నేడు ఏపీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టనున్న షర్మిల..
వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాల కోసం కాంగ్రెస్ పార్టీలో చేరిన వైఎస్ షర్మిల నేడు ఏపీసీసీ అధ్యక్ష బాధ్యతలను తీసుకోనున్నారు. కాగా, గన్నవరం విమానాశ్రయానికి 9.30 గంటలకు ఆమె చేరుకోనున్నారు. బాధ్యతల స్వీకరణ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తుంది. నేటి ఉదయం 11 గంటలకు ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలను స్వీకరించనుంది. అనంతరం బెజవాడలో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కు వైఎస్ షర్మిల వెళ్లనున్నారు. ప్రస్తుతం షర్మిల వెంట కేవీపీ రామచంద్రరావు, రఘువీరా రెడ్డి, శైలజానాథ్, తులసి రెడ్డి ఇతర ముఖ్య నేతలు ఉన్నారు. అయితే, వీరందరు ఒకప్పటి వైఎస్ హయాంలో కాంగ్రెస్‌ని నడిపించినవాళ్లే.. వీరితో పాటూ.. వైసీపీ నుంచి కూడా కొంత మంది అసంతృప్త నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరే ఛాన్స్ ఉంది.
నేడు జనసేన జోనల్ కమిటీలతో పవన్ కళ్యాణ్ భేటీ..
ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ పార్టీలు తమ పార్టీ గెలుపే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెడుతున్నారు. తాజాగా జనసేన పార్టీ కూడా వచ్చే ఎన్నికలకు రెడీ అవుతుంది. ఈ ఎన్నికల నేపథ్యంలో ప్రచారాలకు సంబంధించిన పలు కార్యక్రమాల కోసం కమిటీలను ఏర్పాటు చేసింది. అయితే, నేడు మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాలయంలో జోనల్ కమిటీలతో పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. ఎన్నికల ప్రచార విధివిధానాలపై ప్రధానంగా చర్చించనున్నారు.. అలాగే, సభలు, సమావేశాలు ఇతర కార్యక్రమాలు సజావుగా సాగేందుకు పార్టీ జోన్ల వారీగా ఈ కమిటీలు ఏర్పాటు చేూసింది. ఉత్తరాంధ్ర, గోదావరి, మధ్య ఆంధ్ర, రాయలసీమ జోన్లుగా విభజించారు. కాగా ఈ కమిటీల్లో కన్వీనర్లు, కో- కన్వీనర్లు సభ్యులు ఉండనున్నారు. అలాగే, లీగల్, డాక్టర్ సెల్స్ తరఫున సభ్యులు కూడా ఉన్నారు.
తిరుమలలో భారీగా తగ్గిన భక్తుల రద్దీ.. కారణం ఇదేనా..?
తిరుమలలో రద్దీ భారీగా తగ్గింది. ఇవాళ ఆదివారం అయినా రద్దీ పెద్దగా కనిపించడం లేదు.. అయితే, సంక్రాంతి సెలవులు పూర్తి కావడంతో పాటు పరీక్షలు కూడా దగ్గరపడుతుండటంతో భక్తుల రాక తగ్గిందని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అధికారులు పేర్కొన్నారు. ఇక, సాధారణంగా శని, ఆదివారాల్లో అత్యధికంగా భక్తులు తిరుమలకు వచ్చి శ్రీవారి దర్శనం చేసుకుంటారు. కానీ, ఈ రోజు మాత్రం రద్దీ తక్కువగా ఉండటంతో శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులకు సమయం తక్కువగా పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు స్వామి వారి దర్శనం గంటలోపే పూర్తి అవుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 76 వేల 41 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 28 వేల 336 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకోని తమ మొక్కులు చెల్లించారు. అయితే, నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.06 కోట్ల రూపాయలు వచ్చిందని టీటీడీ బోర్డు అధికారులు వెల్లడించారు. కానీ, ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని పది కంపార్ట్‌మెంట్లలోనే భక్తులు శ్రీనివాసుడి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇక, సర్వ దర్శనం క్యూ లైన్ లోకి టోకెన్లు లేకుండా ప్రవేశించే భక్తులకు దర్శన సమయం ఎనిమిది గంటలకు పైగా పడుతుంది.
ప్రభుత్వ సలహాదారులుగా ముగ్గురికి చోటు.. ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ఆనేత..!
ప్రభుత్వ సలహాదారులను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ముగ్గురిని ప్రభుత్వ సలహాదారులుగా నియమించింది. కాంగ్రెస్ సీనియర్ నేతలు షబ్బీర్ అలీ, వేం నరేందర్ రెడ్డి, హరకర వేణుగోపాల్‌లను ప్రభుత్వ సలహాదారులుగా నియమించింది. వీరందరూ.. మంత్రివర్గానికి సలహాదారులుగా పనిచేస్తారు. ఇక హరకార వేణుగోపాల్.. ప్రోటోకాల్, పబ్లిక్ రిలేషన్స్, వేం నరేందర్ రెడ్డి.. సీఎం వ్యవహారాలు, షబ్బీర్ అలీ-ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీలు ప్రభుత్వ సలహాదారుగా వ్యవహరిస్తారు. ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా మరో సీనియర్ నేత మల్లు రవి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
రాంనగర్ అఖిల్ పహిల్వాన్ కేసు.. సినీ ఇండస్ట్రీతో పరిచయాలు..!
హైదరాబాద్ లో రాంనగర్ అఖిల్ పహిల్వాన్ వ్యభిచారం కేసు సంచలనంగా మారింది. అయితే విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో అఖిల్ పహిల్వాన్ మొబైల్ ఫోన్ కీలకంగా మారింది. రామ్ నగర్ అఖిల్ వ్యభిచారం కేసులో దర్యాప్తు చేపడుతున్న కొద్ది విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి. అఖిల్ ఫోన్ లో సగం కు పైగా వెస్ట్ బెంగాల్ అమ్మాయిలు, వ్యభిచార నిర్వాహకుల ఫోన్ నెంబర్స్ ఉండటం పోలీసులు షాక్ తిన్నారు. ఇప్పటి వరకు ఎంత మంది అమ్మాయిలను వ్యభిచారం పేరుతో హైదరాబాద్ తీసుకొచ్చాడు అనేదానిపై దృష్టి పెట్టి పోలీసులు కూపీ లాగుతున్నారు.
దేశ వ్యాప్తంగా అమల్లోకి ‘వన్ నేషన్, వన్ రేషన్ కార్డ్’
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘వన్ నేషన్, వన్ రేషన్ కార్డ్’ పథకం ఇప్పుడు దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. ఇప్పుడు దేశం మొత్తం ఈ పథకం పరిధిలోకి వచ్చిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ శనివారం ప్రకటించింది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఒక రేషన్ కార్డు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారిక ట్విట్టర్లో ఇప్పుడు 80 కోట్ల మంది NFSA వినియోగదారులు ఈ పథకం పరిధిలోకి వచ్చారు. ప్రతి నెలా దాదాపు 2.5 కోట్ల పోర్టబిలిటీ లావాదేవీలు జరుగుతున్నాయని పేర్కొంది. వన్ నేషన్, వన్ రేషన్ కార్డ్ (ONORC) పరిధి నుండి ఇప్పుడు ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం విడిచిపెట్టబడదని వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ తెలిపింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌లో ఇచ్చిన హామీని ప్రభుత్వం నెరవేర్చింది. దేశంలోని 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో విస్తరించి ఉన్న 80 కోట్ల మంది లబ్ధిదారులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ప్రతినెలా పోర్టబిలిటీ లావాదేవీల సంఖ్య కూడా పెరుగుతోంది. వన్ నేషన్, వన్ రేషన్ కార్డ్ పథకం అమలు తర్వాత, ఇప్పటివరకు దాదాపు 125 కోట్ల పోర్టబిలిటీ లావాదేవీలు జరిగాయి.
ఎట్టకేలకు తెలుగు టైటాన్స్ విజయం.. ప్రత్యేక ఆకర్షణగా కావ్య థాపర్!
ఎట్టకేలకు తెలుగు టైటాన్స్ ఓ విజయాన్ని అందుకుంది. ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్‌లో వరుసగా 7 ఓటముల తర్వాత విజయం సాధించింది. 14 మ్యాచ్‌ల్లో రెండో గెలుపును ఖాతాలో వేసుకుంది. అంతేకాదు ఈ సీజన్‌లో తొలిసారి ఆలౌట్ కాకుండా తెలుగు టైటాన్స్ నిలిచింది. శనివారం రాత్రి గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో 49-32 తేడాతో యూపీ యోధాస్‌ను టైటాన్స్ ఓడించింది. కెప్టెన్ పవన్ సెహ్రావత్ (16), ఓంకార్ పాటిల్ (10) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. తెలుగు టైటాన్స్ మ్యాచ్ ఆరంభం నుంచి జోరు ప్రదర్శించింది. పదో నిమిషంలోనే యూపీ యోధాస్‌ను ఆలౌట్ చేసింది.14వ నిమిషంలో సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన ఓంకార్ పాటిల్.. ఒకే రైడ్‌లో నాలుగు పాయింట్లు తెచ్చాడు. మరోవైపు పవన్ సెహ్రావత్ పాయింట్స్ తేవడంతో తెలుగు టైటాన్స్ తొలి అర్ధభాగాన్ని 24-16తో ముగించింది. విరామం తర్వాత పవన్, ఓంకార్ నిలకడగా ఆడడంతో టైటాన్స్ దూకుడు కొనసాగించింది. ఆధిక్యాన్ని కొనసాగించిన తెలుగు జట్టు 49-32తో విజయం సాధించింది. యూపీ యోధాస్ జట్టులో పర్దీప్ నర్వాల్ (10), గగన గౌడ (7) ఆకట్టుకున్నారు. ఈ ఇద్దరు మినహా పెద్దగా ఎవరూ రాణించలేదు. సొంతగడ్డపై విజయం సాధించడంతో తెలుగు ఫాన్స్ ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం తెలుగు టైటాన్స్ పట్టికలో చివరి స్థానంలో ఉంది. అంతకుముందు జరిగిన మరో మ్యాచ్‌లో దబంగ్ ఢిల్లీ 39-33తో యు ముంబాపై గెలిచింది. ఈ మ్యాచ్‌లను హీరోయిన్ కావ్య థాపర్ వీక్షించారు. అభిమానవుల మధ్య ఆమె సందడి చేశారు. కావ్య ఇండోర్ స్టేడియంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
టాటా గ్రూప్‌కే మరోసారి ఐపీఎల్ టైటిల్ హక్కులు.. టోర్నీ చరిత్రలోనే అత్యధిక మొత్తం!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టైటిల్ స్పాన్సర్‌గా భారత దిగ్గజ సంస్థ ‘టాటా గ్రూప్’ కొనసాగనుంది. వచ్చే 5 ఏళ్ల కాలానికి స్పాన్సర్‌షిప్ హక్కులను టాటా గ్రూప్ చేజిక్కించుకుంది. 2024 నుంచి 2028 వరకు రూ. 2500 కోట్ల భారీ మొత్తంతో కొత్తగా ఒప్పందం కుదుర్చుకుంది. టాటా కంపెనీ ఏడాదికి రూ. 500 కోట్లు బీసీసీఐకి చెల్లించనుంది. టాటా సంస్థ గత రెండేళ్లుగా ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌గా ఉన్న విషయం తెలిసిందే. ఇక ఒక్కో సీజన్‌కు రూ.500 కోట్లకు బిడ్ చేసిన ఆదిత్య బిర్లా గ్రూప్‌కు నిరాశే ఎదురైంది. ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌షిప్ కోసం బీసీసీఐ 2023 డిసెంబర్ 12న టెండర్‌ను జారీ చేసింది. టైటిల్ స్పాన్సర్‌షిప్ హక్కుల కోసం జనవరి 14న ఆదిత్య బిర్లా గ్రూప్ రూ. 2500 కోట్లకు బిడ్ చేసింది. టాటా గ్రూప్ గతంలో టైటిల్ స్పాన్సర్‌షిప్ కోసం ఒక్కో సీజన్‌కు రూ. 365 కోట్లు చెల్లించింది. ఒక్కో సీజన్‌కు రూ. 500 కోట్లకు బిడ్ చేసిన ఆదిత్య బిర్లా గ్రూప్ స్పాన్సర్‌షిప్ హక్కులను గెలుచుకునే దిశగా దూసుకుపోయింది. అయితే రైట్ టు మ్యాచ్ కార్డ్‌ని ఉపయోగించిన టాటా గ్రూప్ బిడ్‌ను గెలుచుకుంది. ఐపీఎల్ చరిత్రలో ఇది అత్యధికం. మహిళల లీగ్‌కు కూడా టాటా గ్రూప్ టైటిల్ స్పాన్సర్‌గా ఉంది.