వర్షంలో ఫోన్ మాట్లాడుతుండగా పిడుగు.. విద్యార్థిని మృతి
వర్షం పడుతుందంటే సెల్‌ఫోన్ మాట్లాడొద్దు.. టీవీలు ఆపేయండి.. అని ఇంట్లో పెద్దలు హెచ్చరిస్తుంటారు.. ముఖ్యంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడేటప్పుడు ఈ హెచ్చరికలు చేస్తుంటారు.. ఇప్పటికే పలువురిని ఈ పిడుగులు బలి తీసుకున్నాయి కూడా.. తాజాగా, ఆంధ్రప్రదేశ్‌లో మరో విద్యార్థిని పిడుగుపాటుకు బలైపోయింది.. అల్లూరి సీతారామ రాజు జిల్లా అరకులోయలో ఈ ఘటన చోటు చేసుకుంది.. అనంతగిరి మండలం పెదబిడ్డ పంచాయతీ చెరుకుమడత గ్రామంలో.. మంగళవారం పిడుగుపాటుకు ఓ విద్యార్థిని మృతి చెందింది. చెరుకుమడత గ్రామానికి చెందిన బడ్నాయిన కీర్తి (16) ఎస్.కోటలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతోంది. అయితే, దసరా సెలవులు ఇవ్వడంతో ఇంటికి వచ్చింది. మంగళవారం భారీ వర్షం కురుస్తోన్న సమయంలో కీర్తి సెల్‌ఫోన్‌లో మాట్లాడుతుంది.. ఆ సమయంలో ఒక్కసారిగా పిడుగుపడింది. ఆ సమయంలో ఇంట్లో ఫోన్ మాట్లాడుతున్న కీర్తి ఫోన్ పడేసి సొమ్మసిల్లి పడిపోయి అపస్మారక స్థితికి చేరింది.. తల్లిదండ్రులు వెంటనే 108 వాహనానికి సమాచారం.. ఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది.. విద్యార్థినిని పరీక్షించి అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. దీంతో, విద్యార్థిని కీర్తి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు..
ఒక ఉగ్రవాదలా నన్ను జైల్లో పెట్టారు.. సీసీ కెమెరా పెట్టి విజయవాడ నుంచి చూశారు..!
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ మిథున్‌రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ రావడంతో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలైన విషయం విదితమే. ఇక, ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన.. సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఒక ఉగ్రవాదలా నన్ను జైల్లో పెట్టారని మండిపడ్డారు.. రెండున్నర నెలల ఒక ఖైదీగా ఉండాల్సిన వచ్చింది.. గౌరవ కోర్టు పెట్టిన ఆంక్షలు మేరకు కేసు గురించి ఎక్కవగా మాట్లాడ కూడదన్న ఆయన.. గతంలో చాలా సార్లు చెప్పాను.. ఎన్ని ఇబ్బందులు పెట్టిన అధైర్యపడే పరిస్థితి ఉండదు అని స్పష్టం చేశారు.. గత 2014లో కేసు పెట్టి జైల్లో పెట్టారు.. అప్పుడు చెప్పాను.. తప్పుడు కేసు అని.. టీడీపీ ఎప్పుడు అధికారంలో ఉన్న మమ్మల్ని వేధించడం మామూలే అన్నారు మిథున్‌రెడ్డి.. కష్టకాలంలో అండగా ఉన్న వారందరికీ ధన్యవాదాలు తెలిపిన ఆయన.. లిక్కర్ కేసు పెట్టి పైశాచిక ఆనందం, తల్లిదండ్రులు బాధ పెట్టడం తప్ప వాళ్లు ఏమీ సాధించలేదు అన్నారు.. కేసులు పెట్టినా.. ఏమి చేసినా వెనక్కి తగ్గేది లేదన్నారు.. ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ముందుకు వెళ్తా అన్నారు మిథున్ రెడ్డి.. ప్రభుత్వం చేయాల్సిన పనులు పక్కన పెట్టి.. డైవర్షన్ చేయడంలో భాగంగా కేసులు పెడుతున్నారని ఆరోపించారు.. ఇక, బీజేపీలోకి వెళ్తామన్న ప్రచారంలో అర్థం లేదన్నారు.. ఇవన్ని టీడీపీ చేస్తున్న అసత్య ప్రచారంగా కొట్టిపారేశారు.. జైల్లో ఇబ్బందులు పెట్టారు.. సీసీ కెమెరా పెట్టి విజయవాడ నుండి చూసేలా ఏర్పాట్లు చేశారని ఆరోపించార.. ఒక ఉగ్రవాదలా నన్ను జైల్లో పెట్టారు.. కోర్టు చెప్పిన అదేశాలను అధికారులు పట్టించుకోవడం లేదన్నారు ఎంపీ మిథున్ రెడ్డి..
వచ్చేది జగనన్న ప్రభుత్వమే.. దాని కోసం ఎన్ని కేసులైనా, ఎన్ని ఇబ్బందులైనా ఎదుర్కొంటాం..!
వచ్చేది జగనన్న ప్రభుత్వమే.. దానికోసం ఎన్ని కేసులైనా.. ఎన్ని ఇబ్బందులైనా ఎదుర్కొంటామని ప్రకటించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ మిథున్ రెడ్డి.. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన.. బెయిల్‌పై జైలు నుంచి విడుదలన ఆయన.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడుతూ.. టీడీపీ అధికారంలో ఉంటే మా మీద కేసులు అనేవి.. వేధించడం అన్నది మామూలే అన్నారు.. ఇవన్నీ ఒక్కరోజులో వీగిపోయే కేసులే అని కొట్టిపారేశారు.. అయితే, ఇలాంటి కేసులకు భయపడేదే లేదు అని స్పష్టం చేశారు.. కేవలం మమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతోనే అక్రమ కేసులు పెట్టారు అని ఫైర్ అయ్యారు.. ఈ కేసులతో భయపడతాం అనుకుంటే అది వారి భ్రమే అవుతుందన్నారు.. ఇక, జైల్లోనూ నన్ను చాలా ఇబ్బందులకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు మిథున్ రెడ్డి.. మా పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు మా వెంటే ఉన్నాడు.. ఎవరికి ఇవ్వని గుర్తింపు మా కుటుంబానికి ఇచ్చాడు అని పేర్కొన్నారు.. ఆంధ్రప్రదేశ్‌లో వచ్చేది జగనన్న ప్రభుత్వమే.. దానికోసం ఎన్ని కేసులైనా.. ఎన్ని ఇబ్బందులైనా ఎదుర్కొంటాం అని తెలిపారు ఎంపీ మిథున్ రెడ్డి.. మరోవైపు, ఒక ఉగ్రవాదలా నన్ను జైల్లో పెట్టారు.. రెండున్నర నెలలు ఒక ఖైదీగా ఉండాల్సిన వచ్చింది.. గౌరవ కోర్టు పెట్టిన ఆంక్షలు మేరకు కేసు గురించి ఇంతకన్నా ఎక్కువగా మాట్లాడడం కుదరదు అని తెలిపారు.. గతంలో చాలా సార్లు చెప్పాను.. ఇప్పుడు చెబుతున్నా.. ఎన్ని ఇబ్బందులు పెట్టిన.. అధైర్యపడే పరిస్థితి ఉండదు.. టీడీపీ ఎప్పుడు అధికారంలో ఉన్న మమ్మల్ని వేధించడం మామూలే అన్నారు ఎంపీ మిథున్ రెడ్డి..
ఎల్లుండి ఏపీ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై ఫోకస్..!
మరోసారి ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం జరగనుంది.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఎల్లుండి ఏపీ కేబినెట్ భేటీకానుంది.. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానున్న మంత్రివర్గ సమావేశంలో.. కీలక అంశాలపై చర్చించనున్నారు మంత్రులు.. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ పర్యటన, ఏర్పాట్లపై చర్చించనుంది ఏపీ కేబినెట్. ఈ నెల 16వ తేదీన ఏపీ పర్యటనకు రానున్నారు ప్రధాని మోడీ.. ఈ పర్యటనలో శ్రీశైలం మల్లికార్జునస్వామిని దర్శించుకోనున్న ఆయన.. ఆ తర్వాత జీఎస్టీపై అవగాహన కల్పించేలా కర్నూలులో ర్యాలీ నిర్వహించనున్నారు.. ఇక, జీఎస్టీకి సంబంధించి ఎన్డీఏ వరస కార్యక్రమాలు నిర్వహస్తోన్న విషయం విదితమే.. మరోవైపు, ఏపీలో జీఎస్టీ కార్యక్రమాలకు సంబంధించి కేబినెట్ సమావేశంలో మంత్రులకు సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం చేయనున్నారు.. అమరావతి రాజధాని నిర్మాణం.. కొన్ని సంస్థలకు భూ కేటాయింపులకు సంబంధించి కేబినెట్‌లో చర్చ జరగనుంది.. ఇక, కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి కూడా చర్చించే అవకాశం ఉంది.. కేబినెట్ తర్వాత తాజా రాజకీయ పరిణామాలపై మంత్రులతో ప్రత్యేకంగా చర్చించనున్నారట సీఎం చంద్రబాబు.. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల తీరు.. కొంతమంది ఎమ్మెల్యేల వ్యాఖ్యలు.. సోషల్ మీడియా ప్రచారానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొన్ని కీలక సూచనలు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది..
తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన!
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడుతోందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఓ ప్రకటనలో తెలిపింది. అల్పపీడనం మరింత బలపడి పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ రాగల 12 గంటల్లో (గురువారం తెల్లవారుజాము) వాయుగుండంగా ఏర్పడుతుందని పేర్కొంది. శుక్రవారం (అక్టోబర్ 3) దక్షిణ ఒడిశా-ఉత్తర కోస్తాల మధ్య తీవ్ర వాయుగుండంగా తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించింది. వాయుగుండం ప్రభావంతో వచ్చే మూడు రోజులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయని ఐఎండీ తెలిపింది. ఈరోజు కోస్తాంధ్ర సహా తెలంగాణకు వాతావరణ శాఖ అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. సూర్యాపేట, హన్మకొండ, వరంగల్, మంచిర్యాలు, పెద్దపల్లి, ఆసిఫాబాద్‌లో ఓ మోస్తరు వర్షాలపడే అవకాశాలు ఉన్నాయి. గురువారం, శుక్రవారం రెండు రాష్ట్రాలలో భారీ వర్షాలు ఉండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రాగల మూడు రోజులు తీరం వెంబడి ౩౦ కిమీ పైగా వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.
జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపిక.. సీఎంతో ముగిసిన పీసీసీ చీఫ్ భేటీ!
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన కసరత్తును కాంగ్రెస్ పార్టీ ప్రారంభించింది. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌తో పాటు జూబ్లీహిల్స్ ఎన్నిక షెడ్యూల్ కూడా వస్తుంది కాబట్టి.. కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థి ఎంపికపై ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే ఈరోజు ఉదయం సీఎం రేవంత్ రెడ్డితో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ భేటీ అయ్యారు. ఈ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికల అభ్యర్థులతో పాటు జూబ్లీహిల్స్ అభ్యర్థిపై చర్చ జరిగింది. ఈ నెల 6న ఏఐసీసీలో స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో స్క్రీనింగ్ కమిటీ సమావేశంకు ముందే అభ్యర్థుల ఎంపికను పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్, తుమ్మల నాగేశ్వర రావు జిల్లా ఇన్‌ఛార్జిలుగా ఉన్నారు. టికెట్ ఆశిస్తున్న అభ్యర్థుల జాబితాను సిద్ధం చేయాలని జిల్లా ఇన్‌ఛార్జిలకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అలానే గెలుపు కోసం అనుసరించే ప్రణాళికలను కూడా సిద్ధం చేయాలని సూచించారు. ఇక్కడ బీసీ అభ్యర్థిని రంగంలోకి దించుతారా? లేదా ఓసీకి అవకాశం ఇస్తారా? అన్నది ఇంకా క్లారిటీ లేదు. బీసీ కోటాలో అంజాన్ కుమార్ యాదవ్, నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్ రేసులో ఉన్నారు. రెడ్డి కోటలో సీఎస్ రెడ్డి, రంజిత్ రెడ్డిలు ఉన్నారు.
వసూళ్లు, కమీషన్స్, కబ్జాల కోసం కాదు.. కేటీఆర్‌కు జడ్చర్ల ఎమ్మెల్యే కౌంటర్!
‘ప్రతిదీ రాజకీయం చేయొద్దు’ అంటూ.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌కు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మీ పార్టీలో ఒక్క ఎమ్మెల్యే అయినా ఏ రోజైనా తనకు సంబంధించిన ఇష్యూపైన మాట్లాడరా?, తన ప్రజలకు కావాల్సిన అంశంపై ఏరోజైనా స్వేచ్ఛగా మాట్లాడారా? అని ప్రశ్నించారు. తాను పోరాటం చేసేది రైతుల కోసం, జడ్చర్ల నియోజకవర్గం ప్రజల కోసం అని స్పష్టం చేశారు. మీ ఎమ్మెల్యేల మాదిరి తాను వసూళ్లు, కమీషన్స్, కబ్జాల కోసం పని చేయను అని కేటీఆర్‌ను జడ్చర్ల ఎమ్మెల్యే విమర్శించారు. ఈ మేరకు ఎక్స్‌లో ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి పోస్ట్ చేశారు. ‘కేటీఆర్ గారు ప్రతిదీ రాజకీయం చేయొద్దు. మీ పార్టీలో ఒక్క ఎమ్మెల్యే అయినా ఏ రోజైనా తనకు సంబంధించిన ఇష్యూ పైన మాట్లాడరా, తన ప్రజలకు కావాల్సిన అంశంపై ఏరోజైనా స్వేచ్ఛగా మాట్లాడారా?. మా పార్టీలో, మా ప్రభుత్వంలో స్వేచ్ఛ ఎక్కువ. మీ పాలన నిరంకుషత్వ పాలన. మీ రౌడీయిజం అరాచకత్వ పాలన చూడలేకనే ప్రజలు మిమ్మల్ని, మీ పార్టీని మిమ్మల్ని బొంద పెట్టారు. నేను పోరాటం చేసేది రైతుల కోసం, నా జడ్చర్ల నియోజకవర్గం ప్రజల కోసం. మీ ఎమ్మెల్యేల లాగా రౌడీయిజం చేసి ఫ్యాక్టరీల్లో వసూళ్ల కోసం, కమీషన్ల, భూకబ్జాల కోసం నేను పనిచేయనని మీరు గమనించాలి. నేను చెరువుల్లో చేపలు చనిపోతున్నాయని ముదిరాజుల కోసం ఫైట్ చేస్తున్నా. మీ మాజీ ఎమ్మెల్యేలు ఫ్యాక్టరీల్లో పొల్యూషన్ వచ్చినా.. వాళ్లకు కమీషన్ వస్తే చాలని ఎప్పుడు కూడా ఈ సమస్య పై మాట్లాడలేదని మీరు గుర్తించాలి’ అని కేటీఆర్ ట్వీట్‌కు ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి రిప్లై ఇచ్చారు.
పోలీస్ శాఖలో 17 వేల పోస్టులు భర్తీ చేస్తాం!
తెలంగాణ కొత్త డీజీపీగా బి.శివధర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. లక్డీకాపూల్‌లోని డీజీపీ కార్యాలయంలో ఈరోజు ఉదయం 9:44 నిమిషాలకు ప్రత్యేక పూజల అనంతరం బాధ్యతలు చేపట్టారు. వేద మంత్రాలతో డీజీపీ కార్యాలయంలోకి ఆయన్ను పండితులు ఆహ్వానించారు. తెలంగాణ 6వ డీజీపీగా 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారి శివధర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. నూతన డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ‘తెలంగాణ డీజీపీగా అవకాశం కల్పించిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టికి కృతజ్ఞతలు. తెలంగాణలో శాంతి భద్రతలు కాపాడం మా మొదటి కర్తవ్యం. తెలంగాణ అభివృధికి, పెట్టుబడులు రాకకు లా అండ్ ఆర్డర్ ఎంతగానో దోహదపడుతుంది. మా ముందు ఉన్న లక్ష్యం స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా నిర్వహించడం. మీడియా సహకారం చాలా అవసరం. పోలీస్ శాఖలో 17 వేల పోస్టులు ఖాళీ ఉన్నాయి, వాటిని భర్తీ చేయాలి. మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవడండి. మావోయిస్టులపై నమోదు అయిన కేసులు విషయంలో సానుకూలంగా వ్యవహరిస్తా. మావోయిస్టుపై వేధింపులు ఉండవు. ప్రభుత్యం ముందు మీరు ఆత్మసమర్పణ చేసుకోండి, ముందుకు రండి. మావోయిస్టు పార్టీ నుండి బయటికి రండి. మావోయిస్టు పొలిట్ బ్యూరో సుజాత ఇటీవలే మావోయిస్టు పార్టీని వీడారు. వేణుగోపాల్ ఇచిన స్టేట్మెంట్ జగన్ ఖండించారు. మావోయిస్ట్ నేత జగన్ ఇచిన స్టేట్మెంట్ అందరూ చూసాం. వీరి మధ్యలో సమస్యలు ఉన్నట్లు తెలుస్తుంది. ప్రభుత్వం మావోయిస్టులకు అందించాల్సిన బెనిఫిట్స్ అందిస్తాం. సైబర్ క్రైమ్ నేరాలు అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకుంటాం. పోలీస్ సిబ్బంది స్కిల్స్ పెంచుతాం. బేసిక్ పోలింగ్ అండ్ విజువల్ పోలీసింగ్ మానిటరింగ్ సిస్టమ్ ఇంప్రూవ్ చేస్తాము’ అని కొత్త డీజీపీ శివధర్ రెడ్డి చెప్పారు.
భారతమాత సేవకే ఆర్ఎస్ఎస్ అంకితమైంది: పీఎం మోడీ
ఢిల్లీలోని డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో ఆర్ఎస్ఎస్ శతాబ్ధి ఉత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆర్ఎస్ఎస్ శతాబ్ధి ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన ఆర్ఎస్ఎస్ శతాబ్ధి ఉత్సవాలను పురస్కరించుకొని తపాలా బిళ్ల, నాణెంను విడుదల చేశారు. అనంతరం ప్రధాని మాట్లాడుతూ.. ముందుగా దేశ ప్రజలందరికీ నవరాత్రి శుభాకాంక్షలు చెప్పారు. వందేళ్లు పూర్తి చేసుకున్న ఆర్ఎస్ఎస్, ఆర్ఎస్ఎస్ సేవకులకు అభినందనలు చెప్పారు. గత వందేళ్లలో ఆర్ఎస్ఎస్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిందని పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ అంటే విజయం, ఆర్ఎస్ఎస్‌కు దేశమే ముఖ్యం అని చెప్పారు. దేశానికి సేవ చేసేందుకు సంఘ్ ఎప్పుడూ ముందుంటుందని వెల్లడించారు. దేశమే ప్రథమం అనేది సంఘ్ విధానం అని పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ సేవకులు నిస్వార్థంగా పని చేస్తారని ప్రధాని చెప్పారు. మన సంస్కృతి, సంప్రదాయాలను సంఘ్ రక్షిస్తోందని, దేశ అభివృద్ధిలో ఆర్ఎస్ఎస్‌ది కీలకమైన పాత్ర అని అన్నారు. సంఘ్ దేశాభివృద్ధి కోసమే పని చేస్తోందని, కొందరు ఆర్ఎస్‌ఎస్‌పై తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేశారని చెప్పారు. ఆర్ఎస్ఎస్‌పై ఎన్నో అక్రమ కేసులు పెట్టారని గుర్తు చేశారు. భారతమాత సేవకే ఆర్ఎస్ఎస్ అంకితమైందని వెల్లడించారు.
బలూచ్‌లో బలం చూపని పాక్.. ఉగ్రమూకల చేతిలో చావుదెబ్బ
పాక్ పార్లమెంటులో ముర్తజా మాట్లాడుతూ.. “పాకిస్థాన్ నిజంగా బలూచిస్థాన్‌ను పాలిస్తుందా?” అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బలూచిస్థాన్ రాజధాని క్వెట్టాలో ఇటీవల పాకిస్థాన్ సైనిక నియంత్రణ ఐదు కిలోమీటర్లకు తగ్గించినట్లు పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో పాకిస్థాన్ మంత్రులు, ఎంపీలు రోడ్డు మార్గంలో ప్రయాణించలేరు.. ఎందుకంటే ఈ రోడ్లను తిరుగుబాటుదారులు ఆక్రమించుకున్నారు. జాతీయ అసెంబ్లీ, ప్రావిన్సులకు ఎన్నికైన ప్రజలు కూడా ఈ రోడ్లపై నడవలేకపోతే, ఇప్పటికైనా పాక్ ప్రభుత్వం, సైన్యం మేల్కొనాలని హితవు పలికారు.
మరీ ఇలా తయారేంట్రా.. రీల్స్ కోసం ఇంతగణమా…
ఈ మధ్య యువత రీల్స్ కోసం ఏలాంటి పని చేసేందుకైనా సిద్ధమవుతున్నారు. ఒక్కోసారి ప్రాణాలను కూడా ఫణంగా పెడుతున్నారు. వీళ్లు చేసే దారుణమైన స్టంట్స్ చూసి నెటిజన్లు విపరీతంగా ఫైర్ అవుతున్నారు. అటువంటి ఘటనే చత్తీస్ గఢ్ లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ లో షాకింక్ ఘటన జరిగింది. ఐదుగురు యువకులు స్కూటర్‌పై ప్రమాదకరమైన ఫీట్లు చేశారు. ఒకే స్కూటీపై ఐదుగురు రిస్క్ స్టంట్ చేస్తూ కనిపించారు. పైగా హెల్మెట్ లేకుండా హై స్పీడ్‌లో నడుపుతూ.. నలుగురు స్కూటీపై కూర్చుని.. ఐదో వ్యక్తిని గాల్లో ఎత్తుకున్నారు. గతంలో ఓ వ్యక్తి ఢిల్లీ-గురుగ్రామ్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఒక వ్యక్తి ప్రమాదకర విన్యాసాలు చేస్తూ రీల్స్ చేశాడు. అతను తన బైక్‌పై నిలబడి, తన ప్రదర్శనను చూపించడానికి ప్రయత్నిస్తూ.. తిరిగి బైక్ పై కూర్చోడానికి ప్రయత్నిస్తుండగా.. ముందున్న కారు ఢీకొట్టింది.
మాతో పెట్టుకోవద్దు.. పోలీసులకు ఐ బొమ్మ స్వీట్ వార్నింగ్
ఐబొమ్మ నిర్వాహకులను త్వరలోనే పట్టుకుంటాము. వారిని అరెస్ట్ చేసి చూపిస్తామని పైరసీ సినిమాలను అప్లోడ్ చేసే వెబ్ సైట్ ఐబొమ్మకు మాజీ సీపీ సీవీ ఆనంద్ రెండు రోజుల క్రితం హెచ్చరించారు. ఆయన వ్యాఖ్యలకు ఐబొమ్మ నిర్వాహకులు అంతే స్థాయిలో బదులిస్తూ కొన్ని అంశాలను ప్రస్తావించారు. ‘ఐ బొమ్మ మీద మీరు ఫోకస్ చేస్తే మేము ఎక్కడ ఫోకస్ చేయాలో అక్కడ చేస్తాం’. డిస్ట్రిబ్యూటర్స్ కి ప్రింట్స్ అమ్మిన తరువాత మీరు ఎం పట్టనట్టు కెమెరా ప్రింట్స్ తీసిన వాళ్ళ మీద కాకుండా మీ OTT రెవిన్యూ కోసం ఆలోచిస్తూ మా మీద ఫోకస్ పెట్టారు. మా వెబ్‌సైట్‌ను బ్లాక్ చేస్తే మీ ఫోన్ నంబర్లు బయటపెడతాం. మా టెలిగ్రామ్ గ్రూపులు, సబ్‌స్క్రిప్షన్లు బహిర్గతం చేస్తాం. రూ. 5 కోట్ల మందికి పైగా యూజర్ల సమాచారం మా దగ్గర ఉంది. మీడియా, OTT, హీరోలకూ షాకింగ్ రివీల్ అవుతుంది. ప్రతి యూజర్ ఫోన్ నంబర్ మా డేటాబేస్‌లో ఉంది. ఇండియా మొత్తంలో మా సపోర్ట్ ఉంది. మా వెబ్‌సైట్ బ్లాక్ చేస్తే – మీరే ఎక్స్‌పోజ్ అవుతారు. ఫ్యాన్స్‌కి సీక్రెట్‌గా ఉన్న హీరోల పేర్లు బయట పెడతాం. మమ్మల్ని టార్గెట్ చేస్తే ఇండస్ట్రీకి పెద్ద షాక్ వస్తుంది. రూ. 5 కోట్ల యూజర్లను ఒకేసారి రివీల్ చేయగలమని హెచ్చరిక!
‘మన శంకరవరప్రసాద్ గారు’.. నయనతార పాత్ర అప్‌డేట్ వచ్చేసింది
అగ్ర కథానాయకుడు చిరంజీవి హీరోగా, దర్శకుడు అనిల్ రావిపూడి రూపొందిస్తున్న చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు (MSG)’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలో చిరుతో పాటు టీమ్ మొత్తం ఫుల్ ఎనర్జీతో ఉన్నారు. తాజాగా దర్శకుడు అనిల్ రావిపూడి ఓ కీలక అప్‌డేట్ షేర్ చేశారు. సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న నయనతార పాత్రను పరిచయం చేస్తూ పోస్టర్‌ను విడుదల చేశారు. ఆమె ఈ చిత్రంలో శశిరేఖ పాత్రలో కనిపించనున్నారు. నయనతారతో కలిసి వర్క్ చేయడం చాలా ఎంజాయ్ చేస్తున్నానని అనిల్ తెలిపారు. ఆమె పాత్ర సినిమాకు మరింత అందాన్ని తెస్తుందని.. అలాగే దసరా సందర్భంగా మరో పెద్ద సర్‌ప్రైజ్ ఇవ్వనున్నట్లు కూడా దర్శకుడు స్పష్టం చేశారు. ఇప్పటికే కేరళలో కొన్ని షెడ్యూల్స్ పూర్తి చేసిన టీమ్, ప్రస్తుతం హైప్ క్రియేట్ చేసే సాంగ్స్ షూటింగ్‌లో బిజీగా ఉంది. ఈ పాటలు చిరు కెరీర్‌లోనే కొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని యూనిట్ నమ్మకంగా చెబుతోంది. 2026 సంక్రాంతికి ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేసి ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ ఇవ్వాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక అక్టోబర్ 5 నుంచి మరో అగ్రనటుడు వెంకటేశ్ కూడా షూటింగ్‌లో జాయిన్ కానున్నారు.
జీవీ ప్రకాష్ & సైంధవి ప్రేమ కథకు ముగింపు పలికిన చెన్నై హైకోర్టు..
నటుడు, సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ 2013లో తన చిన్ననాటి స్నేహితురాలు సైంధవిని వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ఒక కుమార్తె ఉంది. వివాహం తర్వాత, జీవీ ప్రకాష్ సినిమాటిక్ కెరీర్‌లో సక్సెస్ సాధించగా, సైంధవి సింగర్‌గా గుర్తింపు సంపాదించుకుంది. కానీ, కొన్ని సంవత్సరాల తర్వాత జంట మధ్య విభేదాలు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. వీరు ఈ విభేదాలను సర్దుకోవడానికి ప్రయత్నించినప్పటికీ, వ్యక్తిగత కారణాల వల్ల పరస్పర అంగీకారంతో విడాకుల కోసం నిర్ణయం తీసుకున్నారు. తాజాగా, వీరు విడాకులు తీసుకోవాలని చెన్నై హైకోర్ట్‌లో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌లో, జంట విడాకులు పరస్పర అంగీకారంతో తీసుకోవాలనే అభ్యర్థన తెలిపారు. హైకోర్టు ఈ కేసును విచారించగా, రెండు వైపుల వారి కుటుంబ పరిస్థితులను బాగా పరిశీలించింది. వీరి కుమార్తె పట్ల సరైన పరిరక్షణ, మద్దతు కల్పించడం, ఆర్థిక వ్యవహారాలపై కూడా హైకోర్టు చర్చలు జరిపింది. ఇవ్వని పరిగణలోకి తీసుకొని, చెన్నై హైకోర్ట్ ఫైనల్‌గా వీరికి విడాకులు మంజూరు చేసింది. చెన్నై హైకోర్టు తీర్పుతో 2013లో ప్రారంభమైన జీవీ ప్రకాష్ & సైంధవి ప్రేమ కథకు అధికారిక ముగింపు పలికింది. ఇద్దరు కూడా ఈ స్వీకరించారు అని సమాచారం. అంతే కాదు ఈ తీర్పు ద్వారా జీవీ ప్రకాష్ & సైంధవి తమ కుమార్తె భవిష్యత్తులో విషయంలో మాత్రం తల్లిదండ్రులుగా వ్యవహరించాలి అని తేల్చారు. ఇక సినీ పరిశ్రమలో వీరి అనుబంధం, విడాకుల విషయం మీడియా, అభిమానుల మధ్య హాట్ టాపిక్‌గా మారింది.