టీడీపీ వర్సెస్ వైసీపీ.. మరోసారి తాడిపత్రిలో టెన్షన్.. టెన్షన్..
తాడిపత్రి రాజకీయ రంగం మళ్లీ వేడెక్కింది.. ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి.. మాజీ ఎమ్మెల్యే, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి పోటాపోటీ కార్యక్రమాలతో మరోసారి హీట్ పెంచింది.. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణం మరోసారి రాజకీయ వేడిని చవి చూస్తోంది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ నేతలు నిరసన ప్రదర్శన చేపట్టగా, అదే సమయంలో టీడీపీ ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి కూడా ప్రత్యామ్నాయ కార్యక్రమం ఏర్పాటు చేయడంతో ఉద్రిక్తతకు దారి తీసింది.. పోలీసులు శాంతి భద్రతల దృష్ట్యా కేతిరెడ్డి పెద్దారెడ్డికి తాడిపత్రిలో కాకుండా ఇతర మండలంలో కార్యక్రమం నిర్వహించాలని సూచించినట్లు సమాచారం. అయితే, ఈ నిర్ణయంపై పెద్దారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కేతిరెడ్డి పెద్దారెడ్డి – పోలీసులు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు సూచన మేరకు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు తమ కార్యక్రమాన్ని యాడికి మండల కేంద్రానికి తరలించారు. అక్కడ ప్రజా ఉద్యమం నిర్వహిస్తూ, “మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను తక్షణం ఆపాలి” అని డిమాండ్ చేశారు. అయితే, యాడికిలో కార్యక్రమం నిర్వహించడానికి వెళ్తున్న కేతిరెడ్డి పెద్దారెడ్డిని కూడా పోలీసులు కొంతసేపు అడ్డుకున్నట్లు సమాచారం. అయితే, తాడిపత్రి రాజకీయాల్లో వైఎస్సార్‌సీపీ వర్సెస్ టీడీపీ కొత్తకాదు. అయితే, తాజా పరిణామాలతో మళ్లీ రెండు వర్గాల మధ్య రాజకీయ ఉత్కంఠ తారాస్థాయికి చేరినట్టు అయ్యింది..
ఏపీలో పెరుగుతున్న అప్పులు, రెవెన్యూ లోటు..
రెవెన్యూ ఖర్చుల నియంత్రణ, అప్పుల నియంత్రణపైనే రాష్ట్రాల ఆర్థిక నిర్వహణ ఆధారపడి ఉంటుంది. కానీ.. ఏపీలో మాత్రం రెవెన్యూ లోటు అంతకంతకూ పెరుగుతోంది. సింపుల్‌గా చెప్పాలంటే.. రాష్ట్రానికి వచ్చే రాబడి కన్నా ఖర్చులు ఎక్కువయ్యాయి. 2025-26లో 33వేల 185 కోట్లు రెవెన్యు లోటు ఉంటుందని అంచనా. కానీ.. ఆరు నెలలకే 46వేల 652 కోట్లకు చేరింది. అంచనాలకు తగినట్లు రాబడులు పెరగడం లేదు.. అనవసర వ్యయాలను తగ్గించుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. గత ప్రభుత్వం హయాంలో కూడా రెవెన్యూ లోటు ఎక్కువగానే ఉంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ అంచనాల్లో రెవెన్యూ లోటు 17వేల 036 కోట్లు ఉంటుందని అంచనావేశారు. కానీ.. 10 నెలల్లో లోటు 47వేల 958 కోట్లకు చేరుకుంది. అంచనాలతో పోలిస్తే ఇది 281 శాతానికి చేరినట్టు లెక్క. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 33,185 కోట్ల రెవెన్యూ లోటు ఉంటుందని అంచనా వేసినా.. 140 శాతం పెరిగింది. రెవెన్యూ రాబడికంటే రెవెన్యూ ఖర్చులు ఎక్కువైతే అదే.. రెవెన్యూలోటు… రెవెన్యూ రాబడి అంటే.. అప్పులను మినహాయించగా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం. రాష్ట్రంలో సొంత పన్నుల ద్వారా వచ్చే ఆదాయం, పన్నేతర ఆదాయం, కేంద్రం ఇచ్చే గ్రాంట్ ఇన్ ఎయిడ్ కలిపి రెవెన్యూ రాబడి అవుతుంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రెవెన్యూ లోటు తగ్గిస్తున్నామని కూటమి ప్రభుత్వం చెబుతోంది. బడ్జెట్ అంచనాల్లో కూడా రెవెన్యూ లోటును చాలా తక్కువగా చూపిస్తోంది. కానీ… వాస్తవాలు వేరే ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్- నుంచి సెప్టెంబర్ నాటికే రెవెన్యూ లోటు 16వేల 652 కోట్లకు చేరింది. రెవెన్యూ వసూళ్లు తగ్గిపోవడం, రెవెన్యూ వ్యయాలను పరిమితం చేయలేకపోవడంతో లోటు ప్రమాదకర స్థాయికి చేరుతోందిని నిపుణులు చెబుతున్నారు. బడ్జెట్ అంచనాలతో పోలిస్తే రెవెన్యూ రాబడులు తగ్గిపోతున్నాయి.
చంద్రబాబుపై పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ్యలు.. కుట్ర పన్ని మెడికల్ కాలేజీ భూముల విక్రయం..!
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.. చిత్తూరు జిల్లా పుంగనూరులో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ర్యాలీ నిర్వహించిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి.. తహసీల్దార్ కు వినతిపత్రం అందజేశారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై ఫైర్ అయ్యారు.. చంద్రబాబు కుట్ర పన్ని లక్షల, కోట్లు విలువచేసే మెడికల్ కాలేజీల భూముల్ని వంద రూపాయలకు విక్రయిస్తున్నాడని ఆరోపించారు.. 50 ఎకరాల మెడికల్ కాలేజీల భూముల వల్ల రాష్టానికి లక్షల కోట్ల ఆదాయం వస్తుంది.. పేద విద్యార్థులు డాక్టర్లు అవ్వడానికి అవకాశం ఉంటుంది.. కానీ, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వల్ల దాదాపు 2,150 మెడికల్ సీట్లు కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.. పులివెందులలో 50 సీట్ల మెడికల్ కాలేజ్ పూర్తయినా చంద్రబాబు నాయుడు అడ్డుకుని నేషనల్ కౌన్సిల్‌కు లేఖ రాశారని మండిపడ్డారు పెద్దిరెడ్డి.. వైద్యం అందించడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. నాడు- నేడు కింద హాస్పిటల్స్, స్కూల్స్ కు వేల కోట్ల ఖర్చు చేశారు.. కానీ, అవన్ని ఇప్పుడు మూలన పడిపోయాయి. 17 మెడికల్ కాలేజీలు వస్తే ప్రతి సంవత్సరం 4,500 సీట్లు అదనంగా వస్తాయి.. 5 సంవత్సరాలలో 30 వేల నుంచి 40 వేల మంది ప్రతి సంవత్సరం వైద్య, విద్య అభ్యసిస్తారు.. ఇలాంటి దాన్ని కుట్రపూరితంగా చంద్రబాబు నాయుడు అతని కుటుంబ సభ్యులు, మంత్రులు డబ్బు ఆశతోనే ఇలాంటి కుట్ర చేస్తున్నారని విమర్శించారు..
ఎన్టీఆర్ ఆశయాన్ని కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుంది.. 16 నెలల్లోనే 3 లక్షల ఇళ్లు పూర్తి..
ప్రతి ఒక్కరికి సొంతిల్లు ఉండాలనే ఎన్టీఆర్ ఆశయాన్ని కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుంది.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి వల్ల 16 నెలల్లోనే 3 లక్షల ఇళ్లు పూర్తి చేసి పేదలకు అందిస్తున్నాం అన్నారు.. రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్.. ఈ రోజు పేదల సొంతింటి కల సాకారం అవుతున్న చారిత్రాత్మక రోజు అని పేర్కొన్నారు.. ఆర్థిక ఇబ్బందులున్నా ఇళ్ల నిర్మాణంలో జాప్యం లేకుండా ఈ లక్ష్యాన్ని సాధించామని మంత్రి గుర్తుచేశారు. 2014-19లో పట్టణాల్లో సెంటున్నర, గ్రామాలలో 2 సెంట్లు ఇచ్చి పేదల పెన్నిదిగా టీడీపీ పనిచేసిందని చెప్పారు. కానీ, వైఎస్ జగన్ రెడ్డి దాన్ని సెంటుకు కుదించి, పేదల ద్రోహిగా మారాడని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వం 12 లక్షల గృహాలను పూర్తి చేసి పేదలకు అందించిందని గుర్తు చేశారు మంత్రి అనగాని.. గతంలో, జగన్ రెడ్డి మాట్లాడుతూ “ఇళ్లు కాదు, ఊళ్లు నిర్మిస్తాం”, కానీ రోడ్లు, డ్రైనేజీ, నీరు, విద్యుత్ వంటి సౌకర్యాలతో ఇళ్లు పూర్తిచేసిన తర్వాత చేతులు దులుపుకున్నాడని మంత్రి ఆరోపించారు. సొంత స్థలం లేని వారికి కూడా రాష్ట్ర ప్రభుత్వం రూ.4 లక్షల సాయం అందిస్తున్నదని తెలిపారు. 2029 నాటికి ప్రతి అర్హుడికి పక్కా ఇల్లు ఇవ్వడం ప్రభుత్వ లక్ష్యం అని చెప్పారు. వైఎస్ జగన్ సెంటు పట్టా పేరుతో రూ.7,500 కోట్లు దోచుకున్నారని, టీడీపీ పూర్తి చేసిన ఇళ్లను కూడా పంచకుండా, పేదలను అప్పుల ఊబిలోకి నెట్టారని ఆరోపించారు రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్..
ప్రజా సమస్యలు ప్రస్తావిస్తే.. ఫ్లెక్సీలు తొలగిస్తారా?
‘జాగృతి జనం బాట’లో భాగంగా నల్లగొండ జిల్లాలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రంలో తన ఫ్లెక్సీలను తొలగించడంపై స్పందించారు. ఫ్లెక్సీలు తొలగించడానికి కవిత తప్పు పట్టారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పెద్ద మంత్రి అనుకున్నా అని విమర్శించారు. ప్రజా సమస్యలు ప్రస్తావిస్తే.. ఫ్లెక్సీలు తొలగిస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను తాను ప్రస్తావిస్తున్నా అని, చేతనైతే ప్రభుత్వం సమస్యలను త్వరగా పరిష్కరించాలన్నారు. నల్లగొండకు కల్వకుంట్ల కవిత రానున్న నేపథ్యంలో ఆమె అభిమానులు కటౌట్‌లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన కటౌట్‌లు, ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించింది. నల్లగొండ జిల్లా కేంద్రంలో కల్వకుంట్ల కవిత మీడియాతో మాట్లాడుతూ… ‘తెలంగాణ వచ్చాక కూడా నల్లగొండ జిల్లాకు కృష్ణా జలాలు అందలేదు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు నల్లగొండ జిల్లాకు సాగునీరు అందించడంలో విఫలం అయ్యాయి. ప్రభుత్వాలను అడిగేందుకు, నిలదీసేందుకే జాగృతి జనం బాట. సుంకిశాల లిఫ్ట్ ఇరిగేషన్ కాంట్రాక్టర్‌పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఎస్‌ఎల్‌బీసీ ఘటనపై విచారణ జరగాలి. నాగార్జున సాగర్ ఎడమ కాలువను రాష్ట్ర ప్రభుత్వం తమ అధీనంలోకి తీసుకోవాలి. కృష్ణా జలాలను నల్లగొండకు తీసుకురాకపోతే.. భూ నిర్వసితులతో ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడిస్తాం’ అని అన్నారు.
ఢిల్లీ బ్లాస్ట్‌పై కీలక విషయాలు.. దర్యాప్తులో కొత్త మిస్టరీ!
ఢిల్లీ బ్లాస్ట్‌పై దర్యాప్తు సంస్థలు లోతుగా దర్యాప్తు చేస్తున్నాయి. విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించిన అధికారులు.. తాజాగా బ్లాస్ట్ వెనుక ఏం జరిగిందన్న విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఫరీదాబాద్‌లో అరెస్టైన డాక్టర్ ముజమ్మిల్ నుంచి కీలక విషయాలను రాబట్టాయి. ఎర్రకోట దగ్గర జరిగిన దాడి దీపావళి నాడు ప్లాన్ చేసినట్లుగా వర్గాలు పేర్కొన్నాయి. దీపావళి నాడు రద్దీగా ఉన్న ప్రాంతాల్లో దాడి చేయాలని ప్లాన్ చేశామని.. అనంతరం ఆ ప్లాన్ రద్దు చేసుకున్నట్లుగా ముజమ్మిల్ దర్యాప్తు అధికారులకు చెప్పినట్లుగా సమాచారం. ఇక ఈ ప్లాన్‌ను జనవరి 26, 2026న అమలు చేయాలని ప్రణాళిక వేసుకున్నామని.. ఇందులో భాగంగానే ఎర్రకోట చుట్టు పక్కల ప్రాంతాలను గుర్తించినట్లుగా ముజమ్మిల్ పోలీసులకు తెలియజేసినట్లుగా వర్గాలు పేర్కొన్నాయి. సామవారం సాయంత్రం ఎర్రకోట దగ్గర జరిగిన కారు బాంబ్ పేలుడులో 12 మంది చనిపోగా.. పలువురు గాయపడ్డారు.
కూటమిలో జోష్.. భారీగా లడ్డూలు సిద్ధం చేస్తున్న కార్యకర్తలు
బీహార్‌లో ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. ఓటర్ల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమైయింది. రెండు విడతలు జరిగిన ఓటింగ్‌లో భారీగా పోలింగ్ శాతం నమోదైంది. తొలి విడతలో 65.08 శాతం పోలింగ్ నమోదు కాగా.. రెండో విడతలో రికార్డ్ స్థాయిలో 67.14 శాతం ఓటింగ్ నమోదైంది. ఎన్నికల ఫలితాలు నవంబర్ 14న విడుదల కానున్నాయి. ఇదిలా ఉంటే మంగళవారం సాయంత్రం పోలింగ్ ముగియగానే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదలయ్యాయి. మరోసారి అన్ని సర్వేలు బీజేపీ-జేడీయూ కూటమికే ప్రజలు పట్టం కట్టినట్లు తేల్చాయి. భారీ మెజార్టీతో ఎన్డీఏ కూటమి గెలవబోతుందని సర్వేలు అంచనాలు వేశాయి. దీంతో కూటమి నేతల్లో.. కార్యకర్తల్లో సరికొత్త జోష్ నెలకొంది. మరోసారి అధికారంలోకి రాబోతున్నామంటూ బీజేపీ కార్యకర్తలు ఆనందంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ముందుగానే బీజేపీ కార్యకర్తలు లడ్డూలు సిద్ధం చేసుకుంటున్నారు. పాట్నాలో 501 కిలోల లడ్డూలను సిద్ధం చేస్తున్నట్లు చెబుతున్నారు.
గోడి మీడియాను నమ్మొద్దు.. సర్వేలపై తేజస్వి యాదవ్ ధ్వజం
ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై మహాఘట్‌బంధన్ ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ మండిపడ్డారు. ‘గోడి మీడియా’ చేస్తున్న తప్పుడు సర్వేలు అని ధ్వజమెత్తారు. బుధవారం తేజస్వి యాదవ్ మీడియాతో మాట్లాడారు. మంగళవారం సాయంత్రం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల ఒత్తిడితో ఈ సర్వేలు వచ్చాయన్నారు. ‘SIR’ సమయంలో గోడి మీడియా బీహార్‌లోకి ప్రవేశించి చేసిన సర్వేగా పేర్కొన్నారు. నవంబర్ 14న ఫలితాలు మహాఘట్‌బంధన్‌కు అనుకూలంగా ఫలితాలు వస్తాయని.. నవంబర్ 18న ప్రమాణస్వీకారం ఉంటుందని తేజస్వి యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. రాత్రి 7 గంటలకు పోలింగ్ ముగిస్తే.. అంతక ముందే ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయని.. ఓటింగ్ ముగియకుండానే సర్వేలు ఎలా ఇస్తారని ప్రశ్నించారు.
భూటాన్‌లో ‘కాలచక్ర అభిషేక’ను ప్రారంభించిన మోడీ
భూటాన్‌లో ప్రధాని మోడీ పర్యటన కొనసాగుతోంది. బుధవారం ప్రపంచ శాంతి ప్రార్థన ఉత్సవంలో మోడీ పాల్గొన్నారు. థింఫులో భూటాన్ మాజీ రాజు జిగ్మే ఖేసర్ నామ్‌గేల్ వాంగ్‌చుక్‌తో కలిసి ‘కాలచక్ర అభిషేక’ను ప్రధాని మోడీ ప్రారంభించారు. చాంగ్లిమితాంగ్ స్టేడియంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మోడీ స్టేడియంలో కలియ తిరిగి అందరికీ నమస్కరించారు. అనంతరం మోడీ మాట్లాడుతూ.. భారతదేశం-భూటాన్ మధ్య శతాబ్ధాలుగా ఆధ్యాత్మిక, సాంస్కతిక బంధం కొనసాగుతుందని పేర్కొన్నారు. భూటాన్ ప్రజాస్వామ్య వ్యవస్థలను స్థాపించడంలో.. సరిహద్దు ప్రాంతాల్లో శాంతిని నెలకొల్పడంలో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుందని మోడీ కొనియాడారు. రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత మెరుగుపడటంపై దృష్టి పెడతామని చెప్పారు. అంతకముందు రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై కూడా చర్చ జరిగింది.
జాబ్‌లే.. జాబ్‌లు.. ఈ రంగాల్లో భారీ పెరుగుదల
ఓవైపు ఉద్యోగుల తొలగింపు కొనసాగుతోంది.. ఇంటర్నేషనల్ సంస్థల నుంచి చిన్న కంపెనీల వరకు పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించినట్టు ప్రకటనలు వచ్చాయి.. అయితే, భారత్‌లో మాత్రం ఉద్యోగాల జాతరే కొనసాగింది.. ఈ సంవత్సరం భారతదేశంలో పండుగ సీజన్ ఉద్యోగ మార్కెట్‌ను పునరుజ్జీవింపజేసింది. ఆగస్టు మరియు అక్టోబర్ మధ్య, ముఖ్యంగా వినియోగ సంబంధిత రంగాలలో ఉద్యోగ అవకాశాలు 17 శాతం పెరిగాయి. బలమైన వినియోగదారుల సెంటిమెంట్, ఆకర్షణీయమైన ఆఫర్లు మరియు దేశవ్యాప్తంగా మార్కెట్ పరిధి ఈ వృద్ధికి దోహదపడింది అని చెబుతున్నారు.. ఇక, గిగ్ మరియు తాత్కాలిక ఉద్యోగాలలో 25 శాతం పెరుగుదల నమోదైంది.. వర్క్‌ఫోర్స్ సొల్యూషన్స్ కంపెనీ అడెక్కో ఇండియా నివేదిక ప్రకారం, గిగ్ మరియు తాత్కాలిక ఉద్యోగాలకు నియామకాలు సంవత్సరానికి 25 శాతం పెరిగాయని పేర్కొంది… దసరాకు ముందు మరియు తరువాత వారాల్లో రిటైల్, ఈ-కామర్స్, BFSI, లాజిస్టిక్స్ మరియు హాస్పిటాలిటీ వంటి రంగాలలో తాత్కాలిక కార్మికులకు డిమాండ్ బాగా పెరిగింది. ఈ సంవత్సరం అడెక్కో 2.16 లక్షల గిగ్ మరియు తాత్కాలిక ఉద్యోగాలను అంచనా వేసింది.. కేవలం మూడు నెలల్లో, 37 శాతం తాత్కాలిక నియామకాలు.. 15-20 శాతం గిగ్ కార్మికులను నియమించారు. ఇది కాలానుగుణ డిమాండ్ బలాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ సంవత్సరం మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్యం 30-35 శాతం పెరిగిందని, ముఖ్యంగా రిటైల్, కస్టమర్ సర్వీస్, లాజిస్టిక్స్ మరియు ఆర్థిక సేవలలో పెరిగిందని అడెక్కో ఇండియా డైరెక్టర్ దీపేష్ గుప్తా అన్నారు.
పసిడి ప్రియులకు ఊరట.. నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
బుధవారం బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ.33 తగ్గి.. రూ.12,551 వద్ద ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ.30 తగ్గి.. 11,505గా ఉంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,25,510గా.. 22 క్యారెట్ల ధర రూ.1,15,050గా నమోదయింది. హైదరాబాద్ నగరంలో బంగారం ధరలను పరిశీలిస్తే.. 24 క్యారెట్ల 10 గ్రాములపై రూ.330 తగ్గి రూ.1,25,510 వద్ద ట్రేడ్ అవుతోంది. 22 క్యారట్ల 10 గ్రాములపై రూ.300 తగ్గి రూ.1,15,050 పలుకుతోంది. విశాఖ, విజయవాడలో ఇవే ధరలు కొనసాగుతున్నాయి. వెండి ధరలు తగ్గేదెలా అనేలా దూసుకెళుతున్నాయి. ఇటీవల స్థిరంగా ఉన్న వెండి.. గత మూడు రోజులుగా భారీగా పెరిగింది. కిలో వెండిపై మొన్న రూ.4500, నిన్న రూ.3000 పెరగగా.. ఈ రోజు రూ.2000 పెరిగింది. బుధవారం బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.1,62,000 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్‌లో కిలో వెండి రూ.1,73,000గా నమోదైంది. ప్రాంతాల వారీగా బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయన్న విషయం తెలిసిందే.
‘ది గర్ల్‌ఫ్రెండ్’ సక్సెస్ పార్టీకి టైమ్, ప్లేస్ ఫిక్స్!
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించిన ‘ది గర్ల్‌ఫ్రెండ్’ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దీక్షిత్ శెట్టి హీరోగా నటించగా, గీతా ఆర్ట్స్ నిర్మాణం చేపట్టింది. రిలీజ్ అయినప్పటి నుంచి మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమా వీకెండ్‌లతో పాటు వీక్‌డేస్ లో కూడా హౌస్‌ఫుల్ షోలు నమోదు చేస్తూ జోరుగా దూసుకుపోతోంది. ఈ విజయాన్ని గుర్తుగా చిత్రబృందం నవంబర్ 12న ఒక గ్రాండ్ సక్సెస్ మీట్ నిర్వహించనుంది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా స్టార్ హీరో విజయ్ దేవరకొండ హాజరుకానున్నారని సమాచారం. దాంతో ఈ సక్సెస్ పార్టీ మరింత గ్రాండ్‌గా జరిగే అవకాశం ఉంది. మరోవైపు, ఎంగేజ్‌మెంట్ రూమర్స్ తర్వాత రష్మిక–విజయ్ ఒకే వేదికపై కనిపించబోతుండటంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. తాజాగా మూవీ టీం “ఈరోజు సాయంత్రం 6 గంటల నుండి హైదరాబాద్‌లోని పార్క్ హయత్‌లో విజయోత్సవ వేడుకలు జరగనున్నాయి” అంటూ ట్వీట్ చేసింది. మొత్తానికి, ‘ది గర్ల్‌ఫ్రెండ్’ టీమ్ సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకునేలా రెడీగా ఉంది.
కొత్త ప్రయాణం మొదలైంది అంటూ.. గుడ్ న్యూస్ చెప్పిన సమంత ..
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాలతో పాటు వ్యాపార రంగంలో కూడా తనదైన ముద్ర వేస్తోంది. కొంతకాలం ఆరోగ్య సమస్యలు, వ్యక్తిగత కారణాలతో సినిమాలకు దూరంగా ఉన్న ఆమె, ఇప్పుడు మళ్లీ పూర్తి స్థాయిలో ప్రొఫెషనల్ లైఫ్‌లోకి తిరిగి వచ్చింది. వరుసగా కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ, నిర్మాతగా కూడా కొత్త ప్రయోగాలు చేస్తోంది. తాజాగా సమంత తన సొంత బ్యానర్ ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ కింద ‘మా ఇంటి బంగారం’ అనే సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమా పూజా కార్యక్రమం ఇటీవలే ఘనంగా జరిగింది. ఇందులో సమంతతో పాటు దిగంత్, గుల్షన్ దేవయ్య ప్రధాన పాత్రల్లో నటించగా, సీనియర్ నటి గౌతమి, మంజుషా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాను రాజ్ నిడుమోరు, హిమాంక్ దువ్వూరుతో కలిసి సమంత నిర్మిస్తున్నారు.