మూడురాజధానులపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ
ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల వ్యవహారం కాకరేపుతోంది. మూడురాజధానుల పిటిషన్ పై ఇవాళ సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. మూడు రాజధానులపై ఏపీ హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో సవాల్ చేసింది ఏపీ ప్రభుత్వం. హైకోర్టు తీర్పును అమలు చేయడం సాధ్యం కాదని తెలిపింది ఏపీ ప్రభుత్వం. హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని కోరింది ఏపీ ప్రభుత్వం. ఏపీ రాజధాని అంశం పై సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలు అయింది. శివరామకృష్ణ కమిటీ సిఫార్సులు అమలు చేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు ప్రకాశం జిల్లాకు చెందిన మస్తాన్ వలీ. పిటిషన్ దాఖలు చేశారు మస్తాన్ వలీ తరపు న్యాయవాది శ్రీధర్ రెడ్డి. ఒకే చోట అభివృద్ధి కాకుండా అన్ని ప్రాంతాల అభివృద్ధి జరగాలని సూచించింది శివ రామకృష్ణ కమిటీ. ఇప్పటికే మూడు రాజధానుల అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. ఇవాళ రెండు పిటిషన్లు కలిపి విచారించనుంది సుప్రీం కోర్టు. ఈ వ్యవహారంపై ఏం జరుగుతుందనేది ఉత్కంఠను రేపుతోంది. అమరావతిని ఆరు నెలల్లోగా అభివృద్ధి చేయాలంటూ ఏపీ హైకోర్టు దాఖలు చేసిన ఆదేశాలపై ఇదివరకే సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ పిటీషన్లపై తదుపరి విచారణను ఈ నెల 31వ తేదీన విచారిస్తామని తెలిపిన సంగతి తెలిసిందే.
తెలంగాణ బడ్జెట్ కు గవర్నర్ తమిళి సై ఆమోదం
ఉత్కంఠ రేకెత్తించిన తెలంగాణ బడ్జెట్ కు గవర్నర్ తమిళి సై ఆమోదం తెలిపారు. బడ్జెట్ సమర్పణ పత్రాలపై సంతకం చేశారు. దీంతో అనుకున్నట్లుగానే ఫిబ్రవరి 3న బడ్జెట్ సమావేశాలు మొదలుకానున్నాయి. బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. అనంతరం రెండు రోజలు తర్వాత ఫిబ్రవరి 6న బడ్జెట్ ప్రవేశపెట్టే ఛాన్స్ ఉంది. ఈ సారి బడ్జెట్ మూడు లక్షల కోట్ల రూపాయలు ఉంటుందని సమాచారం. మండలి, అసెంబ్లీ సంయుక్త సమావేశానికి కూడా గవర్నర్ తమిళ్ సై అనుమతి ఇచ్చారు. రాష్ట్ర హైకోర్టు సూచనలతో రాష్ట్ర ప్రభుత్వం, రాజ్‌భవన్ న్యాయవాదుల మధ్య సోమవారం రాజీ కుదిరింది. హైకోర్టులో అత్యవసరంగా దాఖలు చేసిన పిటిషన్ విషయంలో ప్రభుత్వం, రాజ్‌భవన్ న్యాయవాదుల మధ్య అడ్వొకేట్ జనరల్ చాంబర్‌లో జరిగిన చర్చలు ఫలించాయి. తమకు ఎలాంటి దురుద్దేశాలు లేవని రాజ్‌భవన్ న్యాయవాది పేర్కొనగా, సంయుక్త సమావేశాల్లో గవర్నర్ ప్రసంగానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని ప్రభుత్వం తరపు న్యాయవాది చెప్పారు. దీంతో ఇరుపక్షాల మధ్య అపోహలు తొలగిపోయాయి.
వెంకటగిరిలో హాట్ పాలిటిక్స్..క్యాడర్ తో ఆనం భేటీలు
సింహపురి రాజకీయాలు నిత్యం రసవత్తరంగా మారుతున్నాయి. ఒకవైపు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎపిసోడ్ హాట్ హాట్ గా నడుస్తోంది. అధిష్టానంపై గుర్రుగా వున్నారు కోటంరెడ్డి. ఇది చాలదన్నట్టుగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ని వైసిపి అధిష్టానం పక్కన పెట్టింది.ఈ పరిణామాల అనంతరం ఆయన నేతలతో మొదటిసారి సమావేశమవుతున్నారు. సైదాపురం మండలానికి చెందిన నేతలతో నిర్వహించే ఈ సమావేశం ఆసక్తికరంగా మారింది. వెంకటగిరి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని నియమించిన తర్వాత ప్రభుత్వంపై విమర్శలు చేయడాన్ని మానేసి.. ఆనం మౌనంగా ఉన్నారు. ఆయన ఇంతవరకూ ఈ పరిణామాలపై ప్రతిస్పందించలేదు. దీంతో ఈరోజు ఆనం ఏం మాట్లాడతారనే విషయంపై నాయకులు.. కార్యకర్తల్లో ఆసక్తి నెలకొంది. ఆనం సమావేశం నిర్వహిస్తున్నారనే సమాచారం రావడంతో నేదురుమల్లి వర్గీయులు అప్రమత్తమయ్యారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించే వారిపై వేటు తప్పదని హెచ్చరించారు. ఆనం నిర్వహించే సమావేశానికి వెళ్లవద్దని కూడా పరోక్షంగా పలువురు నేతలకు సూచించారు.
మధ్యప్రదేశ్ లో భారీ అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం
మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో ఎగ్జిబిషన్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గ్వాలియర్ ఫెయిర్ పేరుతో జరుగుతున్న వ్యాపార మేళాలో వరుసగా ఉన్న పదుల సంఖ్యలోని దుకాణాలన్నీ అగ్నికి ఆహుతయ్యాయి. ఎగ్జిబిషన్ లో ఏర్పాటు చేసిన స్టాల్స్, వస్త్ర దుకాణాలన్నీ మంటల్లో కాలి బూడిదయ్యాయి. ఈ అగ్నిప్రమాదంలో సుమారు కోటి యాభై లక్షల రూపాయలు విలువైన వస్త్రాలు మంటల్లో కాలిపోయాయి. దీంతో వాటి యజమానులు లబోదిబోమంటున్నారు. మొదట ఐదు, ఆరు నెంబర్ల దుకాణాల్లో మొదలైన మంటలు ఆ తర్వాత ఫెయిర్ మొత్తానికే అంటుకున్నాయి. దట్టంగా పొగలు అలుముకోవడంతో సహయక చర్యలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని భావిస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
ప్రజల్ని ఓటు అడిగే హక్కు బీఆర్ఎస్ కే ఉంది
జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో మంత్రి కేటీఆర్ సభ ఏర్పాట్లు పౌరసరరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్, సీపీ సుబ్బారాయుడు, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ కనుమల్ల విజయ పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భవించిన తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ జమ్మికుంటలో మొట్ట మొదటి భహిరంగ సభ అని ఆయన అన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కొన్ని అనివార్య కారణాల వల్ల బీఅర్ ఎస్ ఓటమి చెందిందని, మేము ప్రజల తీర్పు శిరసావహిస్తామన్నారు. 2023 ఎన్నికల్లో హుజురాబాద్ లో బీఆర్ఎస్ భారీ మెజారిటీతో గెలువబోతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇందుకోసం బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు శక్తి వంచన లేకుండా పని చేస్తున్నారన్నారు. ప్రజలను ఓట్లు అడిగే హక్కు కేవలం బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఉందని ఆయన అన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి కాక ముందు హుజురాబాద్ నియోజక వర్గం ఎలా ఉందన్నారు.
అమరరాజా గ్రోత్ కారిడార్ లో భారీ అగ్నిప్రమాదం
ఈమధ్యకాలంలో అగ్నిప్రమాదాలు మామూలైపోయాయి. ఈ ప్రమాదాల కారణంగా భారీగా ఆస్తినష్టం, ప్రాణనష్టం కలుగుతోంది. చిత్తూరు మోర్ధానపల్లి అమరరాజా గ్రోత్ కారిడార్ లో నిన్న రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ట్యూబులర్ బ్యాటరీ తయారీ విభాగంలో మంటలు చెలరేగి ప్లాంట్ మొత్తం వ్యాపించాయి. సంఘటనా స్దలానికి చేరుకున్న అగ్నిమాపక వాహనాలతో అర్ధరాత్రి వరకు అతి కష్టం మీద మంటలు అదుపులోకి తెచ్చారు అగ్నిమాపక సిబ్బంది. మంటలు రాత్రి భోజన విరామంలో జరిగాయి. ఆ సమయంలో సిబ్బంది అంతా క్యాంటీన్ లో ఉండటం తో సిబ్బందికి ప్రాణ నష్టం తప్పింది. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని ప్రాథమిక అంచనాకు వచ్చిన పోలిసు అధికారులు, అగ్నిమాపక అధికారులు విచారణ జరుపుతున్నారు. అగ్నిప్రమాదంలో వల్ల ఏర్పడ్డ ఆస్తి నష్టం పై అంచనా వేస్తున్నారు అమర రాజా సంస్ద అధికారులు. ప్రాణ నష్టం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
నిరుద్యోగులకు గుడ్ న్యూస్..గ్రూప్ 4 జాబ్ నోటిఫికేషన్ గడువు పెంపు
నిరుద్యోగులు ఎప్పుడు ఎప్పుడా అని ఎదురు చూస్తున్న జాబ్ నోటిఫికేషన్లు విడుదలవుతూనే ఉన్నాయి. తాజాగా ఇచ్చిన గ్రూప్ 4 జాబ్ నోటిఫికేషన్ గడువు నేటితో ముగిసిపోతుండడంతో.. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్సీ) గ్రూప్–4 ఆశావహులకు శుభవార్త తెలిపింది. దరఖాస్తుల స్వీకరణ గడువును ఫిబ్రవరి 3వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు పొడిగిస్తున్నట్లు టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. నిజానికి డిసెంబర్ 30 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. జనవరి 30వ తేదీ సాయంత్రం వరకు గడువు ఇవ్వడంతో అది ముగిసిపోయింది. గ్రూప్–4 కేటగిరీలో మరి కొన్ని కొలువులు జతచేస్తూ అనుబంధ ప్రకటన విడుదల చేయడం, అభ్యర్థుల నుంచి వినతులు రావడంతో గడువును పొడిగిస్తూ టీఎస్‌పీఎస్సీ నిర్ణయం తీసుకుంది. గ్రూప్ 4 ఉద్యోగాల కోసం ఇప్పటివరకు 8,47,277 దరఖాస్తులు వచ్చాయి. ఆదివారం 49 వేలు, సోమవారం 34,247 దరఖాస్తులు వచ్చాయి. మరో నాలుగు రోజులు గడువు ఉండటంతో దరఖాస్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు టీఎస్‌పీఎస్సీ వర్గాలు భావిస్తున్నాయి.