రేపే టీడీపీ భారీ బహిరంగ సభ.. నేతలకు టార్గెట్..
ఉమ్మడి కడప జిల్లా వైసీపీకి పెట్టని కోట.. అయితే ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రెండు దశాబ్దాల తర్వాత మొట్టమొదటిసారిగా పది స్థానాలకు గాను ఏడు స్థానాలను దక్కించుకుంది కూటమి… దీంతో జోష్ లో ఉన్న టీడీపీ కడపలో మహానాడు నిర్వహణకు సిద్ధమైంది… మూడు రోజులపాటు జరుగుతున్న మహానాడులో ఆఖరి ఘట్టం భారీ బహిరంగ సభ… ఇది ఇప్పుడు టీడీపీ నేతలకు సవాలుగా మారింది.. ఒకపక్క వర్షాలు.. మరోపక్క మహానాడు నిర్వహణ.. టీడీపీ నేతలకు కత్తి మీద సాముగా మారింది… టిడిపి పార్టీ ఆవిర్భావం తర్వాత మొట్టమొదటిసారిగా జిల్లాలో జరుగుతున్న మహానాడు ను ఎలాగైనా విజయవంతం చేయాలని జిల్లా ఎమ్మెల్యేలు భావిస్తున్నారట… అయితే ప్రస్తుతం ఉన్న వాహనాలు ఎటు సరిపోవడం లేదట… దీనికోసం అటు చిత్తూరు, కర్నూలు, అనంతపురం జిల్లాలలో ఉన్న స్కూల్ బస్సులతో సహా ఏమి దొరికితే వాటిని తెప్పించడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారట… మహానాడు జరుగుతున్న కమలాపురం నియోజకవర్గంలో 70 వేల మందిని సమీకరించడానికి ఎమ్మెల్యే పుట్టా కృష్ణ చైతన్య రెడ్డి పూనుకున్నారట… కడప నగరానికి అతి సమీపంలో మహానాడు నిర్వహణ జరుగుతున్న నేపథ్యంలో కడప ఎమ్మెల్యే మాధవికి అదే స్థాయిలో టార్గెట్ విధించారట. ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, పులివెందుల నియోజకవర్గాల నుంచి ఒక్కొక్క నియోజకవర్గం నుంచి మినిమం 20 వేల మందిని తరలించేలా ఏర్పాట్లు చేసుకోవాలని అధిష్టానం సూచించింది… మహానాడు ప్రారంభానికి ముందు మంత్రులు ఎమ్మెల్యేలు ఉమ్మడి కడప జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో కీలక నేతలతో సమావేశం నిర్వహించారు… ఎవరెవరికి ఎన్ని బస్సులు లారీలు కావాలి. వాటిని ఎలా సమకూర్చుకోవాలి అన్న వాటిపై చర్చించారట.. ఉమ్మడి కడప జిల్లా నుంచి రెండు లక్షల మందిని సమకూర్చితే మిగిలిన రాష్ట్రంలోని జిల్లాల నుంచి మూడు లక్షల మందిని తరలించారు వ్యూహరచన చేస్తోందట టిడిపి.
నా భర్తపై దాడి చేసినప్పుడు ఎక్కడికి పోయారు..? దళిత సంఘాలకు కానిస్టేబుల్ భార్య ప్రశ్న
తన భర్తపై రౌడీషీటర్లు దాడి చేసి హత్య చేసేందుకు ప్రయత్నిస్తే కులసంఘాలు ఎక్కడికిపోయాయని మండిపడ్డారు కానిస్టేబుల్ చిరంజీవి భార్య కళ్యాణి.. గుంటూరు జిల్లా తెనాలిలో కానిస్టేబుల్ చిరంజీవిపై నెల రోజుల క్రితం ఐతానగర్ కు చెందిన రౌడీషీటర్ లడ్డూ అనుచరులు జాన్ విక్టర్, బాబూలాల్, రాకేష్ లు గంజాయి మత్తులో దాడి చేశారు. ఈ ఘటనపై కానిస్టేబుల్ చిరంజీవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానిస్టేబుల్ పై దాడి చేసిన ప్రాంతంలోనే రౌడీషీటర్ అనుచరులు జాన్ విక్టర్, బాబూలాల్, రాకేష్ లకు పోలీసులు నడిరోడ్డుపైనే అరికాలి కోటింగ్ ఇచ్చారు.. ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారడంతో పోలీసులపై విమర్శలు కూడా వచ్చాయి.. ఇక, పోలీసుల తీరుపై కులసంఘాలు మండిపడ్డాయి. కొందరు రాజకీయ నేతలు కూడా ఇదేం అంటూ ప్రభుత్వం, పోలీసులపై మండిపడ్డారు.. అయితే, దీనిపై కానిస్టేబుల్ చిరంజీవి భార్య కళ్యాణి స్పందించారు.. తాను ఎస్సీ అని, చిరంజీవితాను పదేళ్లక్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నామన్నారు. తన భర్తపై దాడి చేస్తే కులసంఘాలు ఎందుకు స్పందించలేదని నిలదీశారు… రౌడీషీటర్ల వల్ల నా భర్తకు ఏదైనా జరిగితే ఎవరిది బాధ్యత అని ప్రశ్నించారు..? కానిస్టేబుల్ చిరంజీవి భార్య కల్యాణి..
మహానాడులో ఎన్టీఆర్ ఏఐ స్పీచ్.. భళా మనవడా.. భళా..
కడపలో రెండో రోజు టీడీపీ మహానాడు ప్రారంభమైంది.. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, విశ్వవిఖ్యాత, నటసార్వభౌమ, నటరత్న, పద్మశ్రీ, డాక్టర్ నందమూరి తారకరామారావు 102వ జయంతి సందర్భంగా సభా వేదికపై ఆయన విగ్రహానికి నివాళులర్పించారు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్.. అయితే, మహానాడు వేదికగా ఎన్టీఆర్ ఏఐ ప్రసంగం ఎంతగానో ఆకట్టుకుంది.. మహా వేడుకలా.. నింగి నేలా పసుపు మయమై పరవశించేలా.. అంగరంగ వైభవంగా జరుగుతోన్న మహానాడు పండుగ వేళ 10 కోట్ల తెలుగు తమ్ముళ్లకు.. ఆడపడుచులకు, రైతన్నలకు, శ్రమజీవులకు, దేశవిదేశాల్లో తెలుగు కీర్తిపతాకాలుగా వెలుగొందుతున్న మన బిడ్డలకు, వివిధ రంగాలలో తమ ప్రతిభాపాటవంతో తెలుగు తల్లికి సాంస్కృతిక, సాంకేతిక, సాహిత్మ నీరాజనం ఇచ్చేన కళాకారులకు, మేధావులకు, శాస్త్రవేత్తలకు, విజ్ఞులకు, ముఖ్యంగా నా పసుపు జెండాను గుండెల మీద మోస్తున్న తెలుగుదేశం కార్యకర్తలకు నా హృదయపూర్వక నమస్సుమాంజలి అంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన ఐఏ ఎన్టీఆర్.. సరిగ్గా 43 ఏళ్లు అయ్యింది నా తెలుగువారి కోసం.. నా తెలుగువారి ఆత్మగౌరవం నిలపడం కోసం.. తెలుగుదేశం పార్టీని స్థాపించి అని గుర్తుచేశారు.. నేను స్థాపించాను అనేకంటే.. పుట్టిందని చెప్పడమే సరైంది అన్నారు..
తెలుగుజాతి ఆరాధించే ఏకైక నేత ఎన్టీఆర్.. మళ్లీ జన్మ ఉంటే తెలుగు గడ్డపైనే పుడతా..
ఎన్టీఆర్ స్థాపించిన పసుపు జెండాకు 43 ఏళ్లు.. తెలుగుజాతి మొత్తం ఆరాధించే ఏకైక నేత ఎన్టీఆరే అన్నారు టీడీపీ అధితే, ఏపీ సీఎం చంద్రబాబు.. కడపలో జరుగుతున్న మహానాడులో రెండో రోజు చంద్రబాబు మాట్లాడుతూ.. మళ్లీ జన్మ ఉంటే తెలుగు గడ్డపై పుడతా అన్నారు.. కార్యకర్త నా హై కామెండ్.. కార్యకర్తె సుప్రీం.. తొలిసారిగా 65 మంది యువత కు సీట్లు ఇచ్చాం.. ఎమ్మెల్యేలు, ఎంపీలుగా గెలిచారు.. లోకేష్ 6 శాసనాలు ప్రవేశ పెట్టారు.. ఆయనకు ఉన్న నాలెడ్జితో మంచి ఆలోచనలు చేస్తున్నారు అని ప్రశంసలు కురిపించారు..ఇక, ఎన్టీఆర్ జయంతి అంటే తెలుగు జాతికి పండగ రోజు.. ఒక వ్యక్తి రెండు రంగాల్లో రారాజుగా రాణించడం చరిత్రలో చూడలేదన్నారు సీఎం చంద్రబాబు.. . తెలుగు సినీ చరిత్రలో ఎవరెస్టుగా ఎన్టీఆర్ ఎదిగారు. నీతి, నిజాయతీ, పట్టుదల ఆయన ఆయుధాలుగా అభివర్ణించారు.. 33 ఏళ్లు వెండితెరకు.. 13 ఏళ్లు రాజకీయాల్లో అద్వితీయ చరిత్ర సృష్టించారని ప్రశంసలు కురిపించారు.. ఎన్టీఆర్ అంటే పేదవాడికి భరోసా.. రైతులకు నేస్తం. అధికారం అంటే బాధ్యత.. పదవి అంటే సేవ అని నిరూపించారని గుర్తుచేశారు.. అన్ని వర్గాలు కీర్తించే ఏకైక నాయకుడు ఎన్టీఆర్.. పాలకులు అంటే సేవకులని చెప్పి దేశ రాజకీయాల అర్థాన్నే మార్చిన వ్యక్తి ఆయన అని కొనియాడారు చంద్రబాబు..
కార్యకర్తలే నా హై కమాండ్.. వారే సుప్రీం..
కార్యకర్తలే నా హై కమాండ్.. వారే సుప్రీం అని తెలిపారు టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.. టీడీపీ మహానాడులో రెండో రోజు ఆయన మాట్లాడుతూ.. మళ్లీ జన్మ ఉంటే తెలుగు గడ్డపై పుడతా అన్నారు.. కార్యకర్త నా హై కామాండ్.. కార్యకర్తె నా సుప్రీం అని స్పష్టం చేశారు.. తొలిసారిగా 65 మంది యువత కు సీట్లు ఇచ్చాం… ఎమ్మెల్యేలు, ఎంపీలు గెలిచారని గుర్తుచేశారు.. లోకేష్ 6 శాసనాలు ప్రవేశ పెట్టారు.. ఆయనకు ఉన్న నాలెడ్జితో మంచి ఆలోచనలు చేస్తున్నారు.. టీడీపీ కొత్తతరహా పరిపాలనకు శ్రీకారం చుట్టింది.. ఎప్పటికి అప్పుడు ప్రజాఅభిప్రాయం తీసుకుంటున్నాం అన్నారు.. కార్యకర్తలే అధినేతలుగా మహానాడు నిర్వహిస్తున్నాం.. కొన్ని నియోజకవర్గాల్లో ఓడినా మెజార్టీ వచ్చిందని వెల్లడించారు..
స్వామి ఆశీస్సులతోనే నేను ఈస్థాయిలో ఉన్నా!
ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం యడవల్లి గ్రామంలో శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ పున:ప్రతిష్ట మహోత్సవం అభివృద్ధి పనులకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క భూమి పూజ నిర్వహించారు. ఆలయ అభివృద్ధి పనులకు రూ. 4 కోట్ల 74 లక్షల 50 వేల రూపాయలను కేటాయించారు. పున:ప్రతిష్ట కార్యక్రమం అనంతరం డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ.. దశాబ్దాలుగా లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం ఆరాధ్యదైవంగా ఉందన్నారు. ప్రతి ఎన్నికల సమయంలో ప్రచారం ఇక్కడ నుంచే మొదలు పెడతా అని, స్వామి వారి ఆశీస్సులతోనే తాను ఈస్థాయిలో ఉన్నానని చెప్పారు. ‘దశాబ్దాలుగా లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం ఆరాధ్యదైవంగా ఉంది. ప్రతి ఎన్నికల సమయంలో ప్రచారం ఇక్కడ నుంచే మొదలు పెడతా. రూ. 4 కోట్ల 74 లక్షల రూపాయలు దేవాలయ అభివృద్ధి కి కేటాయించాము. మీరందరూ గెలిపిస్తేనే నేను ఉప ముఖ్యమంత్రిని అయ్యాను. రాష్ట్ర ప్రజలందరూ చల్లగా ఉండాలని ప్రజా ప్రభుత్వం మంచి పాలన అందిస్తుంది. సమాజంలో ఉన్న అన్ని వర్గాల ప్రజల కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ పోతుంది. రాష్ట్రంలో ఉన్న మహిళలకు వడ్డీ లేని రుణం కింద 20 వేల కోట్ల రూపాయలు ఇస్తుంది. 22 వేల కోట్ల రూపాయలు రెండు లక్షల లోపు రైతులకు రుణమాఫీ చేశాం. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద భూమి లేని వారికి రూ.12 వేలు ఇస్తున్నాం’ అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు.
డీఎంకే మద్దతుతో రాజ్యసభకు కమల్‌హాసన్..
తమిళనాడు అధికార డిఎంకెతో ఎన్నికల ఒప్పందం తర్వాత మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) అధినేత, నటుడు కమల్ హాసన్ రాజ్యసభలోకి అడుగుపెట్టనున్నారు. తమిళనాడులో ఆరు, అస్సాంలో రెండు స్థానాలకు ఎనిమిది రాజ్యసభ స్థానాలకు జూన్ 19న ఎన్నికలు జరుగనున్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు తన మక్కల్ నీది మయ్యం పార్టీ డిఎంకె నేతృత్వంలోని కూటమితో ఒప్పందం కుదుర్చుకుంది. దీనిలో భాగంగా కమల్ హాసన్‌కు ఒక లోక్‌సభ స్థానానికి పోటీ చేసే అవకాశం లేదా ఎన్నికల తర్వాత రాజ్యసభ సభ్యత్వాన్ని అంగీకరించే విధంగా ఒప్పందం కుదిరింది. 70 ఏళ్ల ఆయన లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయకుండా వైదొలిగారు. అయినప్పటికీ ఆయన పార్టీ తమిళనాడులో డిఎంకె-కాంగ్రెస్ కూటమికి పూర్తి మద్దతు ఇచ్చింది. ద్రవిడ పార్టీలైన డిఎంకె, ఎఐఎడిఎంకెలకు ప్రత్యామ్నాయంగా కమల్ హాసన్ 2018 లో ఎంఎన్ఎంను స్థాపించారు. ఈ ఏడాది ప్రారంభంలో చెన్నైలో జరిగిన పార్టీ 8వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో ప్రసంగిస్తూ పార్లమెంటు అరంగేట్రం గురించి సూచనప్రాయంగా చెప్పారు.
ఆపరేషన్ సింధూర్ లోగోను రూపొందించింది వీరే
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా మే 7న భారత సైన్యం పాకిస్తాన్‌పై ‘ఆపరేషన్ సింధూర్’ ప్రారంభించింది. ఉగ్రవాదులను పెంచిపోషిస్తున్న పాక్ కు తగిన బుద్ధి చెప్పింది. పాకిస్తాన్‌పై భారత్ తీసుకున్న చర్య గురించి చర్చతో పాటు, ఈ ఆపరేషన్ లోగో రూపకల్పన కూడా ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి రేపింది. కోట్లాది మంది భారతీయుల భావోద్వేగాలకు ప్రతీకగా నిలిచిన ఆపరేషన్ సింధూర్ లోగో ఎవరు రూపొందించి ఉంటారబ్బా అని సెర్చ్ చేయడం ప్రారంభించారు. అయితే, ఈ లోగోను రూపొందించింది అడ్వర్టైసింగ్ ప్రొఫెషనల్స్, బ్రాండింగ్ కంపెనీలు అనుకుంటే పొరపాటే. ఈ లోగోను ఇద్దరు భారత ఆర్మీ సైనికులు రూపొందించారు. ఆపరేషన్ సిందూర్ లోగోను లెఫ్టినెంట్ కల్నల్ హర్ష్ గుప్తా, హవల్దార్ సురీందర్ సింగ్ రూపొందించారు. ఈ లోగో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ దృఢ సంకల్పాన్ని ప్రతిబింబిస్తుంది. మే 7న, పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై భారత్ ఒక ఆపరేషన్ ప్రారంభించింది. లక్షిత దాడులు జరిగిన వెంటనే, భారత సైన్యం సోషల్ మీడియాలో ఆపరేషన్ సిందూర్ గురించి వెల్లడిస్తూ ఒక పోస్ట్ పోస్ట్ చేసింది.
పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్. వరుసగా రెండు రోజులు తగ్గిన బంగారం ధరలు నేడు స్థిరంగా ఉన్నాయి. దాంతో మొత్తంగా గత నాలుగు రోజులుగా పసిడి రేట్స్ పెరగలేదు. బులియన్ మార్కెట్‌లో బుధవారం (మే 28) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.89,350గా.. 24 క్యారెట్ల ధర రూ.97,480గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడల్లో ఇదే ధరలు కొనసాగుతున్నాయి. మరోవైపు వెండి ధర కూడా గత రెండు రోజుల నుంచి స్థిరంగా ఉంది. ఈరోజు బులియన్ మార్కెట్‌లో కిలో వెండి రూ.1,00,000గా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి రూ.1,11,000గా నమోదయింది. ముంబై, ఢిల్లీ, బెంగళూరులో కిలో వెండి ఒక లక్షగా ఉంది. ఈరోజు ఉదయం 10 గంటల వరకు పలు వెబ్‌సైట్లలో నమోదైన డీటెయిల్స్ ఇవి. ప్రాంతాల వారీగా బంగారం, వెండి ధరల్లో మార్పులు ఉంటాయన్న విషయం తెలిసిందే.
కిక్కెక్కిస్తున్న ‘వీరమల్లు’ రొమాంటిక్ సాంగ్..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, దర్శకులు క్రిష్ జాగర్లమూడి అలాగే జ్యోతి కృష్ణలు తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా చిత్రం ‘హరిహర వీరమల్లు’. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ ఎప్పుడో రావాల్సింది.. కానీ ఎన్నో ఇబ్బందులు ఎదురుకొని ఫైనల్‌గా ఈ జూన్ 12న గ్రాండ్ గా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కాబోతుంది. ఇక విడుదల సమయం దగ్గర పడుతుండడంతో, ఒక్కో అప్ డేట్ వదులుతున్నారు మూవీ మేకర్స్. కాగా ఇప్పటికే మూడు పాటలు రిలీజ్ కాగా, తాజాగా సినిమా నుంచి నాలుగో సాంగ్ కూడా విడుదలైంది. ఇక ఈ సాంగ్ లో నిధి లుక్ అదిరిపోయింది. లిరిక్స్ బ్యాగ్రౌండ్ స్మూత్‌గా కిక్కిచ్చేలా ఉందని చెప్పాలి. కీరవాణి మంచి ట్యూన్‌ని అందించగా శ్రీహర్ష ఈమని ఇచ్చిన సాహిత్యం కూడా బాగుంది. ఇక ఈ సాంగ్ లో లిప్సిక భాష్యం గొంతు, బాగా ప్లస్ అయ్యిందని చెప్పాలి. అలాగే సాంగ్ లో విజువల్స్ కూడా ఒకింత ఆశ్చర్యకరంగా ఉన్నాయి. సాంగ్ మూడ్ కి తగ్గట్టుగా సెట్ చేసిన సెట్టింగ్స్ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక నిధి అగర్వాల్ అయితే మెయిన్ ఎసెట్ అని చెప్పవచ్చు. తన గ్లామర్ ఇంకా తన డాన్స్ మూమెంట్స్ సాంగ్ లో చాలా బాగున్నాయి. మొత్తానికి నాలుగో పాట కూడా అదిరిపోయింది.
అదిరిపోయిన ‘మిరాయ్’ టీజర్.. లాస్ట్ షాట్ గూస్ బంప్స్ అంతే
‘హనుమాన్’ లాంటి భారీ హిట్ అందుకున్నా తేజ సజ్జ మళ్ళీ అదే తరహాలో ‘మిరాయ్’ వంటి భారీ పాన్ వరల్డ్ చిత్రంతో వస్తున్నాడు. యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కిస్తున్న ఈ షూటింగ్‌కి, కొంచెం ఎక్కువ సమయం తీసుకుంటున్నప్పటికీ ఆ మధ్య వచ్చిన గ్లింప్స్ అందరికీ షాకిచ్చింది. ఒక్కో పోస్టర్ మాత్రం మూవీ అంచనాలు బాగా పెంచేసింది. ఇక ఈ రోజె అవైటెడ్ టీజర్‌ని రిలీజ్ చేశారు మేకర్స్. మరి ఈ టీజర్ ఎలా ఉంది అంటే.. ఊహించని రీతిలో ఉందని చెప్పాలి. ఒక్క మాటలో చెప్పాలంటే మరో ప్రపంచంలోకి తీసుకెళ్లేలా ఉంది. ఇండియన్ సినిమా దగ్గర ఎన్నో భారీ సినిమాలు వస్తున్నాయి కానీ కంటెంట్ ఉంటే దానికి తగ్గట్టుగా కావాల్సిన ప్రామిసింగ్ విజువల్స్ కూడా చాలా మెయిన్. ఇక ‘మిరాయ్’ దానికి అతీతంగా ఉందని చెప్పడంలో సందేహం లేదు. స్టన్నింగ్ విజువల్ ఎఫెక్ట్స్‌తో ఒక హాలీవుడ్ సినిమా చూస్తున్న ఫీల్ వచ్చింది. ముఖ్యంగా మంచు మనోజ్.. అదరకొట్టాడు. సాహస సన్నివేశాల్లో తేజ ఎక్కడా కూడా అసలు కాంప్రమైజ్ అయినట్టే కనిపించడం లేదు. అలాగే ఇండియన్ సినిమాకు ఒక సరికొత్త అవుట్ ఆఫ్ ది బాక్స్ సినిమాగా ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. ఇక లాస్ట్ షాట్‌లో రాముని రాకపై చూపించిన విజువల్ వర్ణనాతీతం.. మొత్తానికి ‘మిరాయ్’ తెలుగు ఇండస్ట్రీని మరో మెట్టు ఎక్కించేలా కనిపిస్తుంది.