NTV Telugu Site icon

Top Headlines @5PM: టాప్ న్యూస్

Ntv Top Hl 5pm

Ntv Top Hl 5pm

విశాఖపై జగన్ క్లారిటీ…కొందరు మంత్రులకు క్లాస్

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పరిపాలన, పార్టీ వ్యవహారాలు, మంత్రుల పనితీరుపై కీలక వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. మూడు రాజధానుల అంశంలో విశాఖకు పాలనా రాజధాని అంశం పై స్పష్టత ఇచ్చారు ముఖ్యమంత్రి జగన్. ఇవాళ క్యాబినెట్ భేటీ అనంతరం మంత్రులతో ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. జూలై నెలలో విశాఖకు వెళ్ళనున్నట్లు ప్రకటించిన సీఎం జగన్.. అప్పటికి అందరూ సిద్దం కావాలని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి. సమావేశాల్లో మంత్రుల పని తీరు మెరుగ్గా ఉండాలని సూచించారు. మీ శాఖలకు సంబంధించి కూలంకషంగా అధ్యయనం చేసి సమాధానాలు ఇవ్వాలన్నారు. అసెంబ్లీ సమావేశాలపై కూడా సీఎం సూచనలు చేశారు. కొందరు మంత్రుల పనితీరుపై సీఎం జగన్ అసహనంతో ఉన్నారని తెలుస్తోంది. మంత్రులు మారకపోతే ఒకరిద్దరిని తప్పించటానికీ వెనుకాడను అని సూచన ప్రాయంగా తెలిపారు. టీడీపీ చేసే విమర్శలకు దూకుడుగా సమాధానాలు ఇవ్వాలన్నారు. మొత్తం మీద విశాఖను పాలనా రాజధానిగా చేయడంతో పాటు అక్కడినుంచి తమ పాలన బాధ్యతలను నిర్వహించడానికి జగన్ నిర్ణయించుకున్నారు. రాబోయే కాలం చాలా కీలకం అనీ, మంత్రులు జాగ్రత్తగా వ్యవహరించాలని దిశానిర్దేశం చేశారు జగన్. సరిగా పనిచేయని మంత్రులకు జగన్ ఒక అవకాశం ఇచ్చారని, పనితీరు మార్చుకోకపోతే వారిపై వేటు పడుతుందనే సంకేతాలు వచ్చాయి.

రాహుల్ గాంధీ బాధ్యతాయుతంగా మాట్లాడాలి

కాంగ్రెస్ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ ఇటీవల పదేపదే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) లక్ష్యంగా పలు విమర్శలు చేశారు. అయితే ఈ విమర్శలపై ఆర్ఎస్ఎస్ స్పందించింది. రాహుల్ గాంధీ బాధ్యతాయుతంగా మాట్లాడాలని, ఆర్ఎస్ఎస్ వాస్తవికతను చూడాలని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేమ హోసబాలే అన్నారు. స్వలింగ వివాహాలపై కేంద్రం దృష్టితో తాము ఏకీభవిస్తున్నామని, ఆడ, మగ వారి మధ్యే వివాహం జరుగుతుందని హోసబాలే అన్నారు. రాహుల్ గాంధీ రాజకీయ ఎజెండా కోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. రాజకీయ రంగంలో ఆర్ఎస్ఎస్ ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఒక రాజకీయ నాయకుడిగా రాహుల్ గాంధీ మరింత బాధ్యతాయుతంగా మాట్లాడాలని, ఆయన అన్నారు. భారత్‌ను జైలుగా మార్చిన వారికి దేశంలో ప్రజాస్వామ్యంపై వ్యాఖ్యానించే హక్కు లేదు అని రాహుల్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ విమర్శించారు. ఆర్ఎస్ఎస్ ముస్లిం మేధావులు, ఆధ్యాత్మిక గురువులను వారి ఆహ్వానం మేరకే కలుస్తున్నామని ఆయన అన్నారు.

వారాహిపై బయల్దేరిన పవన్.. గజమాలతో గ్రాండ్ వెల్ కం

బందరు రోడ్లన్నీ జనసైనికులతో కిక్కిరిసిపోయాయి. జనసేన 10వ ఆవిర్భావ దినోత్సవం ఇవాళ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. మచిలీపట్నంలో భారీ సభ జరగనుంది. ఈ నేపథ్యంలో తన ప్రచార రథం వారాహి వాహనంపై అభిమానులకు అభివాదం చేస్తూ వెళ్తున్న పవన్ కళ్యాణ్ కు క్రేన్ ద్వారా గజమాల వేశారు అభిమానులు.. జనసేన శ్రేణులతో కిక్కిరిసింది బెజవాడ బందరు రోడ్డు.. మూడు కిలోమీటర్ల మేర నిలిచిన ట్రాఫిక్ స్తంభించిపోయింది. మరో వైపు భారీ ర్యాలీగా మచిలీ పట్నం బయల్దేరిన పవన్ కు జనసైనికులతో అపూర్వ రీతిలో స్వాగతం చెబుతున్నారు. జనసేన శ్రేణులతో కలిసి ర్యాలీ లో పాల్గొన్న గబ్బర్ సింగ్ సినిమా అంత్యాక్షరి టీమ్ సందడి చేస్తోంది. అంతకుముందు విజయవాడ నోవాటెల్ నుంచి ఆటో నగర్ బయల్దేరారు జనసేన అధినేత పవన్.. దీంతో బెజవాడ బందరు రోడ్డులో స్తంభించింది ట్రాఫిక్.. ఆటో నగర్ వచ్చి వారాహి వాహనంపై మచిలీ పట్నం వెళ్లనున్నారు పవన్. మచిలీపట్నం బహిరంగసభ ప్రాంతానికి చేరుకుంటున్న జనసైనికులతో అక్కడ కోలాహలం ఏర్పడింది. సాయంత్రం 5 గంటలకు సభావేదిక వద్దకు చేరుకుంటారు పవన్ కల్యాణ్..విజయవాడ – మచిలీపట్నం జాతీయ రహదారిపై భారీగా ఫ్లేక్సీలు ఏర్పాటు..దూరప్రాంతాల నుండి వచ్చే జనసైనికుల కోసం భోజన సదుపాయం ఏర్పాటుచేశారు. మహిళలకు ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేశారు.

టీఎస్‍పీఎస్సీ కీలక భేటీ.. పేపర్ లీక్ లో సంచలన విషయాలు

టీఎస్‍పీఎస్సీ ఏఈ పేపర్ లీక్ కేసులో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. అయితే తాజాగా గ్రూప్-1 ప్రిలిమ్స్ పేపర్ కూడా లీకైనట్లు ఆరోపణలు రావడంతో ఈ పరీక్ష రాసిన అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రవీణ్ కుమార్ అధికారులు సస్పెండ్ చేయగా.. మరో ఔటసోర్సింగ్ ఉద్యోగి రాజశేఖర్ రెడ్డిని శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగించారు. ఈ క్రమంలోనే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ భేటీ అయ్యింది. సర్వీస్ కమిషన్ చైర్మన్ జనార్ధన్ రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించనున్నారు. ఈ నెల 5న జరిగిన పరీక్ష పేపర్ లీకేజీ పై కమిషన్ చర్చించనుంది. ఏఈ పరీక్ష రద్దు చేసే యోచనలో కమిషన్‌ ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా.. గ్రూప్- 1 పరీక్ష పై వస్తున్న అనుమానాలను కమిషన్ పరిశీలిస్తోంది. ప్రవీణ్ ఎగ్జామ్ సమయంలో వ్యవహరించిన తీరు… అతడి పేపర్ పై చర్చ నిర్వహించే అవకాశ ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో ఉద్యోగ అభ్యర్థుల ఆందోళనలు ఉదృతమైన నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని ఉత్కంఠ కొనసాగుతోంది. లీకేజీల వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. దీనిపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వం టీఎస్పీఎస్సీ ఉన్నతాధికారులను కోరింది. సమావేశం అనంతరం మీడియా ప్రకటన విడుదలకు ఛాన్స్ ఉంది.

కర్నూలులో జంట హత్యలు.. పోలీసుల గాలింపు

కర్నూలు జిల్లాలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. నగరంలోని చెన్నమ్మ సర్కిల్ వద్ద జంట హత్యలు తీవ్ర కలకలం రేపాయి. తల్లీ, కూతురిని దుండగులు నరికి చంపిన ఘటన కర్నూలు నగరంలో తీవ్ర కలకలం రేపుతుంది. ఓ భవనం పై అంతస్తులో తల్లిని.. కింద అంతస్తులోని ఓ గదిలో కూతురిని హత్య చేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి వచ్చి పరిస్థితి సమీక్షించారు. ఈ జంట హత్యలకు కారణాలను పోలీసులు తెలుసుకుంటున్నారు. మృతులు రుక్మిణి, రమాదేవిగా పోలీసులు గుర్తించారు. కాగా ఈ హత్యల ఘటనలో రమాదేవి తండ్రి వెంకటేశ్వర్లకు కూడా తీవ్రంగా గాయాలు అయ్యాయి. దీంతో అతణ్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే కర్నూలుకు చెందిన శ్రావణ్ కు రుక్మిణిని ఇచ్చి వివాహం చేశారు. హైదారాబాద్ లో బ్యాంక్ ఉద్యోగం చేస్తున్న శ్రవాణ్ కు పెళ్లి తరువాత ఆపరేసన్ అయింది. దీంతో తన కుమారుణ్ణి సంసారానికి పనికి రాకుండా చేసావంటూ కక్షగట్టిన శ్రవణ్ తండ్రి ప్రసాద్.. రుక్మిణి, తల్లి రమాదేవిని హత్య చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పెళ్లి తంతు ముగిశాక ఇవాళే అత్తవారింటికి రుక్మిణి వచ్చింది. కూతురును వదిలేట్టేందుకు కర్నూలుకు రుక్మిణి తల్లి రమాదేవి, తండ్రి వెంకటేశ్వర్లు వచ్చారు. ఈ కక్ష మనసులో పెట్టుకున్న శ్రవణ్ అతని తండ్రి ప్రసాద్ ఇద్దరు కలిసి రుక్మిణి, ఆమె తల్లి రామాదేవిని దారుణంగా హత్య చేసినట్లు తెలుస్తోంది.

నందమూరి ఆడపడుచులను ఇలా ఎప్పుడైనా చూశారా?

నందమూరి తారక రామారావు.. ఆయన సంతానం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు నందమూరి కుమారులందరిని ఎక్కడో ఒక చోట చూస్తూనే ఉంటాం. కానీ, నందమూరి ఆడపడుచులను ఎప్పుడైనా చూసారా.. అరే ఒక్కొక్కరిగా కాదు అందరిని ఒకేచోట.. చాలా రేర్ గా అక్కచెల్లెళ్లు కలిసి కనిపిస్తారు. ఇప్పటివరకు వీరందరూ కలిసి ఒకే ఫ్రేమ్ లో మీడియా కంట కనిపించలేదు అంటే అతిశయోక్తి కాదు. ఎన్టీఆర్ కు మొత్తం నలుగురు కుమార్తెలు.. భువనేశ్వరి, పురంధేశ్వరి, లోకేశ్వరి, ఉమా మహేశ్వరి.. ఇక చివరి అమ్మాయి ఉమా మహేశ్వరీ గతేడాది ఆత్మహత్య చేసుకొని మృతి చెందిన విషయం తెల్సిందే. ఇక మిగతా ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఎవరి పనుల్లో వారు తీరిక లేకుండా ఉన్నారు. ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు భార్యగా భువనేశ్వరి .. తన బిజినెస్ లు చూసుకొంటుంది. దగ్గుబాటి పురంధేశ్వరి.. తండ్రిలానే రాజకీయాల్లో రాణిస్తోంది. ఇక మూడో కుమార్తె లోకేశ్వరి డాక్టర్ గా స్థిరపడింది. ఈ ముగ్గురు అక్కాచెలెళ్ళు ఒక ఫంక్షన్ లో దర్శనమిచ్చారు. ముగ్గురు పక్కపక్కన కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటూ చిరునవ్వులు చిందిస్తున్నారు.

గౌతమ్ అదానీ కొడుకు ఎంగేజ్ మెంట్… వధువు ఎవరంటే?

ప్రముఖ వ్యాపారవేత్త, అదానీ గ్రూప్స్ అధినేత గౌతమ్ అదానీ చిన్న కొడుకు జీత్ అదానీ ఎంగేజ్మెంట్ దివా జైమిన్ షాతో ఆదివారం జరిగింది. గుజరాత్ అహ్మదాబాద్ లో జరిగి ఈ నిశ్చితార్థానికి కేవలం కొద్దిమంది సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. జీత్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి దివా ప్రముఖ వజ్రాల వ్యాపారి సి.దినేష్ & కో. ప్రైవేట్ లిమిటెడ్‌ యజమాని జైమిన్ షా కుమార్తె. ఈ కంపెనీ ముంబాయి, సూరత్ ప్రాంతాల్లో ఉంది. అదానీ యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ అప్లైడ్ సైన్సెస్ నుండి పట్టా పొందారు. 2019లో అదానీ గ్రూపులో చేరారు. ప్రస్తుతం అదానీ గ్రూప్ ఫైనాన్స్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. జీత్ అదానీ ఎయిర్‌పోర్ట్స్ వ్యాపారంతో పాటు అదానీ డిజిటల్ ల్యాబ్స్‌కు కూడా చీఫ్ గా వహిస్తున్నారు. గౌతమ్ అదానీ పెద్ద కుమారుడు కరణ్, న్యాయ సంస్థ సిరిల్ అమర్ చంద్ మంగళదాస్ మేనేజింగ్ పార్ట్నర్ అయిన సిరిల్ ష్రాఫ్ కుమార్తె పరిధి ష్రాప్ ను వివాహం చేసుకున్నాడు. కరణ్ అదానీ అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ లిమిటెడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ)గా, అదానీ ఎయిర్‌పోర్ట్ హోల్డింగ్స్ లిమిటెడ్ డైరెక్టర్ గా ఉన్నారు. ఇటీవల హిండెన్ బర్గ్ నివేదికతో అదానీ షేర్లు పడిపోయిన విషయం తెలిసిందే. అయితే తాను ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని గౌతమ్ అదానీ తెలిపారు.

హెల్త్ చెకప్ కోసం విదేశాలకు ప్రభాస్

పాన్ ఇండియా హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా మారాడు. గతేడాది పెద్దనాన్న కృష్ణంరాజు మృతి తరువాత ప్రభాస్ నిమిషం కూడా ఖాళీగా ఉండకూడదని నిర్ణయించుకున్నాడో ఏమో.. వరుస సినిమాలతో కొంచెం కూడా గ్యాప్ లేకుండా షూటింగ్స్ తోనే బిజీగా మారాడు. ఒకపక్క సలార్, ఇంకోపక్క ప్రాజెక్ట్ కె.. మధ్యమధ్యలో మారుతి సినిమాను కంప్లీట్ చేస్తున్నాడు.అయితే అందుతున్న సమాచారం ప్రకారం కొద్దిరోజుల క్రితం ప్రభాస్ విదేశాలకు వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. సలార్ షూటింగ్ కోసం ప్రభాస్ విదేశాలకు వెళ్లినట్లు చెప్పుకొచ్చారు. కానీ, ప్రభాస్ విదేశాలకు వెళ్ళింది సలార్ షూటింగ్ కొద్సం కాదట.. ఆయన రెగ్యులర్ హెల్త్ చెకప్ కోసమే వెళ్లినట్లో ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. కొన్నేళ్లుగా ప్రభాస్ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడని వార్తలు వస్తున్న విషయం తెల్సిందే. గతేడాది ప్రభాస్ కు మోకాలి సర్జరీ కూడా జరిగిందని రూమర్స్ వచ్చాయి. అయితే అందులో నిజం ఎంత అనేది ఇప్పటికీ తెలియదు. కానీ, ఈ హెల్త్ చెకప్ ఆ సర్జరీకి సంబంధించింది కాదట. ఎప్పుడూ చేయించుకొనే రెగ్యులర్ చెకప్ మాత్రమే అని సమాచారం. మరో రెండు మూడు రోజుల్లో ప్రభాస్ ఇండియాలో అడుగుపెట్టనున్నారు. ఆ తరువాత ఎప్పటిలానే షూటింగ్ కు మొదలుపెట్టనున్నాడట. ఇక ఈ విషయం తెలియడంతో ప్రభాస్ అభిమానులు ఆయనకు ఏమైంది అంటూ ఆందోళన చెందుతున్నారు.