ఆర్టీసీలో మహిళల ఉచిత బస్సు ప్రయాణం పథకానికి పేరు ఖరారు
ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం.. రాష్ట్రంలోని మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేస్తోంది.. ఇప్పటికే ఆగస్టు 15వ తేదీ నుంచి ఈ స్కీమ్ అమలు చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు.. అయితే, ఈ పథకంలో మరో ముందడుగు పడినట్టు అయ్యింది.. ఆర్టీసీలో మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి స్త్రీ శక్తి అని పేరు పెట్టారు. మహిళలకు జీరో ఫేర్ టికెట్ అందిస్తారు. టికెట్ పై స్త్రీ శక్తి అని ముద్రిస్తారు. ప్రస్తుతం కండక్టర్లకు స్త్రీ శక్తి టికెట్ పై శిక్షణ ఇస్తున్నారు.. రాష్ట్ర మంతా యూనిట్ గా చేసుకుని ఉచిత ప్రయాణం మహిళలకు ఇవ్వాలనే అలోచన లో ప్రభుత్వం ఉంది.. అయితే, ఈ విషయం పై ఇంకా పూర్తి స్థాయిలో స్పష్టత ఇవ్వలేదు.. వచ్చే ఏపీ కేబినెట్ సమావేశంలో చర్చించనుంది ప్రభుత్వం. ఆగస్టు 15వ తేదీ నుంచి ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం అమలుకానున్న విషయం విదితమే..
రాజమండ్రి సెంట్రల్ జైలుపై డ్రోన్ కలకలం..
రాజమండ్రి సెంట్రల్ జైలుపై డ్రోన్ కలకలం సృష్టించింది.. సెంట్రల్ జైలు సమీపంలోని ఒక అపార్ట్‌మెంట్ నుంచి గుర్తు తెలియని వ్యక్తులు డ్రోన్ ఎగురవేశారు. వరుసగా రెండు రోజులపాటు సెంట్రల్ జైలు పైకి డ్రోన్ రావడంతో జైలు సూపరింటెండెంట్ రాహుల్ అప్రమత్తమై.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. డ్రోన్ ప్రయోగించినవారిని గుర్తించేందుకు జిల్లా ఎస్పీ నర్సింహ కిషోర్ ప్రత్యేక దర్యాప్తు బృందాలు నియమించారు. ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టిస్తున్న ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ మిథున్ రెడ్డి.. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌ఖైదీగా ఉన్నారు.. ఈ సమయంలో ఉద్దేశపూర్వకంగా డ్రోన్ ఎగరవేసినట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా, సెంట్రల్ జైలులో ఉన్న ఎంపీ మిథున్‌రెడ్డిని.. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులతో పాటు పలువురు వైసీపీ ప్రజాప్రతినిధులు ములాఖత్‌లో కలుస్తూ వస్తున్నారు.. కానీ, ఈ సమయంలో.. అది కూడా వరుసగా రెండు రోజుల పాటు సెంట్రల్ జైలు పైకి డ్రోన్ రావడం తీవ్ర కలకలం రేపుతోంది..
ఏపీపీఎస్సీలో కీలక సంస్కరణలు.. ఇక, వేగంగా నియామకాలు..
ప్రత్యక్ష ఉద్యోగ నియామకల్లో స్క్రీనింగ్ పరీక్ష నిర్వహణకు అనుసరిస్తోన్న విధానంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) కీలక సంస్కరణలు తీసుకొచ్చింది..అభ్యర్థుల సంఖ్య 25 వేలు మించినప్పుడు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించే విధానాన్ని రద్దు చేసింది ఏపీపీఎస్సీ… ఉద్యోగాల ఖాళీల సంఖ్య కంటే అభ్యర్థుల సంఖ్య 200 రెట్లు మించినప్పుడే ఇకపై స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి ఏపీపీఎస్సీ చేసిన ప్రతిపాదనలను ఆమోదిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో వేగంగా ఉద్యోగాల నియామక ప్రక్రియ చేపట్టేందుకు ఏపీపీఎస్సీకి వెసులుబాటు కలగనుంది. ప్రతి ఉద్యోగానికి ప్రిలిమ్స్, మెయిన్స్ రెండు పరీక్షలు రాయాల్సిన అవసరం ఉండదు. తక్కువ సమయంలో ఎక్కువ ఉద్యోగ నియామకాలు చేసే అవకాశం నియామక సంస్థకు లభిస్తుంది. కొత్త విధానంతో నిరుద్యోగులకు ప్రయోజనం కలగనుంది…
నెల్లూరు చేరుకున్న జగన్.. హరిత హోటల్ దగ్గర ఉద్రిక్తత..
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు చేరుకున్నారు.. హెలిప్యాడ్ వద్ద వైఎస్ జగన్‌కు స్వాగతం పలికారు వైసీపీ ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు.. ఇక, నెల్లూరు జైలులో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని మొదట పరామర్శించనున్న జగన్.. ఆ తర్వాత మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటికి వెళ్లి పరామర్శించనున్నారు.. అయితే, జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా పర్యటన నేపథ్యంలో ఏపీ టూరిజం హరిత హోటల్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని స్వాగతించేందుకు.. మెయిన్ రోడ్డుపైకి వచ్చారు ప్రసన్నకుమార్ రెడ్డి.. వందలాది ప్రజలతో వచ్చిన ప్రసన్నను అడ్డుకున్నారు పోలీసులు.. జై జగన్.. జై ప్రసన్న కుమార్ రెడ్డి.. జగన్, ప్రసన్న నాయకత్వం వర్ధిల్లాలి.. అంటూ నినాదాలతో హోరెత్తించారు యువకులు. దీంతో, ట్రాఫిక్ కి అంతరాయం కలిగింది.. అప్రమత్తమైన పోలీసులు, వారిని అక్కడి నుంచి వెళ్లగొట్టే ప్రయత్నం చేశారు.. నల్లపురెడ్డి కుమార్ రెడ్డిని పోలీసులు అడ్డుకోవడంతో.. కార్యకర్తలు దూసుకురాగా.. వైసీపీ కార్యకర్తల మీద లాఠిఛార్జ్ చేశారు పోలీసులు.. దీంతో, రోడ్డుమీద బైఠాయించారు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి.. తనతో సహా వైసీపీ శ్రేణులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడంపై నిరసనకు దిగారు.. రోడ్డుపై పోలీసుల ఆదేశాల ప్రకారమే తాము నడుచుకున్నా పోలీసులు లాఠీఛార్జ్ చేశారంటూ ప్రసన్న కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు.. ఎస్పీ వచ్చి క్షమాపణ చెప్పే వరకు రోడ్డుపై నుంచి లేచేది లేదంటూ బైఠాయించారు..
తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..
దేశ మంతా ఉత్కంఠతతో ఎదురుచూస్తున్న పార్టీ ఫిరాయింపుల కేసులో తీర్పు వెలువడింది. తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. చీఫ్ జస్టిస్ బి ఆర్ గవాయ్ ధర్మాసనం తీర్పు ఇచ్చింది. మూడు నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. న్యాయస్థానమే వేటు వేయాలన్న పిటిషనర్ల విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది.. ఏళ్ల తరబడి ఫిరాయింపు పిటిషన్లను పెండింగ్‌లో ఉంచడం సరికాదు.. మూడు నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
సృష్టి ఫెర్టిలిటీ కేసు.. కల్యాణి రిమాండ్ రిపోర్ట్లో కీలక అంశాలు
సృష్టి ఫెర్టిలిటీ కేసులో నిందితురాలు కల్యాణి రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. సృష్టి ఫెర్టిలిటీ మోసాల్లో మేనేజర్ కల్యాణి కీ రోల్ పోషించినట్లు సమాచారం. అక్రమాల ద్వారా వచ్చిన ప్రాఫిట్ ను కల్పనకు డాక్టర్ నమ్రతా షేర్ చేసినట్లు గుర్తించారు. వైజాగ్ లో ని సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ లో 2012లో ANM నర్స్ గా చేరిన కల్యాణి సేవలను గుర్తించి, 2020లో వైజాగ్ బ్రాంచ్ కి మేనేజర్ గా డాక్టర్ నమ్రతా అపాయింట్ చేసింది. అప్పటి నుంచి సృష్టి ఫెర్టిలిటీ లో మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న కల్యాణి.. నమ్రతా చెప్పింది చేసినందుకు కల్పనకు భారీ విల్లా గిఫ్ట్ గా ఇచ్చింది.. వైజాగ్ లోని ocean view apartment ను వినియోగించుకుంటున్న కల్యాణి.. ఆర్థిక ఇబ్బందులు కారణంగా, నమ్రతా చేసే మోసాలకు సహకరించింది.. సృష్టి ఫెర్టిలిటీ లావాదేవీల వ్యవహారాలు మొత్తం కల్యాణి చూసుకున్నట్లు రిమాండ్ రిపోర్టులో తేలింది.
మాలేగావ్ పేలుళ్ల కేసులో సంచలన తీర్పు
2008 మాలేగావ్ పేలుళ్ల కేసులో ముంబైలోని ప్రత్యేక కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ప్రజ్ఞా ఠాకూర్‌ను నిర్దోషిగా న్యాయస్థానం పేర్కొంది. ఈ కేసులో అనుమానం సరిపోదని కోర్టు తెలిపింది. దీంతో ఈ కేసులో బీజేపీ మాజీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్, మాజీ సైనిక అధికారి ప్రసాద్ శ్రీకాంత్ పురోహిత్ సహా ఏడుగురు నిందితులను నిర్దోషులుగా ప్రకటించింది. నిందితులకు వ్యతిరేకంగా సాక్ష్యాలు లేవని.. పేలుడులో వాడిన బైక్ ప్రజ్ఞాకు చెందినదిగా నిరూపించలేకపోయారని కోర్టు అభిప్రాయపడింది.
భారత్, రష్యాపై డొనాల్డ్ ట్రంప్ ఫైర్.. టారిఫ్స్కు సిద్ధం కావాలని హెచ్చరిక!
భారత్ దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 25 శాతం టారీఫ్స్ విధిస్తున్నట్లు ప్రకటించారు. అయితే, రష్యా నుంచి భారీగా చమురు కొనుగోలు చేయడమే దీనికి ప్రధాన కారణమని కూడా చెప్పారు. తాజాగా రష్యా, భారత్‌లను ఉద్దేశిస్తూ ఆయన మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. రష్యాతో భారత్ ఎలాంటి వాణిజ్య ఒప్పందం చేసుకున్నా తనకు సంబంధం లేదని గురువారం ట్రూత్ సోషల్‌లో ఓ పోస్టు పెట్టారు. కానీ, వారి ఆర్థిక వ్యవస్థను మరింత పతనం చేసుకుంటున్నాయని తెలిపారు. తాము, భారత్ తో చాలా తక్కువ వ్యాపారం చేస్తున్నాం.. ఎందుకంటే అత్యధికంగా సుంకాలు విధిస్తుందని ఆరోపించారు. ఇక, రష్యా, యూఎస్‌లు కలిసి ఎలాంటి వ్యాపారం చేయట్లేదని డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు.
భారత్ – ఇంగ్లాండ్ మ్యాచ్కి వర్షం అంతరాయం.. తొలి రోజు రద్దయ్యే ఛాన్స్..?
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో భారత్‌కు ఐదో టెస్టు అత్యంత కీలకంగా మారిపోయింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే సిరీస్‌ను సమం చేసే అవకాశం ఉంది. కానీ, మ్యాచ్ ఓడినా, డ్రా అయినా సిరీస్‌ను కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో చివరి మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉండటం టీమిండియాను ఆందోళనకు గురి చేస్తుంది. ఐదో టెస్టు లండన్‌లోని ఓవల్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్‌కు రిషభ్ పంత్, బెన్ స్టోక్స్ దూరం అయ్యారు. జస్‌ప్రీత్ బుమ్రా విశ్రాంతి తీసుకునే ఛాన్స్ ఉంది. వాతావరణ పరిస్థితులు కూడా టీమ్ ప్లానింగ్‌పై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది. పిచ్ బౌలింగ్‌కు అనుకూలంగా మారే అవకాశం ఎక్కువగా ఉండటంతో టాస్ కీలక పాత్ర పోషించనుంది.
రూ.5 కోట్లు మోసం – తమిళ నటుడు శ్రీనివాసన్ అరెస్ట్
తమిళ సినీ పరిశ్రమలో “పవర్ స్టార్”గా గుర్తింపు పొందిన ఎస్. శ్రీనివాసన్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఢిల్లీకి చెందిన ఓ సంస్థను మోసం చేసిన ఆరోపణలపై ఆయనను ఢిల్లీ పోలీసులు చెన్నైలో అరెస్ట్ చేశారు. సమాచారం ప్రకారం.. 2010లో ‘బ్లూ కోస్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ లిమిటెడ్’ అనే సంస్థకు రూ.1000 కోట్లు లోన్ ఇప్పిస్తానని శ్రీనివాసన్ హామీ ఇచ్చాడట. దీనికి బదులుగా.. వారి దగ్గర నుంచి రూ.5 కోట్లు అడ్వాన్స్‌గా తీసుకున్నాడు. నెల రోజుల్లో లోన్ వస్తుందని రాకపోతే డబ్బులు తిరిగిఇస్తానని హామీ ఇచ్చాడు. అయితే నెల కంటే ఎక్కువ రోజులు గడుస్తున్న లోన్ మంజూరు కాకపోవడంతో మోసపోయామని గుర్తించిన సంస్థ యాజమాన్యం పోలీసులను ఆశ్రయించింది. అయితే ఈ కేసుపై విచారణ చేపట్టిన పోలీసులు.. దర్యాప్తులో భాగంగా రూ. 5 కోట్లు నేరుగా శ్రీనివాసన్, అతని భార్య బ్యాంకు ఖాతాలకు బదిలీ అయినట్లు గుర్తించారు. అంతేకాదు ఈ డబ్బుని అతడి వ్యక్తిగత అవసరాల కోసంతో పాటు సినిమాల నిర్మాణానికి ఉపయోగించినట్లు తేలింది. ఇక ఈ కేసులో దర్యాప్తునకు సహకరించకుండా, విచారణకు హాజరుకాకుండా 2018 నుంచి శ్రీనివాసన్ తప్పించుకుని తీరుగుతున్నాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దీంతో కోర్టు అతడిని నేరస్థుడిగా ప్రకటించింది. తాజా సమాచారం ప్రకారం అతడు చెన్నైలో ఉన్నట్లు తెలవడంతో అతడిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకుని తదుపరి విచారణ నిమిత్తం ఢిల్లీకి తరలించారు.
‘డెకాయిట్’ టీమ్ ప్లాన్ అదుర్స్.. మృణాల్‌కు ఎమోషనల్ సర్‌ప్రైజ్
తెలుగు ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న మృణాల్ ఠాకూర్, ప్రస్తుతం అడివి శేష్ సరసన ‘డెకాయిట్’ అనే చిత్రంలో నటిస్తు మళ్లీ టాలీవుడ్‌ను పలకరించనున్నారు. ఆగస్టు 1న తన పుట్టినరోజును పురస్కరించుకుని, చిత్రబృందం ఆమెకు అద్భుతమైన ప్రీ బర్త్‌డే సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఆమెకు తెలియకుండా తీసుకొచ్చిన కేక్‌తో సెట్స్‌లో సర్‌ప్రైజ్ వేడుక నిర్వహించగా, మృణాల్ ఎంతో భావోద్వేగంగా స్పందించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సందర్భంగా తలుపు తట్టిన టీమ్ సభ్యులు “హ్యాపీ బర్త్‌డే సరస్వతి” అంటూ శుభాకాంక్షలు తెలపడంతో సినిమాలో ఆమె పాత్ర పేరు ‘సరస్వతి’ అని తెలియజేసింది. షానీల్ డియో దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. విభిన్న ప్రేమ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా డిసెంబర్ 25న విడుదల కానుంది. మృణాల్‌కి ఇది కేవలం బర్త్‌డే కాదు, కెరీర్‌లో మరో గుర్తుండిపోయే మధురమైన రోజు.