ఆన్‌లైన్‌లో ఉచిత ఇసుక బుకింగ్.. ఇక అన్నీ పోర్ట్‌లోనే..!
ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వ హయాంలో ఇసుక దందా జరిగిందని ఆరోపిస్తూ వచ్చిన కూటమి నేతలు.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉచిత ఇసుక విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది.. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా స్టాక్‌ను బట్టి ఇసుక సరఫరా కొనసాగిస్తున్నారు.. అయితే, ఇసుక సరఫరాలో మరింత పారదర్శకత తీసుకొచ్చే విధంగా ఆన్‌లైన్ విధానానికి శ్రీకారం చుడుతోంది చంద్రబాబు నాయుడు సర్కార్.. ఈరోజు నుంచి ఏపీలో ఇసుక ఆన్‌లైన్ బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. వినియోగదారులు ఉచిత ఇసుకను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం.. ఇందుకోసం ప్రత్యేకంగా వెబ్‌పోర్టల్ ఏర్పాటు చేసింది. ఇవాళ్టి నుంచి ఏపీలో ఉచిత ఇసుక ఆన్లైన్ బుకింగ్ విధానం అమల్లోకి రాబోతోంది.. ఉచిత ఇసుక పోర్టల్‌ను ఆవిష్కరించనున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. గ్రామ, వార్డు సచివాలయాల్లోనే ఇసుక బుక్ చేసుకునే అవకాశం కల్పించనున్నారు.. అధికారులు నుంచి ఇసుక రవాణాదారుల ఎవ్వరూ తప్పిదాలకు పాల్పడకుండా పోర్టల్ రూపకల్పనకు పూనుకుంది సర్కార్.. జిల్లా స్థాయిలో కలెక్టర్, అధికారుల నేతృత్వంలో కమిటీలు ఏర్పాటు చేయనున్నారు.. ఇసుక స్టాక్ ఎంత ఉంది..? సరఫరా కేంద్రాలెన్ని..? లాంటి వివరాలను కూడా పోర్టల్‌లో చూసుకునే వెసులుబాటు ఉంటుంది.. 2000 చదరపు అడుగుల్లోపు నిర్మాణాలకు సాధారణ బుకింగ్స్ అమలు చేయనుండగా.. 2000 చదరపు అడుగులు మించితే బల్క్ విధానంలో బుక్ చేసుకునేలా పోర్టల్ రూపకల్పన చేసింది ఏపీ ప్రభుత్వం.. ఏపీ శాండ్ పోర్టల్ పేరిట ఈ పోర్టల్ రూపొందించారు.. ఇక, అధికారులు ఇప్పటికే ఏపీ ఇసుక నిర్వహణ పోర్టల్, యాప్‌ను ఏర్పాటు చేశారు. అదేవిధంగా అన్ని జిల్లాల వివిధ శాఖల ఉద్యోగులందరికీ శిక్షణ ఇచ్చారు. సెప్టెంబరు 11 నుంచి ఆన్‌లైన్‌లో ఇసుక బుకింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా, రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాల కారణంగా అది ఆలస్యమైంది.
వైసీపీకి షాక్‌ల మీద షాక్‌లు..! రాజీనామాకు సిద్ధమైన మరో కీలక నేత..
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్‌లమీద షాక్‌లు తగులుతూనే ఉన్నాయి.. నిన్నటికి నిన్నే మాజీ మంత్రి, సీనియర్ నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి.. వైసీపీ రాజీనామా చేసిన విషయం విదితమే కాగా.. ఇప్పుడు కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను సైతం పార్టీకి గుడ్‌బై చెప్పేందుకు సిద్ధమయ్యారట.. రేపు వైసీపీకి రాజీనామా చేయనున్నారట జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే ఉదయభాను.. ఈ నెల 22వ తేదీన జనసేన పార్టీలో చేరతారని ప్రచారం సాగుతోంది.. ఇప్పటికే ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో టచ్‌లోకి వెళ్లారట ఉదయభాను.. రేపు నియోజక వర్గంలో కార్యకర్తలతో సమావేశం కానున్న ఉదయభాను.. తన నిర్ణయాన్ని కార్యకర్తలతో పంచుకుంటారని తెలుస్తోంది.. అయితే, ఆరు సార్లు పోటీ చేసి మూడు సార్లు గెలిచిన ఉదయభాను.. రెండు సార్లు ప్రభుత్వ విప్‌గా పనిచేశారు.. ఏపీలో ఘోర ఓటమి తర్వాత వైసీపీకి రాజీనామా చేసే నేతల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది.. ఇప్పటికే పలువురు ఎంపీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేటర్లు.. ఇలా చాలా మంది వైసీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ కోవలో తాజాగాఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నేత సామినేని ఉదయభాను కూడా చేరిపోయారు.. ఇప్పటికే జగ్గయ్యపేట నియోజకవర్గంలో పెద్ద ఎత్తున బ్యానర్లు, ఫ్లెక్సీలు తయారుచేస్తున్నారని తెలుస్తోంది.. కాపు సామాజివర్గానికి చెందిన సామినేని ఉదయభాను 1999, 2004ల్లో జగ్గయ్యపేట నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009, 2014 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. 2019లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగి విజయం సాధించారు. మొత్తం మీద మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.
టూరిజానికి పెద్దపీట.. ఈ ప్రాంతాలపై ఫోకస్..
ఏపీలో టూరిజానికి పెద్దపీట వేస్తున్నాం.. గత వైసీపీ ప్రభుత్వం టూరిజాన్ని పూర్తిగా నాశనం చేసింది అన్నారు మంత్రి కందుల దుర్గేష్.. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. 27న విజయవాడలో ప్రపంచ పర్యాటక దినోత్సవం నిర్వహిస్తున్నాం.. ఈ సందర్భంగా వివిధ విభాగాల్లో అవార్డులు ప్రదానం చేస్తాం అన్నారు.. ఇప్పటికే ఎంట్రీ లను ఆహ్వానిస్తున్నాం అన్నారు.. కేంద్రం కూడా ఏపీ టూరిజానికి అధిక ప్రాధాన్యత ఇస్తుంది.. దీనిపై ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రిని కలిసి వచ్చాను అన్నారు.. అక్టోబర్ 15న కేంద్రానికి టూరిజం డెవలప్‌మెంట్‌కు నివేదిక అందిస్తాం.. 250 కోట్లు కేటాయించడానికి కేంద్రం ముందుకు వచ్చింది.. శ్రీశైలం టెంపుల్ టూరిజం అభివృద్ది చేస్తాం.. అఖండ గోదావరి టూరిజం ప్రాజెక్టు తెస్తున్నాం.. పట్లలో బీచ్ డెవలప్‌మెంట్ చేయబోతున్నాం.. సంగమేశ్వర ప్రాజెక్టును టూరిజం కారిడార్ గా చేస్తాం.. ఎకో టూరిజం ఇందులో ప్రాధాన్యం ఇస్తాం.. పర్యాటకులు టూరిజం కేంద్రాల్లో మూడు, నాలుగు రోజులు ఆహ్లాదకరంగా గడిపేందుకు మౌలిక వసతులు పెంచుతున్నాం అన్నారు.
జెమిలి ఎన్నికలు.. మంచి ఆశయంతో ఉన్నాం..
జెమిలి ఎన్నికలపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి హర్షం వ్యక్తం చేశారు. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కమిటీ జెమిలి ఎన్నికలకు సిఫార్సు చేయడాన్ని అభినందించారు. జెమిలి ఎన్నికలపై పార్లమెంట్ లో రాజ్యాంగ సవరణ జరగాల్సి ఉందన్నారు. దీని వలన పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల తర్వాత వంద రోజులకు స్థానిక ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్కసారి ఎన్నికలు జరగడం వలన కోడ్ ఆఫ్ కాంటాక్ట్ అమలులోకి వచ్చి అభివృద్ధికి అవరోధం ఏర్పడుతుందన్నారు. అభివృద్ధికి అవరోధం లేకుండా ఉండేందుకే జమిలి ఎన్నికలు ఎంతో ఉపయోగంగా పేర్కొన్నారు. దేశంలో ఒకేసారి ఎన్నికలు అయిపోతేనే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. జెమిలి ఎన్నికలపై మంచి ఆశయంతో ఉన్నామని అన్నారు. దేశ మంచిని దృష్టిలో పెట్టుకుని జెమిలి ఎన్నికలపై కాంగ్రెస్ ఆలోచన చేయాలని అభ్యర్థన చేశారు. విదేశాలకు వెళ్లి కాంగ్రెస్ దేశ గౌరవాన్ని భంగం చేస్తుందని మండిపడ్డారు దగ్గుబాటి పురంధేశ్వరి.. కాగా, జమిలి ఎన్నికలకు మరో ముందడుగు పడింది.. వన్ నేషన్-వన్ ఎలక్షన్ ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.. రాజ్‌నాథ్ కోవింద్ కమిటీ నివేదికకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం విదితమే.. శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్ ముందుకు బిల్లు తీసుకొచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోన్న విషయం విదితమే.
యాదాద్రి భక్తులకు ఊరట.. ఆలయ సమీపంలో లింక్ ఫ్లైఓవర్ ఏర్పాటు ..
తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో యాదాద్రి కూడా ఒకటి. ఇది రాష్ట్రంలోని మరో తిరుపతి ప్రసిద్ధి గాంచిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. అయితే లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం కోసం భక్తులు తరచుగా ఇక్కడికి వస్తుంటారు. ముఖ్యంగా పండుగలు, ప్రత్యేక రోజులు, సెలవు దినాల్లో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో యాదాద్రి ఆలయానికి వస్తుంటారు. దీంతో ప్రత్యేక రోజుల్లో కూడా యాదాద్రికి వెళ్లే రహదారులపై ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటుంది. స్వామివారిని దర్శించుకోవాలనుకునే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే త్వరలోనే భక్తులకు ఆ సమస్య నుంచి ఉపశమనం లభించనుంది. తాజాగా యాదాద్రి భక్తులకు ధార్మిక శాఖ మంత్రి కొండా సురేఖ శుభవార్త తెలిపారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో దేశంలోనే రెండో అతిపెద్ద స్టీల్ లింక్‌ను త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. యాద్రాదిలోని ఆలయానికి ఇప్పటి వరకు భక్తులు ఎగ్జిట్ ఫ్లైఓవర్‌పై ఆధారపడి వచ్చేవారు. అయితే లింక్ బ్రిడ్జి అందుబాటులోకి రావడంతో భక్తులకు ఊరట లభిస్తుందని మంత్రి సురేఖ పేర్కొన్నారు. అలాగే యాదాద్రి ఆలయ సమీపంలో నిర్మించనున్న 64 మీటర్ల వంతెనను వచ్చే మూడు నెలల్లో నిర్మించి భక్తులకు అందుబాటులోకి తెస్తామని తెలిపారు. అంతేకాదు యాదాద్రి గర్భాలయానికి బంగారు తాపడంపై ఆయన కీలక ప్రకటన చేశారు. త్వరలో బంగారు తవ్వకం పనులు ప్రారంభిస్తామన్నారు. అలాగే యాదాద్రి సమీపంలోని రాయగిరిలో సుమారు 20 ఎకరాల్లో కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో రూ.43 కోట్లతో నిర్మిస్తున్న వేద పాఠశాల నిర్మాణ పనులు ప్రారంభిస్తున్నట్లు మంత్రి వివరించారు.
5 లక్షల ఇళ్లు, 2 లక్షల ఉద్యోగాలు, బాలికలకు స్కూటర్లు.. హర్యానాలో బీజేపీ హామీలు
హర్యానా అసెంబ్లీ ఎన్నికల తీర్మాన లేఖను బీజేపీ విడుదల చేసింది. పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా నేతృత్వంలో ఈ తీర్మాన లేఖను విడుదల చేశారు. కాంగ్రెస్ 7 హామీలతో పోలిస్తే బీజేపీ మొత్తం 20 వాగ్దానాలు చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడుతూ.. 2014లో తాము ఇచ్చిన హామీలేవీ నెరవేర్చామని అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ‘‘మేము హర్యానాలో చాలా పని చేసాము, నేను ఢిల్లీ నుండి రోహ్‌తక్ చేరుకోవడానికి కేవలం గంటన్నర సమయం పట్టింది. దీన్నిబట్టి రాష్ట్రంలో మనం ఎంత పనిచేశామో అర్థమవుతుంది. రాష్ట్రంలో రైల్వే బడ్జెట్ గతంలో కంటే 9 రెట్లు పెరిగింది.’’ అని నడ్డా అన్నారు. బీజేపీ ఏం వాగ్దానాలు చేసిందో తెలుసుకుందాం…
1.వెనుకబడిన కులాలకు ప్రత్యేక సంక్షేమ బోర్డు.
2. గ్రామీణ బాలికల విద్యార్థులకు స్కూటర్లు ఇస్తామని హామీ ఇచ్చారు.
3. ఓబీసీ కేటగిరీ వారందరికీ రూ. 25 లక్షల వరకు రుణ ప్రతిపాదన
4. హర్యాన్వి అగ్నిమాపక సిబ్బందికి ప్రభుత్వ ఉద్యోగాలు
5. 24 పంటలు కనీస మద్దతు ధర వద్ద కొనుగోలు చేయబడతాయి.
6. ప్రతి జిల్లాలో ఒలింపిక్ క్రీడల శిక్షణను నిర్వహించడం.
7. హర్యానాలోని మహిళలకు రూ.2100 మొత్తం ఇవ్వబడుతుంది.
8.రాష్ట్రంలో 2 లక్షల మంది యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
9. పట్టణ. గ్రామీణ ప్రాంతాల్లో 9. 5 లక్షల పీఎం గృహాలు అందించబడతాయి.
10. ప్రభుత్వ ఆసుపత్రుల్లో డయాలసిస్ సేవ ఉచితం.
11.హర్ ఘర్ గృహిణి యోజన కింద మహిళలందరికీ సిలిండర్‌పై రూ. 500 సబ్సిడీ.
సుప్రీంకోర్టులో టెలికాం కంపెనీలకు షాక్..
తమ అడ్జెస్టెడ్ గ్రాస్ రెవెన్యూ (ఏజీఆర్) బకాయిలపై సుప్రీంకోర్టు నిర్ణయాన్ని పునర్ విచారించాలంటూ టెలికాం కంపెనీలు దాఖలు చేసిన పిటిషన్‌ను ఈరోజు తిరస్కరించింది. వొడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్‌టెల్ ఇతర కంపెనీలు 2019లో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలపై గతేడాది క్యూరేటివ్ పిటిషన్ ఫైల్ చేశాయి. దీనిపై ఓపెన్ కోర్టులో నిర్ణయం ప్రకటించాలని వేడుకున్నాయి. టెలికామ్ డిపార్ట్‌మెంట్ (డీవోటీ) ఏజీఆర్ బకాయిల గణనలో భారీ తప్పిదం చోటు చేసుకొందని కంపెనీలు వాదనలు వినిపించాయి. తమ పిటిషన్‌ను ఓపెన్ కోర్టులో ఎంక్వైరీ చేయాలని.. ఎయిర్‌టెల్, ఒడాఫోన్ గతేడాది కోర్టును కోరాయి. ఈ ఏజీఆర్ ఛార్జీలు ప్రభుత్వం- కంపెనీలు ఆదాయం పెంచుకునే విధానంలో ఉన్నాయని తెలిపాయి. దీని కిందే లైసెన్సింగ్ ఫీజులు, స్పెక్ట్రమ్ వినియోగ ఫీజలు చెల్లిస్తాయని పేర్కొన్నాయి. కానీ, డీవోటీ మాత్రం ఏజీఆర్‌లో శాతాలుగా గణించాయని చెప్తున్నాయి. 2005 నుంచి ఏజీఆర్ అనేది ఇబ్బందికర అంశంగానే మారిందని ఐడీయా- ఎయిర్ టెల్ కంపెనీలు పేర్కొన్నాయి.
జమ్మూ కాశ్మీర్‌లో కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్ కూటమిదే అధికారం..
ఆర్టికల్ 370పై పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ హాట్ కామెంట్స్ చేశారు. జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370కి సంబంధించిన విషయంలో కాంగ్రెస్- నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి వైఖరితో షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం ఏకీభవిస్తుందన్నారు. తాజాగా ఓ మీడియా చానల్‌కు పాక్ మినిస్టర్ ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్-ఎన్సీ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. కాశ్మీర్‌లో ఆర్టికల్ 370, 35A పునరుద్దరించే విషయంలో పాకిస్థాన్, కాంగ్రెస్-ఎన్సీ కూటమి ఓకే వైఖరితో ఉన్నాయని వెల్లడించారు. కాగా, పాకిస్థాన్ రక్షణ మంత్రి ఆసిఫ్ వ్యాఖ్యలపై బీజేపీ రియాక్ట్ అయింది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ దేశ ప్రయోజనాలకు విఘాతం కలిగించే వారి వైపే నిలుస్తుందని ఆరోపించింది. ‘పాకిస్థాన్ ఒక ఉగ్రదేశం.. కశ్మీర్‌పై కాంగ్రెస్, నేషనల్ కాంగ్రెస్ పార్టీ వైఖరిని సమర్థిస్తుంది అని పేర్కొనింది. గురుపత్వంత్ సింగ్ పన్నూన్ నుంచి పాక్ వరకు భారతదేశ ప్రయోజనాలకు విరుద్ధమైన వారి వైపు రాహుల్, కాంగ్రెస్ నిలుస్తుందని బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ ఎక్స్ వేదికగా విమర్శించారు. కాగా, ఆర్టికల్ 370ని పునరుద్ధరిస్తామని ఎన్సీ హామీ ఇచ్చింది.. కానీ, కాంగ్రెస్ ఈ అంశంపై మౌనంగా ఉండిపోయింది. అయితే, కశ్మీర్‌కు పూర్తి రాష్ట్ర హోదాను పునరుద్ధరించడానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని పలుమార్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో పాక్ రక్షణ మంత్రి అసిఫ్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ నెల 21న ఢిల్లీ సీఎంగా అతిషి మర్లెనా ప్రమాణ స్వీకారం..
ఢిల్లీ ముఖ్యమంత్రిగా సెప్టెంబర్ 21వ తేదీన అతిషి మర్లెనా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అతిషితో ముఖ్యమంత్రిగా ఢిల్లీ ఎల్జీ వీకే సక్సేనా ప్రమాణ స్వీకారం చేయుంచనున్నారు. అతిషితో పాటు మంత్రులుగా పలువురు నేతలు ప్రమాణం చేయనున్నారు. సెప్టెంబర్ 17న సీఎం పదవికి రాజీనామా చేసిన అరవింద్ కేజ్రీవాల్.. ఢిల్లీ 8వ ముఖ్యమంత్రిగా అతిషి ఎన్నిక అయ్యారు. ఇక, అతిషి ఢిల్లీ అసెంబ్లీలోని కల్కాజీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కొత్త సర్కార్ లో ఎవరికి కేబినెట్‌లో చోటు దక్కుతుందనే చర్చ జోరుగా కొనసాగుతుంది. కేబినెట్‌లో పాత మంత్రులతో పాటు మరో కొత్త వారికి సైతం అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు. కేబినెట్‌లో ఖాళీగా ఉన్న పదవులతో పాటు ప్రాంతీయ, కుల సమీకరణాలను కూడా లెక్కలోకి తీస్కోని ఆమ్ ఆద్మీ పార్టీ కసరత్తు చేస్తుంది. అలాగే, ఢిల్లీకి మూడవ మహిళా ముఖ్యమంత్రిగా ఆమె పని చేయనున్నారు. గతంలో ఢిల్లీకి మహిళా సీఎంలుగా సుష్మాస్వరాజ్, షీలా దీక్షిత్ పని చేశారు. కాగా, 15 సంవత్సరాల 25 రోజుల పాటు ముఖ్యమంత్రిగా షీలా దీక్షిత్ కొనసాగారు. 1998లో 52 రోజుల పాటు ఢిల్లీ సీఎంగా సుష్మాస్వరాజ్ బాధ్యతలు నిర్వహించారు. కాగా, ఇప్పుడు అతిషి ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
పెవిలియన్‌కు వరుసగా క్యూ కట్టిన టీమిండియా టాప్ ప్లేయర్స్..
భారత్, బంగ్లాదేశ్ రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో మొదటి మ్యాచ్ నేటి నుండి చెన్నైలోని MA చిదంబరం స్టేడియంలో జరుగుతుంది. బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటో టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన టీమ్ ఇండియా స్కోరు 14 వద్ద కెప్టెన్ రోహిత్ శర్మ రూపంలో తొలి వికెట్ పడింది. హిట్‌మ్యాన్ కేవలం 6 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద హసన్‌కు బౌలింగ్ లో క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీని తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన శుభ్‌మన్ గిల్ ఖాతా కూడా తెరవలేక హసన్‌కు రెండో బాధితుడిగా మారాడు. స్కోరు 28 వద్ద గిల్ వికెట్ పడిపోయింది. హసన్ తన మొదటి స్పెల్‌లో 34 పరుగుల వద్ద విరాట్ కోహ్లీ మూడవ వికెట్ రూపంలో అవుట్ అయ్యాడు. కోహ్లీ 6 పరుగులు చేసిన తర్వాత ఔటయ్యాడు. మూడు వికెట్లు పడిన తర్వాత పంత్ – జైస్వాల్ జోడీ భారత్‌పై పట్టు సాధించింది. లంచ్ బ్రేక్ వరకు టీమ్ ఇండియా మరో వికెట్ కోల్పోకుండా 88/3 పరుగులతో కొనసాగుతుంది. పంత్ – జైస్వాల్ మధ్య 54 పరుగుల భాగస్వామ్యం కొనసాగుతోంది. మొత్తానికి మొదటి సెషన్ లో బంగ్లాదేశ్ ఆధిపత్యం కొనసాగించిందని చెప్పవచ్చు. రిషబ్ పంత్ 33 పరుగులతో క్రీజులో ఉండగా, యశస్వి జైస్వాల్ 37 పరుగులతో క్రీజులో ఉన్నారు. 34 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి ఇన్నింగ్స్‌ను చేజిక్కించుకున్న వీరిద్దరూ ఇప్పటి వరకు 54 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
అల్లు అర్జున్ – సుక్కుల ‘పుష్ప -2’ షూటింగ్ కీలక అప్ డేట్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో రూపొందిన పుష్ప ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం పుష్ప సినిమాకి కొనసాగింపుగా వస్తున్న పుష్ప 2 పై భారీ అంచనాలు ఉన్నాయి. అటు బన్నీ అభిమానులు ఇటు సినీ ప్రియులు ఈ సినిమా కోసం ఎంత గానో ఎదురు చూస్తున్నారు. ఆగస్టులో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా షూటింగ్ డిలే కారణంగా డిసెంబర్ లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయడానికి మూవీ మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి కీలక అప్ డేట్ వెలువడింది. ఇప్పటివరకు ఫస్టాఫ్ వర్క్ పూర్తవ్వగా.. సెకండాఫ్ మూవీ షూటింగ్ దశలో ఉందట. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీ లో జరుగుతోంది. పుష్ప 2 సినిమాలో మొత్తం నాలుగు పాటలు ఉన్నాయట. జాతర పాట సినిమాకే హైలైట్ గా నిలుస్తోందని ఎప్పటి నుంచో టాలీవుడ్ సిర్కిల్స్ లో గట్టిగా వినిపిస్తోంది. కానీ, ఈ పాటను లిరికల్ సాంగ్ రిలీజ్ చేయకుండా మాత్రం నేరుగా థియేటర్లలోనే విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది యూనిట్. ఈ పాటకు థియేటర్లు దద్దరిల్లడం ఖాయం అని టాక్. ఈ సినిమా షూటింగ్ అక్టోబర్ చివరి నాటికి పూర్తి కానుందని సమాచారం. పుష్ప-2లో రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రీ మూవీమేకర్స్ నిర్మించే ఈ భారీ బడ్జెట్ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా పుష్ప -2 డిసెంబర్ 6వ తేదీన వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
సీనియర్ హీరోలకు పోటీగా.. సంక్రాంతి బరిలో యంగ్ హీరో..
2025 సంక్రాంతికి మరోసారి పెద్ద, చిన్న సినిమాల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇప్పటికే పలు స్టార్ హీరోల సినిమాలు సంక్రాంతి రిలీజ్ కు కర్చీఫ్ వేసాయి. ఎలాగైనా సంక్రాంతికి వచ్చేలా షూటింగ్ చక చక చేస్తున్నాయి. వీటిలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా యంగ్ దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న విశ్వంభర అందరికంటే ముందుగా వచ్చే ఏడాది పొంగల్ రిలీజ్ అని ప్రకటించారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ చివరి దశలో ఉంది. ఇక పొంగల్ కు వస్తున్నా మరో స్టార్ వెంకీ, అనిల్ రావిపూడి ‘ సంక్రాంతికి వస్తున్నాం’ పొంగల్ రిలీజ్ కు జెట్ స్పీడ్ లో రెడీ అవుతోంది. ఇక బాబీ – బాలయ్య సినిమా కూడా సంక్రాంతికే మొగ్గు చూపుతున్నారు. ఇక ఇప్పుడు తాజాగా మరో యంగ్ హీరో సినిమా స్టార్ హీరోలతో పోటీ పడేందుకు సిద్దమయింది. ఇటీవల రాయన్ సినిమాలో ప్రశంసలు అందుకున్న సందీప్ కిషన్ వరుస సినిమాల్లో నటిస్తున్నాడు. ఆ కోవలో ధమాకా సినిమాతో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు త్రినాధ్ రావ్ నక్కిన తెరకెక్కిస్తున్న సినిమాలో నటిస్తున్నాడు ఈ యంగ్ హీరో. సంక్రాంతి బరిలో నిలిచేందుకు ఫుల్ స్వింగ్ లో లాంగ్ షెడ్యూల్ లో షూట్ చేస్తున్నారు మేకర్స్. అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను విడుదల చేయనున్నారు మేకర్స్. కాగా ఈ సినిమా నాన్ థియేటర్ బిఙినెస్ 22 కోట్లకు అమ్ముడయ్యాయి. ఇది ఇకారకంగా చెప్పాలంటే సందీప్ కెరీర్ హయ్యస్ట్. దీనితో పాటుగా రవితేజ సితార ఎంటర్టైన్మెంట్స్ సినిమా, నాగార్జున బంగార్రాజు -3 కూడా ఫెస్టివల్ రేస్ లో ఉన్నాయి.