NTV Telugu Site icon

Top Headlines @9AM: టాప్ న్యూస్

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

ఇవాళ తొర్రూరుకు మంత్రి కేటీఆర్..మహిళా దినోత్సవం సందర్భంగా సభ

నేడు ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ వరంగల్‌ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్లు, మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరులో పర్యటించనున్నారు. ఉదయం బేగంపేట నుంచి మంత్రి కేటీఆర్‌ హెలికాప్టర్‌లో వరంగల్‌ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్లుకు చేరుకుంటారు. ఇవాల మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతిమ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నేటి నుంచి 10 వరకు నిర్వహించనున్న క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ వైద్య శిబిరాన్ని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌తో కలిసి కేటీఆర్‌ ప్రారంభిస్తారు. అనంతరం జరిగే సభలో ప్రసంగిస్తారు. తర్వాత తొర్రూరులో నిర్మించిన సమీకృత వెజ్‌, నాన్‌వెజ్‌ మోడల్‌ మార్కెట్‌ను ప్రారంభిస్తారు. ఇక మధ్యాహ్నం 3 గంటలకు యతిరాజారావు మెమోరియల్‌ పార్కు, ఓపెన్‌ జిమ్‌ ప్రారంభించి, మధ్యాహ్నం 3.15 గంటలకు అక్కడే ఏర్పాటు చేసే సభలో మహిళా సహాయక సంఘాలకు రూ.750 కోట్ల వడ్డీలేని రుణాలను పంపిణీ చేయనున్నారు. అనంతరం అభయహస్తం డబ్బులను పంపిణీ చేసిన అనంతరం 20 వేల మంది మహిళలతో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఇక సాయంత్రం 4 గంటలకు తొర్రూరు నుంచి హైదరాబాద్‌కు హెలికాప్టర్‌లో తిరిగి బయల్దేరుతారు.

వరుస గుండెపోట్లకు కారణాలేంటి?

ఈ గుండెకి ఏమైంది? వరుసగా సంభవిస్తున్న గుండెపోటు మరణాలకు కారణాలేంటి? కరోనా వైరస్ కి మనం తీసుకున్న వ్యాక్సిన్లే కొంపముంచుతున్నాయా? దేశవ్యాప్తంగా ఇదే చర్చసాగుతోంది.అసలు ఎందుకిలా గుండెపోటు వస్తుంది? సడెన్ గా హార్ట్ పై ఎటాక్ ఎందుకు జరుగుతోంది? ఎందుకిలా ప్రాణాలు పోతున్నాయి.? ఇప్పుడీ ప్రశ్నలు అందరినీ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వయసుతో సంబంధం లేదు. ఇటీవలి కాలంలో చోటు చేసుకుంటున్న గుండెపోటు ఘటనలు, హఠాన్మరణాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. గుండెపోటుతో పలువురు సెలబ్రిటీలు సైతం హఠాత్తుగా మరణించిన ఘటనలు కలకలం రేపాయి. కన్నడ స్టార్ పునీత్ రాజ్ కుమార్, ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, ఇటీవలే నందమూరి తారకరత్న మరణాలు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. గత కొద్దిరోజులుగా వరుస గుండెపోట్లతో ఆస్పత్రికి తీసుకెళ్ళి వైద్యం చేయకుండానే ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.

మహిళా నీకు వందనం.. స్పెషల్ డూడుల్ తో గూగుల్ విషెస్

మార్చి 8, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దిగ్గజ సెర్చ్ ఇంజన్ గూగుల్ మహిళలకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపింది. మహిళా దినోత్సవాన్ని, మహిళల గొప్పతనాన్ని ప్రతిబింబిచేలా గూగుల్ డూడుల్ ను రూపొందించింది. మహిళలు తమ దైనందిక జీవితంలో వారు పోషించే పాత్రను ఈ డూడుల్ లో అద్భుతంగా తెలియజేసింది గూగుల్.ఈ డూడుల్ లో మహిళలు వారి హక్కుల కోసం పోరాడటం, సైన్స్, వైద్య రంగాల్లో మహిళ పాత్ర, ఓ తల్లిగా ఆమె బాధ్యతలను నిర్వర్తిస్తుండటం డూడుల్ లో చూడవచ్చు. ఈ డూడుల్ థీమ్ లక్ష్యం మహిళలకు మద్దతు ఇవ్వడమని, నా జీవితంలో ఇతర మహిళలు నాకు మద్దతు ఇచ్చిన అన్ని మార్గాలను ప్రతిబింబిస్తూ చాలా సమయం గడిపానని ఈ డూడుల్ ను రూపొందించిన కళాకారిణి అలిస్సా వినాన్స్ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా మహిళ సాధించిన సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ విజయాలను గుర్తించేందుకు, వారిని మరింతగా ప్రోత్సహించేందుకు ప్రతీ ఏడాది మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటారు.

రాజమండ్రిలో బ్లేడ్ బ్యాచ్ దాడి.. యువకుడికి గాయాలు

నేరాలు, ఘోరాలు ఎక్కువ అయిపోతున్నాయి. యువకులు రెచ్చిపోతున్నారు. మద్యం మత్తులో ఏం చేస్తున్నారో తెలీడం లేదు. మళ్ళీ బ్లేడ్ బ్యాచ్ దాడులు ఏపీలో కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. ఓ యువకుడిపై బ్లేడ్ బ్యాచ్ దాడిచేసి గాయపరిచింది. రాజమండ్రిలో బ్లేడ్ బ్యాచ్ దాడి చేసినట్లు పవన్ అనే మెడికల్ రిప్రెజెంట్ త్రీ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. క్వారీ ఏరియాకు చెందిన పవన్ తొర్రేడు నుండి విధులు ముగించుకుని కలెక్షన్ బ్యాగ్ తో ఇంటికి వస్తున్నట్లు చెబుతున్నాడు. కంపోస్ట్ యార్డ్ వద్ద నలుగురు యువకులు బ్లేడ్ తో దాడి చేసి, కలెక్షన్ చేసి తీసుకుని వస్తున్న బ్యాగ్ లోని 30 వేల రూపాయలు బ్లేడ్ బ్యాచ్ దాడి అపహరించినట్లు బాధితుడు ఫిర్యాదు చేశాడు. బ్లేడ్ బ్యాచ్ దాడి వల్ల బాధితుడి మెడ, ఛాతీపై బ్లేడ్ తో గీసిన గాయాలు ఉన్నాయి. రక్త స్రావం కావడంతో బాధితుడిని కుటుంబ సభ్యులు రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. బ్లేడ్ బ్యాచ్ దాడి ఘటనను త్రీ టౌన్ సిఐ మధుబాబు పరిశీలించారు. బాధితుడిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. అయితే ఘటనపై మీడియాతో మాట్లాడడానికి పోలీసులు నిరాకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని అంటున్నారు. ప్రశాంతంగా ఉండే రాజమండ్రిలో ఇలాంటి ఘటన కలకలం రేపింది.

ఆ ఘనత కాంగ్రెస్ దే.. రేవంత్ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళామణులందరికి శుభాకాంక్షలు తెలిపారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. మహిళా శక్తిని ప్రపంచానికి చాటిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అన్నారు. ప్రధాన మంత్రిగా, యూపీఏ చైర్ పర్సన్‌గా, రాష్ట్రపతిగా, లోక్ సభ స్పీకర్‌గా మహిళలకు అనేక పదవులను ఇచ్చి గౌరవించింది కాంగ్రెస్.. స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించి వారిని రాజకీయాలలో ప్రోత్సహించింది కాంగ్రెస్ పార్టీ అన్నారు రేవంత్. మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించి వారికి వడ్డీ లేని రుణాలు అందించి ఆదుకున్న పార్టీ కాంగ్రెస్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణలోని ప్రతి మహిళకూ కాంగ్రెస్ పార్టీ పక్షాన హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు రేవంత్

ఆప్ఘాన్ లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 4.2 తీవ్రత

ఆఫ్ఘానిస్తాన్ లో భూకంపం సంభవించింది. బుధవారం తెల్లవారుజామున 1.40 గంటలకు రిక్టర్ స్కేలుపై 4.2 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ(ఎన్సీఎస్) వెల్లడించింది. భూకంప కేంద్రం భూమి నుంచి 136 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతం అయింది. అంతకుముందు మార్చి 2న ఆఫ్ఘనిస్తాన్ ఫైజాబాద్ ప్రాంతంలో తెల్లవారుజామున 4.1 తీవ్రతతో భూకంపం వచ్చింది. భూకంప కేంద్రం 245 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతం అయింది. అత్యధిక భూకంపాలు సంభవించే ప్రాంతాల్లో ఆఫ్ఘన్ కూడా ఉంది. ఇక్కడి హిందూకుష్ పర్వత శ్రేణుల్లో తరుచుగా భూకంపాలు సంభవిస్తుంటాయి. భారత్ తో పాటు ఆఫ్ఘన్ కూడా ఇండియన్ టెక్టానిక్ ప్లేట్ లో ఉంది. ఈ ప్రాంతం ఉత్తరం వైపు కదులుతూ.. యూరేషియా టెక్టానిక్ ప్లేట్ ను నెట్టేస్తోంది. దీని ప్రభావంతో అక్కడ భూకంపాలు సంభవిస్తున్నాయి. ఇటీవల టర్కీ ప్రాంతంలో కూడా ఇలాంటి టెక్టానిక్ ప్లేట్ యాక్టివిటీ వల్లే భారీ భూకంపాలు సంభవించాయి. టర్కీ అనటోలియన్ టెక్టానిక్ ప్లేట్ లో ఉంది. ఇది అరేబియన్ టెక్టానిక్ ప్లేట్ తో ఢీకొట్టడం వల్లనే 7.8,7.5 తీవ్రతతో రెండు భారీ భూకంపాలు వచ్చాయి.

ఆఫ్ఘన్‌కు 20 వేల మెట్రిక్ టన్నుల గోధుమలు.. ఉదారత చాటుకున్న భారత్

ఐక్యరాజ్యసమితి భాగస్వామ్యంతో, భారతదేశం ఆఫ్ఘనిస్తాన్‌కు 20 వేల మెట్రిక్ టన్నుల గోధుమల సాయాన్ని ప్రకటించింది. ఆఫ్ఘనిస్తాన్‌పై భారత్-మధ్య ఆసియా జాయింట్ వర్కింగ్ గ్రూప్ తొలి సమావేశం తర్వాత సంయుక్త ప్రకటన విడుదలైంది. ఈ సహాయం కాబూల్‌కు పాకిస్తాన్ ద్వారా కాకుండా ఇరాన్‌లోని చబహార్ పోర్ట్ ద్వారా అందించబడుతుంది. తీవ్రవాదాన్ని ఎలా ఎదుర్కోవాలో ఐదు మధ్య ఆసియా దేశాలు మంగళవారం చర్చించాయి. ఈ సమావేశానికి భారతదేశం, కజకిస్తాన్, కిర్గిజిస్థాన్, తజికిస్థాన్, తుర్క్‌మెనిస్తాన్, ఉజ్బెకిస్థాన్ ప్రత్యేక రాయబారులు, సీనియర్ అధికారులు హాజరయ్యారు. డ్రగ్స్ అండ్ క్రైమ్స్‌పై ఐక్యరాజ్యసమితి కార్యాలయానికి చెందిన దేశాల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.ఐక్యరాజ్యసమితి భాగస్వామ్యంతో, భారతదేశం ఆఫ్ఘనిస్తాన్‌కు 20 వేల మెట్రిక్ టన్నుల గోధుమల సాయాన్ని ప్రకటించింది. ఆఫ్ఘనిస్తాన్‌పై భారత్-మధ్య ఆసియా జాయింట్ వర్కింగ్ గ్రూప్ తొలి సమావేశం తర్వాత సంయుక్త ప్రకటన విడుదలైంది. ఈ సహాయం కాబూల్‌కు పాకిస్తాన్ ద్వారా కాకుండా ఇరాన్‌లోని చబహార్ పోర్ట్ ద్వారా అందించబడుతుంది. తీవ్రవాదాన్ని ఎలా ఎదుర్కోవాలో ఐదు మధ్య ఆసియా దేశాలు మంగళవారం చర్చించాయి. ఈ సమావేశానికి భారతదేశం, కజకిస్తాన్, కిర్గిజిస్థాన్, తజికిస్థాన్, తుర్క్‌మెనిస్తాన్, ఉజ్బెకిస్థాన్ ప్రత్యేక రాయబారులు, సీనియర్ అధికారులు హాజరయ్యారు. డ్రగ్స్ అండ్ క్రైమ్స్‌పై ఐక్యరాజ్యసమితి కార్యాలయానికి చెందిన దేశాల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.

సత్తా చాటిన ఇస్రో.. విజయవంతంగా మేఘా ట్రోపిక్-1 శాటిలైట్ కూల్చివేత

ఇస్రో మరోసారి సత్తా చాటింది. దశాబ్ధకాలంగా సేవలు అందిస్తూ, జీవిత కాలం ముగిసిపోయిన మేఘా ట్రోపిక్-1 శాటిలైన్ ను విజయవంతంగా ధ్వంసం చేసింది ఇస్రో. అత్యంత కట్టుదిట్టమైన ప్లానింగ్ లో పసిఫిక్ మహాసముద్రంలో జనావాసాలకు దూరంగా కూల్చివేసింది. అక్టోబర్ 2011లో లోయర్ ఎర్త్ ఆర్బిట్ లో ప్రవేశపెట్టబడిన మేఘా ట్రోఫిక్-1 ఉష్ణమండల వాతావరణం గురించి విలువైన సమాచారాన్ని దశాబ్ధకాలంగా అందిస్తూ వస్తోంది. భారత్, ఫ్రెంచ్ సంయుక్తంగా ఈ శాటిలైట్ ను అంతరిక్షంలోకి పంపాయి. మేఘాట్రోపిక్-1 నియంత్రిత రీ ఎంట్రీ ప్రయోగం ద్వారా మార్చి 7, 2023న విజయవంతంగా ధ్వంసం చేసినట్లు ఇస్రో ట్వీట్ చేసింది. 2011లో అంతరిక్షంలో ప్రవేశపెట్టబడిన తర్వాత మూడేళ్ల పాటు సేవలు అందిస్తుందని భావించినప్పటికీ.. దశాబ్ధకాలంగా శాటిలైట్ పనిచేసింది. శాటిలైట్ జీవిత కాలం ముగిసిన తర్వాత ధ్వంసం చేయాలని ఐక్యరాజ్యసమితి ఇంటర్-ఏజెన్సీ స్పేస్ డెబ్రిస్ కోఆర్డినేషన్ కమిటీ(యూఎన్ఐఏడీసీ) సూచిస్తోంది. దీనికి అనుగుణంగానే ఇస్రో ఈ ప్రయోగాన్ని చేపట్టింది.