విశాఖ రైల్వేజోన్ పరిధిలోనే కేకే లైన్ కొనసాగించాలి.. ఊపందుకున్న డిమాండ్..
అరకు రైలు ప్రయాణం పర్యాటకులను ఫిదా చేస్తుంది. కొండలు, గుట్టలు, లోయలు దాటుకుని పచ్చటి అడవుల్లో టన్నెల్స్ గుండా సాగిపోయే జర్నీ మరపురాని అనుభూతి. విశాఖ నుంచి దాదాపు 120 కిలో మీటర్లు సాగిపోయే ఈ పర్యాటక రైలు మార్గం ఇంత కాలం వాల్తేరు రైల్వే డివిజన్ పరిధిలో ఉండేది. విస్టాడోమ్ కోచ్ లు ఏర్పాటు చేయడం ద్వారా ఎక్కువ మంది టూరిస్టులను ఆకర్షిస్తోంది.. అయితే, విశాఖ కేంద్రంగా ఏర్పాటైన సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కు అధికారికంగా కేంద్రం ఆమోదించడంతో పాటు రూట్ మ్యాప్ పిక్స్ చేసింది. ఆంధ్రప్రదేశ్ మొత్తం జోన్ పరిధిలోకి తెస్తూనే కీలకమైన కేకే లైన్ ను తూర్పు కోస్తా పరిధిలో నూతనంగా ఏర్పాటైన రాయగడ డివిజన్ పరిధిలోకి మార్పు చేసింది. కొత్తవలస – కిరండోల్ భాగమైన అరకు రైల్వే స్టేషన్ పై తెలుగువారికి ఎంతో ఎమోషనల్ టచ్ ఉన్నది. అంతే కాదు కేకే లైన్ తూర్పు కోస్తా రైల్వే జోన్‌కి అత్యధిక ఆదాయం తెచ్చేది కూడా. దీనిని వదలుకోవడం అంటే విశాఖ రైల్వే డివిజన్‌కు ఆర్థికంగా నష్టమే. ఏపీ, ఒడిశా, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలను కలుపుతూ 446 కిలోమీటర్ల మేర ఈ మార్గం సాగిపోతుంది. 58 చోట్ల కొండలను తవ్వి గుహల్లోంచి రైలు మార్గాన్ని నిర్మించారు. ఈ లైన్లలో 48 రైల్వేస్టేషన్లు ఉన్నాయి. కేకే లైన్ ద్వారా ఛత్తీస్‌గఢ్‌లోని బైలదిల్లా గనుల నుంచి.. విశాఖ పోర్టు వరకు ఐరన్ ఓర్ రోజుకు 10 నుంచి 12 వ్యాగన్ల రవాణా జరుగుతుంది. ఏటా 10 వేల కోట్లు ఆదాయం లభిస్తుందని అంచనా. గూడ్స్ రైళ్లు మాత్రమే కాకుండా కేకే లైన్‌లో విశాఖ నుంచి మూడు, రాయగడ నుంచి మూడు ప్యాసింజర్ రైళ్లు నడుస్తాయి. ఈ విధంగా బహుముఖ ప్రయోజనాలు ఉన్న కేకే లైన్ విశాఖ డివిజన్ లోనే కొనసాగించాలని నిరసనలు ఊపందుకుంటున్నాయి.
సీఐడీ విచారణకు వర్మ డుమ్మా.. ఆర్జీవీ తరఫు న్యాయవాది కీలక వ్యాఖ్యలు..
గుంటూరులో సీఐడీ పోలీసులు ఇచ్చిన నోటీసుల ప్రకారం.. సినీ దర్శకుడు రాం గోపాల్ వర్మ ఈ రోజు విచారణకు హాజరుకావాల్సి ఉంది.. అయితే, సారీ మూవీ ప్రమోషన్ లో ఉన్న కారణంగా హాజరు కాలేను అని.. ఈ నెల 28న సినిమా రిలీజ్ ఉండటంతో బిజీగా ఉన్నానని.. 8 వారాల సమయం కావాలని.. ఆ 8 వారాల తర్వాత డేట్ ఇస్తే విచారణకు హాజరు అవుతామని సీఐడీకి సమాచారం ఇచ్చారు ఆర్జీవీ.. తనకు నోటీసులు అందజేసిన.. సీఐడీ ఇన్‌స్పెక్టర్ తిరుమల రావుకి వాట్సాప్ ద్వారా సమాచారం ఇచ్చారు.. సీఐడీ చీఫ్ రవి శంకర్ కు వాట్సాప్ ద్వారా సమాచారం అందించారు వర్మ.. అయితే, సీఐడీ విచారణకు ఆర్జీవీ హాజరుకాలేకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశారు ఆయన తరఫు న్యాయవాది నాని బాబు.. అనారోగ్య కారణాలతో.. గుంటూరులో సీఐడీ విచారణకు వర్మ హాజరు కాలేరని ఆయన తరపు న్యాయవాది నాని బాబు.. సీఐడీ పోలీసులకు సమాచారం ఇచ్చారు.. నేడు గుంటూరులో సీఐడీ కార్యాలయానికి వెళ్లిన వర్మ తరపు అడ్వకేట్.. సీఐడీ విచారణకు రావడానికి రామ్ గోపాల్ వర్మ కు 8 వారాల సమయం కావాలని కోరారు.. అనారోగ్య కారణాలతో ఆయన విచారణకు హాజరు కాలే పోతున్నారని, వర్మ తరపు న్యాయవాది పోలీసులకు సమాచారం ఇచ్చారు.. సామాజిక మధ్యమాలలో పెట్టిన పోస్టుల కారణంగా వర్మ మీద కేసు నమోదు అయిందని, ఈ నేపథ్యంలో గుంటూరు సీఐడీ కార్యాలయానికి రావాలని సీఐడీ పోలీసులు వర్మకి నోటీసులు ఇచ్చారని ఆయన తరపు న్యాయవాది అంటున్నారు. 8 వారాల సమయం కోరాం, పోలీసులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి అంటూన్నారు వర్మ తరుపున న్యాయవాది..
పోలీసులపై మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి వివాదస్పద వ్యాఖ్యలు..
పోలీసులపై మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. రాప్తాడు నియోజకవర్గం కనగానపల్లి మండలం గుంతపల్లిలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తపై కత్తితో దాడి సందర్భంగా.. పోలీసులు వ్యవహరించిన తీరుపై ఘాటైన విమర్శలు చేశాడు. రాప్తాడులో ప్రశ్నించినవారిపై దాడులు చేస్తున్న పరిటాల కుటుంబానికి పోలీసులు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. పోలీసులకు సిగ్గుండాలని, పోలీసులు పరిటాల కుటుంబం గుమస్తాలు, వాచ్‌మెన్‌లు కాదని విమర్శించారు. పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ వర్గీయులే వైసీపీ కార్యకర్త చాకలి నరసింహులుపై దాడి చేయించారన్నారు. వైసీపీ కార్యకర్తపైనే దాడి చేసి.. తిరిగి వైసీపీ కార్యకర్త నరసింహులు.. టీడీపీ నాయకులపై దాడి చేశారని.. అక్రమ కేసులు పెడుతున్నారన్న ఆరోపించారు. మరోవైపు పాత కక్షలు నేపథ్యంలో చాకలి నరసింహులుపై దాడి జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ మధ్య వివాదం ముదురుతోంది. మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ రాప్తాడు నియోజకవర్గంలో యాక్టివ్‌గా తిరగడంపై ప్రకాష్ రెడ్డి వర్గీయులు తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇదే సమయంలో ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా పనిచేసిన సొంత పార్టీ నేతలను బీ టీంగా అభివర్ణిస్తూ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సస్పెండ్ చేయించారు.. దీంతో, ఆగ్రహించిన రామగిరికి చెందిన మండల నాయకులు.. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వ్యతిరేకిస్తూ రాజీనామాలు చేస్తామంటూ పోస్ట్ లు పెట్టడం కలకలం రేపింది.
మరణంలోనూ ఐదుగురికి ప్రాణం పోసిన యువ వైద్యురాలు.. శోకసంద్రమైన నంగివాండ్లపల్లి
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్‌పై జరిగిన కారు ప్రమాదంలో మృతి చెందిన డాక్టర్ భూమికారెడ్డి అంత్యక్రియలు స్వగ్రామంలో నిర్వహించారు.. సత్యసాయి జిల్లా తలుపుల మండలం నంగివాండ్లపల్లికి భూమికారెడ్డి భౌతికకాయాన్ని తరలించారు కుటుంబ సభ్యులు.. తమ గ్రామానికి చెందిన యువ వైద్యురాలు ప్రాణాలు పోవడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.. డాక్టర్ భూమికారెడ్డి మృతదేహం స్వగ్రామానికి చేరుకోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు శోకసంద్రంలో మునిగిపోయారు.. ఇక, తాను మరణించాక కూడా అవయవాదానంతో ఐదుగురి ప్రాణాలు కాపాడింది యువ డాక్టర్ భూమికారెడ్డి.. వైద్య వృత్తితో ఎంతోమందికి వైద్య సేవలు, చికిత్సలు అందించిన ఆమె.. ప్రాణాలు పోయిన తర్వాత కూడా అవయవ దానం చేసి ఐదుగురికి పునర్జన్మ ఇచ్చారు.. యువ డాక్టర్ భూమిక రెడ్డికి కుటుంబ సభ్యులు, బంధువులు, తోటి వైద్యులు, స్నేహితులు.. నంగివాండ్లపల్లి గ్రాస్తులు బరువెక్కిన హృదయాలతో కన్నీటివీడ్కోలు పలికారు..
పార్టీ మారి 10 నెలలు అయింది.. ఇది రీజనబుల్ టైం కాదా..? సుప్రీంకోర్టు
సుప్రీం కోర్టులో బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సోమవారం విచారణ జరిగింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఈ పిటిషన్ దాఖలు చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ వారు ఈ పిటిషన్ పెట్టారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ వినోద్ చంద్రన్ ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. పార్లమెంటరీ ప్రక్రియను ఫ్రస్ట్రేషన్‌కు గురి చేయొద్దని, ప్రజాస్వామ్యంలో పార్టీలకు హక్కులు ఉంటాయని తెలిపింది. ఎమ్మెల్యేలు పార్టీలు మారి 10 నెలలు అయింది.. ఇది రీజనబుల్ టైం కాదా అంటూ సుప్రీం కోర్ట్ ప్రశ్నించగా.. మాకు వాదనలు వినిపించేందుకు రెండు మూడు రోజుల సమయం కావాలని కోరారు రోహిత్గి. మరోవైపు సుప్రీంకోర్టు ఇచ్చిన గత తీర్పుల ప్రకారం రీజనబుల్ టైమ్ అంటే మూడు నెలలు మాత్రమేనని బిఆర్ఎస్ వాదిస్తుంది. రీజనబుల్ టైమ్ అంటే ఎంత సమయం కావాలో చెప్పండని కోర్టు లేవనెత్తింది. అనంతరం ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు, ఈ పిటిషన్‌పై విచారణను ఫిబ్రవరి 18కి వాయిదా వేసింది.
కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డ ఎమ్మెల్సీ కవిత
జగిత్యాలలో బీఆర్ఎస్ పార్టీ సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. కేసీఆర్ పాలన ఐఫోన్ లా ఉంటే, రేవంత్ రెడ్డి పాలన చైనా ఫోన్ లా ఉందని ఆవిడ పేర్కొన్నారు. ఐఫోన్ స్థిరమైన పనితీరుకు ప్రాధాన్యం కల్పిస్తే, చైనా ఫోన్ బయటకు బాగుంటుందని.. కానీ, సరిగ్గా పని చేయదని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి కూడా మాటలు చెప్పి బీసీలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. కవిత తమ ప్రసంగంలో బీసీ సమాజంపై జరిగిన అన్యాయాన్ని ప్రస్తావించారు. “ఏ కులంలో ఎంత జనాభా ఉన్నారో లెక్కలు ఎందుకు బయటపెట్టడం లేదు?” అని ఆమె ప్రశ్నించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ బీసీ సంఘాలతో తూతూ మంత్రంగా సమావేశాలు పెట్టడం కాకుండా, స్వయంగా ముఖ్యమంత్రి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే వరకు తమ పోరాటం ఆగదని, మరో తెలంగాణ పోరాటం తరహాలో సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
వామ్మో.. ట్రాఫిక్ నరకం.. 300 కి.మీ మేర నిలిచిపోయిన వాహనాలు
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు అత్యంత భారీగా భక్తులు పోటెత్తారు. తాజాగా మహా కుంభమేళాకు ఊహించని రీతిలో తండోపతండాలుగా భక్తులు తరలివస్తున్నారు. కనీసం కాలు తీసి కాలు వేయలేనంతగా భక్తులు తరలివచ్చారు. ఇసుకేస్తే రాలనంతగా భక్తులు తరలివచ్చారు. దీంతో వారణాసి, కన్పూర్ నుంచి ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే మార్గాలన్నీ వాహనాలతో నిండిపోయాయి. ఇక ఆదివారం సెలవు దినం కావడంతో ఊహించని విధంగా భక్తులు తరలి రావడంతో రహదారులన్నీ వాహనాలతో.. భక్తులతో కిక్కిరిపోయింది. ఇలా దాదాపు 300 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో భక్తులకు నరకం కనిపిస్తోంది. అటు వెనక్కి వెళ్లలేని పరిస్థితి… ఇటు ముందుకు వెళ్లాలని పరిస్థితి దాపురింది. తెచ్చుకున్న ఆహార పదార్థాలు అయిపోవడంతో.. తాగేందుకు నీళ్లు దొరకకా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిన్న పిల్లలు, వృద్ధులైతే తీవ్ర కష్టాలు పడుతున్నారు. తగిన విశ్రాంతి లేకపోవడంతో నీరసించి పోతున్నారు. కొనేందుకు కూడా ఆహార పదార్థాలు దొరకడం లేదని భక్తులు వాపోతున్నారు. ఇలా దాదాపు 48 గంటల నుంచి భక్తులు తంటాలు పడుతున్నారు.
ప్రయాగ్‌రాజ్ రైల్వే స్టేషన్ మూసివేత గురించి రైల్వే మంత్రి ఏమన్నారంటే ?
మరోసారి ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభ మేళాకు వెళ్లే వారి సంఖ్య భారీగా పెరిగింది. జనసమూహం ఎంతగా ఉందంటే నగరమంతా ట్రాఫిక్‌తో ఇబ్బంది పడుతుంది. అటువంటి పరిస్థితిలో, ప్రయాగ్‌రాజ్‌లోని సంగం రైల్వే స్టేషన్ కూడా భారీ జనసమూహం కారణంగా మూసివేసినట్లు వార్తలు వెలుగులోకి వచ్చాయి. దీనికి సంబంధించి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ నుంచి ప్రకటన వెలువడింది. ప్రయాగ్‌రాజ్‌లో జరిగే మహా కుంభమేళా సందర్భంగా 8 స్టేషన్లలో రైల్వే పనులు క్రమపద్ధతిలో జరుగుతున్నాయని ఆయన అన్నారు. దీనికోసం రాష్ట్ర పరిపాలన, న్యాయమైన పరిపాలనతో సహకారం, సమన్వయంతో పని జరుగుతోంది. నిన్న ప్రయాగ్‌రాజ్ జంక్షన్ నుండి 330 రైళ్లు బయలుదేరాయని ఆయన చెప్పారు. ఎక్కడా సమస్య లేదు. ఎవరైనా పుకార్లు వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తే, వాటిని పట్టించుకోవద్దని తెలిపారు.
దివ్యాంగులకు భారత రైల్వే శుభవార్త
రైల్వేపాసుల కోసం ఇకపై దివ్యాంగులు రైల్వే కార్యాలయాలు, స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఇందుకోసం భారత రైల్వేశాఖ కొత్తగా ఆన్‌లైన్ పాస్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని ద్వారా ఇంటి నుంచే పాస్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఇందుకోసం ప్రత్యేకంగా http://divyangjanid.indianrail.gov.in అనే వెబ్‌సైట్ ప్రారంభించారు. దివ్యాంగులు, ప్రత్యేక అవసరాలు కలిగిన వారికి రైల్వేశాఖ రాయితీపై ప్రయాణ సౌకర్యం అందిస్తోంది. రైళ్లు, బస్సుల్లో ప్రత్యేక సీట్లు కేటాయించడంతోపాటు ఛార్జీల్లోనూ రాయితీ ఉంటుంది. ఇప్పటివరకు ఈ పాస్‌లు పొందాలంటే రైల్వే స్టేషన్లు లేదా డివిజన్ కార్యాలయాలకు వెళ్లాల్సి వచ్చేది. చాలామందికి ఇది కష్టసాధ్యమయ్యేది. మరీ ముఖ్యంగా పల్లెలు, మారుమూల ప్రాంతాల్లో నివసించే వారు పెద్ద స్టేషన్లకు పలుమార్లు వెళ్లాల్సి వచ్చేది. హైదరాబాద్, విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం వంటి ప్రధాన స్టేషన్లలో మాత్రమే పాస్‌లు జారీ చేస్తుండటం కూడా పెద్ద ఇబ్బందిగా మారింది. కానీ, ఇకపై ఆ ఇబ్బందులు ఉండవు. పూర్తిగా ఆన్‌లైన్‌లోనే కొత్త పాస్‌లు పొందవచ్చు లేదా పాత పాస్‌లు పునరుద్ధరించుకోవచ్చు. దీని ద్వారా OTP ఆధారిత లాగిన్ చేసి, ఫామ్ పరిస్థితిని ఎప్పుడైనా పరిశీలించవచ్చు.
డోనాల్డ్ ట్రంప్ టారిఫ్ యుద్ధం.. రికార్డు స్థాయికి పడిపోయిన రూపాయి
డోనాల్డ్ ట్రంప్ టారిఫ్ యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలను, వాటి కరెన్సీలను ప్రభావితం చేస్తోంది. సోమవారం డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ 44 పైసలు తగ్గి చారిత్రాత్మక కనిష్ట స్థాయి 87.9400కి చేరుకుంది. ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై 25శాతం సుంకం విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కారణంగా ఈ తగ్గుదల సంభవించిందని చెబుతున్నారు. రూపాయి పతనం తర్వాత, భారత స్టాక్ మార్కెట్‌లో కూడా పెద్ద క్షీణత కనిపిస్తోంది. ముఖ్యంగా మెటల్ సెగ్మెంట్ షేర్లు భారీ క్షీణతను చూస్తున్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ తగ్గడం వల్ల సామాన్యుడి జేబుపై ప్రత్యక్ష ప్రభావం పడుతుంది. రూపాయి బలహీనపడటం వల్ల దిగుమతి చేసుకున్న వస్తువుల ధర పెరుగుతుంది. దీని కారణంగా దేశంలో ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉంది. డాలర్ ధర పెరిగితే వస్తువులను దిగుమతి చేసుకోవడానికి మరిన్ని రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది. రూపాయి విలువ పతనం వల్ల పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతి ఖరీదైనదిగా మారుతుంది, దీనివల్ల పెట్రోల్, డీజిల్ ధరలు పెరగవచ్చు. రూపాయి బలహీనపడటం వల్ల మొబైల్ ఫోన్లు, టీవీలు, రిఫ్రిజిరేటర్లు, ఏసీలు వంటి ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ధరలు పెరగవచ్చు. దీనికి తోడు, దిగుమతి చేసుకున్న ముడి పదార్థాల ధర కారణంగా, ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది, ఇది వినియోగదారులపై ప్రభావం చూపుతుంది. విదేశాలలో చదువుతున్న విద్యార్థులకు, విదేశాలకు ప్రయాణించే విద్యార్థులకు ట్యూషన్ ఫీజులు, జీవన వ్యయాలు కూడా పెరుగుతాయి.
జస్ప్రీత్ బుమ్రా కోసం బీసీసీఐ వెయిటింగ్!
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది. ఈ ట్రోఫీ కోసం ఇప్పటికే అన్ని టీమ్స్ తమ స్క్వాడ్‌లను ప్రకటించాయి. స్క్వాడ్‌లో మార్పులు చేసుకొనేందుకు అధికారికంగా ఇంకా మూడు రోజుల గడువు ఉంది. అయితే ఈ ఐసీసీ ట్రోఫీలో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఆడతాడా? లేదా? అనేది ఇంకా తెలియరావడం లేదు. స్క్వాడ్‌లో మార్పులు చేసుకొనేందుకు గడువు ముగుస్తున్నా.. బుమ్రా ఫిట్‌నెస్ విషయంలో బీసీసీఐ ఓ అంచనాకు రాలేకపోయింది. పేస్ గుర్రం ఫిట్‌నెస్‌పై బీసీసీఐ వెయిటింగ్ చేస్తోంది. ప్రస్తుతం జస్ప్రీత్ బుమ్రా జాతీయ క్రికెట్ అకాడమీలో ఉన్నాడు. ఎన్‌సీఏలో అప్పుడప్పుడు బౌలింగ్ చేస్తున్న అతడిని బీసీసీఐ వైద్య బృందం నిరంతరం పర్యవేక్షిస్తోందని తెలుస్తోంది. బుమ్రా ఇప్పటికే జిమ్ చేస్తున్నాడని, మరో రెండు రోజులు ఎన్‌సీఏలోనే ఉంటాడని క్రికెట్ వర్గాలు తెలిపాయి. గతంలో హార్దిక్ పాండ్యా విషయంలో వ్యవహరించినట్లుగానే ఇప్పుడూ బుమ్రా ఫిట్‌నెస్‌పై బీసీసీఐ వేచి చూస్తోందని పేర్కొన్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ ట్రావెల్ రిజర్వ్‌లో యువ పేసర్ హర్షిత్ రాణా ఉన్నాడు. బుమ్రా స్థానంలో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని తీసుకొనే అవకాశం కూడా లేకపోలేదు. మరో రెండు రోజుల్లో బుమ్రా ఫిట్‌నెస్‌పై పూర్తి స్పష్టత రానుంది.
మస్తాన్ సాయి- లావణ్య కేసులో వెలుగులోకి మరో ఆడియో
గుంటూరు మస్తాన్ సాయి అనే యువకుడు కేసు ప్రతి రోజు అనేక మలుపులు తిరుగుతోంది. అనేక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక తాజాగా ఈ కేసులో మరో ఆడియో వెలుగులోకి వచ్చింది. ఏపీలోని గుంటూరులో మస్తాన్ సాయి పై లావణ్య పెట్టిన కేసులో పోలీసులతో బేరసారాలు ఆడినట్టు వెలుగులోకి వచ్చింది. ఛార్జ్ షీట్ వేసే సమయంలో తమకు అనుకూలంగా రాస్తే డబ్బులు పోలీసులు ఇద్దామని మస్తాన్ సాయి, తండ్రి ప్రలోభాలకు గురి చేస్తున్నట్టుగా ఉన్న ఆడియో ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఇక అలా పోలీసులకు డబ్బు ఎర వేసి ఛార్జ్ షీట్ తమకు అనుకూలంగా మస్తాన్ సాయి మార్చుకున్నట్టు తాజాగా ఆడియోతో బట్టబయలు అయ్యింది. ఇక లావణ్య ఇచ్చిన ఫిర్యాదు ఉన్నది ఉన్నట్టుగా కాకుండా మనకు అనుకూలంగా ఛార్జ్ షీట్ ఉండాలని మస్తాన్ సాయి తండ్రితో మాట్లాడినట్టు చెబుతున్నారు. ఇక లావణ్య, మస్తాన్ సాయి కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. ముందు వరకు హార్డ్ డిస్క్, యువతుల వీడీయోలు చుట్టూ తిరిగిన ఈ కేసు ఇప్పుడు డ్రగ్స్ టర్న్ తీసుకుంది. మస్తాన్ సాయి ఇంట్లో చేసుకున్న డ్రగ్స్ పార్టీలపై విచారణ చేసిన పోలీసులకు కీలక ఆధారాలు లభించాయి. పలువురు యువతులను పార్టీ అని పిలిచి డ్రగ్స్ ఇచ్చి వారికి తెలియకుండా వీడియోలు రికార్డు చేశారు మస్తాన్ సాయి. డ్రగ్స్ పార్టీల వీడియోల్లో ఉన్న వారిపై పోలీసులు నిఘా పెట్టి రాహుల్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ కేసులో ఇప్పటికే నగ్న వీడియోలు చిత్రీకరించారు అని మస్తాన్ సాయి తో పాటు ఖాజను అరెస్ట్ చేసిన నార్సింగి పోలీసులు. ఖాజాకు 41 నోటీసులు ఇచ్చి వదిలి పెట్టారు.
బోల్డ్ హీరోకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సాయి పల్లవి..!
తన అందం, అభినయంతో అనతి కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగిన హీరోయిన్ సాయి పల్లవి. వరుస విజయాలను అందుకుంటూ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారింది. ఇక యూత్‌లో సాయి పల్లవికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అందరూ హీరోయిన్స్‌లా కాకుండా ఈ ముద్దుగుమ్మ తన రూటే సెపరేట్ అనేలా ఉంటుంది. ఒక ఎక్స్ పోజ్ ఉండదు, ఒక మేకప్ ఉండదు, ఎలాంటి ఆడంబరాలు ఉండవు. తన సింప్లిసిటీ తోనే జనాల హృదయాలను కట్టిపడేస్తోంది. మూవీ సెలక్షన్ విషయంలో కూడా సాయిపల్లవి ఎంతో జాగ్రత్తగా ఉంటుంది.ముఖ్యంగా రొమాంటిక్ సీన్స్‌కి మాత్రం చాలా ధూరంగా ఉంటుంది. ఇక గత ఏడాది ‘అమరన్’ సినిమాతో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకు ఈ చిన్నది, తాజాగా నాగచైతన్య హీరోగా తెరకెక్కిన ‘తండేల్’ సినిమాతో వచ్చి బాక్సాఫీసు వద్ద మరో ఘన విజయాన్ని సాధించింది. అయితే తాజాగా ఓ రొమాంటిక్ హీరోకి సాయిపల్లవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.