తమ అరాచకాలు, ఎత్తులు సాగడం లేదని వైసీపీ మదన పడుతుంది..!
కడప జిల్లాలోని పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది.. పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. అయితే, వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు.. పులివెందుల, ఒంటిమిట్ట ఓటర్లు కూటమి అభ్యర్థిని గెలిపించేందుకు పూర్తిస్థాయి సన్నద్ధంగా ఉన్నారన్న ఆయన.. ఇందులో ఎటువంటి అనుమానము ఎవరికి అవసరం లేదు. వైసీపీ అరాచకాలకు తెరదించుతూ ఈ ఎన్నికల్లో ఓటర్లు తీర్పునివ్వనున్నారు. పూర్తి పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ జరుగుతుంటే తమ అరాచకాలు, ఎత్తులు సాగడం లేదని వైసీపీ తీవ్రంగా మదనపడిపోతుందని ఫైర్ అయ్యారు. ఇక, ఏదోరకంగా అడ్డంకులు కలిగించేందుకు పసలేని ఆరోపణలు చేస్తోంది అని విమర్శించారు పల్లా శ్రీనివాసరావు.. అందుకే ఎంపీ అవినాష్ రెడ్డి సేవ్ డెమోక్రసీ అంటూ గగ్గోలు పెడుతూ దృష్టి మరల్చేందుకు ప్రయత్నిస్తున్నారు. వీరి కుయుక్తులన్నీ ప్రజలు పసిగట్టారు. వీరి అరాచకాలకు భరతం పట్టేరీతిన తీర్పును ఇవ్వనున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తమ హామీలను నెరవేర్చే దిశగా తీసుకుంటున్న చర్యలు ప్రజలకు ఎంతో ఉపశమనాన్ని ఇస్తున్నాయి. ఒంటిమిట్ట సీతారామ చంద్రుల ఆశీస్సులు కూటమి ప్రభుత్వానికి పూర్తిస్థాయిలో ఉన్నాయి. ఒంటిమిట్ట ,పులివెందుల రెండు జడ్పీటీసీ స్థానాలు కూటమి ఖాతాలో చేరబోతున్నాయి. ఈ రెండు ప్రాదేశిక నియోజక వర్గాల ఓటర్లు తమ విస్పష్ట తీర్పును ఎటువంటి ప్రలోభాలకు, బెదిరింపులకు లొంగకుండా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేందుకు ముందుకు వస్తున్నారు. వారందరికీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఇదే మా శుభాభినందనలు. కూటమి అభ్యర్థుల గెలుపునకు ప్రజలు పూర్తి సహకారం అందిస్తారని విశ్వసిస్తున్నాను అంటూ ఓ ప్రకటనలో పేర్కొన్నారు పల్లా శ్రీనివాసరావు..
పోలీసులు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు.. అరెస్టులు దారుణం..
కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి అరెస్ట్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా.. తెల్లవారుజామున వందల మంది పోలీసులతో ఎంపీ అవినాష్ రెడ్డిని బలవంతంగా అరెస్ట్ చేయడం హేయమైనా చర్య అన్నారు.. పోలీసులు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని ఫైర్ అయ్యారు. ఓటు వేసేందుకు వెళ్లకుండా ప్రజలను పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గం.. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందన్నారు. పోలీసులను అడ్డం పెట్టుకొని పోలింగ్ జరపడం సిగ్గుచేటు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఇలాంటి ప్రభుత్వాన్ని దేశ చరిత్రలో ఎప్పుడు చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు.. ఇక, చంద్రబాబు నాయుడుకు రాబోయే రోజుల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా.. మరోవైపు, ఎంపీ అరెస్ట్ పై వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.. కడప జిల్లాలో ప్రజాస్వామ్యాన్ని కూటమి నాయకులు అపహాస్యం చేశారు.. ప్రజాస్వామికంగా ఎన్నికలు జరగాలి.. కానీ, పోలీసులను అడ్డం పెట్టుకొని పోలింగ్ జరపడం దారుణం అన్నారు.. ప్రజలు పోలీసుల కాళ్లు పట్టుకుని మా ఓటు మేము వేసుకుంటాం అని ప్రాధేయపడుతున్నారు.. ఇలాంటి ఎన్నికలు దేశ చరిత్రలో ఎప్పుడు చూడలేదు.. చంద్రబాబుకు రాబోయే రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు అని వార్నింగ్ ఇచ్చారు వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి..
జడ్పీటీసీ ఉప ఎన్నికలు.. ఈసీ ఎదుట వైసీపీ ధర్నా
కడప జిల్లాలోని పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలు కాకరేపుతున్నాయి.. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా.. పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. మరోవైపు తెల్లవారుజాము నుంచే పులివెందులలో టెన్ష్ వాతావరణం నెలకొంది.. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు.. పలువురు వైసీపీ నేతలను, టీడీపీ నేతలను కూడా అరెస్ట్, హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు.. అయితే, పులివెందుల, ఒంటిమిట్టలో పోలీసుల వైఖరిపై భగ్గుమంటోంది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం ముందు ధర్నాకు దిగారు వైసీపీ నేతలు.. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల ఘటనలకు నిరసనగా ఎలక్షన్ కమిషన్ కార్యాలయం ఎదుట బైఠాయించారు.. పోలీసులపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని నినాదాలు.. ఎన్నికల కమిషన్ దగ్గర జరిగిన ఆందోళన కార్యక్రమంలో మాజీ మంత్రులు పేర్ని నాని, అంబటి రాంబాబు, వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, హఫీజ్ ఖాన్.. పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు..
చరిత్రలో ఇంత దారుణమైన ఎన్నికలు జరగలేదు..
చరిత్రలో ఇంత దారుణమైన ఎన్నికలు జరగలేదు అని ఆరోపించారు వైసీపీ సీనియర్ నేత, మాజీమంత్రి అంబటి రాంబాబు.. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికలపై విజయవాడలోని ఎన్నికల కమిషన్ ఆఫీసు ముందు ఆందోళన దిగారు వైసీపీ నేతలు.. జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అక్రమాలు జరగుతున్నాయి.. అన్యాయంగా వైసీపీ నేతలను అరెస్ట్ చేస్తున్నారంటూ ఈసీకి ఫిర్యాదు చేశారు.. ఇక, ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన అంబటి రాంబాబు.. ఓటర్లు ఓటు వేయటానికి ప్రయత్నించి పోలీసుల కాళ్లు పట్టుకుని నా ఓటు హక్కును వినియోగించుకునేలా అవకాశం ఇవ్వాలని ప్రాధేయపడాల్సి వస్తుందన్నారు.. ఖాళీ మొత్తం స్థానాల్లో కాకుండా కేవలం పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు మాత్రమే ఎన్నికలు పెట్టారు.. ఇక్కడ గెలిచి వైఎస్ జగన్ పని అయిపోయింది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
ప్రశాంత వాతావరణంలో పులివెందుల ఎన్నికలు.. వైసీపీది తప్పుడు ప్రచారం..!
పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా అరెస్ట్‌లు, అక్కడి పరిస్థితులపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఎదుట ఆందోళనకు దిగింది వైసీపీ అయితే.. ప్రశాంత వాతావరణంలో పులివెందుల జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్నాయి.. వైసీపీది తప్పుడు ప్రచారమని కొట్టిపారేశారు మంత్రి డోల వీరాంజనేయస్వామి.. విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. పులివెందులలో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి.. లా అండ్ ఆర్డర్ కాపాడుకుంటూ హక్కుల్ని కాపాడుకుంటూ ప్రజలకి భద్రత కల్పిస్తున్నారు.. వైసీపీ నేతలు ఇంటింటికి తిరిగి ఓట్లు అడుగుతున్నారు.. ఈ రోజు దాదాపుగా 100 కోట్లకుపైగా ఖర్చు పెడుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు.. ఇక, 154 స్థానాల నుండి 11 స్థానాలకు పడిపోయినా వైసీపీకి బుద్ది రావడం లేదని మండిపడ్డారు డోల వీరాంజనేయస్వామి.. ఈ రోజు పులివెందులలో కూడా వాళ్ల ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు… ఓటమిని జీర్ణించుకోలేక రిగ్గింగ్ చేస్తున్నారని, తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు.. ఇప్పటికే 35 శాతం ఓటింగ్ జరిగిందని తెలిపారు వాళ్ల ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేశారు అంటున్నారు.. మరి మా ఎమ్మెల్సీ ని కూడా హౌస్ అరెస్ట్ చేశారు కదా.. ? అని ప్రశ్నించారు.. చట్టం తన పని తాను చేసుకుంటా పోతుంది.. వారికి లాగా మేం ధర్నాలు గొడవలు చేయడం లేదన్నారు.. ప్రస్తుతానికి ఎన్నికలు ప్రశాంతంగా నడుస్తున్నాయి.కూటమి ప్రభుత్వం కచ్చితంగా విజయం సాధిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. వైసీపీ నేతలు ప్రతిదాన్ని రాజకీయం చేసుకుంటూ వెళ్తున్నారు.. చట్టాన్ని గౌరవించాలి. ఏకపక్షంగా రాజకీయం చేయడం ఎవరు ఉపేక్షించరని స్పష్టం చేశారు మంత్రి డోల వీరాంజనేయస్వామి..
మేమిద్దరం అన్నదమ్ములమని అప్పుడు తెలియదా?.. మరోసారి రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్!
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. తనకు మంత్రి పదవి ఇవ్వకుండా ఎవరు అడ్డుకుంటున్నారు? అని ప్రశ్నించారు. తనను పార్టీలోకి తీసుకున్నప్పుడు మేము ఇద్దరం అన్నదమ్ములం ఉన్నామని కాంగ్రెస్ హైకమాండ్‌కు తెలియదా? అనిమండిపడ్డారు. ఇద్దరం అన్నదమ్ముల్లో ఇద్దరం సమర్థులమే అని, ఇద్దరికీ మంత్రి పదవులు ఇస్తే తప్పేంటి? అని అడిగారు. ఆలస్యమైనా సరే తాను ఓపిక పడుతా అని, తనకు మంత్రి పదవి ఇవ్వాల్సిందే అని రాజగోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. ‘నాకు మంత్రి పదవి ఇవ్వకుండా ఎవరడ్డుకుంటున్నారు. నన్ను పార్టీలోకి తీసుకున్నప్పుడు తెలియదా మేము ఇద్దరం అన్నదమ్ములం ఉన్నామని. పార్లమెంట్ ఎన్నికల సమయంలో రెండవసారి ప్రామిస్ చేసినప్పుడు తెలియదా మేమిద్దరం అన్నదమ్ములం ఉన్నామని. ఒడ్డు దాటే వరకు ఓడ మల్లయ్య, ఒడ్డు దాటాక బోడి మల్లయ్య అన్న చందంగా ఉంది. 9 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఖమ్మం జిల్లాకి ముగ్గురు మంత్రులు ఉన్నారు.
ఖజానా జ్యువెలరీలో దోపిడీ దొంగల బీభత్సం.. సిబ్బందిపై కాల్పులు!
హైదరాబాద్ నగరంలోని చందానగర్‌లో కాల్పుల కలకలం రేగింది. ప్రముఖ నగల దుకాణం ‘ఖజానా జ్యువెలర్స్’లో దుండగులు దోపిడీకి ప్రయత్నించారు. దొంగతనంను అడ్డుకున్న సిబ్బందిపై దాడి చేయడమే కాకుండా.. కాల్పులు కూడా జరిపారు. దుండగుల కాల్పుల్లో షాపులోని పలువురు సిబ్బందికి గాయాలు అయ్యాయి. పోలీసుల రంగప్రవేశంతో దుండగులు షాప్‌లో నుంచి తప్పించుకుపోయారు. కేసు నమోదు చేసిన చందానగర్ పోలీసులు.. దుండగుల కోసం గాలిస్తున్నారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. దుండగులు ముందుగా ఖజానా జ్యువెలర్స్ గేట్ సిబ్బందిని గాయపరిచి లోపలికి ఎంటర్ అయ్యారు. ఎదురుతిరిగిన సిబ్బందిపై తుపాకీతో కాల్పులు జరిపారు. మరికొందరిపై దాడులకు సైతం పాల్పడ్డారు. లాకర్ కీ ఇవ్వకపోవడంతో గన్ తీసుకొని బెదిరించారు. దుండగుల ముఠా అసిస్టెంట్ మేనేజర్‌పై కాల్పులు జరిపింది. షాప్ లోపల బంగారు ఆభరణాలకు సంబందించిన స్టాల్స్ పగలగొట్టారు. స్టాఫ్ సిబ్బంది ఒకరు పోలీసులకు కాల్ చేయగా.. వెంటనే వారు ఖజానా జ్యువెలర్స్ షాప్‌కు చేరుకున్నారు. పోలీసులను చూసి దొంగల ముఠా పారిపోయింది.
అసత్యాలు మాట్లాడారంటూ.. కేంద్రమంత్రి బండి సంజయ్‌కి లీగల్ నోటీసు!
కేంద్రమంత్రి బండి సంజయ్‌కి భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ లీగల్ నోటీసు పంపారు. ఫోన్ టాపింగ్ కేసులో బండి సంజయ్ అడ్డగోలుగా, అసత్యపూరితంగా చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ లీగల్ నోటీస్ పంపారు. కేంద్రమంత్రిగా ఉండి బాధ్యతారహితంగా మాట్లాడారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ప్రజాప్రతినిధి మరొక ప్రజా ప్రతినిధిపై అసత్య ఆరోపణలు చేయడం దుర్మార్గం అంటూ నోటీసులలో పేర్కొన్నారు.
సుప్రీంకోర్టు బాటలోనే హైకోర్టు.. తక్షణమే వీధి కుక్కలు తొలగించాలని ఆదేశం
దేశ రాజధాని ఢిల్లీలో రెండు నెలల్లో వీధి కుక్కలు లేకుండా చేయాలని సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. ఈ తీర్పు జంతు ప్రేమికుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు తెప్పించింది. ఈ తీర్పు చట్ట విరుద్ధం అంటూ ఢిల్లీలోని ఇండియా గేట్ దగ్గర నిరసనలు చేపట్టారు. తాజాగా సుప్రీంకోర్టు బాటలో రాజస్థాన్ హైకోర్టు కూడా చేరింది. దేశ సర్వోన్నత న్యాయస్థానం తీసుకున్నట్టుగానే హైకోర్టు సీరియస్ ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్రంలో వీధి కుక్కలను తక్షణమే తీసివేయాలని కఠినమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జస్టిస్ కుల్దీప్ మాథుర్, జస్టిస్ రవి చిరానియాలతో కూడిన డివిజన్ బెంచ్ ఆదేశాలు ఇచ్చింది.
రామమందిరం చుట్టూ రక్షణ గోడ.. భారీగా బడ్జెట్ కేటాయింపు
ఆలయ సముదాయంలోని ఉత్తరం వైపు నుంచి నిర్మాణం ప్రారంభమై మొత్తం చుట్టు కవర్ అయ్యే వరకు దశలవారీగా పనులు కొనసాగనున్నాయి. మతపరమైన ప్రదేశానికి రక్షణ వ్యవస్థ ముఖ్యమైన భాగం అని భద్రతా నిపుణులు పేర్కొన్నారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఈ నిర్మాణం చేపడుతోంది. 14–16 అడుగుల ఎత్తులో మూడు అడుగుల ఉక్కు కంచెతో ఈ గోడ నిర్మాణం జరుగుతుంది. అనధికార ప్రవేశాన్ని నిరోధించడానికి అధునాతన నిఘా పరికరాలు, వాచ్‌టవర్‌లు ఏర్పాటు చేయనున్నారు. దీని నిర్మాణ బాధ్యతను ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్‌కు అప్పగించింది. ఈ గోడ నిర్మాణంతో ఆలయ భద్రతతో పాటు ఆధ్మాత్మిక పవిత్రతను కూడా బలోపేతం చేస్తుందని ట్రస్ట్ సీనియర్ సభ్యుడు అనిల్ మిశ్రా తెలిపారు. ముళ్ల తీగలు, ఎలక్ట్రానిక్ సెన్సార్లు, వాచ్‌టవర్‌లతో సహా ఆధునిక నిఘా పరికరాలు ఉంటాయని చెప్పారు. అనధికార చొరబాటుకు ఎటువంటి అవకాశం ఇవ్వబోమని తెలిపారు. ఏప్రిల్ మధ్యలో ట్రస్ట్‌కు అందిన భద్రతా హెచ్చరిక నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
ట్రంప్ గుడ్ న్యూస్.. బంగారంపై ఎటువంటి సుంకం ఉండదు.. ధరలు మరింత తగ్గే ఛాన్స్!
గత వారం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్, బ్రెజిల్ సహా అనేక దేశాలపై 50 శాతం సుంకం విధించాలని ఆదేశించారు. ట్రంప్ ఆదేశాలతో బంగారం దిగుమతులపై సస్పెన్స్ నెలకొంది. అదే సమయంలో, బంగారాన్ని సుంకాల యుద్ధం నుంచి దూరంగా ఉంచుతామని ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్‌లో బంగారంపై ఎటువంటి సుంకం ఉండదని ఒక పోస్ట్‌ను పంచుకున్నారు. గత వారం రోజులుగా బంగారంపై సుంకాలు విధిస్తారా లేదా అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కస్టమ్స్, సరిహద్దు భద్రతా విభాగం కూడా బంగారంపై భారీ సుంకం విధించే అవకాశాన్ని వ్యక్తం చేసింది. బంగారంపై 50 శాతం సుంకం విధిస్తారనే పుకార్ల కారణంగా, ధరలు భారీగా పెరిగాయి. అయితే, ట్రంప్ స్వయంగా ఈ పోస్ట్‌ను షేర్ చేయడం ద్వారా అన్ని పుకార్లకు ముగింపు పలికారు. ట్రంప్ తన పోస్ట్‌లో “బంగారంపై ఎటువంటి సుంకం ఉండదు” అని తెలిపారు.
కొత్త ఆదాయపు పన్ను బిల్లు 2025 లో.. ఆస్తి పన్నులో వచ్చే మార్పులు ఇవే!
దేశంలో అతి త్వరలో ఒక ముఖ్యమైన చట్టాన్ని సవరించబోతున్నారు. నిన్న ఆగస్టు 11న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో కొత్త ఆదాయపు పన్ను బిల్లు 2025ను ప్రవేశపెట్టారు. ఇది లోక్‌సభలో దాదాపు 3 నిమిషాల్లోనే ఆమోదించబడింది. రాజ్యసభ నుంచి ఆమోదం పొంది, రాష్ట్రపతి సంతకం చేసిన తర్వాత, ఈ బిల్లు కొత్త చట్టంగా అమల్లోకి వస్తుంది. కొత్త ఆదాయపు పన్ను బిల్లు 2025 పాత ఆదాయపు పన్ను చట్టం 1961 నిబంధనలను మార్చబోతోంది. ఈ బిల్లులో ఆస్తి పన్నుకు సంబంధించి అనేక మార్పులు చోటుచేసుకుంటాయని సంబంధిత వర్గాలు వెల్లడిస్తున్నాయి.
ఫ్యామిలీ మ్యాన్ 3 స్ట్రీమింగ్.. ఎప్పుడంటే?
మనోజ్ బాజ్పాయ్ థియేటర్ కన్నా ఓటిటి ప్లాట్ ఫామ్స్ వైపే ఫోకస్ పెంచాడు. ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకున్న ఇండియన్ వెబ్ సిరీస్ లలో ది ఫామిలీ మాన్ సిరీస్ ఒకటి. మనోజ్ బాజ్‌పేయీకి ఎంతో పేరు తెచ్చింది. రాజ్ & డీకే డైరెక్షన్‌లో వచ్చిన ఈ సిరీస్‌లో ‘శ్రీకాంత్ తివారి’గా ఆయన అందరి మనసు దోచుకున్నాడు. స్పై థ్రిల్లర్, ఫ్యామిలీ ఎమోషన్స్ మిక్స్‌తో రెండు సీజన్లు సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు, ఇండియా – చైనా టెన్షన్ మధ్య, శ్రీకాంత్ మిషన్ కొత్త లెవల్‌లో సెట్ అవుతోందట. నవంబర్ నుంచి ఈ థర్డ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో స్ట్రీమింగ్ కానుందని సమాచారం.
‘కూలీ’ లో తన పాత్ర పై కింగ్ నాగ్ సెన్సేషనల్ స్టేట్‌మెంట్..
సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ‘కూలీ’ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో నాగార్జున, శ్రుతి హాసన్, ఆమిర్ ఖాన్ వంటి అగ్ర తారలు భాషా భేదం లేకుండా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక లోకేష్ కనగరాజ్ ఇప్పటికే తన LCU (Lokesh Cinematic Universe) ద్వారా ప్రేక్షకులను కొత్త యాక్షన్ అనుభవం అందించారు. కూలీతో ఆయన మాస్, ఎమోషనల్, స్టైల్ కలిపి మరో హిట్ అందించబోతున్నారని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఆగస్టు 14 విడుదలతో ఈ సినిమా రజనీకాంత్, నాగార్జున అభిమానులకు మరిచిపోలేని అనుభూతిని ఇవ్వనుంది. అయితే ఈ మూవీ ప్రమోషన్‌లో భాగంగా నటినటులంత కూడా వరుస ఇంటర్వ్యూలలో పాల్గోంటూ మూవీకి సంబంధించిన విషయాలు పంచుకుంటున్నారు.