ధర్మవరం చెరువు కబ్జా..! మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి కుటుంబానికి నోటీసులు..
శ్రీ సత్యసాయి జిల్లాలోని ధర్మవరం చెరువు కబ్జా వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి కుటుంబానికి షాక్ ఇచ్చారు అధికారులు.. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తమ్ముడు భార్య వసుమతికి నీటిపారుదల శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు.. ధర్మవరం చెరువును కబ్జా చేశారని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.. ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తమ్ముడు భార్య వసుమతికి నోటీసులు జారీ చేసినట్టుగా చెబుతున్నారు.. అయితే, చెరువు స్థలాన్ని వెంటనే ఖాళీ చేయాలని ఆ నోటీసుల్లో ప్రస్తావించారు నీటిపారుదలశాఖ అధికారులు… కబ్జా చేసిన చెరువు స్థలాన్ని ఏడు రోజుల్లో ఖాళీ చేయాలని నోటీసుల్లో పేర్కొన్నారు అధికారులు..
కబ్జా నోటీసులపై స్పందించిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి.. దీని వెనుక రాజకీయ కోణం..!
ధర్మవరం చెరువు కబ్జా వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి కుటుంబానికి నీటిపారుదలశాఖ నోటీసులు జారీ చేయడం హాట్ టాపిక్‌గా మారింది.. అయితే, ఆ నోటీసులపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు కేతిరెడ్డి.. చెరువు భూములు కబ్జా చేశారని తన తమ్ముడి భార్యకు నోటీసులు ఇవ్వడంపై రియాక్ట్ అయిన ఆయన.. ఈ నోటీసుల వెనుక ఖచ్చితంగా రాజకీయ కోణం ఉందని ఆరోపించారు. చెరువు భూములు కబ్జా చేశారని వచ్చిన ఆరోపణలపై తాను గతంలోనే కోర్టుకు వెళ్లానని తెలిపారు.. దీనికి సంబంధించిన కేసు కోర్టులో ఉన్నప్పటికీ.. అధికారంలో ఉన్నవారు నోటీసులు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.. అయితే, ఈ విషయంలో కంటెంట్ ఆఫ్ కోర్టు కింద కేసు వేస్తానని హెచ్చరించారు కేతిరెడ్డి… తన భూముల విషయంలో చాలా క్లియర్‌గా ఉన్నానని వెల్లడించారు.. చెరువు కబ్జా నోటీసులపై ఫేస్ బుక్ లైవ్ ద్వారా స్పందించిన ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి.. చీకటి ఉన్నట్టే పగలు కూడా ఉంటుందన్నారు.. కచ్చితంగా వీటన్నింటికీ సమాధానం ఇచ్చే రోజు వస్తుందన్నారు.. నా భూముల విషయంలో చాలా క్లియర్ గా ఉన్నాను.. ఈ విషయం హైకోర్టులో ఉన్నప్పటికీ అధికారంలో నోటీసులు ఇచ్చారు.. కంటెంట్ ఆఫ్ కోర్టు కింద కేసు వేస్తాను అని వార్నింగ్ ఇచ్చారు.. నా నోటీసుల వెనుక కచ్చితంగా రాజకీయ కోణం ఉందన్నారు.. నాపై చేసిన ఆరోపణలు మీద గతంలోనే హైకోర్టుకు వెళ్లానన్నారు ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి..
వైసీపీ కీలక నిర్ణయం.. ఆ ఎన్నికల్లో పోటీకి దూరం
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న రెండు పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకూడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని ఆ పార్టీ నేత పేర్ని నాని ప్రకటించారు. పోలీసులను పెట్టి వైసీపీ నేతల్ని ఇష్టానుసారంగా అరెస్టులు చేయిస్తున్నారని ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నిక సక్రమంగా జరిగే అవకాశం లేదన్నారు. అందుకే తాము ఎన్నికల్లో పోటీ చేయకూడదని డిసైడయ్యామని తెలిపారు పేర్ని.. కాగా, గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ, ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. వీటికి టీడీపీ తరపున ఆలపాటి రాజేంద్రప్రసాద్, పేరాబత్తుల రాజశేఖర్ పేర్లను చంద్రబాబు ఖరారు చేశారు. ఇక, పార్టీ నేతలను గ్రాడ్యూయేట్ ఓటర్లుగా నమోదు చేయించేందుకు ఆ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు. ఓటర్ల నమోదు ను చంద్రబాబు స్వయంగా పర్యవేక్షించారు. అయితే, వైసీపీ తరపున అభ్యర్థులని ఖరారు చేయకపోవడంతో వారు తమ పార్టీ ఓటర్లను కూడా నమోదు చేయించలేకపోయారు. అధికారంలో ఉన్నప్పుడు జరిగిన మూడు పట్టభద్రుల గ్రాడ్యూయేట్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పరాజయం పాలైంది. అప్పట్లో తమ ఓటర్లు వేరు అని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. గ్రాడ్యూయేట్లలో వైసీపీకి ఓటేసేవారు తక్కువగా ఉంటారన్న అంచనాతో పాటు మళ్లీ ఓడితే రకరకాల సమస్యలు వస్తాయన్న కారణంగా వెనుకడుగు వేసినట్లుగా తెలుస్తోంది. తక్కువ ఓట్లు నమోదు అయితే ఇంకా ఇబ్బందులు వస్తాయని పార్టీ నేతలు, వ్యూహకర్తలు నిర్ణయించడంతో ఆగిపోయినట్లుగా తెలుస్తోంది.
స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం కార్మికుల ఉక్కు సంకల్పం.. మరో వినూత్న కార్యక్రమం..
విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ కు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు చేస్తున్న ఉద్యమం 1300రోజులు దాటింది. ఐక్య కార్యాచరణ సమితి దశలవారీగా పోరాటాన్ని విస్తరిస్తోంది. మరోవైపు, రాజకీయ పక్షాలకు ఈ వ్యవహారం సంకటంగా మారింది. ఈ పరిస్థితుల్లో ఉక్కు పరిరక్షణలో ఎవరి భాగస్వామ్యం ఎంత..? అనే చర్చ ప్రజల ముందుకు వస్తోంది. అదే సమయంలో ఉక్కు మంత్రిత్వశాఖ నిర్ణయాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రయివేటీకరణ జరగబోదని పీలర్స్ ఇస్తూనే తెరచాటు వ్యవహారాలను చక చక పూర్తి చేసేస్తోంది. 2000 మందికి టిఆర్ఎస్ అమలు చేయాలని ఆలోచన., సీనియర్ ఉద్యోగులను నగర్నార్ స్టీల్ ప్లాంట్ కు బదిలీ, కాంట్రాక్టు ఉద్యోగులకు వేతనాలు చెల్లింపులో జాప్యం వంటి వ్యవహారాలతో ఆందోళన రెట్టింపు అయ్యింది. ఈ నేపథ్యంలో ప్రజాభీష్టాన్ని దేశ ప్రధానికి మరింత బలంగా చేరవేసేందుకు ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ శ్రీకారం చుట్టింది. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 10న ఆర్కే బీచ్ లో పోస్ట్ కార్డు ఉద్యమం ప్రారంభిస్తోంది. ‘రెస్పెక్టెడ్ ప్రైమ్ మినిస్టర్, ప్లీజ్ విత్ డ్రా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్’- అనే నినాదంతో 10 లక్షల పోస్ట్ కార్డులు పంపిస్తామని ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ ప్రకటించింది. ప్రపంచంలోనే ఒక సమస్యపై ప్రధానికి 10 లక్షల పోస్ట్ కార్డులు పంపడం రికార్డుగా చరిత్రలో మిగులుతుందంటున్నారు. మొదట విడతగా రెండున్నర లక్షల పోస్ట్ కార్డులను ఇప్పటికే సిద్ధం చేసింది ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ. ఈ నెల 10న భారీ ర్యాలీగా ప్రధాన పోస్ట్ ఆఫీస్ కి వెళ్లి పోస్ట్ కార్డులను పోస్ట్ చేసేలా కార్యచరణ రూపొందించింది.
పవన్ కల్యాణ్‌ను ఏపీకి రాకుండా అడ్డుకుంది మీరు కాదా..?
గతంలో పవన్ కల్యాణ్‌ను ఏపీకి రాకుండా అడ్డుకుంది మీరు కాదా..? అంటూ మండిపడ్డారు బీజేపీ మీడియా ఇంఛార్జ్ పాతూరి నాగభూషణం.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఎన్డీఏ అధికారంలో ఉండగా వైసీపీ అధికారంలోకి రావడం కల్ల అన్నారు.. ప్రతిపక్ష పార్టీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడినా టైం వేస్ట్ అని స్పందించ లేదు.. విశాఖలో కిషోర్, విజయవాడలో రాజేష్ లు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని కర్నూలు మొత్తం తిప్పింది వాస్తవం కాదా? డాక్టర్ సుధాకర్ న్యాయం అడిగితే బట్టలు ఊడదీసి కొట్టి అతని మరణానికి కారణమయ్యారు..! చంద్రబాబు, అచ్చెంనాయుడు, కొల్లు రవీంద్ర, ధూళిపాళ్ల నరేంద్రను అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టలేదా..? పవన్ ను ఎపీకి రాకుండా అడ్డుకుంది మీరు కాదా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. మా అధ్యక్షురాలు పురంధేశ్వరి మద్యం వల్ల మరణాలు అని చూపిస్తే.. ఆమెపై అసభ్య పోస్టులు పెట్టించారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు నాగభూషణం.. మా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పైనా వ్యంగ్య పోస్టులా..? అని ఆవేదన వ్యక్తం చేశారు.. ఇక, చంద్రబాబు మంచితనం వల్ల చట్టపరంగానే చర్యలు తీసుకుంటున్నారు.. సిసోడియాను వ్యక్తిగతంగా దూషణలు చేస్తున్నారు .. లోకేష్ రెడ్ బుక్ పూర్తిగా తీయాలి.. చట్టపరంగా శిక్షించాలని కోరుతున్నాను అన్నారు. రవీంద్రరెడ్డి తప్పించుకున్నాడంటే పోలీసులు సహకారం లేదా? అని నిలదీశారు..
మాడవీధుల్లో గండ దీపం వద్ద దీపారాధన.. సీఎంకు పూర్ణ కుంభ స్వాగతం
యాదగిరిగుట్టకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేరుకున్నారు. యాదాద్రి జిల్లా లోని పుష్కరిణి నుండి తూర్పు రాజగోపురం వరకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు నడుచుకుంటూ వచ్చారు. మాడవీధుల్లో గండ దీపం వద్ద సీఎం, మంత్రులు దీపారాధన చేశారు. తూర్పు రాజగోపురం వద్ద ఆలయ అర్చకులు సీఎంకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. తూర్పు రాజగోపురం నుండి ప్రవేశించిన అనంతరం త్రితల గోపురం గుండా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఆలయంలోకి ప్రవేశించారు. అనంతరం ఆంజనేయ స్వామి వారి దర్శించుకున్నారు. ప్రధానాలయంలోకి వెళ్లారు. ప్రధానాలయంలో సువర్ణ పుష్పర్చనలో పాల్గొన్నారు. సహస్ర సువర్ణ పుష్పార్చనలో సీఎం రేవంత్ రెడ్డి తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. సహస్ర పుష్పార్చన పూర్తి అనంతరం వేద పండితులు సీఎం, మంత్రులకు వేద ఆశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ కలిసి సీఎంకు స్వామి ప్రతిమను అందజేశారు. అనంతరం మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆలయ అభివృద్ధి పనులపై వీటీడీఏ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 1 నుంచి 1.30 వరకు భోజనం. 1.30 గంటలకు వలిగొండ మండలం సంగెం ప్రెసిడెన్షియల్ సూట్ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరుతారు. మధ్యాహ్నం 2.10 నుంచి 3 గంటల వరకు బిమలింగం వద్ద పూజల్లో పాల్గొని నడక సాగిస్తారు. మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు రెండున్నర కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపట్టనున్నారు. 4.30 గంటలకు ధర్మారెడ్డి కాలువ మీదుగా సంగెం-నాగిరెడ్డిపల్లి ప్రధాన రహదారికి చేరుకుంటారు. అనంతరం సాయంత్రం 4.30 నుంచి 5 గంటల వరకు నాగిరెడ్డిపల్లిలో వాహనంపై నుంచి ప్రజలనుద్దేశించి సీఎం ప్రసంగిస్తారు. సాయంత్రం 5 గంటలకు సంగెం నుంచి హైదరాబాద్‌కు బయలుదేరుతారు.
పంజాగుట్టలో కారు బీభత్సం.. చెకింగ్ చేస్తుండా హోం గార్డు ఈడ్చుకెళ్ళిన డ్రైవర్
పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో కారు డ్రైవర్ బీభత్సం సృష్టించింది. కారు చెకింగ్ సమయంలో డ్రైవర్ కారు ఆపకుండా దూసుకెళ్ళిపోయాడు. కారు బ్లాక్ ఫిల్మ్ చెకింగ్ లో భాగంగా పంజాగుట్ట ట్రాఫిక్ పోలీసులు ఇవాళ ఉదయం తనిఖీలు చేపట్టారు. వాహనాలను చెకింగ్ చేస్తూండగా ఓ కారు డ్రైవర్ ను పంజాగుట్ట నాగార్జున సర్కిల్ వద్ద కారు చెక్ చేయడానికి హోంగార్డ్ రమేష్ కారును ఆపాడు. కారు ఆపకుండా డ్రైవర్ సయ్యద్ మాజుద్ధిన్ నసిర్ అనే వ్యక్తి హోం గార్డు రమేష్ నీ ఈడ్చుకెళ్లి పోయాడు. ట్రాఫిక్ పోలీసులకు భయపడిన కారు డ్రైవర్ ఆపకుండా దూసుకెళ్లాడు. దీంతో.. పంజాగుట్ట ట్రాఫిక్ ఎస్సై ఆంజనేయులు ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. కారు డ్రైవర్ ను అదుపులో తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కారు ఎక్కడి నుంచి వచ్చింది? కారును ఎందుకు ఆపకుండా వెళ్లిపోయాడు అనే అనుమానం వ్యక్తం చేస్తున్నా పోలీసులు. డ్రైవర్ సయ్యద్ మాజుద్ధిన్ నసిర్ ను వెంటనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. ప్రమాదానికి గురైన హోం గార్డు రమేష్ కు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు.
సీఎం రేవంత్ రెడ్డికి బర్త్ డే విషెస్ చెప్పిన కేటీఆర్.. ఎక్స్ లో సెటైర్లు..
సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు కేటీఆర్ ఎక్స్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌లో ‘నేను హైదరాబాద్‌లో ఉన్నాను. మీ ఏసీబీ అధికారులు ఎప్పుడైనా రావచ్చు. వారికి నా స్వాగతం. వారితో మీ పుట్టినరోజు కేక్ కట్ చేయాస్తా. టీ, బిస్కెట్లు కూడా ఇస్తాను అని ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలుపుతూ సెటైర్లు వేశారు. అయితే.. కాగా, అరెస్టు భయంతో కేటీఆర్ మలేషియా వెళ్తున్నారని పలు మీడియా కథనాలపై బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ ట్వీట్ చేశారు. కేటీఆర్ పరువు తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలుసు. జర్నలిజాన్ని జోక్ మార్చకండి అన్నారు. కేటీఆర్ హైదరాబాద్‌లోని తన నివాసంలో చాయ్ తాగుతూ ఈ వార్తను చదువుతూ ఉంటారని చెప్పారు . ట్వీట్‌ను ట్యాగ్ చేస్తూ కేటీఆర్, ఇవాళ సీఎం పుట్టిన రోజూ సందర్బంగా స్పందిస్తూ.. నేను ఎక్కడికి వెళ్లలేదు హైదరాబాద్ లోనే వున్నా ఎప్పుడైనా రావచ్చు అంటూ సెటైర్లు వేశారు. నా అరెస్టు కోసం ఉవ్విళ్ళూరుతున్న రేవంత్ రెడ్డి! దమ్ముందా మెఘా కృష్ణా రెడ్డి ని సుంకిసాల ఘటనలో బ్లాక్ లిస్ట్ చెయ్యడానికి! అని ప్రశ్నించారు. దమ్ముందా మెఘా కృష్ణా రెడ్డి ని అరెస్ట్ చెయ్యడానికి? ని మండిపడ్డారు. దమ్ముందా ఆ ‘ఆంధ్రా కాంట్రాక్టర్’ని తన ‘ఈస్ట్ ఇండియా కంపెనీ’ని కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ నుండి తీసివేయడానికి? అని తెలిపారు. దమ్ముందా? లేదా? అని సీఎంకు ట్వీటర్ వేదికగా సవాల్ విసిరారు. సీఎం అయ్యుండి మేఘాకు గులాంగిరీ చేస్తున్నావా?! అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసి పాదయాత్ర పైన కేటీఆర్ కామెంట్స్ చేశారు.
తప్పుడు వార్తలను ప్రచారం చేశారంటూ బీజేపీ ఎంపీపై కేసు నమోదు..
కర్ణాటకలోని హవేరి జిల్లాకు చెందిన రైతు రుద్రప్ప చన్నప్ప బాలికై తన భూమిని వక్ఫ్ బోర్డు స్వాధీనం చేసుకోవడంతో సూసైడ్ చేసుకున్నట్లు.. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, మంత్రి జమీర్ అహ్మద్ చర్యల వల్ల రైతులు కుంగిపోతున్నారని ఇటీవల సోషల్‌మీడియా వేదికగా బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య ఆరోపించారు. అయితే, 2022 జనవరిలో రైతు రుద్రప్ప పంట నష్టం, రుణ భారం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడని, భూ సమస్యల వల్ల కాదని హవేరీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వెల్లించారు. కాగా, రైతు రుద్దరప్ప ఆత్మహత్యను వక్ఫ్ భూములకు ముడి పెడుతూ పోస్టు పెట్టి.. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారనే ఆరోపణలతో బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్యతో పాటు రెండు కన్నడ పత్రికల ఎడిటర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. వక్ఫ్ నోటీసులకు వ్యతిరేకంగా హవేరీలో రైతులు ఆందోళన తెలియజేస్తున్నారని.. ఈ ఘటనతో రైతు మానసిక క్షోభకు గురై సూసైడ్ చేసుకున్నారని వార్తా పత్రికలు తెలిపాయి. కాగా, ఆ పోస్టును ప్రస్తుతం ఎంపీ సూర్య డిలీట్ చేశారు.
అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు..
ఉత్తర్ ప్రదేశ్‌లోని అలీగఢ్ ముస్లిం యూనివర్శిటీ మైనారిటీ హోదాకు సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు ఈరోజు (శుక్రవారం) కీలక తీర్పు వెల్లడించింది. యూనివర్సిటీ మైనార్టీ హోదా ఉందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 4: 3 మెజారిటీతో తీర్పు ఇచ్చింది. విశ్వవిద్యాలయానికి మైనారిటీ హోదాను చట్టం ద్వారా కల్పించారని తెలిపింది. ఎస్ అజీజ్ బాషా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో 1967 నాటి సుప్రీంకోర్టు తీర్పును కొట్టిపారేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 30 కింద అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీకి మైనార్టీ హోదా వర్తిస్తుందని సీజేఐ డీవై చంద్రచూడ్ వెల్లడించారు. కాగా, అలీఘడ్ ముస్లిం యూనివర్సిటీకి మైనార్టీ హోదా కల్పించే కేసు విచారణలో ఈరోజు అత్యున్నత న్యాయస్థానం నాలుగు రకాల తీర్పులను వెల్లడించింది. ఈ కేసులో మూడు రకాల వ్యతిరేక తీర్పులు ఉన్నట్లు సీజేఐ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు. మెజారిటీ తీర్పుకు తనతో పాటు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జేబీ పర్దివాలా, మనోజ్ మిశ్రా రాసినట్లు సీజేఐ తెలిపారు. మరోవైపు, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపాంకర్ దత్త, జస్టిస్ సతీశ్ చంద్ర శర్మలు సపరేట్ తీర్పులను ఇచ్చినట్లు డీవై చంద్రచూడ్ చెప్పారు. అయితే, రాజ్యాంగంలోని ఆర్టికల్ 30 కింద అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీకి మైనార్టీ హోదా వర్తిస్తుందని రాజ్యాంగ ధర్మాసనం నిర్ణయించింది. ఈ కేసులో 8 రోజుల పాటు వాదనలు విన్న తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీన తీర్పును రిజర్వు న్యాయస్థానం ఈరోజు తుది తీర్పు ఇచ్చింది.
సవరించిన పరీక్ష తేదీల క్యాలెండర్ విడుదల చేసిన యూపీఎస్సీ
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష మే 25, 2025న నిర్వహించబడుతుంది. NDA, NA పరీక్ష (I) ఏప్రిల్ నెలలో నిర్వహించబడుతుంది. యూపీఎస్సీ విడుదల చేసిన సవరించిన వార్షిక పరీక్షల క్యాలెండర్‌లో అన్ని ఇతర పరీక్షల తేదీలు ప్రకటించబడ్డాయి. అభ్యర్థులు పోర్టల్‌ను సందర్శించడం ద్వారా ఈ సమాచారాన్ని తనిఖీ చేయవచ్చు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన రివైజ్డ్ వార్షిక పరీక్షల క్యాలెండర్ ప్రకారం.. సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ 2025 కోసం దరఖాస్తు ప్రక్రియ జనవరి 22, 2025 నుండి ప్రారంభమవుతుంది. దరఖాస్తు ఫారమ్‌లు ఫిబ్రవరి 11, 2025 వరకు ఆమోదించబడతాయి. పరీక్ష మే 25, 2025న నిర్వహించబడుతుంది. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (మెయిన్స్) పరీక్ష 2025 నవంబర్ 16, 2025న నిర్వహించబడుతుంది. IES/ISS పరీక్ష 2025 కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఫిబ్రవరి 12, 2025 నుండి ప్రారంభమవుతుంది. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ మార్చి 4, 2025. ఈ పరీక్ష జూన్ 20, 2025న నిర్వహించబడుతుంది. CDS పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్ డిసెంబర్ 11, 2024న విడుదల చేయబడుతుంది. పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ డిసెంబర్ 31, 2024. పరీక్ష ఏప్రిల్ 13న నిర్వహించబడుతుంది. కాగా, CDS పరీక్ష (II) 2025 నోటిఫికేషన్ మే 28న విడుదల అవుతుంది. రెండవ దశ నమోదు ప్రక్రియ జూన్ 17, 2025 వరకు కొనసాగుతుంది. రాత పరీక్ష సెప్టెంబర్ 14, 2025న నిర్వహించబడుతుంది. యూపీఎస్సీ వార్షిక క్యాలెండర్ 2025ను సవరించడం ఇది రెండోసారి. దీనికి ముందు, ఆగస్టులో పరీక్ష తేదీలను సవరించారు. పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మారిన క్యాలెండర్ ప్రకారం ప్రిపేర్ కావాలని సూచించారు.
కెప్టెన్‌తో గొడవ.. కట్ చేస్తే రెండు మ్యాచ్లు సస్పెన్షన్
మూడు వన్డేల సిరీస్‌ను వెస్టిండీస్ 2-1తో కైవసం చేసుకుంది. తొలి వన్డేలో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో వెస్టిండీస్ ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. రెండో వన్డేలో ఇంగ్లండ్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మూడో వన్డేలో వెస్టిండీస్ ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ నేపథ్యంలో మూడో వన్డేలో జరిగిన సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. వెస్టిండీస్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడో వన్డేలో ఫాస్ట్ బౌలర్ అల్జారీ జోసెఫ్, జట్టు కెప్టెన్ షాయ్ హోప్‌తో గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో జోసెఫ్ మైదానాన్ని వీడి డగౌట్‌లోకి వచ్చాడు. అలా వచ్చిన అతను కాసేపు డ్రెస్సింగ్ రూమ్‌లోనే ఉంది పోయాడు. ఆ తర్వాత వెస్టిండీస్ కోచ్ డారెన్ సామీ అల్జారీ జోసెఫ్‌తో మాట్లాడిన తర్వాత అతనికి సర్థి చెప్పడంతో.. దాంతో అల్జారీ జోసెఫ్ తిరిగి మైదానంలోకి అడుగుపెట్టాడు. చివరకి 10 ఓవర్ల కోటాను పూర్తి చేసి రెండు వికెట్లు తీశాడు. గ్రౌండ్ లోకి వచ్చిన తర్వాత ఇద్దరి మధ్య వివాదం ఆగలేదు. ఈ ఘటనపై వెస్టిండీస్ క్రికెట్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో వెస్టిండీస్ క్రికెట్ బోర్డు అల్జారీ జోసెఫ్ ను శిక్షించింది. అతనిపై రెండు మ్యాచ్‌ల నిషేధం విధించింది.
‘గేమ్ ఛేంజర్’ నయా పోస్టర్.. కియారా లుక్ కిరాక్ అంతే!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, డైరెక్టర్ ఎస్ శంకర్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘గేమ్ ఛేంజర్’. బాలీవుడ్ భామ కియారా అడ్వాణీ హీరోయిన్. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. 10 జనవరి 2025న గేమ్ ఛేంజర్ సినిమా వరల్డ్‌వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ వరుస అప్‌డేట్స్ ఇస్తున్నారు. దీపావళి పండగ సందర్భంగా గేమ్ ఛేంజర్ టీజర్ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్.. తాజాగా అభిమానుల కోసం మరో పోస్టర్‌ను విడుదల చేశారు. హీరోయిన్ కియారా అడ్వాణీ కొత్త లుక్ పోస్టర్‌ను వదిలారు. ‘గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మాయాజాలానికి, బ్యూటిఫుల్ కియారా అడ్వాణీ అందాల అనుభుతి పొందేందుకు ఒక్క రోజే ఉంది. గేమ్ ఛేంజర్ టీజర్ నవంబర్ 9న వస్తోంది. జనవరి 10 నుంచి ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది’ అని ట్వీట్ చేశారు. పోస్టర్‌లో కియారా లుక్ కిరాక్‌గా ఉంది. మోడ్రన్ ఔట్ ఫిట్‌లో కియారా అదరగొట్టారు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. నవంబర్ 9న గేమ్ ఛేంజర్ టీజర్ లాంచ్ ఈవెంట్ లక్నోలో జరగనుంది. టీజర్‌కు మరో రోజు మాత్రమే మిగిలి ఉందని తెలియజేస్తూ.. చిత్ర యూనిట్ కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. టీజర్ లాంచ్ ఈవెంట్‌కు చరణ్, కియారా, శంకర్ సహా టీమ్ మొత్తం హాజరవనుంది. లాంచ్ ఈవెంట్ లక్నోలో భారీ ఎత్తున ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. గేమ్ ఛేంజర్ నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు సినిమాపై అంచనాలు పెంచాయి. ఇక టీజర్ కోసం ఫాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
35 ఏళ్ల వయసులోనే ఆత్మహత్య చేసుకున్న నటుడు!
ప్రముఖ బుల్లితెర నటుడు నితిన్ చౌహాన్ (35) మృతి చెందారు. గురువారం ముంబైలోని తన అపార్ట్‌మెంట్‌లో ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయాన్ని అతని సహనటులు సుదీప్ సాహిర్, సయంతని ఘోష్, విభూతి ఠాకూర్ ధ్రువీకరించారు. నితిన్ మరణ వార్త తెలిసిన వెంటనే నటి విభూతి ఠాకూర్ భావోద్వేగ పోస్ట్‌ను పంచుకున్నారు. చిన్న వయసులోనే నితిన్ చనిపోయిన విషయాన్ని తోటీ నటీనటులు జీర్ణించుకోలేకపోతున్నారు. నితిన్ చౌహాన్ ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్ నివాసి. సినిమాలపై ఉన్న ఇష్టంతో గత కొన్నేళ్లుగా ముంబైలో ఉంటున్నారు. నితిన్ మృతి చెందిన విషయాన్ని అతని కుటుంబ సభ్యులకు స్నేహితులు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు ముంబైకి వచ్చి.. నితిన్ మృతదేహాన్ని అలీగఢ్‌కు తీసుకెళ్లారు. నేడు అంత్యక్రియలు జరగనున్నాయి. నితిన్ మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. కేసు నమోదు చేసుకున్న ముంబై పోలీసులు.. దర్యాప్తు ఆరంభించారు. రియాల్టీ షో ‘దాదాగిరి 2’ విజేతగా నిలిచిన అనంతరం నితిన్ చౌహాన్ పేరు మార్మోగిపోయింది. స్ప్లిట్స్‌విల్లా 5, జిందగీ డాట్ కామ్, క్రైమ్ పెట్రోల్, ఫ్రెండ్స్ వంటి రియాలిటీ షోలతో ప్రజాదరణ పొందారు. 2022లో సాబ్ టీవీ దినపత్రిక ‘తేరా యార్ హూన్ మైన్’లో నితిన్ చివరిసారిగా స్క్రీన్‌పై కనిపించారు. నితిన్ త్వరలో తన 36వ పుట్టినరోజును ఘనంగా జరుపుకోవాలని ప్లాన్ చేశారట. అయితే పుట్టినరోజుకు వారం ముందే ఆయన మరణించారు.
లేడీ డైరెక్టర్ తో సెంచరీ కొట్టనున్న యంగ్ మ్యూజిక్ సెన్సేషన్
ఇండియాస్ గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ ఏ. ఆర్ .రెహమాన్ మేనల్లుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జీ.వి ప్రకాష్ కుమార్ కూడా మేనమామ వెరీ ట్యాలెంటెడ్ . సంగీత దర్శకుడిగానే కాకుండా హీరోగానూ తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. ఓ వైపు మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేస్తూనే హీరోగానూ చాలా సినిమాలు చేశాడు.. ఇంకా చేస్తూనే ఉన్నాడు. ఓ పెద్దింటి కుటుంబం నుంచి వచ్చినా? జీవీ పోషించే పాత్రలను చూస్తుంటే ఎంతో ముచ్చటేస్తుంటాయి. మరి నటుడంటే అంతే.. ఎలాంటి పాత్ర అయినా పోషించగలగాలి. అప్పుడే పరిపూర్ణ నటుడు అవుతాడు అనడానికి జీవీ ప్రకాష్ ఓ ఫర్ ఫెక్ట్ ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు. ఎలాంటి డీ గ్రేడ్ పాత్రలోనైనా జీవీ ప్రకాష్ జీవిస్తాడు. అలాంటి భిన్నమైన పాత్రలకైనా ఆయన జీవం పోస్తాడు. మరి అలాంటి జీవి సంగీత దర్శకుడిగా 100వ సినిమాలకు చేరువలో ఉన్నాడు? అంటే నమ్ముతారా? అవును జీవి ఇప్పుడు సెంచరీకి అతి చేరువలో ఉన్నాడు. 2006లో మ్యూజిక్ డైరెక్టర్ గా ప్రయాణం మొదలు పెట్టాడు. తొలిసారి `వెయిల్` అనే సినిమాకి మ్యూజిక్ అందించాడు. అక్కడి నుంచి జీవి మ్యూజిక్ డైరెక్టర్ గా వెనక్కి తిరిగి చూడలేదు. రెహమాన్ సారథ్యంలో గాయకుడిగా, కంపోజర్ గా రాటు దేలడంతో అవకాశాల పరంగా తనకు ఎదురు లేకుండా పోయింది. సంగీత దర్శకుడిగా పీక్స్ లో ఉండగానే నటుడిగా ప్రస్తానం మొదలు పెట్టాడు. చిన్న పాత్రలతో మొదలై స్టార్ హీరోల సినిమాల్లో సైతం నటించడం మొదలు పెట్టాడు. అలా నటుడిగా కొనసాగుతూనే మెయిన్ ట్రాక్ లో మ్యూజిక్ ని పెట్టి ముందుకు దూసుకు వెళ్తున్నాడు. ఇటీవల రిలీజ్ అయిన తెలుగు సినిమా లక్కీ భాస్కర్ కి జీవీనే మ్యూజిక్ అందించాడు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. అలాగే `అమరన్` సినిమాకు కూడా ఇతడే సంగీతం అందించాడు. ఇది రెండు రాష్ట్రాల్లోనూ బ్లాక్ బస్టర్ అయింది. ఈ నేపథ్యంలో 100వ సినిమా సీక్రెట్ విప్పాడు. సుధ కొంగర దర్శకత్వంలో 100 వ సినిమా ఉంటుందని తెలిపాడు. త్వరలోనే ఈ సినిమా పూర్తి వివరాలు అధికారికంగా ప్రకటిస్తామని తెలిపారు.