లోకేష్‌ను కలిసిన వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ వర్సిటీ విద్యార్థులు
శ్రీ సత్యసాయి జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేస్.. పుట్టపర్తిలో ప్రజలు, కార్యకర్తలను కలిశారు.. పలు సమస్యలపై వారి నుంచి అర్జీలు స్వీకరించారు.. ఇక, ఈ సందర్భంగా.. మంత్రి లోకేష్ ను కలిశారు వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ విద్యార్థులు.. శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువు జడ్పీ పాఠశాలలో మెగా పీటీఎం-2.0 కార్యక్రమంలో పాల్గొనేందుకు పుట్టపర్తి చేరుకున్న మంత్రి నారా లోకేష్ ముందుగా.. ఈ రోజు ఉదయం కప్పలబండలోని పారిశ్రామిక వాడలో ప్రజలు, కార్యకర్తలను కలుసుకున్నారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించిన మంత్రి.. వివిధ సమస్యలపై వారి నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రతి అర్జీని పరిశీలించి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని భరోసా ఇచ్చారు. ఇక, కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్యరెడ్డి, ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో కడపలోని వైఎస్ఆర్ ఆర్కిటెక్టర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ విద్యార్థులు మంత్రి నారా లోకేష్ ను కలిశారు.. యూనివర్సిటీ గుర్తింపు విషయంలో నెలకొన్న సమస్యను పరిష్కరించాలని విన్నవించారు. విద్యార్థుల విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన మంత్రి లోకేష్.. కలిసికట్టుగా సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థులు ఎలాంటి ఆందోళనా చెందవద్దని భరోసా ఇచ్చారు. విద్యార్థులు విద్యపై దృష్టిపెట్టాలని, మీ భవిష్యత్ ను తాను చూసుకుంటాని ధైర్యం చెప్పారు మంత్రి నారా లోకేష్..
కాణిపాకం ఆలయంలో అపచారం
కాణిపాకం దేవాలయం దక్షిణ భారతదేశంలో సందర్శించాల్సిన ప్రముఖ ఆలయాల్లో ఒకటిగా చెబుతారు.. ఈ ఆలయం శివుడు మరియు పార్వతీదేవికి ఇష్ట కుమారుడై గణేశుడికి అంకితం చేయబడింది. చిత్తూరు జిల్లాలో ఉన్న ఒక పురాతన దేవాలయం.. ఇక్కడ స్వయంభువుగా గణేశుడు వెలిశారని ప్రసిద్ధి.. ఇక్కడ వినాయకుని విగ్రహం ఎల్లప్పుడూ నీటిలో ఉంటూ, రోజురోజుకీ పెరుగుతూ ఉంటుందని భక్తుల నమ్మకం.. అయితే, కాణిపాకం ఆలయంలో అపచారం చోటు చేసుకుంది.. పాడైన పాలతో వినాయకుడికి అభిషేకం చేయాల్సిన దుస్థితి ఏర్పడింది.. ఆలయంలో పాడైన పాలను భక్తులకు విక్రయిస్తున్నాడు కాంట్రాక్టర్.. దీంతో, కాంట్రాక్టర్ తీరుపై భక్తులు మండిపడుతున్నారు.. దీనిపై సదరు కాంట్రాక్టర్‌ను ప్రశ్నించిన ఉపయోగం లేకపోగా.. ఇక, భక్తులకు అధికారులు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారంటూ.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కాణిపాకం గణపతి ఆలయానికి వచ్చిన భక్తులు..
ఉపాధ్యాయుడిగా మారిన సీఎం చంద్రబాబు.. విద్యార్థిగా లోకేష్..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ నిర్వహిస్తోంది.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో కార్యక్రమం జరుగుతోంది.. పాఠశాల విద్యలో తల్లిదండ్రుల పాత్ర, ఉపాధ్యాయుల సహకారంపై చర్చతో పాటు.. గుడ్ టచ్, బ్యాడ్ టచ్.. డ్రగ్ ఎడిక్షన్ తదితర అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నారు.. ఇక, గిన్నిస్ బుక్ రికార్డు దిశగా పేరెంట్ టీచర్ మీటింగ్ జరుగుతోంది.. 2 కోట్లకు పైగా భాగస్వామ్యంతో పేరెంట్ – టీచర్ మీటింగ్ జరుగుతుంగా.. 74 లక్షలకు పైగా విద్యార్థులు పాల్గొంటున్నారని చెబుతున్నారు.. అయితే, ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు.. ఒక్క సారిగా ఉపాధ్యాయుడిగా మారిపోయి.. విద్యార్థులకు పాఠాలు భోదించారు.. ఇదే సమయంలో.. విద్యార్థిగా మారిపోయిన మంత్రి నారా లోకేష్.. విద్యార్థుల మధ్యే కూర్చొని ఆ క్లాస్ విన్నారు.. పుట్టపర్తి నియోజకవర్గం, కొత్తచెరువు గ్రామంలో మెగా పేరెంట్-టీచర్ మీటింగ్‌లో పాల్గొన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్.. అయితే, ఉపాధ్యాయుడిగా మారారు ముఖ్యమంత్రి చంద్రబాబు.. పీటీఎం కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు విద్యా బోధన చేశారు.. వనరుల అనే సబ్జెక్ట్ పై విద్యార్థులకు క్లాస్ తీసుకున్నారు.. అయితే, విద్యార్థులతో కలిసి పాఠాలు విన్నారు మంత్రి నారా లోకేష్.. ఆ తర్వాత విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డులను పరిశీలించి.. మార్కులపై ఆరా తీశారు సీఎం.. తల్లిదండ్రులతో మాట్లాడి పాఠశాలలు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు.. విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో ఫొటోలు దిగారు సీఎం చంద్రబాబు.. విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ బాగా పని చేస్తున్నారని కితాబిచ్చారు.. ఈ మార్పులన్నింటినీ తీసుకొచ్చినందుకు మంత్రి లోకేష్‌పై ప్రసంశలు కురిపించారు సీఎం చంద్రబాబు నాయుడు..
నా కోడికి న్యాయం కావాలి.. పోలీస్ స్టేషన్ చేరిన పంచాయతి..!
రోజురోజుకూ పెరుగుతున్న నేరాలు, హత్యలు, దోపిడీలు, దొంగతనాలు వంటి ఘటనలతో పోలీసులు తలపట్టుకుంటున్న ఈ రోజుల్లో.. నల్లగొండ జిల్లా నకిరేకల్ పోలీసులకు ఓ వింత కేసు ఎదురైంది. సాధారణంగా న్యాయం కోసం వచ్చేవారి కేసులు చట్టబద్ధమైనవే అయినా.. ఈసారి వచ్చిన ఫిర్యాదు అంతకుమించిలా ఉంది. ఆ కేసు వివరాలు వినగానే అందరికీ ఆశ్చర్యం వేస్తుంది. మరి ఆ కేసు ఏంటి..? ఆ కేసుకు పోలీసులు ఎలాంటి పరిశరాన్ని చూపారో చూద్దామా.. నకిరేకల్ కి చెందిన గంగమ్మకు ఎంతో ఇష్టమైన పెంపుడు కోడి ఉంది. ప్రతిరోజూ అది బయట తిరిగి సాయంత్రం ఇంటికే వచ్చేది. అయితే, అదే కోడి పక్కింటి రాకేష్ ఇంటి గడ్డివాము వద్ద గింజలు తినడం మొదలుపెట్టింది. దీన్ని చూసిన రాకేష్ కోపంతో కోడిని కర్రతో కొట్టడంతో అది గాయపడింది. రాకేష్ కొట్టుడుతో.. కోడి కాళ్లు విరిగిపోయాయి. అంతే, ఆ విషయాన్ని గమనించిన గంగమ్మ బోరున ఏడుస్తూ నకిరేకల్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది.
మల్నాడ్ రెస్టారెంట్ డ్రగ్స్ పార్టీ కేసులో ‘ఈగల్ టీం’ దూకుడు.. 9 పబ్స్పై కేసు నమోదు!
మల్నాడు రెస్టారెంట్ డ్రగ్ పార్టీ కేసులో ఈగిల్ టీం దర్యాప్తును ముమ్మరం చేసింది. 9 పబ్స్ పైన ఈగల్ టీం కేసులు నమోదు చేసింది. ఇప్పటికే, పబ్బుల యజమానులకు నోటీసులు జారీ చేసింది. వచ్చే వారం తమ ఎదుట హాజరు కావాలని పబ్బు యజమానులకు నోటీసులు అందజేశారు. మల్నాడు రెస్టారెంట్ సూర్యతో ముగ్గురు పబ్ యజమానులతో సంబంధాలు ఉన్నట్లు సమాచారం. మూడు పబ్స్ యజమాలతో కలిసి డ్రగ్ పార్టీలు నిర్వహించినట్లుగా ఈగల్ టీం గుర్తించారు. అయితే, పబ్బుల్లో డ్రగ్స్ పార్టీ కోసం ప్రిజం పబ్, ఫామ్ పబ్, బర్డ్ బాక్స్ పబ్, బ్లాక్ 22 పబ్, వాక్ కోరా పబ్, బ్రాడ్ వే పబ్స్ కు చెందిన యాజమాన్యాలు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. అయితే, వాక్ కోరా పబ్, బ్రాడ్ వే పబ్, బ్రాడ్ వే యజమానులపై పోలీసులు కేసు నమోదు చేశారు. క్వాక్ పబ్ రాజా శేఖర, కోరా పబ్ పృద్వి వీరమాచినేని, బ్రాడ్ వే పబ్ ఓనర్ రోహిత్ మాదిశెట్టిలపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ ముగ్గురు పబ్బు యజమానులతో కలిసి డ్రగ్ పార్టీలు నిర్వహించినట్లు సూర్య పేర్కొన్నారు.
మాజీ ప్రధాని ఇందిరా గాంధీపై శశిథరూర్ ఘాటు విమర్శలు..
కాంగ్రెస్ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ హయాంలో విధించిన ఎమర్జెన్సీని చీకటి అధ్యాయంగా విమర్శిస్తూ రాసిన ఓ ఆర్టికల్‌లో తీవ్ర విమర్శలు గుప్పించారు ఆయన. ఎమర్జెన్సీ ప్రకటించడం ఒక చీకటి అధ్యాయం.. ఆ చీకటి అధ్యాయం నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయని చెప్పుకొచ్చారు. అయితే, ఎమర్జెన్సీ సమయంలో అందరి స్వేచ్ఛను హరించారు. ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా అణచి వేసే ప్రయత్నం చేశారని ప్రాజెక్టు సిండికేట్ అనే వెబ్‌సైట్‌లో ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఓ వ్యాసం రాశారు. ఇక, దేశంలో అంతర్గత గందరగోళాన్ని తొలగించడం కోసం బయటి నుంచి వచ్చే ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి ఎమర్జెన్సీ లాంటి కఠినమైన నిర్ణయం తప్పనిసరి అని మాజీ ప్రధాన మంత్రి ఇందిరాగాంధీని ఆలోచించి.. తప్పుడు నిర్ణయం తీసుకున్నారని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఆరోపించారు. కానీ, ఈ తప్పుడు విధానాలు ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేశాయని చెప్పుకొచ్చారు. దాదాపు జూన్ 21 నెలల పాటు కొనసాగిన అత్యవసర పరిస్థితిలో పౌరుల స్వేచ్ఛ, మీడియా, ప్రతిపక్ష నేతలు పూర్తిగా అణిచివేయబడ్డారని తెలిపారు.
కర్ణాటకను హడలెత్తిస్తోన్న ఆకస్మిక మరణాలు.. హార్ట్‌ఎటాక్‌తో యూపీఎస్సీ అభ్యర్థిని మృతి
కర్ణాటక రాష్ట్రాన్ని ఆకస్మిక మరణాలు హడలెత్తిస్తున్నాయి. ఎక్కువగా యువకులే గుండెపోటుతో మరణిస్తున్నారు. గత జూన్ నెలలో హసన్ జిల్లాలో 23 మంది హార్ట్‌ఎటాక్‌తో ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఆకస్మిక మరణాలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. దీంతో గుండె పరీక్షల కోసం ప్రజలు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. ఇలా రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇలాంటి సంఘటనలే కనబడుతున్నాయి. ఇదిలా ఉంటే గత 24 గంటల్లో రాష్ట్రంలో ఏడుగురు గుండెపోటుతో మరణించారు. కళ్ల ముందు తిరుగుతూ ఉన్న వారే హఠాత్తుగా ప్రాణాలు వదులుతున్నారు. ఇక బుధవారం ధార్వాడలోని పురోహిత్ నగర్‌కు చెందిన జీవిత కుసగుర్(26) గుండెపోటుతో మరణించింది. ఆమె తండ్రి ఒక ఉపాధ్యాయుడు. కుమార్తెను ఐఏఎస్ చేయాలన్న ఉద్దేశంతో చదివిస్తున్నాడు. ఇంతలోనే గుండెపోటు రూపంలో మృత్యువు కబళించడంతో కుటుంబ సభ్యులు తల్లిడిల్లిపోతున్నారు. ఇంట్లో ఉన్నప్పుడు ఛాతీనొప్పి వస్తుందని చెప్పింది. వెంటనే కుటుంబ సభ్యులు నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే ఆమె తుది శ్వాస విడిచింది. ఆమెను పరీక్షించిన వైద్యులు చనిపోయినట్లుగా ధృవీకరించారు. ఈ వార్త స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. చిన్న వయసులోనే గుండెపోటులు రావడంతో రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపుతోంది.
అమెరికాతో వాణిజ్య చర్చలు నడుస్తున్నాయి.. భారత వాణిజ్య శాఖ వెల్లడి
అమెరికాతో వాణిజ్య చర్చలు నడుస్తున్నాయని వాణిజ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ అగర్వాల్ గురువారం తెలిపారు. భారతదేశం-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంలో అగర్వాల్ ముఖ్య సంధానకర్తగా ఉన్నారు. ఇప్పటికే పలుమార్లు అమెరికాతో వాణిజ్య చర్చలు జరిపారు. త్వరలోనే ఒక కొలిక్కి అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. వాస్తవానికి ట్రంప్ విధించిన డెడ్‌లైన్ గడువు జూలై 9తో ముగిసిపోయింది. అయితే కొన్ని దేశాలకు ఆగస్టు 1 వరకు గడువు పొడిగించారు. అయితే అమెరికా.. భారత్‌లో వ్యవసాయం, పాడి పరిశ్రమపై మినహాయింపులు కోరుతోంది. ఈ రెండు కూడా భారతదేశంలో చాలా సెంటిమెంట్. ఈ నేపథ్యంలోనే ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు సందిగ్ధంలో పడ్డాయి. తాజాగా ఇదే అంశంపై గురువారం రాజేష్ అగర్వాల్ స్పందించారు. ఎగుమతి లాజిస్టిక్స్‌పై జరిగిన కార్యక్రమంలో అగర్వాల్ వాణిజ్య ఒప్పందాలపై మాట్లాడారు. అమెరికా-భారత్ మధ్య వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేయడానికి భారతదేశం ప్రయత్నిస్తోందని చెప్పారు. ఈ ఒప్పందం యొక్క మొదటి దశను సెప్టెంబర్-అక్టోబర్ నాటికి ముగించడానికి లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. భారతదేశం ఇప్పటి వరకు 26 దేశాలతో 14కి పైగా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు అమలు చేసిందని అగర్వాల్ అన్నారు. ప్రస్తుతం ప్రధాన మార్కెట్లతో అనుసంధానం అవుతున్నామని.. ఇప్పటికే యూకేతో ఒక ఒప్పందాన్ని ముగించినట్లు పేర్కొన్నారు. యూరోపియన్ యూనియన్‌తో కూడా చర్చల దశలో ఉన్నట్లు తెలిపారు.
‘కొత్తపల్లిలో ఒకప్పుడు’ ట్రైలర్ రిలీజ్..
‘కేరాఫ్ కంచరపాలెం’, ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’ బాంటి విజయవంతమైన చిత్రాలతో ప్రేక్షకుల్ని మెప్పించిన నిర్మాత ప్రవీణ పరుచూరి.. ఇప్పుడు ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’ అనే సినిమాతో, దర్శకురాలిగా, పరిచయం అవుతున్నారు. రవీంద్ర విజయ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి రానా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా జులై 18న ఇది విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్రబృందం ట్రైలర్ విడుదల చేసింది. కాగా ఈ ట్రైలర్ ఊహించని ట్విస్ట్ లతో.. నాన్ స్టాప్ కామెడితో ఆకట్టుకుంది. ట్రైలర్ లో రామకృష్ణ అనే యువకుడు ఒక చిన్న పట్టణంలో డ్యాన్స్ స్టూడియో నడుపుతుంటాడు. అతను సావిత్రిని ప్రేమిస్తుంటాడు, ఆమె కూడా అతని భావాలకు స్పందిస్తున్నట్లు కనిపిస్తుంది. ఓ రోజు సావిత్రి అతన్ని గడ్డివాము వద్ద కలవమని అడుగుతుంది. ఆనందంగా వెళ్లిన రామకృష్ణ జీవితంలో అప్పటి నుంచి భారీ మలుపు తిరుగుతుంది. ఇది కేవలం ప్రేమకథ మాత్రమే కాకుండా, ఒక అనూహ్యమైన మిస్టరీ, దైవిక సంబంధాల నడుమ నడిచే కథ గా మారుతుంది. ఇక మనోజ్ చంద్ర, మోనికా ప్రధాన పాత్రల్లో నటిస్తూ తమ పాత్రలకు స్వచ్ఛమైన అమాయకత్వాన్ని తీసుకొచ్చారు. రవీంద్ర విజయ్ కూడా తన పాత్ర ద్వారా బలమైన ప్రభావాన్ని చూపిస్తున్నారు. మొత్తానికి ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’ ట్రైలర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించడంలో సఫలమైంది. ఈ సినిమా జులై 18 న విడుదలకు సిద్ధమవుతుంది. రూటీన్ ప్రేమ కథలకు భిన్నంగా మలచిన ఈ గ్రామీణ డ్రామా ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని ఇచ్చే అవకాశం ఉంది.
మరో సినిమా స్టార్ట్ చేసిన కార్తీ.. టైటిల్ ఇదే
తమిళ హీరో కార్తీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజిగా ఉన్నాడు. డిఫ్రెంట్ కథలతో సినిమాలు చేస్తూ తనకంటూ సెపరేట్ గుర్తింపు తెచ్చుకున్నాడు. అటు తమిళ్ తో పాటు ఇటు తెలుగులోను కార్తీ సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. కార్తీ నటించిన యుగానికి ఒక్కడు, ఖైదీ, ఊపిరి, ఆవారా, ఖాకి, సర్దార్ వంటి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి. కార్తీ సినిమా అంటే మినిమం గ్యారెంటీ అనే అభిప్రాయం సినిమా ప్రేక్షకుల్లో ఉంది. ప్రస్తుతం సర్దార్ కు సీక్వేల్ సర్దార్ 2 తో పాటు మరో సూపర్ హిట్ ఖైదీ కి సీక్వెల్ ఖైది 2లో నటిస్తున్నాడు కార్తీ. ఇక ఇప్పుడు మరో సినిమా చేస్తున్నాడు. కార్తీ కెరీర్ లో 29వ సినిమాగా వస్తున్న ఈ సినిమాకు ‘మార్షల్’ అనే టైటిల్ ను ఫిక్స్ చేస్తూ అఫీషియల్ పోస్టర్ ను రిలీజ్ చేసారు మేకర్స్. నేడు చెన్నైలో పూజా కార్యక్రమాలతో మొదలైన ఈ సినిమాకు కోలీవుడ్ సూపర్ హిట్ సినిమా తనక్కారన్ డైరెక్ట్ చేసిన యంగ్ దర్శకుడు ‘తమిళ’ దర్శకత్వం వహిస్తున్నాడు. యంగ్ సెన్సషన్ సాయి ఆభ్యంకర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా భారీ బడ్జెట్‌తో నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ సినిమా కథ రామేశ్వరం నేపథ్యంలో సాగుతుండడం మెజారిటి పోర్షన్ సముద్రం లొకేషన్స్ షూట్ చేయాల్సి ఉందట. అత్యంత భారీ బడ్జెట్ పై తెరకెక్కుతున్న మార్షల్ సినిమాను డ్రీమ్ వారియర్ పిచర్స్ బ్యానర్ పై ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు నిర్మిస్తున్నారు.