వారి ముందు జంతువుల్ని చంపినప్పుడు వారి పిల్లలు ఎలా దయగా, సహనంలో ఉంటారని ప్రశ్నించారు. సమాజంలో ప్రతీ ఒక్కరూ చెడ్డవారు కానప్పటికీ కఠ్ముల్లాలు దేశానికి ప్రమాదం అని అన్నారు.
సిరియాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. రెబల్స్ లక్ష్యంగా క్షిపణుల ప్రయోగం
సిరియాపై ఇజ్రాయెల్ డజన్ల కొద్దీ వైమానిక దాడులు నిర్వహించింది. సిరియా అంతటా క్షిపణులు ప్రయోగించింది. దీంతో బాంబు దాడులతో సిరియా దద్దరిల్లింది. తాజాగా సిరియా తిరుగుబాటుదారుల చేతుల్లోకి వెళ్లిపోయింది. సిరియా అధ్యక్షుడు అసద్.. రష్యాకు పారిపోయారు. దీంతో రెబల్స్.. రాజధాని డమాస్కస్‌తో సహా సిరియా అంతటిని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అయితే ఆయుధ సంపత్తి.. రెబల్స్ చేతుల్లోకి వెళ్లకుండా అడ్డుకట్ట వేయలని ఇజ్రాయెల్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా సాయంతో సిరియాపై ఐడీఎఫ్ దళాలు డజన్ల కొద్దీ క్షిపణులను ప్రయోగించింది. రసాయన ఆయుధాలు కలిగిన పరిశోధనా కేంద్రంతో సహా మిలిటరీ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని భారీగా వైమానిక దాడులు చేసినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. అసద్ పాలనను కూలదోసిన తర్వాత ఆయుధాలు తీవ్రవాదుల చేతుల్లోకి వెళ్లకుండా నిరోధించేందుకు ఈ దాడులు చేస్తున్నట్లు ఇజ్రాయెల్ పేర్కొంది. డమాస్కస్‌కు 25 కిలోమీటర్ల పరిధి వరకు వైమానిక దాడులకు పాల్పడినట్లు యూకేకు చెందిన సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యుమన్ రైట్స్ వెల్లడించింది. ఈ ఘటనలో క్షిపణి లాంచర్లు, హెలికాప్టర్లు, యుద్ధ విమానాలు ధ్వంసమైనట్లు తెలిపింది. ఇజ్రాయెల్ దళాలు సిరియా వైపు దూసుకువస్తున్నట్లు స్పష్టం చేసింది.
బ్రెజిల్ ప్రెసిడెంట్ లూయిజ్‌కు బ్రెయిన్ సర్జరీ.. ఐసీయూలో వైద్యుల పర్యవేక్షణ
బ్రెజిల్ ప్రెసిడెంట్ లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా(79) బ్రెయిన్ సర్జరీ చేయించుకున్నారు. దీంతో ఆయన ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. గత అక్టోబర్‌లో ఆయన ఇంటి దగ్గర పడిపోయారు. దీంతో మెదడుపై రక్తస్రావం జరిగింది. ప్రస్తుతం మరోసారి గాయం తిరగగొట్టడంతో బ్రెయిన్ సర్జరీ చేయించుకున్నారు. ఆయన ఆరోగ్యం బాగానే ఉందని వైద్యులు తెలిపారు. ఇంటెన్సివ్ కేర్‌లో కోలుకుంటున్నారని వెల్లడించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణ ఉన్నట్లు స్పష్టం చేశారు. సోమవారం లూయిజ్ తలనొప్పితో బాధపడ్డారు. దీంతో వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఎంఆర్ స్కాన్ నిర్వహించారు. దీంతో ఇంట్రాక్రానియల్ హెమరేజ్ ఉన్నట్లుగా గుర్తించారు. వెంటనే సావో పాలోలోని సిరియో లిబనేష్ ఆస్పత్రికి తరలించారు. సర్జరీ తర్వాత లూయిజ్ క్షేమంగా ఉన్నట్లు ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఉన్న ఆసుపత్రి సిబ్బంది తెలిపారు.
అను ఇమ్మాన్యుయేల్ ఎక్కడ..?
కేరళ కుట్టీ అను ఇమ్మాన్యుయేల్ ఎక్కడ..? మలయాళ భామలు టాలీవుడ్ వైపు పరుగులు పెడుతుంటే.. ఆమె ఎందుకు వెనకడుగు వేస్తోంది..? అవకాశాలు రావట్లేదా..? కావాలనే గ్యాప్ తీసుకుందా..? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. బ్యూటీఫుల్ ఫేస్.. అంతకు మించి యాక్టింగ్ స్కిల్, ఉంటే.. ఏం లాభం.. ఆవగింజంత లక్ లేకపోతే. ఇది కేరళ బ్యూటీ అను ఇమ్మాన్యుయేల్ విషయంలో ట్రూ అనిపిస్తుంది. ఒకటా రెండా.. ఇంచు మించు 10 సినిమాలు చేస్తే.. ఆమె ఖాతాలో బ్లాక్ బస్టర్ హిట్టే లేకపోవడం. అదీ కూడా సాదా సీదా హీరోలు కాదు.. టైర్ 1 స్టార్లతో జతకట్టిన ఎక్స్ పీరియన్స్ ఆమెది. కానీ అవకాశాలు మాత్రం రావట్లేదు. నాని మజ్నుతో స్టార్టైన ఆమె కెరీర్.. లాస్ట్ ఇయర్ రావణాసుర వరకు కొనసాగింది. తమిళంలో వచ్చిన జపాన్ కూడా ఆమె కెరీర్‌కు రిమార్క్‌గా మారిపోయింది. దీంతో ఈ ఏడాది ఏ ఇండస్ట్రీని పలకరించలేదు అమ్మడు. ప్రజెంట్ ఆమె చేతిలో మలయాళ మూవీ యాక్షన్ హీరో బిజు2 మాత్రమే ఉన్నట్లు సమాచారం. టాలీవుడ్‌లో కొత్త సినిమాలు ఒప్పుకున్న దాఖలాలు లేవు. దీంతో ఆమె తెలుగు ఇండస్ట్రీకి టాటా చెప్పిందానన్న ప్రశ్నలు తలెత్తున్నాయి. నిజంగానే టీటౌన్‌లో లక్ ఫ్యాకర్ట్ ఆమె కెరీర్‌ను డిసైడ్ చేసిందా..? ఇక ఇక్కడ సినిమాలు చేయదా..? లేదా కావాలనే గ్యాప్ తీసుకుందా..? చూద్దాం.. నెక్ట్స్ ఇయర్ ఏదైనా అప్టేడ్ ఇస్తుందేమో..
పుష్ప- 2కి షెకావత్ కష్టాలు.. దాడులు చేస్తామంటూ కర్ణిసేన వార్నింగ్
అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన ‘పుష్ప 2’ చిత్రం తాజాగా ఓ వివాదంలో చిక్కుకుంది. ఇప్పుడు ఈ చిత్రానికి వ్యతిరేకంగా కర్ణి సేన రంగంలోకి దిగింది. సినిమాలో ఫహద్ ఫాజిల్ పేరుకు సంబందించి కర్ణి సేన అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఇప్పుడు ఆ పదాన్ని ‘పుష్ప 2’ నుండి తొలగించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు కర్ణి సేన నాయకుడు రాజ్ షెకావత్ ఒక వీడియో విడుదల చేసి ‘పుష్ప 2’ నిర్మాతలను బహిరంగంగా హెచ్చరించాడు. నిర్మాతలు ‘క్షత్రియ’ సమాజాన్ని అవమానిస్తున్నారని ఆయన ఆరోపించారు. ‘పుష్ప 2’ సినిమాలో ‘షెకావత్’ అనే పదాన్ని ఉపయోగించడంపై రాజ్ షెకావత్ మండిపడ్డారు. అలా చేయడం ద్వారా ఈ సినిమా ‘క్షత్రియ సమాజాన్ని ఘోరంగా అవమానించిందని’ వారు ఆరోపించారు. క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన షెకావత్‌ను విలన్ గా చూపించారని పేర్కొన్నారు. భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో సినీ పరిశ్రమ ఏళ్ల తరబడి క్షత్రియుల పరువు తీస్తూనే ఉందని ఆయన అన్నారు. “ చెవులు రిక్కించి వినండి, సినిమాలో ఈ క్రింది విధంగా ఉపయోగించిన ‘షెకావత్’ పదాన్ని తీసివేయాలి. లేకుంటే కర్ణి సేన కూడా దాడులు చేస్తుంది, ఇళ్లలోకి ప్రవేశిస్తుంది, అవసరమైతే ఎంతకైనా తెగిస్తుంది.” అని ఆయన హెచ్చరించారు. సుకుమార్ దర్శకత్వం వహించిన ‘పుష్ప 2’ చిత్రంలో, విలన్ పేరు భన్వర్ సింగ్ షెకావత్, అతని పాత్రను మలయాళ సూపర్ స్టార్ ఫహద్ ఫాసిల్ పోషించారు. అతని పాత్ర నెగిటివ్‌గా చూపబడడంతో కర్ణి సేన అభ్యంతరం వ్యక్తం చేసింది. సినిమా నుంచి షెకావత్ ఇంటిపేరు తొలగించాలన్నది వారి డిమాండ్. ఇప్పుడు ఈ మొత్తం విషయంపై మేకర్స్ నుండి స్పందన ఇంకా రాలేదు. అయితే ఈ సినిమా డైరెక్షన్ టీంలో ఉన్న వీరేంద్ర సింగ్ షెకావత్ అనే వ్యక్తి పేరుతోనే ఈ షెకావత్ పేరును సృష్టించామని సుకుమార్ తాజాగా సక్సెస్ మీట్ లో వెల్లడించిన సంగతి తెలిసిందే.
పుష్ప -2 పాట్నా ఈవెంట్ పై హీరో సిద్దార్ధ్ ఓవరాక్షన్
ఇండియాస్ బిగ్గెస్ట్ ఫిలింగా రూపొందిన ఈ చిత్రం పుష్ప -2. ఈ సినిమాలో ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ నట విశ్వరూపం చూపించాడు. బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ క్లాస్ టేకింగ్‌తో ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ చిత్రంగా నిలిచింది. ప్రపంచ స్థాయి నిర్మాణ విలువలతో ఈ చిత్రాన్ని సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించారు. డిసెంబరు 5న చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలయిన ఈ సినిమాను ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఆ మధ్య బీహార్‌లోని పాట్నాలో భారీ ఎత్తున నిర్వహించారు. ఈ వేడుక ఇండియా మొత్తం హాట్‌టాపిక్‌గా నిలిచింది. సుమారు 3 లక్షల మందికి పైగా ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు. అయితే ఈ పాట్నాలో జరిగిన ఈ ఈవెంట్ ఫై తమిళ్ హీరో సిద్దార్ధ్ వివాదస్పద వ్యాఖ్యలు చేసాడు. ఆయన నటించిన మిస్ యు సినిమా ప్రమోషన్స్ లో మాట్లాడుతూ ‘ బీహార్ లోని పాట్నాలో పుష్ప2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన ప్రేక్షకులు కేవలం మార్కెటింగ్ మాత్రమే, అదిపెద్ద విషయం కాదు, రోడ్ పై జేసీబీ వర్క్ చేస్తున్న కూడా ఎక్కువ మంది గుమిగూడతారు. బీహార్ లాంటి చోట అంత క్రౌడ్ రావడం మ్యాటర్ కాదు. మీరు పెద్ద మైదానాన్ని బ్లాక్ చేసి ఈవెంట్‌ను నిర్వహిస్తే, ప్రజలు గుమిగూడుతారు. ఒక బిర్యానీ, క్వార్ట్రర్ ఇస్తే రాజకీయ నాయకుల మీటింగ్ కు జనాలు విపరీతంగా వస్తారు అలా అని రాజకీయ పార్టీలు గెలుస్థాయా ” అని కామెంట్స్. ఈ నోటి దురుసు వల్లే ఒకప్పుడు టాప్ హీరోగా ఉన్న సిద్దార్ద్ సినిమాలు ఇప్పుడు చూసే వారు లేరని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.