నకిలీ మద్యం తయారీ కేసులో మరో ట్విస్ట్.. ఆ కేసులోనూ నిందితులుగా జోగి బ్రదర్స్..
నకిలీ మద్యం తయారీ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.. ములకలచెరువు నకిలీ మద్యం తయారీ కేసులోనూ మాజీ మంత్రి జోగి రమేష్.. ఆయన సోదరుడు జోగి రాము.. అంటే జోగి బ్రదర్స్‌ను నిందితుల జాబితాలో చేర్చినట్లు పోలీసులు వెల్లడించారు. ఇందులో భాగంగా, జోగి రమేష్, జోగి రాము పేర్లపై పీటీ వారెంట్ దాఖలు చేయగా, కోర్టు దీనికి అనుమతి ఇచ్చింది. తాజాగా పీటీ వారెంట్ అమల్లోకి రావడంతో, పోలీసులు ఈరోజు జోగి రమేష్ మరియు జోగి రామును ములకలచెరువు కేసులో స్థానిక కోర్టు ముందు హాజరుపరచనున్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న మరికొంతమందిపై కూడా విచారణ జరుగుతోంది. నకిలీ మద్యం తయారీ, పంపిణీ, ఆర్థిక లావాదేవీలు సహా ఇతర అంశాలపై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ పరిణామంతో నకిలీ మద్యం కేసు మళ్లీ రాజకీయ మరియు దర్యాప్తు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు, నకిలీ మద్యం తయారీ కేసులో జోగి బ్రదర్స్ నలుగురు కుమారులకు సోమవారం రోజు నోటీసులు జారీ చేసిన ఎక్సైజ్ శాఖ అధికారులు.. రేపు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్న విషయం విదితమే.. ఇప్పటికే నకిలీ మద్యం తయారీ కేసులో జోగి బ్రదర్స్‌ను కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించిన ఎక్సైజ్ అధికారులు.. ఆ తర్వాత వారి కుమారులకు నోటీసులు జారీ చేయడం చర్చగా మారింది..
అమరావతిలో క్వాంటం వ్యాలీకి 50 ఎకరాల భూమి కేటాయింపు..
నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో క్వాంటం టెక్నాలజీ రంగంలో కీలక అడుగు పడింది. క్వాంటం వ్యాలీ అభివృద్ధికి ప్రభుత్వం 50 ఎకరాల భూమి కేటాయించింది. ఇందులో భాగంగా, రెండు ఎకరాల్లో అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. సీఆర్డీఏ కార్యాలయానికి సమీపంలోని సీడ్ యాక్సెస్ రోడ్ పక్కనే భవన నిర్మాణం కోసం భూమి కేటాయింపు పూర్తయింది. ఈ నిర్మాణ పనులకు సంబంధించిన టెండర్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఈ నెల 6తో టెండర్ల దాఖలు గడువు ముగియనుంది. అయితే, శాశ్వత భవనం నిర్మాణం పూర్తయ్యే వరకు, రాజధాని పరిధిలోని ఒక ప్రైవేట్ యూనివర్శిటీలో తాత్కాలిక క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అనంతరం సెంటర్‌ను రాయపూడిలో నిర్మిస్తున్న శాశ్వత భవనానికి తరలించనున్నారు. ఇక, ప్రతిపాదిత క్వాంటం భవనం గ్రీన్ బిల్డింగ్ రూపకల్పనతో Z+1 ఫ్లోర్ డిజైన్‌లో నిర్మించనున్నారు. మొత్తం నిర్మాణ విస్తీర్ణం 4,201 చదరపు మీటర్లు కాగా.. గ్రౌండ్ ఫ్లోర్: 1,990 చద.మీ. ఫస్ట్ ఫ్లోర్: 1,996 చద.మీ.. బేస్మెంట్: 210 చద.మీ. అదనంగా: హెడ్‌రూమ్ 109 చద.మీ., డెక్ ఏరియా 130 చద.మీటర్లుగా ఉండనుంది..
శ్రీశైలంలో రివాల్వర్ కలకలం
ప్రముఖ శైవక్షేత్రంలో ఓ రివాల్వర్ కలకలం సృష్టించింది.. శ్రీశైలం టోల్గేట్ వద్ద మంగళవారం ఉదయం జరిగిన తనిఖీల్లో రివాల్వర్ బయటపడటంతో కొద్ది సేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది వాహనాలను తనిఖీ చేస్తుండగా ఒక వ్యక్తి దగ్గర 9 ఎమ్ఎమ్ పిస్టల్ రివాల్వర్ ఉండటం గమనించారు. వెంటనే వారు అక్కడే విధుల్లో ఉన్న పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో, పోలీసులు రివాల్వర్ కలిగి ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. తనను మధ్యప్రదేశ్‌కు చెందిన సైబర్ క్రైమ్ శాఖలో ఎస్ఐగా పనిచేస్తున్నానని ఆ వ్యక్తి తెలిపాడు. అతని వద్ద ఉన్న రివాల్వర్ లైసెన్స్డ్ ఆయుధమని, అధికారిక కారణాలతో ప్రయాణిస్తున్నానని తెలిపాడు. ఇక, ఈ నేపథ్యంలో శ్రీశైలం సీఐ ప్రసాద్ రావు ఆ వ్యక్తి వద్ద ఉన్న ఐడీ కార్డు, రివాల్వర్‌ను స్వాధీనం చేసుకుని దర్యాప్తు నిర్వహించారు. మధ్యప్రదేశ్ సైబర్ క్రైమ్ ఎస్పీతో సంప్రదించి ఆ వ్యక్తి వివరాలు నిర్ధారించుకున్నారు. విచారణలో అతను నిజంగానే మధ్యప్రదేశ్ సైబర్ క్రైమ్ విభాగంలో సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నట్లు తేలింది. దీంతో పోలీసులు అతని రివాల్వర్, ఐడీ కార్డులను తిరిగి అప్పగించారు. కొద్ది సేపు ఆందోళన కలిగించిన ఈ ఘటనలో ఆ రివాల్వర్ కలిగిఉన్న వ్యక్తి నిజంగానే పోలీసు అధికారి అని తేలడంతో.. ఆ రివాల్వర్ ఉత్కంఠ వీడినట్టు అయ్యింది.. దీంతో, భక్తులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
పెద్దిరెడ్డిని ఎదిరించి బయటకు వచ్చా.. ఇప్పుడు ఇంకో రెడ్డిని తెచ్చి నా మీద పెడుతారా..? చంద్రబాబు దగ్గరే తేల్చుకుంటా..
తన నియోజకవర్గంలో పెత్తందారి వ్యవస్థ ఎక్కువైంది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం.. సత్యవేడు నియోజకవర్గంలో పెత్తందారీ వ్యవహారం పెరిగిపోయిందని, తాను ఎమ్మెల్యేగా ఉన్నా తనకు గౌరవం లేకుండా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో అధికార పార్టీ నేతల ప్రవర్తనపై మండిపడ్డ ఆయన, త్వరలోనే ఈ వ్యవహారంపై సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. నియంత్రణ ధోరణి నాకిష్టం లేదు.. అందుకే పెద్దిరెడ్డిని ఎదిరించాను.. ఇప్పుడు మరొక రెడ్డిని తెచ్చి నామీద పెట్టాలా? అంటూ అదిమూలం అసహనం వ్యక్తం చేశారు. తనను పట్టించుకోకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించిన ఆయన.. చిన్నచిన్న విషయాలు సీఎం చంద్రబాబుకు కూడా తెలియడం లేదు..? ఈ వ్యవహారం మొత్తాన్ని సీఎం వద్ద వివరంగా చెబుతాను అన్నారు. ప్రోటోకాల్‌ను పట్టించుకోవడం లేదని, ఈ విషయంలో ఇప్పటికే ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేశానని ఆదిమూలం అన్నారు. నియోజకవర్గ కోఆర్డినేటర్ శంకర్ రెడ్డి ఎలా పెన్షన్లు ఇవ్వడానికి వెళ్తున్నాడు? పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనొచ్చు.. కానీ ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎలా పాల్గొంటారు?” అని ప్రశ్నించారు.
పవన్ కల్యాణ్‌కు తెలంగాణ మంత్రి కౌంటర్.. తలతిక్క మాటలు మానుకో..!
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పందంగా మారాయి.. గత వారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గంలో పర్యటించిన ఆయన.. కేశవదాసుపాలెం వద్ద శంకరగుప్తం, కేశనపల్లి డ్రెయిన్ నుంచి సముద్రపు నీరు పోటెత్తడం కారణంగా పాడైన కొబ్బరి పంటను పరిశీలించారు.. అయితే, ఈ సందర్భంగా పవన్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు తెలంగాణ మంత్రి వాకిటి శ్రీహరి.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.. లేదంటే భవిష్యత్‌లో తెలంగాణలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని హెచ్చరించారు.. ఇక, రెండు ప్రాంతాల మధ్య విద్వేషం పెంచే మాటలు సరికాదు అని పవన్ కల్యాణ్‌కు హితవు చెప్పారు వాకిటి శ్రీహరి.. పవన్ కల్యాణ్ తలతిక్క మాటలు మానుకోవాలి.. తెలంగాణలో వనరులు వాడుకుని.. ఈ స్థాయికి ఎదిగావు.. మైలేజ్ పొందాలంటే.. పనితనం చూపించు.. కానీ, ఇలా కాదు అని సూచించారు.. ఇప్పుడు పవన్ ఇలా మాట్లాడటం సరికాదు.. అన్నదమ్ముల్లా విడిపోయాం.. కలిసుందాం అని పిలుపునిచ్చారు తెలంగాణ మంత్రి వాకిటి శ్రీహరి.. కాగా, రాజోలు నియోజకవర్గ పర్యటనలో పవన్ కల్యా్ణ్ మాట్లాడుతూ.. పచ్చని కోనసీమకు దిష్టి తగిలిందని.. ఇక్కడ పచ్చని కొబ్బరి చెట్లను చూసే ప్రత్యేక రాష్ట్ర (తెలంగాణ) డిమాండ్ వచ్చిందేమో? అంటూ తెలంగాణ ఉద్యమానికి లింక్ చేసి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన విషయం విదితమే..
పవన్ క్షమాపణ చెప్పకపోతే.. ఒక్క సినిమా కూడా ఆడదు.. కోమటిరెడ్డి వార్నింగ్..
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన కోనసీమ దిష్టి వ్యాఖ్యలపై పొలిటికల్ దుమారమే రేగుతోంది.. పవన్ కల్యాణ్ కామెంట్లపై ఘాటుగా స్పందిస్తున్నారు తెలంగాణ నేతలు.. పవన్ క్షమాపణ చెప్పకపోతే తెలంగాణ ఒక్క సినిమా కూడా ఆడదంటూ వార్నింగ్ ఇచ్చారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. పవన్ కల్యాణ్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.. ఇక, పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు నన్ను బాధించాయి.. భేషరతుగా క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేశారు మంత్రి కోమటిరెడ్డి.. తెలంగాణ ప్రజల దిష్టి కాదు.. ఆంధ్రా పాలకుల వల్ల.. తెలంగాణ ప్రజలు ఫ్లోరైడ్ విషం తాగారని ఆవేదన వ్యక్తం చేశారు.. పవన్ కల్యాణ్ క్షమాపణ చెప్పకపోతే.. ఒక్క సినిమా కూడా ఆడదు అని వార్నింగ్ ఇచ్చారు.. సినిమా ఆటోగ్రాఫి మంత్రిగా చెబుతున్నా.. క్షమాపణ చెప్పక పోతే.. ఒక్క థియేటర్ లో కూడా సినిమా విడుదల కాదు మీది అని హెచ్చరించారు.. అయితే, చిరంజీవి సూపర్ స్టార్.. ఆయన మంచోడు.. కానీ, పవన్ కల్యాణ్‌కు రాజకీయ అనుభవం లేదు అనుకుంటా.. అందుకే అలా మాట్లాడుతున్నారు అని వ్యాఖ్యానించారు తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి..
పంచాయతీ ఎన్నికల వేళ ‘వరాల జల్లులు’.. ఇంటికి రూ.5 లక్షల బీమా, పెళ్లికి పుస్తె మెట్టెలు ఇంకా ఎన్నో..!
తెలంగాణలో పంచాయతీ ఎన్నికల సందడి కొనసాగుతుండగా.. గ్రామ సర్పంచ్ ఎన్నికలు మరింత రసవత్తరంగా మారాయి. అభ్యర్థులు ఓటర్లను ఆకర్షించేందుకు కొత్తరకపు హామీలతో ముందుకు రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. కొందరు అభ్యర్థులు ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి వరాల జల్లుల్లా పథకాలు ప్రకటిస్తుండగా.. మరికొందరు ఏకంగా బాండ్ పేపర్లపై హామీలతో ఓటర్లకు నమ్మకం కల్పిస్తున్నారు. ఈ వినూత్న పోకడలు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నాయి. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం కొత్తపేట గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి పనుల వనమ్మ నరసింహ యాదవ్ ప్రకటించిన మ్యానిఫెస్టో గ్రామంలో సంచలనాన్ని రేపుతోంది. గ్రామంలోని ప్రతి ఇంటికి రూ.5 లక్షల జీవిత బీమా చేయిస్తానన్న ఆయన హామీ అత్యంత ఆకర్షణీయమైనదిగా నిలిచింది. గ్రామంలో సుమారు 700 ఇళ్లు ఉండటంతో, దీనికి ఐదేళ్ల కాలానికి రూ.42.5 లక్షల ప్రీమియం అవుతుందని గ్రామస్థుల అంచనా. దీనితోపాటు ఆడబిడ్డ పెళ్లికి పుస్తె మెట్టెలు, అబ్బాయి వివాహానికి రూ.5,116 సహాయం, ఆడబిడ్డ పుట్టినప్పుడు రూ.5,000 ఫిక్స్డ్ డిపాజిట్ ప్రకటించడం ఆయన ప్రచారాన్ని మరింత ప్రత్యేకంగా మార్చాయి. ఇల్లు కట్టుకునే వారికి స్లాబ్ వేసే సమయంలో రూ.21,000 సహాయం, శస్త్రచికిత్స అవసరమైతే రూ.15,000 సాయం, దహన సంస్కారాలకు రూ.10,000 మంజూరు చేయనున్నట్లు తెలిపారు. అంతేకాదండోయ్.. గ్రామానికి ఉచిత అంబులెన్స్, నెలకోసారి మెడికల్ క్యాంపులు, గ్రంథాలయం ఏర్పాటు, వీధులన్నింటిలో సీసీ కెమెరాలు, అంత్యక్రియల కోసం ప్రత్యేక వైకుంఠ రథం అందుబాటులో ఉంచుతానని వెల్లడించారు. శివరాత్రి, శ్రీరామనవమి, మొహరం వంటి పండుగల సందర్భంగా అన్నదానం, రంజాన్ సమయంలో ఇఫ్తార్ విందు కూడా నిర్వహిస్తానని ప్రకటించడం ఆయన ప్రచారానికి మరింత ఊపు తెచ్చింది. ఇంకా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నోట్‌బుక్స్, బ్యాగులు, బూట్లను ఉచితంగా అందించడం, ఉన్నత విద్యకు ఆర్థిక సాయం కూడా ఆయన హామీల్లో భాగమయ్యాయి.
ప్రముఖ హోటళ్లపై ఐటీ పంజా.. ఆర్థిక లావాదేవీలపై ఆరా..!
హైదరాబాద్ మహానగరంలోని పలు ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లపై ఆదాయ పన్ను (ఐటీ) శాఖ చేపట్టిన దాడులు, విచారణలు మరింత ఉధృతంగా కొనసాగుతున్నాయి. ఆదాయపు పన్ను ఎగవేత, బ్లాక్ మనీ, హవాలా లావాదేవీల ఆరోపణలపై ఐటీ అధికారులు దృష్టి సారించారు. నవంబర్ 18న ప్రారంభమైన ఈ సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. పిస్తా హౌస్ (Pista House), షాగౌస్ (Shah Ghouse), మేహ్ ఫిల్ (Mehfil) వంటి ప్రముఖ రెస్టారెంట్ల యజమానుల ఇళ్లు, కార్యాలయాలు, ప్రధాన కార్యాలయాల్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో అధికారులు భారీ మొత్తంలో లెక్కలో లేని నగదుతో పాటు పలు కీలక డాక్యుమెంట్లను గుర్తించినట్లు సమాచారం. తాజా పరిణామాలలో భాగంగా.. వుడ్‌బ్రిడ్జ్ (Wood Bridge) హోటల్ యజమాని, బీఆర్ఎస్ నాయకుడు అయిన హర్షద్ అలీ ఖాన్ ను ఐటీ అధికారులు విచారిస్తున్నారు. సోమవారం ఉదయం నుంచి అర్థరాత్రి వరకు (డిసెంబర్ 2) ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించి, అనంతరం ఆయనను అదుపులోకి తీసుకుని విచారించారు. హర్షద్ అలీ ఖాన్‌ను విచారించిన ఐటీ అధికారులు, గతంలో దాడులు జరిగిన పిస్తా హౌస్ తోపాటు ఇతర హోటళ్లు, రెస్టారెంట్లతో ఆయనకు ఉన్న సంబంధాలు, ఆర్థిక లావాదేవీలపై ప్రధానంగా ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఈ హోటళ్లకు పరస్పరం లింకులు ఉన్నాయనే అనుమానంతో ఐటీ అధికారులు వారిపై కూడా దృష్టి సారించారు.
అసెంబ్లీ సమావేశాల వ్యూహాలపై చర్చించాం.. బ్రేక్‌ఫాస్ట్ తర్వాత సిద్ధరామయ్య క్లారిటీ
కర్ణాటకలో ప్రస్తుతం ‘పవర్ షేరింగ్’ వివాదం నడుస్తోంది. మొన్నటిదాకా హస్తిన వేదికగా చర్చలు నడవగా.. ప్రస్తుతం బెంగళూరులో బ్రేక్‌ఫాస్ట్ రాజకీయాలు నడుస్తున్నాయి. గత శనివారం సిద్ధరామయ్య ఇంట్లో డీకే.శివకుమార్ అల్పాహారం తీసుకోగా.. మంగళవారం డీకే.శివకుమార్ ఇంట్లో సిద్ధరామయ్య బ్రేక్‌ఫాస్ట్ చేశారు. అనంతరం సిద్ధరామయ్య మీడియాతో మాట్లాడారు. డిసెంబర్ 8 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయని.. ఈ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించినట్లుగా తెలిపారు. ఇక ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవని తేల్చి చెప్పారు. ఇద్దరం ఐక్యంగా ఉన్నట్లు పేర్కొన్నారు. కలిసి ప్రభుత్వాన్ని నడుపుతున్నట్లు స్పష్టం చేశారు. భవిష్యత్‌లో కూడా ఇలానే కలిసి ప్రభుత్వాన్ని నడుపుతామని చెప్పుకొచ్చారు. కర్ణాటక ఎమ్మెల్యేలందరూ ఐక్యంగా ఉన్నారని, ప్రతిపక్షాలను కలిసి ఎదుర్కొంటామని ముఖ్యమంత్రి అన్నారు. ఇక డీకే.శివకుమార్ ఇంట్లో నాటుకోడి చికెన్, ఇడ్లీలను సిద్ధరామయ్య తిన్నారు.
ఉగ్రవాది డానిష్ ఫోన్లో మాస్టర్ ప్లాన్! ఉమర్‌ను ఎలా డైరెక్షన్ చేశాడంటే..!
ఢిల్లీ కారు బ్లాస్ట్‌పై దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే అనేక కీలక విషయాలను దర్యాప్తు సంస్థలు రాబట్టాయి. ఇక ఢిల్లీ బ్లాస్ట్ వెనుక ఉన్న సహ కుట్రదారుడు జాసిర్ బిలాల్ వనీ అలియాస్ డానిష్‌ను నవంబర్ 17న పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ పేలుళ్ల వెనుక క్రియాశీల సహ-కుట్రదారుడిగా ఇతడేనని కనిపెట్టారు. అంతే కాకుండా దేశ వ్యాప్త పేలుళ్లకు కీలక సూత్రదారుడిగా భావిస్తున్నారు. డానిష్ డ్రోన్లు నిర్వహించడంలో స్పెషలిస్ట్. ఇజ్రాయెల్‌పై హమాస్ జరిపించినట్లుగా అదే తరహాలో డ్రోన్ దాడులు చేయాలని కుట్రపన్నినట్లుగా తేలింది. ఈ మేరకు డానిష్‌లో లభ్యమైన ఫొటోలను బట్టి అధికారులు అంచనాకు వచ్చారు. డానిష్ ఫోన్లో డిలీట్ అయిన ఫోల్డర్ నుంచి ఫొటోలు, వీడియోలను అధికారుల బృందం సేకరించింది. ఇందులో డ్రోన్లు, రాకెట్ లాంచర్లు డజన్ల కొద్ది చిత్రాలు, వీడియోలను గుర్తించారు. హమాస్ తరహాలోనే భారత్‌లోనూ దాడులు చేయాలని ప్లాన్ చేసినట్లుగా కనిపెట్టారు. డ్రోన్లలో పేలుడు పదార్థాలు ఎలా అమర్చాలో కూడా ఒక వీడియో మొబైల్లో ఉంది. వీడియోలన్నీ ఒక యాప్ ద్వారా సహచర కుట్రదారులకు పంపినట్లుగా కనుగొన్నారు. యాప్‌లో కొన్ని విదేశీ నెంబర్లు కూడా ఉన్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఇక ఉగ్రవాదులు 25 కిలోమీటర్ల వరకు ప్రయాణించగల మోడిఫైడ్ డ్రోన్లను కూడా తయారు చేసినట్లుగా దర్యాప్తులో తేలింది.
లాంగ్ లాంగ్ బ్రేక్ తర్వాత ఎంట్రీ.. చరిత్ర సృష్టించిన కేన్ మామ!
దాదాపు ఏడాది విరామం తర్వాత న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ టెస్ట్ క్రికెట్లోకి తిరిగి వచ్చాడు. ఈరోజు క్రైస్ట్‌చర్చ్ వేదికగా వెస్టిండీస్‌తో ప్రారంభమైన టెస్ట్‌లో మైదానంలో అడుగుపెట్టాడు. తన పునరాగమన మ్యాచ్‌లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో కేన్ అర్ధ సెంచరీ చేసి న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. కేన్ మామ చివరిసారిగా 2024 డిసెంబర్ 12-17 మధ్య హామిల్టన్‌లో టెస్ట్ మ్యాచ్ ఆడాడు. 353 రోజుల తర్వాత టెస్ట్ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. డెవాన్ కాన్వే డకౌట్ అయ్యాక న్యూజిలాండ్‌పై ఒత్తిడి పెరిగింది. ఈ సమయంలో విండీస్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ కేన్ విలియమ్సన్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. కఠినమైన పిచ్‌పై కౌంటర్ అటాక్ ఇన్నింగ్స్‌తో బ్లాక్‌క్యాప్స్‌కు అండగా నిలిచాడు. కివీస్ బ్యాటర్లు పెవిలియన్ బాట పట్టినా.. కేన్ మామ క్రీజులో నిలిచి విలువైన 52 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌తో వెస్టిండీస్‌పై టెస్టుల్లో 1000 పరుగులు పూర్తి చేసిన న్యూజిలాండ్ రెండో బ్యాటర్‌గా విలియమ్సన్ నిలిచాడు. ఈ జాబితాలో రాస్ టేలర్ అగ్ర స్థానంలో ఉన్నాడు. వెస్టిండీస్‌పై టేలర్ 1136 చేశాడు. ఈ హాఫ్ సెంచరీతో వెస్టిండీస్‌పై తన ఎనిమిదో ఫిఫ్టీని నమోదు చేశాడు. దాంతో నాథన్ ఆస్టెల్ రికార్డును సమం చేశాడు. టేలర్‌ను దాటి వెస్టిండీస్‌పై అత్యధిక ఫిఫ్టీ ప్లస్ ఇన్నింగ్స్ ఆడిన న్యూజిలాండ్ బ్యాటర్ల జాబితాలో కేన్ అగ్రస్థానానికి చేరాడు.
రాజాసాబ్ రన్ టైమ్ పై టెన్షన్ పడుతున్న ఫ్యాన్స్
రెబల్ స్టార్’ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాజాసాబ్’ సినిమాను.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్దికుమార్ కథానాయికలు కాగా.. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కీలక పాత్ర పోషించారు. 2026 సంక్రాంతి సందర్భంగా జనవరి 9న రాజాసాబ్ ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా రిలీజ్‌కు సమయం దగ్గరపడుతుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ మొదలెట్టింది. ఈ క్రమంలోనే ఇటీవల ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు మేకర్స్. త్వరలోనే మరొక ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నట్టు కూడా తెలుస్తోంది. ఇదిలా ఉండగా రాజాసాబ్ రన్ టైమ్ లాక్ అయినట్టు తెలుస్తోంది. అందిన సమాచారం మేరకు దాదాపు 3. 15 గంటల రన్ టైమ్ తో ఫైనల్ కాపీ రెడీ అయినట్టు సమాచారం. అయితే ఈ రన్ టైమ్ ఇప్పుడు డార్లింగ్ ఫ్యాన్స్ ను కాస్త బయపెడుతోంది. మూడు గంటలకు పైగా రన్ టైమ్ దానికి తోడు మధ్యలో ఇరవై నిముషాలు బ్రేక్ అంటే అటు ఇటుగా మూడున్నర గంట సినిమా అవుతుంది. మరి అంతటి భారీ రన్ టైమ్ అంటే కాస్త రిస్క్ అనే చెప్పాలి. అదే ఇప్పడు ప్రభాస్ ఫ్యాన్స్ ను కలవరపెడుతోంది. అయితే సెన్సార్ తర్వాత రన్ కాస్త తగ్గే ఛాన్స్ లేకపోలేదు. ఎలా చూసుకున్న మూడు గంటలపైనే ఉండే అవకాశం ఉంది. షూటింగ్ చివరి దశలో ఉన్న రాజాసాబ్ జనవరి 9న జననాయగన్ సినిమాతో పోటీగా రిలీజ్ అవనుంది.
నా తల్లి మరణాన్ని కూడా ఎగతాళి చేశారు – జాన్వీ కపూర్
అలనాటి సినీ రత్నం, దివంగత నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ ప్రముఖుల మరణాలను సరదాగా మీమ్స్‌గా మార్చే ధోరణిపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, తన తల్లి శ్రీదేవి మరణం గురించి ప్రతి సారి జాగ్రత్తగా మాట్లాడాల్సి వస్తుందని చెప్పింది. తల్లి మరణాన్ని వాడుకుని తను వార్తల్లో నిలవడానికి ప్రయత్నిస్తోంది అని ప్రజలు అనుకోకూడదు అనే భయంతో చాలాసార్లు ఆ విషయాన్ని మాట్లాడటానికి కూడా వెనుకంజ వేశానన్ని తెలిపింది జాన్వీ. “ఆ సమయంలో నేను ఎదుర్కొన్న వేదన, అనుభవించిన భావోద్వేగాలను మాటల్లో చెప్పలేను.. చెప్పిన అర్థం కాదు. అది పూర్తిగా వ్యక్తిగతమైన అనుభూతి” అని ఆమె చెప్పింది. అలాగే ప్రస్తుత జర్నలిజం, మీడియా సంస్కృతి, సోషల్ మీడియా పబ్లిక్ ఫోకస్ మానవ నైతికతను పూర్తిగా దెబ్బతీస్తున్నాయనే అభిప్రాయాన్ని జాన్వీ వ్యక్తం చేసింది. ప్రముఖులు చనిపోయిన వెంటనే వారి మరణాన్ని మీమ్స్‌గా మార్చే ధోరణి చాలా భయంకరమని ఆమె చెప్పింది..‘‘ధర్మేంద్ర మరణించినప్పుడు కూడా చాలా మంది చాలా రకాల వార్తలు పుట్టించారు. ఒకరి మరణాన్ని మీమ్‌గా మార్చడం ఎంతో పాపం దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో నాకు తెలియదు. రోజు రోజుకు ఈ పరిస్థితి మరింత దిగజారిపోతోంది” అని జాన్వీ ఆవేదన వ్యక్తం చేసింది.