గుమ్మనూరు జయరాం సంచలన వ్యాఖ్యలు.. రైలు పట్టాలపై పడుకోబెడతా..!
మాజీ మంత్రి, గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో కాస్తా.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.. గుంతకల్ పట్టణ శివారులోని ధోని మొక్కల లేఔట్ లో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పలువురు అధికారులతో కలిసి పర్యటించారు. అనంతరం లేఔట్ లో గృహ నిర్మాణ లబ్ధిదారులకు సమస్యల గురించి ఆరా తీశారు.. సమస్యలు ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.. ఈ సందర్భంగా గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల పట్టాలు ఇస్తామని లబ్ధిదారులకు హామీ ఇచ్చారు.. గత ప్రభుత్వంలో కబ్జాకి గురైన ఇళ్ల పట్టాలు మొత్తాన్ని విచారణ చేయాలని అధికారులకు ఆదేశించారు. ఇదే సమయంలో ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు వివాదస్పదంగా మారాయి. తనపై చేసిన ఆరోపణలు నిరూపించే దమ్ముంటే వార్తలు రాయాలని సవాల్ విసిరిన జయరాం.. ఎవడో డబ్బులు ఇస్తాడని.. అమ్ముడుపోయి రాతలు రాస్తే ఖబర్దార్ అంటూ హెచ్చరించారు.. తప్పు చేస్తే రాయండి.. ఆధారాలు లేకుండా రాస్తే తాటతీస్తినంటూ సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చారు.. కొంతమంది నాకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారని, నా కుటుంబ పెత్తనం ఉందని అంటున్నారని.. అలాగే భూ అక్రమాలు చేశాను అని చెబుతున్నరన్నారు. వీటన్నింటినీ నిరూపించాలి.. లేదంటే.. రైలు పట్టాలపై పడుకోబెడతారని హెచ్చరించారు మాజీ మంత్రి, గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం..
మూడో వారంలో ఏపీ బడ్జెట్ సమావేశాలు..!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధం అవుతుంది.. వచ్చే నెల మూడో వారంలో ఏపీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించే అవకాశం కనిపిస్తోంది.. ఆయా శాఖల నుంచి వచ్చిన ప్రతిపాదనలపై ఆర్ధిక శాఖ కసరత్తు చేస్తోంది.. రెండు రోజుల్లో బడ్జెట్ అంచనాలపై ఆర్ధిక శాఖ మొదటి సమావేశం నిర్వహించనున్నట్టుగా చెబుతున్నారు.. వచ్చే నెల 1న అనగా ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర బడ్జెట్ రాబోతోంది.. లోక్‌సభలో కేంద్ర ఆర్థికశాఖమంత్రి నిర్మలా సీతామారన్.. కేంద్ర బడ్జెట్ 2025-26ను ప్రవేశపెట్టబోతున్నారు.. దీంతో, ఏపీ బడ్జెట్ 2025- 26 బడ్జెట్ కూడా ఫిబ్రవరిలోనే ప్రవేశపెట్టే అవకాశం ఉంది.. ఏప్రిల్ 1వ తేదీ నుంచే ఆర్ధిక కార్యకలాపాలు ప్రారంభించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కాగా, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సన్నద్ధం అవుతోంది.. ఏ శాఖలకు ఎలాంటి కేటాయింపులు ఉంటాయి.. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు విషయంలో కూటమి సర్కార్ ఎలాంటి ప్రణాళికలతో రాబోతుంది అనేది ఆసక్తికరంగామారింది..
మహిళలకు ఉచిత బస్సు పథకంపై కీలక అప్డేట్..
ఆంధ్రప్రదేశ్‌లో తాము అధికారంలోకి వస్తే.. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామంటూ కూటమి నేతలు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఇప్పటికే కొన్నింటిని నెరవేర్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం.. ఇక, ఏపీఎస్ఆర్టీసీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై కసరత్తు కొనసాగిస్తోంది.. ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ బెంగళూరు వెళ్ళి వచ్చింది.. అక్కడ ఆ పథకం అమలు తీరుపై అధ్యయనం చేసింది.. ముఖ్యమంత్రి, ఆర్టీసీ అధికారులతో చర్చలు జరిపి క్షేత్రస్థాయిలో సమస్యలపై కూడా దృష్టిపెట్టారు.. అలాగే అధికారులు సైతం తెలంగాణ, కర్ణాటక వెళ్ళి వచ్చారు… ఇద్దరి నివేదికలు ప్రభుత్వానికి సమర్పించారు.. ప్రధానంగా కొత్త బస్సులు కొనాలని, కొత్తగా డ్రైవర్లు, కండక్టర్ల నియామకం జరపాలని నివేదికలో తెలిపినట్టు సమాచారం.. దీంతో ఉగాది నాటికి కసరత్తు పూర్తి చేసి, ఉగాది కానుకగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించే విధంగా కూటమి ప్రభుత్వం సిద్ధమవతోందని తెలుస్తోంది…
అటవీశాఖ ఉన్నతాధికారులకు పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు.. వెంటనే నివేదిక కావాలి..!
అటవీశాఖ ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. చిత్తూరు జిల్లా మంగళంపేట సమీపంలోని అడవుల్లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుటుంబం అటవీ భూములు ఆక్రమించారని వెలువడిన సమాచారంపై సమగ్ర విచారణ జరిపి.. నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.. అసలు, పెద్దిరెడ్డి కుటుంబం.. అటవీ భూములు ఏ మేరకు ఆక్రమించింది.. అక్కడ ఉన్న అడవులను ఏ విధంగా ధ్వంసం చేశారో విచారణ చేపట్టాలని స్పష్టం చేశారు ప్రిన్సిపల్ ఛీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్.. పుంగనూరు నియోజకవర్గం పరిధిలో ఉన్న అటవీ భూముల వివరాలు, వాటి రికార్డులను పరిశీలించాలని, ఏ మేరకు ఆక్రమణలకు గురయ్యాయో నిగ్గు తేల్చాలని డిప్యుటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇక, అటవీ భూముల రికార్డులు ఎక్కడైనా తారుమారు చేశారా? చేసిన పక్షంలో అందుకు బాధ్యులెవరు? తద్వారా లబ్ధి పొందింది ఎవరు..? అనేది నివేదికలో పేర్కొనాలని డిప్యూటీ సీఎం పవన్ స్పష్టం చేశారు.. అటవీ భూములు ఆక్రమించినవారిపై చట్టపరంగా ముందుకు వెళ్లాలని ఆదేశించారు.. సత్వరమే ప్రాథమిక నివేదిక ఇవ్వాలని పీసీసీఎఫ్‌ను ఆదేశించారు. అయితే, మంగళంపేట సమీపంలోని అడవుల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుటుంబం అటవీ భూములు ఆక్రమించారనే విస్తున్న ఆరోపణలపై సమగ్ర విచారణ చేసి వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలంటూ అటవీశాఖ ఉన్నతాధికారులను డిప్యుటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిపోయింది..
పంచ గ్రామాల ప్రజలకు సీఎం గుడ్‌న్యూస్
పంచగ్రామాల ప్రజలకు శుభవార్త చెప్పారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఈ విషయాన్ని మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వెల్లడించారు.. పంచగ్రామాల ప్రజలకు సీఎం గుడ్‌న్యూస్ చెప్పారు.. త్వరలోనే సింహాచలంలో సమావేశాన్ని ఏర్పాటు చేసి పట్టాలు పంపిణీ చేస్తాం అన్నారు.. పంచ గ్రామల సమస్య ఉన్న నాలుగు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, అధికారులుతో పంచగ్రామాల సమస్యలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. కోర్టులలో ఉన్న వివాదాలను విత్ డ్రా చేసుకునేందుకు ఇరుపక్షాలు అంగీకారం తెలిపాయన్నారు గంటా శ్రీనివాసరావు.. అనువంశిక ధర్మకర్త కూడా ఆలయ భూములకు ప్రత్యామ్నాయ భూములను తీసుకునేందుకు అంగీకరించారన్నారు.. దేవాదాయ శాఖ అధికారులు స్థానిక జిల్లా యంత్రాంగంతో కలిసి త్వరలోనే వివాదాలన్నీ పరిష్కరిస్తారన్నారు గంటా శ్రీనివాసరావు.
జీవితంలో అన్నిటికంటే ఉత్తమమైనది విద్య.. చదువుతోనే విజ్ఞానం పెరుగుతుంది!
లక్డికాపూల్ లోని FTCCI కార్యాలయంలో విద్యాధన్ స్వచ్ఛంద సంస్థ స్కాలర్ షిప్ ల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జీవితంలో అన్నిటికంటే ఉత్తమమైనది విద్య.. విద్యతోనే వికాసం సాధ్యపడుతుంది అన్నారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వం విద్యా హక్కు చట్టం తెచ్చి 6-14 సంవత్సరాల మధ్య పిల్లలకు నిర్బంధ విద్యను ప్రవేశ పెట్టింది.. విద్యను ఎవరు దోచుకోలేరు, విద్య పంచుకుంటేనే విజ్ఞానం పెరుగుతుందని పేర్కొన్నారు.. ఆ ఉద్దేశంతో విద్యాధన్ ఫౌండేషన్ పని చేయడం అభినందనీయం అని చెప్పుకొచ్చారు. మీ ప్రయత్నాలకు మా ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి సీతక్క వెల్లడించారు.
తెలంగాణ ఉద్యమంలో గద్దర్ ఉన్నాడా.. బండి సంజయ్ ఉన్నాడా..?
తెలంగాణ ఉద్యమంలో గద్దర్ ఉన్నారా.. బండి సంజయ్ ఉన్నాడా? అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు. ఊరూరా తిరిగి పాట పాడి చైతన్యం చేసిన వ్యక్తి గద్దర్.. ఆయన చనిపోతే ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ కూడా నివాళి అర్పించారు అని గుర్తు చేశారు. కేంద్ర మంత్రిగా ఉన్న సంజయ్ ఈలాంటి కామెంట్స్ చేసి ఉండకుంటే బాగుండేది అన్నారు. ఇక, తాము మూసీ నదిని క్లీన్ చేస్తామంటే కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు ఏసీ రూమ్స్ లో పడుకుంటున్నారు.. ఈ బీజేపీ వాళ్లు యూపీలో గంగా ప్రక్షాళన చేస్తామంటే సంతోష పడతారు.. కానీ, మూసీ ప్రక్షాళన చేస్తామంటే మాత్రం అడ్డు తగులుతున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. ఇక, నల్గొండాకు కేటీఆర్ ఎందుకు వచ్చారు.. పదేళ్లు మా జిల్లాను విస్మరించారని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. మానవత్వం లేని మృగాలు వాళ్ళు.. SLBC ఎందుకు కంప్లీట్ చేయలేదు.. మల్లన్న సాగర్ నుంచి ఆలేరుకి ఎందుకు నీళ్ళు ఇవ్వలేదో సమాధానం చెప్పు అని ప్రశ్నించారు. అలాగే, మహాత్మా గాంధీ యూనివర్సిటీకి పదేళ్లలో ఎప్పుడైనా కేటీఆర్ వెళ్ళాడా అని అడిగారు. టీ- హబ్ కి తాళం వేసి ఉంచారు.. కంపెనీలు ఎందుకు తీసుకురాలేదు.. బార్లా లాగా టీ- హబ్ ను తయారు చేశారని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ మీటింగులకు పల్లి బటాని బుక్కోవడానికి వచ్చినంత మంది కూడా కేటీఆర్ సభకు రాలేదన్నారు. ఫ్లోరోసిస్ కోసం నేను పోరాటం చేసినప్పుడు కేసీఆర్.. డిప్యూటీ స్పీకర్ గా ఉన్నాడనికోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.
తొక్కిసలాట తర్వాత సీఎం యోగి సంచలన ప్రకటన
మౌని అమావాస్య రోజున మహా కుంభమేళాలో అర్థరాత్రి తొక్కిసలాట జరిగింది. దీని తరువాత పరిస్థితి ఇప్పుడు అదుపులోకి వచ్చింది. గట్టి భద్రత మధ్య స్నానం మళ్లీ ప్రారంభమైంది. పరిస్థితి ఇప్పుడు అదుపులో ఉంది. సంగంలో స్నానం కొనసాగుతుంది. భక్తులు విశ్వాసం కోల్పోతున్నారు. దీనితో పాటు, సంగం వెళ్ళే బదులు ఎక్కడ ఉన్నా స్నానం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. మహా కుంభమేళాలో తొక్కిసలాట తర్వాత పరిస్థితిని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నిశితంగా పరిశీలిస్తున్నారు. సిఎం యోగి సోషల్ మీడియా హ్యాండిల్ X లో పోస్ట్ చేయడం ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. “2025 మహా కుంభమేళా, ప్రయాగ్‌రాజ్‌కు వచ్చిన ప్రియమైన భక్తులారా, మీరు సమీపంలో ఉన్న గంగా ఘాట్‌లో స్నానం చేయండి, సంగం వైపు వెళ్లడానికి ప్రయత్నించవద్దు” అని ముఖ్యమంత్రి అన్నారు. మహా కుంభమేళాలో రాత్రి జరిగిన తొక్కిసలాట తర్వాత పరిస్థితి మరోసారి అదుపులోకి వచ్చింది. సంగంలోని అన్ని ఘాట్లలో స్నానాలు మళ్లీ ప్రారంభమయ్యాయి. సంగంలోని అన్ని ఘాట్లలో స్నానాలు ప్రశాంతంగా జరుగుతున్నాయని, ఎలాంటి పుకార్లను పట్టించుకోవద్దని యోగి అన్నారు. స్నానాలు చేసేవారి కోసం అనేక ఘాట్లను నిర్మించామని, అక్కడ వారు సౌకర్యవంతంగా స్నానం చేయవచ్చని సిఎం యోగి అన్నారు. పరిపాలన సూచనలను అందరూ పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎలాంటి పుకార్లను పట్టించుకోవద్దని సీఎం యోగి అందరికీ విజ్ఞప్తి చేశారు.
అగ్ని ప్రమాదం తర్వాత కాలిఫోర్నియాలో కరోనా పరిస్థితులు
అమెరికాకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే అడవుల్లో రాచుకున్న అగ్గి వేలాది ఎకరాలను బుగ్గి చేసింది. వందలాది ఇళ్లను బూడిద చేసింది. అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిన అగ్నిప్రమాదం తర్వాత మరోకొత్త విపత్తు సంభవించింది. ఈ విపత్తు బర్డ్ ఫ్లూ రూపంలో ఉంది. ఈ వ్యాధి ఈ ప్రాంతంలో వేగంగా వ్యాపిస్తోంది. శాస్త్రవేత్తలు H5N9 అని పిలిచే ఒక రకమైన బర్డ్ ఫ్లూ, కోళ్లలో, మిగతా పక్షులలో కనుగొనబడింది. అమెరికా కోళ్లలో H5N9 కనుగొనబడటం ఇదే మొదటిసారి అని, అంటే ఇది తీవ్రమైన అనారోగ్యానికి కారణమయ్యే అవకాశం ఉందని అమెరికా వ్యవసాయ శాఖ తెలిపింది. దీనివల్ల మరణాల రేటు కూడా పెరుగుతుంది. పెరుగుతున్న కేసుల దృష్ట్యా, రాష్ట్ర అధికారులు కరోనా సమయంలో చేసినట్లుగా ప్రభావిత ప్రాంతాలను నిర్బంధించారు. కరోనా కాలంలో ఏదైనా ప్రాంతంలో రోగి దొరికినప్పుడల్లా, ఆ ప్రాంతాన్ని సీలు చేసేవారు. ఇది ముఖ్యంగా కరోనా ప్రారంభ దశలో కనిపించింది. శాస్త్రవేత్తలు బర్డ్ ఫ్లూ వైరస్‌లను వాటిలో ఉన్న రెండు ప్రధాన ప్రోటీన్ల రకాన్ని బట్టి వర్గీకరిస్తారు. H5 లేదా H3 వంటి హేమాగ్గ్లుటినిన్, N1 లేదా N9 వంటి న్యూరామినిడేస్. ఆ రెండు ప్రోటీన్ల విభిన్న మిశ్రమాలు, వైరస్‌లోని ఇతర చోట్ల అనేక ఇతర ఉత్పరివర్తనాలతో పాటు, ప్రజలు, జంతువులు ఎలా అనారోగ్యానికి గురవుతాయి. అది ఎలా వ్యాపిస్తుందో ప్రభావితం చేస్తాయి. గత సంవత్సరం అమెరికాలో వ్యాప్తికి ఆజ్యం పోసిన జాతులలో H5N1 ప్రధాన సమూహం.
అత్యాధునిక ఫీచర్లతో స్టైలిష్ స్కూటర్‌ను తీసుకొచ్చిన హీరో మోటోకార్ప్
హీరో మోటోకార్ప్.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. టూ-వీలర్ మార్కెట్లో ఈ పేరు అందరికీ సుపరిచితమే. ఈ సంస్థ తయారు చేసే వాహనాలకు భారతీయులకు ప్రత్యేక స్థానం ఉంది. ఇకపోతే గత కొద్దిరోజులుగా స్కూటర్ సెగ్మెంట్లోనూ హీరో సంస్థ తన ప్రత్యేకతను చూపిస్తోంది. ఇటీవల నిర్వహించిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో హీరో జూమ్ 160 (Xoom 160) స్కూటర్‌ను లాంచ్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. నిజానికి ఈ స్కూటర్ బైక్‌తో పోలిస్తే తక్కువ, కానీ రెగ్యులర్ స్కూటర్ కంటే అధునాతనమైన ఫీచర్లతో మార్కెట్ లోకి రానుంది. ఈ స్కూటర్ అత్యాధునిక డిజైన్, శక్తివంతమైన ఇంజిన్, అనేక ఆధునిక ఫీచర్లతో భారతీయ మార్కెట్లోకి వచ్చేసింది. మరి వాటి విశేషాలేంటో ఒకసారి చూద్దామా.. హీరో జూమ్ 160 స్కూటర్ మోడర్న్ లుక్‌తో ఆకట్టుకుంటుంది. ఇందులో split-LED హెడ్‌లైట్, విండ్ స్క్రీన్ వంటి ఆధునిక డిజైన్ ఎలిమెంట్స్ కలిగి ఉన్నాయి. ఈ స్కూటర్ కాస్ట్ పర్ల్ సమ్మిట్ వైట్ (Cast Pearl Summit White), కాస్ట్ కేనియన్ రెడ్ (Cast Canyon Red), కాస్ట్ వోల్కానిక్ గ్రే (Cast Volcanic Grey), కాస్ట్ మ్యాట్ రైన్ ఫారెస్ట్ గ్రీన్ (Cast Matte Rain Forest Green) అనే నాలుగు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉండనుంది.
విరాట్ కోహ్లీ ఎఫెక్ట్.. అందుకు ఓకే చెప్పిన బీసీసీఐ!
2012 తర్వాత టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దేశవాళీ క్రికెట్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. జనవరి 30 నుంచి రైల్వేస్‌తో ప్రారంభం అయ్యే రంజీ మ్యాచ్‌లో ఢిల్లీ తరఫున విరాట్ ఆడనున్నాడు. ఈ మ్యాచ్ కోసం మంగళవారం న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో మిగతా ఆటగాళ్లతో కలిసి ప్రాక్టీస్ కూడా చేశాడు. 13 ఏళ్ల తర్వాత దేశవాళీ క్రికెట్ ఆడుతుండడంతో అందరి కళ్లు కోహ్లీపైనే ఉన్నాయి. విరాట్ ఆట చూసేందుకు ఫాన్స్ ఎదురుచూస్తున్నారు. రోస్టర్ విధానంలో మూడు రంజీ మ్యాచ్‌లకు మాత్రమే లైవ్ స్ట్రీమింగ్కు అవకాశం ఉంది. ఈ మూడింటిలో విరాట్ కోహ్లీ ఆడే మ్యాచ్‌కు చోటు లేదు. అయితే విరాట్ క్రేజ్ దృష్టా చివరి క్షణంలో బీసీసీఐ తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. జియో సినిమా ఓటీటీలో ఢిల్లీ మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ కానుందని ఓ బీసీసీఐ అధికారి ఒకరు పీటీఐకి తెలిపారు. ఢిల్లీలో కోహ్లీ ఆటను ప్రత్యక్షంగా చూడలేకపోయిన వారికి ఓ శుభవార్త అని, ఫాన్స్ ఇంట్లో కూర్చొని మ్యాచ్‌ను వీక్షించే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. విషయం తెలిసిన విరాట్ ఫాన్స్ సంబరపడిపోతున్నారు.
సోషల్ మీడియాలో ‘స్పిరిట్’ సినిమా స్టోరీ లీక్.. కథ ఇదే..?
సెట్స్ పైకి వెళ్లకుండానే క్యూరియాసిటి కలిగిస్తోన్న సినిమా స్పిరిట్. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రాబోతున్న అప్ కమింగ్ ప్రాజెక్ట్ గురించి ఓ ఇంటస్ట్రింగ్ మ్యాటర్ లీకైంది.ఏడాదికి మినిమం రెండు సినిమాలను దింపేయాలన్న ఉద్దేశంతో సినిమాలు ఎనౌన్స్ చేసుకుంటూ వెళ్లిపోతున్నాడు డార్లింగ్ ప్రభాస్. ఒకటా రెండా చేతిలో ఎన్ని ప్రాజెక్టులున్నాయో ఆయనకైనా తెలుసా అనేంతలా లైపన్ ఉంది. ప్రెజెంట్ రాజా సాబ్, ఫౌజీ చిత్రాలు చేస్తున్న డార్లింగ్ డైరీలో సలార్2, కల్కి2 ఉండనే ఉన్నాయి. ఇవే కాకుండా స్పిరిట్, హోంబలేలో మరో రెండు సినిమాలు, క్యామియో రోల్ చేస్తోన్న కన్నప్పకు కమిటయ్యాడు ఈ ఆరడుగుల బుల్లెట్. ఫౌజీ తర్వాత స్పిరిట్ సెట్స్ పైకి వెళుతుందని టాక్. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందని, మ్యూజిక్ సిట్టింగ్ స్టార్టైనట్లు రీసెంట్లీ షేర్ చేసుకున్నాడు సందీప్ రెడ్డి వంగా. తన మార్క్ మూవీగా తీయబోతున్నాడు దర్శకుడు. అయితే ఈ సినిమా ప్లాట్ లీకైనట్లు ఓ మ్యాటర్ నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది. ఇందులో పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడట డార్లింగ్. ఇంతకు ముందెన్నడూ చూడని బాడీ లాంగ్వేజ్ లో చూడబోతున్నట్లు టాక్. సందీప్ సినిమాలంటే కాస్త వైల్డ్ కూదీన కల్ట్ సినిమాలాగ ఉంటాయి. అందుకు తగ్గట్టుగానే ఉండబోతుందట స్పిరిట్ కూడా. ఇంటర్నేషనల్ డ్రగ్ మాఫియాపై పోరాటం చేసే పోలీసాఫీర్ గా, కాస్త నెగిటివ్ షేడ్స్ కూడా కనిపించబోతున్నాయని సమాచారం. ప్రి ప్రొడక్షన్ కంప్లీట్ అయ్యాక జక్తారాలో ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేయబోతున్నారని టాలీవుడ్ సర్కిల్క్ లో వార్త నడుస్తోంది. ఈ లీక్ మ్యాటర్ పై దర్శకుడు సందీప్ రెడ్డి వంగా స్పందిస్తాడో లేదో చూడాలి.
హిందీలో సినిమా చేస్తే ఎలాంటి ఎగ్జైయిట్‌మెంట్ ఉండదు: రాశి ఖన్నా
టాలీవుడ్ హీరోయిన్ లు చాలా మంది ఇక్కడ అవకాశాలు తగ్గిన వెంటనే బాలీవుడ్ వైపు మొగ్గు చూపుతున్నారు. అలా వెళ్లి బోల్తా పడిన వారు కొంత మంది అయితే, సక్సెస్ అందుకున్న వారు కొంత మంది. అలాంటి వారిలో రాశిఖన్నా ఒకరు.‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ బబ్లీ బ్యూటీ తెలుగులో వరుసగా సినిమాలు చేసింది. యంగ్ హీరోలకు జోడీగా నటిస్తూ దూసుకుపోయింది ఈ అమ్మడు. అలాగే తమిళ్ లోనూ ఛాన్స్‌లు అందుకుంది. అక్కడ కూడా మంచి ఫేమ్ రావడంతో రాశి ఖన్నా కు హిందీలో కూడా ఆఫర్ లు వస్తున్నాయి. ఇందులో భాగంగా హిట్ ఫట్ ..అని కూడా చూడకుండా చిన్న పాత్ర అయినా సరే వచ్చిన ఆఫర్ చేసుకుంటూ పోతుంది. అంతేకాదు ముందు స్కిన్ షో కి దూరంగా ఉన్న ఈ చిన్నది ఇప్పుడు మాత్రం గ్లామర్ గేట్లు ఎత్తేసి కవ్విస్తుంది. ఈ మధ్య కాలంలో పోస్ట్ చేస్తున్న ఫోటోలు చూస్తే కుర్రకారుకు నిద్ర పట్టడం లేదు. ఆ రేంజ్ లో అందాలు ఆరబోస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా రాశి ఖన్నా చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.