NTV Telugu Site icon

Top Headlines @5PM: టాప్ న్యూస్

Ntv Top Hl 5pm

Ntv Top Hl 5pm

ఇండియన్ సినిమాకు ఇదో చారిత్రాత్మక రోజు.. అమిత్ షా

95వ అకాడమీ అవార్డ్స్‌లో ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ కేటగిరిలో ‘నాటు నాటు’ పాట ఆస్కార్ పురస్కారాన్ని గెలిచినందుకు గాను.. ఆర్ఆర్ఆర్ చిత్రబృందానికి కేంద్రం హోంమంత్రి అమిత్ షా శుభాకాంక్షలు తెలిపారు. ఇండియన్ సినిమాకు ఇదో చారిత్రాత్మక దినమని కొనియాడారు. నాటు నాటు పాట ఆస్కార్ సొంతం చేసుకొని.. సరికొత్త చరిత్ర సృష్టించిందని ట్విటర్ మాధ్యమంగా పేర్కొన్నారు. ‘‘భారతీయ చిత్రసీమకు ఇదో చారిత్రాత్మక దినం. నాటు నాటు పాట ఆస్కార్ అవార్డ్ గెలిచి చరిత్ర సృష్టించింది. ఈ పాట భారతీయుల నోళ్లలో నానడమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంగీత ప్రియుల్ని ఉర్రూతలూగించింది. ఆర్ఆర్ఆర్ చిత్రబృందానికి శుభాకాంక్షలు’’ అంటూ ట్వీట్ చేస్తూ.. రాజమౌళి, కీరవాణి, చంద్రబోస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ పేర్లను అమిత్ షా ట్యాగ్ చేశారు. అంతకుముందు.. భారత ప్రధాని నరేంద్ర మోడీ సైతం ఆర్ఆర్ఆర్ యూనిట్‌ని అభినందించారు. ఇది దేశం గర్వించదగిన సందర్భమని చెప్పుకొచ్చారు. ఈ విజయాన్ని అసాధారణమైనదిగా పేర్కొన్న మోడీ.. నాటు నాటు పాట ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందిందని, ఇది కొన్ని సంవత్సరాల వరకు గుర్తుండిపోయే పాటగా నిలుస్తుందని తెలిపారు. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేలతో పాటు ఇతర రాజకీయ ప్రముఖులు ఆర్ఆర్ఆర్ చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రమాలపై మరోసారి ఈసీకి టీడీపీ ఫిర్యాదు

ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. అధికార పార్టీ అక్రమాలకు పాల్పడుతోందని టీడీపీ ఈసీకి వరుసగా కంప్లైంట్లు చేస్తూనే ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల అక్రమాలపై ఎన్నికల సంఘానికి మరోసారి ఫిర్యాదు చేసింది టీడీపీ. పులివెందుల్లో అధికార వైసీపీ బూత్ల క్యాప్చరింగ్ చేసిందంటూ ఫిర్యాదు చేసింది. మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ.. సీఎం నియోజకవర్గం పులివెందుల్లోనే బూత్ కాప్చరింగ్ చేశారు.మంత్రులు, ఎమ్మెల్యేలు దొంగ ఓట్లు వేయించేందుకు రోడ్ల పై పడ్డారు.తప్పులు వారు చేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు.పులివెందుల్లో జరిగింది చాలా దారుణం.టీడీపీ అభ్యర్దులు విజయం సాధించేందుకు సిద్దంగా వున్నారు.పులివెందుల బూత్ నంబర్ 80లో బూత్ క్యాప్చరింగ్ చేశారు.. మరో చోట పోలింగ్ ఆపారు. టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు వైసీపీ అక్రమాలపై మండిపడ్డారు. 12 గంటల వరకు బోగస్ ఓట్లు అయ్యాక మధ్యాహ్నం నుంచి వివిధ బూత్ లను క్యాప్చర్ చేశారు. తిరుపతిలో 229 బూత్ లో పోలింగ్ ఆపారు.పులివెందుల్లో బీటెక్ రవి బూత్ క్యాప్చరింగ్ పై ప్రశ్నిస్తే దాడి చేశారు.అయన కారుపా దాడి చేశారు.అనంతపురంలో వైసీపీ నేతలు ఆటో డ్రైవర్లతో ఓట్లు వేయిస్తున్నారు.టీడీపీ, వామపక్షాల అభ్యర్థులపై దాడులకు గురైతే వారిపైనే కేసులు పెడుతున్నారు. బోగస్ ఓట్ల వున్న ప్రతి చోట రీ-పోలింగ్ పెట్టాలి. వైసీపీకి ప్రజలు మద్దతు ఉన్నది అనుకుంటే ఎందుకు ఈ అరాచకాలు..? ఎక్కడెక్కడ అక్రమాలు జరిగాయో అక్కడ రీ-పొలింగ్ కోరుతున్నాం అన్నారు.

ముస్లింలకు పెద్దపీట వేసింది జగనే

ఏపీలో ముస్లిం మైనారిటీలకు రాజకీయంగా పెద్ద పీట వేసిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందన్నారు ఏపీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా. ముస్లిం మత పెద్దలతో ముఖ్యమంత్రి జగన్ మూడు గంటల పాటు సమావేశం అయ్యారన్నారు. ముఖ్యమంత్రి ఇంత సమయం కేటాయించటం సాధారణ విషయం కాదు. చట్ట సభల్లో ముస్లిం మైనారిటీలకు రాజకీయ పదవులు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్ దే.. చంద్రబాబు ఎప్పుడూ మైనారిటీకు ప్రాధాన్యత ఇవ్వలేదు.. అన్ని రంగాల్లో వారికి మా గురువులు కొన్ని సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్ళారు. అన్ని అంశాలను ముఖ్యమంత్రి జగన్ నిశితంగా విన్నారు.ఈ సమస్యల పరిష్కారానికి వెంటనే సీఎంఓ అధికారులకు ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలు చేశారు. మా మైనారిటీ వర్గాల తరపున ముఖ్యమంత్రికి కృతఙ్ఞతలు తెలిపారన్నారు డిప్యూటీ సీఎం అంజాద్ బాషా. వైసీపీ మైనారిటీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఖాదర్ బాషా మాట్లాడుతూ.. చంద్రబాబు మైనారిటీలకు సంబంధించి 16, 17 హామీలు ఇచ్చి ఒకటి కూడా పూర్తి చేయలేదు. జగన్ మాకు ఇచ్చిన హామీల్లో 98 శాతం పూర్తి చేశారు . 2,100 కోట్లు ఖర్చు చేస్తే జగన్ మూడున్నర ఏళ్ళల్లో 21 వేల కోట్లు ఖర్చు చేశారు. జమాతే అల్ హదీస్, విజయవాడ ప్రెసిడెంట్ నసీరుద్దీన్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి తో మీటింగ్ అంటే ఏదో అప్లికేషన్ తీసుకుని పరిష్కరిస్తారు అనుకున్నాం. కానీ చాలా డైనమిక్ గా అప్పటికప్పుడే సమస్యల పరిష్కరానికి ఆదేశాలు జారీ చేయటం అభినందనీయం. గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి ఎంత తేడా ఉందో చాలా స్పష్టంగా మా కళ్ళకు కనిపించింది.

గిరిజనులకు తప్పని డోలి కష్టాలు.. నిండు గర్భిణికి నరకయాతన

ఎన్ని ప్రభుత్వాలు మారినా గిరిజనుల జీవితాల్లో మాత్రం వెలుగులు ప్రసరించడం లేదు. గిరిజనులు నడవడానికి కూడా రోడ్డు సౌకర్యం అందడం లేదు. దీంతో గిరిజనులు, ముఖ్యంగా గర్భిణీలు నానా కష్టాలు పడుతున్నారు. ఒక్కోసారి ప్రసవం కోసం కిలోమీటర్లు నడిచి కడుపులో బిడ్డను కోల్పోయి కడుపుకోతను అనుభవిస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో గర్భిణీల డోలి మోతలు తప్పడం లేదు. తాజాగా అనంతగిరి మండలం పెనకోట పంచాయతీ రాచకీలం కొండపై గ్రామంలో సూకూరు లక్ష్మి(20) అనే గర్భిణీకి ఆదివారం పురిటి నొప్పులు వచ్చాయి. వెంటనే 108 కి ఫోన్ చేశారు. అయితే ఆ గ్రామానికి సరైన రోడ్డు లేకపోవడంతో గర్భిణీని రోడ్డు మార్గం తెమ్మన్నారు. దీంతో కొండపైనుంచి రాచకిలం నుంచి గుమ్మంతి వరకు నాలుగు కిలోమీటర్ల మేర రాళ్లు, రప్పలు, ఎత్తైన కొండ మార్గం నుంచి మైదాన ప్రాంతం గుమ్మంతి వరకు ఆమెను డోలిపై మోసుకుని అంబులెన్సు వద్దకు వచ్చారు. అంబులెన్సులో ఆమెను పినకోట ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. అయితే అక్కడ వైద్యులు లేకపోవటం వల్ల ఆమెను కే.కోటపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే అక్కడ వైద్యుల సూచన మేరకు ఆమెను విశాఖ కేజీహెచ్ కు తరలించారు. ప్రస్తుతం ఆమె అక్కడే చికిత్స పొందుతోంది. గత ఏడాది సెప్టెంబర్ లో డోలిపై ఇద్దరు రోగులను తరలించడంతో వారు చికిత్స పొందుతూ మృతి చెందారు.

మార్కెట్ యార్డుల్లో రైతన్నలకు రూ.5 భోజనం..

వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతులకు ఐదు రూపాయలకే భోజన సౌకర్యం కల్పించాలనా తెలంగాణ సర్కార్ యోచిస్తోంది. దీనిక సంబంధించిన విధివిధానాలను త్వరలో ఖరారు చేయనుంది. రాష్ట్రంలో 192 ప్రధాన మార్కెట్ యార్డులు, 87 సబ్ యార్డులలో వీటన్నింటికీ కలిపి సీజయ్ సమయంలో రోజూ దాదాపుగా 8 వేల నుంచి 10 వేల మంది వస్తుంటారు. మార్కెట్ యార్డుల్లో ప్రస్తుతం భోజన సౌకర్యాలు లేవు. ధాన్యం, ఇతర పంట ఉత్పత్తులను తీసుకొచ్చి రైతులు రోజంతా యార్డులోనే ఉంటారు. ఒక్కోసారి రాత్రిపూట కూడా అక్కడే ఉండాల్సి వస్తుంది. దీంతో యార్డుకి దగ్గరల్లో ఉన్న క్యాంటీన్లు, హోటళ్లకు వెళ్లి భోజనాలు చేస్తారు. అధికశాతం యార్డుల్లో మంచినీటి వసతి కూడా లేకపోవడంతో రైతన్నలు నానా అవస్థలు పడుతున్నారు. అందువల్ల రైతులకు రాయితీపై, భోజన సౌకర్యం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నజర్ పెట్టింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అన్నపూర్ణ పథకం ద్వారా పట్టణాలు, నగరాల ఆస్పత్రుల్లో సహాయకుల కోసం రూ. 5 కి భోజనం అందిస్తున్నారు. ఒక్కో భోజనానికి ప్రభుత్వం రూ. 21 రాయితీ చెల్లిస్తోంది. ఈ పథకాన్ని మార్కెట్ యార్డులకూ విస్తరించాలని భావిస్తోంది. 36 రైతు బజార్లో ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 10 వేల మంది రైతులకు భోజన సౌకర్యం కల్పించేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నారు.

అల్లా ఏమైనా చెవిటివాడా.. ‘అజాన్’పై బీజేపీ లీడర్ వివాదాస్పద వ్యాఖ్యలు

సీనియర్ బీజేపీ నాయకుడు, కర్ణాటక మాజీ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప ‘అజాన్’పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘అల్లా ఏమైనా చెవిటివాడా.. ఆయనను పిలవడానికి లౌడ్‌స్పీకర్లు ఉపయోగించాల్సిన అవసరం ఉందా?’ అని ప్రశ్నించారు. తాను బహిరంగ సభలో ప్రసంగిస్తున్న సమయంలో.. సమీపంలో ఉండే మసీదు నుండి ‘అజాన్’ వచ్చిందని, తానె ఎక్కడికి వెళ్లినా ఈ అజాన్ తలనొప్పిగా మారిందంటూ వ్యాఖ్యానించారు. ఈ అజాన్ వ్యవహారంపై సుప్రీంకోర్టు తీర్పు రావాల్సి ఉందని.. ఈరోజు కాకపోతే కచ్ఛితంగా అజాన్‌ని నిలిపివేయాలంటూ ఏదో ఒక రోజు పిలుపు తప్పకుండా వస్తుందని పేర్కొన్నారు. హిందూ ఆలయాలలో అమ్మాయిలు, మహిళలు ప్రార్థనలతో పాటు భజనలు చేస్తారని.. తామూ మతపరమైన వాళ్లమేనని, కానీ లౌడ్ స్పీకర్లను వినియోగించమని ఈశ్వరప్ప అన్నారు. మీరు లౌడ్ స్పీకర్లను వినియోగించి ప్రార్థనలకు పిలవవలసి వస్తే.. అప్పుడు దానర్థం అల్లా చెవిడివాడేనని చెప్పారు. ఈ విధంగా ఈశ్వరప్ప చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు జాతీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. కాగా.. ఉప ముఖ్యమంత్రిగానూ పని చేసిన ఈశ్వరప్పకు వివాదాలు కొత్తేమీ కాదు. 18వ శతాబ్దపు మైసూర్ పాలకుడు టిప్పు సుల్తాన్‌ను ‘ముస్లిం గూండా’గా పేర్కొన్నప్పుడు కూడా వివాదం చెలరేగింది. గతేడాది ఓ కాంట్రాక్టర్ ఆత్మహత్య కేసు వ్యవహారంలో.. ఈ సీనియర్ నేత తన మంత్రి పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది. తాను ఆత్మహత్య చేసుకోవడానికి పంపించిన చివరి మెసేజ్‌లలో.. తన సూసైడ్‌కి ఈశ్వరప్పే ప్రధాన కారణమని ఆ కాంట్రాక్టర్ పేర్కొనడంతో, ఆ నేతపై పోలీసులు కేసు పెట్టారు. అప్పట్లో ఈ కేసు విషయం పెద్ద చర్చనీయాంశంగా మారింది.

బీరుబాటిళ్లలో బంగారం తరలింపు.. చివరికి ఏమైంది?


పంజాబ్‌లోని అమృత్‌సర్ విమానాశ్రయంలో బంగారం స్మగ్లింగ్‌ను కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ పట్టుకుంది. అరెస్టయిన వ్యక్తి మద్యం ముసుగులో దుబాయ్ నుంచి భారత్‌కు బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తుంటే.. విచారణలో కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ నిందితుడిని పట్టుకుంది. కస్టమ్ యాక్ట్ 1962 కింద నిందితుడిపై డిపార్ట్‌మెంట్ కేసు నమోదు చేసింది. అందిన సమాచారం ప్రకారం.. అరెస్టయిన నిందితుడు దుబాయ్ నుంచి అమృత్‌సర్ ఎయిర్‌పోర్టులో దిగాడు. నిందితుల లగేజీని ఎక్స్‌రే మిషన్‌లో పరిశీలించగా బాటిళ్లతో పాటు అనుమానాస్పద వస్తువులను గుర్తించారు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. వస్తువులను తెరిచి పరిశీలించారు. నిందితులు మద్యం బాటిళ్ల ముసుగులో స్మగ్లింగ్‌కు యత్నించారు. 13 బంగారు బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్ శాఖ అధికారులు విచారణ ప్రారంభించగా నిందితుల లగేజీలో ఉంచిన మూడు బాటిళ్లలో 13 బంగారు బిస్కెట్లు లభ్యమయ్యాయి. మొత్తం బరువు 1.516 కిలోలు. భారతదేశంలో బంగారం విలువ 86.41 లక్షలుగా అంచనా. కస్టమ్ చట్టం కింద కేసు నమోదు చేసి నిందితులపై కస్టమ్ శాఖ చర్యలు ప్రారంభించింది.

సిలికాన్ ప్రభావం.. ఈ ఏడాది కనిష్టానికి కీలక సూచీలు పతనం

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ ఈ వారం ట్రేడింగ్‌ని శుభారంభం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఇవాళ సోమవారం ఉదయం రెండు కీలక సూచీలు లాభాలతో మొదలయ్యాయి. కానీ.. ఇంట్రాడేలో ఆ ట్రెండ్‌ని కొనసాగించలేకపోయాయి. దీంతో.. సాయంత్రం భారీ నష్టాలతో ముగిశాయి. ఈ ఏడాది కనిష్ట విలువలను నమోదు చేశాయి. వివిధ రంగాల్లోని కంపెనీల షేర్లు అమ్మకాల ఒత్తడికి గురయ్యాయి. ఫలితంగా.. ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, టాటా మోటార్స్‌, మహింద్రా అండ్‌ మహింద్రా, ఎస్‌బీఐ, ఇన్ఫోసిస్‌, టైటాన్ వంటి సంస్థలు భారీగా దెబ్బతిన్నాయి. సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌ సంక్షోభ ప్రభావం మన దేశ బ్యాంకింగ్‌ రంగం పైన కూడా పడింది. సెన్సెక్స్‌ ఏకంగా 897 పాయింట్లు కోల్పోయి 58 వేల 237 పాయింట్ల వద్ద ఎండ్‌ అయింది.నిఫ్టీ 258 పాయింట్లు తగ్గి 17 వేల 154 పాయింట్ల వద్ద క్లోజ్‌ అయింది. సెన్సెక్స్‌లోని మొత్తం 30 కంపెనీల్లో 29 కంపెనీలు అంచనాలు తప్పాయి. నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ మోస్తారుగా రాణించింది.మీడియా సూచీ ఘోరంగా 2 శాతానికి పైగా తగ్గింది. వ్యక్తిగత స్టాక్స్‌ను పరిశీలిస్తే.. టెక్‌ మహింద్రా షేర్‌ విలువ 9 శాతానికి పైగా పెరిగింది. ఇన్ఫోసిస్‌కి చెందిన మోహిత్‌ జోషి.. ఎండీ అండ్‌ సీఈఓగా పగ్గాలు చేపట్టనుండటం ఈ సంస్థకు కలిసొచ్చింది.

ఆస్కార్ విన్నింగ్ డాక్యుమెంటరీ గొప్పతనమేంటి!?

ఈ యేడాది భారత్ కు చెందిన మూడు చిత్రాలు ఆస్కార్ బరిలో వివిధ కేటగిరిల్లో నిలిచాయి. అందులో రెండు సినిమాలు ఆస్కార్ ట్రోఫీని అందుకున్నాయి. మన వాళ్ళంతా బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఆస్కార్ ను సొంతం చేసుకున్న ‘ఆర్.ఆర్.ఆర్.’ మూవీ గురించి, ‘నాటు నాటు’ సాంగ్ గురించి ముచ్చటించుకుంటున్నారు. అయితే… నలభై నిమిషాల నిడివి ఉన్న ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ మూవీ కూడా తక్కువదేమీ కాదు. ఈ కేటగిరిలోని మిగిలిన నాలుగు డాక్యుమెంటరీస్ దీనికి గట్టి పోటీని ఇచ్చినా… ఇదే ఆస్కార్ విన్నర్ గా నిలిచింది. జ్యూరీ సభ్యులు ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ కు ఓటు వేయడంతో గునీత్ మోంగా, కార్తికి గోన్సాల్వేస్ ఆస్కార్ ప్రతిమను సగర్వంగా ఈ రోజు ఉదయం వేదికపై అందుకున్నారు. బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ లిస్ట్ లో అమెరికన్ కు చెందిన మూడు సినిమాలు ఉన్నాయి. ‘స్ట్రేంజర్ ఎట్ ది గేట్’ అనే 29 నిమిషాల డాక్యుమెంటరీ ఆఫ్ఘన్ శరణార్దికి చెందింది. బిబి బహ్రామీ అనే శరణార్థి ఇండియానాలోని ఓ మసీదులో తన వాళ్ళతో తలదాచుకున్న సంఘటన నేపథ్యంలో ఈ డాక్యుమెంటరీని జోషువ సెఫ్టెల్ తెరకెక్కించాడు. అలానే ‘హౌ డు యూ మెజర్ ఏ ఇయర్!?’ అనే అమెరికన్ డాక్యుమెంటరీలో తండ్రీ – కూతుళ్ళ అనుబంధాన్ని దర్శకుడు జయ్ రోజన్ బ్లట్ చూపించాడు. ఇక మూడోది ‘ది మార్త మిఛెల్ ఎఫెక్ట్’ అమెరికన్ పొలిటికల్ సిస్టమ్ లోని ఓ చీకటి కోణానికి సంబంధించింది. ఈ మూడింటి కంటే ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ కు గట్టిపోటీ ఇచ్చిన డాక్యుమెంటరీ ‘హాలౌట్’. రష్యన్, బ్రిటిష్ సంస్థలు నిర్మించిన ఈ డాక్యుమెంటరీ రష్యన్ సైంటిస్ట్ మాగ్జిమ్ చక్లివ్ వాల్రాస్ గురించి చేసిన పరిశోధనకు సంబంధించింది. వాల్రాస్ ను కొన్ని చోట్ల నీటి గుర్రాలని, నీటి కుక్కలని కూడా అంటారు. ఆ జాతి మనుగడకు సంబంధించిన విశేషాలతో ఈ డాక్యుమెంటరీ సాగింది. అయితే… ఈ నాలుగు డాక్యుమెంటరీలను కాదని ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’కు జ్యూరీ సభ్యులు పట్టం కట్టారు.