బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..! 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు..
తెలంగాణలోని పలు జిల్లాల్లో వద్దన్నా వానలు పడుతున్నాయి. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహస్తున్నాయి. సంగారెడ్డి జిల్లాలో ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులో ఒకరు గల్లంతయ్యారు. రాయికోడ్ మండలం కుస్నూర్ శివారులోని గుర్మిల వాగు.. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఉప్పొంగి ప్రవహిస్తోంది. వాగు దాటే ప్రయత్నం చేసిన కృష్ణ.. వరద ఉధృతికి గల్లంతయ్యాడు. స్థానికులు కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. వరంగల్‌నూ వాన ముంచెత్తింది. ఏకధాటిగా కురిసిన వర్షానికి నగరం జలమయమైంది. వరంగల్ జిల్లా, దుగ్గొండి మండలం చంద్రయ్య పల్లి గ్రామంలో పిడుగు పడి ఓ యువకుడు చనిపోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణపురం భారీ వర్షానికి తడిసిముద్దయ్యింది. ప్రధాన రహదారులు చెరువుల తలపించాయి. అటు, భారీ వర్షానికి అల్లూరి జిల్లా పాడేరు జలమడుగును తలపించింది. గంటపాటు కురిసిన వర్షానికి రోడ్లపైకి భారీగా వర్షపు నీరు చేరింది. పాడేరు నుంచి చింతపల్లి వెళ్లే ప్రధాన రహదారి బొక్కెల్లు దగ్గర మత్స్య గడ్డ వాగు పొంగిప్రవహించడంతో వాహనదారులు అవస్థలు పడ్డారు. నేషనల్ హైవే 516 నిర్మాణపు పనులు జరుగుతున్న చోట బురదమయంగా మారడంతో రాకపోకలు కష్టతరంగా మారాయి. ఇప్పటికే ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా.. మరో వాన గండం ఉందంటూ వాతావరణశాఖ అలర్ట్ చేసింది. ఈ నెల 25న తూర్పు మధ్య, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలపింది. దీని ప్రభావంతో రాబోయే మూడు రోజులు ఏపీలోని ఉత్తరాంధ్ర, కోస్తాతో పాటుగా తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. అయితే, పగలంతా ఎండ.. సాయంత్రం అయ్యిందంటే చాలు.. ఒక్కసారిగా వాతావరణం మారిపోవడం.. భారీ నుంచి అతి భారీ వర్షాలు.. ఎడతెరిపి లేకుండా.. రాత్రి అంతా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.. దీంతో, వర్షం సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు, ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే వాళ్లు నరకం చూస్తున్నారు..
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ.. రేపు పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం దంపతులు..
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు తిరుమల ముస్తాబైంది. సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడే శ్రీవారికి నిర్వహించే ఉత్సవాలుగా పేరుగాంచిన బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. కోటి సూర్య ప్రభాతముల సమమైన వాడు, భూ దిగంతాల మధ్య వ్యాపించి వాడు.. మొక్కినంతనే వరాలిచ్చేవాడు, కోరినంతనే కోరికలు తీర్చేవాడు.. తిరుమలగిరి వాసుడు. ఎవరినైతే క్షణకాలం దర్శించుకున్నా.. జన్మ ధన్యమైనట్లు భావిస్తామో.. ఎవరి దర్శనంతో సకల పాపాలు హరించుకుపోతాయని నమ్ముతామో.. ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు.. దివ్య మంగళ స్వరూపుడై.. రకరకాల రూపాల్లో తనకిష్టమైన వాహనాలపై ఊరేగుతూ అభయాన్ని ప్రసాదిస్తుంటే ఆ భాగ్యాన్ని వర్ణించతరమా?. కేవలం బ్రహ్మోత్సవాలకు మాత్రమే ఆవిష్కృతమయ్యే అద్భుతం ఇది. రేపటి నుంచి అక్టోబరు 2వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.. ఇవాళ రాత్రి 7 గంటలకు బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేయనున్నారు.. ఇక, రేపు మధ్యాహ్నం పరివార దేవతలు, గరుడ పఠం ఊరేగింపు.. రేపు సాయంత్రం మీన లగ్నంలో ధ్వజారోహణంతో ప్రారంభంకానున్నాయి బ్రహ్మోత్సవాలు.. రేపు రాత్రి 8 గంటలకు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి దంపతులు.. రేపు రాత్రి 9 గంటలకు పెద్దశేష వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు మలయప్పస్వామి..
మండలిలో మరోసారి మంత్రి లోకేష్ వర్సెస్ బొత్స సత్యనారాయణ..
శాసనసభ సమావేశాలకు దూరంగా ఉన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ… శాసన మండలిలో మాత్రం ప్రభుత్వాన్ని నిలదీస్తోంది.. దీంతో, మండలిలో కూటమి వర్సెస్ వైసీపీగా మారింది పరిస్థితి.. ఇవాళ మండలిలో మంత్రి నారా లోకేష్ వర్సెస్ విపక్షనేత బొత్స సత్యనారాయణగా మారింది పరిస్థితి.. మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తున్నాం అన్నారు.. ప్రభుత్వ పాఠశాలల్లో మంచి ఫలితాలు రావాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.. సమాజంలో మార్పు రావాలంటే నైతిక విలువలు పెంపొందాలి అన్నారు.. ప్రభుత్వం చాగంటి కోటేశ్వరరావు సలహాదారుగా పెట్టుకున్నాం.. ఆయన రాసిన పుస్తకాలు ముద్రించి విద్యార్ధులకు అందిస్తున్నాం.. ఆయన ఒక్క రూపాయి జీతం, ఇతర సౌకర్యాలు ఏమీ తీసుకోకుండా పనిచేస్తున్నారు అని వెల్లడించారు.. ఎస్సీ, బీసీ విద్యార్ధులకు విడిగా క్లాసులు పెట్టామన్న సమాచారం ఉంటే ఇవ్వండి.. చర్యలు తీసుకుంటాం అన్నారు మంత్రి లోకేష్.. అయితే, సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి లోకేష్ సమాధానాలకు పొంతన లేదు అని విమర్శించారు విపక్షనేత బొత్స సత్యనారాయణ.. ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణపై ప్రశ్న అడిగాం.. ఫీజుల నియంత్రణ కోసం కమిటీ వేస్తున్నామా? లేదా? అని అడిగాం.. ఆర్టీఈ యాక్ట్ గురించి తీసుకున్న చర్యలేంటి అని ప్రశ్నించారు బొత్స.. అయితే, నేను అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పా.. ప్రభుత్వం 50 వేల మంది పిల్లలకు ఆర్టీఈ ప్రకారం విద్యను అందించాం అని పేర్కొన్నారు మంత్రి నారా లోకేష్.. ఈ సమయంలో మంత్రి నారా లోకేష్ వర్సెస్ బొత్స సత్యనారాయణగా మారింది పరిస్థితి..
ఇన్ని రోజులు ప్రజల రక్తం పీల్చి, ఇప్పుడు పన్నులు తగ్గించమని సంబరాలు
తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ వస్తు, సేవల పన్ను(GST) విషయంలో కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పార్టీ వైఖరిపై తీవ్ర విమర్శలు చేశారు. GSTని ప్రవేశపెట్టినప్పుడే కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ దానిని “గబ్బర్ సింగ్ ట్యాక్స్”గా అభివర్ణించారని, ఇది దేశ ప్రజలకు దోచుకునే ఆయుధంగా మారిందని ప్రభాకర్ అన్నారు. పెట్రోల్, డీజిల్ వంటి వాటిని GST పరిధిలోకి తీసుకురావాలని రాహుల్ గాంధీ సూచించినా.. మోదీ ప్రభుత్వం దానిపై స్పందించలేదని ఆయన పేర్కొన్నారు. అలాగే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆరు నెలల్లో GST ద్వారా రూ.22 లక్షల కోట్ల ఆదాయం వచ్చిందని చెప్పడం అంటే, ఆరు నెలల్లో పేద ప్రజల నుంచి అంత మొత్తాన్ని దోచుకున్నట్టేనని ప్రభాకర్ ఆరోపించారు. ఇన్ని రోజులు ప్రజల రక్తం పీల్చుకుని, ఇప్పుడు పన్నులు తగ్గించి సంబరాలు చేసుకోవడం మూర్ఖత్వమని ఆయన అన్నారు. GST తగ్గిందని ప్రభుత్వం ప్రచారం చేస్తున్నా, నిత్యావసర వస్తువుల ధరలు ఏమైనా తగ్గాయా..? అని ప్రశ్నించారు. ఈ పన్ను పెంచింది ఎవరు? తగ్గించింది ఎవరు? అని అన్నారు. ఇంకా ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు నిజంగా లాభం జరిగిందా..? లేదా..? అని చూడాలని అన్నారు.
మోడీ నివాసం దగ్గర గుంతలు లేవా? కర్ణాటకలోనే ఉన్నాయా? డీకే.శివకుమార్ ఎదురుదాడి
టెక్ సిటీ బెంగళూరులో ప్రధాన రహదారులన్నీ గుంతలమయం అయ్యాయి. దీంతో ఉద్యోగులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లు రిపేర్ చేయాలంటూ ఇటీవల బెంగళూరు వాసులు ఆందోళన కూడా చేశారు. అలాగే ప్రతిపక్ష బీజేపీ కూడా తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వ తీరు కారణంగా ఐటీ కంపెనీలు తరలిపోతున్నాయని ఆరోపించింది. బెంగళూరు శిథిలావస్థకు చేరుకుంటోందని.. టెక్ హబ్‌ను గుంతల నగరంగా మార్చారంటూ కేంద్ర మంత్రి హెచ్‌డి కుమారస్వామి ఇటీవల ఆరోపించారు. రోడ్డు పరిస్థితులు బాగోలేకపోవడంతో కంపెనీలు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నాయని తెలిపారు. బీజేపీ ఆరోపణలపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్ స్పందించారు. ‘‘రోడ్లపై గుంతలు కేవలం కర్ణాటకలోనే ఉన్నాయా? నిన్న నేను ఢిల్లీలోకి వెళ్తే ప్రధాని మోడీ నివాస రోడ్డులో కూడా గుంతలు కనిపించాయి. కానీ మీడియా మాత్రం కర్ణాటక రోడ్లనే మాత్రమే చూపిస్తున్నాయి.’’ అని డీకే.శివకుమార్ తిప్పికొట్టారు. భారీ వర్షాలు కారణంగా దేశ వ్యాప్తంగా రోడ్లు గుంతలమయం అయ్యాయన్నారు.
స్నానాకి వెళ్లిన భార్యను నరికి చంపిన భర్త.. ఫేస్‌బుక్ లైవ్‌లో పెట్టి..!
కేరళలో జరిగిన ఓ హత్యకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కోల్లంకు చెందిన ఇసాక్.. గల్ఫ్ నుంచి తిరి గొచ్చి స్థానికంగా రబ్బర్ ట్యాపర్‌గా పనిచేస్తున్నాడు. అతడి భార్య శాలిని సమీపంలోని పాఠశాలలో సహాయకురాలిగా పనిచేస్తోంది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు.. అయితే శాలినికి, ఇసాక్‌క మధ్య గత కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సోమవారం రోజు బాధితురాలు వంట గది వెనక ఉన్న పైపులైన్ వద్దకు స్నానానికి వెళ్ళిన సమయంలో ఇసాక్ ఆమెపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు.. కత్తితో శాలిని మెడ, ఛాతీ, వీపుపై తీవ్రమైన గాయాలు కావడంతో.. ఆమె మరణించింది. అనంతరం ఫేస్ బుక్ లో లైవ్ పెట్టి.. తన భార్యను హత్య చేసినట్లు ఇసాక్ వివరించాడు. శాలిని ఎప్పుడూ తన మాట వినలేదని, తన తల్లితోనే కలిసి నివసించడానికి వెళ్లిందని ఆరోపించాడు. భార్యను హత్య అనంతరం శాలిని భర్త ఇసాక్.. పునాలూర్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. మృతురాలి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
భర్తలకు విడాకులిచ్చి.. పెళ్లి చేసుకున్న ఇద్దరు అమ్మాయిలు..
పశ్చిమ బెంగాల్ లో విచిత్ర ఘటన జరిగింది. సాధారణం పెళ్లి అనేది.. అమ్మాయికి , అబ్బాయికి జరుగుతుంది.. లేదా.. లెస్బియన్స్ దగ్గరవడం చేస్తుంటారు. కొత్తగా ఈ మధ్య పెళ్లిళ్లు చేసుకుంటున్నారు కూడా. ఇలాంటి సంఘటనే ఇక్కడ ఒకటి జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. పశ్చిమ బెంగాల్‌లో వింత కథ వెలుగులోకి వచ్చింది. వివాహం జరిగిన తర్వాత భర్తలకు విడాకులు ఇచ్చి.. ఇద్దరు అమ్మాయిలు వివాహం చేసుకున్నారు. ఈ ఘటన అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. మూడేళ్ల క్రితం ఇన్‌స్టాగ్రామ్ తో పరిచయమైన ఈ ఇద్దరు మహిళలు.. కొత్త జీవితాన్ని ప్రారంభించారు. బీర్భూమ్‌లోని ఓ శివాలయంలో పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. ఇందుకు సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ కాగా కొందరు కంగ్రాట్స్ చెప్తున్నారు. శక్తి, సాంప్రదయాలను ధిక్కరించగల ధైర్యాన్ని పొగుడుతున్నారు. కానీ చాలా మంది దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు జరిగితే మానవాళికి ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు కొందరు పెద్దలు.
హనుమాన్ విగ్రహంపై రిపబ్లికన్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు
అమెరికాలో ఏర్పాటు చేసిన హనుమాన్ విగ్రహంపై రిపబ్లికన్ నేత అలెగ్జాండర్ డంకన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. టెక్సాస్‌లో హనుమాన్ విగ్రహం ఏర్పాటుకు ఎలా అనుమతి ఇచ్చారంటూ వ్యాఖ్యానించారు. డంకన్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో వ్యతిరేకత వ్యక్తమైంది. హిందూ అమెరికన్ ఫౌండేషన్.. డంకన్ వ్యాఖ్యలను తిప్పికొట్టింది. ఈ విషయాన్ని పరిష్కరించాలని టెక్సాస్‌లోని రిపబ్లికన్ పార్టీకి ఫిర్యాదు చేశారు. 2024లో టెక్సాస్‌లో హనమాను విగ్రహం ఏర్పాటు చేశారు. స్టాట్యూ ఆఫ్ యూనియన్ ఆవిష్కరించారు. యూఎస్‌లో ఎత్తైన హిందూ స్మారక చిహ్నాలలో ఇదొకటి. అమెరికాలోనే మూడో ఎత్తైన విగ్రహం ఇదే. 90 అడుగుల ఎత్తులో ఈ విగ్రహాన్ని నిర్మించారు. టెక్సాస్‌లోని షుగర్ ల్యాండ్ పట్టణంలోని శ్రీ అష్టలక్ష్మి ఆలయంలో ఈ విగ్రహాన్ని నెలకొల్పారు.
పేదలకు శుభవార్త.. కొత్తగా 25 లక్షల మహిళలకు ఉచిత LPG కనెక్షన్లు
కేంద్ర ప్రభుత్వం ఉజ్జ్వలా యోజనను మరింత విస్తరించాలన్న నేపథ్యంలో కొత్తగా 25 లక్షల మహిళలకు ఉచిత LPG కనెక్షన్లు అందించనుంది. మహిళా సాధికారతకు తోడ్పడే ఈ నిర్ణయం 2025-26 ఆర్థిక సంవత్సరంలో అమలు కానుంది. ప్రధాని నరేంద్ర మోడీ సోషల్ మీడియా ద్వారా.. నవరాత్రి పవిత్ర సందర్భంలో, ఉజ్జ్వల కుటుంబానికి చెందిన తల్లులు, అక్కచెల్లలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ పని వల్ల వారు ఈ పండుగ రోజు ఆనందాన్ని పొందడమే కాక, మహిళా సాధికారతపై మన సంకల్పాన్ని బలోపేతం చేస్తుందని తెలిపారు. కేంద్ర పెట్రోలియం అండ్ ప్రాకృతిక వాయు మంత్రి హర్దీప్ సింగ్ పూరీ తెలిపిన ప్రకారం.. నవరాత్రి ప్రారంభం సందర్భంగా, ఉజ్జ్వలా యోజన ద్వారా 25 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడమే మహిళలకు ప్రధాని మోడీ దేవి దుర్గా సమానమైన గౌరవాన్ని ఇస్తున్నారని అంటూ పేర్కొన్నారు. ఈ కనెక్షన్లతో దేశంలోని ఉజ్జ్వల కుటుంబాల సంఖ్య 10.60 కోట్లకు చేరుతుందని ఆయన అన్నారు. ప్రభుత్వం ప్రతి కనెక్షన్‌పై రూ.2,050 ఖర్చు పెట్టనుందని.. దీని ద్వారా లబ్ధిదారులు ఉచిత LPG సిలిండర్, గ్యాస్ స్టప్, రెగ్యులేటర్ వంటి పరికరాలను కూడా పొందగలరని అన్నారు.
ఎల్లుండి తమ్ముడు పవన్ సినిమా.. అఖండ 2 వచ్చేది అప్పుడే.. క్లారిటీ ఇచ్చిన బాలయ్య..
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఓజీ సినిమా విడుదలపై స్పందించిన టీడీపీ ఎమ్మెల్యే, నటసింహ నంమూరి బాలకృష్ణ.. తన తాజా మూవీ అఖండ 2 విడుదలపై కూడా క్లారిటీ ఇచ్చారు.. అసెంబ్లీ లాబీలో మంత్రులు, ఎమ్మెల్యేలతో చిట్‌చాట్ చేశారు నందమూరి బాలకృష్ణ.. అయితే, అఖండ-2 విడుదల ఎప్పుడు అంటూ బాలయ్యను అడిగారు మంత్రులు, ఎమ్మెల్యేలు.. దీనిపై స్పందించిన బాలకృష్ణ ఎల్లుండి (సెప్టెంబర్ 25) తమ్ముడు పవన్ కల్యాణ్ ఓజీ సినిమా విడుదలవుతోంది.. అఖండ-2 డిసెంబర్ 5న విడుదలవుతోందని పేర్కొన్నారు.. పాన్ ఇండియా సినిమాగా వివిధ భాషల్లో అఖండ 2 సినిమాను తీసుకొస్తున్నాం. హిందీ డబ్బింగ్ కూడా చాలా బాగా వచ్చిందని దర్శకుడు బోయపాటి శ్రీను అన్నారని తెలిపారు.. అంతేకాదు, అన్ని భాషల్లోనూ ప్రమోషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి అన్నారు.. అయితే, ఎమ్మెల్యేలుగా నియోజకవర్గాల అభివృద్ధికి కృషిచేద్దాం అని పిలుపునిచ్చారు నందమూరి బాలకృష్ణ.. ఇక, జిల్లాకు ప్రత్యేక నిధులు అడుగుదామని మంత్రి సవిత అనగ.. రాష్ట్రమంతా సమాన అభివృద్ధి జరుగుతోందన్నారు నందమూరి బాలకృష్ణ.
రితేష్ దేశ్‌ముఖ్ – రామ్ గోపాల్ వర్మ కలయికలో ఛత్రపతి శివాజీ బయోపిక్.. ట్వీట్ వైరల్
రామ్ గోపాల్ వర్మ మరోసారి హాట్ టాపిక్‌గా మారారు. టాలీవుడ్, బాలీవుడ్‌లలో తనదైన శైలితో సినిమాలు చేసిన వర్మ, ఇప్పుడు బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్‌ముఖ్‌తో కలిసి ఛత్రపతి శివాజీ బయోపిక్ చేయబోతున్నారు. రితేష్ ఈ చిత్రంలో కేవలం హీరోగానే కాకుండా దర్శకుడు, నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. మహారాష్ట్ర గర్వకారణమైన శివాజీ మహారాజ్ జీవితం ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాను గురించి వర్మ సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. “నేను రాజా శివాజీతో ఉన్నాను.. ఇది భారత్‌లో ఎప్పుడూ రానటువంటి అత్యుత్తమ చారిత్రక చిత్రం అవుతుంది” అని వర్మ పేర్కొన్నారు. రితేష్ దేశ్‌ముఖ్ విషయానికి వస్తే.. ఇప్పటికే హిందీ, మరాఠీ సినిమాలతో పాటు టెలివిజన్ హోస్ట్‌గా కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఈ భారీ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ చిత్రంతో పాటు మస్తీ 4, ధమాల్ 4 వంటి చిత్రాలలో కూడా నటిస్తున్నారు రితేష్ . కానీ భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ రాజా శివాజీ మూవీతో రితేష్ ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తారో చూడాలి. పైగా వర్మ కలయిక కావడంతో అంచనాలు ఇప్పుడు మరింత పెరిగిపోయాయి.
డియర్ కళ్యాణ్ బాబు, నీ మాటలు నా మనసును తాకాయి : చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రాణం ఖరీదు విడుదలై 47 సంత్సరాలు గడుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన తమ్ముడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ వేదికగా మెగాస్టార్ సినీ జర్నీపై ఎమోషనల్ ట్వీట్ చేశారు. “నెల్లూరులో మేము ఉన్న రోజులు, నేను ఇంకా స్కూల్లో ఉన్న సమయం.. ‘ప్రాణం ఖరీదు’ సినిమాలో పెద్దన్నయ్య హీరోగా నటించిన ఆ రోజులు ఇప్పటికీ నా కళ్ల ముందు స్పష్టంగా కనిపిస్తాయి. కనకమహల్ థియేటర్‌లో ఆ సినిమా చూసిన రోజు నా ఆనందానికి అంతులేని ఉత్సాహం కలిగింది, అది మాటల్లో వర్ణించలేనిది కూడా. 47 సంవత్సరాల సినీ ప్రస్థానంలో ప్రతి అంశంలోనూ అన్నయ అసాధారణంగా ఎదిగిన తీరు, అయినప్పటికీ అలసిపోని తత్వం, వినయంతో సహాయం చేసే ఆప్యాయమైన స్వభావాన్ని కోల్పోకుండా ఉండటం ఎంతో స్ఫూర్తిదాయకం. దుర్గమ్మ తల్లి ఆయనకు విజయం, ఆరోగ్యం, ఐశ్వర్యంతో కూడిన దీర్ఘాయుష్షును ప్రసాదించాలని కోరుకుంటున్నా. రాబోయే సంవత్సరాల్లో ఆయన మరిన్ని వైవిధ్యమైన పాత్రల్లో కనిపించాలని ఆశిస్తున్నా. ఆయనకు రిటైర్మెంట్ అనేదే లేదు. జన్మతః యోధుడు మన ప్రియమైన పెద్దన్నయ్య, శంకర్ బాబుగా పిలుచుకునే ‘మెగాస్టార్ చిరంజీవి’ ఎప్పటికీ మన హృదయాల్లో నిలిచిపోతారు” అంటూ పవన్ ట్వీట్ చేశారు
పవర్ స్టార్ ‘OG’ కథ.. ఇన్ సైడ్ టాక్ ఇదే.. ఆ సినిమాని పోలి ఉన్నట్టుందిగా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ సినిమా ఓజి OG . యంగ్ దర్శకుడు సుజిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. తమిళ భామ ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తున్నాడు. టాలీవుడ్ సెన్సేషన్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను DVV ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మించారు. రేపు రాత్రి 10 గంటల ప్రీమియర్స్ తో వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది OG. కాగా ఈ సినిమా పూర్తి అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సినిమాగా వస్తోంది. ఇక కథ విషయానికి వస్తే ఒకప్పుడు ముంబై మాఫియాను ఏలిన గ్యాంగ్ స్టర్ OG. ముంబై మొత్తాన్ని తన కనుసైగలతో శాసిస్తాడు. కానీ ఒక బలమైన కారణంగా ఉన్నట్టుండి మాఫీయాను వదిలేసి ఎక్కడో దూరంగా బ్రతుకుతుంతాడట. OG వెళ్ళిపోవండం OMI (ఇమ్రాన్ హష్మీ) మాఫియను తన గుప్పిట్లో పెట్టుకోవాలని, ఆధిపత్యం చెలాయించాలని చూస్తడట. ఈ క్రమంలో OG ఫ్యామిలీ జోలికి వేల్తాడట OMI. దాంతో అజ్ఞాతం వీడి ఈ సారి తన కొడుకుని, ఫామిలీని రక్షించుకోవడం కోసం ముంబై తిరిగివచ్చిన వచ్చిన ఓజి చేసే విధ్వంసం మాములుగా ఉండదట. ముంబై తిరిగి వచ్చిన ఓజీకి అలాగే ఓమికిమధ్య జరిగే సంఘర్షణ నెక్ట్స్ లెవల్ లో ఉండబోతుందట. కాస్త అటు ఇటుగా ఈ సినిమా అజిత్ కుమార్ గుడ్ బ్యాడ్ అగ్లీ ని పోలిఉంటుందని టాలీవుడ్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలోని యాక్షన్ ఎపిసోడ్స్ గురించి మాత్రం ఓ రేంజ్ లో చెప్పుకుంటున్నారు. ఓవరాల్ గా OG ఫ్యాన్స్ కు ఓ పండగ లాంటి సినిమా సమాచారం.