తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్‌న్యూస్.. భారీగా నిధులు విడుదల
తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు శుభవార్త చెప్పింది కేంద్ర ప్రభుత్వం.. రెండు రాష్ట్రాల్లో రోడ్ల అభివృద్ధి కోసం నిధులు కేటాయించింది కేంద్రం.. అందులో ఆంధ్రప్రదేశ్‌కు 498 కోట్ల రూపాయలు కేటాయించగా.. తెలంగాణకి 516 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసింది.. ఏపీలో 200.06 కిలోమీటర్ల పొడవైన 13 రాష్ట్ర రహదారులకు కేంద్ర రహదారి మౌలిక వసతుల నిధి నుంచి నిధులు కేటాయించింది.. గుంటూరు – నల్లపాడు రైల్వే మార్గంలో శంకర్ విలాస్ ఆర్‌ఓబీ ని నాలుగు వరుసల నిర్మాణానికి 98 కోట్ల రూపాయలు కేటాయించగా.. తెలంగాణలో NH 565లోని నకిరేకల్ – నాగార్జున సాగర్ మధ్య 14 కిలోమీటర్ల పొడవు, 4-లేన్ బైపాస్ నిర్మాణానికి 516 కోట్ల రూపాయలు మంజూరు చేసింది..
కొత్త పాలసీలపై ఫోకస్.. సీఎం వరుస సమీక్షలు..
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వివిధ పాలసీల రూపకల్పనపై ఫోకస్ పెట్టారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. వివిధ పాలసీలపై వరుసగా రెండో రోజున సీఎం చంద్రబాబు సమీక్షలు జరపనున్నారు.. మద్యం, ఇసుక పాలసీలను ఇప్పటికే అమలు చేస్తోన్న ప్రభుత్వం. రీచుల్లో తవ్వకాలను అనుమతించాలని ఇటీవలే ఇసుక పాలసీలో మార్పులు చేసింది.. ఇక, ఏపీలో మైనింగ్ పాలసీపై తుది కసరత్తు చేస్తున్నారు సీఎం చంద్రబాబు. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ విధానామా..? లేక క్వారీల వేలం వేసే విధానామా..? అనే అంశంపై మైనింగ్ పాలసీ విషయంలో తర్జన భర్జన పడుతోంది.. ఇక, ఈ రోజు సాయంత్రం ఏపీ ఆర్థిక పరిస్థితిపై సమీక్షించనున్నారు సీఎం చంద్రబాబు. బడ్జెట్ ప్రవేశపెట్టే అంశంపై సమీక్షలో ప్రస్తావనకు వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు.. ఆదాయార్జన శాఖలను మరింత మెరుగుపరిచి ఏ విధంగా ఆదాయం సముపార్జించాలనే అంశంపై చర్చించనున్నారు ఏపీ సీఎం.. కేంద్ర పథకాలకు యూసీల చెల్లింపులు ఏ మేరకు జరుగుతున్నాయనే అంశంపై ఆరా తీయనున్నారు చంద్రబాబు. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల్లో ఏమైనా పెండింగ్ ఉన్నాయా..? ఉంటే వాటిని ఏ విధంగా తీసుకు రావాలనే అంశంపై ఈ సమావేశంలో సమీక్షించబోతున్నారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
పుంగనూరులో ఏనుగుల గుంపు.. రైతును తొక్కి చంపేశాయి..
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం ఏనుగుల గుంపు హల్‌చల్ చేసింది.. అటవీప్రాంతం నుంచి పంటపొలాల్లోకి దూసుకెళ్లిన ఏనుగులు గుంపు విధ్వంసం సృష్టించాయి.. దేవళంపేట, అయ్యావాండ్లపల్లె, ఎర్రపాపిరెడ్డి పల్లెలో ఏనుగుల గుంపు పంటలకు తీవ్ర నష్టం కలిగించాయి.. వరి పంటను తొక్కి నాశనం చేశాయి ఏనుగులు.. ఇక, ఏనుగుల దాడిలో ఓ రైతు మృతి చెందాడు.. పుంగనూరు నుండి పీలేరు వైపునకు వెళ్తున్న ఏనుగుల గుంపు.. పీలేరు సమీపంలో ఇందిరమ్మ కాలనీ వద్ద మామిడి తోటలోకి చొరబడ్డాయి.. ఏకంగా 15 ఏనుగులు గుంపు మామితోటలను ధ్వంసం చేసింది.. అయితే, మామిడి తోపు యజమాని రాజారెడ్డిని తొక్కి చంపేశాయి ఏనుగులు గుంపు. దీంతో, ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు పోలీసులు.. మరోవైపు ఏనుగుల గుంపు సృష్టించిన విధ్వంసంపై అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు రైతులు.. ఇక, ఆ ఏనుగులను తిరిగి అటవీ ప్రాంతంలోకి పంపించే విధంగా తీసుకోవాల్సిన చర్యలపై దృష్టిసారించారు ఫారెస్ట్ అధికారులు..
జిల్లాలకు ఇంఛార్జ్ మంత్రుల నియామకం.. పవన్ కల్యాణ్, లోకేష్‌కు నో ఛాన్స్..!
ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం జిల్లాలకు ఇంఛార్జ్ మంత్రులను నియమించింది.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది కూటమి సర్కార్.. అయితే, పలువురు మంత్రులను రెండేసి జిల్లాలకు ఇంఛార్జ్‌గా నియమించారు.. మంత్రులు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, గొట్టిపాటి రవి, అనగాని సత్య ప్రసాద్ లాంటి వారికి రెండు జిల్లా బాధ్యతలు అప్పగించారు.. అచ్చెన్నాయుడుకు పార్వతీపురంమన్యం, అంబేద్కర్ కోనసీమ జిల్లాల ఇంఛార్జ్ బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వం.. నిమ్మలకు తూర్పు గోదావరి, కర్నూలు జిల్లాల బాధ్యతలు.. గొట్టిపాటి రవికి పల్నాడు, పశ్చిమ గోదావరి జిల్లాల బాధ్యతలు.. అనగానికి శ్రీసత్యసాయి, తిరుపతి జిల్లాల బాధ్యతల అప్పగించింది.. అయితే, జిల్లాలకు ఇంఛార్జ్ మంత్రులను నియమించిన ప్రభుత్వం.. ఆ బాధ్యతలకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్‌ను దూరం పెట్టింది.. పవన్ కల్యాణ్, లోకేష్‌కు ఇంఛార్జ్ మంత్రుల బాధ్యతలు ఇవ్వకపోవడంతో నలుగురు మంత్రులకు రెండేసి జిల్లాల బాధ్యతలు అప్పగించింది.. ఇక, జనసేన మంత్రులకు ఏలూరు, గుంటూరు జిల్లాల బాధ్యతలు అప్పగించగా.. బీజేపీ మంత్రికి ఎన్టీఆర్ జిల్లా బాధ్యతలు అప్పజెప్పింది..
దీపావళి ఏ రోజు జరుపుకోవాలి..? పంచాంగ కర్తల మధ్య వివాదం..
ఏదైనా పండుగ వచ్చిందంటే చాలు.. ఈ రోజు జరుపుకుంటే మంచిదని కొందరు.. లేదు.. ఆ రోజే బెటర్ అని మరికొందరు వాదించిన సందర్భాలు ఎన్నో చూస్తూనే ఉన్నాం.. పండుగల సమయంలో.. పంచాంగ కర్తలు మధ్య రెండు వాదనలు.. విభేదాలకు దారితీస్తున్నాయి.. అయితే.. ఇప్పుడు దీపావళి పండుగను ఏ తేదీన జరుపుకోవాలనే విషయంపై పంచాంగ కర్తల మధ్య విబేధాలు చోటు చేసుకున్నాయి. దీపావళి అక్టోబర్ 31వ తేదీన కాదు.. నవంబర్ 1న జరుపుకోవాలని కోనసీమ ధృక్ సిద్ధాంత పంచాంగ కర్తలు గణన చేస్తుండగా.. లేదు లేదు.. అక్టోబర్ 31వ తేదీనే జరుపుకోవాలని రేలంగి తంగిరాల పంచాంగ కర్తలు పేర్కొంటున్నారు. రేలంగి తంగిరాల వారి పంచాంగాన్ని.. తిరుమల తిరుపతి దేవస్థానం, శ్రీశైలం దేవస్థానం అధికారికంగా అనుసరిస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా దీపావళి సెలవును అక్టోబరు 31న ప్రకటించింది. కానీ, రేలంగి తంగిరాల పంచాంగం సరైన పద్ధతిలో గుణించలేదని.. అది తప్పని కోనసీమ పంచాంగ కర్తలు పేర్కొంటున్నారు. పూర్వ పద్ధతి, ధృక్ సిద్ధాంతాన్ని కలగలిపి పంచాంగాన్ని రూపొందించిన రేలంగి తంగిరాల సిద్ధాంతి వైఖరిని.. కోనసీమ పంచాంగ కర్తలు తీవ్రంగా దుయ్యబడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ధృక్ సిద్ధాంత పంచాంగాన్నే ఆమోదించిందని.. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాలని కోనసీమ పంచాంగ కర్తలు కారుపర్తి నాగ మల్లేశ్వర సిద్ధాంతి, గొర్తి సుబ్రహ్మణ్య పట్టాభి సిద్ధాంతి, ఉపద్రస్ట నాగాదిత్య సిద్ధాంతి, విజయవాడకు చెందిన పులిపాక చంద్ర శేఖర శర్మ సిద్ధాంతి విజ్ఞప్తి చేశారు. సూర్యోదయం ఉన్న తిథినే ప్రామాణికంగా తీసుకుని దీపావళి పండుగను నవంబర్ 1వ తేదీన జరుపుకోవాలని కోనసీమ పంచాంగ కర్తలు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అయితే, దీపావళి ఏ రోజు అనే విషయంలో వివాదం చోటుచేసుకున్న వేళ.. ప్రభుత్వం దీనిపై అధికారికంగా ఏమైనా ప్రకటన చేస్తుందేమో చూడాలి.
గ్రూప్-1 మెయిన్స్‌కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. ఈనెల 21న పరీక్షలపై..
తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షల రద్దుపై హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. మెయిన్స్ పరీక్షల నిర్వహణకు ఎలాంటి బలమైన కారణం కనిపించడం లేదని, మొయిన్స్ పరీక్షలు నిర్వహించుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాగా, ప్రిలిమ్స్ పరీక్షల్లో ప్రశ్నలు తప్పుగా ఉన్నాయని, ఎస్టీ రిజర్వేషన్ చెల్లదని 10 మంది అభ్యర్థులు కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లను నేడు విచారించిన ధర్మాసనం ఇప్పటికే కొన్ని పిటిషన్లను కొట్టివేసింది. తాజాగా ఈరోజు (మంగళవారం) గత రెండు పిటిషన్లను కొట్టివేస్తూ.. ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేయాలని దాఖలైన పిటిషన్లు ఆమోదయోగ్యం కాదని పేర్కొంది. ఈ నెల 21 నుంచి మెయిన్స్ పరీక్షలు యథావిధిగా నిర్వహించాలని నిర్ణయించారు. ఈ తీర్పుతో ప్రిలిమ్స్ ఉత్తీర్ణులై మెయిన్స్ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థుల్లో ఆనందం నెలకొంది. ప్రిలిమ్స్‌పై దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టివేయడంతో గ్రూప్-1 పరీక్షకు అడ్డంకి తొలగిపోయింది. మరో ఆరు రోజుల్లో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ నెల 21 నుంచి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించేందుకు టీజీపీఎస్సీ ఏర్పాట్లు చేసింది. 31,382 మంది అభ్యర్థులు మెయిన్స్ పరీక్షలు రాయనున్నారు.
గురుకుల పాఠశాలలకు తాళాలు.. బయటే టీచర్లు, విద్యార్దుల నిరీక్షణ..
రాష్ట్రవ్యాప్తంగా అద్దె భవనాల్లో నడుస్తున్న గురుకుల పాఠశాలలకు యాజమాన్యాలు తాళాలు వేశారు. సుమారు 9 నెలలుగా ప్రభుత్వం అద్దె చెల్లించకపోవడాన్ని నిరసిస్తూ భవనాల యజమానులు మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల, హాస్టళ్లకు తాళాలు వేశారు. దీంతో దసరా సెలవుల అనంతరం పాఠశాలలకు వచ్చిన విద్యార్థులు, ఉపాధ్యాయులు బయటే ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. తుంగతుర్తి, బెల్లంపల్లి, తాండూరు, వరంగల్, భూపాలపల్లి, హుజూర్‌నగర్, భువనగిరిలోని రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లకు భవన యజమానులు తాళాలు వేశారు. బకాయిలన్నీ వెంటనే చెల్లించాలని రాష్ట్ర గురుకుల విద్యాలయ ప్రైవేట్ భవన యజమానుల సంఘం డిమాండ్ చేసింది. మాబాధను అర్థం చేసుకోవాలని అందులో పేర్కొన్నారు.
హైదరాబాద్‌లో దారుణం.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిపై ఆటోలో సామూహిక అత్యాచారం
హైదరాబాద్‌లో వరుస క్రైమ్‌లో ఆందోళన కలిగిస్తున్నాయి.. తాజాగా మరో దారుణం వెలుగు చూసింది.. ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఇద్దరు యువకులు.. గచ్చిబౌలిలో ఈ ఘటన చోటు చేసుకుంది.. అర్ధరాత్రి సమయంలో ఆటో వెళ్తున్న యువతిపై కన్నేసిన కామాంధులు.. ఆటోలోనే ఆమెపై అత్యాచారాకి ఒడిగట్టారు.. ఆటో డ్రైవర్‌తో పాటు.. మరో యువకుడు తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నిన్న అర్ధరాత్రి ఆర్‌సీ పురం వద్ద ఆటో ఎక్కింది సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న యువతి.. ఆ ఆటో అర్ధరాత్రి 2:30 సమయంలో మసీద్ బండ ప్రాంతానికి చేరుకుంది.. అయితే, మసీద్ బండ దగ్గరకు ఆటో చేరుకోగానే.. తనపై ఆటో డ్రైవర్‌తో పాటు మరో యువకుడు.. ఆటోలోనే అత్యాచారం చేశారని గచ్చిబౌలి పోలీసులను ఆశ్రయించింది బాధితురాలు.. తనపై అఘాయిత్యానికి పాల్పడిన అనంతరం మసీద్ బండ దగ్గర వదిలి పారిపోయారని ఫిర్యాదులో తెలిపింది యువతి.. ఇక, కేసు నమోదు చేసుకున్న గచ్చిబౌలి పోలీసులు.. నిందితుల కోసం గాలిస్తున్నారు.. అయితే, హైదరాబాద్‌లో ఓవైపు అఘాయిత్యాలు.. మరోవైపు మర్డర్‌లు వరుసగా వెలుగు చూస్తున్న వేళ.. మరో ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది..
ఒక్కొక్కరిని చంపబోతున్నాం.. జగిత్యాలలో పోస్టర్ల కలకలం..
మంత్రగాళ్లారా తస్మాత్ జాగ్రత్త అంటూ జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం కట్లకుంటలో వాల్ పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. ప్రజ మంచికోరే సంస్థ పేరిట పోస్టర్లు వెలిశాయి. చ్చునూతి దగ్గరి నుంచి మొదలు పెట్టి అన్ని వాడల్లో ఉన్న మంత్రగాళ్లందరినీ చంపేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు పోస్టర్ అతికించారు. ఎప్పుడు ఎవరు ఎలా చస్తారో మాకే తెలవదంటూ పోస్టర్లలో పేర్కొన్నారు. రెడ్ పెన్నుతో ఈ విషయాన్ని అందులో రాసుకొచ్చారు. దీంతో స్థానికంగా ఈ వ్యవహారం కలకలం రేపడంతో ఈ విషయం పోలీసుల వరకు వెళ్లింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దీనిపై దర్యా్ప్తు చేస్తున్నారు. స్థానికులు భాయందోళన చెందడంతో పోలీసులు ఈ పోస్టర్లను అక్కడి నుంచి తొలగించారు. ప్రజలు భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రజలు ఎలాంటి ఇబ్బంది ఎదురైనా పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
చెన్నై సిటీలో కుండపోత వర్షం.. సెల్ ఫోన్ సిగ్నల్స్ కు అంతరాయం..
తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తుంది. మరో 24 గంటల పాటు ఇదే స్థాయిలో వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. చెన్నై నగరంలో ఉదయం నుంచి కురుస్తున్న వర్షానికి టీ నగర్, వెలచేరి, పురుషవాకం, అన్నా నగర్, కోయంబేడు సహా ఇతర లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో అలర్ట్ అయిన తమిళనాడు ప్రభుత్వం.. చెన్నై సిటీలోని సబ్ వేలను మూసి వేసింది. దీంతో పాటు మెట్రో ట్రైన్ సేవలు తాత్కాలికంగా రద్దు చేసింది. ఇక, పలు చోట్లా రోడ్లపైకి మెడ లోతు వరకు వరద నీరు చేరింది. కుండపోత వర్షం ధాటికి సెల్ ఫోన్ సిగ్నల్స్ కు అంతరాయం కలిగింది. ఇక, సిగ్నల్ ఇష్యూ రాకుండా ఎయిర్‌టెల్, జియో, బీఎస్‌ఎన్‌ఎల్, వొడాఫోన్ తో పాటు ఇతర సంస్థల ప్రతినిధులతో అధికారుల అత్యవసర సమావేశం అయ్యారు. అలాగే, కమాండ్ కంట్రోల్ రూమ్ లో నుంచి భారీ వర్షాలను రాష్ట్ర డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ పర్యవేక్షిస్తున్నారు.
తైవాన్ సరిహద్దులోకి ప్రవేశించిన 153 చైనా మిలిటరీ విమానాలు
చైనా, తైవాన్ దేశాల మధ్య ఉద్రిక్తత నిరంతరం పెరుగుతోంది. మరోసారి చైనా సైన్యం తైవాన్ సరిహద్దుల్లోకి చొరబడేందుకు ప్రయత్నించింది. అయితే తైవాన్ సైన్యం కూడా స్పందించింది. తైవాన్ సరిహద్దుకు సమీపంలో చైనా విమానాలు, నౌకాదళ నౌకలు కనిపించాయని తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. మంగళవారం ఉదయం 6 గంటలకు తైవాన్ చుట్టూ 14 చైనా నౌకాదళ నౌకలు, 12 అధికారిక నౌకలు కనిపించాయని తైవాన్ జాతీయ రక్షణ మంత్రిత్వ శాఖ (MND) తెలిపింది. 153 సైనిక విమానాలు ఎగురుతూ కనిపించాయని, 153 విమానాలలో 111 విమానాలు తైవాన్ జలసంధి మధ్య రేఖను దాటి తైవాన్ తూర్పు వైమానిక రక్షణ గుర్తింపు జోన్ (ADIZ)లోకి ప్రవేశించాయని మిలిటరీ నివేదించింది. చైనా, తైవాన్ మధ్య ఈ నీటి ఒప్పందం అనధికారిక సరిహద్దు మాత్రమే. ఈ సందరబంగా తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ లో.. ‘ఈ ఉదయం, తైవాన్ చుట్టూ 153 విమానాలు, 14 నౌకలు, 12 అధికారిక నౌకలు కనిపించాయి. 111 విమానాలు తైవాన్ జలసంధి మధ్య రేఖను దాటి తైవాన్ ఉత్తర, మధ్య, నైరుతి, ఆగ్నేయ ADIZలలోకి ప్రవేశించాయి. పరిస్థితిని గమనిస్తూనే ఉన్నామని తెలిపింది.
న్యూజిలాండ్‌కు భారీ షాక్.. టెస్ట్ సిరీస్ నుంచి మరో ప్లేయర్ ఔట్!
భారత్‌తో టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ముందు న్యూజిలాండ్‌కు మరో భారీ షాక్ తగిలింది. గాయం కారణంగా ఇప్పటికే మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ తొలి టెస్టుకు దూరమవ్వగా.. ఫాస్ట్ బౌలర్ బెన్ సియర్స్ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. మోకాలి గాయం కారణంగా టెస్టు సిరీస్ మొత్తానికి సియర్స్ దొరమయ్యాడని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. అతడి స్థానంలో జాకబ్ డఫీని ఎంపిక చేసినట్లు వెల్లడించింది. శ్రీలంక పర్యటనలోనే బెన్ సియర్స్ మోకాలి నొప్పితో బాధపడ్డాడు. భారత్‌తో సిరీస్ సమయానికి అతను కోలుకుంటాడని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు భావించి.. అతడిని ఎంపిక చేసింది. గత వారం కివీస్ టీమ్ భారత్‌కు రాగా.. సియర్స్ మాత్రం అక్కడే ఉండిపోయాడు. స్కానింగ్‌లో గాయం తీవ్రత అధికంగా ఉన్నట్లు తెలిసింది. దీంతో సియర్స్ స్థానంలో జాకబ్ డఫీని ఎంపిక చేసింది. సియర్స్ కివీస్ తరఫున 1 టెస్టు, 17 టీ20లు ఆడాడు. టెస్టులో 5 వికెట్లు, టీ20ల్లో 19 వికెట్లు పడగొట్టాడు. జాకబ్ 6 వన్డేలు, 14 టీ20లు ఆడాడు కానీ.. ఇంకా టెస్ట్ అరంగేట్రం చేయలేదు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 299 వికెట్లు తీశాడు.
విరాట్, రోహిత్ తీవ్ర విమర్శలు.. బీసీసీఐ కీలక నిర్ణయం!
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. దేశవాళీ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ 2024లో ‘ఇంపాక్ట్ ప్లేయర్’ రూల్‌ను తొలగించింది. రాబోయే సీజన్‌లో ఈ నిబంధనను రద్దు చేయనున్నట్లు రాష్ట్ర సంఘాలకు బీసీసీఐ ఇప్పటికే తెలియజేసింది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ నవంబర్ 23 నుండి ప్రారంభం కానుంది. ఫైనల్ మ్యాచ్ డిసెంబర్ 15న జరుగుతుంది. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌ను ప్రయోగాత్మకంగా ముందుగా సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో బీసీసీఐ అమలు చేసింది. ఆపై ఐపీఎల్‌లోకి తీసుకువచ్చింది. ఈ రూల్‌పై మిశ్రమ స్పందన వచ్చింది. ఐపీఎల్‌లో చాలా మంది కెప్టెన్లు, కోచ్‌లు వ్యతిరేకించారు. భారత స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కూడా విమర్శలు చేశారు. ఆల్‌రౌండర్ల అభివృద్ధికి ఆటంకం కలుగుతుందని చాలా మంది పేర్కొన్నారు. ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్‌తో 12 మంది ప్లేయర్స్ ఆడుతున్నారని, ఆల్‌రౌండర్లకు బదులుగా స్పెషలిస్ట్ బ్యాటర్లు లేదా బౌలర్లు తుది జట్టులో కొనసాగుతున్నారని పేర్కొన్నారు. విమర్శల నేపథ్యంలో ఇంపాక్ట్ రూల్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
గజనీ సీక్వెల్ లో అమీర్ ఖాన్.. దర్శకుడు ఎవరంటే..?
తమిళ్ లో సూర్య హీరోగా AR మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గజనీ’. తెలుగులోను డబ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ సాధించింది. సూర్య కు తెలుగులో స్టాండర్డ్ మార్కెట్ వచ్చేలా చేసింది. అంతటి సంచనాలు నమోదు చేసిన ఈ సినిమా పలు భాషల్లో స్టార్ హీరోలు రీమేక్ చేసారు. అలా బాలీవుడ్ హీరో అమిర్ ఖాన్ తో తెలుగు అగ్ర నిర్మాత అల్లు అరవింద్ ఈ సినిమాను హిందీ లో రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. కాగా ఇప్పుడు ఈ సినిమాకు సిక్వెల్ చేసే ఆలోచనలో ఉన్నాడు అమీర్ ఖాన్ . ఈ బాలీవుడ్ హీరో చాలా సంవత్సరాల తర్వాత తమిళ సినిమాలో నటిస్తున్నాడు. రజనీకాంత్ హీరోగా స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కూలీ’ చిత్రంలో అమీర్ ఖాన్ కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ చిత్రంలో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర, టాలీవుడు స్టార్ హీరో అక్కినేని నాగార్జున, మలయాళ స్టార్ నటుడు ఫహద్ ఫాసిల్ నటిస్తున్నారు. తాజాగా అమీర్ ఖాన్ వచ్చి చేరడంతో కూలి పై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ఈ షూట్ లో భాగంగానే అమీర్ ఖాన్ తర్వాతి సినిమా ఏమిటనేది చర్చకు రాగ గజనీ 2 కు సంబంధించి ఇటీవల కథ చర్చలు మొదలైనట్టు తమిళ సినీవర్గాలు పేర్కొన్నాయి. అయితే దర్శకుడు ఎవరనేది ఇంకా ఫైనల్ కాలేదని తెలుస్తోంది. అదే గనక జరిగితే అమీర్ ఖాన్ కెరీర్ లో మరొక సెన్సషనల్ హిట్ నమోదవడం గ్యారెంటీ.