తణుకులో ఎస్ఐ ఆత్మహత్య.. తుపాకీతో కాల్చుకొని..!
పశ్చిమగోదావరి జిల్లా తణుకులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తుపాకీతో కాల్చుకొని సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్ఐ) మృతి చెందిన ఘటన తణుకు రూరల్ పోలీస్ స్టేషన్లో ఈ రోజు చోటుచేసుకుంది. రూరల్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పని పనిచేస్తున్న ఏజీఎస్ మూర్తి.. ఇటీవల పలు ఆరోపణలు నేపథ్యంలో సస్పెండ్ అయ్యారు. అయితే, ఈరోజు ఉదయం పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఆయన.. తుపాకీతో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నారు.. సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని ఎస్సై ఏజీఎస్ మూర్తి మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. ఇటీవల వీఆర్‌లో ఉన్న ఎస్సై మూర్తి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.. కుటుంబ సమస్యలా? వ్యక్తిగత కారణాలా? లేదా సస్పెండ్ అయ్యానని అవమానంతో ప్రాణాలు తీసుకున్నాడా? అనే కోణంలో విచారణ చేపట్టారు తణుకు పోలీసులు.. రూరల్ ఎస్సై సొంత ఊరు దాక్షారామం వద్ద గంగవరం.. కాగా, ఒక బాబు, పాప ఉన్నారు.. ఇక, తణుకు రూరల్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న జిల్లా ఎస్పీ నయీమ్ అస్మి.. ఎస్సై ఆత్మహత్యకు గల కారణాలపై వివరాలు సేకరించారు.
హడలెత్తిస్తున్న చిరుతలు.. తిరుమల, తిరుపతిలో కలకలం
టెంపుల్ సీటి కేంద్రంగా శ్రీవారి భక్తులను, నగరవాసులను చిరుతపులులు హడలెత్తిస్తున్నాయి… నిత్యం తిరుమల, తిరుపతిలో చిరుతపులులు సంచారం కంటిమీదా కునుకులేకుండా చేస్తున్నాయి.. నిన్న తిరుమలలో చిరుత సంచారం కలకలం రేపిన విషయం తెలిసిందే.. తిరుమల శిలాతోరణం వద్ద నిన్న సాయంత్రం చిరుత సంచరిస్తున్నట్లు భక్తులు గుర్తించారు. ఈ క్రమంలో వెంటనే టీటీడీ, అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అయితే, ప్రస్తుతం సర్వదర్శన టోకెన్ల క్యూలైన్ సమీపంలోని అటవీ ప్రాంతంలోనే చిరుత సంచరిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో, భక్తులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో తిరుమలకు వచ్చే భక్తులను టీటీడీ అప్రమత్తం చేసింది. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. తాజాగా తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీలో చిరుత సంచారం తీవ్ర కలకలం సృష్టించింది. గత రాత్రి సమయంలో యూనివర్సిటీ ఆవరణలో చిరుత.. ఓ కుక్కను వేటాడి ఎత్తుకెళ్లడంతో విద్యార్థులు భయంతో వణికిపోతున్నారు.. దీంతో యూనివర్సిటీ విద్యార్థులు, సిబ్బంది, స్కాలర్స్, హాస్టల్ సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు. అయితే గత నెల రోజులుగా యూనివర్సిటీలో చిరుత కదలికలు ఉన్నాయంటూ ఫ్లెక్సీలు అక్కడ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా చిరుతను గుర్తించేందుకు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు ఫారెస్ట్ అధికారులు.
పదవీ విరమణ ఫేర్వెల్ పరేడ్.. డీజీపీ భావోద్వేగం..
ఏపీ డీజీపీ ద్వారకా తిరుమల రావు తన పదవీ విరమణ ఫేర్వెల్ పరేడ్‌లో భావోద్వేగానికి గురయ్యారు.. యూనిఫామ్ ఇకపై ఉండదంటేనే భావోద్వేగంగా ఉందని పేర్కొన్నారు.. మంగళగిరి పోలీస్ పరేడ్ గ్రౌండ్లో డీజీపీ ద్వారకాతిరుమల రావు పదవీ విరమణ ఫేర్వెల్ పరేడ్ నిర్వహించారు.. ఏపీ నూతన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఐపీఎస్ అధికారులు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ద్వారక తిరుమల రావు మాట్లాడుతూ.. నా జీవితంలో ఇవి ఉద్విగ్నభరిత క్షణాలు.. సర్వీసులో ఉన్నపుడు చేసిన పనులు నా జ్ఞాపకాలు.. దశాబ్దాలుగా నన్ను అంటిపెట్టుకుని ఉన్న యూనిఫాం ఇకపై ఉండదు అనేది ఎమోషన్‌గా అనిపించిందని పేర్కొన్నారు.. ఇన్నాళ్ల పాటు సర్వీసులో ఉన్న నాకు అనేక మంది సహకరించారు.. సర్వీసులో చేరినప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక సవాళ్లను చూశాను అన్నారు.. ఇక, సంప్రదాయ పోలీసింగ్ నుంచి సాంకేతిక పోలీసింగ్ వైపు మారామని గుర్తుచేసుకున్నారు ద్వారకాతిరుమల రావు.. ప్రతి పోలీసులో ప్రొఫెషనలిజం తెస్తున్నాం.. సైబర్ క్రైమ్, గంజాయి, మహిళలు చిన్నారులపై నేరాల విషయంలో ప్రత్యేక చర్యలు చేపట్టాం అన్నారు. విపత్తుల సమయంలో ఏపీ పోలీసులు సాహసోపేతంగా పనిచేశారని ప్రశంసలు కురిపించారు.. యూనిఫాం ధరించిన వారి అందరికీ న్యాయం అందించాలి అని కోరుతున్నట్టు తెలిపారు.. క్రమశిక్షణ, నిజాయితీ, సంకల్పం కలిగి ఉంటే మంచి ఫలితాలు వస్తాయి.. కేసుల విచారణలో కొత్త కొత్త విధానాలు అందుబాటులోకి వచ్చాయన్నారు. ఇక, డీజీపీగా అవకాశం ఇచ్చిన సీఎం చంద్రబాబుకి ధన్యవాదాలు తెలిపారు ద్వారకా తిరుమల రావు.. బాధ్యతలు ఇవ్వటమే కాదు వాటి నిర్వహణకు గైడెన్స్ కూడా ఇచ్చారన్న ఆయన.. ప్రభుత్వ సహకారం వల్లే పోలీస్ వ్యవస్థను బలోపేతం చేశానని వెల్లడించారు.. విధి నిర్వహణలో ప్రాణ త్యాగాలు చేసిన కుటుంబాలకు ధన్యవాదాలు తెలిపారు.. సర్వీసులో ఎన్నో జ్ఞాపకాలు, గుణపాఠాలు, పరిచయాలు, ఎమోషన్స్ తో కలిసి ఉన్నాయి.. విధి నిర్వహణలో లేనప్పటికీ నా మనసు పోలీసుల చుట్టూనే ఉంటుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఏపీ డీజీపీ ద్వారకాతిరుమల రావు.
జగన్ ఒక్క ఛాన్స్ మాత్రమే అడిగారు.. జమిలితో చంద్రబాబుకే నష్టం..!
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు.. మాజీ సీఎం వైఎస్ జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ చింతా మోహన్.. గుంటూరులో మీడియాలో మాట్లాడిన ఆయన.. జగన్ ఒక్క ఛాన్స్ మాత్రమే అడిగారు.. రెండో ఛాన్స్ లేదు.. అడిగినా ప్రజలు అవకాశం ఇవ్వరు అని పేర్కొన్నారు.. మళ్లీ ఏపీలో జగన్ బలపడే అవకాశం లేదని జోస్యం చెప్పారు.. ఇక, జమిలి వస్తే చంద్రబాబుకు నష్టం.. అందుకే జమిలి ఎన్నికలకు చంద్రబాబు ఒప్పుకోరని పేర్కొన్నారు.. జమిలి ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీకి నష్టం లేదన్నారు చింతా మోహన్.. ఇక, కాంగ్రెస్ నాయకులు ప్రజల్లో తిరగడంలేదు.. హైదారాబాద్ లో కూర్చుంటే పనులు జరగడం లేదు.. ప్రస్తువం ఈవీఎంల మేనేజ్మెంట్ జరుగుతోంది.. గెలవాలి అంటే ప్రజల్లోకి వెళ్లి కష్టపడాలని సూచించారు.. మరోవైపు.. దళితులపై వివక్ష, అంటరానితనం ఎలా ఉంటుందో కళ్లారా చూసిన వ్యక్తిని నేను అన్నారు చింతా మోహన్.. ఒకప్పుడు దళితుల నాడి పట్టుకుని వైద్యం చేయడానికి కూడా వెనకాడేవారని పేర్కొన్న ఆయన.. మూతికి ముంత, వెనుక తాటాకు కట్టుకుని తిరిగిన ఘటనలు ఎన్నో ఉన్నాయి.. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అంటరాని తనం రూపు మాపాలని గాంధీకి నెహ్రూకు చెప్పారు.. రాజ్యాంగంలో ఎస్సీలకు 15 శాతం ఇచ్చిన ఘనత, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కిచ, కాంగ్రెస్ నాయకులకు దక్కిందన్నారు.. అయితే, ఎస్సీ వర్గీకరణపై ఇచ్చిన తీర్పులో లోపాలు ఉన్నాయి.. పక్క రాష్ట్రాల్లో అమలు చేయలేని వర్గీకరణను ఏపీలో చంద్రబాబు అమలు చేయాలని చేస్తున్నారు.. ఏకసభ్య కమిటీ పేరుతో చేస్తున్న ప్రయత్నాలు ఆపాలని డిమాండ్ చేశారు.. చంద్రబాబుకి దళితుల చేసిన అన్యాయం ఏంటి…? అని నిలదీశారు. దళితులను ఎందుకు విభజించాలని చూస్తున్నారు.. తిరుపతిలో పెట్టాల్సి న రాజధాని విజయవాడలో పెడితే రాయల సీమ ప్రాంతం ఏం అవ్వాలి? అని ప్రశ్నించారు.. రాయల సీమ వాళ్లు బయట పడటం లేదు.. కానీ, ఉడికి పోతున్నారని పేర్కొన్నారు..
రేపటి నుంచి పెరగనున్న రిజిస్ట్రేషన్ ఛార్జీలు.. సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసులు కిటకిట
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూముల విలువతో పాటు రిజిస్ట్రేషన్ ఛార్జీలను కూడా పెంచేందుకు సిద్ధమైంది.. సవరించిన ధరలు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అంటే రేపటి నుంచే అమల్లోకి రాబోతున్నాయి.. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ల విలువల సవరణ చేస్తూ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.. మార్కెట్ విలువకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ ఛార్జీలను సవరించింది సర్కార్.. అయితే, రేపటి నుంచే కొత్త ఛార్జీలు అమల్లోకి రానున్న నేపథ్యంలో.. రాష్ట్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు రద్దీగా మారాయి..
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు ఇంకెప్పుడు.. తెలంగాణ స్పీకర్ పై సుప్రీంకోర్టు ఆగ్రహం
బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టును ఆశ్రయించింది బీఆర్ఎస్. ముగ్గురు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావ్, కడియం శ్రీహరిలపై సుప్రీంకోర్టులో SLP వేసింది కారు పార్టీ. వాళ్లపై చర్యలకు టైం ఫ్రేం పెట్టాలని అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. తగిన సమయంలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తుది నిర్ణయం తీసుకోవాలని గతంలో రాష్ట్ర హైకోర్ట్ డివిజన్ బెంచ్ ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాలు చేసింది బీఆర్ఎస్. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పిటిషన్ పై ఈరోజు (జనవరి 31) సుప్రీం బెంచ్ జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ విచారణ జరిపారు. ఇక, పార్టీ ఫిరాయింపులు జరిగి పది నెలలు అవుతున్న స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకోవడం లేదు అని బీఆర్ఎస్ తరపున న్యాయవాది వాదనలు వినిపించారు. కనీసం ఎమ్మెల్యేలకు నోటీసులు కూడా ఇవ్వలేదు అని తేల్చి చెప్పారు. హైకోర్టు రీజనబుల్ టైంలో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. రీజనబుల్ టైం అంటే ఎంత సమయం కచ్చితంగా టైం ఫ్రేమ్ ఉండాలని బీఆర్ఎస్ తరపు అడ్వకేట్ తమ వాదనల్లో తెలిపారు.
ఉస్మానియా ఆస్పత్రికి సీఎం రేవంత్ రెడ్డి భూమిపూజ..
హైదరాబాద్ మహా నగరంలోని గోషామహల్ స్టేడియంలో ఉస్మానియా ఆస్పత్రి నూతన భవనానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎంకు పూర్ణకుంభంతో అర్చకులు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనర్సింహ, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ లతో పాటు సలహాదారు కే. కేశవరావు, హైదరాబాద్ మేయర్ విజయ లక్ష్మీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీఎస్ శాంతకుమారి, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు, తదితరులు హాజరయ్యారు. ఇక, సుమారు రూ.2,700 కోట్ల వ్యయంతో 26.30 ఎకరాల్లో ఉస్మానియా ఆస్పత్రిని నిర్మిస్తున్నారు. 32 లక్షల చదరపు అడుగుల భవనాలతో పాటు 2 వేల పడకల సామర్థ్యంతో ఆస్పత్రిని నిర్మించనున్నారు. 500 బెడ్లతో ఇంటెన్సివ్ కేర్ యూనిట్.. 30 స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ వైద్య విభాగాలు.. అధునాతన వసతులతో 41 ఆపరేషన్ థియేటర్లు.. అలాగే, అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కూడిన అవయవ మార్పిడి శస్త్ర చికిత్సల విభాగం కూడా ఏర్పాటు చేయనున్నారు. దీంతో పాటు ఆస్పత్రికి అనుబంధంగా డెంటల్, నర్సింగ్, ఫిజియోథెరపీ కాలేజీలను.. 750 సీట్ల కెపాసిటీతో భారీ ఆడిటోరియం నిర్మించనున్నారు. విద్యార్థులు, స్టాఫ్ కోసం రెసిడెన్షియల్, ప్లే జోన్లు.. పేషెంట్ అటెండర్లకు నిత్యన్నదానం కోసం ధర్మశాలను కూడా నిర్మించేలా ప్లాన్ చేస్తుంది ప్రభుత్వం. 2 వేల కార్లు, వెయ్యి బైక్‌లకు సరిపడా అండర్‌గ్రౌండ్ పార్కింగ్ ఫెసిలిటీతో పాటు నలువైపులా విశాలమైన రోడ్లు, ఆహ్లాదకర వాతావరణం ఉండేలా ప్రణాళిక సిద్ధం చేశారు.
ప్రభుత్వం రూ.3కోట్ల మంది మహిళలను లక్షాధికారులను చేస్తుంది
మహిళలకు ఆర్థిక సాధికారత చేకూర్చడానికి ప్రభుత్వం లఖ్పతి దీదీ యోజన ప్రారంభించబడింది. దీని ద్వారా ప్రభుత్వం మహిళలకు ఆర్థికంగా మద్దతు ఇస్తుంది. 3 కోట్ల మంది మహిళలను లక్షాధికారులుగా చేసే ప్రభుత్వం పథకం కింద, లక్షల రూపాయల విలువైన రుణాలు వడ్డీ లేకుండా ఇవ్వబడతాయి. ఈ పథకం స్వయం సహాయక బృందానికి సంబంధించినది. ఈ గుంపులో ఎక్కువగా మహిళలు ఉంటారు. స్వయం సహాయక సంఘాలలో బ్యాంక్ దీదీ, అంగన్వాడీ దీదీ, మెడిసిన్ దీదీ ఉన్నాయి. లఖ్పతి దీదీ యోజన అనేది నైపుణ్యాభివృద్ధి శిక్షణా కార్యక్రమం. దీని ద్వారా దేశంలోని సోదరీమణులందరికీ నైపుణ్య శిక్షణ ఇవ్వబడుతుంది. తద్వారా వారు స్వయంగా డబ్బు సంపాదించగలరు. లఖ్పతి దీదీ యోజన 15 ఆగస్టు 2023న ప్రారంభించారు. దేశంలోని మహిళలను స్వతంత్రులుగా, ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఈ పథకం ప్రారంభించారు. ఈ పథకంలో మహిళలు తమ సొంత వ్యాపారాన్ని ప్రారంభించడానికి శిక్షణ పొందుతారు.
బడ్జెట్ సమావేశానికి ముందు లక్ష్మీ దేవిని గుర్తు చేసిన ప్రధాని మోదీ
బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్ భవనానికి చేరుకున్నారు. పాత్రికేయులను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ, సంపదకు దేవత అయిన లక్ష్మీదేవిని స్మరించుకున్నారు. ఇది శతాబ్దాల నాటి సంప్రదాయమని అన్నారు. శ్రేయస్సు, జ్ఞానం ఇచ్చే లక్ష్మీ దేవిని నేను ప్రార్థిస్తున్నాను అని ఆయన అన్నారు. దేశంలోని ప్రతి పేద, మధ్యతరగతి వ్యక్తిపై లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీస్సులు ఉండాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. గణతంత్రం ఏర్పడి 75 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఇది దేశంలోని ప్రతి పౌరుడికి అత్యంత గర్వకారణమైన క్షణం. దేశ ప్రజలు నాకు ముఖ్యమైన బాధ్యతను మూడోసారి అప్పగించారని మోదీ అన్నారు. ఇది మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టనున్న తొలి పూర్తి స్థాయి బడ్జెట్ అని ప్రధాని మోదీ అన్నారు. మిషన్ మోడ్‌లో పనిచేయడానికి తన నిబద్ధతను వ్యక్తం చేస్తూ, మహిళా శక్తి గర్వాన్ని స్థాపించాలని ఆయన అన్నారు. ఈ సమావేశాలు అభివృద్ధి చెందిన భారతదేశానికి కొత్త శక్తిని ఇస్తాయని ప్రధాని మోదీ అన్నారు. భారతదేశం బలం ప్రజాస్వామ్య ప్రపంచంలో దానిని ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పిస్తుంది. 2047 లో దేశం తన 100 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకునే సమయంలో దేశం తీసుకున్న అభివృద్ధి చెందిన భారతదేశం సంకల్పానికి ఈ బడ్జెట్ విశ్వాసాన్ని సృష్టిస్తుందని నేను నమ్మకంగా చెప్పగలనని మోదీ అన్నారు. దేశం 100 సంవత్సరాల స్వాతంత్ర్య వేడుకలు జరుపుకునేటప్పుడు అది అభివృద్ధి చెందినదిగా ఉంటుందన్నారు.
డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన టీమిండియా ప్లేయర్ దీప్తి శర్మ
భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ క్రికెటర్ దీప్తి శర్మ క్రీడల్లో భారతదేశానికి చేసిన సేవలకుగాను ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్‌లో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP)గా నియమితులయ్యారు. దింతో డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన రెండో భారత క్రికెటర్‌గా దీప్తి శర్మ నిలిచింది. కొద్ది రోజుల క్రితమే ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ తెలంగాణలో డీఎస్పీగా నియమితులైన సంగతి తెలిసిందే. టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ ఒక క్రికెటర్‌గా దేశానికి ఆమె చేసిన కృషికి జనవరి 27న ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ జిల్లాలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP)గా నియమితులయ్యారు. ఐసీసీ మహిళల వన్డే, టి20 ఇంటర్నేషనల్ టీమ్‌లలో ఎంపికైన దీప్తి జనవరి 29, బుధవారం నాడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వార్తను పంచుకున్నారు. తనకు కల్పించిన గౌరవానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది. దీప్తి శర్మ ఖాకీ యూనిఫాం ధరించిన కొన్ని చిత్రాలను పంచుకుంటూ, తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో పోటోలను షేర్ చేస్తూ.. “ఈ గొప్ప మైలురాయిని సాధించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు. నా కుటుంబానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాని.. వారి మద్దతు, ఆశీర్వాదాలు నాకు ప్రేరణగా నిలిచాయని అన్నారు. ఈ అవకాసాన్ని ఇచ్చిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి కూడా నా కృతజ్ఞతలు అంటూ తెలిపింది. ఉత్తరప్రదేశ్ పోలీస్‌లో డీఎస్పీగా ఈ కొత్త బాధ్యతను స్వీకరిస్తూ.. నా విధులను నిబద్ధతతో నిర్వహిస్తూ, నిజాయితీతో సేవ చేయడానికి పూర్తిగా అంకితం అవుతానని రాసుకొచ్చింది.
సింగిల్ డిజిట్‌కే కింగ్ కోహ్లీ ఔట్.. స్టేడియం వీడుతున్న ఫాన్స్!
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఢిల్లీ అభిమానులకు తీవ్రంగా నిరాశపరిచాడు. రంజీ ట్రోఫీ 2025లో భాగంగా రైల్వేస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ తరఫున బరిలోకి దిగిన కింగ్.. సింగిల్ డిజిట్ (6)కే పెవిలియన్‌కు చేరాడు. ఢిల్లీ తొలి ఇన్నింగ్స్‌లో రైల్వేస్ బౌలర్ హరీష్ సంగ్వాన్ బౌలింగ్‌లో బోల్డ్ అయ్యాడు. దాంతో విరాట్ ఆటను చూద్దామని వచ్చిన అభిమానులు నిరాశగా అరుణ్ జైట్లీ స్టేడియంను వీడుతున్నారు. మరోవైపు విరాట్ కూడా అసహనంతో పెవిలియన్‌కు చేరాడు. ఇందుకు సబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. విరాట్ కోహ్లీ 13 ఏళ్ల తర్వాత దేశవాళీ క్రికెట్ ఆడాడు. చివరిసారిగా 2012లో ఉత్తరప్రదేశ్‌తో ఘజియాబాద్‌లో రంజీ మ్యాచ్ ఆడాడు. ఢిల్లీ తరఫున 23 మ్యాచ్‌ల్లో 50.77 సగటుతో 1574 పరుగులు చేశాడు. రంజీ ట్రోఫీలో విరాట్ 5 సెంచరీలు చేశాడు. 6 పరుగులకే అవుట్ అవ్వడంతో దేశవాళీ క్రికెట్ బరిలోకి దిగి విఫలమైన స్టార్ బ్యాటర్ల జాబితాలో కోహ్లీ చేరిపోయాడు. రౌండ్ మ్యాచుల్లో రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్ నిరాశపర్చారు. ప్రస్తుతం ఢిల్లీ 35 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. క్రీజులో ఆయుష్ బదోని (25), సుమిత్ మాథుర్ (17) ఉన్నారు. రైల్వేస్ తొలి ఇన్నింగ్స్‌లో 241 పరుగులు చేసింది.
మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..చిరు సినిమాకు అనిరుధ్ ఫిక్స్
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘విశ్వంభర’ అనే సినిమా చేస్తున్నారు. బింబిసార చిత్ర దర్శకుడు వశిష్ట ఈ సినిమాను విజువల్ వండర్‌గా, సోషియో పాంటసీ డ్రామాగా ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నాడు. ఆస్కార్ విన్నర్ కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. త్రిష హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం సమ్మర్లో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత మెగాస్టార్ సాలిడ్ లైనప్ సెట్ చేసుకున్నారు. ఊహించని విధంగా దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో ఓ సినిమా అనౌన్స్ చేశారు. ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ పేరు గత కొద్ది రోజులుగా వినిపిస్తోంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఇప్పుడు అనిరుధ్ దాదాపు లాక్ అయ్యినట్టుగా తెలుస్తోంది. మెగాస్టార్‌కి అనిరుధ్ ఇచ్చే ఎలివేషన్ మామూలుగా ఉండదని చెప్పడంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. ఇప్పుడున్న యంగ్ మ్యూజిక్ డైరెక్టర్స్‌లలో అనిరుధ్ హవా నడుస్తోంది. ఒక్కో సినిమాకు అందరికంటే ఎక్కువ పారితోషికం తీసుకుంటూ దూసుకుపోతున్నాడు. తెలుగులో చివరగా దేవర సినిమాతో అదరగొట్టాడు అనిరుధ్. ఈ సినిమాకు ఆయన ఇచ్చిన బీజిఎం హైలెట్‌గా నిలిచింది. గతంలో విక్రమ్, జైలర్ సినిమాలను తన బీజిఎంతో నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లాడు అనిరుధ్. ప్రస్తుతం తెలుగులో విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి సినిమా కోసం పని చేస్తున్నాడు. త్వరలో ఇందుకు సంబంధించి త్వరలో అధికారక ప్రకటన రానుంది.
15 ఏళ్లుగా అతని ప్రేమిస్తున్నాను..విశాల్ తో లవ్‌ట్రాక్ కి ముగింపు పలికిన అభినయ
ఎంత ట్యాలెంట్ ఉన్నప్పటికి.. కొంత మంది నటినటులు గుర్తింపు కోసం చాలా కష్టపడుతున్నారు. కానీ నటి అభినయ మాత్రం అనతి కాలంలోనే మంచి క్రేజ్ సంపాదించుకుంది. పుట్టుకతోనే ఆమె మూగ, చెవుడు. అయినప్పటికీ.. నటి కావాలన్న తన కోరికను ధృడ సంకల్పముతో నెరవేర్చుకుంది. తండ్రి కూడా నటుడే అవడం ఆమెకు కొంతమేర కలిసొచ్చింది. తమిళనాడుకు చెందిన అమ్మాయే అయినప్పటికీ, చూడటానికి చక్కగా ఉండే అభినయ తెలుగు సినిమాలతోనే మంచి పాపులారిటీ తెచ్చుకుంది. ఇక మూవీస్ విషయం పక్కన పెడితే కొద్ది రోజులుగా హీరో విశాల్ తో అభినయ రిలేషన్షిప్లో ఉన్నట్లు వర్తులు వినపడుతూనే ఉన్నాయి. చాలా సార్లు ఈ అమ్మడు మా మధ్య అలాంటిదేం లేదు అని క్లారిటీ ఇచ్చిన కూడా పుకార్లు అగడం లేదు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గోన ఈ ముద్దుగుమ్మ ఈ రూమర్స్ కి చెక్ పెట్టింది.. ‘విశాల్ నా అభిమాన నటుడు. అతన్ని చూసి చాలా నేర్చుకున్నాను. కానీ మా ఇద్దరి గురించి వస్తున్న ఈ వార్తలు వింటుంటే నాకు చాలా బాధ కలిగా ఉంది. ఇందులో ఎంత మాత్రం నిజం లేదు, విశాల్ నాకు స్నేహితుడు మాత్రమే. నిజానికి నేను 15 ఏళ్లుగా నాతో కలిసి చదువుకున్న స్నేహితుడిని ప్రేమిస్తున్నాను, త్వరలో అతని పెళ్లి చేసుకుంటాను’ అంటూ తన సైన్ లాంగ్వేజ్ తో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది అభినయ. కానీ ఆమె ప్రేమిస్తున్న అబ్బాయ్ ఎవరు అన్నది మాత్రం చెప్పలేదు. ఏదేమైతేనేం మొత్తానికి కథ సమాప్తం అయ్యింది. విశాల్ తో లవ్‌ట్రాక్ అనే రూమర్స్ కి చెక్ పడింది.