కేశినేని బ్రదర్స్.. నాని కామెంట్లపై చిన్ని ఆసక్తికర వ్యాఖ్యలు..
అన్న కేశినేని నాని వ్యాఖ్యలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు టీడీపీ నేత, నాని తమ్ముడు కేశినేని చిన్ని.. ఎన్టీఆర్ వర్థంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా నడుస్తాం.. పార్టీ కోసం శ్రమిస్తున్నాం అన్నారు.. ఎన్టీఆర్ జీవితం మాకూ.. అందరికీ ఆదర్శం అన్నారు.. కానీ, గొల్లపూడిలో పార్టీ కార్యాలయం విషయంలో ప్రభుత్వం వైఖరి సరికాదని మండిపడ్డారు. ఇక, కేశినేని నాని కామెంట్లపై స్పందించిన కేశినేని చిన్ని… పార్టీ ఎవరికి టికెట్ ఇస్తే వారికి సహకరిస్తానని ప్రకటించారు.. టీడీపీ అధిష్టానం.. కేశినేని నానికి టికెట్ ఇచ్చినా నా మద్దతు ఉంటుందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. 2014 ఎన్నికల్లో కేశినేని నానికి తెర వెనుకుండి పని చేశాను.. గెలుపు కోసం కృషి చేశాను.. 2019 ఎన్నికల్లో నానితో విబేధాల కారణంగా పని చేయకున్నా.. పార్టీకి వ్యతిరేకంగా పని చేయలేదన్నారు.. అయితే, కేశినేని నాని చేసిన కామెంట్లను నేను పట్టించుకోనని కొట్టిపారేశారు.. సేవా కాక్యక్రమాలు ఎవరు చేసినా మంచిదేనన్న ఆయన.. అన్న క్యాంటీన్లల్లో పేదలు భోజనం చేస్తారు.. కానీ, డబ్బున్న వారు భోజనం చేస్తారా..? అని ప్రశ్నించారు. అన్న క్యాంటీన్లల్లో నేను భోజనం చేస్తున్నానని నేనేమన్నా చెప్పానా..? అని నిలదీశారు.. పార్టీ బలోపేతం కోసం పని చేయడం.. పేదలకు సేవ చేయడమే నాకు తెలుసని స్పష్టం చేశారు కేశినేని చిన్ని.
భూదందా ఆరోపణలు.. ఎమ్మెల్యే రఘునందన్ కు తోట చంద్రశేఖర్ కౌంటర్
నాలుగు వేల కోట్ల విలువైన మియాపూర్ భూములను సీఎం కేసీఆర్ ధారాదత్తం చేశారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు తనపై చేసిన ఆరోపణలకు ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ కౌంటర్ ఇచ్చారు. ఖమ్మంలో బీఆర్‌ఎస్ పార్టీ బహిరంగ సభ నుంచి మీడియా దృష్టి మరల్చేందుకు తనపై పనికిమాలిన ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ ఆరోపణలు నిజమైతే ఆ సర్వే నంబర్‌లోని 90 శాతం మీరే తీసుకోవాలని, మిగిలిన 10 శాతం తనకిస్తే చాలన్నారు. ఇలాంటి చిల్లర రాజకీయాలు, నిరాధార ఆరోపణలు మానుకోవాలని తోట చంద్రశేఖర్ అన్నారు. కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ పార్టీ దేశ భవిష్యత్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తుందని చంద్రశేఖర్ పేర్కొన్నారు. తెలంగాణ మోడల్‌ను దేశవ్యాప్తంగా అమలు చేసేందుకే కేసీఆర్ బీఆర్‌ఎస్ పార్టీని స్థాపించారన్నారు. ఏపీతో పాటు తెలంగాణ ప్రగతిని దేశానికి పరిచయం చేస్తామన్నారు. త్వరలో విశాఖలో బీఆర్‌ఎస్ బహిరంగ సభను కేసీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యేందుకు సన్నాహాలు చేస్తున్నామని తోట చంద్రశేఖర్ వెల్లడించారు.
వైరల్‌గా మారిన కోహ్లీ అభిమాని పోస్ట్.. కోరిక తీరింది.. ఇక పెళ్లి..!
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇప్పుడు సూపర్ ఫామ్‌లోకి వచ్చాడు.. వరుసగా సెంచరీలు బాదేస్తున్నాడు.. క్రికెట్ దిగ్గజాల రికార్డులను కొల్లగొడుతూ.. కొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు.. ఎంతో కాలంగా విరాట్ పూర్తి వైభవం కోసం ఎదురుచూస్తోన్న అభిమానుల కోరిక కూడా తీరిపోయింది.. విరాట ఊచకోత.. పరుగుల వరద కోసం ఎదురుచూస్తోన్నవారికి కన్నుల పండుగ అవుతోంది.. ఈ సమయంలో ఓ అభిమాని పెట్టిన పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.. 2019 తర్వాత మొన్న ఆసియా కప్ వరకు సెంచరీ చేయకపోవడంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు లోనయ్యారు.. ఈ క్రమంలో ఓ అభిమాని ప్లకార్డు పట్టుకొని ‘విరాట్ 71వ సెంచరీ పూర్తి చేసే వరకూ పెళ్లి కూడా చేసుకోను’ అంటూ రాసి ఉన్న ఓ ప్లకార్డు అప్పట్లో నెట్టింట్ హల్‌చల్ చేసింది.. అయితే, విరాట్ ఫామ్‌లోకి వచ్చి సెంచరీలు బాదేయడంతో.. నా కోరిక తీరింది ఇక పెళ్లి చేసుకుంటున్నాను అనే తరహాలో మరో పోస్ట్ పెట్టాడు ఆ అభిమాని.. టీ20 ఫార్మాట్‌లో జరిగిన గత ఆసియా కప్‌లోనే అద్భుతమైన ప్రదర్శనతో సెంచరీ కొట్టిన విరాట్.. ఆ తర్వాత వరుసగా మూడు సెంచరీలు బాది తన ఖాతాలో 74వ సెంచరీ వేసుకున్నాడు.. దీంతో.. ఆ అభిమాని.. నేను 71వ సెంచరీ అడిగాను.. అయితే విరాట్ నా ప్రత్యేకమైన రోజున 74వ శతకం బాదాడు.. అంటూ షేర్వానీతో టీవీ దగ్గర నిలిచోని ఉన్న ఫొటోను షేర్ చేశాడు.. అయితే, ఇది విరాట్ ఫ్యాన్స్‌తో పాటు క్రికెట్ ప్రేమికులను.. నెటిజన్లను ఎంతోగానో ఆకట్టుకుంటుంది.. క్రికెట్‌కు ఎంతో ఆదరణ ఉన్న దేశంలో, క్రికెటర్లను దేవుళ్లలా చూస్తారు ఫ్యాన్స్.. విరాట్ కోహ్లి, మునుపటి తరహాలోనే తన క్రికెట్ కెరీర్‌లో మిలియన్ల మంది హృదయాలను గెలుచుకుంటున్నాడు.. అభిమానులు తమ అభిమాన క్రికెటర్లపై తమ ప్రేమను వ్యక్తం చేయడానికి చాలా కష్టపడ్డారు మరియు అమన్ అగర్వాల్ కూడా దీనికి మినహాయింపు కాదు.
మనసును కలిచివేస్తున్న ఆత్మహత్య.. కట్టుకున్నది లేదని..!
తమిళనాడులో జరిగిన ఓ యువకుడి ఆత్మహత్య ఇప్పుడు అందరి మనస్సులను కలచివేస్తోంది.. కట్టుకున్న భార్య కన్నుమూయడాన్ని జీర్ణించుకోలేకపోయిన ఆ యువకుడు.. ఓసారి ఆత్మహత్యకు యత్నించి.. ప్రాణాలతో బయటపడ్డాడు.. కానీ, ఆ తర్వాత మళ్లీ అదే ప్రయత్నం చేశాడు.. ఆత్మహత్య చేసుకున్నాడు.. తమిళనాడులో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కడలూరు సమీపంలోని నిట్టమలై సెట్టి బస్‌స్టాప్‌లో గుణశేఖరన్ అనే యువకుడు నిన్న ఉదయం బస్సు టైర్ కింద తలపెట్టి ఆత్మహత్యాయత్నం చేశాడు.. అయితే.. డ్రైవర్ అప్రమత్తతో బతికి పోయాడు.. కానీ, సాయంత్రం అదే బస్ స్టాప్ లో మరో బస్సు టైర్ కింద తలపెట్టి ఆత్మహత్య చేసుకోవడం విషాదంగా మారింది.. అయితే, గుణశేఖరన్ ఆత్మహత్యకు కారణం అతడి భార్య లేకపోవడమే అని తెలుస్తోంది.. కొద్ది రోజుల క్రితం సముద్రంలో స్నానం చేస్తూండగా కొట్టుకుని పోయింది గుణశేఖరన్ భార్య భవానీ.. అయితే, ఆ ఘటన జరిగినప్పటి నుంచి తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు.. వీరికి ఒక ఆడపిల్ల కూడా జన్మించింది. కనీసం.. ఆ చిన్నారి గురించి కూడా ఆలోచించలేని పరిస్థితికి వెళ్లిపోయాడు.. చివరకు ప్రాణాలు తీసుకున్నాడు.. మొదటిసారి మిస్ అయినా బిడ్డకోసం కూడా మనసు మార్చుకోకుండా.. రెండోసారి ప్రయత్నించి ప్రాణాలు తీసుకున్న వైనం స్థానికులను కలిచివేసింది. ఇక, గుణశేఖరన్ ఆత్మహత్యకు యత్నించింది.. మరియు ఆత్మహత్య చేసుకున్న దృశ్యాలు సీసీ టీవీలో రికార్డ్ అయ్యాయి.
‘రేవతి’గా మారిన బేబమ్మ… కటకటాల వెనక్కి ఎందుకు వెళ్లింది?
ఉప్పెన సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా సాలిడ్ ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి. క్యూట్ లుక్స్ తో పాటు మంచి యాక్టింగ్ స్కిల్స్ కూడా ఉండడంతో మొదటి సినిమాతోనే సినీ అభిమానులు బేబమ్మకి కనెక్ట్ అయ్యారు. డెబ్యు మూవీ సూపర్ హిట్ అవ్వడంతో తెలుగు, తమిళ దర్శక నిర్మాతలు కృతి శెట్టి డేట్స్ కోసం ఎగబడ్డారు. కృతి శెట్టి కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది కానీ ఈ తొందరలో కథ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం మర్చిపోయింది. దీంతో ఎంత త్వరగా పేరొచ్చిందో రాంగ్ డెసిషన్స్ తో కృతి శెట్టి అంతే త్వరగా తన కెరీర్ ని కష్టాల్లో పడేసుకునే స్టేజ్ కి వెళ్లింది. ప్రస్తుతం కృతి శెట్టి చేతిలో ఉన్న సినిమాల్లో హిట్ అయ్యే ఛాన్స్ కాస్త ఎక్కువగా ఉన్న సినిమా ‘కస్టడీ’. తమిళ క్రియేటివ్ దర్శకుడు ‘వెంకట్ ప్రభు’ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో యువసామ్రాట్ అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తున్నాడు. కృతి శెట్టి ‘రేవతి’గా నటిస్తున్న ఈ మూవీలో తన ఫస్ట్ లుక్ పోస్టర్ బయటకి వచ్చింది. జైల్లో కటకటాల వెనక కృతి శెట్టి నిలబడి ఉన్నట్లు డిజైన్ చేసిన పోస్టర్ ఆకట్టుకుంది. కృతి శెట్టికే కాదు నాగ చైతన్యకి కూడా కస్టడీ సినిమా హిట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. 2022ని నాగ చైతన్య ఫ్లాప్ తో ఎండ్ చేశాడు. మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాలి అంటే కస్టడీ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టాల్సిందే. ఈ మూవీ మే 12న ఆడియన్స్ ముందుకి రానుంది. బంగార్రాజు సినిమాతో హిట్ ఇచ్చిన నాగ చైతన్య, కృతి శెట్టిలు కలిసి నటిస్తున్నారు కాబట్టి కస్టడీ సినిమా కూడా హిట్ అయితే ఈ హీరో-హీరోయిన్ ని హిట్ పెయిర్ అయిపోతారు.
చెప్పి మరీ హిట్ కొట్టాడు…
దిల్ రాజు బ్యానర్ నుంచి ఒక సినిమా వస్తుంది అంటే మినిమమ్ గ్యారెంటీ హిట్ అనే నమ్మకం ప్రతి తెలుగు సినీ అభిమానుల్లో ఉంది. స్టార్ హీరోస్ తో సినిమాలని చెయ్యడంతో పాటు కంటెంట్ ని కూడా నమ్మి సినిమాలు ప్రొడ్యూస్ చెయ్యడంలో ముందుండే దిల్ రాజు, టాలీవుడ్ నుంచి కోలీవుడ్ హిట్ కొట్టడానికి వెళ్లారు. అక్కడి స్టార్ హీరో దళపతి విజయ్ తో ‘వారిసు’ సినిమాని నిర్మించాడు. వంశీ పైడిపల్లి హీరోగా నటించిన వారిసు మూవీ ఈ సంక్రాంతికి ఆడియన్స్ ముందుకి వచ్చింది. తెలుగులో వారసుడు పేరుతో మూడు రోజుల డిలేతో రిలీజ్ అయిన ఈ మూవీ సెన్సేషనల్ కలెక్షన్స్ ని రాబడుతోంది. తమిళనాడులో ఎర్త్ శాటరింగ్ కలెక్షన్స్ ని రాబడుతున్న వారిసు సినిమా వరల్డ్ వైడ్ ఇప్పటివరకూ అంటే 7 రోజుల్లో 210 కోట్లని రాబట్టింది. ఒక ఫ్యామిలీ సినిమా ఈ రేంజ్ కలెక్షన్స్ ని రాబట్టడం అనేది మాములు విషయం కాదు. విజయ్ లాంటి మాస్ ఇమేజ్ ఉన్న హీరోతో ఫ్యామిలీ సినిమా ఎందుకు చేస్తున్నారు, ఇలా అయితే మూవీ ఫ్లాప్ అవుతుంది అని చాలా మంది కామెంట్స్ చేశారు. ఈ మాటల్ని పట్టించుకోని విజయ్ తో అందరిలా రొటీన్ మాస్ మసాలా సినిమా చెయ్యకుండా తన గట్స్ ని మాత్రమే నమ్మి ఫ్యామిలీ సినిమా చేశాడు దిల్ రాజు. తన నమ్మకమే తనని గెలిపిస్తుంది అనే మాట ఇప్పుడు దిల్ రాజు విషయంలో నిజమయ్యింది. ఫ్యామిలీ సినిమా పండగ సీజన్ లో రిలీజ్ అయితే ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ కి వస్తారు, చాలా రోజులుగా విజయ్ మాస్ సినిమాలు మాత్రమే చేస్తున్నాడు కాస్త సెంటిమెంట్ టచ్ ఇస్తే కొత్తగా ఉంటుంది అని దిల్ రాజు పెట్టుకున్న నమ్మకమే వారిసు విజయానికి కారణం అయ్యింది. వారసుడు సినిమా తెలుగులో మూడు రోజుల డిలేతో రిలీజ్ అయినా కూడా మంచి కలెక్షన్స్ నే రాబడుతోంది. బ్రేక్ ఈవెన్ మార్క్ ని రీచ్ అయ్యి ప్రాఫిట్స్ జోన్ లోకి ఎంటర్ అవుతుంది. వారిసు విజయం దిల్ రాజుని కోలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్ ని చేస్తుందేమో చూడాలి.
ప్రభాస్ లాంచ్ చేసిన ‘హంట్’ ట్రైలర్ అదిరింది…
నైట్రో స్టార్ సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘హంట్’ యాక్షన్ ఎక్స్ట్రావెంజాగా రూపొందుతున్న ఈ మూవీని జనవరి 26న ప్రేక్షకుల ముందుకి తీసుకోని రానున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ పీక్ స్టేజ్ కి తీసుకోని వెళ్తూ మేకర్స్ ‘హంట్’ ట్రైలర్ ని రిలీజ్ చేశాడు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సుధీర్ బాబు ‘హంట్’ ట్రైలర్ ని రిలీజ్ చేశాడు. దాదాపు రెండు నిమిషాల నిడివితో కట్ చేసిన ట్రైలర్ యాక్షన్ ప్యాక్డ్ గా ఉంది. సుధీర్ బాబు ఒక యాక్సిడెంట్ కి ముందు యాక్సిడెంట్ కి తర్వాత చేపట్టిన ఒక కేస్ చుట్టూ ‘హంట్’ సినిమా తిరుగుతోంది అనే విషయాన్ని ట్రైలర్ లో క్లియర్ కట్ గా చెప్పేశారు. అర్జున్ పాత్రలో కనిపించనున్న సుధీర్ బాబు, తన యాక్సిడెంట్ కి ముందు టేకప్ చేసిన కేస్ ఏంటి? అతను రెడీ చేసిన ఫైల్ లో ఏం ఉంది? యాక్సిడెంట్ తర్వాత తన ఎంక్వయిరీలో రాసుకున్న డైరీలో ఏం ఉంది? డైరీ లాస్ట్ పేజ్ లో వైట్ పేపర్ ఎందుకు ఉంది? అనే ప్రశ్నలతో ట్రైలర్ లాక్ చేసిన మేకర్స్, ఆడియన్స్ లో సినిమా చూడాలి అనే క్యురియాసిటి కలిగించారు. ట్రైలర్ లో చూపించిన విజువల్స్, యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయి. ఘిబ్రాన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ట్రైలర్ ని ఎలివేట్ చేసింది. శ్రీకాంత్, తమిళ హీరో ప్రేమిస్తే భరత్ లు ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేస్తున్న హంట్ మూవీని మహేశ్ సూరపనేని డైరెక్ట్ చేస్తున్నాడు. భవ్య క్రియేషన్స్ నిర్మిస్తున్న హంట్ మూవీ సుధీర్ బాబుకి మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కిస్తుందేమో చూడాలి.
విమానంలో 100 మందికి పైగా ప్రయాణికులు.. నడిసముద్రంపై ఉండగా సాంకేతిక లోపం..
నేపాల్‌లో జరిగిన విమాన ప్రమాదం ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టించింది.. అయితే, ఆ ఘటన నుంచి ఇంకా తేరుకోక మునుపే.. పెను ప్రమాదం నుంచి ఓ విమానం బయటపడింది.. వంద మందికి పైగా ప్రయాణికులతో బయల్దేరిన ఓ విమానం.. నడి సముద్రంపై ఉన్న సమయంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి.. అయితే, ఆ తర్వాత ఆ విమానం సిడ్నీ ఎయిర్‌పోర్ట్‌లో సురక్షితంగా ల్యాండ్ కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.. ఈ విమాన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. న్యూజిలాండ్‌లోని క్వాంటాస్‌కు చెందిన విమానం ప్రమాద సంకేతాన్ని జారీ చేయడంతో సిడ్నీ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయింది.. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో సిడ్నీలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు.. న్యూజిలాండ్‌లోని అక్లాండ్ నుంచి సిడ్నీకి బయల్దేరింది క్వాంటాస్ విమానం క్యూఎఫ్144… అయితే, అది పసిఫిక్ సముద్రంపై ప్రయాణిస్తున్న సమయంలో.. బోయింగ్ 737 దాని రెండు ఇంజన్‌లలో ఒకదానిలో సాంకేతిక సమస్యలు వచ్చాయి.. ఇది ట్విన్ ఇంజిన్ బోయింగ్ 737-800 మోడల్ విమానం. ఈ విమానంలో దాదాపు 100 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. పరిస్థితిని అర్థం చేసుకొన్న ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ మేడే అలర్ట్ జారీ చేసింది. సాధారణంగా ప్రాణాంతకమైన పరిస్థితుల్లో వైమానిక రంగంలో ఈ అలర్ట్ జారీ చేస్తుంటారు.. దాదాపు 45 నిమిషాల ముందు ఈ అలర్ట్ జారీ అవ్వడంతో.. విమానంలోని ప్రయాణికులు సిబ్బంది అంతా ఆందోళనకు గురయ్యారు.. సిడ్నీకి మరో గంటలో చేరుకుంటుందన్న సమయంలో.. ఈ హెచ్చరికలు ఎదుర్కోవాల్సి వచ్చిందని.. ఆస్ట్రేలియన్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్‌కి ఒక ప్రకటనలో పేర్కొంది.. తీవ్రమైన మరియు ఆసన్నమైన ప్రమాదాన్ని సూచించే మేడే సిగ్నల్ ల్యాండింగ్‌కు ముందు “సాధ్యమైన సహాయం అవసరం” కోసం డౌన్‌గ్రేడ్ చేయబడింది.. దీంతో.. విమానం సిడ్నీలో ల్యాండ్ అయ్యే సమయానికి ఎమర్జెన్సీ సర్వీసెస్ అన్ని అందుబాటులో ఉంచారు.. న్యూ సౌత్ వేల్స్ అంబులెన్స్ దాని పారామెడిక్స్ హెచ్చరికకు స్పందించినట్లు ధృవీకరించింది.. మొత్తంగా ఆ విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యిందని.. అదులోని ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నట్టు చెబుతున్నారు.. విమానంలోని సాంకేతిక సమస్యలను ఇంజనీర్లు అంచనా వేసిన తర్వాత మరింత సమాచారాన్ని పంచుకుంటామని క్వాంటాస్ పేర్కొంది.