రోడ్లపై బర్త్‌డే కేక్ కటింగ్, హంగామా చేస్తున్నారా..? పోలీసుల సీరియస్ వార్నింగ్..
బర్త్‌డేలు వచ్చాయంటే చాలు.. ఇప్పటి యువత రోడ్లపై హంగామా చేస్తోంది.. ఫ్రెండ్స్‌తో కలిసి రోడ్లపై కేక్ కటింగ్‌లు, బాణాసంచా పేల్చడాలు.. ఇలా నానా రచ్చ చేస్తున్నారు.. అయితే, తిరుపతి యువతకు పోలీసులు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.. నగరంలో సాయంత్రం 6 గంటల నుంచి వేకువజామున మూడు గంటల వరకు.. ప్రజలకు, భక్తులకు ఇబ్బంది కలిగేలా బాణసంచా కాల్చినా.. వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలిగించేలా రోడ్లపై కేక్‌లు కట్ చేసినా.. పోలీసులు కేసులు నమోదు చేయనున్నారు. దీనికి సంబంధించి జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రతి సబ్ డివిజన్ పరిధిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా తిరుపతిలో డీఎస్పీ భక్తవత్సలం ప్రత్యేక చొరవ తీసుకుని ఈస్ట్, యూనివర్శిటీ పరిధిలో రెండు కేసులు నమోదు చేయించారు. జిల్లాలో మొట్టమొదటిసారిగా తిరుపతి సబ్ డివిజన్ పరిధిలో ఈ కేసులు నమోదయ్యాయి. ఆదివారం నుంచి తిరుపతి లోని మధురానగర్, ఇర్లానగర్, బైరాగిపట్టెడ, ఎస్టీవీనగర్, శివజ్యోతినగర్, సత్యనారాయణపురం, రైల్వే కాలనీ, ఉపాధ్యాయనగర్ తదితర ప్రాంతాల్లో ఇలాంటి సమస్యలున్నట్లు గుర్తించిన పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఒకటికి రెండు సార్లు చెప్పినా మాట వినకుంటే కేసులు నమోదు చేయనున్నారు.. అలా రోడ్డుపై ఖాళీగా తిరుగుతున్న యువతకు కౌన్సిలింగ్ ఇచ్చారు పోలీసులు..
విశాఖ శారదా పీఠానికి టీటీడీ షాక్.. 15 రోజుల్లో ఖాళీ చేయాలని నోటీసులు..!
విశాఖ శారదా పీఠానికి తిరుమల తిరుపతి దేవస్థానం షాక్ ఇచ్చింది.. తిరుమలలోని విశాఖ శారదా పీఠాన్ని ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేసింది టీటీడీ.. 15 రోజుల్లోగా ఖాళీచేసి టీటీడీకి అప్పగించాలని ఆదివారం రోజు జారీ చేసిన నోటీసుల్లో పేర్కొంది టీటీడీ.. అయితే, టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు చేపట్టారని విశాఖ శారదా పీఠంపై ఆరోపణలు వచ్చాయి.. అక్రమ నిర్మాణాలపై కోర్టుకు వెళ్లాయి హిందూధర్మ పరిరక్షణ సమితి సంఘాలు.. కోర్టులో టీటీడీకి అనుకూలంగా తీర్పు రావడంతో చర్యలకు దిగిన టీటీడీ అధికారులు.. అందులో భాగంగా.. 15 రోజుల్లోగా ఖాళీ చేయాలంటూ తిరుమలలోని విశాఖ శారదా పీఠానికి నోటీసులు ఇచ్చారు..
గిరిజనల కోసం స్పెషల్ డీఎస్సీ..!
ఎన్నికల సమయంలో మాట ఇచ్చిన ప్రకారం మెగా డీఎస్సీని ప్రకటించాం.. అవసరమైతే గిరిజనల కోసం స్పెషల్ డీఎస్సీ వేస్తామని తెలిపారు మంత్రి గుమ్మడి సంధ్యారాణి.. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ డిగ్రీ కళాశాల అదనపు భవనాల ప్రారంభోత్సవానికి విచ్చేసిన గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత ప్రభుత్వ పనికిమాలిన పనుల వలన ప్రస్తుతం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నాం.. గత ప్రభుత్వ తప్పిదాల వలన ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోన్నాం.. ఎటువంటి అభివృద్ధి పనులకు నోచుకోలేదు.. ఒక్క బటన్ నొక్కడం తప్ప బిల్డింగులు, రోడ్లు, సంక్షేమ పథకాలు లేవని ఆరోపించారు.. ముఖ్యంగా గిరిజనులకు అవసరమైన విద్య, వైద్యం, సాగునీరు, తాగునీరు, రహదారి సౌకర్యాలపై గత ప్రభుత్వం ఎటువంటి దృష్టి పెట్టలేదు.. గంజాయి పండించేందుకు మాత్రం ప్రోత్సహించారని మండిపడ్డారు.
ఏసీలు ఇలా వాడండి.. విద్యుత్ ఆదా చేయండి..!
ఏసీలు ఎలా వాడాలి..? ఎన్ని డిగ్రీల వరకు ఏసీ వేసుకుని వాడితే మంచిదో కీలక సూచనలు చేసింది బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ).. ఇళ్లతో పాటు, కార్యాలయలు, వాణిజ్య సముదాయాల్లో ఏసీలను 24 డిగ్రీల వద్ద వినియోగించడం వల్ల విద్యుత్ వినియోగం తగ్గుతుంది అని వెల్లడించింది బీఈఈ.. ఏసీలను 24 డిగ్రీల వద్ద వాడితే 6 శాతం విద్యుత్ ఆదా అవుతుందని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ పేర్కొంది.. ఇలా చేస్తే సంవత్సరంలో దాదాపు 20 బిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా అవుతుందని.. దాని ద్వారా రూ.10 వేల కోట్లు మిగిల్చినట్లు అవుతుందంటూ ఓ ప్రకటనలో వెల్లడించింది బీఈఈ.. అయితే, సాధారణంగా చాలా మంది 20 డిగ్రీల దగ్గర ఏసీలను వినియోగిస్తున్నారని.. దీంతో విద్యుత్ భారం అదనంగా పడుతుందని తెలిపింది.. ఇక, హోటళ్లు, ఎయిర్‌పోర్ట్‌లు, షాపింగ్ మాల్స్, ఆఫీసులు, గవర్నమెంట్ ఆఫీసులు, వాణిజ్య సముదాయాల్లో ఏసీలను వినియోగించేప్పుడు 24 డిగ్రీలు పెడితే.. తద్వారా కర్బన ఉద్ఘారాల విడుదల తగ్గుతుందని.. దీంతో, ఏసీల జీవితకాలం కూడా పెరుగుతుందని కూడా పేర్కొంది.. ఈ విషయంలో విస్తృత ప్రచారం కల్పించాలని ప్రభుత్వ ఏజెన్సీలకు సూచించినట్టు పేర్కొంది బీఈఈ..
గుంటూరుకు గుడ్‌న్యూస్.. తక్కువ సమయంలో ఆర్‌వోబీ నిర్మాణం..!
గుంటూరులో శంకర్ విలాస్ బ్రిడ్జి స్థానంలో కొత్తగా ఆర్‌వోబీ నిర్మాణం వీలైనంత తక్కువ సమయంలో పూర్తి చేస్తామన్నారు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. ఆర్‌వోబీ నిర్మాణంతో భూములు కోల్పోయే 21 మందికి 70 లక్షల చెక్కులు పంపిణీ చేశారు. ఆర్‌వోబీపై ప్రజల్లో అపోహలు సృష్టించవద్దన్నారు. మొదట ఆర్‌యూబీ నిర్మాణం చేసి తర్వాత ఆర్వోబీ నిర్మాణం చెయ్యడం కుదరదని చెప్పారు. అండర్ పాసులు, సర్వీస్ రోడ్లు ఉండేలా నిర్మాణం చేస్తామని స్పష్టం చేశారు పెమ్మసాని చంద్రశేఖర్..
తెలంగాణ తెచ్చుకున్నదే ఉద్యోగాల కోసం.. కానీ ఓ కుటుంబానికి మాత్రమే జాబ్స్ వచ్చాయి!
తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే ఉద్యోగాల కోసం అని, తెలంగాణ తెచ్చుకున్నాక ఓ కుటుంబానికి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రజా పాలనలో నిరుద్యోగులందరికీ పారదర్శకంగా ఉద్యోగాలు ఇస్తున్నామన్నారు. బీఆర్ఎస్ హయాంలో పేపర్ లీకేజీలతో సమయం అయిపోయిందని, కాంగ్రెస్ హయాంలో నిరుద్యోగులకు పారదర్శకంగా ఉద్యోగాలు కల్పిస్తున్నామన్నారు. ఖమ్మం జిల్లా మధిరలో మెగా జాబ్ మేళా కార్యక్రమం జరిగింది. ఒకేరోజు 5 వేల మందికి ఉపాధి దక్కింది. ఉద్యోగాలు పొందిన వారికి డిప్యూటీ సీఎం భట్టి నియామకపత్రాలు అందజేశారు.
హైకోర్టులో కేటీఆర్‌కు ఊరట!
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌కు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు పోలీసు స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను హైకోర్టు కొట్టివేసింది. గతేడాది సెప్టెంబర్‌లో కేటీఆర్‌పై ఉట్నూరు పీఎస్‌లో కేసు నమోదైంది. కాంగ్రెస్ నాయకురాలు ఆత్రం సుగుణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనపై కేసు నమోదు అయింది. మూసీ ప్రక్షాళణ పేరుతో ప్రభుత్వం 25 వేల కోట్ల కుంభకోణానికి పాల్పడిందని కేటీఅర్ చేసిన ఆరోపణలు తమ పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీశారంటూ కాంగ్రెస్ నాయకురాలు ఆత్రం సుగుణ ఫిర్యాదు చేశారు. దీంతో ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు పోలీసు స్టేషన్‌లో 2024 సెప్టెంబరు 30న కేసు నమోదైంది. కేసును కొట్టివేయాలని కోరుతూ కేటీఆర్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఇరువైపుల వాదనలు విన్న కోర్టు తాజాగా ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేసింది.
ఎన్డీఏ కూటమిలోకి విజయ్!? కీరోల్ ఇచ్చే దిశగా చర్చలు
తమిళనాడులో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అధికార-ప్రతిపక్షాలు అధికారం కోసం వ్యూహాలు-ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. ఇక నటుడు విజయ్ కొత్త పార్టీ స్థాపించారు. టీవీకే (తమిళగ వెట్రి కళంగం) పార్టీ కూడా ఈసారి ఎన్నికల కదనరంగంలోకి దిగుతోంది. టీవీకే అధినేత విజయ్‌పై ఇటీవల అనేక కథనాలు వెలువడుతున్నాయి. సొంతంగా కాకుండా.. మరో పార్టీతో జత కట్టి ఎన్నికల్లోకి దిగుతారని ప్రచారం సాగుతోంది. ఆ దిశగా చర్చలు కూడా సాగుతున్నట్లు ప్రస్తుతం వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. టీవీకే.. ఎన్డీఏ కూటమిలో చేరబోతున్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే ఎన్నికల పొత్తులపై డిసెంబర్‌లో నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే త్వరలోనే విజయ్ రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర చేపట్టబోతున్నట్లు సమాచారం. ఆ యాత్ర ముగిసిన తర్వాత.. ఏ పార్టీతో ముందుకు వెళ్తారన్నది తెలిసేది అప్పుడేనని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఒకవేళ ఎన్డీఏ కూటమిలో విజయ్ చేరతే.. దానికి విజయ్‌నే నాయకత్వం వహిస్తారని ఆ పార్టీ కార్యదర్శి ఆదవ్ అర్జున్ పేర్కొన్నారు. ఇప్పటికే బీజేపీ-ఏఐడీఎంకే పొత్తు పెట్టుకున్నాయి. ఒకవేళ విజయ్ కూడా కూటమిలో చేరితే.. ఆయనకు కీరోల్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆయనను ముందు పెట్టి.. అధికారంలోకి రావాలని బీజేపీ భావిస్తున్నట్లు సమాచారం. మరీ.. ఏపీ కూటమి ఫార్ములా.. తమిళనాడులో కూడా వర్క్ అవుట్ అవుతుందో.. లేదో మరిన్ని రోజులు ఆగాల్సిందే.
ఉషా వాన్స్ పూర్వీకుల సొంతూరు ఇదే.. ఇప్పుడెలా ఉందంటే..!
అగ్ర రాజ్యం అమెరికా రెండవ మహిళ ఉషా వాన్స్ భారత్‌కు చేరుకున్నారు. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భార్యగా ఉషా ఢిల్లీలో అడుగుపెట్టారు. ఉషా చిలుకూరి పూర్వీకుల స్వగ్రామం ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం వడ్లూరు. ఉషా తల్లిదండ్రులు అమెరికాకు వలస వెళ్లారు. కాలేజీ చదివే రోజుల్లో జేడీ వాన్స్-ఉషా చిలుకూరి మధ్య ప్రేమ చిగురించి అనంతరం వివాహం చేసుకున్నారు. ఇక గతేడాది జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి అమెరికా ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ ఎన్నికయ్యారు. నాలుగు రోజుల పర్యటన కోసం జేడీ వాన్స్, ఉషా వాన్స్ దంపతులు, పిల్లలు భారత్‌కు చేరుకున్నారు. దేశంలో వివిధ ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఇక సోమవారం ప్రధాని మోడీ ఇచ్చే విందులో పాల్గొననున్నారు. ఇక ఉషా వాన్స్ భారత్‌కు చేరుకున్న నేపథ్యంలో ఉషా పూర్వీకుల గ్రామంలో స్థానికులు పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు. ఉషా చిలుకూరి పర్యటనపై వడ్లూరు గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉషా సొంతూరుకి వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. 40 ఏళ్ల క్రితం గ్రామాభివృద్ధి కోసం ఆ కుటుంబం పాటు పడిందని గుర్తుచేశారు. ఆమె రాక కోసం తామంతా ఎదురు చూస్తున్నట్లు గ్రామస్తులు చెప్పుకొచ్చారు.
యెమెన్ వార్ లీక్‌లో బిగ్ ట్విస్ట్! అసలేం జరుగుతోంది..!
అమెరికా.. ప్రపంచంలోనే అగ్ర రాజ్యం. ఇక రక్షణ వ్యవస్థ గురించి చెప్పక్కర్లేదు. ఎంతో పగడ్బందీగా.. రహస్యంగా ఉంటుంది. అలాంటి రక్షణ వ్యవస్థకు సంబంధించిన సమాచారం లీక్ కావడం అంతర్జాతీయంగా సంచలనంగా మారింది. యెమెన్‌పై భీకర దాడులు చేసేందుకే అమెరికా ప్రణాళికలు రచించింది. హౌతీ రెబల్స్ లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించింది. అయితే ఇందుకు సంబంధించిన సమాచారం ముందుగానే లీక్ అయిపోయింది. దీంతో తీవ్ర కలకలం రేగింది. అలా లీకైందంటూ పెంటగాన్ అధికారులు తలలు పట్టుకున్నారు. అయితే ఇందుకు సంబంధించిన సమాచారాన్ని అమెరికా రక్షణశాఖ మంత్రి పీట్ హెగ్సెత్ భార్యనే లీక్ చేసినట్లుగా గుర్తించారు. యెమెన్‌పై దాడుల సమాచారాన్ని కుటుంబ సభ్యులకు, వ్యక్తిగత లాయర్‌తో ఆమె షేర్ చేసినట్లుగా తెలుస్తోంది. అలా యుద్ధ ప్రణాళిక ముందుగానే తెలిసిపోయింది. అయినా ప్రైవేట్ సిగ్నల్ గ్రూప్ చాట్ ఎలా లీక్ అయిందో అర్థం కావడం లేదని అమెరికా జాతీయ భద్రత సలహాదారు మైక్ వాల్జ్ తెలిపారు. ఆ గ్రూప్ తానే క్రియేట్ చేశానని.. పూర్తి బాధ్యత తానే వహిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు న్యూయార్క్ టైమ్స్ ఆదివారం ఒక కథనంలో పేర్కొంది. అయినా అత్యంత సీరియస్ సందేశాలు లీక్ కావడంపై అనేక సందేహాలు వ్యక్తం చేసింది. ఇక హెగ్సెత్ భార్య, మాజీ ఫాక్స్ న్యూస్ నిర్మాత జెన్నిఫర్ కూడా విదేశీ సైనిక ప్రతినిధులతో రహస్య సమావేశాలకు హాజరైనట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ మరో కథనంలో తెలిపింది.
ఆ ఇద్దరికి మళ్లీ చోటు.. తెలుగు కుర్రాడికి ఛాన్స్!
2024-2025 సంవత్సరానికి ఆటగాళ్ల వార్షిక కాంట్రాక్టుల జాబితాను భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) సోమవారం ప్రకటించింది. మొత్తం 34 మంది క్రికెటర్లను నాలుగు కేటగిరీల్లో బీసీసీఐ ఎంపిక చేసింది. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులోని A+ గ్రేడ్‌లో నలుగురు ప్లేయర్స్ ఉన్నారు. గత ఏడాది బీసీసీఐ ఆగ్రహానికి గురై కాంట్రాక్ట్ కోల్పోయిన స్టార్ ప్లేయర్స్ శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్‌కు మళ్లీ చోటు దక్కింది. మరోవైపు ఇటీవల అదరగొడుతున్న తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డికి బీసీసీఐ కాంట్రాక్టులో ఛాన్స్ ఇచ్చింది. A+ గ్రేడ్‌లో నలుగురు, A గ్రేడ్‌లో ఆరుగురు, బి గ్రేడ్‌లో ఐదుగురు, సి గ్రేడ్‌లో 19 మంది ప్లేయర్స్ ఉన్నారు. ఐపీఎల్ స్టార్స్ నితీష్ రెడ్డి, హర్షిత్ రాణా, అభిషేక్ శర్మ, వరుణ్ చక్రవర్తి తొలిసారిగా బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులో చోటు సంపాదించారు. వీరందరూ సి గ్రేడ్‌లో ఉన్నారు. వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్ బి గ్రేడ్ నుండి A గ్రేడ్‌కు పదోన్నతి పొందాడు. A+ గ్రేడ్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా ఉన్నారు. వీరికి ఏడాదికి రూ.7 కోట్లను బీసీసీఐ వేతనంగా ఇవ్వనుంది. A గ్రేడ్‌లో కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యా, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ, రిషభ్ పంత్ ఉన్నారు. వీరందరూ ఏడాదికి రూ.5 కోట్లు వేతనంగా పొందనున్నారు. టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బి గ్రేడ్‌లో కాంట్రాక్ట్ దక్కింది. యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్‌కు బి గ్రేడ్‌లో ఛాన్స్ వచ్చింది. వీరికి ఏడాదికి రూ.3 కోట్ల వేతనం వస్తుంది. యువ క్రికెటర్లకు సి గ్రేడ్‌లో చోటు దక్కింది. ఈ గ్రేడ్‌లో ఉన్న ఏడాదికి రూ. కోటి చొప్పున బీసీసీఐ చెల్లించనుంది.
హీరోలుగా సక్సెస్ కాలేకపోతున్న స్టార్ కమెడియన్స్
తెరపై స్కోప్ తక్కువున్నప్పటికి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంటారు కమెడియన్స్. వీరి కామెడీ పటాసుల్లా పేలి సినిమా సక్సెస్ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలా అని సినిమా మొత్తం మేమే ఉంటాం అంటే ప్రేక్షకులకు బోర్ కొట్టేస్తుంది. కమెడియన్లు హీరోలుగా ఛేంజ్ అవుతుంటే. బ్రహ్మానందం నుండి సంతానం వరకు ఇదే జరిగింది.. జరుగుతోంది. బ్రహ్మీ జోకులను థియేటర్లలో ఎంజాయ్ చేసిన ప్రేక్షకుడు హీరోగా మారితే జీర్ణించుకోలేకపోతున్నాడు. సునీల్ కూడా జక్కన్న వల్ల లీడింగ్ యాక్టర్ గా మారి కామెడీ వదిలేస్తే హీరోగా కొన్ని చిత్రాలకే పరిమితమయ్యాడు. ఇప్పుడు జ్ఞానోదయం అయ్యి సెకండ్ ఇన్నింగ్స్‌లో టాలీవుడ్, కోలీవుడ్‌లో బిజియెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారాడు. పుష్ప2లో సీరియస్ క్యారెక్టర్ చేసి మ్యాడ్ స్క్వేర్‌లో భాయ్‌గా నవ్వులు పువ్వులు పూయించాడు సునీల్. ఇక కోలీవుడ్ బ్రహ్మీ వడివేలు కూడా హీరోగా మారి యూటర్న్ తీసుకున్నాడు. మామన్నన్‌లో సీరియర్ క్యారెక్టర్ చేసి ఇప్పుడు గ్యాంగర్స్‌తో వింటేజ్ కామెడీతో ప్రేక్షకులకు కితకితలు పెట్టబోతున్నాడు. వడివేలు తర్వాత తమిళనాట బాగా క్లికైన కమెడియన్ సంతానం. ఓ వైపు హీరోకు ఫ్రెండ్ క్యారెక్టర్ మరో వైపు కామెడీని పండించాడు. కానీ హిడెన్ టాలెంట్ దర్శకులు గుర్తించారని లీడింగ్ యాక్టరైతే పట్టించుకోవడం లేదు ప్రేక్షకులు. ఇక సెట్ కావట్లేదని గ్రహించిన సంతానం బ్యాక్ టు ది పెవిలియన్. శింబు 49 చిత్రంలో కామెడీ రోల్ చేస్తున్నాడు. అలా అని రెమ్యునరేషన్ తక్కువ తీసుకుంటున్నాడా అంటే కోట్లలో పుచ్చుకుంటున్నాడన్నది లేటెస్ట్ బజ్. ఇక యోగి బాబు తనేంటో తనకు తెలుసు అందుకే హీరోగా చేస్తూనే కమెడియన్‌గానూ కంటిన్యూ అవుతున్నాడు.
అందుకే నాని తో మూవీ ఓకే చూశా..
‘కేజీఎఫ్’ చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ శ్రీనిధి శెట్టి. మొదటి సినిమాతోనే స్టార్ హోదా సంపాదించుకుంది. కానీ యష్ లాంటి స్టార్ హీరోతో కలిసి తెరపై మెరిసిన, ఆ తర్వాత మాత్రం ఆమె కెరీర్ ఊహించిన దిశగా సాగలేదు. తదుపరి చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు. అందులో విక్రమ్ సరసన చేసిన ‘కోబ్రా’ ఒకటి. అయినా సరే నిరుత్సాహ పడకుండా.. ఇప్పుడు టాలీవుడ్‌లో తన రెండో ఇన్నింగ్స్ స్టార్ట్ చేయాలని ఉత్సాహంగా ఉంది శ్రీనిధి. ప్రస్తుతం నాని హీరోగా నటిస్తున్న ‘హిట్ 3’ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. మే 1న విడుదల కానున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ చిత్రాన్ని అంగీకరించడానికి కారణాన్ని వివరించింది. శ్రీనిధి మాట్లాడుతూ.. ‘ హిట్ 3 స్క్రిప్ట్ నా దగ్గరకు రాగానే క్షణం కూడా ఆలోచించకుండా అంగీకరించాను. నాని అంటే ఓ బ్రాండ్. ఆయన సినిమాలో ఆఫర్ వచ్చినప్పుడు ప్రశ్నలు అడగకుండా అంగీకరించాలి. నేను ఇందులో ఆయన భార్య గా కనిపించనున్నాను. నేను ప్రోమో లో ఎక్కువగా కనిపించలేదు. కానీ, నా పాత్ర చాలా శక్తివంతమైనది. ఈ మూవీ నా కెరీర్ కి మంచి గ్రాఫ్ ని అందిస్తుందని కోరుకుంటున్నా’ అని చెప్పుకొచ్చింది. నిజంగా ఈ మూవీ పై పరిశ్రమలో అంచనాలు భారీగానే ఉన్నాయి. కాబట్టి, ఈ సినిమా విజయం ఆమె కెరీర్‌కు తిరుగు లేని బూస్ట్ ఇవ్వొచ్చు. మరి ఈ అవకాశాన్ని ఎలా ఉపయోగించుకుంటుందో చూడాలి.